అత్యధికంగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల్లో ఈ దుస్థితి
29 జిల్లాల్లో ఒక్క కాలేజీ కూడా లేదు
దేశవ్యాప్తంగా మొత్తం 1,160 యూనివర్సిటీలు
ఇందులో 480 గ్రామీణ ప్రాంతాల్లో, 680 పట్టణాల్లో.. ఉన్నత విద్యలో 2035 నాటికి 50 శాతం జీఈఆర్ పెంచాలి
అప్పటికి 4.5 కోట్ల మంది అదనపు విద్యార్థులు రావాలి
నీతి అయోగ్ అధ్యయన నివేదిక వెల్లడి
సాక్షి, అమరావతి : దేశంలో రాష్ట్రాల మధ్య విశ్వవిద్యాలయాలు, కాలేజీల నిష్పత్తిలో అసమానతలున్నాయని నీతి ఆయోగ్ అధ్యయన నివేదిక వెల్లడించింది. కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువ విశ్వవిద్యాలయాలుంటే ఇంకొన్ని రాష్ట్రాల్లో అతి తక్కువ ఉన్నాయని తెలిపింది. ఉదా.. రాజస్థాన్‌లో 93, గుజరాత్‌లో 91, ఉత్తరప్రదేశ్‌లో 87 ఉండగా.. అండమాన్–నికోబార్ దీవులు, లక్షద్విప్, దాద్రా–నగర్ హవేలీ, డామన్–డయ్యూ కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒక్క విశ్వవిద్యాలయం కూడా లేదని పేర్కొంది.
ఈశాన్య రాష్ట్రాల్లో కూడా తక్కువ విశ్వవిద్యాలయాలున్నాయని నివేదిక తెలిపింది. దేశ రాజధాని ఢిల్లీ మినహా మిగిలిన రాష్ట్రాల్లో విశ్వవిద్యాలయాల నిష్పత్తిలోను, ఉన్నత విద్య అందుబాటులోనూ అసమానతలున్నాయని వివరించింది. నీతి ఆయోగ్ నివేదికలోని ఇతర ముఖ్యాంశాలు ఏమిటంటే..
పట్టణ ప్రాంతాల్లో 59 శాతం వర్సిటీలు..
ఇదిలా ఉంటే.. దేశవ్యాప్తంగా 1,160 విశ్వవిద్యాలయాలుంటే ఇందులో 680 వర్సిటీలు పట్టణ ప్రాంతాల్లోనూ.. 480 వరిటీలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. అంటే.. 66 శాతం జనాభా గల గ్రామీణ ప్రాంతాల్లో 41 శాతం యూనివర్శిటీలుండగా 34 శాతం జనాభాగల పట్టణ ప్రాంతాల్లో 59 శాతం యూనివర్సిటీలున్నాయి.
జాతీయ విద్యా విధానంలో భాగంగా 2035 నాటికి ఉన్నత విద్యలో జీఈఆర్‌ను 50 శాతానికి పెంచాలన్న లక్ష్యాలు నెరవేరాలంటే ప్రస్తుతమున్న 4.33 కోట్ల విద్యార్థుల నమోదును 9 కోట్లకు చేర్చాల్సి ఉంది. దాదాపు 4.5 కోట్ల మంది అదనపు విద్యార్థులను ఉన్నత విద్యలోకి తీసుకురావాలి.
ఈ నేపథ్యంలో.. ప్రాంతాలు, జిల్లాలు, రాష్ట్రాల మధ్య ఉన్నత విద్యా సంస్థల్లో అసమానతలను తొలగించేందుకు చర్య లు తీసుకుంటూ క్లస్టర్ వర్శిటీలతో సహా అనేక కొత్త విశ్వవిద్యాలయాలను స్థాపించాలని నీతి ఆయోగ్ నివేదిక సూచించింది. ప్రాంతీయ డిమాండ్, యాక్సెసిబిలిటీ, సామీప్యత పరిగణనలోకి తీసుకుని కొత్త వర్సిటీలు స్థాపించాలని సూచించింది.
ఉన్నత విద్యలోనూ అవకాశాలు పరిమితం..
» తక్కువ జనాభా కలిగిన ఈశాన్య రాష్ట్రాల్లో లక్ష జనాభాకు చూస్తే ఎక్కువ విశ్వవిద్యాలయాలు, కాలేజీలున్నాయి. కానీ, అత్యధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్‌లో లక్ష జనాభాకు కొన్ని వర్సిటీలే ఉన్నాయి. అలాగే, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల్లోనూ ఒక లక్ష జనాభాకు తక్కువ విశ్వవిద్యాలయాలున్నాయి.
» దేశంలో ఉన్నత విద్య అందుబాటులోనూ అసమానతలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో పరిమితంగా అవకాశాలు అందుబాటులో ఉండగా కొన్ని జిల్లాల్లో ఎక్కువ ఉన్నాయి.
» రాజస్థాన్‌లోని జైపూర్‌లో అత్యధికంగా 35, బెంగళూరులో 25, గుజరాత్‌లో 21 విశ్వవిద్యాలయాలున్నాయి.
» 160 జిల్లాల్లో ఒక్కో విశ్వవిద్యాలయం చొప్పున.. 102 జిల్లాల్లో మూడు కంటే తక్కువగా వర్సిటీలున్నాయి.
» ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల్లోని 380 జిల్లాల్లో అసలు విశ్వవిద్యాలయాలే లేవు.
» ఇక కాలేజీలు కూడా దేశంలోని కొన్ని జిల్లాల్లో అత్యధికంగా కొన్ని జిల్లాల్లో తక్కువగాను ఉన్నాయి.
» బెంగళూరులో 1,118 ఉండగా రాజస్థాన్‌లోని జైపూర్‌లో 740, మహారాష్ట్రలోని పూణేలో 628 కాలేజీలు ఉన్నాయి.
» దేశంలోని 153 జిల్లాల్లో 100 లేదా అంతకంటే ఎక్కువ కాలేజీలుండగా 29 జిల్లాల్లో ఒక్క కాలేజీ కూడా లేదు. 85 జిల్లాల్లో ఐదు కన్నా తక్కువ కాలేజీలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment