
నదీ జలాలు ప్రమాదకర స్థాయిలో కలుషితం
సీడబ్ల్యూసీ–సీపీసీబీ సంయుక్త అధ్యయనంలో వెల్లడి
కర్ణాటకలో నదిలోకి మురుగు, పారిశ్రామిక వ్యర్థ జలాలు, వ్యర్థాలు
మురుగు, పారిశ్రామిక వ్యర్థ జలాలను శుద్ధి చేశాకే నదిలోకి వదలాలి
కేంద్ర ప్రభుత్వానికి సీడబ్ల్యూసీ, సీపీసీబీ సూచన
సాక్షి, అమరావతి: ‘‘తుంగాపానం.. గంగాస్నానం’’ అనేది నానుడి.. అంటే, తాగేందుకు తుంగభద్ర నీరు.. స్నానానికి గంగా నది నీరు అని. కానీ, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) నివేదిక మాత్రం తుంగభద్ర నది కాలుష్య కాసారంగా మారిందని.. నదీ జలాల్లో హానికర బ్యాక్టీరియా, వ్యర్థాలు ప్రమాదకర స్థాయికి చేరాయని.. ఈ నీటిని శుద్ధి చేయకుండా తాగితే వ్యాధుల బారినపడక తప్పదని హెచ్చరిస్తోంది.
కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లోని తుంగభద్ర పరివాహక ప్రాంత నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో మురుగు నీటి, పారిశ్రామిక వ్యర్థ జలాలను యథేచ్ఛగా నదిలోకి వదిలేయడం.. వ్యర్థాలను పడేయడం వల్ల జలాలు కలుషితం అవుతున్నాయి. జాతీయ ప్రమాణాల ప్రకారం లీటర్ నీటికి బీవోడీ (బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్) రెండు మిల్లీగ్రాముల లోపు ఉండాలి. కానీ, కర్ణాటక పరిధి తుంగభద్ర జలాల్లో బీవోడీ గరిష్ఠంగా 7 మిల్లీగ్రాముల నుంచి కనిష్ఠంగా 6.2 మిల్లీగ్రాములు ఉంది. దీన్నిబట్టే కాలుష్యం ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది.
రాష్ట్ర పరిధిలో మంత్రాలయం నుంచి కర్నూలు వరకు తుంగభద్ర జలాల్లో లీటర్ నీటికి బీవోడీ గరిష్ఠంగా 6.2 మిల్లీగ్రాముల నుంచి కనిష్ఠంగా 2.4 మిల్లీగ్రాములు ఉండగా.. కోలీఫామ్ (బ్యాక్టీరియా) వంద మిల్లీ లీటర్లకు 220 ఉన్నాయి. ఇక ఫీకల్ కోలీఫామ్ (హానికర బ్యాక్టీరియా) వంద మిల్లీలీటర్లకు ఒక్కటి కూడా ఉండకూడదు. కానీ.. మంత్రాలయం నుంచి కర్నూలు వరకు తంగభద్ర జలాల్లో వంద మిల్లీలీటర్లకు 58 హానికర బ్యాక్టీరియాలు ఉన్నట్లు తేలింది.
నాడు స్వచ్ఛతకు.. నేడు కాలుష్యానికి
కర్ణాటక పరిధిలోని పశ్చిమ కనుమల్లో కుద్రేముఖ్ పర్వత శ్రేణుల్లో సముద్ర మట్టానికి 1,196 మీటర్ల ఎత్తులో తుంగ ఒకవైపు.. భద్ర ఒకవైపు జన్మిస్తాయి. 147 కిలోమీటర్ల పొడవున తుంగ, 171 కి.మీ.ల పొడవున భద్ర పయనించాక కూడలి వద్ద సంగమిస్తాయి. తుంగభద్రగా మారాక 547 కి.మీ. ప్రవహించి తెలంగాణలోని జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర సమీపంలోని గొందిమల్ల వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది.
కృష్ణాకు ప్రధాన ఉప నది అయిన తుంగభద్ర ఒకప్పుడు స్వచ్ఛతకు పెట్టింది పేరు. అయితే, కర్ణాటక పరిధి పరివాహక ప్రాంతాల్లోని నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో మురుగు నీరు, పారిశ్రామిక వ్యర్థ జలాలు, వ్యర్థాలను యథేచ్ఛగా వదిలేయడంతో కాలుష్య కాసారంగా మారింది. నిరుడు నవంబరులో తుంగభద్ర జలాల స్వచ్ఛతపై సీడబ్ల్యూసీ, సీపీసీబీ సంయుక్తంగా అధ్యయనం చేసి కేంద్ర జలశక్తి శాఖకు నివేదిక ఇచ్చాయి.
ఈ నివేదిక ప్రకారం..
» కర్ణాటకలో శివమొగ్గ వద్ద తుంగ నదీ జలాల్లో లీటర్ నీటికి 6 మిల్లీగ్రాముల బీవోడీ ఉంది.
» కర్ణాటక పరిధి భద్రావతి నుంచి హోలెహొన్నూరు వరకు భద్ర నదీ జలాల్లో లీటర్ నీటికి 7 మిల్లీ గ్రాముల బీవోడీ ఉంది.
» తుంగభద్రగా రూపాంతరం చెందే కూడలి నుంచి మైలార, ఉల్లనూరు నుంచి హొకినేహళ్లి వరకు జలాల్లో లీటర్ నీటికి బీవోడీ 6.2 మిల్లీగ్రాములు ఉంది.
» కర్ణాటకలో వ్యర్థాలతో కలుషితమైన తుంగభద్ర నదీ జలాలు ఏపీలోకి ప్రవేశించాక.. మంత్రాలయం నుంచి బావపురం మధ్య ప్రాంతంలోనూ లీటర్ నీటికి బీవోడీ గరిష్ఠంగా 6.2 మిల్లీగ్రాముల నుంచి కనిష్ఠంగా 3 మిల్లీగ్రాములు ఉంది.
» తుంగభద్రలో కాలుష్య ప్రభావం అధికంగా ఉన్న శివమొగ్గ, భద్రావతి–హోలెహొన్నూరు, కూడలి–మైలార, ఉల్లనూరు–హోకినేహళ్లి, మంత్రాలయం–కర్నూలు ప్రాంతాల్లో మురుగు, పారిశ్రామిక వ్యర్థ జలాలను శుద్ధి చేశాకే నదిలోకి వదలాలి.

Comments
Please login to add a commentAdd a comment