న్యూస్‌లైన్ ప్రతినిధి, కడప : ఏం సాయి, ఎప్పుడొచ్చావ్...వస్తున్నట్లు ఒక్కమాట కూడా చెప్పలేదే, పోదాం పదా ఇంటికెళ్లి అన్నం తినేసి వద్దాంకానీ అన్నాడు రాజ. లేదన్నా... అన్నం తినేసి వచ్చాను... చిన్నప్పుడు దసరా పండుగ చూశాం. తర్వాత చూసిందిలేదు, ఇప్పుడు చూడాలన్పించింది, ఇంట్లో కూడా చెప్పాపెట్టకుండా వచ్చానుల్యే.
సరే ఆడ జివ్విచెట్టు కాడ, శివుడు ఉంటాడు పోదాంరా...అందరం కలిసికట్టుగా ఊరేగింపు చూడొచ్చని రాజ అనడంతో ఇరువురు శివుని వద్దకు బయలుదేరారు. ప్రొద్దుటూరు దసరా ఉత్సవాలను చూసేందుకు వచ్చిన రవీంద్ర, మహమ్మద్‌లు కూడా ఆ దారిలో తోడైనారు. అందరు కలిసి శివుని అడ్డాకు చేరుకున్నారు. వీరిని చూసీ చూడగానే, అరే అంతా కూడబల్కుకొని వచ్చినారే, ఒక్క మాటన్నా ముందు చెప్పలేదేందిన్నా, మాంచి డిన్నర్ ఏర్పాటు చేసిందునే అన్నాడు శివుడు.
ఏదోలే, శివుడూ దశరా ఉత్సవాలు చూద్దామని వచ్చిమి, ఒక్కరమే జతై, శివుడు ఉంటాడని అందరం ఇట్లా వచ్చినాములే అని రవీంద్ర అన్నాడు. సరేన్నా, ఏమి తీసుకుంటారు, ఏమివద్దులే శివుడు, మంచినీళ్లు తెప్పీ, తాగుతాం అన్నారు సహచర మిత్రులు. రేయ్..! మంచినీళ్లు తీసుకురా...శివుడి కేకతోనే అనుచరుడు పరుగెత్తుకుంటూ నీళ్లు తీసుకొచ్చాడు. ఏమన్నా...మెరవణి చూసేందుకు అట్లా పోదామా, నువ్వు భలేవాడివి శివుడు, అందరం కలిసి మెరవణికి పోతే, అక్కడున్న జనం మనల్నే చూస్తు, వీళ్లకు పనిలేకుండా పోతాందిలే అనుకుంటారులేబ్బీ అన్నాడు రాజ. అదేందన్నా ఇంకా ఆర్నెళ్లు మనదే రాజ్యం, ఆ తర్వాత ఎవర్వికెవ్వరో ఎవరికి తెలుసున్నా అని శివుడు అనబోగానే, నేను ఒక టర్మ్ ముందే రాజకీయాల్లో రిటైర్డ్ అయిపోన్యా. మీరంత కలిసి కలిసికట్టుగా రిటైర్డ్ అవుదుర్లే శివుడు అన్నాడు రాజ.
అన్న చెప్పేదాంట్లో తప్పులేదు శివుడు మరో ముఫ్పై ఏండ్లు మన కుటుంబందే రాజకీయం ఉండాల్సింది మనమంతా తప్పుచేశాములే అన్నాడు రవీంద్ర. మనమేమి జేసినామన్నా, ఉన్న పార్టీలో అట్నే ఉంటిమి కదా అన్నాడు మహమ్మద్. సరేలేబ్బీ, రవీంద్ర అన్నదాంట్లో నిజమే ఉందిల్యే. నువ్వు శివుడు, సాయి ప్రతిసారి ఎవ్వరి పుణ్యంతో గెలుచ్చాండిరీ మీకు తెల్వదు. శేఖర్ ఉన్నంత కాలం మీకు, మాకు ఇబ్బంది లేకప్యోయా. శేఖర్ కుటుంబానికి అండగా ఉండాల్సిన టయంలో మనమంతా ఎవ్వరిదారి వాళ్లము చూసుకుంటిమి. శేఖర్ చేసిన మంచి పనులకు జనం ఆ కుటుంబం వెంటే ఉన్నారు అన్యాడు రాజ.
నిజమేన్నా మీరంతా ఎట్లున్నా నేను శేఖర్ కుటుంబం వెంటే ఉండిండాల్సిందీ...! క్షమించరాని తప్పు చేశానున్నా అని సాయి అందుకున్యాడు. ఇప్పుడు విచారం వ్యక్తం చేయడం ఎందుకులే సాయి, మనం సాధ్యమైనంత వరకూ పోరాడుదాం, కానప్పుడు ఏమి చేద్దామని కలిసి క ట్టుగానే ఆలోచిద్దాం లేండి, పోదాం పదా మెరువణి చూద్దాం అన్నాడు రవీంద్ర. ‘మాయమైపోతున్నడమ్మా..మనిషన్నవాడు’ అన్న పాటను రాగయుక్తంగా పాటకచేరి వాళ్లు పాడుతున్నారు.
అదే సమయానికి ఐదుగురు మిత్రులు అక్కడి చేరుకోవడంతో వీళ్లను చూసిన జనం అబ్బా భలే పాట పాడుతున్నారంటూ ఈలలు, కేకలు వేయసాగారు. జనం వీరికి అచ్చం అతికినట్లు సరిపోయిందని అంటుండడాన్ని మహమ్మద్ గమనించాడు. అన్నా అదో అక్కడ రంగు రంగుల పటాకులు కాల్చుతూ, వింతైన వేషాలు వేసినారు, ఆడికి పోదాంపదండి అన్నాడు మహమ్మద్. ఐదుగురు కదలగానే జనం అనుకుంటున్న మాటలను మిత్రులకు మహమ్మద్ చెప్పాడు. ఆ సరేగానీపాబ్బీ ‘చెడు కాపురానికి ముప్పేంటీ? మొండికాలికి చెప్పేంటీ?’ అని కొట్టిపారేశాడు రాజ. చూడు మహమ్మద్ మనదీ రాంగ్‌స్టెఫ్, జనం అనుకుంటే అనుకుంటారు వాళ్లను నిందించాల్సిన పనిలేదు.
మొన్న రాష్ట్ర విభజన అన్నప్పుడన్నా మనం ప్రత్యేకంగా మన ఏరియా కోసం మాట్లాడకపోతిమి, ఎలాంటి త్యాగం చేయకపోతిమి. అట్లాంటప్పుడు జనం అనుకుంటున్నారని అనుకోవాల్సిన పనిలేదని రవీంద్ర సర్దిజెప్పాడు. మన వాళ్ల మాటలను గురించి పట్టించుకుంటే ‘గొంగట్లో అన్నం తింటూ వెంట్రుకలు ఏరినట్లు’ ఉంటాదని రవీంద్ర చెప్పుకొచ్చాడు. ఇంతకూ మనపరిస్థితి ఏందిన్నా మనముందర ఎదిగినోళ్లు రేప్పొద్దున లీడర్లుగా ఉంటే మనం ఏమి చెయ్యాలని శివుడు పల్లాయి ఎత్తుకున్యాడు.
ఇప్పుడు ఏమనుకున్యా మన కంఠశోషే శివుడు అని సాయి అంటూనే మీరంత ఒక ఎత్తు. శేఖర్ లేకపోతే నేను లేనని జిల్లాకే కాదు, రాష్ట్రానికంతా తెలుసూ. మమ్ములిద్దర్ని ‘ఆవు దూడ’ అని కూడా అంటున్యారు. అట్లాంటిదీ నేను కూడా తప్పే జేస్తిని ఆవేదన చెందారు. నువ్వే కాదులే సాయి అందరం ఎవ్వరి స్థాయిలో వారు తప్పులు జేచ్చానే ఉన్నాంలే.
శేఖర్ కుటుంబానికి మిత్రద్రోహులుగానే మనల్ని ప్రజలు చూచ్చాండారు. లేకపోతే మన ఎత్తుగడలను తిప్పిగొట్టి, మొన్నటి ఎలెచ్చన్లలో డిపాజిట్ దక్కకుండా జేసిరే అని రవీంద్ర, రాజ అన్నారు. అన్నా ఇప్పుడెందుకు ఇంకోసారి తీరిగ్గా మాట్లాడుకుందాం.. ‘రోట్లో తలకాయబెట్టి రోకటిపోటు’కు వెరవడం ఎందుకని శివుడు అన్నాడు. మిత్రుని కుటుంబాన్ని కాదన్నందుకు నవ్వులపాలైతిమీ కదున్నా అని మహమ్మద్ అంటాంటే, ఈసారైనా మంచి రోజలు కల్పించూ తల్లీ అని ‘అమ్మవారు’ను కోరుకుందాం పదండీ అంటూ మిత్రులంతా కలిసి అమ్మవారిశాలకు వెళ్లారు.
మిత్రభేదంతో నవ్వులపాలైతిమి కదన్నా..!
Published Mon, Oct 14 2013 1:15 AM | Last Updated on Mon, Jul 29 2019 6:03 PM
Advertisement
Advertisement