సాక్షి, ప్రొద్దుటూరు: చాగలమర్రి సమీపంలోని కడప–కర్నూలు జాతీయ రహదారి పక్కన ఉప్పలపాడు, ఇడమడక అనే రెండు గ్రామాలు ఉన్నాయి. మధ్యలో ఏర్పాటు చేసిన సిమెంట్ రోడ్డే రెండు గ్రామాల మధ్య హద్దు. ఎడమ వైపు ఉన్న ఉప్పలపాడు గ్రామం రాజుపాళెం మండల పరిధిలోకి వస్తే.. రోడ్డుకు కుడి వైపు ఉన్న ఇడమడక దువ్వూరు మండల పరిధిలోకి వస్తుంది. ఈ గ్రామాల్లో ఏదైన సంఘటన జరిగినప్పుడు ఏ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాలో తెలియక ప్రజలు నేటికీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
- ప్రొద్దుటూరులోని శివాలయం సెంటర్ వన్‌టౌన్, టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌ల పరిధిలోకి వస్తుంది. అయితే సమీపంలో త్రీ టౌన్ పరిధి కూడా ఉంది. ఏదైనా సంఘటన జరిగినప్పుడు బాధితులు ఎక్కడ ఫిర్యాదు చేయాలనే సందేహాలు గతంలో అనేక సార్లు వ్యక్తం అయ్యాయి. ఫిర్యాదు చేయడానికి స్టేషన్‌కు వెళ్లినప్పుడు తమ పరిధిలోకి రాదని పోలీసులు వెనక్కి పంపిన సంఘటనలూ చాలానే ఉన్నాయి.
- ప్రొద్దుటూరులోని రూరల్ పోలీస్‌స్టేషన్‌ను టూ టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నిర్మించారు. ఇటీవల రూరల్ స్టేషన్ ఆవరణంలో చిన్నశెట్టిపల్లె గ్రామస్తులు ఘర్షణ పడగా టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఒక వ్యక్తి రూరల్ స్టేషన్ ముందు విషద్రావణం తాగి ఆత్మహత్యాయత్నం చేయగా ఆ కేసు కూడా టూ టౌన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు అయింది.
- పట్టణాలు, నగరాల్లో నాలుగైదు పోలీస్‌స్టేషన్లు ఉంటాయి. చాలా మందికి ఏ ప్రాంతం ఏ స్టేషన్ పరిధిలోకి వస్తుందో తెలియదు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు అందుబాటులో ఉన్న స్టేషన్‌కు ఫిర్యాదు చేయడానికి వెళ్తే.. సంఘటన జరిగిన స్థలం తమ పరిధిలోకి రాదని, మరో స్టేషన్‌కు వెళ్లమని పోలీసు అధికారులు బాధితులను వెనక్కి పంపించిన సంఘటనలు గతంలో అనేకం జరిగాయి. ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంలో జాప్యం జరిగిన కారణంగా నేరగాళ్లు తప్పించుకుపోయే అవకాశాలు లేకపోలేదు. ఈ కారణంగా బాధితులకు సత్వర న్యాయం జరగాలనే ఉద్దేశంతో ‘జీరో ఎఫ్‌ఐఆర్’ ను నమోదు చేయాలని పోలీసులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ‘జీరో ఎఫ్‌ఐఆర్’ విధానంతో సంఘటన జరిగిన ప్రాంతంతో నిమిత్తం లేకుండా ఏ స్టేషన్‌కు వెళ్లైనా ఫిర్యాదు చేయొచ్చు.
ఫిర్యాదును తిరస్కరిస్తే చర్యలు..
బాధితులు ఏ స్టేషన్‌కు వెళ్లినా అక్కడి స్టేషన్ అధికారులు ఫిర్యాదు స్వీకరించాల్సించి ఉంటుంది. ఏ పోలీసు అధికారైనా తమ పరిధి కాదని ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి నిరాకరిస్తే వారిని ఐపీసీ 166–ఏ సెక్షన్ ప్రకారం ప్రాసిక్యూట్ చేయడానికి ఆదేశించి, శాఖాపరమైన చర్యలకు సిఫార్స్ చేయవచ్చు. జీరో ఎఫ్‌ఐఆర్‌ను నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ అన్బురాజన్ పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
- జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంలో కొన్ని ఇబ్బందులు తలెత్తినా ప్రజల రక్షణ కోసం చేయాల్సిందేనని పోలీసు అధికారులు అంటున్నారు. కేసు తీసుకోనని చెప్పడానికి ఏ పోలీస్ అధికారికి హక్కు లేదు. దీనికి సంబంధించి మార్గదర్శకాలు ఎప్పటి నుంచో ఉన్నా ప్రభుత్వాలు అమలు చేయలేదు. నిర్భయ ఘటన జరిగిన తర్వాత డిల్లీ, ముంబై నగరాల్లో మాత్రమే ఈ ‘జీరో ఎఫ్‌ఐఆర్’ విధానాన్ని అమలు చేస్తున్నారు.
మహిళలు, చిన్న పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు ఏపీలో తొలిసారిగా జీరో ఎఫ్‌ఐఆర్‌ను అందుబాటులోకి తీసుకొని రావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘జీరో ఎఫ్‌ఐఆర్’తో పాటు మహిళలు, చిన్నారులు ఆపదలో ఉన్నప్పుడు 100, 112, 181 టోల్‌ఫ్రీ నంబర్లకు ఫోన్ చేయాలని డీఎస్పీ సుధాకర్ సూచించారు. మహిళల రక్షణ సవాల్‌గా మారింది. గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని పోలీసు అధికారులు భావిస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో కూడా మహిళలు ఫిర్యాదులు ఇవ్వొచ్చని, మహిళా సంరక్షణ కార్యదర్శులు వాటిని పోలీస్‌ష్టేషన్‌కు పంపిస్తారని డీఎస్పీ అంటున్నారు.
‘జీరో ఎఫ్‌ఐఆర్’ అంటే..
చాలా మంది పోలీసులకు ‘జీరో ఎఫ్‌ఐఆర్’పై సరైన అవగాహన లేదు. జీరో ఎఫ్‌ఐఆర్ అంటే.. ఘటన జరిగిన ప్రదేశం ఏ పోలీస్‌స్టేషన్ పరిధిలోకి వస్తుందో తెలియనప్పుడు.. ఏదో ఒక పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడం. రాత్రి, పగలు ఎప్పుడైనా ఆపద సమయంలో బాధితులు స్టేషన్‌కు వెళ్లినప్పుడు పరిధితో నిమిత్తం లేకుండా పోలీసు అధికారులు ఫిర్యాదును స్వీకరించాలి. వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లి బాధితుడు చెప్పిన విషయం ప్రా«థమికంగా నిర్ధారణ అయితే కేసు నమోదు చేయాలి. సాధారణంగా స్టేషన్‌లోని వరుస సంఖ్యతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తారు. అయితే వచ్చిన కేసు తమ స్టేషన్ పరిధిలోకి రాకపోతే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి ‘జీరో’ నంబర్ కేటాయిస్తారు. తర్వాత ఆయా పోలీస్‌స్టేషన్‌కు కేసును బదిలీ చేశాక అక్కడ ఎఫ్‌ఐఆర్‌కు నెంబర్ ఇస్తారు.
- ఆపద సమయంలో దారిలో కనిపించే స్టేషన్‌కు గానీ, లేదా దగ్గరలో ఉండే స్టేషన్‌కు గానీ బాధితులు వెళ్లడం సహజం. చట్టంలో జీరో ఎఫ్‌ఆర్‌కు వెసులు బాటు ఉన్నా అధికారుల ఉదాసీనత కారణంగా అమలుకు నోచుకోలేదు. ఫలితంగా నిత్యం ఎంతో మంది బా«ధితులు ఇబ్బందులు పడుతున్నారు. ఇకపై కేసుల నమోదు చేయడంలో ఎలాంటి జాప్యం జరగకూడదనే ప్రభుత్వం ‘జీరో ఎఫ్‌ఐఆర్’ ను ఖచ్చితంగా నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ విధానంతో స్థానికంగానే గాక రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో ఉన్నా ఆయా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ‘జీరో ఎఫ్‌ఐఆర్’ కింద కేసు నమోదు చేసుకోమని పోలీసు అధికారులను అడగవచ్చు.
జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఆదేశాలిచ్చాం..
స్టేషన్ పరిధితో నిమిత్తం లేకుండా జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని సబ్‌డివిజన్ పరిధిలోని సీఐలు, ఎస్‌ఐలకు ఆదేశాలు జారీ చేశాం. బాధితులు ఏ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినా ఫిర్యాదులు తీసుకుంటాం. మహిళలు నిర్భయంగా స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయొచ్చు. మíßహిళలు, చిన్న పిల్లల రక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం.
– లోసారి సుధాకర్, ప్రొద్దుటూరు డీఎస్పీ.
జీరో ఎఫ్‌ఐఆర్ కింద ఫిర్యాదు తీసుకోవాల్సిందే..
బాధితుడికి అన్యాయం జరిగితే తాను నివసించే చోటు నుంచి నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తే పరిధితో నిమిత్తం లేకుండా ‘జీరో ఎఫ్‌ఐఆర్’ నమోదు చేయాల్సిందేనని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోకవరపు శ్రీనివాస్ ఇటీవల లోక్‌అదాలత్ భవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. బాధితుడి ఫిర్యాదుపై జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశాక సమగ్ర దర్యాప్తు కోసం సంబంధిత పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేయాలని తెలిపారు. ఒక బాధితుడు తమ దగ్గరికి ఫిర్యాదు చేసేందుకు రాగా సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించానన్నారు. తీరా స్టేషన్‌కు వెళితే తమకు సంబంధం లేదని బాధితుడిని పోలీసులు వెనక్కి పంపించినట్లు జిల్లా జడ్జి ఆవేదన వ్యక్తం చేశారు. పబ్లిక్ సర్వెంట్‌గా ఎస్‌ఐ గానీ, సీఐ గానీ ఎక్కడైనా సెక్షన్ 154 సీఆర్‌పీసీ ప్రకారం జీరో ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేయాలన్నారు. లేకుంటే 166ఏ ఐపీసీ సెక్షన్ ప్రకారం వారే నిందితులవుతారని స్పష్టం చేశారు.
‘దిశ’ మిస్సింగ్‌పై ఫిర్యాదు తీసుకోని పోలీసులు..
హైదరాబాద్‌లోని శంషాబాద్‌లో వెటర్నరీ డాక్టర్ దిశ మిస్సింగ్ విషయంలో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడానికి వెళ్లగా సంఘటనా స్థలం తమ పరిధిలోకి రాదని, మరో స్టేషన్‌కు వెళ్లాలని అక్కడి పోలీసులు చెప్పినట్లు వార్తలు రావడం వివాదాస్పదమైంది. తర్వాత దిశను నలుగురు కలిసి హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ సంఘటన నేపథ్యంలో బాధితుల నుంచి ఏ పోలీస్‌స్టేషన్‌కు మొదట ఫిర్యాదు వస్తే అక్కడే తీసుకోవాలని నిబంధనలు పెట్టారు. ఈ మేరకు ఏపీ డీజీపీ ఆదేశాలు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment