Jurisdiction
-
కాలపరిమితి ఆదేశాలు సరికాదు
న్యూఢిల్లీ: ట్రయల్ కోర్టుల పరిధిలో కేసుల విచారణకు కాలపరిమితిని విధిస్తూ ఆదేశాలిచ్చే సంస్కృతిని హైకోర్టులు విడనాడాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. ఈ మేరకు ఒక వ్యక్తికి బెయిల్‌ను నిరాకరిస్తూ, కాలపరిమితిలోపు విచారణ పూర్తిచేయాలంటూ ట్రయల్ కోర్టుకు హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టేసింది. గత సోమవారం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు శనివారం వెలుగులోకి వచ్చాయి. నకిలీ నోట్ల కేసులో రెండున్నరేళ్లుగా విచారణ ఖైదీగా జైలులో మగ్గిపోతున్న ఒక వ్యక్తికి బెయిల్ మంజూరుచేస్తూ జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మాసిహ్ల సుప్రీంకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. ‘‘కాల పరిమితిలోపు కేసు విచారణ పూర్తికాని పక్షంలో బెయిల్ కోసం నిందితుడు చట్టాల ప్రకారం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో కోర్టులు చట్టప్రకారం వీలైతే ఆ నిందితుడికి బెయిల్ ఇవ్వడానికే మొగ్గుచూపాలి. మరో అవకాశంలేని పక్షంలో మాత్రమే అతడిని విచారణ ఖైదీగా జైలుకు పరిమితం చేయాలి. బెయిల్ అనేది నియమం, జైలు అనేది ఒక మినహాయింపు అనే సూత్రం ఇక్కడా వర్తిస్తుందని హైకోర్టులు గుర్తుంచుకోవాలి’’అని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘‘ప్రతి కోర్టులోనూ క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. కేసు విచారణను కాలపరిమితిలోపు ముగించాలని ట్రయల్ కోర్టులను హైకోర్టులు ఆదేశిస్తే ఆయా కిందికోర్టుల పనితీరుపై తీవ్ర ఒత్తిడి, ప్రభావం పడుతుంది. ఇలాంటి ఆదేశాలను కచ్చితంగా అమలుచేయడం ట్రయల్ కోర్టుకు కష్టమవుతుంది. బెయిల్‌ను నిరాకరిస్తూ నిందితులకు కంటితుడుపు చర్యగా ఆ కేసు విచారణను త్వరగా పూర్తిచేయిస్తామని హైకోర్టులు చెబుతున్నాయి. ఇలాంటి ఆదేశాలతో సంబంధిత వ్యక్తులకు అనవసరంగా ఆశ కలి్పంచినవారమవుతాం. ఇది ఒకరకంగా వాళ్లకు తప్పుడు సందేశం పంపినట్లే’’అని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. -
‘పరిధి’ మార్చి మా అధికారాల్లోకి తలదూర్చొద్దు
కోల్‌కతా: దేశ సరిహద్దు వెంట రాష్ట్ర భూభాగాలపై సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) అజమాయిషీ పరిధిని కేంద్రం పెంచిన అంశాన్ని ఢిల్లీలో తేల్చుకుంటానని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ స్పష్టంచేశారు. హస్తిన పర్యటనలో భాగంగా సోమవారం సాయంత్రం ఆమె ఢిల్లీకి చేరుకున్నారు. సరిహద్దు వెంట 15 కి.మీ.లకు బదులుగా 50 కి.మీ.ల పరిధి వరకూ సోదాలు, అరెస్ట్‌లకు బీఎస్ఎఫ్కు అధికారాలు కట్టబెడుతూ తాజాగా తీసుకున్న నిర్ణయాన్ని మోదీతో భేటీలో లేవనెత్తుతానని మమత చెప్పారు. ‘ బీఎస్ఎఫ్ పరిధిని పెంచి మోదీ సర్కార్ సరిహద్దు రాష్ట్రాలపై తమ అధికారం, ఆధిపత్యాన్ని చెలాయించాలని చూస్తోంది’ అని మమత ఆరోపించారు. త్రిపురలో హింసాకాండ, బెంగాల్లో తృణమూల్ పార్టీ కార్యకర్తలపై బీజేపీ వర్గాల దాడుల అంశాలనూ ప్రధానితో చర్చిస్తానని ఆమె పేర్కొన్నారు. ‘ త్రిపురలో హింసపై మానవహక్కుల సంస్థలు, వామపక్ష సంఘాలు ఇంతవరకూ నోరు మెదపకపోవడం నాకు ఆశ్చర్యం కల్గిస్తోంది’ అని మమత వ్యాఖ్యానించారు. -
నేరస్తుల చెరలో ‘న్యాయ’ శాస్త్రం
లా కళాశాలల్లో క్రిమినల్ లా, ప్రొసీజర్ గురించి పాఠాలు చెబుతూ ఉంటాం. తరగతి గదిలో చెప్పేదానికి, కోర్టుల్లో జరిగేదానికి తేడాలు ఉంటా యని నవ్వుకుంటూ ఉంటారు. తీవ్ర నేరం జరిగితే ప్రథమ సమాచార నివేదిక నమోదు చేయడం అనేది మొదటి దశ. ఇదే లేకపోతే అసలు దర్యాప్తులు నేర విచారణలు ఉండవు. శిక్ష సంగతి తలెత్తదు. బీజేపీ నాయకుల మీద ఎఫ్ఐఆర్ చేసే విధిని ధైర్యంగా నిర్వర్తించే పోలీసు అధికారులు ఈ దేశంలో లేరా? అది జరగాలనే న్యాయవాదులు, న్యాయమూర్తులన్నా ఉన్నారా? ఈ అన్యాయం భరించలేక హర్షమందర్ అనే మానవహక్కులవాది డిల్లీ హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయాలని హైకోర్టు మెట్లెక్కవలసి రావడమే పెద్ద విషాదం. ముఖ్యమైన మూడు కొత్త పాఠాలు ఇవి. 1. నేరం జరిగితే మొదటి సమాచార నివేదిక పేరుతో కేసు నమోదు చేయాలని తరగతి గదిలో చెబుతాం. సోలిసిటర్ జనరల్ గారి కొత్తపాఠం: తగిన వాతావరణం ఏర్పడి పరి స్థితులు అనుకూలంగా ఉంటే తప్ప నేరం జరి గినా ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయడానికి వీల్లేదని సోలిసిటర్ జనరల్ వాదించారు. 2. ఒకవేళ ఎక్స్ అనే వ్యక్తిపై నేరారోపణ వస్తే అతని మీద ఫిర్యాదు రూపంలో ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయాలన్నది క్రిమినల్ లా పాఠం. సోలిసిటర్ జనరల్ గారి కొత్తపాఠం: ఎక్స్ మీద ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయాలంటే ఏబీసీడీ నుంచి జడ్ దాకా అందరిమీదా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. లేకపోతే లేదు. 3. న్యాయం కోరే వ్యక్తి ఎవరైనా సరే అతని దరఖాస్తులో నిజం ఉంటే న్యాయస్థానం విచారణకు స్వీకరిస్తుందని తరగతి గదిలో చెప్పే పాఠం. కొత్తగా ప్రధాన న్యాయమూర్తి గారి ప్రవచనం: న్యాయం చేయాలని కోరే వ్యక్తికి న్యాయవ్యవస్థమీద విశ్వాసం ఉందని రుజువు అయితేనే ఆయన దరఖాస్తు విచారణ చేయాలి. హింసాద్వేషాలు వెదజల్లే ప్రసంగాలు నినాదాలు చేసిన మంత్రిగారు అనురాగ్ థాకూర్, కపిల్ మిశ్రా, పర్వేశ్ వర్మ, అభయ్ వర్మలపైన ఎఫ్ఐఆర్ నమోదుచేస్తారో లేదో ఒకరోజులో తెలియజేయండి అని డిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మురళీధర్ బెంచ్ హర్షమందర్ కేసు విచారణలో సూచించారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించడం కుదరదు. ఎందుకంటే ప్రాథమికంగా నేరం జరిగిన ఆధారాలుంటే నిర్ణయం తీసుకునే విచక్షణాధికారం పోలీసులకే ఉంది. కనుక ఆలోచించి రేపు సాయంత్రంలోగా చెప్పండి అని మాత్రమే జస్టిస్ మురళీధర్ అన్నారు. అంతే, న్యాయశాఖ ఆగమేఘాలమీద అర్థరాత్రి బదిలీ ఉత్తర్వులు తయారు చేసింది. జస్టిస్ మురళీధర్‌ను పంజాబ్ హర్యానా హైకోర్టుకు బదిలీ చేస్తూ రాష్ట్రపతితో సంతకం చేయించి మరీ ప్రకటించింది ఫిబ్రవరి 12నే సుప్రీంకోర్టు కొలీజియం మురళీధర్ బదిలీ ప్రతిపాదనను ఆమోదించింది కనుక అని చెప్పింది. మురళీధర్ బదిలీకి కొలీజియం ఇంతవరకు కారణాలు తెలియజేయలేదు. మరునాడు ఢిల్లీ హైకోర్టు చీఫ్ జడ్జిగారి ధర్మాసనం ఆ కేసును నెల వాయిదా వేసింది. బీజేపీ నాయకుల హింసాద్వేష ప్రసంగాలమీద కేసులు త్వరగా వినాలని, ఢిల్లీ హైకోర్టు అంత సుదీర్ఘ వాయిదా వేయడం తగదని సుప్రీంకోర్టు మార్చి 4న మరో కేసులో చెప్పడం కారు చీకటిలో చిరు కాంతిరేఖ. కానీ, ఇందులో కూడా తిరకాసు ఉంది. అదేమంటే ఒక ప్రసంగం చేస్తూ హర్షమందర్ తనకు న్యాయవ్యవస్థ పట్ల విశ్వాసం లేదన్నారని పోలీసుశాఖ ఒక అఫిడవిట్ వేసింది. కోపిం చిన సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తిగారు ముందీ సంగతి తేల్చండి తరువాతే అసలు కేసు వింటాం అన్నారు. కానీ, పిటిషనర్‌కు విశ్వాసం ఉన్నా లేకపోయినా న్యాయవ్యవస్థ మీద రాజ్యాంగం మీద న్యాయమూర్తులకు విశ్వాసం ఉంది గనుక కేసు వినవలసి ఉంటుంది కదా? మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
పరిధి కాదు.. ఫిర్యాదు ముఖ్యం
సాక్షి, నిర్మల్: నిర్మల్–నిజామాబాద్ జిల్లాల మధ్య గోదావరి నది వంతెనపై సోన్ గ్రామ సమీపంలో కొన్నేళ్ల క్రితం రోడ్డుప్రమాదం జరిగింది. ఘటనలో ఇద్దరు మృతిచెందగా పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన ప్రదేశం రెండు జిల్లాల మధ్యలో ఉంది. సమాచారం రెండు జిల్లాల సరిహద్దు మండలాల పోలీసులకు చేరింది. కానీ.. సత్వరమే రెండు స్టేషన్ల నుంచి స్పందన రాలేదు. తమ పరిధి కాదంటే.. తమ పరిధి కాదంటూ.. సమాధానాలిచ్చారు. కొంతసేపటి తర్వాత సోన్ పోలీసులే వెళ్లి కేసు నమోదు చేసుకున్నారు. ఇలా జిల్లాలో పలు మండలాల మధ్య, జిల్లాకేంద్రం చుట్టూ ఉన్న శివారు ప్రాంతాల మధ్య పోలీసుల ‘పరిధి’ ఇబ్బందిగా మారుతోంది. బాధితులు ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక అవస్థలు పడుతున్నారు. దిశ కేసులోనూ ఇదే పరిస్థితి ఎదురైంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసు చట్టాల్లోనూ మార్పులు తీసుకువస్తోంది. సాంకేతికతను విస్తృతం ఉపయోగించుకుంటున్న పోలీస్‌శాఖ వెలుగులోకి తీసుకురాని జీరో ఎఫ్ఐఆర్ను తెరపైకి తీసుకువచ్చింది. దిశపై అఘాయిత్యం జరిగిన రోజు రాత్రి ఆమె కుటుంబసభ్యులు మిస్సింగ్ కేసు నమోదు చేయడానికి సమీప పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ ఘటన జరిగిన ప్రదేశం తమ పరిధిలోకి రాదని చెప్పారు. దీంతో ఆ రాత్రి బాధిత కుటుంబం రెండు ఠాణాల చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఇలా కేవలం ఈ ఒక్క కేసులోనే కాదు. చాలా సంఘటనలు జరిగినప్పుడు పోలీసుల సాయం కోసం వెళ్లే వారికి ఎదురవుతూనే ఉంది. చట్టం ప్రకారం తమ జ్యురిస్డిక్షన్(పరిధి)లో ఉంటేనే కేసు నమోదు చేస్తామని చెబుతుంటారు. దీంతో బాధితులు వెళ్లి సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసే లోపు దిశలాంటి ఘటనలు జరిగిపోతున్నాయి. ఇక ఇలాంటి సమస్య లేకుండా జీరో ఎఫ్ఐఆర్ విధానాన్ని పకడ్బందీగా అమలులోకి తీసుకువస్తున్నారు. జీరో నంబర్ ఎఫ్ఐఆర్.. పోలీస్ స్టేషన్ల పరిధితో సంబంధం లేకుండా బాధితులు తమకు సమీపంలో ఉన్న ఠాణాలో ఫిర్యాదు చేసుకునేందుకు అవకాశం కల్పించేదే జీరో నంబర్ ఎఫ్ఐఆర్. బాధితుడి నుంచి అందుకున్న ఫిర్యాదును పోలీసుస్టేషన్లో కేసుగా నమోదు చేస్తూ ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్) జారీ చేస్తారు. ప్రతి ఎఫ్ఐఆర్కు సీరియల్ నెంబర్/ఆ సంవత్సరం సూచిస్తూ సంఖ్యను కేటాయిస్తారు. తమ పరి«ధిలో జరగని నేరాలకు సంబంధించి వచ్చే ఫిర్యాదులకు ఎలాంటి నంబర్ కేటాయించకుండా ‘జీరో ఎఫ్ఐఆర్’ నమోదు చేసి వెంటనే బాధితులకు సాయం అందిస్తారు. అనంతరం సంబంధిత ఘటన ఏ స్టేషన్ పరిధిలోకి వస్తుందో పరిశీలించి.. ఆ ఠాణాకు కేసును బదిలీ చేస్తారు. లేకుంటే ఇబ్బందే.. జీరో ఎఫ్ఐఆర్ విధానాన్ని రాష్ట్రంలోనూ అమలు చేయాల్సిన అవసరం ఉందని ‘దిశ’ కేసు స్పష్టం చేసింది. ఠాణాల పరిధులు తెలుసుకోవడం సామాన్యుడికే కాదు ఒక్కోసారి పోలీసులకూ ఇబ్బందికరంగానే మారుతోంది. ఈ పరిధుల సమస్య ఎక్కువగా ఒకచోట నుంచి మరో చోటుకి ప్రయాణాలు చేస్తున్నప్పుడు జరుగుతుంది. మిస్సింగ్, చోరీ, యాక్సిడెంట్ కేసుల్లో ఎక్కువగా ఈ సమస్య ఉత్పన్నమవుతోంది. ప్రతీ పోలీస్‌స్టేషన్‌కు జ్యురిస్‌డిక్షన్‌గా పిలిచే అధికారిక పరిధి ఉంటుంది. సంబంధిత పోలీసు అధికారులు ఆ పరిధిలోని ఘటనలపైనే స్పందిస్తుంటారు. ఆయా పరిధుల్లో జరిగిన నేరాలపై మాత్రమే సదరు ఠాణా అధికారులు కేసు నమోదు చేస్తుంటారు. పరిధి దాటితే చట్టపరంగా తాము సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని పోలీసులు చెబుతుంటారు. కానీ.. ఈ నిబంధనలు సామాన్యులకు ఇబ్బందిగా మారుతోంది. మార్పు ‘దిశ’గా.. దేశవ్యాప్తంగా సంచలనమైన దిశ ఘటనతో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సైతం మరోసారి ఆలోచనలో పడ్డాయి. ఢిల్లీ జరిగిన నిర్భయ ఘటనతో కొత్త చట్టాన్ని తీసుకువచ్చారు. ఇప్పుడు ‘దిశ’ ఘటనపైనా దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఈమేరకు బుధవారం హైదరాబాద్‌లో హోంమంత్రి, పలువురు మంత్రులు, ఉన్నతాధికారులతో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో పలు నిర్ణయాలను తీసుకున్నారు. ప్రధానంగా జీరో ఎఫ్ఐఆర్ అంశంపైనే చర్చ సాగింది. ఈమేరకు ఈ విధానాన్ని రాష్ట్రంలో పక్కాగా అమలు చేయాలని ఉన్నతస్థాయి సమావేశం నిర్ణయించింది. జిల్లాలోనూ సమస్య.. పోలీస్స్టేషన్ల పరిధికి సంబంధించిన సమస్యలు తరచూ ఉత్పన్నమవుతున్నాయి. ప్రధానంగా నిర్మల్ జిల్లాకేంద్రం చుట్టూ విస్తరించింది. ఇందులో సారంగపూర్, నిర్మల్‌రూరల్, సోన్, దిలావర్పూర్ తదితర మండలాలు చుట్టూ ఉన్నాయి. శివారు ప్రాంతాల్లో జరిగిన ఘటనల్లో ఏ స్టేషన్‌కు వెళ్లాలన్న విషయంలో తరచూ ఇబ్బంది ఎదురవుతోంది. బాసర, సోన్ వంతెనలపైన గతంలో రోడ్డుప్రమాదాల విషయంలో ఇలాంటి ఘటనలు ఎదురయ్యాయి. పలు పోలీస్స్టేషన్ల అధికారులు తమ పరిధిలను గుర్తించి, సూచికల బోర్డులను ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం జీరో నంబర్ ఎఫ్ఐఆర్ను కచ్చితంగా అమలు చేయాలని నిర్ణయించడంతో పరిధికి సంబంధం లేకుండా ఫిర్యాదు చేసుకునే అవకాశం ఏర్పడనుంది. ఇది బాధితులకు ఊరటనిస్తుందని పలువురు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఎక్కడైనా ఫిర్యాదు చేయొచ్చు ఏదైన ఘటన జరిగినప్పుడు సంబంధిత ప్రాంతంతో సంబంధం లేకుండా బాధితులు సమీపంలో ఉన్న ఏ పోలీసుస్టేషన్లోనైనా ఫిర్యాదు చేయొచ్చు. చట్ట ప్రకారం స్టేషన్ పరిధి కాని ప్రాంతమైతే జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. అనంతరం సంబంధిత ప్రాంత పోలీసుస్టేషన్‌కు కేసును బదిలీ చేస్తారు. జిల్లాలో ఈ విధానాన్ని ముందు నుంచి అమలు చేస్తున్నాం. ఇప్పుడు మరింత పకడ్బందీగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటాం. – సి.శశిధర్‌రాజు, ఎస్పీ -
ఓటు టోటలైజర్లతో పనిలేదు: సుప్రీంలో కేంద్రం
న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుతం ఓట్ల టోటలైజర్ యంత్రాలను ఉపయోగించాల్సిన అవసరం లేదని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. ప్రస్తుతం దేశంలో అలాంటి యంత్రాలతో పనిలేదనీ, బూత్‌ల వారీగా ఫలితాలు వెల్లడిస్తేనే అభ్యర్థులకు ఏ ప్రాంతంలో ఓట్లు తక్కువ వచ్చాయి, ఎక్కడ ఎక్కువ వచ్చాయి అనే విషయాలు తెలుస్తాయంది. తద్వారా వారు ఓట్లు తక్కువ వచ్చిన ప్రాంతాలపై మరింత దృష్టి పెట్టి పనిచేసే అవకాశం ఉంటుందని న్యాయ శాఖ సుప్రీంకోర్టుకు తెలిపింది. -
సంఘటన దురదృష్టకరం
రాజమండ్రిసిటీ : పుష్కరాల రేవులో జరిగిన నంఘటన దురదృష్టకరమని ఇటువంటివి పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని రాష్ర్ట మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, కె.అచ్చెంనాయుడు, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్‌లు ఆనంకాళాకేంద్రంలో మీడియా సెంటర్లో వేర్వేరుగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. జరిగిన సంఘటనపై న్యాయవిచారణకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారన్నారు. విచారణలో తప్పిదం ఎవరిదనే విషయం తెలిసిన వెంటనే చర్యలు చేపట్టనున్నామని పేర్కొన్నారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటన రద్దు చేసుకుని మిగిలిన 11 రోజులు స్వయం పర్యవేక్షణలో ఏవిధమైన ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. పుష్కరఘాట్‌లో స్నానం చేయడమేమిటీ? అనే విషయమై వివిధ అభిప్రాయాలు వినిపిస్తున్నాయని పండితులు చెప్పిన మీదట అక్కడే స్నానమాచరించాల్సి వచ్చిందని వారు తెలిపారు. భక్తులు నిర్భయంగా పుష్కరాలకు తరలిరావాలని వారు పిలుపు ఇచ్చారు. పుష్కరాల్లో మీడియాకు సరైన ప్రాధాన్యం కల్పించకపోవడంతో సమాచార శాఖామంత్రి రఘునాథరెడ్డిపై విలేకరుల తీవ్ర స్ధాయిలో ద్వజమెత్తారు. బుధవారం నుండి ఏవిధమైన ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడతామని ఆయన హామీ ఇచ్చారు.