విజయనగరం టౌన్ : జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌గా తాను బాధ్యతలు స్వీకరించిన తరువాత నేరాల సంఖ్య గణనీయంగా తగ్గించానని ఎల్.కె.వి.రంగారావు తెలిపారు. విజయవాడ డీజీపీ కార్యాలయంలోని శాంతిభధ్రతల విభాగం ఏఐజీగా బదిలీపై వెళ్తున్న ఆయన ఇక్కడి డీపీఓ సమావేశ మందిరంలో శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాను బాధ్యతలు చేపట్టిన ఆర్థిక సంవత్సరంలో 19 హత్యకేసులు నమోదవ్వగా, తన 14 నెలల పదవీ కాలంలో కేవలం 12 కేసులు మాత్రమే నమోదయ్యాయని చెప్పారు. ఆ ఏడాది సాధారణ దొంగతనాలు 101 కేసులు నమోదవ్వగా తర్వాతి తన కాలంలో 99 మాత్రమే నమోదైనట్టు వివరించారు.
తాను బాధ్యతలు స్వీకరించిన ఏడాదిలో చిన్న తగాదా కేసులు
325 నమోదు కాగా, తన సర్వీసులో గ్రామ సమస్యలను పరిష్కరించేందుకు ప్ర త్యేక చర్యలు చేపట్టడంతో వాటి సంఖ్య గణనీయంగా 261కి తగ్గిందని చెప్పారు. అప్పటికి రోడ్డు ప్రమాదాలలో మరణించిన కేసులు 157 నమోదు కాగా, తాను చేపట్టిన ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాలు, ముందస్తు చర్యల కారణంగా 143 కేసులకు తగ్గించామని చెప్పారు. ముఖ్యంగా మహిళల మీద దాడులకు సంబం ధించిన కేసులు ఆ ఏడాది 322 నమోదు కాగా, వాటి సంఖ్యను 233కి నియంత్రించామని పేర్కొన్నారు.
గంజాయిపై పటిష్ట నిఘా...
ఎన్‌డీపీఎస్ చట్టం కింద 2014లో ఆరు కేసులు నమోదు చేసి 265 కిలోల గంజాయిని, 2015లో ఐదు కేసులు నమోదుచేసి 467 కిలోల గంజాయిని, 2016లో 16 కేసులు నమోదుచేసి 1512 కిలోల గంజాయిని పట్టుకోగా... 2017లో నాలుగు కేసులు నమోదుచేసి 913 కిలోల గంజాయిని సీజ్ చేశామని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వాహనచోదకులపై 2016లో 4021 కేసులు, 2017లో 2233 కేసులు నమోదుచేశామని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమణకు సంబంధించి తానురాక ముందు 82వేల7 కేసులు నమోదైతే, తాను బాధ్యతలు తీసుకున్న తర్వాత అవగాహన కల్పించాలని సంకల్పించామని, అందువలన కేవలం 57,317 కేసులు 2017లో ఇప్పటి వరకూ 55,643 కేసులు నమోదుచేశామని వివరించారు.
పోలీస్ సంక్షేమానికి అధిక ప్రాధాన్యం
పోలీసుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇచ్చానని చెప్పారు. వారి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్నడూ లేని విధంగా కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు చేపట్టామనీ, డీపీఓ కార్యాలయ ప్రాంగణంలో మైలాన్ కంపెనీ సహకారంతో వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక షెడ్ నిర్మించామని, వేర్వేరు ప్రాంతాల నుంచి జిల్లాకు వచ్చేవారికోసం ప్రత్యేక డార్మిటరీ, పోలీస్ స్టేషన్లలో పనిచేసే సిబ్బంది 15 రోజులకోసారి సెలవు తీసుకునేలా సంస్కరణలు చేపట్టానని తెలిపారు. పోలీస్ ప్రాంగణాలను సుందరంగా తీర్చిదిద్ది, ఖాళీగా స్ధలాల్లో మొక్కలను నాటి, వాటిని సంరక్షించే బాధ్యతను స్దానిక పోలీసులకు అప్పగించామన్నారు. ఆత్మీయనేస్తం, మీతోమీఎస్పీ, గ్రీవెన్స్‌డే, ప్రతిదినం ప్రబోధం, ఆత్మీయవీడ్కోలు, వనం–మనం, పోలీస్ మిత్ర, డైన్ విత్ యువర్ ఎస్పీ, విజ్ఞానదర్శిని, పోలీస్ సేవాదళ్, వృద్ధమిత్ర తదితర కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఇప్పటివరకూ తనకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
నేరాల సంఖ్య తగ్గించా...
Published Sun, Jul 2 2017 4:24 AM | Last Updated on Tue, Sep 5 2017 2:57 PM
Advertisement