ప్రొద్దుటూరులో డ్రగ్స్‌ మాఫియా ? | drugs mafia at proddatur in kadapa | Sakshi
Sakshi News home page

ప్రొద్దుటూరులో డ్రగ్స్‌ మాఫియా ?

Published Fri, Apr 14 2017 1:31 PM | Last Updated on Fri, May 25 2018 2:11 PM

drugs mafia at proddatur in kadapa

► గల్ఫ్‌ దేశాలకు డ్రగ్స్‌ సరఫరా
► హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టులో దొరికిన నిషేధిత మత్తు పదార్థాలు
► పార్సిల్‌పై ప్రొద్దుటూరు వాసి పేరు

ప్రొద్దుటూరు క్రైం: వాణిజ్య కేంద్రమైన ప్రొద్దుటూరులో అన్ని రకాల అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయనేది జగమెరిగిన సత్యం. క్రికెట్‌ బెట్టింగ్, మట్కా, పేకాట, చాటు మాటుగా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు కొందరు యువకులు చెడు వ్యసనాలకు లోనై మత్తు పదార్థాల బారిన పడుతున్నారు. ఇటీవల హైదరాబాద్‌ ఎయిర్‌ పోర్టులో ప్రొద్దుటూరు వ్యక్తి పేరుతో ఉన్న పార్సిల్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అందులో రూ. లక్షలు విలువ చేసే నిషేధిత డ్రగ్స్‌ ఉండటంతో జిల్లాతో పాటు  ఇక్కడి పోలీసు అధికారులు ఉలిక్కి పడ్డారు.

సిరిపురిలో డ్రగ్స్‌ మూలాలు
సిరిపురిలో డ్రగ్స్‌ మూలాలు ఉన్నట్లు తెలుస్తోంది. సుమారు నాలుగేళ్ల క్రితం పట్టణంలోని ఒక స్టేషన్‌ పరిధిలో ముగ్గురు యువకుల నుంచి బ్రౌన్‌ షుగర్‌ మాదిరిగా ఉన్న నాలుగు ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అప్పట్లో వీటిని పోలీసు అధికారులు పరీక్ష నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు. అయితే ఇంత వరకూ ఆ రిపోర్టు వివరాలు బయటికి రాలేదు. నాలుగు రోజుల క్రితం హైదరాబాద్‌ ఎయిర్‌ పోర్టులో జీన్స్‌ప్యాంట్లు కలిగిన పార్సిల్‌ను డైరెక్టర్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ప్యాంట్ల నడుము భాగం కుట్టులో డ్రగ్స్‌ బిళ్లలను అమర్చి వాటిని కార్గో పార్సిల్‌ ద్వారా కువైట్‌కు పంపించే ప్రయత్నాన్ని అధికారులు భగ్నం చేశారు. అందులో  ఉన్న సుమారు 2500 ఎర్రటి బిళ్లలను స్వాధీనం చేసుకొని పరీక్ష నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు. వాటిని పరిశీలించిన అధికారులు నిషేధిత మత్తు పదార్థాలుగా భావిస్తున్నారు. వాటి విలువ సుమారు 9 లక్షల వరకూ ఉంటుందని అంచనా. పార్సిల్‌పై మహమ్మద్‌ రఫీ, ప్రొద్దుటూరు అనే పేరు ఉండటంతో అక్కడి అధికారులు  జిల్లా పోలీసు అధికారులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది.

వ్యాపారమా.. సేవించడానికా..!
రూ.లక్షలు విలువ చేసే నిషేధిత బిళ్లలను ప్రొద్దుటూరు నుంచి కువైట్‌కు సరఫరా చేస్తున్న ముఠా గురించి ఇక్కడి పోలీసు అధికారులు ఆరా తీస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. జిల్లాలోని రాజంపేట, రాయచోటి, నందలూరు, కడపతో పాటు ప్రొద్దుటూరులో కూడా వేల సంఖ్యలో గల్ఫ్‌ దేశాలకు వెళ్లారు. డ్రైవర్, బంగారు పని, ఏసీ మెకానిక్‌ తదితర పనులు చేసుకునేందుకు యువకులు కూడా ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున సౌదీ, కువైట్‌ దేశాలకు వెళ్లారు.

ఇలా వెళ్లిన కొందరు యువకులు కలిసి మత్తు పదార్థాలను తెప్పించుకుంటున్నారా లేక డ్రగ్స్‌ మాఫియా యువకులతో వ్యాపారం చేయిస్తోందా అనే దానిపై పోలీసులు కూపీ లాగుతున్నట్లు సమాచారం. ఎయిర్‌ పోర్టులో దొరికిన డ్రగ్స్‌ బిళ్లలు ఎక్కడి నుంచి వచ్చాయి, అవి యువకుల్లో ఎలాంటి ప్రభావాన్ని కలిగిస్తాయి అనే విషయాలపై పోలీసు అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. కావాలనే ప్రొద్దుటూరు వాసి పేరును రాసి ఉంటారా అనే కోణంలో కూడా విచారణ చేయనున్నట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement