District Superintendent of Police
-
వేమగిరిలో దారుణ హత్య
సాక్షి, కడియం: మండలంలోని వేమగిరిలో బొంతు వెంకన్న (45) అనే కూలీ శనివారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వేమగిరి తోట ప్రాంతానికి చెందిన పితాని సత్యనారాయణ అలియాస్ అన్నమయ్య, భవానీ భార్యాభర్తలు. సత్యనారాయణ లారీ డ్రైవర్‌గా పనిచేస్తుండగా, భవానీ గ్రామంలోని హైవేపైగల ఒక ప్రముఖ డ్రగ్స్ ఫ్యాక్టరీలో పనిచేస్తోంది. కాగా భవానీ ఫ్యాక్టరీ నుంచి వచ్చే క్రమంలో అదే గ్రామానికి చెందిన కూలి పనులు చేసుకొనే వెంకన్న ఆమెను మోటారు సైకిల్‌పై తీసుకువచ్చి ఇంటి వద్ద దింపుతుండేవాడు. ఈ క్రమంలోనే సత్యనారాయణకు భార్యపై అనుమానం ఏర్పడింది. దీంతో భార్యాభర్తల మధ్య తరచు గొడవలు జరిగేవి. ఇదే విషయంపై గతంలో కూడా సత్యనారాయణ, వెంకన్నల మధ్య వివాదం కూడా చోటు చేసుకుందని చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఎప్పటి మాదిరిగానే శనివారం రాత్రి ఫ్యాక్టరీ నుంచి వస్తున్న భవానీని వెంకన్న తన మోటారు సైకిల్‌పై తీసుకువస్తున్నాడు. వీరిని గమనించిన సత్యనారాయణ వారిని వెంబడించి గ్రామానికి సమీపంలోని ఒక నర్సరీ వద్ద కాపు కాశాడు. తన వెంట తెచ్చుకున్న పదునైన ఆయుధంతో వెంకన్న, భవానీలపై విచక్షణా రహితంగా దాడికి దిగాడు. మృతుడు వెంకన్న మెడ, ఇతర శరీర భాగాలపై తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. భవానీపై కూడా దాడి చేయడంతో ఆమె మెడ భాగంలో గాయమైంది. అక్కడి నుంచి భవానీ పరుగు పెడుతూ ఇంటికి చేరుకుంది. ఆమె కుటుంబ సభ్యులు భవానీని రాజమహేంద్రవరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతోంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. పోలీసులకు అందిన సమాచారం మేరకు కడియం పోలీస్ ఇన్స్పెక్టర్ కె. శ్రీధర్‌కుమార్ తన సిబ్బందితో ఘటనా ప్రాంతానికి చేరుకుని వివరాలు నమోదు చేసుకున్నారు. దక్షిణ మండలం డీఎస్పీ ఎం. శ్రీలత ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది. మృతదేహాన్ని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడిన ఎం.సత్యనారాయణ పరారీలో ఉన్నాడు. పోలీసులు గాలిస్తున్నారు. అతడు పనిచేసే మండపేట ప్రాంతానికి చెందిన లారీ యజమానిని కూడా పోలీసులు ఆరా తీసారు. అయితే అతని ఆచూకీ ఇంకా లభించలేదు. విషయం తెలుసుకున్న మృతుడు బొంతు వెంకన్న కుటుంబ సభ్యులు ఆతృతగా ఘటనా ప్రాంతానికి చేరుకుని గుండెలవిసేలా రోదించారు. -
DSP Shilpa Sahu; ‘అమ్మ’ఆన్ డ్యూటీ
అవసరం అయితే తప్ప ఇళ్లలోంచి కదలవద్దని జనానికి చెప్పడానికి.. ఇంట్లో ఉండవలసిన అవసరం ఉన్నప్పటికీ బయటికి వచ్చి ఎర్రటి ఎండలో డ్యూటీ చేస్తున్నారు ఐదు నెలల గర్భిణీ అయిన దంతెవాడ డీఎస్పీ శిల్పా సాహూ!! ‘సురక్షితంగా ఉండండి, మాస్కులు ధరించండి’ అని చెప్పడానికి, నిర్లక్ష్యంగా తిరుగుతున్న వారిని హెచ్చరించడానికి లాఠీ చేతపట్టి.. తన కడుపులోని బిడ్డకు ప్రమాదమేమో అని కూడా తలవకుండా కరోనా సెకండ్ వేవ్ లో, సూర్యుడి భగభగల్లో, మావోయిస్టుల కదలికల నడుమ.. ఆమె తన విధులు నిర్వహిస్తున్నారు! ఎప్పుడూ గుడిలో దర్శనమిచ్చే దంతేశ్వరీ దేవి మంగళవారం మధ్యాహ్నం ఎర్రటి ఎండలో దంతెవాడ పట్టణ ప్రధాన కూడళ్లలో కర్ర పట్టి తిరుగుతూ, ప్రజలు కరోనా బారినపడకుండా జాగ్రత్తలు చెబుతూ ఉన్నట్లే అనిపించి ఉండవచ్చు అక్కడి వారికి కొందరికైనా! ఆ ‘దంతేశ్వరీ దేవి’ పేరు శిల్పా సాహూ (29). దంతెవాడ డిప్యూటీ సూపరింటిండెంట్ ఆఫ్ పోలీస్. దంతెవాడ చత్తీస్‌గఢ్ జిల్లాలో ఉంది. సాధారణంగా మావోయిస్టులను గుర్తుకు తెచ్చే ఈ ప్రాంతం.. కరోనా లాక్డౌన్ విధుల నిర్వహణలో డీఎస్పీ శిల్పా సాహూ చూపిన అంకితభావం కారణంగా ఎవరికైనా శక్తిమాతను గుర్తు తెచ్చి ఉంటే అందులో ఆశ్చర్యం ఏమీ లేదు. దేశంలోని మొత్తం యాభై రెండు శక్తి పీఠాలలో ఒకటైన దంతేశ్వరీదేవి ఆలయం దంతెవాడలో ఉంది. ఆ తల్లి తన బిడ్డల్ని అదిలించి, కదిలించి, సంరక్షించిన విధంగానే ఇప్పుడు శిల్ప తన పౌరుల్ని కరోనా నిర్లక్ష్యం నుంచి అదిలిస్తూ, త్వరగా చేరమని ఇళ్లకు కదిలించే డ్యూటీలో ఉన్నారు. నిజానికైతే ఆమె కూడా ఇంట్లోనే ఉండిపోవలసిన పరిస్థితే. గాలి సోకితే చాలు కరోనా వచ్చేలా ఉంది. ఎండ ఆవిర్లు వదులుతోంది. మావోయిస్టులు ఎక్కడ మాటువేసి ఎటుగా వస్తోరో తెలియదు. అయినా పోలీస్ డ్యూటీ పోలీస్ డ్యూటీనే. అన్నిటినీ తట్టుకోవాలి. పౌరుల్ని కాపాడాలి. డిఎస్పీ శిల్ప కూడా అదే డ్యూటీ ఉన్నారు కానీ, ఆమె కాస్త ప్రత్యేకమైన పరిస్థితిలో డ్యూటీ చేస్తున్నారు. ఐదవ నెల గర్భిణి ఆమె. ఇక నుంచి ఆమె మరింతగా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి డాక్టర్ ఆమెకు చెప్పే ఉంటారు. అయితే సెకండ్ వేవ్ కరోనాలో ప్రజలు మరింతగా భద్రంగా ఉండాలని చెప్పడం కోసం ఆమె బయటికి వచ్చారు. లాఠీ పట్టుకుని దంతెవాడ ప్రధాన రహదారులలో డ్యూటీ చేశారు. మాస్క్ వేసుకోని వాళ్లను, అనవసరంగా బయటికి వచ్చినవాళ్లను ఆపి, మందలించారు. కరోనా బారిన పడకుండా, ఇతరులను పడేయకుండా ఉండటానికి జాగ్రత్తలు చెప్పి పంపారు. సాటి మానవులు చెబితే కోపం వస్తుందేమో కానీ, డీఎస్పీ చెబితే వినకుండా ఉంటారా? ఇప్పుడామె చేస్తున్నది బాధ్యతల్ని గుర్తు చేసే డ్యూటీ. ఒకరు గుర్తు చేయాల్సినంతగా నిర్లక్ష్యాన్ని, ఉదాసీనతను ప్రదర్శిస్తున్న పౌరులు.. గర్భిణిగా ఉండి కూడా మిట్ట మధ్యాహ్నపు ఎండలో డ్యూటీ చేయడం చూసి సిగ్గుపడే ఉంటారు. తనకు, కడుపులో ఉన్న తన బిడ్డకు కరోనా సోకుతుందేమోనన్న భయం లేకుండా శిల్ప పౌరుల క్షేమం కోసం పాటు పడటం మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ గౌరవాన్నే పెంచింది. గర్భంతో ఉండి కూడా ఆమె డ్యూటీ చేస్తున్నప్పటి ఫొటోను ఐపీఎస్ ఆఫీసర్, చత్తీస్‌గఢ్ అడిషనల్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ దీపాంశు కబ్రా తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేయగానే ‘డ్యూటీ మైండెడ్’ శిల్పపై గత 48 గంటలుగా ట్విట్టర్లో ధారాపాతంగా ప్రశంసలు కురుస్తూనే ఉన్నాయి. ‘సెల్యూట్ టు డీఎస్పీ శిల్పా సాహూజీ! డీజీపీ శ్రీ అవస్థిగారూ.. ఆమెకు అవార్డు ప్రకటించంది. అలాగే ఆమె కోరుకుంటే కనుక ఆమెను రాయ్‌పుర్ బదలీ చేయండి’ అని ఒకరు, ‘గుడ్ జాబ్ మేమ్, ఐ రిక్వెస్ట్ యు ప్లీజ్ స్టే సేఫ్ అండ్ స్టే హెల్దీ’ అని ఇంకొకరు.. పదులు, వందల్లో ఆమెను అభినందిస్తూ, జాగ్రత్తలు చెబుతున్నారు. రాయ్‌పుర్ చత్తీస్‌గఢ్ రాజధాని. అక్కడికి, దంతెవాడకు ఏడున్నర గంటల ప్రయాణం. రాయ్‌పుర్‌లో అయితే శిల్పకు ఈ సమయంలో సౌకర్యంగా ఉంటుందని కూడా ట్విటిజెన్‌లు ఆలోచిస్తున్నారు. సీఎం ఆమెను ఒక ఆదర్శ మహిళా అధికారిగా కీర్తించారు. ఇంతకంటే కఠిమైన డ్యూటీలనే చేశారు శిల్పి. ఎ.కె.47 ధరించి ‘ఆపరేషన్’లలో పాల్గొన్నారు. దంతేవాడలో మావోయిస్టులకు వ్యతిరేకంగా ఏర్పాటైన ‘దంతేశ్వరి ఫైటర్స్’ (మహిళా కమాండోలు) కు నాయకత్వం వహించారు. వాటికంటే కష్టమైన పని.. కరోనా లాక్డౌన్ నిబంధనల్ని జనం ఉల్లంఘించకుండా చూడటం అని ఇప్పుడామె గ్రహించే ఉంటారు. ‘‘నేను బయట ఉంటేనే.. వాళ్ల లోపల ఉంటారు’’ రోడ్డు మీద వెళుతూ అధాటున చూసిన వారికి మామూలు దుస్తుల్లో ఉన్న శిల్పా సాహు మొదట సాధారణ మహిళగా అనిపించవచ్చు. కానీ, గర్జించే ఆమె స్వరం.. ఆమె పోలీసు అన్న వాస్తవాన్ని ఆ వెంటనే తెలియజేస్తుంది. ‘వాపస్ జావో, ఘర్ జావో’ (వెనక్కు వెళ్లు.. ఇంటికి వెళ్లు) అని గట్టిగా అరచి చెప్పినా వినని వారికి ఆమె చేతిలోని లాఠీ చక్కగా అర్థమయ్యేలా చెప్పేందుకు సిద్ధమౌతుంది. ఏప్రిల్ 18 నుంచి దంతెవాడ జిల్లా (దక్షిణ బస్తర్) లాక్డౌన్లో ఉంది. ఆ రోజు నుంచీ శిల్ప లాక్డౌన్ డ్యూటీలో ఉన్నారు. ‘‘గర్భిణిగా ఉండి మీరు బయటికి రావడం ఎందుకు?’’ అనే ప్రశ్నకు.. ‘‘నేను బయట ఉంటేనే వాళ్లు లోపల ఉంటారు’’ అంటున్నారు శిల్ప. -
వైరస్ బారినపడి ఏఆర్ డీఎస్పీ మృతి
మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ జిల్లా పోలీసు కార్యాలయంలోని ఏఆర్ విభాగంలో డీఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న పీఎస్.శశిధర్ (50) మృతి చెందారు. కొద్దిరోజుల క్రితం కరోనా బారిన పడిన ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. 1996 బ్యాచ్ ఆర్ఎస్సైగా పోలీసు శాఖలో చేరిన ఆయన బెల్లంపల్లి హెడ్ క్వార్టర్స్, కరీంనగర్, సిరిసిల్లలో పనిచేశాక పదోన్నతిపై డీఎస్పీగా మహబూబాబాద్ జిల్లా పోలీసు కార్యాలయానికి 2019 ఫిబ్రవరి నెలలో వచ్చారు. కాగా, శశిధర్ మృతి పట్ల మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌తో పాటు ఎస్పీ కోటిరెడ్డి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
ఉత్తరప్రదేశ్‌లో ఘోరం
కాన్పూర్: ఉత్తరప్రదేశ్‌లో నేరగాళ్లు రెచ్చిపోయారు. వికాస్ దూబే అనే హిస్టరీ షీటర్‌ను అదుపులోకి తీసుకొనేందుకు ప్రయత్నించిన పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు. వారి ఆయుధాలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలో డీఎస్పీ సహా మొత్తం 8 మంది పోలీసులు నేలకొరిగారు. సాధారణ పౌరుడితో సహా ఏడుగురు పోలీసులు గాయపడ్డారు. అనంతరం మరో ఎన్కౌంటర్లో ఇద్దరు నేరస్తులను పోలీసులు హతమార్చారు. కాన్పూర్ సమీపంలోని బిక్రూ గ్రామంలో గురువారం అర్ధరాత్రి జరిగిన ఈ ఉదంతం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. కరడుగట్టిన నేరగాడైన వికాస్ దూబేపై 60కి పైగా కేసులున్నాయి. కొంతకాలంగా పోలీసుల కళ్లుగప్పి తప్పించుకుని తిరుగుతున్నాడు. బిక్రూ గ్రామంలో అతడు మకాం వేసినట్లు సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఈ విషయం గుర్తించిన వికాస్ దూబే ఆ గ్రామానికి దారితీసే రోడ్లపై తన అనుచరులతో అడ్డుకట్టలు వేయించాడు. పోలీసులు అతికష్టం మీద వికాస్ ఉన్న ఇంటి వద్దకు చేరుకున్నారు. ఇంతలో ఇంటిపై నుంచి అతడి అనుచరులు తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులు ప్రారంభించారు. ఈ కాల్పుల్లో డీఎస్పీ దేవేంద్ర మిశ్రా, ముగ్గురు ఎస్ఐలు, నలుగురు కానిస్టేబుళ్లు మృతిచెందారు. ఇద్దరు ఎస్ఐలు, ముగ్గురు కానిస్టేబుళ్లు, ఒక హోంగార్డు, మరో పౌరుడు గాయపడ్డారు. మృతిచెందిన, గాయపడిన పోలీసుల వద్ద ఉన్న ఏకే–47, ఇన్సాస్ రైఫిల్, గ్లాక్ పిస్టల్, రెండు .9 ఎంఎం పిస్టళ్లను వికాస్ దూబే అనుచరులు ఎత్తుకెళ్లారు. ఉన్నతాధికారులు వెంటనే గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. నివాడా గ్రామం వద్ద దుండగులు ఎదురుపడడంతో కాల్పులు జరిపారు. ఇందులో వికాస్ అనుచరులైన ప్రేమ్ ప్రకాశ్, అతుల్ దూబే అనే ఇద్దరు హతమైనట్లు అధికారులు ప్రకటించారు. బిక్రూలో పోలీసుల వద్ద అపహరించిన ఒక పిస్టల్‌ను తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వికాస్ దూబేపై రూ.25 వేల రివార్డు ఉంది. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం చనిపోయిన పోలీసులకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం కాన్పూర్‌లో నివాళులర్పించారు. వారి కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం అందజేస్తామని ప్రకటించారు. నేరగాళ్ల చేతిలో ఎనిమిది మంది పోలీసులు చనిపోవడం పట్ల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. యూపీలో గూండారాజ్‌కు ఇది మరో నిదర్శనమని ఆరోపించారు. యూపీలో నేరగాళ్లకు జంకూగొంకూ లేకుండా పోయిందని, విచ్చలవిడిగా చెలరేగిపోతున్నారని కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ ప్రియాంకా గాంధీ మండిపడ్డారు. -
డిఎస్పీ కుమారుడికి కరోనా
-
ఎక్కడైనా ఫిర్యాదు చేయొచ్చు..
సాక్షి, ప్రొద్దుటూరు: చాగలమర్రి సమీపంలోని కడప–కర్నూలు జాతీయ రహదారి పక్కన ఉప్పలపాడు, ఇడమడక అనే రెండు గ్రామాలు ఉన్నాయి. మధ్యలో ఏర్పాటు చేసిన సిమెంట్ రోడ్డే రెండు గ్రామాల మధ్య హద్దు. ఎడమ వైపు ఉన్న ఉప్పలపాడు గ్రామం రాజుపాళెం మండల పరిధిలోకి వస్తే.. రోడ్డుకు కుడి వైపు ఉన్న ఇడమడక దువ్వూరు మండల పరిధిలోకి వస్తుంది. ఈ గ్రామాల్లో ఏదైన సంఘటన జరిగినప్పుడు ఏ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాలో తెలియక ప్రజలు నేటికీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రొద్దుటూరులోని శివాలయం సెంటర్ వన్‌టౌన్, టూ టౌన్ పోలీస్స్టేషన్ల పరిధిలోకి వస్తుంది. అయితే సమీపంలో త్రీ టౌన్ పరిధి కూడా ఉంది. ఏదైనా సంఘటన జరిగినప్పుడు బాధితులు ఎక్కడ ఫిర్యాదు చేయాలనే సందేహాలు గతంలో అనేక సార్లు వ్యక్తం అయ్యాయి. ఫిర్యాదు చేయడానికి స్టేషన్‌కు వెళ్లినప్పుడు తమ పరిధిలోకి రాదని పోలీసులు వెనక్కి పంపిన సంఘటనలూ చాలానే ఉన్నాయి. ప్రొద్దుటూరులోని రూరల్ పోలీస్‌స్టేషన్‌ను టూ టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నిర్మించారు. ఇటీవల రూరల్ స్టేషన్ ఆవరణంలో చిన్నశెట్టిపల్లె గ్రామస్తులు ఘర్షణ పడగా టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఒక వ్యక్తి రూరల్ స్టేషన్ ముందు విషద్రావణం తాగి ఆత్మహత్యాయత్నం చేయగా ఆ కేసు కూడా టూ టౌన్లో ఎఫ్ఐఆర్ నమోదు అయింది. పట్టణాలు, నగరాల్లో నాలుగైదు పోలీస్స్టేషన్లు ఉంటాయి. చాలా మందికి ఏ ప్రాంతం ఏ స్టేషన్ పరిధిలోకి వస్తుందో తెలియదు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు అందుబాటులో ఉన్న స్టేషన్‌కు ఫిర్యాదు చేయడానికి వెళ్తే.. సంఘటన జరిగిన స్థలం తమ పరిధిలోకి రాదని, మరో స్టేషన్‌కు వెళ్లమని పోలీసు అధికారులు బాధితులను వెనక్కి పంపించిన సంఘటనలు గతంలో అనేకం జరిగాయి. ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో జాప్యం జరిగిన కారణంగా నేరగాళ్లు తప్పించుకుపోయే అవకాశాలు లేకపోలేదు. ఈ కారణంగా బాధితులకు సత్వర న్యాయం జరగాలనే ఉద్దేశంతో ‘జీరో ఎఫ్ఐఆర్’ ను నమోదు చేయాలని పోలీసులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ‘జీరో ఎఫ్ఐఆర్’ విధానంతో సంఘటన జరిగిన ప్రాంతంతో నిమిత్తం లేకుండా ఏ స్టేషన్‌కు వెళ్లైనా ఫిర్యాదు చేయొచ్చు. ఫిర్యాదును తిరస్కరిస్తే చర్యలు.. బాధితులు ఏ స్టేషన్‌కు వెళ్లినా అక్కడి స్టేషన్ అధికారులు ఫిర్యాదు స్వీకరించాల్సించి ఉంటుంది. ఏ పోలీసు అధికారైనా తమ పరిధి కాదని ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి నిరాకరిస్తే వారిని ఐపీసీ 166–ఏ సెక్షన్ ప్రకారం ప్రాసిక్యూట్ చేయడానికి ఆదేశించి, శాఖాపరమైన చర్యలకు సిఫార్స్ చేయవచ్చు. జీరో ఎఫ్ఐఆర్ను నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ అన్బురాజన్ పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో కొన్ని ఇబ్బందులు తలెత్తినా ప్రజల రక్షణ కోసం చేయాల్సిందేనని పోలీసు అధికారులు అంటున్నారు. కేసు తీసుకోనని చెప్పడానికి ఏ పోలీస్ అధికారికి హక్కు లేదు. దీనికి సంబంధించి మార్గదర్శకాలు ఎప్పటి నుంచో ఉన్నా ప్రభుత్వాలు అమలు చేయలేదు. నిర్భయ ఘటన జరిగిన తర్వాత డిల్లీ, ముంబై నగరాల్లో మాత్రమే ఈ ‘జీరో ఎఫ్ఐఆర్’ విధానాన్ని అమలు చేస్తున్నారు. మహిళలు, చిన్న పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు ఏపీలో తొలిసారిగా జీరో ఎఫ్ఐఆర్ను అందుబాటులోకి తీసుకొని రావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘జీరో ఎఫ్ఐఆర్’తో పాటు మహిళలు, చిన్నారులు ఆపదలో ఉన్నప్పుడు 100, 112, 181 టోల్‌ఫ్రీ నంబర్లకు ఫోన్ చేయాలని డీఎస్పీ సుధాకర్ సూచించారు. మహిళల రక్షణ సవాల్‌గా మారింది. గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని పోలీసు అధికారులు భావిస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో కూడా మహిళలు ఫిర్యాదులు ఇవ్వొచ్చని, మహిళా సంరక్షణ కార్యదర్శులు వాటిని పోలీస్‌ష్టేషన్‌కు పంపిస్తారని డీఎస్పీ అంటున్నారు. ‘జీరో ఎఫ్ఐఆర్’ అంటే.. చాలా మంది పోలీసులకు ‘జీరో ఎఫ్ఐఆర్’పై సరైన అవగాహన లేదు. జీరో ఎఫ్ఐఆర్ అంటే.. ఘటన జరిగిన ప్రదేశం ఏ పోలీస్‌స్టేషన్ పరిధిలోకి వస్తుందో తెలియనప్పుడు.. ఏదో ఒక పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడం. రాత్రి, పగలు ఎప్పుడైనా ఆపద సమయంలో బాధితులు స్టేషన్‌కు వెళ్లినప్పుడు పరిధితో నిమిత్తం లేకుండా పోలీసు అధికారులు ఫిర్యాదును స్వీకరించాలి. వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లి బాధితుడు చెప్పిన విషయం ప్రా«థమికంగా నిర్ధారణ అయితే కేసు నమోదు చేయాలి. సాధారణంగా స్టేషన్‌లోని వరుస సంఖ్యతో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. అయితే వచ్చిన కేసు తమ స్టేషన్ పరిధిలోకి రాకపోతే ఎఫ్ఐఆర్ నమోదు చేసి ‘జీరో’ నంబర్ కేటాయిస్తారు. తర్వాత ఆయా పోలీస్‌స్టేషన్‌కు కేసును బదిలీ చేశాక అక్కడ ఎఫ్ఐఆర్కు నెంబర్ ఇస్తారు. ఆపద సమయంలో దారిలో కనిపించే స్టేషన్‌కు గానీ, లేదా దగ్గరలో ఉండే స్టేషన్‌కు గానీ బాధితులు వెళ్లడం సహజం. చట్టంలో జీరో ఎఫ్‌ఆర్‌కు వెసులు బాటు ఉన్నా అధికారుల ఉదాసీనత కారణంగా అమలుకు నోచుకోలేదు. ఫలితంగా నిత్యం ఎంతో మంది బా«ధితులు ఇబ్బందులు పడుతున్నారు. ఇకపై కేసుల నమోదు చేయడంలో ఎలాంటి జాప్యం జరగకూడదనే ప్రభుత్వం ‘జీరో ఎఫ్ఐఆర్’ ను ఖచ్చితంగా నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ విధానంతో స్థానికంగానే గాక రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో ఉన్నా ఆయా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ‘జీరో ఎఫ్ఐఆర్’ కింద కేసు నమోదు చేసుకోమని పోలీసు అధికారులను అడగవచ్చు. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశాలిచ్చాం.. స్టేషన్ పరిధితో నిమిత్తం లేకుండా జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సబ్‌డివిజన్ పరిధిలోని సీఐలు, ఎస్ఐలకు ఆదేశాలు జారీ చేశాం. బాధితులు ఏ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినా ఫిర్యాదులు తీసుకుంటాం. మహిళలు నిర్భయంగా స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయొచ్చు. మíßహిళలు, చిన్న పిల్లల రక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. – లోసారి సుధాకర్, ప్రొద్దుటూరు డీఎస్పీ. జీరో ఎఫ్ఐఆర్ కింద ఫిర్యాదు తీసుకోవాల్సిందే.. బాధితుడికి అన్యాయం జరిగితే తాను నివసించే చోటు నుంచి నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తే పరిధితో నిమిత్తం లేకుండా ‘జీరో ఎఫ్ఐఆర్’ నమోదు చేయాల్సిందేనని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోకవరపు శ్రీనివాస్ ఇటీవల లోక్‌అదాలత్ భవన్లో విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. బాధితుడి ఫిర్యాదుపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశాక సమగ్ర దర్యాప్తు కోసం సంబంధిత పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేయాలని తెలిపారు. ఒక బాధితుడు తమ దగ్గరికి ఫిర్యాదు చేసేందుకు రాగా సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించానన్నారు. తీరా స్టేషన్‌కు వెళితే తమకు సంబంధం లేదని బాధితుడిని పోలీసులు వెనక్కి పంపించినట్లు జిల్లా జడ్జి ఆవేదన వ్యక్తం చేశారు. పబ్లిక్ సర్వెంట్‌గా ఎస్ఐ గానీ, సీఐ గానీ ఎక్కడైనా సెక్షన్ 154 సీఆర్పీసీ ప్రకారం జీరో ఎఫ్ఐఆర్ను నమోదు చేయాలన్నారు. లేకుంటే 166ఏ ఐపీసీ సెక్షన్ ప్రకారం వారే నిందితులవుతారని స్పష్టం చేశారు. ‘దిశ’ మిస్సింగ్‌పై ఫిర్యాదు తీసుకోని పోలీసులు.. హైదరాబాద్‌లోని శంషాబాద్‌లో వెటర్నరీ డాక్టర్ దిశ మిస్సింగ్ విషయంలో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడానికి వెళ్లగా సంఘటనా స్థలం తమ పరిధిలోకి రాదని, మరో స్టేషన్‌కు వెళ్లాలని అక్కడి పోలీసులు చెప్పినట్లు వార్తలు రావడం వివాదాస్పదమైంది. తర్వాత దిశను నలుగురు కలిసి హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ సంఘటన నేపథ్యంలో బాధితుల నుంచి ఏ పోలీస్‌స్టేషన్‌కు మొదట ఫిర్యాదు వస్తే అక్కడే తీసుకోవాలని నిబంధనలు పెట్టారు. ఈ మేరకు ఏపీ డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. -
లీవ్ కావాలంటే ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిందే
బలరామ్‌పూర్ : మనకు ఎప్పుడైనా లీవ్ కావాలంటే ఏం చేస్తాం ! వెంటనే మెయిల్ రూపంలో కానీ లేదా మెసేజ్ రూపంలో సమాచారాన్ని అందిస్తాం. కానీ ఉత్తర్‌ప్రదేశ్‌లోని బలరాంపూర్ పోలీసులు మాత్రం తమకు లీవ్ కావాలంటే దరఖాస్తును ఇంగ్లీష్‌లోనే పెట్టుకోవాలని జిల్లా ఎస్పీ రంజన్ వర్మ కోరారు. బలరాంపూర్ జిల్లాలో పనిచేస్తున్న పోలీసులు అందుకోసం ప్రతిరోజు వీలైనన్ని ఇంగ్లీష్ దినపత్రికలను చదవడం అలవాటు చేసుకోవాలని పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లు, పోలీస్ హెడ్‌క్వార్టర్స్ లో వర్క్‌షాప్‌లు నిర్వహించినట్లు తెలిపారు. తన ఆదేశాల ప్రకారం ఇంగ్లీష్ నేర్చుకోవడానికి పలువురు పోలీసు అధికారులు డిక్షనరీలు కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. 'ఈ నిర్ణయం తీసుకోవడానికి నా దగ్గర ఒక బలమైన కారణం ఉంది. సైబర్ క్రైమ్, నిఘా సంస్థల నుంచి మాకు వస్తున్న ఫిర్యాదులు అన్నీ ఇంగ్లీష్‌లోనే వస్తాయి. మా పోలీసులకు ఇంగ్లీష్ మీద కనీస పరిజ్ఞానం లేకపోవడంతో వచ్చిన ఫిర్యాదులను తప్పుగా అర్థం చేసుకుంటున్నట్లు తేలింది. అందుకే మా పోలీసులు ఇంగ్లీష్ మీద కనీస అవగాహన పెంచుకోవాలనే ఉద్దేశంతో సెలవు కావాలంటే దరఖాస్తును తప్పనిసరిగా ఇంగ్లీష్‌లోనే పెట్టుకోవాలన్న కండీషన్ పెట్టినట్లు' ఎస్పీ రంజన్ వర్మ చెప్పుకొచ్చారు. 2011 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన రంజన్ వర్మ విధుల్లో చేరినప్పటి నుంచి తాను పని చేసిన ప్రతీ చోట ఇంగ్లీష్‌ను నేర్చుకోవాలనే నిబంధనను అమలు చేసేవారు. ' ఇప్పుడిప్పుడే మా కానిస్టేబుళ్లు గూగుల్ సహాయంతో తమ లీవ్‌కు సంబంధించిన దరఖాస్తును ఇంగ్లీష్‌లోనే చేసుకుంటున్నారని, ఇది ఇతర ప్రాంతాల పరిధిలోని పోలీస్స్టేషన్లలో అమలు అయ్యే విధంగా చూస్తానని' ఆయన తెలిపారు. రంజన్ వర్మ తీసుకున్న నిర్ణయం పట్ల పోలీసు ఉన్నతాధికారుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీసులకు దీన్ని అమలు చేసే విషయమై సీఎం యోగి ఆదిత్యానాథ్ నిర్ణయం కోసం వేచి చూస్తున్నట్లు లక్నోకి చెందిన ఓ సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు. -
ఆదిలాబాద్ డీఎస్పీ, జైనథ్ ఎస్ఐపై వేటు
ఆదిలాబాద్ రూరల్: ఫోర్స్క్వేర్ టెక్నో మార్కె టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కేసులో ఇద్దరు పోలీసులపై వేటుపడింది. కేసు దర్యాప్తు,. నిందితుల అరెస్టులో అలసత్వం ప్రదర్శించడంతో ఆదిలాబాద్ డీఎస్పీ కె.నర్సింహారెడ్డి, జైనథ్ ఎస్ఐ తోట తిరుపతిలను సస్పెండ్ చేస్తూ డీజీపీ మహేందర్‌రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్‌లో నివాసముంటున్న నిజామాబాద్ జిల్లాకు చెందిన నాగారం కల్యాణ్‌కుమార్ ఫోర్ స్క్వేర్ టెక్నో మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ నకిలీ సంస్థను స్థాపించాడు. నిరుద్యోగులకు డిజిటల్ ఇండియా పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు కల్పిస్తామని నమ్మబలికాడు. 596 మంది నుంచి రూ.50 వేల నుంచి రూ.2 లక్షల చొప్పున సుమారు రూ.3.57 కోట్లు ఏజెంట్ల ద్వారా వసూలు చేసి మోసం చేశాడు. ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ ఆదేశాల మేరకు డీఎస్పీ నర్సింహారెడ్డి, అప్పటి ఆదిలాబాద్ రూరల్ ఎస్ఐ తోట తిరుపతి సోదాలు నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అయితే దర్యాప్తులో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు అక్రమాలకు పాల్పడి నిందితులను కాపా డేందుకు ప్రయత్నించారు. దీన్ని గుర్తించిన ఎస్పీ వారిద్దరిపై డీజీపీకి నివేదిక పంపగా.. ఇద్దరిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. -
‘ఆ డీఎస్పీ అవినీతిపై విచారణ చేస్తే ఆధారాలు చూపిస్తా’
సాక్షి, వైఎస్సార్ జిల్లా : ప్రొద్దుటూరు డీఎస్పీ శ్రీనివాసరావు అవినీతికి పాల్పడ్డారని మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఆరోపించారు. ఆయన అవినీతిపై అధికారులు విచారణ చేస్తే ఆధారాలు చూపిస్తానని చెప్పారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ ఎంపీ సీఎం రమేష్ అండతో డీఎస్పీ శ్రీనివాసరావు రూ. రెండు కోట్ల మేర అవినీతి సొమ్ము సంపాదించారని ఆరోపించారు. డీఎస్పీపై గతంలో ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోలేదన్నారు. వారం రోజుల్లో శ్రీనివాసరావుపై చర్యలు తీసుకోకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. -
నేరాల సంఖ్య తగ్గించా...
విజయనగరం టౌన్ : జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌గా తాను బాధ్యతలు స్వీకరించిన తరువాత నేరాల సంఖ్య గణనీయంగా తగ్గించానని ఎల్.కె.వి.రంగారావు తెలిపారు. విజయవాడ డీజీపీ కార్యాలయంలోని శాంతిభధ్రతల విభాగం ఏఐజీగా బదిలీపై వెళ్తున్న ఆయన ఇక్కడి డీపీఓ సమావేశ మందిరంలో శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాను బాధ్యతలు చేపట్టిన ఆర్థిక సంవత్సరంలో 19 హత్యకేసులు నమోదవ్వగా, తన 14 నెలల పదవీ కాలంలో కేవలం 12 కేసులు మాత్రమే నమోదయ్యాయని చెప్పారు. ఆ ఏడాది సాధారణ దొంగతనాలు 101 కేసులు నమోదవ్వగా తర్వాతి తన కాలంలో 99 మాత్రమే నమోదైనట్టు వివరించారు. తాను బాధ్యతలు స్వీకరించిన ఏడాదిలో చిన్న తగాదా కేసులు 325 నమోదు కాగా, తన సర్వీసులో గ్రామ సమస్యలను పరిష్కరించేందుకు ప్ర త్యేక చర్యలు చేపట్టడంతో వాటి సంఖ్య గణనీయంగా 261కి తగ్గిందని చెప్పారు. అప్పటికి రోడ్డు ప్రమాదాలలో మరణించిన కేసులు 157 నమోదు కాగా, తాను చేపట్టిన ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాలు, ముందస్తు చర్యల కారణంగా 143 కేసులకు తగ్గించామని చెప్పారు. ముఖ్యంగా మహిళల మీద దాడులకు సంబం ధించిన కేసులు ఆ ఏడాది 322 నమోదు కాగా, వాటి సంఖ్యను 233కి నియంత్రించామని పేర్కొన్నారు. గంజాయిపై పటిష్ట నిఘా... ఎన్డీపీఎస్ చట్టం కింద 2014లో ఆరు కేసులు నమోదు చేసి 265 కిలోల గంజాయిని, 2015లో ఐదు కేసులు నమోదుచేసి 467 కిలోల గంజాయిని, 2016లో 16 కేసులు నమోదుచేసి 1512 కిలోల గంజాయిని పట్టుకోగా... 2017లో నాలుగు కేసులు నమోదుచేసి 913 కిలోల గంజాయిని సీజ్ చేశామని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వాహనచోదకులపై 2016లో 4021 కేసులు, 2017లో 2233 కేసులు నమోదుచేశామని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమణకు సంబంధించి తానురాక ముందు 82వేల7 కేసులు నమోదైతే, తాను బాధ్యతలు తీసుకున్న తర్వాత అవగాహన కల్పించాలని సంకల్పించామని, అందువలన కేవలం 57,317 కేసులు 2017లో ఇప్పటి వరకూ 55,643 కేసులు నమోదుచేశామని వివరించారు. పోలీస్ సంక్షేమానికి అధిక ప్రాధాన్యం పోలీసుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇచ్చానని చెప్పారు. వారి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్నడూ లేని విధంగా కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు చేపట్టామనీ, డీపీఓ కార్యాలయ ప్రాంగణంలో మైలాన్ కంపెనీ సహకారంతో వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక షెడ్ నిర్మించామని, వేర్వేరు ప్రాంతాల నుంచి జిల్లాకు వచ్చేవారికోసం ప్రత్యేక డార్మిటరీ, పోలీస్ స్టేషన్లలో పనిచేసే సిబ్బంది 15 రోజులకోసారి సెలవు తీసుకునేలా సంస్కరణలు చేపట్టానని తెలిపారు. పోలీస్ ప్రాంగణాలను సుందరంగా తీర్చిదిద్ది, ఖాళీగా స్ధలాల్లో మొక్కలను నాటి, వాటిని సంరక్షించే బాధ్యతను స్దానిక పోలీసులకు అప్పగించామన్నారు. ఆత్మీయనేస్తం, మీతోమీఎస్పీ, గ్రీవెన్స్‌డే, ప్రతిదినం ప్రబోధం, ఆత్మీయవీడ్కోలు, వనం–మనం, పోలీస్ మిత్ర, డైన్ విత్ యువర్ ఎస్పీ, విజ్ఞానదర్శిని, పోలీస్ సేవాదళ్, వృద్ధమిత్ర తదితర కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఇప్పటివరకూ తనకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. -
గతం కాదు.. ఇప్పుడు చూడండి
►కోడిపందాలపై జిల్లా ఎస్పీ శపథం ► ఆదేశాలు లెక్క చేయకపోతే రౌడీషీట్లు తెరుస్తాం ఉండి : గతంలో కోడిపందాలపై ఎవరు ఎలా వ్యవహరించారో నాకు తెలియదు కాని నేను మాత్రం కచ్చితంగా ఆపి తీరుతా అని శపథం చేశారు జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్. సోమవారం ఉండి పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కోడిపందాలు, పేకాట తదితర దురలవాట్ల వల్ల చాలా కుటుంబాలు వీధిన పనడుతున్నాయన్నారు. అందుకే సంక్రాంతి పండగకు ముందుగానే జిల్లావ్యాప్తంగా సుమారు 600 బైండోవర్ కేసులు నమోదు చేశామని అన్నారు. కోడిపందాలపై ఉక్కుపాదం మోపేందుకు జిల్లాలో ఆరు ప్రత్యేక టీంలు పనిచేస్తున్నాయని చెప్పారు. పందాల నిర్వహణకు ఏర్పాట్లు చేసినా రౌడీషీట్లు తెరుస్తామని అన్నారు. పందాల నిర్వహణపై పూర్తి స్థాయిలో నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. వీటిపై ప్రతిరోజూ కేసులూ నమోదు చేస్తున్నామని తెలిపారు. కోడిపందాలపై రెండు నిమిషాల నిడివితో డాక్యుమెంటరీ విడుదల చేస్తున్నట్టు చెప్పారు. జిల్లాలో భద్రతాపరమైన చర్యల్లో భాగంగా 167 సీసీ కెమెరాలు వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసామన్నారు. హెల్మెట్ ధారణను భారంగా కాకుండా బాధ్యతగా తీసుకోవాలని చెప్పారు. పోలీసుల బాధ పడలేకపోతున్నాం అని అనుకోకుండా కుటుంబాలను, జీవితాలను కాపాడుకుంటున్నాం అనే మంచి ఆలోచనతో హెల్మెట్ ధరించాలన్నారు. జిల్లాల్లో 2014లో రూ.2.80 కోట్లు, 2015లో రూ.3.70 కోట్ల సొత్తును రికవరీ చేశామని తెలిపారు. రాష్ట్రాన్ని వణికించిన సైకో సూదిగాడి కోసం ఇంకా గాలింపు జరుపుతున్నామన్నారు. సీసీ కెమెరాలలో క్వాలిటీ సరిగ్గా లేకపోవడంతో నిందితుడిని పట్టుకోలేకపోయామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ అమర్నాథ్నాయుడు, సీఐ ఆర్జే జయసూర్య, ఎస్సై ఎం.రవివర్మ తదితర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రజా ఆస్తుల రక్షణే కర్తవ్యం
‘సోషియాలజీలో రోల్ ప్లే అనే అంశంపై ఒక పాఠం ఉంది. ఎవరి పని వారు చేసుకుంటేనే వ్యవస్థ సక్రమంగా నడుస్తుందన్నది దాని సారాంశం. పోలీసు శాఖకు కూడా ఇదే వర్తిస్తుంది. ఎవరో ఆదేశించారనో.. ఇంకెవరో ఒత్తిడి చేశారనో.. ప్రజలు ప్రశ్నిస్తారనో.. కాకుండా బాధ్యతతో కర్తవ్యం నిర్వర్తించడం ద్వారానే సత్ఫలితాలు సాధించగలుగుతాం.’ శ్రీకాకుళం క్రైం: ‘సహజంగా శ్రీకాకుళం ప్రశాంతమైన జిల్లా. కానీ సమాజంలో చోటు చేసుకుంటన్న ఆర్థికపరమైన మార్పులు.. అవసరాలు ఒకింత శాంతిభద్రతల సమస్య సృష్టిస్తున్నాయి. అయితే వాటిని ఎదుర్కొనేందుకు ప్రజలకు భద్రత కల్పించేందుకు మేమెప్పుడూ సిద్ధంగానే ఉంటాం’.. అని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్(ఎస్పీ) ఎ.ఎస్.ఖాన్ చెప్పారు. టెక్కలిలో ఇటీవల జరిగిన వరుస సంఘటనలు కలచివేశాయని.. ఒడిశా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన ఆగంతకులు ఇక్కడ నేరాలకు పాల్పడి పరారవుతున్న గుర్తించామని.. ఇటువంటివారి ఆట కట్టించేందుకు గట్టి చర్యలు తీసుకుంటామన్నారు. వేసవిలో జరిగే నేరాలు, పోలీసు శాఖ ఆధునికీకరణ ఆటో కార్మికుల ఆందోళన తదితర అంశాల గురించి ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎస్పీ సవివరంగా మాట్లాడారు. ఇంటర్వ్యూ ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. వేసవి కాలం తస్మాత్ జాగ్రత్త ఇటీవల జిల్లాలో జరుగుతున్న వరుస నేరాలపై దృష్టి సారించాం. బంగారంపై ఉన్న మక్కువతో మహిళలు అధికంగా నగలు ధరించి విందు వినోద శుభకార్యాలకు హాజరవుతున్నారు. దీన్ని ఆసరాగా తీసుకుని చోరులు రెచ్చిపోతున్నారు. అందుకే మహిళలు ఆభరణాలు ధరించి ఒంటరిగా వెళ్లకూడదని సూచించారు. ప్రస్తుతం వేసవి కాలం కావడంతో చోరులు మరింత రెచ్చిపోయే అవకాశం ఉంది. ప్రజలు తమ కష్టార్జితాన్ని కాపాడుకోవడానికి అప్రమత్తంగా ఉండాలి. ప్రజల జీవన విధానంలో వచ్చిన మార్పులు కూడా చోరులకు అవకాశం కల్పిస్తున్నాయి. శ్రీకాకుళం పట్టణంలోని టైటాన్ షోరూమ్‌లో జరిగిన లూటీ సంఘటనపై విచారణ వేగవంతం చేశాం. ఈ సంఘటనలో ఇతర రాష్ట్రాలకు చెందిన చోరులు పాల్గొన్నట్టు గుర్తించాం. పెండింగ్ కేసుల విచారణపై ప్రత్యేక దృష్టి సారించాం. సిబ్బందిలో మార్పు రావాలి తమ ధన, మాన, ప్రాణాలకు ఇబ్బంది ఏర్పడినప్పుడు ఫిర్యాదు చేసేందుకు వచ్చే ప్రజల పట్ల పోలీసు సిబ్బంది జాగ్రత్తగా వ్యవహరించాలి. ఫిర్యాదుదారుల పట్ల మర్యాద పూర్వకంగా వ్యవహరించాలి. శాంతిభధ్రతలు, నేర నియంత్రణ, ట్రాఫిక్ తదితర విషయాల్లో హోంగార్డు నుంచి అధికారి స్థాయి వరకు బాధ్యతగా వ్యవహరింలి. ఆటోవాలాలు సహకరించాలి రవాణా శాఖ నిబంధనల ప్రకారం ఆటోలు జాతీయ రహదారిపై ప్రయాణించటం నేరం. నిబంధనలు ఉల్లంఘించి పరిమితికి మించి ఆటోలు జాతీయ రహదారిపై రాకపోకలు సాగించడం వల్ల రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఇటీవల నరసన్నపేట, శ్రీకాకుళం శివారు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాలే దీనికి నిదర్శనం. ఆందుకే రవాణా శాఖతో కలిసి పోలీసులు జాతీయ రహదారిపై సంయుక్త దాడులు నిర్వహించి కేసులు నమోదు చేస్తున్నారు. జాతీయ రహదారిపై అండర్ పాసేజ్‌లు, ఓవర్ బ్రిడ్జిలు లేకపోవటం కూడ రోడ్డు ప్రమాదాలకు మరో కారణంగా గుర్తించాం. ఆటో యాజమానులను గుర్తించేందుకు జిల్లాలోని అన్ని పోలీసుస్టేషన్లను అనుసంధానిస్తూ ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ ఏర్పాటు చేస్తాం. శ్రీకాకుళం పట్టణ పరిధిలో పార్కింగ్ ప్రాంతాలు, ముఖ్య కూడళ్లలో సిగ్నలింగ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తాం. మద్యం సేవించి వాహనాలు నడిపేవారిని నియంత్రించేందుకు బ్రిత్ ఎనలైజర్లు ప్రవేశపెట్టే విషయాన్ని మున్సిపల్ అధికారులతో చర్చించాం. కొత్త వాహనాలివే... రాత్రి పూట గస్తీ, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కొత్త వాహనాలను, సిబ్బందిని సమకూర్చుతున్నాం. పాలకొండ, నరసన్నపేట, రాజాం, పలాస, కాశీబుగ్గ, ఇచ్ఛాపురం, టెక్కలి ప్రాంతాల్లో కొత్త రక్షక్ వాహనాలను, జాతీయ రహదారిపై వాహనాల వేగ నియంత్రణ కోసం ఇన్ట్రాసెక్టర్ వాహనాలను రప్పించనున్నాం. ఇందుకోసం హైదరాబాద్‌లో ప్రత్యేక శిక్షణకు ఎనిమిదిమంది సిబ్బందిని పంపించాం. ప్రస్తుతం జిల్లాలో నాలుగు హైవే పెట్రోలింగ్ వాహనాలు ఉన్నాయి. మరో రెండు కొత్త వాహనాలు రానున్నాయి. డయల్-100 పేరిట రెండు కొత్త పెట్రోలింగ్ వాహనాలను తెప్పిస్తున్నాం. రాత్రి గస్తీని పటిష్టం చేసేందుకు నేనే స్వయంగా పర్యవేక్షిస్తాను. రామలక్ష్మణ జంక్షన్, ఆర్టీసీ బస్టాండ్, ఇలిసిపురం తదితర ప్రాంతాల్లో ఉన్న పోలీసు సబ్ కంట్రోల్ రూమ్‌లను అధునికీకరిస్తాం. -
ఉత్కంఠకు తెర
18న ఎస్పీగా బాధ్యతలు స్వీకరించనున్న సుమతి సంగారెడ్డి క్రైం: జిల్లా ఎస్పీగా నియామకమైన బి.సుమతి ఈ నెల 18న బాధ్యతలు స్వీకరించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 36 మంది ఐపీఎస్‌లకు పోస్టింగ్‌లు, బదిలీలు చేస్తూ మంగళవారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా జిల్లా ఎస్పీ శెముషీ బాజ్‌పేయ్‌ని బాలానగర్ డీసీపీగా నియమిస్తూ.. మెదక్ నుంచి బదిలీ చేశారు. గతంలో ఈమెను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. ఈ నేపథ్యంలో ఆమెను హైదరాబాద్ డీజీపీ కార్యాలయానికి బదిలీ చేశారు. రెండు నెలల క్రితమే ఎస్పీ బదిలీ అయినప్పటికీ పోస్టింగ్‌లు ఇవ్వడంలో జాప్యం జరిగింది. కౌంటర్ ఇంటలిజెన్స్‌లో ఎస్పీగా పనిచేస్తున్న సుమతిని రెండు నెలల క్రితమే మెదక్‌కు నియమించినప్పటికీ పోస్టింగ్ ఇవ్వలేదు. తాజాగా ఐపీఎస్‌లకు పోస్టింగ్‌లు ఇవ్వడంతో రెండు నెలలుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. 1984 బ్యాచ్‌కు చెందిన సుమతి వరంగల్ డీఎస్పీగా, మల్కాజ్గిరి ఏసీపీగా, సీఐడీ ఎస్పీగా, కౌంటర్ ఇంటెలిజెన్స్ ఎస్పీగా పనిచేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఎవరినీ ఉపేక్షించరని పేరు తెచ్చుకున్నారు. -
పోలీస్ శాఖలో ఇద్దరు సస్పెన్షన్
సాక్షి ప్రతినిధి, ఏలూరు : కానిస్టేబుళ్లు, జిల్లా పోలీస్ కార్యాలయ ఉద్యోగులు కలసికట్టుగా సాగించిన మెడికల్ లీవుల కుంభకోణంపై జిల్లా ఎస్పీ డాక్టర్ కె.రఘురామిరెడ్డి సమగ్ర విచారణకు ఆదేశించారు. ‘లీవుల స్వాహా’ శీర్షికన సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఉద్యోగుల మెడికల్ లీవులను సర్వీస్ రిజిస్టర్లో నమోదు చేయకుండా అవకతవకలకు పాల్పడిన జిల్లా పోలీస్ కార్యాలయంలోని ‘ఏ సెక్షన్’ విభాగం జూని యర్ అసిస్టెంట్లు లంకా కిషోర్, హలీమ్‌ను సస్పెండ్ చేసినట్టు ఎస్పీ తెలిపారు. సోమవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ మెడికల్ లీవుల అవకతవకలపై ఇప్పటికే తమకు సమాచారం ఉందన్నారు. సమగ్ర వివరాలతో వచ్చిన ‘సాక్షి’ కథనం ఆధారంగా లోతైన విచారణ చేస్తామని చెప్పారు. మెడికల్ లీవులను సర్వీసు రిజిస్టర్లో నమోదు చేయించకుండా జీతాలు పొందిన కానిస్టేబుళ్ల వేతనాల్లో కోత విధించేలా చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. ఈ మేరకు పోలీసు ఉన్నతాధికారులకు, రాష్ట్ర ఖజానా విభాగానికి లేఖ రాస్తామని చెప్పారు. క్రమశిక్షణకు మారుపేరైన పోలీసు శాఖలో మరోసారి ఇటువంటి అవకతవకలకు పాల్పడకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రాథమికంగా ఆ ఇద్దరు ఉద్యోగులదే తప్పని తేలడంతో వారిని సస్పెండ్ చేశామని, వీరితోపాటు ఆ విభాగంలో ఎవరెవరి పాత్ర ఉందన్న విషయమై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. -
టీడీపీ నేతలకు భంగపాటు
- ఎస్పీ సెంథిల్‌కుమార్ జిల్లాకు రాక రేపు - 31న బాధ్యతల స్వీకరణ ! నెల్లూరు(క్రైమ్): జిల్లా ఎస్పీగా సెంథిల్‌కుమార్ నియామకాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన టీడీపీ నేతలకు భంగపాటు ఎదురైనట్లు తెలుస్తోంది. సెంథిల్ కుమార్ బుధవారం నెల్లూరుకు రానున్నారు. గురువారం ఆయన ఎస్పీగా బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. ఆయనను నెల్లూరు ఎస్పీగా బదిలీ చేస్తూ ఈ నెల 16న ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. నిబంధనల ప్రకారం బాధ్యతల నుంచి రిలీవ్ అయిన వారు వారం రోజుల్లోపు నియమించిన చోట విధుల్లో చేరాలి. ఈ నెల 21న సెంథిల్‌కుమార్ అనంతపురం ఎస్పీ బాధ్యతల నుంచి రిలీవ్ అయ్యారు. నెల్లూరులో 22న రిలీవ్ అయిన నవదీప్సింగ్గ్రేవాల్ సోమవారం విజయనగరం వెళ్లారు. అయితే సెంథిల్‌కుమార్ బాధ్యతలు చేపట్టే విషయంలో కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. ఆయనకు ముక్కుసూటిగా వ్యవహరించే అధికారిగా పేరుంది. అనంతపురంలో ఆయన రాజకీయాలకు అతీతంగా వ్యవహరించారు. అధికార పార్టీ నేతల సిఫార్సులను కూడా ఖాతరు చేయని అధికారిగా గుర్తింపు పొందారు. ఈ క్రమంలోనే ఆయన నెల్లూరు ఎస్పీగా నియమితులు కావడంతో జిల్లా టీడీపీ నేతల్లో కలవరం మొదలైంది. అనంతపురం నాయకుల ద్వారా ఎస్పీ గురించి తెలుసుకుని ఆయన నియామకాన్ని ఆపేందుకు శతవిధాలా ప్రయత్నించారు. ఈ నేపథ్యంలోనే సెంథిల్‌కుమార్ స్థానంలో సూర్యనారాయణరావు పేరు తెరపైకి వచ్చింది. టీడీపీ నేతల ఒత్తిళ్లు ఫలించాయని, సూర్యనారాయణరావు ఎస్పీగా బాధ్యతలు చేపడతారని ప్రచారం జరిగింది. సెంథిల్‌కుమార్ కూడా రిలీవ్ అయిన వారం తర్వాత కూడా బాధ్యతలు చేపట్టకపోవడంతో ఆయన నియామకం ఆగిందని భావించారు. వీటిన్నింటికి ఫుల్స్టాప్ పెడుతూ ఆయన గురువారం బాధ్యతలు చేపడుతున్నట్లు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసుశాఖలోని పలువురు అధికారులు, సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. విధినిర్వహణలో బాధ్యతారాహిత్యం, అక్రమాలను సెంథిల్‌కుమార్ సహించరనే పేరుండడంతో హడలిపోతున్నారు. -
కొత్త ఎస్పీ రవికృష్ణ
కర్నూలు: కర్నూలు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్పీ) రఘురామిరెడ్డి పశ్చిమ గోదావరి జిల్లాకు బదిలీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసాధికారులకు ప్రభుత్వం స్థానచలనం కల్పించింది. కొత్త నియామకాలకు సంబంధించి బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కర్నూలు జిల్లా ఎస్పీగా రవికృష్ణను నియమించింది. 2006 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన రవికృష్ణ ముఖ్యమంత్రి భద్రతా విభాగం ప్రత్యేక అధికారిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం శాఖా పరమైన శిక్షణలో భాగంగా జైపూర్‌లో ఉంటున్నారు. పది రోజుల్లో శిక్షణ పూర్తి కానుంది. ఆ తర్వాత ఆయన కర్నూలులో బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన ఈయన అదే జిల్లాలోని చింతపల్లి ఏఎస్పీగా మొదట విధుల్లో చేరారు. 2011లో ఎస్పీగా పదోన్నతి పొందారు. శ్రీకాకుళంలో పని చేసేటప్పుడు మావోయిస్టులను జన జీవన స్రవంతిలోకి రప్పించడానికి ‘అమ్మ పిలుపు’ అనే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టి విజయవంతం చేశారు. హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీగా కూడా పని చేశారు. ట్రాఫిక్ విధుల్లో పని చేసే సిబ్బంది నిజాయతీగా ఉండాలని, అవినీతికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి అమలు చేయించారు. అలాగే వాహనాల్లో తల్లిదండ్రులు బయటికి వెళ్లేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పాఠశాలలు, కళాశాలల విద్యార్థులతో ‘నాన్న కోసం’ అనే వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. 2011 నుంచి జూలై 2013 వరకు గుంటూరు అర్బన్ ఎస్పీగా సేవలందించారు. ఈ సందర్భంగా ఆపరేషన్ అనాధలు, ఆపరేషన్ వీధి బాలలు, బాధితులకు భరోస, ఆపరేషన్ యాచకులు వంటి సేవా కార్యక్రమాలను చేపట్టి ప్రజల మన్ననలు పొందారు. వీధుల్లో ఉంటున్న యాచకులు, బాలల కోసం పునరావాసం కల్పించడం రాత్రి వేళల్లో పడుకోవడానికి ప్రత్యేకంగా షెల్టర్లు ఏర్పాటు చేయించడం వంటి సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. సొంత శాఖలో పని చేస్తున్న సిబ్బంది సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తారని ఈయనకు పేరుంది.