
ద్రవ్యోల్బణానికి తగ్గట్లుగా పెరగడం లేదు
నైపుణ్యాల కొరతే ఇందుకు కారణం
నీతి ఆయోగ్ సభ్యుడు విర్మానీ
న్యూఢిల్లీ: దేశంలో ఉద్యోగాలు పెరుగుతున్నప్పటికీ, ద్రవ్యోల్బణానికి తగ్గట్లుగా జీతాలు మాత్రం పెరగడం లేదని నీతి ఆయోగ్ సభ్యుడు అరవింద్ విర్మానీ వ్యాఖ్యానించారు. గత ఏడేళ్లుగా ఇదే పరిస్థితి ఉందని చెప్పారు. ఇందుకు నైపుణ్యాల కొరతే ప్రధాన కారణమని తెలిపారు. అత్యధిక జనాభాను భారత్ ప్రయోజనకరమైన అంశంగా మల్చుకోవాలని అభిప్రాయపడ్డారు. ఇందుకోసం బోధన, శిక్షణను మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉంటుందని పేర్కొన్నారు. ‘పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే డేటా ప్రకారం వర్కర్లు–జనాభా నిష్పత్తి గత ఏడేళ్లుగా పెరుగుతోంది.
అంటే జనాభా వృద్ధికి మించి ఉద్యోగాల సంఖ్య పెరుగుతోంది. కాబట్టి ఉద్యోగాలు పెరగడం లేదనడం తప్పు. క్యాజువల్ వర్కర్ల వాస్తవ వేతనాలూ పెరిగాయని, వారి పరిస్థితులూ మెరుగుపడ్డాయని గణాంకాలు చెబుతున్నాయి. కానీ రెగ్యులర్ జీతాల ఉద్యోగాలే పెద్ద సమస్యగా ఉంటోంది. ఈ కేటగిరీలో ఏడేళ్లుగా ద్రవ్యోల్బణానికి తగ్గట్లుగా వాస్తవ వేతనాలు పెరగలేదు‘ అని విర్మానీ చెప్పారు. మిగతా దేశాల గణాంకాలతో పోల్చి చూసినప్పుడు, నైపుణ్యాలను మెరుగుపర్చుకోవడంపై భారత్ మరింతగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందనిపిస్తోందని తెలిపారు.
జిల్లా స్థాయిలో ఫోకస్ చేయాలి..
కేంద్ర ప్రభుత్వం దీనిపై తగు చర్యలు తీసుకుంటోందని, రాష్ట్రాలు కూడా ఈ దిశగా కసరత్తు చేయాలని చెప్పారు. ఉద్యోగాల కల్పన జిల్లా స్థాయిలో జరుగుతుంది కాబట్టి అక్కడ దృష్టి పెట్టాలన్నారు. ఇప్పటికే పని చేస్తున్న వారికే కాకుండా కొత్తగా ఉద్యోగాల్లో చేరుతున్న వారికి కూడా నైపుణ్యాలు అవసరమేనని విర్మానీ చెప్పారు. ‘ఉద్యోగం, నైపుణ్యాలనేవి ఒకే నాణేనికి రెండు పార్శా్వలు. నైపుణ్యాలుంటే ఉద్యోగం దక్కించుకోవడం సులభమవుతుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే మనం అన్ని అంశాల్లోనూ మెరుగుపడాలి. అవకాశాలను అందిపుచ్చుకోవాలి‘ అని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment