లీవ్‌ కావాలంటే ఇంగ్లీష్‌ నేర్చుకోవాల్సిందే | UP Top Cop Asks Staff To Learn Basics In English To Apply Leave | Sakshi
Sakshi News home page

లీవ్‌ కావాలంటే ఇంగ్లీష్‌ నేర్చుకోవాల్సిందే

Published Sun, Oct 6 2019 1:24 PM | Last Updated on Sun, Oct 6 2019 1:24 PM

UP Top Cop Asks Staff To Learn Basics In English To Apply Leave - Sakshi

బలరామ్‌పూర్‌ : మనకు ఎప్పుడైనా లీవ్‌ కావాలంటే ఏం చేస్తాం ! వెంటనే మెయిల్‌ రూపంలో కానీ లేదా మెసేజ్‌ రూపంలో సమాచారాన్ని అందిస్తాం. కానీ ఉత్తర్‌ప్రదేశ్‌లోని బలరాంపూర్ పోలీసులు మాత్రం తమకు లీవ్‌ కావాలంటే దరఖాస్తును ఇంగ్లీష్‌లోనే పెట్టుకోవాలని జిల్లా ఎస్పీ రంజన్‌ వర్మ కోరారు. బలరాంపూర్‌ జిల్లాలో పనిచేస్తున్న పోలీసులు అందుకోసం ప్రతిరోజు వీలైనన్ని ఇంగ్లీష్‌ దినపత్రికలను చదవడం అలవాటు చేసుకోవాలని పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా పరిధిలోని అన్ని పోలీస్‌ స్టేషన్లు, పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌ లో వర్క్‌షాప్‌లు నిర్వహించినట్లు తెలిపారు. తన ఆదేశాల ప్రకారం ఇంగ్లీష్‌ నేర్చుకోవడానికి పలువురు పోలీసు అధికారులు డిక్షనరీలు కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు.

'ఈ నిర్ణయం తీసుకోవడానికి నా దగ్గర ఒక బలమైన కారణం ఉంది. సైబర్‌ క్రైమ్‌, నిఘా సంస్థల నుంచి మాకు వస్తున్న ఫిర్యాదులు అన్నీ ఇంగ్లీష్‌లోనే వస్తాయి. మా పోలీసులకు ఇంగ్లీష్‌ మీద కనీస పరిజ్ఞానం లేకపోవడంతో వచ్చిన ఫిర్యాదులను తప్పుగా అర్థం చేసుకుంటున్నట్లు తేలింది. అందుకే మా పోలీసులు ఇంగ్లీష్‌ మీద కనీస అవగాహన పెంచుకోవాలనే ఉద్దేశంతో సెలవు కావాలంటే దరఖాస్తును తప్పనిసరిగా ఇంగ్లీష్‌లోనే పెట్టుకోవాలన్న కండీషన్‌ పెట్టినట్లు' ఎస్పీ రంజన్‌ వర్మ చెప్పుకొచ్చారు.

2011 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన రంజన్‌ వర్మ విధుల్లో చేరినప్పటి నుంచి తాను పని చేసిన ప్రతీ చోట ఇంగ్లీష్‌ను నేర్చుకోవాలనే నిబంధనను అమలు చేసేవారు. ' ఇప్పుడిప్పుడే మా కానిస్టేబుళ్లు గూగుల్‌ సహాయంతో తమ లీవ్‌కు సంబంధించిన దరఖాస్తును ఇంగ్లీష్‌లోనే చేసుకుంటున్నారని, ఇది ఇతర ప్రాంతాల పరిధిలోని పోలీస్‌స్టేషన్లలో అమలు అయ్యే విధంగా చూస్తానని' ఆయన  తెలిపారు. రంజన్‌ వర్మ తీసుకున్న నిర్ణయం పట్ల పోలీసు ఉన్నతాధికారుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీసులకు దీన్ని అమలు చేసే విషయమై సీఎం యోగి ఆదిత్యానాథ్‌ నిర్ణయం కోసం వేచి చూస్తున్నట్లు లక్నోకి చెందిన ఓ సీనియర్‌ పోలీస్‌ అధికారి వెల్లడించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement