![English proficiency key barrier to state university graduates getting jobs](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/13/s.jpg.webp?itok=uxawpBf1)
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాల నుంచి పట్టభద్రులైన యువతకు ఆంగ్లంలో సరైన నైపుణ్యం లేకపోవడం వారి పోటీ సామర్థ్యాన్ని దెబ్బతీస్తోందని నీతి ఆయోగ్ వెల్లడించింది. యువతలో భాషా నైపుణ్యాలు పెంపొందించేలా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేసింది. విద్యార్థులు ఆంగ్లం, ఇతర విదేశీ భాషలపై పట్టుసాధించేలా అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యంతో ప్రత్యేక కార్యక్రమాలకు రూపకల్పన చేయాలని నీతి ఆయోగ్ సిఫార్సు చేసింది.
ఈ మేరకు ఇటీవల ‘రాష్ట్రాలు, రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాల ద్వారా నాణ్యమైన ఉన్నత విద్య విస్తరణ’పేరిట విడుదల చేసిన నివేదికలో ఆంగ్ల భాష అవసరాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది. ‘అనేక రాష్ట్రాల్లో, స్థానిక పరిశ్రమలలో పనిచేసే నైపుణ్యం గల వ్యక్తులు, ఇతర మానవ వనరులు ప్రధానంగా రాష్ట్రం బయటి నుంచే వస్తున్నారు. ఈ ధోరణికి ముఖ్య కారణం స్థానిక యువతకు ఆంగ్ల భాషలో నైపుణ్యం తగినంతగా లేకపోవడమే. సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాల్సి ఉంది. విద్యార్థుల ఉపాధి నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు, తద్వారా వారు రాష్ట్రంలోనే ఉంటూ జాతీయ స్థాయిలో పోటీపడే స్థాయికి తీసుకెళ్లడం అత్యవసరం’అని తన నివేదికలో పేర్కొంది.
ముందున్న రెండు రాష్ట్రాలు
ఆంగ్ల భాష అవసరాన్ని గుర్తించడంలో పంజాబ్, కర్ణాటక రాష్ట్రాలు ముందున్నాయని నివేదికలో పేర్కొంది. పంజాబ్ ప్రభుత్వం 2023లో బ్రిటిష్ కౌన్సిల్ సహకారంతో ఈ దిశగా ప్రయత్నాలను ప్రారంభించిందని తెలిపింది. ఆరు నెలల పాటు ఇంటెన్సివ్ 18–సెషన్ల కోర్సును నిర్వహించడం ద్వారా ఆంగ్ల భాషా నైపుణ్యాలను పెంపొందించడంపై దృష్టి పెట్టిందని వివరించింది. దాదాపు 5వేల మంది ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు ఈ పైలట్ ప్రాజెక్ట్‌తో లాభం కలిగిందని వెల్లడించింది. విస్తరిస్తున్న ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రపంచ స్థాయిలో అభివృధ్ధి చెందేందుకు విద్యార్థులకు అవసరమైన భాషా సామర్థ్యాలను పెంపొందించడంలో పంజాబ్ చొరను నీతిఆయోగ్ ప్రశంసించింది. అదేవిధంగా, కర్ణాటక ప్రభుత్వం 2024లో ప్రారంభించిన కార్యక్రమాలను ప్రత్యేకంగా ప్రస్తావించింది.
ఉన్నత విద్యకు ప్రాధాన్యం ఇవ్వడం, భాషా నైపుణ్యాలను పెంచడం, విద్యార్థులకు ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుందని గుర్తు చేసింది. మైక్రోసాఫ్ట్ ఇండియాతో భాగస్వామ్యంతో ‘ఇంగ్లిష్ స్కిల్స్ ఫర్ యూత్’కార్యక్రమం ద్వారా 16 ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలల్లో 5,795 మంది విద్యార్థుల ఆంగ్ల నైపుణ్యాభివృధ్ధికి తోడ్పాటునందిస్తోంది. ‘స్కాలర్స్ ఫర్ అండర్ గ్రాడ్యుయేట్ టాలెంట్’కార్యక్రమం ద్వారా ఆరు విశ్వవిద్యాలయాల నుంచి అర్హులైన విద్యార్థులకు లండన్‌లోని విశ్వవిద్యాలయాలకు రెండు వారాల పాటు పంపి, వారితో అభ్యసించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ఆంగ్ల విద్యను ప్రోత్సహించిందని నీతిఆయోగ్ ప్రశంసించింది.
Comments
Please login to add a commentAdd a comment