నిందితుడి వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ ప్రసాదరావు
ప్రొద్దుటూరు క్రైం/రాజుపాళెం : పిల్లలు ఆడుకుంటున్న సమయంలో నెలకొన్న చిన్నపాటి గొడవ.. ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. పసిపిల్లలే తగవే కదా అని పెద్దలూ సంయమనం పాటించలేదు.. చిలికి చిలికి గాలివానగా మారి రెండు కుటుంబాల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి.. ఫలితంగా బాలిక తండ్రి దస్తగిరి పసి బాలుడు తనీష్‌రెడ్డి(9)ని గొంతు నులిమి దారుణంగా హత మార్చాడు. నిందితుడు సాయదుగాల పెద్ద దస్తగిరిని రాజుపాళెం పోలీసులు అరెస్ట్ చేశారు. డీఎస్పీ ప్రసాదరావు అరెస్ట్ వివరాలను రూరల్ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం సాయంత్రం మీడియాకు వెల్లడించారు.
రాజుపాళెం మండలం, వెంగళాయపల్లెకు చెందిన గుద్దేటి సంజీవరెడ్డి కుమారురుడు తనీష్‌రెడ్డి ఈ నెల 7న మధ్యాహ్నం నుంచి కనిపించలేదు. స్థానికంగా, బంధువుల ఊళ్లలో గాలించినా బాలుడి ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో తల్లిదండ్రులు అదే రోజు రాజుపాళెం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో 9వ తేదీ రాత్రి వెంగళాయపల్లెలోని అంకాలమ్మ గుడి ఎదురుగా ఉన్న కంప చెట్లలో పాడుబడిన రాళ్ల తొట్టిలో బాలుడు శవమై కనిపించాడు.
ఐదు బృందాలతో దర్యాప్తు..
తనీష్‌రెడ్డి హత్య కేసు దర్యాప్తునకు ఇద్దరు డీఎస్పీలు, ఐదుగురు సీఐలతో ఐదు బృందాలను జిల్లా ఎస్పీ అన్బురాజన్ ఏర్పాటు చేశారు. అమావాస్య ముందు రోజే బాలుడు కనిపించకుండా పోవడంతో క్షుద్రపూజలు జరిగి ఉంటాయని, నరబలి జరిగి ఉంటుందని మండలంలో ప్రచారం జరిగింది. రెండు డాగ్‌స్క్వాడ్ బృందాలతో సంఘటనా స్థలంలో దర్యాప్తు చేశారు. గ్రామంలోని అనుమానితులందరినీ విచారించారు.
దర్యాప్తులో భాగంగా రెండు కుటుంబాల మధ్య నెలకొన్న మనస్పర్థలతో బాలుడు హత్యకు గురైనట్లు పోలీసులు నిర్ధారించారు. 7వ తేదిన సాయంత్రం తనీష్‌రెడ్డిని దస్తగిరి తన పశువుల పాకలో గొంతు నులిమి చంపాడు. అదే రోజు రాత్రి పొద్దుపోయిన తర్వాత బాలుడి మృతదేహాన్ని అంకాలమ్మ ఆలయం సమీపంలో పడేశాడు. తనీష్‌రెడ్డి, దస్తగిరి కుమార్తె ఇద్దరూ రోజూ ఆడుకునే వారు. ఆడుకునే క్రమంలో ఇద్దరి మధ్య చిన్నపాటి గొడవలు వచ్చేవి.
ఈ విషయమై ఇరువురి పెద్దలు పలుమార్లు గొడవ కూడా పడ్డారు. ఇలా రెండు కుటుంబాల మధ్య మనస్పర్థలు కొంత కాలంగా ఉండేవి. ఎన్నిసార్లు చెప్పినా తనీష్‌రెడ్డిలో మార్పు రాలేదని, తన కుమార్తెను వేధిస్తున్నాడని భావించిన దస్తగిరి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. శుక్రవారం నిందితుడ్ని వెంగళాయపల్లెలో రూరల్ సీఐ మధుసూదన్‌గౌడ్, రాజుపాళెం ఎస్‌ఐ కృష్ణంరాజునాయక్ సిబ్బందితో కలిసి అరెస్ట్ చేశారు. దస్తగిరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ వివరించారు.
నరబలి కాదు: డీఎస్పీ
తన కుమార్తెను వేధించడం వల్లనే తనీష్‌రెడ్డిని దస్తగిరి హత్య చేసినట్లు డీఎస్పీ ప్రసాదరావు తెలిపారు. అంతేగానీ మూఢ నమ్మకాల కారణంగా క్షుద్రపూజలు, నరబలి లాంటివి జరగలేదని డీఎస్పీ అన్నారు. సమావేశంలో సీఐ రూరల్ సీఐతో పాటు రాజుపాళెం ఎస్‌ఐ కృష్ణంరాజునాయక్, చాపాడు ఎస్‌ఐ సుబ్బారావు, రూరల్ ఎస్‌ఐలు శివశంకర్, అరుణ్‌కుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment