భోపాల్ : మానవత్వం చూపించాల్సిన పోలీసులు దారుణంగా ప్రవర్తించారు. రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు చనిపోతే.. బాధితుడి భౌతిక కాయాన్ని స్వాధీనం చేసుకుని తదుపరి కార్యక్రమాలు నిర్వహించాల్సింది పోయి కర్కశాన్ని ప్రదర్శించారు. అచ్చం ‘జై భీమ్’(jai bhim) సినిమాలో పోలీస్ స్టేషన్‌లో తాము చేసిన దాడిలో గిరిజనుల చనిపోతే.. కేసు నుంచి తప్పించుకునేందుకు పోలీసులు బాధితుల మృతదేహాల్ని జిల్లాల సరిహద్దుల్ని ఎలా మార్చారో.. అలాగే ఈ విషాదంలో బాధితుడికి ప్రమాదం జరిగిన ప్రాంతం తమ పరిధిలోకి రాదంటూ రెండు రాష్ట్రాల పోలీసులు తప్పించుకున్నారు. డెడ్ బాడీని రోడ్డుమీద వదిలేశారు. చివరికి..
మధ్యప్రదేశ్‌కు చెందిన రాహుల్ అహిర్వార్ (27) దినసరి కూలి. మధ్యప్రదేశ్ (madhya pradesh) నుంచి ఢిల్లీకి వచ్చి అక్కడే దొరికిన పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే ఈ క్రమంలో రాహుల్ మధ్యప్రదేశ్ నుంచి ఢిల్లీకి వెళ్లాడు. అక్కడ ఓ ప్రాంతంలో రోడ్డు దాటుతుండగా నిన్న సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో మరణించాడు.
రాహుల్ మరణంపై సమాచారం అందుకున్న రాహుల్ సన్నిహితులు మధ్యప్రదేశ్‌లోని హర్పాల్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సన్నిహితుల ఫిర్యాదుతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. ప్రమాదం జరిగిన ప్రాంతం ఉత్తరప్రదేశ్(uttarpradesh)లోని మహోబా జిల్లాలోని మహోబ్‌కాంత్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందని చెప్పారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు.
చేసేది లేక రాహుల్ భౌతిక కాయాన్ని అక్కడే ఉంచి ఉత్తర ప్రదేశ్ మహోబ్‌కాంత్ పీఎస్‌కు సమాచారం అందించారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకున్న పోలీసులు.. శవ పరీక్ష చేయించేందుకు నిరాకరించారు. ఇది తమ ప్రాంతం పరిధిలోకి రాదంటూ బుకాయించారు.
దీంతో పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు రోడ్డును దిగ్బంధించారు. ప్రమాదం జరిగిన నాలుగు గంటల తర్వాత మధ్యప్రదేశ్ పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్షకు పంపించారు. ఆ తర్వాతే గ్రామస్తులు రోడ్డును క్లియర్ చేసి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.
రాహుల్ మరణంతో అతడి కుటుంబ సభ్యులు రోడ్డుపై మృతదేహం పక్కనే రోదిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ సందర్భంగా యువకుడి బంధువు మాట్లాడుతూ...‘ మా కుటుంబ సభ్యుడు రాహుల్ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఈ ప్రాంతం మధ్యప్రదేశ్ పరిధిలోకి వస్తుంది. కానీ పోలీసులు కేసు నమోదు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. మృత దేహం గంటల తరబడి రోడ్డుపైనే ఉంది. మేం చేసిన ఫిర్యాదుతో ఘటనా స్థలానికి వచ్చిన మధ్యప్రదేశ్ పోలీసులు.. ఈ ప్రదేశం మా ప్రాంతంలోకి రాదని మమ్మల్ని తిట్టారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి, నిందితులను గుర్తించాలని కోరారు.
పోలీసుల తీరుతో రాత్రి 7 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగితే..రాత్రి 11 గంటల సమయంలో మృతదేహాన్ని రోడ్డుపై నుంచి బయటకు తీశారు’అని కన్నీరు మున్నీరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment