
మధ్యప్రదేశ్‌లోని రైసెన్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఒక ట్రక్కు రాంగ్ సైడ్ నుండి ఓవర్‌టేక్ చేసి, వివాహ వేడుకలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, 11 మంది గాయపడ్డారు.
సుల్తాన్‌పూర్ ప్రాంతంలో ఈ ప్రమాద ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. వివాహ వేడుకలకు లైట్లు మోసే కూలీలు ప్రమాదం బారినపడ్డారని సుల్తాన్‌పూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ రజత్ సారథే తెలిపారు. ఘటన అనంతరం ట్రక్కు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. సోమవారం రాత్రి 10 గంటలకు ఖమారియా గ్రామ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నదని రైసెన్ కలెక్టర్ అరవింద్ దూబే తెలిపారు.
ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, 11 మంది గాయపడ్డారని కలెక్టర్ పేర్కొన్నారు. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. వారికి వైద్య చికిత్స అందించేందుకు భోపాల్‌కు తరలించారు. ఈ ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి ప్రకటించారు.