సాక్షి, నిర్మల్: నిర్మల్–నిజామాబాద్ జిల్లాల మధ్య గోదావరి నది వంతెనపై సోన్ గ్రామ సమీపంలో కొన్నేళ్ల క్రితం రోడ్డుప్రమాదం జరిగింది. ఘటనలో ఇద్దరు మృతిచెందగా పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన ప్రదేశం రెండు జిల్లాల మధ్యలో ఉంది. సమాచారం రెండు జిల్లాల సరిహద్దు మండలాల పోలీసులకు చేరింది. కానీ.. సత్వరమే రెండు స్టేషన్‌ల నుంచి స్పందన రాలేదు. తమ పరిధి కాదంటే.. తమ పరిధి కాదంటూ.. సమాధానాలిచ్చారు. కొంతసేపటి తర్వాత సోన్ పోలీసులే వెళ్లి కేసు నమోదు చేసుకున్నారు. ఇలా జిల్లాలో పలు మండలాల మధ్య, జిల్లాకేంద్రం చుట్టూ ఉన్న శివారు ప్రాంతాల మధ్య పోలీసుల ‘పరిధి’ ఇబ్బందిగా మారుతోంది. బాధితులు ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక అవస్థలు పడుతున్నారు. దిశ కేసులోనూ ఇదే పరిస్థితి ఎదురైంది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసు చట్టాల్లోనూ మార్పులు తీసుకువస్తోంది. సాంకేతికతను విస్తృతం ఉపయోగించుకుంటున్న పోలీస్‌శాఖ వెలుగులోకి తీసుకురాని జీరో ఎఫ్‌ఐఆర్‌ను తెరపైకి తీసుకువచ్చింది. దిశపై అఘాయిత్యం జరిగిన రోజు రాత్రి ఆమె కుటుంబసభ్యులు మిస్సింగ్ కేసు నమోదు చేయడానికి సమీప పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ ఘటన జరిగిన ప్రదేశం తమ పరిధిలోకి రాదని చెప్పారు. దీంతో ఆ రాత్రి బాధిత కుటుంబం రెండు ఠాణాల చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఇలా కేవలం ఈ ఒక్క కేసులోనే కాదు. చాలా సంఘటనలు జరిగినప్పుడు పోలీసుల సాయం కోసం వెళ్లే వారికి ఎదురవుతూనే ఉంది. చట్టం ప్రకారం తమ జ్యురిస్‌డిక్షన్(పరిధి)లో ఉంటేనే కేసు నమోదు చేస్తామని చెబుతుంటారు. దీంతో బాధితులు వెళ్లి సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసే లోపు దిశలాంటి ఘటనలు జరిగిపోతున్నాయి. ఇక ఇలాంటి సమస్య లేకుండా జీరో ఎఫ్‌ఐఆర్ విధానాన్ని పకడ్బందీగా అమలులోకి తీసుకువస్తున్నారు.
జీరో నంబర్ ఎఫ్‌ఐఆర్..
పోలీస్ స్టేషన్‌ల పరిధితో సంబంధం లేకుండా బాధితులు తమకు సమీపంలో ఉన్న ఠాణాలో ఫిర్యాదు చేసుకునేందుకు అవకాశం కల్పించేదే జీరో నంబర్ ఎఫ్‌ఐఆర్. బాధితుడి నుంచి అందుకున్న ఫిర్యాదును పోలీసుస్టేషన్‌లో కేసుగా నమోదు చేస్తూ ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్) జారీ చేస్తారు. ప్రతి ఎఫ్‌ఐఆర్‌కు సీరియల్ నెంబర్/ఆ సంవత్సరం సూచిస్తూ సంఖ్యను కేటాయిస్తారు. తమ పరి«ధిలో జరగని నేరాలకు సంబంధించి వచ్చే ఫిర్యాదులకు ఎలాంటి నంబర్ కేటాయించకుండా ‘జీరో ఎఫ్‌ఐఆర్’ నమోదు చేసి వెంటనే బాధితులకు సాయం అందిస్తారు. అనంతరం సంబంధిత ఘటన ఏ స్టేషన్ పరిధిలోకి వస్తుందో పరిశీలించి.. ఆ ఠాణాకు కేసును బదిలీ చేస్తారు.
లేకుంటే ఇబ్బందే..
జీరో ఎఫ్‌ఐఆర్ విధానాన్ని రాష్ట్రంలోనూ అమలు చేయాల్సిన అవసరం ఉందని ‘దిశ’ కేసు స్పష్టం చేసింది. ఠాణాల పరిధులు తెలుసుకోవడం సామాన్యుడికే కాదు ఒక్కోసారి పోలీసులకూ ఇబ్బందికరంగానే మారుతోంది. ఈ పరిధుల సమస్య ఎక్కువగా ఒకచోట నుంచి మరో చోటుకి ప్రయాణాలు చేస్తున్నప్పుడు జరుగుతుంది. మిస్సింగ్, చోరీ, యాక్సిడెంట్ కేసుల్లో ఎక్కువగా ఈ సమస్య ఉత్పన్నమవుతోంది. ప్రతీ పోలీస్‌స్టేషన్‌కు జ్యురిస్‌డిక్షన్‌గా పిలిచే అధికారిక పరిధి ఉంటుంది. సంబంధిత పోలీసు అధికారులు ఆ పరిధిలోని ఘటనలపైనే స్పందిస్తుంటారు. ఆయా పరిధుల్లో జరిగిన నేరాలపై మాత్రమే సదరు ఠాణా అధికారులు కేసు నమోదు చేస్తుంటారు. పరిధి దాటితే చట్టపరంగా తాము సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని పోలీసులు చెబుతుంటారు. కానీ.. ఈ నిబంధనలు సామాన్యులకు ఇబ్బందిగా మారుతోంది.
మార్పు ‘దిశ’గా..
దేశవ్యాప్తంగా సంచలనమైన దిశ ఘటనతో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సైతం మరోసారి ఆలోచనలో పడ్డాయి. ఢిల్లీ జరిగిన నిర్భయ ఘటనతో కొత్త చట్టాన్ని తీసుకువచ్చారు. ఇప్పుడు ‘దిశ’ ఘటనపైనా దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఈమేరకు బుధవారం హైదరాబాద్‌లో హోంమంత్రి, పలువురు మంత్రులు, ఉన్నతాధికారులతో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో పలు నిర్ణయాలను తీసుకున్నారు. ప్రధానంగా జీరో ఎఫ్‌ఐఆర్ అంశంపైనే చర్చ సాగింది. ఈమేరకు ఈ విధానాన్ని రాష్ట్రంలో పక్కాగా అమలు చేయాలని ఉన్నతస్థాయి సమావేశం నిర్ణయించింది.
జిల్లాలోనూ సమస్య..
పోలీస్‌స్టేషన్‌ల పరిధికి సంబంధించిన సమస్యలు తరచూ ఉత్పన్నమవుతున్నాయి. ప్రధానంగా నిర్మల్ జిల్లాకేంద్రం చుట్టూ విస్తరించింది. ఇందులో సారంగపూర్, నిర్మల్‌రూరల్, సోన్, దిలావర్‌పూర్ తదితర మండలాలు చుట్టూ ఉన్నాయి. శివారు ప్రాంతాల్లో జరిగిన ఘటనల్లో ఏ స్టేషన్‌కు వెళ్లాలన్న విషయంలో తరచూ ఇబ్బంది ఎదురవుతోంది. బాసర, సోన్ వంతెనలపైన గతంలో రోడ్డుప్రమాదాల విషయంలో ఇలాంటి ఘటనలు ఎదురయ్యాయి. పలు పోలీస్‌స్టేషన్ల అధికారులు తమ పరిధిలను గుర్తించి, సూచికల బోర్డులను ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం జీరో నంబర్ ఎఫ్‌ఐఆర్‌ను కచ్చితంగా అమలు చేయాలని నిర్ణయించడంతో పరిధికి సంబంధం లేకుండా ఫిర్యాదు చేసుకునే అవకాశం ఏర్పడనుంది. ఇది బాధితులకు ఊరటనిస్తుందని పలువురు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
ఎక్కడైనా ఫిర్యాదు చేయొచ్చు
ఏదైన ఘటన జరిగినప్పుడు సంబంధిత ప్రాంతంతో సంబంధం లేకుండా బాధితులు సమీపంలో ఉన్న ఏ పోలీసుస్టేషన్‌లోనైనా ఫిర్యాదు చేయొచ్చు. చట్ట ప్రకారం స్టేషన్ పరిధి కాని ప్రాంతమైతే జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తారు. అనంతరం సంబంధిత ప్రాంత పోలీసుస్టేషన్‌కు కేసును బదిలీ చేస్తారు. జిల్లాలో ఈ విధానాన్ని ముందు నుంచి అమలు చేస్తున్నాం. ఇప్పుడు మరింత పకడ్బందీగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటాం.
– సి.శశిధర్‌రాజు, ఎస్పీ
Comments
Please login to add a commentAdd a comment