► మళ్లీ చలివేంద్రాలా...
► రూ.1.62కోట్లు కేటాయించామని సర్క్యులర్
ప్రొద్దుటూరు టౌన్: చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. గత ఏడాది ఏర్పాటు చేసిన చలివేంద్రాలకు ఇప్పటి వరకు బిల్లులు చెల్లించకపోవడంతో స్వయం సహాయక సంఘాల సభ్యులు ఆవేదనవ్యక్తం చేస్తున్నారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో గత ఏడాది కుండలు, గ్లాసుల కొనుగోలుకు రూ.1000, ఇసుకకు రూ.500, 100 మందికి మజ్జిగకు రూ.400లు, పంపిణీ చేసిన సభ్యురాలికి రూ.200 ప్రకారం డబ్బు వెచ్చించారు. ఇదే గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఎస్‌హెచ్‌జీ మెంబర్‌కు రూ.150తో కలిపి రూ.1950 ఖర్చు చేశారు.
ఈ విధంగా మొత్తం 11 కేంద్రాల్లో 10 నుంచి 20 రోజుల పాటు చలివేంద్రాలు నిర్వహించారు. ఒక్కోదానికి రూ.10వేలు నుంచి రూ.12వేలు ఖర్చయింది. ఇక్కడ మజ్జిగ తాగిన వారి సంతకాలు, సెల్ నంబర్‌లు తీసుకోవాలని చెప్పడంతో ఎస్‌హెచ్‌జీ మెంబర్లు పుస్తకాలు ఏర్పాటు చేసి వారి వివరాలను నమోదు చేశారు. ఇంత పకడ్బందీగా నిర్వహించినా డబ్బు చెల్లించడానికి ఎవరూ ముందుకు రాలేదు. బిల్లులు ఇచ్చినా డబ్బు రాకపోవడంతో స్వయం సహాయ సంఘాల సభ్యులు వేదనకు గురయ్యారు. టీఎల్‌ఎఫ్ నుంచి ఒక్కో చలివేంద్రానికి రూ.6వేలు చెల్లించడం, మిగిలిన డబ్బును కమ్యూనిటీ ఆర్గనైజర్లు, ఆవార్డులోఉన్న సంఘ లీడర్లు, ఆర్పీలు పెట్టుకున్నారు. అయితే ఇప్పటి వరకూ వారికి ఖర్చు చేసిన డబ్బులో ఒక్క రూపాయి అందలేదు.
ప్రభుత్వం ఈ ఏడాది జిల్లాలోని పంచాయతీల్లో 790, మున్సిపాలిటీల్లో 256 చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 25 రోజులపాటు వీటిని కొనసాగించాలని, పంచాయతీల్లో ఒక్కో దానికి రోజుకు రూ.550, మున్సిపాలిటీల్లో రూ.600 కేటాయిస్తూ ఉత్తుర్వులు ఇచ్చింది. ఈ విధంగా మొత్తం రూ.1.62 కోట్లు చలివేంద్రాల నిర్వహణకు కేటాయించారు. ఇందులో రూ.60లక్షలు విడుదల చేసినట్లు పేర్కొన్నారు.
గత ఏడాది రూ.1.50లక్షలు ఖర్చు
ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో గత ఏడాది ఏర్పాటు చేసిన 11 చలివేంద్రాలకు రూ.1.50లక్షలు ఖర్చయిందని పీఆర్పీ కెజియా జాస్లిన్.. మున్సిపల్ కమిషనర్ వెంకటశివారెడ్డికి తెలిపారు. బిల్లులు మంజూరు చేయకపోవడంతో సభ్యులు ఇబ్బందులు పడ్డారని వివరించారు. ఈ విషయంపై కమిషనర్ డీఈ రామచంద్ర ప్రభును వివరణ కోరగా తనకు బిల్లులు ఇవ్వలేదని తెలిపారు. పీఆర్పీ బిల్లులు ఇచ్చామని, అధికారులు ఇవ్వలేదని ఒకరిపై ఒకరు చెప్పుకున్నారు. ఈ విధంగా జిల్లాలో చాలా మున్సిపాలిటీ, పంచాయతీల్లో బిల్లులు మంజూరు కాలేదని సమాచారం.