Zero FIR
-
మరో 10 నిమిషాలైతే ఆస్ట్రేలియాకు చెక్కేసే వాడే..
రాంగోపాల్‌పేట్: సోషల్ మీడియాలో ఓ యువతిని పరిచయం చేసుకుని..ప్రేమ, పెళ్లి అంటూ మాయమాటలతో లోబర్చుకుని..లైంగిక దాడికి పాల్పడి..ఆ్రస్టేలియా పారిపోయేందుకు యత్నించిన ఓ యువకుడిని మహంకాళి పోలీసులు అరెస్టు చేశారు. 10 నిమిషాల్లో విమానం ఎక్కేందుకు సిద్ధంగా ఉన్న నిందితుడిని చాకచక్యంగా అరెస్టు చేశారు. ఉత్తర మండలం డీసీపీ రష్మీ పెరుమాళ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జనగాం జిల్లా గంగాపూర్ గ్రామానికి చెందిన బండారం స్వామి (29) బీఎస్సీ పౌల్ట్రీ, ఎమ్మెస్సీ కెమిస్ట్రీ చేసి పంజాబ్, రాయ్‌పూర్‌లలోని పౌల్ట్రీ పరిశ్రమలో ఉన్నత ఉద్యోగాలు చేశాడు. గత కొద్ది నెలల క్రితం ఆస్ట్రేలియాలో ఉద్యోగం రావడంతో వెళ్లిపోయాడు. అక్కడికి వెళ్లాక ఫేస్బుక్ ద్వారా పరిచయమైన చత్తీస్ఘడ్ రాష్ట్రంలోని రాయ్‌పూర్‌కు చెందిన ఓ రెస్టారెంట్లో పనిచేసే 27 ఏళ్ల యువతితో స్నేహం చేశాడు. ఇలా ఇద్దరూ ఒకిరికొకరు సామాజిక మాధ్యమాల ద్వారా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ యువతిని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మబలుకుతూ వచ్చాడు. నగరానికి రప్పించి.. ఇదిలా ఉండగా..స్వామి తండ్రి గత కొద్ది రోజులుగా అనారోగ్యానికి గురికావడంతో తండ్రిని చూసేందుకు జూన్ 26వ తేదీన ఇండియాకు తిరిగి వచ్చాడు. ఆ సమయంలో రాయ్‌పూర్‌లోని యువతికి ఫోన్ చేసి..పెళ్లి చేసికుంటానని, హైదరాబాద్ వస్తే తన తల్లిదండ్రుల వద్దకు తీసుకుని వెళతానని స్వామి నమ్మబలికాడు. దీంతో ఈ నెల 2వ తేదీన ఆ యువతి రాయ్‌పూర్ నుంచి బస్సులో హైదరాబాద్‌కు బయలుదేరింది. 3వ తేదీ ఉదయం 11 గంటలకు బోయిన్‌పల్లిలో బస్సు దిగి ఉండగా..తన ద్విచక్ర వాహనంపై వెళ్లి రిసీవ్ చేసుకుని..అంతకు ముందే పార్క్‌లేన్‌లోని ఓ హోటల్ 4వ అంతస్తులో బుక్ చేసిన హోటల్ గదికి ఆమెను తీసుకెళ్లాడు. కొద్దిసేపటికి స్వామి ఆ యువతికి కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఇచ్చి లైంగిక దాడికి పాల్పడ్డాడు. రెండు రోజుల పాటు హోటల్లోనే ఉంచి..తన తల్లిదండ్రులు ఊరు వెళ్లారని, 10 రోజుల తర్వాత వస్తానని నమ్మించి 5వ తేదీన మళ్లీ ఆ యువతిని రాయ్‌పూర్ పంపించాడు. ఆ తర్వాత యువతి ఫోన్ చేస్తే స్పందించకపోవడంతో పాటు తనకు ఫోన్ చేయవద్దని, పెళ్లి లాంటివి ఏమి లేవని చెప్పాడు. దీంతో ఆ యువతి స్థానిక ఎస్పీని సంప్రదించగా ఆయన రాయ్‌పూర్‌లోని విధానసభ పోలీసులకు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించాడు. యువతితో పాటు హైదరాబాద్ చేరుకున్న అక్కడి పోలీసుల సమాచారం మేరకు 29వ తేదీన సాయంత్రం మహంకాళి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. డీసీపీ రష్మీ పెరుమాళ్ ఆదేశాల మేరకు ఇన్స్పెక్టర్ పరశురాం, ఎస్ఐలు జాన్ పరదేశి, వెంకటేశ్వర్లు ఇతర అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. నిందితుడి ఆధార్ కార్డు, ఫోన్ నంబర్ ఆధారంగా పాస్‌పోర్టు తదితర వివరాలు సేకరించారు. 10 నిమిషాల్లో ఎగిరిపోయేందుకు సిద్ధం.. నిందితుడు స్వామి సోమవారం రాత్రి 9.30 నిమిషాలకు శ్రీలంక మీదుగా ఆ్రస్టేలియా వెళ్లిపోతున్నాడన్న సమాచారం మహంకాళి పోలీసులకు 8 గంటలకు తెలిసింది. వెంటనే పోలీసులు ఎయిర్‌పోర్టులోని సీఐఎస్ఎఫ్, శంషాబాద్ ఆర్‌జేఐఏ పోలీసులకు చేరవేశారు. నిందితుడు 5 గంటలకే ఎయిర్‌పోర్టు చేరుకుని చెక్ ఇన్, ఇమిగ్రేషన్ పూర్తి చేసుకుని లాంజ్‌లో వేచిచూస్తున్నాడు. ఇంకో పది నిమిషాల్లో విమానం ఎగిరిపోతుందనే సమాయానికి హుటాహుటిన లోపలికి వెళ్లిన పోలీసులు..నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం రిమాండ్‌కు తరలించారు. -
సైబరాబాద్‌లో నేరం.. బెంగళూరులో కేసు
సాక్షి, హైదరాబాద్: భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్) అమలులోకి వచి్చన 20 రోజులకు అందులోని నిబంధనల ఆధారంగా కర్ణాటక రాజధాని బెంగళూరు పోలీసులు తొలి జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అక్కడి కూబన్ పార్క్ పోలీసుస్టేషన్లో శనివారం నమోదైన ఈ కేసు సైబరాబాద్ పరిధిలో జరిగిన నేరంపై కావడం గమనార్హం. ఈ కేసును ఇక్కడి పోలీసులకు బదిలీ చేయడానికి ఆ పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. బెంగళూరులోని వసంత్‌నగర్‌కు చెందిన అపూర్వ్ ప్రకాష్ అక్కడి విఠల్ మాల్యాలోని ఓ ప్రైవేట్ సంస్థ ఉద్యోగి. ఈ నెల 9న గచి్చ»ౌలిలోని హెచ్ఐసీసీలో జరిగిన ఓ సదస్సుకు ఆయన హాజరయ్యారు. తన ల్యాప్‌టాప్, రూ.70 వేల నగదుతో కూడిన బ్యాగ్ తస్కరణకు గురైనట్లు సదస్సు పూర్తయిన తర్వాత గమనించారు. ఆ రోజు సాయంత్రమే బెంగళూరు తిరిగి వెళ్లాల్సి ఉండటం, విమాన టిక్కెట్లు సైతం బుక్ కావడంతో వెంటనే పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయలేకపోయారు. దీంతో బెంగళూరు వెళ్లిన ప్రకాష్ శనివారం కూబన్ పార్క్ ఠాణాలో కంప్లైంట్ ఇచ్చారు. బీఎన్ఎస్ఎస్ అమలులోకి రాకముందు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆరీ్పసీ) అమలులో ఉండేది. దీని ప్రకారం జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం తప్పనిసరి కాదు. దీంతో బా«ధితులు నేరం జరిగిన ప్రాంతం ఏ ఠాణా పరిధిలోకి వస్తే అక్కడకే ఫిర్యాదు చేయాల్సి వచ్చేది. అయితే బీఎన్ఎస్ఎస్లోని సెక్షన్ 173 ప్రకారం దేశంలోని ఏ ప్రాంతంలో బాధితుడిగా మారినా తమకు ఉన్న అవకాశాన్ని బట్టి ఏదైనా ఠాణాలో ఫిర్యాదు చేయవచ్చు. దీని ప్రకారం కేసు నమోదు చేయడం ఫిర్యాదు స్వీకరించిన పోలీసుల బాధ్యత. దీంతో ప్రకాష్ శనివారం కూబన్ పార్క్ ఠాణాకు వెళ్లి సైబరాబాద్‌లోని హెచ్ఐసీసీలో తస్కరణకు గురైన బ్యాగ్‌పై ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా కూబన్ పార్క్ పోలీసులు బీఎన్ఎస్ సెక్షన్ 305 (ఎ) ప్రకారం జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసును సైబరాబాద్‌కు పంపాలని బెంగళూరు పోలీసులు నిర్ణయించారు. అక్కడ నుంచి గచి్చ»ౌలి ఠాణాకు ఈ కేసు చేరిన తర్వాత ఎఫ్ఐఆర్ నెంబర్‌తో రీ–రిజిస్టర్ చేసే పోలీసులు దర్యాప్తు చేపట్టడంతో పాటు ఘటనాస్థలి సందర్శన, పంచనామా నిర్వహణ తదితర ప్రక్రియలు పూర్తి చేయాల్సి ఉంటుంది. -
అమల్లోకి కొత్త నేర చట్టాలు.. ఈ సంగతులు తెలుసా?
న్యూఢిల్లీ: బ్రిటిష్ కాలం నాటి చట్టాలకు తెరపడింది. భారత న్యాయ వ్యవస్థలో మూడు కొత్త నేర చట్టాలు భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం నేటినుంచి అమల్లోకి వచ్చాయి. భారత శిక్షా స్మృతి (ఐపీసీ), కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్(సీఆర్పీసీ), భారత సాక్ష్యాధార చట్టాల చరిత్ర గత అర్ధరాత్రితో ముగిసింది. కొత్త చట్టాలతో జీరో ఎఫ్ఐఆర్, ఫిర్యాదులను ఆన్లైన్లో నమోదు చేయడం, ఎస్ఎంఎస్ వంటి ఎలక్టాన్రిక్ పద్ధతిలో సమన్లు పంపడం, హేయమైన నేరాలకు సంబంధించిన క్రైమ్ సీన్లను తప్పనిసరి వీడియోల్లో బంధించడం వంటి ఆధునిక పద్ధతులు న్యాయ వ్యవస్థలో రానున్నాయి. బ్రిటిష్ కాలం నాటి చట్టాల మాదిరిగా శిక్షకు కాకుండా, న్యాయం అందించేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచి్చనట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. చట్టాల పేరు మాత్రమే కాదు, వాటి సవరణలు పూర్తి భారతీయ ఆత్మతో రూపొందించామన్నారు. కొత్త చట్టాలు రాజకీయ, ఆర్థిక, సామాజిక న్యాయాన్ని అందిస్తాయని చెప్పారు. → భారతీయ శిక్షాస్మృతిలోని రాజద్రోహాన్ని ఇప్పుడు దేశద్రోహంగా మార్చారు. కులం, మతం వంటి కారణాలతో సామూహిక దాడులు, హత్యకు పాల్పడితే ఐపీసీ ప్రకారం ఏడేళ్ల శిక్ష పడుతుంది. దీన్నిప్పుడు యావజ్జీవంగా మార్చారు. హేయమైన నేరాలకు సంబంధించిన క్రైమ్ సీన్ల వీడియో చిత్రీకరణ తప్పనిసరి చేశారు.→ నకిలీ నోట్ల తయారీ, వాటి స్మగ్లింగ్ ఉగ్రవాదం పరిధిలోకి వస్తుంది. విదేశాల్లో మన ఆస్తుల ధ్వంసాన్నీ ఉగ్రవాదంగా నిర్వచించారు. డిమాండ్ల సాధనకు వ్యక్తులను బంధించడం, కిడ్నాప్ చేయడాన్ని ఉగ్రవాదం పరిధిలోకి చేర్చారు. → మహిళలు, పిల్లలపై నేరాలపై కొత్త అధ్యాయాన్ని జోడించారు. పిల్లల్ని కొనడం, అమ్మడం ఘోరమైన నేరంగా మార్చారు. మైనర్‌పై సామూహిక అత్యాచారానికి మరణశిక్ష లేదా జీవిత ఖైదు నిబంధన తెచ్చారు. పెళ్లి చేసుకుంటానన్న తప్పుడు వాగ్దానాలతో లైంగిక సంబంధాలు పెట్టుకుని మహిళలను వదిలేయడం వంటి కేసులకు కొత్త నిబంధన పెట్టారు. మహిళలు, పిల్లలపై నేరాల్లో బాధితులకు అన్ని ఆస్పత్రుల్లో ప్రథమ చికిత్స లేదా ఉచిత వైద్యం అందించాలి. మహిళలు, 15 ఏళ్లలోపు, 60 ఏళ్లు పైబడిన వ్యక్తులు, వికలాంగులు, తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నవారు ఇంటినుంచే పోలీసు సాయం పొందవచ్చు. కోర్టు అనుమతి లేకుండా లైంగిక దాడి గురించి ప్రచురిస్తే రెండేళ్ల జైలు శిక్ష, జరిమానా నిబంధన చేర్చారు.→ కొత్త చట్టాల ప్రకారం ఫిర్యాదుల నుంచి సమన్లదాకా అన్నీ ఆన్లైన్లో జరగనున్నాయి. పోలీసు స్టేషన్‌కు వెళ్లే పని లేకుండా ఎల్రక్టానిక్ కమ్యూనికేషన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఎస్ఎంఎస్ ద్వారా కూడా సమన్లు పంపవచ్చు. పరిధితో సంబంధం లేకుండా ఏ పోలీస్ స్టేషన్లో అయినా ఎఫ్ఐఆర్ దాఖలు చేసే జీరో ఎఫ్ఐఆర్ విధానం ప్రవేశపెట్టారు. అరెస్టయిన వ్యక్తి కుటుంబానికి, స్నేహితులకు సమాచారాన్ని పంచుకునే వీలు కల్పించడంతోపాటు వివరాలను పోలీస్ స్టేషన్లలో ప్రదర్శిస్తారు. -
ఏబీఎన్ రాధాకృష్ణపై కేసు నమోదు
సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో షెల్ కంపెనీల ముసుగులో రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఏపీఎస్ఎస్డీసీ) నిధులు కొల్లగొట్టిన కేసులో అరెస్టుల పర్వానికి తెరలేచింది. రూ. 241 కోట్ల కుంభకోణంలో కీలకంగా వ్యవహరించిన ప్రైవేటు కంపెనీలకు చెందిన ముగ్గురు ప్రతినిధులను సీఐడీ అధికారులు ఆదివారం అరెస్ట్ చేశారు. పుణేకు చెందిన డిజైన్ టెక్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ వికాస్ ఖన్విల్కర్, ఢిల్లీకి చెందిన స్కిల్లర్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ముఖేశ్ అగర్వాల్, నోయిడాలో నివసిస్తున్న సీమెన్స్ కంపెనీ మాజీ ఎండీ సుమన్ బోస్‌లను సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. అక్కడి న్యాయస్థానాల నుంచి ట్రాన్సిట్ వారంట్ పొంది విజయవాడ తీసుకువచ్చారు. ఆ ముగ్గురిని విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానంలో హాజరు పరచగా న్యాయమూర్తి వారికి ఈ నెల 24 వరకు రిమాండ్ విధించారు. సోదాలు నిర్వహిస్తుండగా రాధాకృష్ణ హల్చల్ సీఐడీ అధికారుల విధులకు ఆటంకం కలిగించిన కేసులో ఆంధ్రజ్యోతి–ఏబీఎన్ చానల్ ఎండీ వేమూరి రాధాకృష్ణపై కేసు నమోదైంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ‘రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో నిధుల దారి మళ్లింపు కేసు విచారణలో భాగంగా సీఐడీ అధికారులు శుక్రవారం హైదరాబాద్‌లో సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ కేసులో నిందితుడైన అప్పటి ఏపీఎస్ఎస్డీసీ డైరెక్టర్ కె.లక్ష్మీ నారాయణ నివాసంలో సీఐడీ అధికారులు సోదాలు నిర్వహిస్తుండగా వేమూరి రాధాకృష్ణ అక్కడకు చేరుకుని హల్చల్ చేయడం వివాదాస్పదమైంది. ఆయన తన అనుచరులతో బయట సీఐడీకి వ్యతిరేకంగా నినాదాలు చేయించారు. సీఐడీ సోదాల ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేయడం ఆపాలని, బయట అనుచరులను అదుపు చేయాలని సీఐడీ అధికారులు చెప్పినప్పటికీ ఆయన వినిపించుకోలేదు. దాంతో సీఐడీ అధికారులు తీవ్ర ఒత్తిడి మధ్యే పంచనామా పూర్తి చేయాల్సి వచ్చింది. ఆ పంచనామాలోని అంశాలను త్వరగా న్యాయస్థానానికి సమర్పించాల్సి ఉన్నందున సీఐడీ అధికారులు వెంటనే విజయవాడకు తిరిగి వచ్చేశారు. అనంతరం వేమూరి రాధాకృష్ణ తమ విధులకు ఆటంకం కలిగించిన విషయంపై విజయవాడలోని సీఐడీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దాంతో 353, 341, 186, 120(బి) సెక్షన్ల ద్వారా ఆయనపై జీరో ఎఫ్ఐఆర్ కింద ఆదివారం కేసు నమోదు చేశారు. తదుపరి విచారణ కోసం కేసును తెలంగాణకు బదిలీ చేయనున్నారు. చదవండి: దోపిడీలో స్కిల్.. బాబు గ్యాంగ్ హల్'షెల్' -
బూతులు తిడుతూ వివస్త్రను చేసి ఫోటోలు, వీడియోలు..
సాక్షి, పంజగుట్ట: జోగిని శ్యామలతోపాటు మరో 15 మందిపై పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌లో జీరో ఎఫ్ఐఆర్ కేసు నమోదయ్యింది. అనంతరం సదరు కేసును మెదక్ జిల్లా పాపన్నపేట పోలీస్‌స్టేషన్‌కు బదలాయించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని గాందీనగర్‌కు చెందిన ఓ యువతి తన తల్లితో కలిసి ఈ నెల 12వ తేదీన మెదక్ జిల్లా ఏడుపాయల సమీపంలోని నాగసాన్‌పల్లిలోని వనదుర్గ భవాణి దేవి దేవాలయానికి వెళ్లింది. అక్కడ దర్శనం పూర్తయిన తర్వాత అదే దేవాలయానికి వచ్చిన జోగిని శ్యామలను కలిసింది. శ్యామల తాను ఉంటున్న ప్రదేశానికి రావాలని సదరు యువతి, ఆమె తల్లిని ఆహ్వానించింది. దీంతో రాత్రి 8 గంటల సమయంలో వీరిద్దరూ అక్కడకు వెళ్లారు. అక్కడ శ్యామలతో పాటు మరో 15 మంది యువకులు, హెల్పర్ ఉమ ఉంది. ఈ క్రమంలో వారు మద్యం తాగుతుండగా యువతిని కూడా మద్యం తాగాలని ఒత్తిడి చేశారు. తాను దానికి ఒప్పుకోలేదని, దీంతో బూతులు తిడుతూ వివస్త్రను చేసి ఫోటోలు, వీడియోలు తీసినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. అంతే కాకుండా బాధిత మహిళను, ఆమె తల్లిపై దాడి చేసి విపరీతంగా కొట్టి గాయపరిచారని పేర్కొంది. బాధితురాలు డ్రైవర్ సాయంతో అక్కడ నుంచి తప్పించుకుని 13వ తేదీ నగరానికి చేరుకున్నట్లు, గాయాలు కావడంతో నేడు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు పంజగుట్ట పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ బుక్ చేసి పాపన్నపేట పోలీస్‌స్టేషన్‌కు బదలాయించారు. చదవండి: డాన్‌ను అంటూ బెదిరించినందుకే రౌడీషీటర్ హత్య ఇద్దరూ తోడుగా వెళ్లారు.. ఒక్కరే తిరిగొచ్చారు! -
బాధితులకు వరం.. జీరో ఎఫ్ఐఆర్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అమలవుతున్న జీరో ఎఫ్ఐఆర్ పద్ధతి బాధితులకు వరంగా మారింది. తెలంగాణాలో దిశ ఘటన తరువాత మన రాష్ట్రంలో జీరో ఎఫ్ఐఆర్ అమలుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కారు చర్యలు చేపట్టిన సంగతి తెల్సిందే. తాజాగా కేంద్ర హోంశాఖ సైతం జీరో ఎఫ్ఐఆర్ అమలు చేయాలని, చట్టంలో ఉన్న వెసులుబాటును అమలు చేయని పోలీసు అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. చట్టం ప్రకారం బాధితులు తమ సమీపంలోని ఏ పోలీసు స్టేషన్లోనైనా ఫిర్యాదు చేసుకునే అవకాశం, వారి ఫిర్యాదుపై ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్) నమోదు చేయాలనే నిబంధన ఉన్నాయి. మన రాష్ట్రంలో ఈ నిబంధనలు ఏడాదిగా పక్కాగా అమలవుతున్నాయి. గతేడాది మొదటి జీరో ఎఫ్ఐఆర్ కృష్ణాజిల్లా కంచికచర్లలో నమోదైంది. రాష్ట్రంలో ఇప్పటివరకు జీరో ఎఫ్ఐఆర్కు సంబంధించి 341 కేసులు నమోదయ్యాయి. గతేడాది 62 కేసులు, ఈ ఏడాది సెప్టెంబర్ వరకు 279 కేసులు నమోదు చేసినట్టు దిశ ప్రత్యేక అధికారి దీపికాపాటిల్ చెప్పారు. జీరో ఎఫ్ఐఆర్ ప్రాధాన్యత వెనుక తెలంగాణలోని షాద్‌నగర్ గ్యాంగ్ రేప్ (దిశ ఘటన)తో జీరో ఎఫ్ఐఆర్ అంశం తెరమీదకు వచ్చింది. ఈ ఘటనలో ఫిర్యాదు తీసుకోకుండా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో.. చట్టంలో జీరో ఎఫ్ఐఆర్ వెసులుబాటు ఉందనే విషయం వెలుగులోకి వచ్చింది. తమ కుమార్తె కనిపించడం లేదని ఆమె కుటుంబసభ్యులు ఫిర్యాదు చేసినా స్థానిక పోలీసులు అది తమ పరిధిలోనిది కాదంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. మిస్సింగ్ కంప్లెయింట్ ఇవ్వడానికి వెళితే తమ పరిధి కాదని పోలీసులు అనడంతో తాము రెండు పోలీసు స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వచ్చిందని బాధితురాలి కుటుంబసభ్యులు అప్పట్లో ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై విచారించిన పోలీసు ఉన్నతాధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహించిన శంషాబాద్ పీఎస్‌కు చెందిన ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే దిశ మాదిరి ఆంధ్రప్రదేశ్‌లో ఏ ఒక్క అమ్మాయికి అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కారు జీరో ఎఫ్ఐఆర్ పద్ధతిని ఖచ్చితంగా అమలు చేసేలా పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. జీరో ఎఫ్ఐఆర్ నిరాకరిస్తే పోలీసులపై క్రిమినల్ కేసు బాధితులు ఫిర్యాదు చేసినా జీరో ఎఫ్ఐఆర్ నమోదుకు నిరాకరించే పోలీసులపై క్రిమినల్ (కేసు) చర్యలు తప్పవని ఇటీవల కేంద్ర హోంశాఖ సైతం హెచ్చరించింది. అన్యాయం జరిగిన చోటే ఫిర్యాదు చేసుకో.. మీ ప్రాంత పోలీస్ స్టేషన్లోనే ఫిర్యాదు చేసుకో.. మా దగ్గరకు ఎందుకొచ్చావ్.. ఇవీ ఏళ్ల తరబడి పోలీసు స్టేషన్లలో పలువురు అధికారుల నోట కర్కశంగా వినిపించిన మాటలు. ఇప్పుడు రాష్ట్రంలో ఈ మాటలు వినిపించడంలేదు. బాధితులు ఏ ప్రాంతం వారైనా, ఎక్కడైనా సత్వర సహాయం కోసం సమీపంలోని పోలీసు స్టేషన్‌ను ఆశ్రయిస్తున్నారు. బాధితులు వచ్చిన వెంటనే వారినుంచి వివరాలు తీసుకుని ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్) నమోదు చేసి కేసును సంబంధిత పోలీసు స్టేషన్‌కు పంపించాలి. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి నిరాకరించిన స్టేషన్ హౌస్ ఆఫీసర్ (పోలీసు)పై ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) సెక్షన్ 166ఎ ప్రకారం క్రిమినల్ కేసు నమోదు చేయవచ్చు. జీరో ఎఫ్ఐఆర్ నమోదుకు సహకరించని పోలీసు అధికారి సస్పెన్షన్‌కు గురవడంతోపాటు క్రిమినల్ కేసులో ఆరునెలల నుంచి రెండేళ్లపాటు శిక్షకు గురయ్యే అవకాశం ఉంది. -
కన్నేసి... కాటేసి..
బంజారాహిల్స్ (హైదరాబాద్): ఇటీవల ఢిల్లీకి చెందిన ఓ యువతిని బర్త్‌డే పార్టీ పేరుతో నగరానికి పిలిచి అత్యాచారానికి ఒడిగట్టిన విషయం మరువకముందే నగరంలో అటువంటి సంఘటనే మరొకటి చోటుచేసుకుంది. కేక్‌లో మత్తుమందు కలిపి అపస్మారక స్థితిలోకి వెళ్లిన తర్వాత ముగ్గురు యువకులు ఓ యువతిపై అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ రెండు ఘటనల్లోనూ నిందితులు వేరైనా నేరం తీరు ఒకేరకంగా ఉంది. జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో జీరో ఎఫ్ఐఆర్గా నమోదైన ఈ కేసు వివరాలిలా ఉన్నాయి. ఎస్పీఆర్హిల్స్ వినాయకనగర్‌లో నివసించే బొందలగడ్ల నవీన్‌రెడ్డి(22) క్లీనర్‌గా పనిచేస్తుండగా అదే ప్రాంతంలో నివసించే మాధవ్‌జీ జోసెఫ్(20) ప్లాస్టిక్ గ్లాసుల విక్రయం చేస్తుంటాడు. సాఫ్ట్వేర్ కంపెనీలో హౌస్ కీపింగ్ పనిచేసే రాగిని రాము(23) ముగ్గురూ ఫ్రెండ్స్ కాగా ఈ ముగ్గురికీ అదే ప్రాంతంలో నివసించే ఓ యువతితో పరిచయం ఏర్పడింది. నలుగురూ స్నేహితులుగా ఉండేవారు. ఎవరికి వారే ఆమెను ప్రేమలో పడేసేందుకు యత్నిస్తున్నారు. ఆ యువతి సికింద్రాబాద్‌లోని ఓ డిగ్రీ కళాశాలలో డిగ్రీ చదువుతోంది. ఈనెల 5న ఫీజు చెల్లించేందుకు ఇంట్లోంచి కాలేజీకి వెళ్లింది. కలసి వేడుక చేసుకుందామని.. యువతికి జోసెఫ్ ఫోన్ చేసి తన పుట్టినరోజు ఉందని అందరం కలసి సెలబ్రేట్ చేసుకుందామని చెప్పడంతో ఆమె ఒప్పుకుంది. నవీన్‌రెడ్డి, జోసెఫ్‌లు యువతి కళాశాలకు వెళ్లి ఆమెను బైక్‌పై కూకట్‌పల్లిలోని ఓయో రూమ్స్‌కు తీసుకెళ్లారు. అప్పటికే అక్కడ మరో స్నేహితుడు రాము వేచి ఉన్నాడు. ముగ్గురూ కలసి ముందస్తు ప్రణాళిక ప్రకారం కేక్‌పై మత్తు చల్లి ఆమెకు తినిపించారు. ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిన తర్వాత అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె స్పృహలోకి వచ్చి జరిగిన విషయం తెలుసుకొని రోదిస్తుండగా ఈ విషయం బయటికి చెబితే నగ్న దృశ్యాలు వైరల్ చేస్తామని బెదిరించారు. దీంతో ఆమె భయపడి ఆ రోజు ఎవరికీ చెప్పలేదు. ఆరోగ్యం దెబ్బతినడంతో.. రెండ్రోజుల తర్వాత బాధిత యువతికి ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిని ఫిట్స్ రావడంతో ఆస్పత్రిలో చేర్చారు. అక్కడి వైద్యులు లోతుగా అడగడంతో జరిగిన విషయాన్ని బాధితురాలు తల్లిదండ్రులకు చెప్పింది. యువతి తల్లిదండ్రులు ఆ ముగ్గురు యువకులను పిలిపించి తిట్టారు. కూతుర్ని కొట్టారు. ఇదే విషయంపై బుధవారం రాత్రి తనపై అత్యాచారానికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలంటూ జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఘటన కేపీహెచ్‌బీ ప్రాంతంలో జరగడంతో కేసును అక్కడికి బదిలీ చేశారు. నిందితులను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అత్యాచార కేసుల్లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు
సాక్షి, అమరావతి: మహిళలు, ఆడపిల్లలపై రోజురోజుకీ పెరిగిపోతున్న దారుణాలపై కేంద్ర హోం శాఖ స్పందించింది. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన హాథ్రస్ హత్యాచార ఘటన నేపథ్యంలో మహిళల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ చట్టాలను అనుసరించి కేంద్ర హోం శాఖ జారీ చేసిన మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి.. ► మహిళలపై నేరాలు.. ప్రధానంగా అత్యాచారం వంటి కేసుల్లో పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి. లైంగిక దాడి వంటి ఘటనల్లో తప్పనిసరిగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. ఒకవేళ నేరం బాధితురాలుండే పోలీస్‌స్టేషన్ పరిధి వెలుపల జరిగితే.. ఎక్కడైనా సరే ‘జీరో ఎఫ్ఐఆర్’ నమోదు చేయాల్సిందే. లేకపోతే సదరు పోలీస్ అధికారి శిక్షార్హుడు. ► లైంగిక దాడి గురించి సమాచారం అందిన 24 గంటల్లోగా బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించాలి. న్యాయాధికారి ముందు రికార్డు చేయనప్పటికీ.. బాధితురాలి మరణ వాంగ్మూలం పరిగణనలోకి తీసుకోవాలి. ► లైంగిక దాడుల కేసుల్లో సాక్ష్యాలను సేకరించేందుకు సెక్సువల్ అసెల్ట్ ఎవిడెన్స్ కలెక్షన్ కిట్లను ఉపయోగించాలి. అత్యాచార కేసుల్లో పోలీసుల దర్యాప్తు 60 రోజుల్లో పూర్తి చేయాలి. ► దర్యాప్తులో రాష్ట్ర పోలీసులకు సహకారం అందించేందుకు ‘ఇన్వెస్టిగేషన్ ట్రాకింగ్ సిస్టమ్ ఫర్ సెక్సువల్ అఫెన్సెస్’ ఆన్లైన్ పోర్టల్‌ను కేంద్ర హోం శాఖ అందుబాటులోకి తెచ్చింది. ఈ మార్గదర్శకాలు పాటించని పోలీసులపైనా కఠిన చర్యలు ఉంటాయి. ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్ మహిళలు, ఆడపిల్లల రక్షణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలిచింది. తెలంగాణలో జరిగిన ‘దిశ’ ఘటన నేపథ్యంలో.. ఏపీలోని ఆడబిడ్డలెవరికీ అలాంటి అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో వైఎస్ జగన్ ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. మహిళలు, బాలికల రక్షణకు ప్రత్యేకంగా ‘దిశ’ యాక్ట్ తెచ్చింది. దిశ పోలీస్ స్టేషన్లు, సైంటిఫిక్ ల్యాబ్‌లు ఏర్పాటు చేసింది. ఫలితంగా మహిళలు, చిన్నారులపై అత్యాచారానికి, లైంగిక వేధింపులకు పాల్పడిన దుర్మార్గులకు 21 రోజుల్లోనే శిక్షలు పడేలా కృషి చేస్తోంది. ఏపీలోని దిశ యాక్ట్ తరహాలోనే ప్రత్యేక చట్టం తెచ్చేందుకు మహారాష్ట్ర, తదితర రాష్ట్రాలు ఏపీలో అధ్యయనం కూడా చేశాయి. అన్యాయానికి గురైన మహిళలు ఎక్కడైనా ఫిర్యాదు చేసేలా 2019 డిసెంబర్ 5 నుంచే రాష్ట్రంలో జీరో ఎఫ్ఐఆర్ను అమలులోకి తెచ్చారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 341 జీరో ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో రాష్ట్రంలో తీసుకొచ్చిన దిశ యాక్ట్, జీరో ఎఫ్ఐఆర్ తదితరాలు మహిళలు, చిన్నారుల రక్షణలో సత్ఫలితాలను ఇస్తున్నాయని ఏపీ పోలీస్ శాఖ టెక్నికల్ చీఫ్ పాల్‌రాజ్ ‘సాక్షి’కి తెలిపారు. -
జీరో ఎఫ్ఐఆర్! నాలుగేళ్లలో ఇదే మొదటిసారి
సాక్షి, సిటీబ్యూరో: లాక్డౌన్ మొదలైన నెల రోజుల తర్వాత దాని ప్రభావం నగర సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కనిపించింది. ఈ ఠాణాలో గురువారం ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. గత నాలుగేళ్లలో ఇలా జరగడం ఇదే మొదటిసారని అధికారులు చెబుతున్నారు. శుక్రవారం మాత్రం మూడు కేసులు రిజిస్టర్ చేశారు. దేశంలోనే కాదు ప్రపంచంలో గణనీయంగా పెరుగుతున్న నేరాల్లో సైబర్ క్రైమ్ ప్రథమ స్థానంలో ఉంటోంది. కనిపించని ఈ–నేరగాళ్లు ఏటా రూ. వందల కోట్లు కొల్లగొడుతున్నారు. ఈ ప్రభావం నగరంలోనూ కనిపిస్తోంది. గత ఏడాది 1400కు పైగా కేసులు నమోదు కాగా.. రూ.25 కోట్లకుపైగా సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టారు. ఈ లెక్కన చూసుకుంటే సరాసరిన రోజుకు మూడు కంటే ఎక్కువ కేసులు రిజిస్టర్ అయ్యాయి. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి దద22 వరకు 612 కేసులు నమోదయ్యాయి. లాక్ డౌన్ ప్రారంభమైన తొలి రోజు (మార్చ్ 23న) సైతం ఈ ఠాణా అధికారులు ఏడు కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు సోషల్ మీడియా కేసులతో బిజీ అయిపోయారు. లాక్డౌన్, కరోనా వైరస్‌లకు సంబంధించి అనేక పుకార్లు వీడియో, ఆడియోల రూపంలో షికార్లు చేశాయి.(రంజాన్ ప్రార్థనల్లో బుడ్డోడు.. నెటిజన్లు ఫిదా) వీటిపై బాధితుల ఫిర్యాదుల ఆధారంగా, సుమోటోగానూ కేసులు నమోదు చేసిన సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేశారు. ఈ కేసుల్లో అరెస్టులు, నోటీసులు జారీ చేయడం కూడా జరిగింది. వీటికి తోడు సైబర్ నేరగాళ్లకు టార్గెట్‌గా మారిన బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు గడిచిన నెల రోజుల్లో 146 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ లెక్కన చూస్తే లాక్డౌన్ సమయంలోనూ సగటున రోజుకు నాలుగుకు పైగా సైబర్ నేరాలకు సంబంధించిన ఎఫ్ఐఆర్లను సైబర్ క్రైమ్ ఠాణా అధికారులు రిజిస్టర్ చేశారు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా గురువారం కనీసం ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. దీనిపై ఓ అధికారి ‘సాక్షి’తో మాట్లాడుతూ... ‘సైబర్ క్రైమ్ ఠాణాకు ప్రతి రోజూ 30 నుంచి 40 ఫిర్యాదులు వస్తుంటాయి. వీటిని పరిశీలించి కేసు నమోదుకు ఆస్కారం ఉన్నవి గుర్తించి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాం. సెలవు దినాలకు తర్వాతి రోజు, సోమవారాల్లో ఫిర్యాదులు, కేసుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా గురువారం కేవలం 14 మంది మాత్రమే సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. వీటికి కేసు నమోదు ప్రమాణాలు లేకపోవడంతో ఒక్క కేసూ నమోదు చేయలేదు. 2016 నుంచి పరిశీలిస్తే సెలవు దినాలు మినహా పని రోజుల్లో (లాక్డౌన్ సహా) ఇలా జరగడం ఇదే తొలిసారి. లాక్‌డౌన్‌ను పకడ్భందీగా అమలు చేస్తుండటంతో పాటు సైబర్ నేరగాళ్ల బారినపడి ఎవరూ భారీ మొత్తం నష్టపోకపోవడమే దీనికి కారణమని భావిస్తున్నాం. శుక్రవారం మాత్రం మూడు కేసులు నమోదు చేశాం’ అన్నారు.(నాన్న..ఇంకెంత దూరం!) కేసులు నమోదైన నేరాలివీ.. శుక్రవారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు మూడు నేరాలకు సంబంధించి వేర్వేరు కేసులు నమోదు చేశారు. నగరానికి చెందిన ఓ యువకుడు బైక్ ఖరీదు చేయాలని భావించి ఓఎల్ఎక్స్ లో సెర్చ్ చేశాడు. అందులో సీఐఎస్ఎఫ్లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న వ్యక్తిగా చెప్పుకున్న సైబర్ నేరగాడు రూ.34 వేలకే హైఎండ్ బైక్ విక్రయిస్తున్నట్లు పోస్టు చేశాడు. తక్కువ ధరకే వాహనం వస్తోందని భావించిన యువకుడు ఎవరికీ విషయం చెప్పకుండా ఆ మొత్తం ఆన్లైన్లో చెల్లించేశాడు. మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ద్వారా వస్తుందని చెప్పిన వాహనం ఎంతకీ రాకపోవడంతో అనుమానించిన బాధితుడు తన సోదరుడైన కానిస్టేబుల్‌కు విషయం చెప్పగా అతడివ సూచన మేరకు శుక్రవారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశాడు. అలాగే పద్మారావునగర్‌కు చెందిన ఓ వ్యక్తి నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్స్ ఈ–మెయిల్‌కు వచ్చే సదుపాయం ఉంది. దీన్ని గమనించిన సైబర్ నేరగాళ్లు తమ మెయిల్‌కు ఇవి వచ్చేలా మార్పిడి చేసి గురువారం అర్ధరాత్రి ఐదు లావాదేవీల్లో రూ.45 వేలు కాజేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టారు. సిటీకి చెందిన మరో మహిళ తనకు ఇంటర్నేషనల్ కోడ్స్‌తో కూడిన వర్చువల్ నెంబర్లతో బ్లాంక్ కాల్స్ వస్తున్నాయని, తిరిగి కాల్ చేస్తే ఎవరూ ఎత్తడం లేదని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. -
తక్షణ స్పందన.. రాత్రి 11 గంటలకు కేసు నమోదు
సాక్షి, విజయవాడ: అర్ధరాత్రి ఓ మహిళ ఫిర్యాదుపై స్పందించి జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన హనుమాన్ జంక్షన్ పోలీసులను నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులు అభినందించారు. జీరో ఎఫ్ఐఆర్తో మహిళలకు అదనపు భద్రత లభిస్తుందని అన్నారు. మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన నిందితులు యజ్జల దర్బార్ అతని కుమారుడిని మీడియా ఎదుట ప్రవేశ పెట్టారు. కేసు వివరాలను డీఎస్పీ వెల్లడించారు. పశ్చిమ గోదావరిలో ఘటన.. తణుకు నుంచి హైదరాబాద్ వెళుతున్న ఓ ప్రైవేటు బస్సులో మహిళ పట్ల ఇద్దరు వ్యక్తులు అసభ్యంగా ప్రవర్తించారు. పచ్చిమ గోదావరి జిల్లా కలపర్రు వద్ద ఈ ఘటన చోటుచేసుకోగా.. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో కృష్ణాజిల్లాలోని హనుమాన్ జంక్షన్ పోలీసులు జీరో ఎఫ్ఐఆర్తో కేసు నమోదు చేశారు. రాత్రి 11 గంటల సమయంలో కేసు రిజిస్టర్ చేయడం విశేషం. నిందితులు పశ్చిమ గోదావరి జిల్లా నారాయణపురంకు చెందిన యజ్జల దర్బార్ అతని కుమారుడిగా గుర్తించారు. -
హైదరాబాద్‌లో యువతి అదృశ్యం
సుల్తాన్‌బజార్: నగరంలో చదువుకుంటున్న ఓ విద్యార్థిని అదృశ్యం కేసులో జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది. సుల్తాన్‌బజార్ ఎస్ఐ వై.లింగారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన ఎన్.బుచ్చన్న కుమార్తె ఎన్.ఇంద్రజ (19) నగరంలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతోంది. కోఠిలోని గోకుల్‌చాట్ పక్కన ఉన్న ఆర్పీఎస్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటోంది. ఈ నెల 1న ధర్మపురిలోని ఇంటికి వెళ్తున్నానంటూ కోఠిలోని హాస్టల్ నుంచి బయలుదేరింది. మూడు రోజులవుతున్నా ఆమె ఇంటికి చేరుకోకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు కోఠిలోని హాస్టల్లో వాకబు చేశారు. ఈ నెల 1వ తేదీనే ఇంద్రజ బయల్దేరిందని హాస్టల్ నిర్వాహకులు చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు స్థానికంగా ధర్మపురి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అక్కడి పోలీసులు జీరో ఎఫ్ఐఆర్గా కేసును నమోదు చేసుకుని ఆన్లైన్లో సుల్తాన్‌బజార్ పోలీసులకు బదిలీ చేశారు. యువతి అదృశ్యం కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఎక్కడైనా ఫిర్యాదు చేయొచ్చు..
సాక్షి, ప్రొద్దుటూరు: చాగలమర్రి సమీపంలోని కడప–కర్నూలు జాతీయ రహదారి పక్కన ఉప్పలపాడు, ఇడమడక అనే రెండు గ్రామాలు ఉన్నాయి. మధ్యలో ఏర్పాటు చేసిన సిమెంట్ రోడ్డే రెండు గ్రామాల మధ్య హద్దు. ఎడమ వైపు ఉన్న ఉప్పలపాడు గ్రామం రాజుపాళెం మండల పరిధిలోకి వస్తే.. రోడ్డుకు కుడి వైపు ఉన్న ఇడమడక దువ్వూరు మండల పరిధిలోకి వస్తుంది. ఈ గ్రామాల్లో ఏదైన సంఘటన జరిగినప్పుడు ఏ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాలో తెలియక ప్రజలు నేటికీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రొద్దుటూరులోని శివాలయం సెంటర్ వన్‌టౌన్, టూ టౌన్ పోలీస్స్టేషన్ల పరిధిలోకి వస్తుంది. అయితే సమీపంలో త్రీ టౌన్ పరిధి కూడా ఉంది. ఏదైనా సంఘటన జరిగినప్పుడు బాధితులు ఎక్కడ ఫిర్యాదు చేయాలనే సందేహాలు గతంలో అనేక సార్లు వ్యక్తం అయ్యాయి. ఫిర్యాదు చేయడానికి స్టేషన్‌కు వెళ్లినప్పుడు తమ పరిధిలోకి రాదని పోలీసులు వెనక్కి పంపిన సంఘటనలూ చాలానే ఉన్నాయి. ప్రొద్దుటూరులోని రూరల్ పోలీస్‌స్టేషన్‌ను టూ టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నిర్మించారు. ఇటీవల రూరల్ స్టేషన్ ఆవరణంలో చిన్నశెట్టిపల్లె గ్రామస్తులు ఘర్షణ పడగా టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఒక వ్యక్తి రూరల్ స్టేషన్ ముందు విషద్రావణం తాగి ఆత్మహత్యాయత్నం చేయగా ఆ కేసు కూడా టూ టౌన్లో ఎఫ్ఐఆర్ నమోదు అయింది. పట్టణాలు, నగరాల్లో నాలుగైదు పోలీస్స్టేషన్లు ఉంటాయి. చాలా మందికి ఏ ప్రాంతం ఏ స్టేషన్ పరిధిలోకి వస్తుందో తెలియదు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు అందుబాటులో ఉన్న స్టేషన్‌కు ఫిర్యాదు చేయడానికి వెళ్తే.. సంఘటన జరిగిన స్థలం తమ పరిధిలోకి రాదని, మరో స్టేషన్‌కు వెళ్లమని పోలీసు అధికారులు బాధితులను వెనక్కి పంపించిన సంఘటనలు గతంలో అనేకం జరిగాయి. ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో జాప్యం జరిగిన కారణంగా నేరగాళ్లు తప్పించుకుపోయే అవకాశాలు లేకపోలేదు. ఈ కారణంగా బాధితులకు సత్వర న్యాయం జరగాలనే ఉద్దేశంతో ‘జీరో ఎఫ్ఐఆర్’ ను నమోదు చేయాలని పోలీసులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ‘జీరో ఎఫ్ఐఆర్’ విధానంతో సంఘటన జరిగిన ప్రాంతంతో నిమిత్తం లేకుండా ఏ స్టేషన్‌కు వెళ్లైనా ఫిర్యాదు చేయొచ్చు. ఫిర్యాదును తిరస్కరిస్తే చర్యలు.. బాధితులు ఏ స్టేషన్‌కు వెళ్లినా అక్కడి స్టేషన్ అధికారులు ఫిర్యాదు స్వీకరించాల్సించి ఉంటుంది. ఏ పోలీసు అధికారైనా తమ పరిధి కాదని ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి నిరాకరిస్తే వారిని ఐపీసీ 166–ఏ సెక్షన్ ప్రకారం ప్రాసిక్యూట్ చేయడానికి ఆదేశించి, శాఖాపరమైన చర్యలకు సిఫార్స్ చేయవచ్చు. జీరో ఎఫ్ఐఆర్ను నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ అన్బురాజన్ పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో కొన్ని ఇబ్బందులు తలెత్తినా ప్రజల రక్షణ కోసం చేయాల్సిందేనని పోలీసు అధికారులు అంటున్నారు. కేసు తీసుకోనని చెప్పడానికి ఏ పోలీస్ అధికారికి హక్కు లేదు. దీనికి సంబంధించి మార్గదర్శకాలు ఎప్పటి నుంచో ఉన్నా ప్రభుత్వాలు అమలు చేయలేదు. నిర్భయ ఘటన జరిగిన తర్వాత డిల్లీ, ముంబై నగరాల్లో మాత్రమే ఈ ‘జీరో ఎఫ్ఐఆర్’ విధానాన్ని అమలు చేస్తున్నారు. మహిళలు, చిన్న పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు ఏపీలో తొలిసారిగా జీరో ఎఫ్ఐఆర్ను అందుబాటులోకి తీసుకొని రావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘జీరో ఎఫ్ఐఆర్’తో పాటు మహిళలు, చిన్నారులు ఆపదలో ఉన్నప్పుడు 100, 112, 181 టోల్‌ఫ్రీ నంబర్లకు ఫోన్ చేయాలని డీఎస్పీ సుధాకర్ సూచించారు. మహిళల రక్షణ సవాల్‌గా మారింది. గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని పోలీసు అధికారులు భావిస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో కూడా మహిళలు ఫిర్యాదులు ఇవ్వొచ్చని, మహిళా సంరక్షణ కార్యదర్శులు వాటిని పోలీస్‌ష్టేషన్‌కు పంపిస్తారని డీఎస్పీ అంటున్నారు. ‘జీరో ఎఫ్ఐఆర్’ అంటే.. చాలా మంది పోలీసులకు ‘జీరో ఎఫ్ఐఆర్’పై సరైన అవగాహన లేదు. జీరో ఎఫ్ఐఆర్ అంటే.. ఘటన జరిగిన ప్రదేశం ఏ పోలీస్‌స్టేషన్ పరిధిలోకి వస్తుందో తెలియనప్పుడు.. ఏదో ఒక పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడం. రాత్రి, పగలు ఎప్పుడైనా ఆపద సమయంలో బాధితులు స్టేషన్‌కు వెళ్లినప్పుడు పరిధితో నిమిత్తం లేకుండా పోలీసు అధికారులు ఫిర్యాదును స్వీకరించాలి. వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లి బాధితుడు చెప్పిన విషయం ప్రా«థమికంగా నిర్ధారణ అయితే కేసు నమోదు చేయాలి. సాధారణంగా స్టేషన్‌లోని వరుస సంఖ్యతో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. అయితే వచ్చిన కేసు తమ స్టేషన్ పరిధిలోకి రాకపోతే ఎఫ్ఐఆర్ నమోదు చేసి ‘జీరో’ నంబర్ కేటాయిస్తారు. తర్వాత ఆయా పోలీస్‌స్టేషన్‌కు కేసును బదిలీ చేశాక అక్కడ ఎఫ్ఐఆర్కు నెంబర్ ఇస్తారు. ఆపద సమయంలో దారిలో కనిపించే స్టేషన్‌కు గానీ, లేదా దగ్గరలో ఉండే స్టేషన్‌కు గానీ బాధితులు వెళ్లడం సహజం. చట్టంలో జీరో ఎఫ్‌ఆర్‌కు వెసులు బాటు ఉన్నా అధికారుల ఉదాసీనత కారణంగా అమలుకు నోచుకోలేదు. ఫలితంగా నిత్యం ఎంతో మంది బా«ధితులు ఇబ్బందులు పడుతున్నారు. ఇకపై కేసుల నమోదు చేయడంలో ఎలాంటి జాప్యం జరగకూడదనే ప్రభుత్వం ‘జీరో ఎఫ్ఐఆర్’ ను ఖచ్చితంగా నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ విధానంతో స్థానికంగానే గాక రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో ఉన్నా ఆయా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ‘జీరో ఎఫ్ఐఆర్’ కింద కేసు నమోదు చేసుకోమని పోలీసు అధికారులను అడగవచ్చు. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశాలిచ్చాం.. స్టేషన్ పరిధితో నిమిత్తం లేకుండా జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సబ్‌డివిజన్ పరిధిలోని సీఐలు, ఎస్ఐలకు ఆదేశాలు జారీ చేశాం. బాధితులు ఏ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినా ఫిర్యాదులు తీసుకుంటాం. మహిళలు నిర్భయంగా స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయొచ్చు. మíßహిళలు, చిన్న పిల్లల రక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. – లోసారి సుధాకర్, ప్రొద్దుటూరు డీఎస్పీ. జీరో ఎఫ్ఐఆర్ కింద ఫిర్యాదు తీసుకోవాల్సిందే.. బాధితుడికి అన్యాయం జరిగితే తాను నివసించే చోటు నుంచి నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తే పరిధితో నిమిత్తం లేకుండా ‘జీరో ఎఫ్ఐఆర్’ నమోదు చేయాల్సిందేనని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోకవరపు శ్రీనివాస్ ఇటీవల లోక్‌అదాలత్ భవన్లో విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. బాధితుడి ఫిర్యాదుపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశాక సమగ్ర దర్యాప్తు కోసం సంబంధిత పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేయాలని తెలిపారు. ఒక బాధితుడు తమ దగ్గరికి ఫిర్యాదు చేసేందుకు రాగా సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించానన్నారు. తీరా స్టేషన్‌కు వెళితే తమకు సంబంధం లేదని బాధితుడిని పోలీసులు వెనక్కి పంపించినట్లు జిల్లా జడ్జి ఆవేదన వ్యక్తం చేశారు. పబ్లిక్ సర్వెంట్‌గా ఎస్ఐ గానీ, సీఐ గానీ ఎక్కడైనా సెక్షన్ 154 సీఆర్పీసీ ప్రకారం జీరో ఎఫ్ఐఆర్ను నమోదు చేయాలన్నారు. లేకుంటే 166ఏ ఐపీసీ సెక్షన్ ప్రకారం వారే నిందితులవుతారని స్పష్టం చేశారు. ‘దిశ’ మిస్సింగ్‌పై ఫిర్యాదు తీసుకోని పోలీసులు.. హైదరాబాద్‌లోని శంషాబాద్‌లో వెటర్నరీ డాక్టర్ దిశ మిస్సింగ్ విషయంలో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడానికి వెళ్లగా సంఘటనా స్థలం తమ పరిధిలోకి రాదని, మరో స్టేషన్‌కు వెళ్లాలని అక్కడి పోలీసులు చెప్పినట్లు వార్తలు రావడం వివాదాస్పదమైంది. తర్వాత దిశను నలుగురు కలిసి హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ సంఘటన నేపథ్యంలో బాధితుల నుంచి ఏ పోలీస్‌స్టేషన్‌కు మొదట ఫిర్యాదు వస్తే అక్కడే తీసుకోవాలని నిబంధనలు పెట్టారు. ఈ మేరకు ఏపీ డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. -
పక్కాగా జీరో ఎఫ్ఐఆర్ అమలు
సాక్షి, హైదరాబాద్ : దిశ ఘటన నేపథ్యంలో జీరో ఎఫ్ఐఆర్ మరోసారి చర్చకు వచ్చింది. పోలీసు స్టేషన్ పరిధులతో సంబంధం లేకుండా ఎఫ్ఐఆర్ బుక్ చేసి ముందు దర్యాప్తు ప్రారంభిస్తారు. అనంతరం కేసును సంబంధిత స్టేషన్‌కు బదిలీ చేస్తారు. వాస్తవానికి ఇదేం కొత్త విధానం కాదు. ఇప్పటికే మనుగడలో ఉన్నదే. దిశ హత్య కేసు అనంతరం జీరో ఎఫ్ఐఆర్ విధానాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్రంలోని వివిధ జిల్లాల ఎస్పీలు, కమిషనర్లకు డీజీపీ మహేందర్‌రెడ్డి గత నెలాఖరునే మౌఖికంగా ఆదేశాలు జారీ చేశారు. త్వరలోనే ఈ విధానాన్ని అన్ని పోలీస్స్టేషన్లలో తప్పకుండా అమలు చేయాలని ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు డీజీపీ కార్యాలయం తెలిపింది. ప్రత్యేకించి యువతులు, బాలికలు, మహిళలు అదృశ్యమయ్యారంటూ వచ్చిన ఫిర్యాదులపై ఏమాత్రం ఆలస్యం చేయవద్దని అందులో పొందుపరచనున్నారు. నేడో, రేపో ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని పోలీసుస్టేషన్లకు ఆదేశాలు చేరనున్నాయి. ఈ ఏడాది 200పైనే.. జీరో ఎఫ్ఐఆర్ విధానాన్ని చాలా ఏళ్లుగా తెలంగాణ పోలీసులు పాటిస్తున్నారు. 2018లో రాష్ట్రవ్యాప్తంగా వివిధ పోలీసు స్టేషన్ల పరిధుల్లో దాదాపు 1,200 కేసులు ఈ విధానంలో నమోదయ్యాయి. అనంతరం దర్యాప్తు దశలో వాటిని ఇతర స్టేషన్లకు బదిలీ చేశారు. తాజాగా వరంగల్‌లోని సుబేదారిలో నమోదైన యువతి మిస్సింగ్ కేసుతో జీరో ఎఫ్ఐఆర్ల సంఖ్య ఈ ఏడాదిలో 200 దాటింది. గతంలో కేసుల బదిలీ ప్రక్రియ మాన్యువల్‌గా జరిగేది. కానీ తెలంగాణ పోలీసులు ఈ కేసులో మాత్రం సీసీటీఎన్ఎస్ (క్రైం అండ్ క్రిమినల్ ట్రాకింగ్ సిస్టం) ద్వారా ఆన్లైన్లో ఈ ఎఫ్ఐఆర్ను బదిలీ చేయడం గమనార్హం. మహిళలు, యువతులు అదృశ్యమైన సందర్భంలో వెంటనే స్పందిస్తారు. విషయాన్ని సంబంధిత ఎస్పీ, కమిషనర్ కార్యాలయాలకు వెంటనే సమాచారం చేరిపోతుంది. ఆ వెంటనే సీసీటీఎన్ఎస్ ద్వారా డీజీపీ కార్యాలయానికి కేసు వివరాలు చేరతాయి. ఇలాంటి కేసులను ఎస్పీ, కమిషనర్‌తోపాటు డీజీపీ కార్యాలయం కూడా పర్యవేక్షిస్తాయి. -
తెలంగాణలో తొలి జీరో ఎఫ్ఐఆర్ నమోదు
సాక్షి, వరంగల్ : తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఓ యువతి మిస్సింగ్ కేసులో వరంగల్ జిల్లా సుబేదారి స్టేషను పోలీసులు ఈ ఎఫ్ఐఆర్ను నమోదు చేశారు. వివరాలు... శాయంపేట పోలీసు స్టేషన్ పరిధిలోని గోవిందాపూర్‌కు చెందిన 24 ఏళ్ల యువతి కనిపించడం లేదంటూ ఆమె కుటుంబ సభ్యులు సుబేదారి పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలో యువతి చిన్నాన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇక వరంగల్ కమిషనరేట్ పరిధిలో తొలి జీరో ఎఫ్ఐఆర్ నమోదు కావడం పట్ల వరంగల్ సీపీ రవీందర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సుబేదారి పోలీసులను ఆయన అభినందించారు. కాగా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం, హత్య నేపథ్యంలో జీరో ఎఫ్ఐఆర్ అంశం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. దిశపై అఘాయిత్యం జరిగిన రోజు తమ పరిధి కాదంటూ పోలీసులు ఆలస్యం చేయడం వల్లే తమ కూతురుకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. దీంతో పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ రాష్ట్ర డీజీపీ పోలీసులను ఆదేశించారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో సైతం జీరో ఎఫ్ఐఆర్ నమోదైన విషయం తెలిసిందే. కృష్ణా జిల్లానందిగామలో మొదటిసారిగా బాలుడి మిస్సింగ్ కేసు సంబంధించి కంచికచర్ల పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కంచికచర్ల పీఎస్ పరిధి కాకపోయినా కేసు నమోదు చేసిన పోలీసులు రెండు బృందాలతో బాలుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మిర్యాలగూడ మండలం వీరంపాడులో బాలుడిని గుర్తించిన పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. -
మహిళల రక్షణకు చర్యలు తీసుకోండి
న్యూఢిల్లీ: మహిళల రక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర హోంశాఖ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖలు రాసింది. గత కొద్ది రోజులుగా వెలుగు చూస్తున్న అత్యాచార ఘటనలు, దాడుల నేపథ్యంలో లేఖ రాస్తున్నట్లు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్‌భల్లా తెలిపారు. మహిళల రక్షణ ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని ఆయన చెప్పారు. మహిళలకు రక్షణ కల్పించేందుకు చట్టాలను మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని, అయినప్పటికీ పోలీసులు వెంటనే స్పందించడం ద్వారా మరింత మెరుగైన ఫలితాలు ఉంటాయన్నారు. జీరో ఎఫ్ఐఆర్ నమోదుచేయడంలో పోలీసులు విఫలమైతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మహిళలు, బాలికలకు సంబంధించిన ఫిర్యాదుల విషయంలో పోలీసులు వేగంగా స్పందించాలని కోరారు. ఇన్వెస్టిగేషన్ ట్రాకింగ్ సిస్టం ఫర్ సెక్సువల్ అఫెన్సెస్ (ఐటీఎస్ఎస్ఓ) పోర్టల్ ద్వారా ఆయా రాష్ట్రాలలోని అత్యాచార కేసుల విచారణను రెండు నెలల్లోగా పూర్తయ్యేలా పర్యవేక్షణ చేసుకోవచ్చని అందులో సూచించారు. -
పరిధి కాదు.. ఫిర్యాదు ముఖ్యం
సాక్షి, నిర్మల్: నిర్మల్–నిజామాబాద్ జిల్లాల మధ్య గోదావరి నది వంతెనపై సోన్ గ్రామ సమీపంలో కొన్నేళ్ల క్రితం రోడ్డుప్రమాదం జరిగింది. ఘటనలో ఇద్దరు మృతిచెందగా పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన ప్రదేశం రెండు జిల్లాల మధ్యలో ఉంది. సమాచారం రెండు జిల్లాల సరిహద్దు మండలాల పోలీసులకు చేరింది. కానీ.. సత్వరమే రెండు స్టేషన్ల నుంచి స్పందన రాలేదు. తమ పరిధి కాదంటే.. తమ పరిధి కాదంటూ.. సమాధానాలిచ్చారు. కొంతసేపటి తర్వాత సోన్ పోలీసులే వెళ్లి కేసు నమోదు చేసుకున్నారు. ఇలా జిల్లాలో పలు మండలాల మధ్య, జిల్లాకేంద్రం చుట్టూ ఉన్న శివారు ప్రాంతాల మధ్య పోలీసుల ‘పరిధి’ ఇబ్బందిగా మారుతోంది. బాధితులు ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక అవస్థలు పడుతున్నారు. దిశ కేసులోనూ ఇదే పరిస్థితి ఎదురైంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసు చట్టాల్లోనూ మార్పులు తీసుకువస్తోంది. సాంకేతికతను విస్తృతం ఉపయోగించుకుంటున్న పోలీస్‌శాఖ వెలుగులోకి తీసుకురాని జీరో ఎఫ్ఐఆర్ను తెరపైకి తీసుకువచ్చింది. దిశపై అఘాయిత్యం జరిగిన రోజు రాత్రి ఆమె కుటుంబసభ్యులు మిస్సింగ్ కేసు నమోదు చేయడానికి సమీప పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ ఘటన జరిగిన ప్రదేశం తమ పరిధిలోకి రాదని చెప్పారు. దీంతో ఆ రాత్రి బాధిత కుటుంబం రెండు ఠాణాల చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఇలా కేవలం ఈ ఒక్క కేసులోనే కాదు. చాలా సంఘటనలు జరిగినప్పుడు పోలీసుల సాయం కోసం వెళ్లే వారికి ఎదురవుతూనే ఉంది. చట్టం ప్రకారం తమ జ్యురిస్డిక్షన్(పరిధి)లో ఉంటేనే కేసు నమోదు చేస్తామని చెబుతుంటారు. దీంతో బాధితులు వెళ్లి సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసే లోపు దిశలాంటి ఘటనలు జరిగిపోతున్నాయి. ఇక ఇలాంటి సమస్య లేకుండా జీరో ఎఫ్ఐఆర్ విధానాన్ని పకడ్బందీగా అమలులోకి తీసుకువస్తున్నారు. జీరో నంబర్ ఎఫ్ఐఆర్.. పోలీస్ స్టేషన్ల పరిధితో సంబంధం లేకుండా బాధితులు తమకు సమీపంలో ఉన్న ఠాణాలో ఫిర్యాదు చేసుకునేందుకు అవకాశం కల్పించేదే జీరో నంబర్ ఎఫ్ఐఆర్. బాధితుడి నుంచి అందుకున్న ఫిర్యాదును పోలీసుస్టేషన్లో కేసుగా నమోదు చేస్తూ ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్) జారీ చేస్తారు. ప్రతి ఎఫ్ఐఆర్కు సీరియల్ నెంబర్/ఆ సంవత్సరం సూచిస్తూ సంఖ్యను కేటాయిస్తారు. తమ పరి«ధిలో జరగని నేరాలకు సంబంధించి వచ్చే ఫిర్యాదులకు ఎలాంటి నంబర్ కేటాయించకుండా ‘జీరో ఎఫ్ఐఆర్’ నమోదు చేసి వెంటనే బాధితులకు సాయం అందిస్తారు. అనంతరం సంబంధిత ఘటన ఏ స్టేషన్ పరిధిలోకి వస్తుందో పరిశీలించి.. ఆ ఠాణాకు కేసును బదిలీ చేస్తారు. లేకుంటే ఇబ్బందే.. జీరో ఎఫ్ఐఆర్ విధానాన్ని రాష్ట్రంలోనూ అమలు చేయాల్సిన అవసరం ఉందని ‘దిశ’ కేసు స్పష్టం చేసింది. ఠాణాల పరిధులు తెలుసుకోవడం సామాన్యుడికే కాదు ఒక్కోసారి పోలీసులకూ ఇబ్బందికరంగానే మారుతోంది. ఈ పరిధుల సమస్య ఎక్కువగా ఒకచోట నుంచి మరో చోటుకి ప్రయాణాలు చేస్తున్నప్పుడు జరుగుతుంది. మిస్సింగ్, చోరీ, యాక్సిడెంట్ కేసుల్లో ఎక్కువగా ఈ సమస్య ఉత్పన్నమవుతోంది. ప్రతీ పోలీస్‌స్టేషన్‌కు జ్యురిస్‌డిక్షన్‌గా పిలిచే అధికారిక పరిధి ఉంటుంది. సంబంధిత పోలీసు అధికారులు ఆ పరిధిలోని ఘటనలపైనే స్పందిస్తుంటారు. ఆయా పరిధుల్లో జరిగిన నేరాలపై మాత్రమే సదరు ఠాణా అధికారులు కేసు నమోదు చేస్తుంటారు. పరిధి దాటితే చట్టపరంగా తాము సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని పోలీసులు చెబుతుంటారు. కానీ.. ఈ నిబంధనలు సామాన్యులకు ఇబ్బందిగా మారుతోంది. మార్పు ‘దిశ’గా.. దేశవ్యాప్తంగా సంచలనమైన దిశ ఘటనతో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సైతం మరోసారి ఆలోచనలో పడ్డాయి. ఢిల్లీ జరిగిన నిర్భయ ఘటనతో కొత్త చట్టాన్ని తీసుకువచ్చారు. ఇప్పుడు ‘దిశ’ ఘటనపైనా దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఈమేరకు బుధవారం హైదరాబాద్‌లో హోంమంత్రి, పలువురు మంత్రులు, ఉన్నతాధికారులతో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో పలు నిర్ణయాలను తీసుకున్నారు. ప్రధానంగా జీరో ఎఫ్ఐఆర్ అంశంపైనే చర్చ సాగింది. ఈమేరకు ఈ విధానాన్ని రాష్ట్రంలో పక్కాగా అమలు చేయాలని ఉన్నతస్థాయి సమావేశం నిర్ణయించింది. జిల్లాలోనూ సమస్య.. పోలీస్స్టేషన్ల పరిధికి సంబంధించిన సమస్యలు తరచూ ఉత్పన్నమవుతున్నాయి. ప్రధానంగా నిర్మల్ జిల్లాకేంద్రం చుట్టూ విస్తరించింది. ఇందులో సారంగపూర్, నిర్మల్‌రూరల్, సోన్, దిలావర్పూర్ తదితర మండలాలు చుట్టూ ఉన్నాయి. శివారు ప్రాంతాల్లో జరిగిన ఘటనల్లో ఏ స్టేషన్‌కు వెళ్లాలన్న విషయంలో తరచూ ఇబ్బంది ఎదురవుతోంది. బాసర, సోన్ వంతెనలపైన గతంలో రోడ్డుప్రమాదాల విషయంలో ఇలాంటి ఘటనలు ఎదురయ్యాయి. పలు పోలీస్స్టేషన్ల అధికారులు తమ పరిధిలను గుర్తించి, సూచికల బోర్డులను ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం జీరో నంబర్ ఎఫ్ఐఆర్ను కచ్చితంగా అమలు చేయాలని నిర్ణయించడంతో పరిధికి సంబంధం లేకుండా ఫిర్యాదు చేసుకునే అవకాశం ఏర్పడనుంది. ఇది బాధితులకు ఊరటనిస్తుందని పలువురు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఎక్కడైనా ఫిర్యాదు చేయొచ్చు ఏదైన ఘటన జరిగినప్పుడు సంబంధిత ప్రాంతంతో సంబంధం లేకుండా బాధితులు సమీపంలో ఉన్న ఏ పోలీసుస్టేషన్లోనైనా ఫిర్యాదు చేయొచ్చు. చట్ట ప్రకారం స్టేషన్ పరిధి కాని ప్రాంతమైతే జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. అనంతరం సంబంధిత ప్రాంత పోలీసుస్టేషన్‌కు కేసును బదిలీ చేస్తారు. జిల్లాలో ఈ విధానాన్ని ముందు నుంచి అమలు చేస్తున్నాం. ఇప్పుడు మరింత పకడ్బందీగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటాం. – సి.శశిధర్‌రాజు, ఎస్పీ -
వోల్వో బస్సులో వికృత చేష్టలు..
సాక్షి, అనంతపురం: పోలీస్ స్టేషన్ల పరిధితో సంబంధం లేకుండా యువతి ఫిర్యాదు మేరకు అనంతపురం జిల్లా జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు యువతిని వేధిస్తున్న డ్రైవర్‌ను తక్షణమే అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళుతున్న వోల్వో బస్సులో మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్‌పై రిలీవింగ్ డ్రైవర్ నూర్ మహ్మద్ వేధింపులకు దిగాడు. యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ వికృత చేష్టలకు పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు డయల్ 100 నంబరుకు ఫోన్ చేసి పోలీసులు సమాచారం అందించించారు. వెంటనే స్పందించిన పోలీసులు అనంతపురం తపోవనంలో బస్సు ఆపారు. నాలుగో టౌన్ పోలీసులు బాధితురాలి నుంచి ఫిర్యాదు తీసుకొని జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితుడైన డ్రైవర్ నూర్ మహ్మద్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు యువతిని అదే బస్సులో బెంగళూరుకు పంపించారు. ఏపీ పోలీసులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవడంపై బస్సులోని ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం జీరో ఎఫ్ఐఆర్ విధానాన్ని అమలు చేస్తున్న తీరును ప్రశంసించారు. కాగా, కృష్ణా జిల్లా నందిగామ పరిధిలో మొట్ట మొదటి జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది. బాలుడి మిస్సింగ్ కేసు సంబంధించి కంచికచర్ల పోలీసులు తొలి జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. -
ఏపీలో తొలి జీరో ఎఫ్ఐఆర్ నమోదు
సాక్షి, విజయవాడ: కృష్ణా జిల్లానందిగామ పరిధిలో మొట్ట మొదటి జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది. తమ పరిధిలోకి రానప్పటికీ బాధితులు ఫిర్యాదులు చేస్తే జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.. మొదటిసారిగా బాలుడి మిస్సింగ్ కేసు సంబంధించి కంచికచర్ల పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కంచికచర్ల పీఎస్ పరిధి కాకపోయినా కేసు నమోదు చేసిన పోలీసులు రెండు బృందాలతో బాలుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మిర్యాలగూడ మండలం వీరంపాడులో బాలుడిని గుర్తించిన పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. (చదవండి: ఏపీ పోలీసుల సంచలన నిర్ణయం) -
జీరో ఎఫ్ఐఆర్ ఎప్పుడు, ఎలా?
‘దిశ’ సంఘటన తరువాత ‘జీరో’ ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్) గురించిన చర్చ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా జరుగుతోంది. తమకు అధికార పరిధి లేదన్న కారణంగా పోలీసులు ఎఫ్ఐఆర్ని తీసుకోలేదని ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలో జీరో ఎఫ్ఐఆర్ చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. నేర సమాచారం అందిన వెంటనే చట్టప్రకారం కేసు నమోదు చేయాలని రెండు తెలుగు రాష్ట్రాల డీజీపీలు పోలీసులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ పోలీసు యంత్రాంగం ఈ విషయం గురించి సర్క్యులర్ని కూడా జారీ చేసింది. తమకు కేసుని దర్యాప్తు చేసే అధికార పరిధి లేకున్నా ఎఫ్ఐఆర్ని విడుదల చేయాలన్నది ‘జీరో ఎఫ్ఐఆర్’ సారాంశం. నేర తీవ్రత ఎక్కువగా ఉండి, వారెంట్ అవసరం లేకుండానే అరెస్టు చేయగలిగే కేసుల్లో (కాగ్నిజబుల్) నేర సమాచారం అందుకున్న తరువాత పోలీసులు తమ అధికార పరిధితో నిమిత్తం లేకుండా ప్రథమ సమాచార నివేదికను విడుదల చేయాలని, ఆ విధంగా చేయకపోతే వాళ్లపై భారతీయ శిక్షాస్మృతి లోని సె.166ఏ ప్రకారం చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సెప్టెంబర్ 19, 2019 రోజున కర్ణాటక పోలీసులని ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. కాగ్నిజబుల్ నేర సమాచారం అందినప్పుడు పోలీసులు (155లోని) తమ అధికార పరిధితో నిమిత్తం లేకుండా కేసు నమోదు చేయాల్సి ఉంటుంది. పోలీసులు తమ కోర్టు అధికార పరిధిలోని కేసులనే దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సె.156(1) చెబుతుంది. అందుకని తమ అధికార పరిధిలేని కేసులో పోలీసులు ఎఫ్ఐఆర్ విడుదల చేసిన తరువాత, మొత్తం కేసు డైరీని తదుపరి దర్యాప్తు నిమిత్తం సంబంధిత పోలీసులకి పంపించాల్సి ఉంటుంది. జీరో ఎఫ్ఐఆర్ భావన డిసెంబర్ 2012 సంవత్సరంలో ఢిల్లీలో నిర్భయ సంఘటన తరువాత ఈ జీరో ఎఫ్ఐఆర్ అన్న పదబంధం తెరమీదికి వచ్చింది. ఆ సంఘటన జరిగిన తరువాత నియమించిన జస్టిస్ వర్మ కమిటీ తన నివేదికలో ఈ భావనని ప్రతిపా దించింది. కేసుని దర్యాప్తు చేసే అధికార పరిధి లేని పోలీసు అధికారి కాగ్నిజబుల్ నేర సమాచారం అందుకుని ప్రథమ సమాచార నివేదికను విడుదల చేయడాన్ని ఇప్పుడు కొత్తగా జీరో ఎఫ్ఐఆర్ అని అంటున్నారు. నేరం ఎక్కడ జరిగినా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో పోలీసులు ప్రథమ సమాచారాన్ని ఇవ్వవచ్చు. బాధితుల సౌకర్యం కోసం ఈ భావ నని తీసుకొని వచ్చారు. ఇది చట్టంలో ఉన్న విష యమే. లైంగిక నేరాలకు సంబంధించిన సమా చారం అందుకుని పోలీసులు కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ విడుదల చేయకపోతే వాళ్లు భారతీయ శిక్షాస్మృతిలోని సె.166ఏ ప్రకారం నేరం చేసినట్లు అవుతుంది. అది కాగ్నిజబుల్ నేరం. మహిళల మీద నేరాలు జరిగినప్పుడు వాళ్లు తమకు దగ్గరలో ఉన్న స్టేషన్లో ప్రథమ సమాచారం ఇచ్చే వీలు చిక్కుతుంది. అదే విధంగా హత్య, ఆక్సిడెంట్ లాంటి నేరాలు జరిగినప్పుడు జీరో ఎఫ్ఐఆర్ విడుదల చేయడంవల్ల సాక్షులను కాపాడటానికి వీలుపడుతుంది. క్రిమినల్ ప్రొసీ జర్ కోడ్‌లోని సె.156(1) ప్రకారం తన అధికార పరిధిలోని కేసులనే దర్యాప్తు చేసే అధికారం పోలీ సులకి ఉంటుంది. అదే నిబంధనలోని సబ్ సెక్షన్ (2) ప్రకారం–పోలీసులు దర్యాప్తు చేయడానికి అధికార పరిధి లేదన్న కారణంగా, ప్రశ్నించే అవ కాశం లేదు. సె.156(3) ప్రకారం నేరాన్ని సె.190 ప్రకారం గుర్తించే అధికారం ఉన్న మేజిస్ట్రేట్ దర్యాప్తుని ఆదేశించవచ్చు. దర్యాప్తు తరువాత తనకి అధికార పరిధి లేదన్న అభిప్రాయానికి పోలీసు అధికారి వచ్చిన ప్పుడు కేసు డైరీని సంబంధిత పోలీసులకి పంపిం చవచ్చు. అంతేకానీ ఎఫ్ఐఆర్ని నమోదు చేయ డానికి నిరాకరించకూడదు. దిశ కేసులో పోలీసులు అధికార పరిధి లేదన్న కారణంగా ఎఫ్ఐఆర్ని విడుదల చేయకపోవడంతో వాళ్లని సస్పెండ్ చేశా రని పత్రికల్లో చూశాం. ఒకవేళ ఆ ఆరోపణ నిజ మైతే వాళ్లు శాఖాపరమైన చర్యలకే కాదు.. భార తీయ శిక్షాస్మృతిలోని సె.166ఏ ప్రకారం కూడా శిక్షార్హులే. జీరో ఎఫ్ఐఆర్వల్ల ఉపయోగాలతో బాటూ నష్టాలూ ఉన్నాయి. కొంతమంది ఈ భావ నని దుర్వినియోగం చేయడంవల్ల బాధితులకి నష్టం కలుగుతుంది. కొంతమంది దురుద్దేశంతో తమ ప్రయోజనాలకి అనుగుణంగా కేసు విషయా లను ప్రథమ సమాచార నివేదికలో పొందుపరిచి, తమకు అనుకూలంగా ఉన్న పోలీసులతో కుమ్మక్కై బాధితులకి నష్టం కలుగజేసే అవకాశం ఉంది. అయితే ఈ పరిస్థితిని పై అధికారులు సరిచేసే అవ కాశం ఉంది. కోర్టులు కూడా సరిచేయవచ్చు. జీరో ఎఫ్ఐఆర్ భావనని తీసుకొని తమకు అనుకూ లంగా పోలీసు స్టేషన్లలో కేసులని నమోదు చేయిం చుకొని దుర్వినియోగంచేసే అవకాశం ఉంది. హత్య, అత్యాచారం లాంటి కేసుల విష యంలో పోలీసులు జాగ్రత్తగా ఉండాలి. మిస్సింగ్ కేసులని కూడా జాగ్రత్తగా చూడాల్సి ఉంటుంది. జీరో ఎఫ్ఐఆర్ చట్టబద్ధం. 1976లోనే ఈ విషయాన్ని సుప్రీంకోర్టు జీరో ఎఫ్ఐఆర్ అని చెప్పకుండా అధికార పరిధితో నిమిత్తం లేకుండా విడుదల చేయాలని చెప్పింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సె.154 ఇదే విష యాన్ని చెబుతుంది. ఇన్ని సంవత్సరాలు గడిచినా పోలీసులు ఈ విషయాన్ని గుర్తించకపోవడం బాధని కలుగజేస్తుంది. తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా వాళ్లకే తెలి యాలి. కనీసం నిర్భయ ఘటన తరువాతైనా ఈ విషయాన్ని పట్టించుకోక పోవడం శోచనీయం. దిశ సంఘటన తరువాత అలాంటి సంఘటనలు మళ్లీ మళ్లీ జరుగవని ఆశిద్దాం. వ్యాసకర్త, మంగారి రాజేందర్, మొబైల్ : 94404 83001 -
జీరో ఎఫ్ఐఆర్ అమలుచేస్తాం
సాక్షి, అమరావతి: పోలీస్‌స్టేషన్ పరిధితో సంబంధం లేకుండా ఏ స్టేషన్లో అయినా ఫిర్యాదు చేసేలా జీరో ఎఫ్ఐఆర్ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఈ మేరకు అన్ని రేంజీల డీఐజీలు, జిల్లా ఎస్పీలు, స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు మెమో జారీ చేశామన్నారు. ప్రజలు తమ సమస్యలపై కేసు పెట్టేందుకు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినప్పుడు నేరం లేదా ఘటన జరిగిన చోటు తమ పరిధిలో లేదని వెనక్కి పంపుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని.. ఇది సరికాదని పేర్కొన్నారు. సోమవారం మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో గ్రామ, వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులకు శిక్షణ ఇచ్చే ట్రైనర్లకు శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తమ పరిధిలో లేని చోట నేరం జరిగినా దానిపై ఫిర్యాదు వస్తే సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, ఆ తర్వాత దాన్ని సంబంధిత పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేయాలని ఆదేశించారు. ఏ పోలీసు అధికారైనా తమ పరిధి కాదని ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి నిరాకరిస్తే వారిని ఐపీసీ166–ఏ ప్రకారం ప్రాసిక్యూట్ చేయడానికి ఆదేశిస్తామని, శాఖాపరమైన చర్యలకు సిఫారసు చేస్తామని స్పష్టం చేశారు. అన్ని యూనిట్ల అధికారులు తమ పరిధిలోని పోలీసుస్టేషన్లు, అధికారులకు ఈ మార్పును తెలిపి అమలయ్యేలా చూడాలన్నారు. ‘స్పందన’ కార్యక్రమంలో ఇప్పటికే 11 వేల కేసులు నమోదు చేశామన్నారు. వీటిలో 18 శాతం మహిళలపై వేధింపులవేనని, ఫిర్యాదుదారుల్లో 52 శాతం మహిళలేనని వెల్లడించారు. అన్ని సేవలు ఒకే చోట పొందేలా యాప్.. మహిళలు, చిన్నారులు ఆపదలో ఉన్నప్పుడు 100, 112, 181 తదితర టోల్‌ఫ్రీ నంబర్లకు ఫోన్ చేయాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ చెప్పారు. ఈ నంబర్లన్నింటినీ ఏకీకృతం చేసే ప్రయత్నాల్లో ఉన్నామని, అప్పుడు దేనికి ఫోన్ చేయాలనే సందిగ్ధం బాధితులకు ఉండదన్నారు. అన్ని సేవలు ఒకే చోట పొందేలా ఒక యాప్‌ను రూపొందిస్తున్నట్లు తెలిపారు. మహిళల రక్షణ సవాల్‌గా మారిందని, గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నామన్నారు. గ్రామ సచివాలయంలోనూ మహిళలు ఫిర్యాదులు ఇవ్వొచ్చని, మహిళా సంరక్షణ కార్యదర్శులు వాటిని పోలీస్‌స్టేషన్‌కు పంపుతారని వివరించారు. పరిపాలన వ్యవస్థను క్షేత్ర స్థాయికి తీసుకువెళ్లే గ్రామ సచివాలయ వ్యవస్థ ఒక విప్లవమని పేర్కొన్నారు. మహిళల భద్రత, రక్షణ, రూల్ ఆఫ్ లా, పోలీసు సమస్యలు, శాంతిభద్రతలు, మహిళా శిశు సంక్షేమ సేవలపై మహిళా సంరక్షణ కార్యదర్శులకు అవగాహన కల్పిస్తామన్నారు. 14,967 మంది గ్రామ, వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులకు రెండు వారాలపాటు శిక్షణ ఇస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నార్, ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి లైఫ్ సేవింగ్ మెడల్‌కు అర్జునరావు పేరు విజయవాడలో బందరు కాలువలో కొట్టుకుపోతున్న మహిళను ప్రాణాలకు తెగించి రక్షించిన ఆర్ఎస్ఐ అర్జునరావును ప్రధానమంత్రి లైఫ్ సేవింగ్ మెడల్‌కు ప్రతిపాదిస్తున్నట్లు డీజీపీ గౌతమ్ సవాంగ్ ఒక ప్రకటనలో తెలిపారు. అతడి ధైర్యసాహసాలను అభినందిస్తున్నట్లు చెప్పారు. -
ఏపీ పోలీసుల సంచలన నిర్ణయం
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ పోలీసులు సోమవారం సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఫిర్యాదులకు సంబంధించి.. "0" (జీరో) ఎఫ్ఐఆర్ అమలు చేయాలంటూ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాలు జారీచేశారు. ఇందుకు సంబంధించి వారం రోజుల్లో విధివిధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఢిల్లీ, ముంబై తరహాలో రాష్ట్రంలో జీరో ఎఫ్ఐఆర్ను అమలు చేయాలని సూచించారు. జీరో ఎఫ్ఐఆర్ అమల్లో ఉంటే.. పోలీసు స్టేషన్ పరిధితో సంబంధం లేకుండా రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోని పోలీసు స్టేషన్లోనైనా ఫిర్యాదు చేయవచ్చు. తమ పరిధి కాదంటూ పోలీసులు బాధితుల ఫిర్యాదును తిరస్కరించడానికి జీరో ఎఫ్ఐఆర్లో అవకాశముండదు. జీరో ఎఫ్ఐఆర్ పేరిట బాధితులు ఏ పోలీసు స్టేషన్లోనైనా ఫిర్యాదు చేస్తే.. దానిని స్వీకరించి.. విచారణ జరిపి.. సంఘటనా స్థలం పరిధిలో ఉన్న స్టేషన్‌కు ఫిర్యాదును పోలీసులు బదిలీ చేయాల్సి ఉంటుంది. అంతకుముందు మంగళగిరిలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గ్రామ, వార్డు మహిళా సంరక్షణ ట్రైనర్స్ వర్క్ షాప్‌ను ప్రారంభోత్సవంలోనే డీజీపీ గౌతం సవాంగ్ ఈ విషయాన్ని వెల్లడించారు. గ్రామ సచివాలయాలకు అందే ఫిర్యాదులు పోలీసులకు అందేలా అనుసంధానం చేస్తున్నామని, జీరో ఎఫ్ఐఆర్ను కచ్చితంగా అమలుచేయాలని అన్ని జిల్లాల ఏస్పీలకు, పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చామని ఆయన వెల్లడించారు. చదవండి: జీరో ఎఫైఆర్‌ను కచ్చితంగా అమలుచేయాలి ‘సున్నా’తో పరిధి సమస్య ఉండదు! పరిధి పరేషాన్ -
జీరో ఎఫ్ఐఆర్ను కచ్చితంగా అమలుచేయాలి
సాక్షి, విజయవాడ: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయ మహిళా సంరక్షణ వ్యవస్థ ద్వారా సమాజంలో పెనుమార్పులు తీసుకువస్తామని డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. గ్రామ సచివాలయాలకు అందే ఫిర్యాదులు పోలీసులకు అందేలా అనుసంధానం చేస్తున్నట్టు తెలిపారు. ఫిర్యాదులకు సంబంధించి పోలీసు స్టేషేన్ పరిధిని పట్టించుకోకుండా జీరో ఎఫ్ఐఆర్ను కచ్చితంగా అమలుచేయాలని అన్ని జిల్లాల ఏస్పీలకు, పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చామని డీజీపీ తెలిపారు. మంగళగిరిలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గ్రామ, వార్డు మహిళా సంరక్షణ ట్రైనర్స్ వర్క్ షాప్‌ను డీజీపీ గౌతం సవాంగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా శిక్షణా తరగతులకు సంబంధించిన మెటీరియల్‌ను ఆయన విడుదల చేశారు. రాష్ట్రంలో పదమూడు జిల్లాల నుంచీ ముఖ్యమైన పోలీసు, మహిళా శిశు సంరక్షణ శాఖ అధికారులు వర్క్ షాప్‌లో పాల్గొన్నారు. ట్రైనర్స్ అనుమానాలు నివృత్తి చేసిన డీజీపీ పలు సూచనలు ఇచ్చారు. ఆరునెలల్లో పది బ్యాచులకు పదకొండు సెంటర్లలో ట్రైనింగ్ ఇవ్వనున్నామని డీజీపీ చెప్పారు. మహిళా సంరక్షణ కార్యదర్సులకు ఆత్మరక్షణ, యోగాలోకూడా శిక్షణ ఇచ్చి మానసిక దృఢత్వాన్ని పెంచుతామన్నారు. మహిళా సంరక్షణకు త్వరలో ఓ యాప్‌ని కూడా విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. జీరో ఎఫైఆర్‌ను కచ్చితంగా అమలుచేయాలని అన్ని జిల్లాల ఏస్పీలకు, ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చినట్టు డీజీపీ తెలిపారు. ఇప్పటికే సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన స్పందనతో మార్పు వచ్చిందని, గ్రామవార్డు మహిళా సంరక్షణ వ్యవస్థ ఏర్పాటుతో సమూలమైన మార్పులు రావటం ఖాయమని డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు.