CWC
-
3 ప్రాజెక్టుల డీపీఆర్‌లు వెనక్కి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) భారీ షాకిచ్చింది. అనుమతుల కోసం గతంలో రాష్ట్ర ప్రభుత్వం పంపించిన కాళేశ్వరం అదనపు టీఎంసీ, పాలమూరు–రంగారెడ్డి, వార్ధా ప్రాజెక్టుల డీపీఆర్‌లను వెనక్కి పంపించింది. ఈ మూడు ప్రాజెక్టులపై తాము లేవనెత్తిన అంశాల(అబ్జర్వేషన్ల)కు తెలంగాణ ప్రభుత్వం దీర్ఘకాలంగా సమాధానం ఇవ్వలేదని పేర్కొంది. బీఆర్ అంబేడ్కర్ వార్ధా ప్రాజెక్టు డీపీఆర్‌పై తాము లేవనెత్తిన అంశాలకు ఏడాదిగా సమాధానం ఇవ్వలేదని, సత్వరంగా ఇవ్వకపోతే డీపీఆర్‌ను వెనక్కి పంపిస్తామని హెచ్చరిస్తూ గత నెల 22న రాష్ట్ర ప్రభుత్వానికి సీడబ్ల్యూసీ లేఖ రాసింది. అయినా ప్రభుత్వం స్పందించకపోవడంతో.. మూడు ప్రాజెక్టుల డీపీఆర్‌లను పరిశీలించలేమని, వాటిని తమ పరిశీలనలో ఉన్న ప్రాజెక్టుల జాబితా నుంచి తొలగిస్తామని తేల్చి చెప్పింది. ఈ మేరకు డీపీఆర్‌లను వెనక్కి పంపిస్తూ సీడబ్ల్యూసీలోని ప్రాజెక్టుల మదింపు విభాగం డైరెక్టర్ రాజీవ్‌కుమార్ ఈ నెల 19న లేఖ రాశారు. తాము లేవనెత్తిన అంశాలకు 3 నెలల్లోగా సమాధానమివ్వకపోయినా, ట్రిబ్యునల్ పరిధిలో వివాదం ఉన్నా డీపీఆర్‌లను పరిశీలించకూడదనే నిబంధనలున్నాయని గుర్తుచేసింది. తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్‌కు మార్గం సుగమం వార్ధా ప్రాజెక్టుపై పలు అంశాలను లేవనెత్తుతూ 2023 జూలై 4, జూలై 20, 2024 నవంబర్ 17 తేదీల్లో సీడబ్ల్యూసీలోని వేర్వేరు డైరెక్టరేట్లు రాసిన లేఖలకు తెలంగాణ ప్రభుత్వం స్పందించలేదు. ప్రాజెక్టుతో మహారాష్ట్రలో ముంపు ఉండడంతో డీపీఆర్‌ను అంతర్రాష్ట్ర బోర్డు పరిశీలనకు పంపాలని సీడబ్ల్యూసీ గతంలో సూచించింది. ముంపుపై మహారాష్ట్ర నుంచి సమ్మతి తీసుకోవాలని కోరింది. ముంపు ఆధారంగా ప్రణాళికల్లో ఏమైనా మార్పులుంటే తెలపాలని సూచించింది. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు కింద హెడ్‌వర్క్స్, సొరంగాలు, ఇతర పనులు ఎంత మేరకు చేశారు? వ్యయం ఎంత? పనుల లొకేషన్ ఏమిటి? ప్రాజెక్టు కోసం సేకరించిన పంపుసెట్ల వివరాలు, వార్ధా లేదా ఇతర ప్రాజెక్టులో వాటి వినియోగంపై సమాచారం ఇవ్వాలని కోరింది. ప్రభుత్వం సమాచారం ఇవ్వకపోవడంతో సీడబ్ల్యూసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. వార్ధా ప్రాజెక్టు డీపీఆర్‌ను సీడబ్ల్యూసీ వెనక్కి పంపడంతో ప్రాణహిత కింద ప్రతిపాదించిన తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్ నిర్మించడానికి మార్గం సుగమమైందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అదనపు ప్రయోజనం లేకుండా అంత ఖర్చు ఎందుకు? ఎలాంటి అదనపు ప్రయోజనాలు లేకపోయినా కాళేశ్వరం అదనపు టీఎంసీ ప్రాజెక్టుపై రూ.27 వేల కోట్లను ఎలా ఖర్చు చేస్తారని సీడబ్ల్యూసీ ప్రశ్నించింది. దీనిపై ఎన్నో లేఖలు రాసినా సమాధానం ఇవ్వడం లేదని తప్పుబట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టు రోజువారీ పంపింగ్ సామర్థ్యాన్ని 2 టీఎంసీల నుంచి 3 టీఎంసీలకు పెంచడానికి ఈ పనులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే ప్రాజెక్టు నిర్వహణ ఆర్థికంగా ఆచరణీయమైనదని నిరూపించడానికి దానితో వచ్చే పంటల దిగుబడులను, వాటి విలువను భారీగా పెంచి చూపారంటూ సీడబ్ల్యూసీ తప్పుబట్టింది. చివరగా గత జనవరి 12న రాసిన లేఖకు ఇంకా సమాధానం ఇవ్వలేదని తెలిపింది. ట్రిబ్యునల్‌లో తేలేవరకు పాలమూరుకు అనుమతి నో ఏపీ, తెలంగాణల మధ్య కృష్ణా జలాల పంపిణీ వ్యవహారం కృష్ణా ట్రిబ్యునల్–2 పరిధిలో ఉన్నందున పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు డీపీఆర్‌ను పరిశీలించలేమని సీడబ్ల్యూసీ స్పష్టం చేసింది. ఉమ్మడి ఏపీకి కృష్ణా జలాల్లో ఉన్న 811 టీఎంసీల వాటాతో పాటు ‘పోలవరం’ప్రాజెక్టు నిర్మాణంతో సాగర్ ఎగువన లభ్యతలోకి వచి్చన 45 టీఎంసీల జలాలను ఏపీ, తెలంగాణ మధ్య పంపిణీ చేసే బాధ్యతను కృష్ణా ట్రిబ్యునల్–2కు కేంద్రం అప్పగించిన విషయాన్ని గుర్తు చేసింది. పోలవరం ప్రాజెక్టు ద్వారా 80 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు తరలిస్తే దానికి బదులుగా సాగర్ ఎగువ రాష్ట్రాలు 80 టీఎంసీలను వాడుకోవడానికి ట్రిబ్యునల్ అవకాశం కల్పించింది. ఈ 80 టీఎంసీల్లో మహారాష్ట్ర, కర్ణాటకలు 35 టీఎంసీలు వాడుకోగా, మిగిలి ఉన్న 45 టీఎంసీలను ఏపీ, తెలంగాణకు పంచే అంశం కృష్ణా ట్రిబ్యునల్–2లో పరిధిలో ఉంది. కాగా ట్రిబ్యునల్ తుది నిర్ణయం వచ్చే వరకు నిర్ణయం తీసుకోవడానికి వీలు లేదని సీడబ్ల్యూసీ తాజాగా స్పష్టం చేసింది. -
ఏపీ తీరం...1,027.58 కి.మీ.
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ తీర రేఖ పొడవు ఎన్ని కిలో మీటర్లు అని అడిగితే... 973.7 కిలో మీటర్లు అని వెంటనే చెప్పేస్తారు. కానీ.. అది గతం.. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) తాజాగా నిర్వహించిన అధ్యయనంలో ఏపీ తీర రేఖ పొడవు 1,027.58 కిలో మీటర్లు అని తేల్చింది. గత అధ్యయనం ప్రకారం దేశ పశ్చిమ, తూర్పు తీర రేఖ పొడవు 7,516.6 కిలో మీటర్లు కాగా.. తాజాగా నిర్వహించిన అధ్యయనంలో అది 11,098.81 కిలో మీటర్లుగా తేలింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి దేశంలో తీర ప్రాంతంపై సీడబ్ల్యూసీ విస్తృతంగా అధ్యయనం చేసి పలు కీలక విషయాలు వెల్లడించింది. 2,31,831 కిలో మీటర్ల మేర కోత » దేశంలో ఇప్పటికే 2,318,31 కిలో మీటర్ల పొడవునా తీరం కోతకు గురైందని కేంద్ర జలసంఘం తేల్చింది. మరో 1,855.02 కిలో మీటర్ల పొడవునా తీర ప్రాంతం కోతకు గురవుతోంది. పశ్చిమ బెంగాల్‌లోని తీర ప్రాంతం అధికంగా కోతకు గురవుతోంది. తీర ప్రాంతం ఎక్కువగా కోతకు గురవుతున్న రాష్ట్రాల్లో ఒడిశా, కేరళ, ఆంధ్రప్రదేశ్ వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. » మన రాష్ట్రంలో ఇప్పటికే 272.34 కిలో మీటర్ల పొడవున తీర ప్రాంతం కోతకు గురైంది. మరో 434.26 కిలో మీటర్ల పొడవున తీర ప్రాంతం కోతకు గురవుతోంది. 320.98 కిలో మీటర్ల పొడవున తీర ప్రాంతం కోతకు గురికాకుండా సురక్షితంగా ఉంది. తూర్పు గోదావరి, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో తీర ప్రాంతం అధికంగా కోతకు గురైంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ఉప్పాడ ప్రాంతంలో తీర రేఖ అధికంగా కోతకు గురైంది. » వాతావరణ మార్పుల వల్ల సముద్రపు నీటి మట్టం పెరగడం, అలల ఉద్ధృతి తీవ్రమవడం, తుపానులు, అధిక ఉద్ధృతితో నదులు ప్రవాహించడం వల్ల సముద్ర తీర ప్రాంతం కోతకు గురువుతోంది. సహజసిద్ధంగా ఏర్పడిన మడ అడవులను నరికివేయడం, పగడపు దిబ్బలను తవ్వేయడం, సముద్రం నాచును తొలగించడం వల్ల తీర ప్రాంతం భారీ ఎత్తున కోతకు గురికావడానికి దారితీస్తోంది. » తీర ప్రాంతం అధికంగా కోతకు గురవుతుండటం వల్ల ఉప్పు నీరు చొచ్చుకొస్తోంది. దీంతో తీర ప్రాంతం ఉప్పు నీటి కయ్యలుగా మారుతోంది. తీరం కోతకు గురవడం వల్ల ఆ ప్రాంతంలో నివసించే ప్రజల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. » తీర ప్రాంతం కోతకు గురికాకుండా రక్షణ చర్యలు చేపట్టకపోతే ఉత్పాతాలు తప్పవని, మానవ మనుగడే ప్రశ్నార్థకమవుతుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సీడబ్ల్యూసీ హెచ్చరించింది. సీ–వాల్(తీరానికి వెంబడి గోడ) నిర్మించడం, రాళ్లతో రివిట్మెంట్ చేయడం ఇతర రక్షణ చర్యల ద్వారా, తీర ప్రాంతం కోతకు గురికాకుండా రక్షించవచ్చని సూచించింది. ఏపీలోని ఉప్పాడ ప్రాంతంలో తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాలని సీడబ్ల్యూసీ ప్రతిపాదించింది. సీడబ్ల్యూసీ అధ్యయనంలో వెల్లడైన ప్రధాన అంశాలు ఇవీ.. » దేశంలో తీర ప్రాంతం పశి్చమాన గుజరాత్‌లోని కచ్ ప్రాంతం నుంచి ప్రారంభమై... తూర్పున పశ్చిమ బెంగాల్‌లోని సుందర్ బన్స్ వద్ద ముగుస్తుంది. తీర ప్రాంతం తొమ్మిది రాష్ట్రాలు గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశి్చమ బెంగాల్‌లతోపాటు నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాలు డయ్యూ–డామన్, లక్ష్యద్వీప్, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవులలో విస్తరించింది.» 2011 జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభాలో 15 శాతం తీర ప్రాంతంలో నివసిస్తున్నారు. ముంబయి, కోల్‌కతా, చెన్నై, విశాఖపట్నంతోపాటు 70 నగరాలు, పట్టణాలు తీర ప్రాంతంలో వెలిశాయి. » తీర రేఖ పొడవు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో గుజరాత్ ప్రథమ స్థానంలో నిలిచింది. గత అధ్యయనం ప్రకారం గుజరాత్ తీర రేఖ పొడవు 1,214.7 కిలో మీటర్లు కాగా... తాజా అధ్యయనం ప్రకారం 2,340.62 కిలో మీటర్లకు పెరిగింది. » ఇప్పటి వరకు తీర రేఖ పొడవు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానంలో ఉండేది. తాజా అధ్యయనం ప్రకారం తమిళనాడు రెండో స్థానంలో నిలిచింది. తమిళనాడు తీర రేఖ పొడవు 1,068.69 కిలో మీటర్లు. » ప్రస్తుతం తీర రేఖ ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో నిలిచింది. గతంలో ఆంధ్రప్రదేశ్ తీర రేఖ పొడవు 973.7 కిలో మీటర్లు. ప్రస్తుతం అది 1,027.58 కిలో మీటర్లకు పెరిగింది. » రాష్ట్రంలో తీర రేఖ పొడవు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ఉమ్మడి తూర్పు గోదావరి (189.84 కి.మీ.) మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో శ్రీకాకుళం (173.12 కి.మీ.), మూడో స్థానంలో నెల్లూరు (172.10 కి.మీ.) ఉన్నాయి. -
పోలవరాన్ని వేగంగా పూర్తి చేయండి
సాక్షి, అమరావతి: కేంద్ర జలసంఘంతో చర్చించి డయాఫ్రం వాల్, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ఈసీఆర్ఎఫ్) డ్యాం పనులను సమాంతరంగా చేపట్టడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని జలవనరుల శాఖ ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. పోలవరం ప్రాజెక్ట్, చింతలపూడి, వెలిగొండ, గోదావరి–పెన్నా అనుసంధానం ప్రాజెక్టులపై మంగళవారం సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ.. జనవరిలో డయాఫ్రం వాల్ పనులు ప్రారంభిస్తే పూర్తి కావడానికి సరిగ్గా ఏడాది పడుతుందని.. ఆ తరువాత ఈసీఆర్ఎఫ్ డ్యాం పనులు చేపట్టి, పూర్తి చేయడానికి 24 నెలలు పడుతుందని వివరించారు. డయాఫ్రం వాల్, ఈసీఆర్ఎఫ్ డ్యాం పనులు సమాంతరంగా చేపడితే 2027 జూలై నాటికి.. విడివిడిగా పనులు చేపడితే 2028 మార్చి నాటికి పనులు పూర్తి చేయవచ్చన్నారు. అధికారులు మాట్లాడుతూ.. ఈసీఆర్ఎఫ్ డ్యాం గ్యాప్–2 నిర్మాణ ప్రాంతంలో 0.40 టీఎంసీల నీటిని ఎత్తిపోశామని.. ప్రస్తుతం సముద్ర మట్టానికి 15.9 మీటర్ల స్థాయిలో నీటి నిల్వ తగ్గిందని వివరించారు. భూసేకరణకు రూ.7,213 కోట్లు అవసరంపోలవరం ప్రాజెక్టు తొలి దశలో భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ పనులకు రూ.7,213 కోట్లు అవసరమని.. ఇంకా 16,440 ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉందని అధికారులు సీఎంకు చెప్పారు. 2025 ఏప్రిల్‌కి భూసేకరణ, 2026 ఏప్రిల్ నాటికి ఆర్ అండ్ ఆర్ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. పోలవరం కుడి కాలువ సామర్థ్యాన్ని 30 వేల క్యూసెక్కులకు తీసుకువెళ్లాలనే అంశంపైనా సమీక్షలో చర్చించారు. కొత్తగా మరో కాలువ నిర్మించడమా లేదా ఉన్న కాలువను విస్తరించడమా అనే అంశంపై చర్చిస్తున్నామని అధికారులు తెలిపారు. పోలవరం ప్రాజెక్టుతోపాటు అప్పట్లో అనుకున్న విధంగా ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణం కూడా చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. జలవిద్యుత్ ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలన్నారు. ఈ నెలలో పోలవరం ప్రాజెక్టును పరిశీలించి.. పనులపై ప్రణాళిక విడుదల చేస్తానని చెప్పారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం కింద 3 లక్షల ఎకరాలకు నీళ్లందించేందుకు రూ.2,463 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని అధికారులు వివరించగా ఆ పనులు పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.పోలవరంలో నేటి నుంచి వర్క్షాప్అంతర్జాతీయ నిపుణులతో డయాఫ్రం వాల్, ప్రధాన డ్యాం డిజైన్లు, నిర్మాణంపై చర్చ సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడంపై ప్రాజెక్టు వద్దే బుధవారం నుంచి 4రోజులపాటు కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) మేధోమథనం చేయనుంది. డ్యాంల నిర్మాణం, భద్రత, భూ¿ౌగోళిక సాంకేతికత(జియో టెక్నికల్) తదితర అంశాలపై అపార అనుభవం ఉన్న డేవిడ్ బి.పాల్, రిచర్డ్ డొన్నెల్లీ, గియాస్ ఫ్రాంక్ డి సిస్కో, సీస్ హించ్‌బెర్గర్‌లతో కూడిన అంతర్జాతీయ నిపుణుల బృందం ప్రాజెక్టును పరిశీలించి.. నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యలను అధిగమించేందుకు చేపట్టాల్సిన చర్యలపై పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), సీడబ్ల్యూసీలకు నివేదిక ఇచ్చింది. వర్షాకాలం ముగియగానే పనులు ప్రారంభించే ముందు నవంబర్ మొదటి వారంలో పోలవరం వద్ద వర్క్‌షాప్ నిర్వహించి.. డిజైన్లు, నిర్మాణంపై చర్చిద్దామని అంతర్జాతీయ నిపుణుల కమిటీ సూచించింది. ఆ మేరకు సీడబ్ల్యూసీ వర్క్‌షాప్ నిర్వహిస్తోంది. ఇందులో పాల్గొనేందుకు అంతర్జాతీయ నిపుణుల బృందం మంగళవారం రాత్రికి రాజమహేంద్రవరం చేరుకుంది. 4 రోజులపాటు ప్రాజెక్టు వద్దే అంతర్జాతీయ నిపుణుల బృందం ఉంటుంది. వర్క్‌షాప్‌లో అంతర్జాతీయ నిపుణులు, పీపీఏ, సీడబ్ల్యూసీ, డ్యాం డిజైన్ రివ్యూ ప్యానల్(డీడీఆరీ్ప), సీఎస్ఎంఆర్ఎస్ (సెంట్రల్ సాయిల్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్), వ్యాప్కోస్ ప్రతినిధులు పాల్గొంటారు. ప్రాజెక్టు ప్రధాన కాంట్రాక్ట్ సంస్థ మేఘా తరఫున డిజైన్లు రూపొందిస్తున్న ఆఫ్రి, బావర్ ప్రతిని«దులు, రాష్ట్ర జలవనరుల శాఖ తరఫున ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు, పోలవరం సీఈ నరసింహమూర్తి ఈ వర్క్‌షాప్‌లో పాల్గొననున్నారు. -
పోలవరానికి 'చంద్రబాబు కూటమి' ఉరి!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు కూటమి ప్రభుత్వమే ఉరి వేసి.. ఊపిరి తీసేసిందా? ప్రాజెక్టు ఎత్తును 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు తగ్గిస్తామని కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు అంగీకరించిందా? 41.15 మీటర్ల ఎత్తుతో ప్రాజెక్టు పూర్తి చేసేందుకు అంచనా వ్యయాన్ని సవరిస్తూ గత ఆగస్టు 28న కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసినప్పుడు.. ఆ సమావేశంలో పాల్గొన్న టీడీపీకి చెందిన కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు అభ్యంతరం చెప్పనిది అందుకేనా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతున్నాయి కేంద్ర, రాష్ట్ర అధికారవర్గాలు! సాధారణంగా కేంద్ర కేబినెట్ తీసుకునే నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి అదే రోజు మీడియాకు వెల్లడిస్తారు. కానీ.. 41.15 మీటర్ల వరకూ పోలవరం పూర్తి చేయడానికి రూ.12,157.53 కోట్లు ఇచ్చేందుకు ఆమోదముద్ర వేస్తూ ఆగస్టు 28న కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని మంత్రి అశ్విని వైష్ణవ్ ఆ రోజు మీడియాకు వెల్లడించలేదు. ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు అంశం బహిర్గతమవుతుందనే పోలవరానికి నిధులు మంజూరు చేసిన అంశాన్ని మంత్రి ఆ రోజు ప్రస్తావించలేదని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే చంద్రబాబు చేసిన చారిత్రక తప్పిదాలతోపాటు ఎత్తు తగ్గించడం వల్ల ప్రాజెక్టు నిర్మాణ లక్ష్యం నీరుగారిపోయిందని నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు.రాష్ట్ర సమగ్రాభివృద్ధికి చుక్కాని..⇒ పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల (150 అడుగులు) గరిష్ట నీటి మట్టంతో.. 194.6 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో.. 322 టీఎంసీలు వినియోగించుకునేలా నిర్మించుకోవడానికి గోదావరి ట్రిబ్యునల్ 1980లో అనుమతి ఇచ్చింది.⇒ అయితే దాదాపు 25 ఏళ్లపాటు ప్రాజెక్టు నిర్మాణంపై ఏ ముఖ్యమంత్రీ కనీసం ఆలోచన చేసిన పాపాన పోలేదు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా 2005లో అన్ని అనుమతులు సాధించి పోలవరం నిర్మాణాన్ని ప్రారంభించారు.⇒ పోలవరం కుడి, ఎడమ కాలువల ద్వారా 7.20 లక్షల ఎకరాలు.. కృష్ణా, గోదావరి డెల్టాల్లో 23.31 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ.. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా 8 లక్షల ఎకరాలు వెరసి 38.51 లక్షల ఎకరాలకు నీళ్లందించవచ్చు. విశాఖ పారిశ్రామిక, తాగునీటి అవసరాల కోసం 23.44 టీఎంసీలను సరఫరా చేయవచ్చు. అంతేకాకుండా 960 మెగావాట్ల జలవిద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చు.⇒ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి పోలవరం చుక్కానిలా నిలుస్తుంది. అందుకే ఈ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్ర ముఖచిత్రమే మారిపోతుందని నీటిపారుదల రంగ నిపుణులు స్పష్టం చేస్తూ వస్తున్నారు.జీవనాడి కాదు జీవచ్ఛవమే..!⇒ పోలవరం ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలకు 35.5 మీటర్ల నుంచి నీటిని సరఫరా చేయవచ్చు. ఎడమ కాలువ పూర్తి సామర్థ్యం 17,580 క్యూసెక్కులు కాగా కుడి కాలువ పూర్తి సామర్థ్యం 17,560 క్యూసెక్కులు.⇒ పోలవరం ప్రాజెక్టును 41.15 మీటర్లకు తగ్గించడం వల్ల జలాశయంలో గరిష్టంగా 115.44 టీఎంసీలు మాత్రమే ఉంటాయి. గోదావరికి గరిష్టంగా వరద వచ్చే రోజుల్లో ఆయకట్టుకు నీటిని సరఫరా చేయగలిగినా.. వరద లేని రోజుల్లో ఆయకట్టుకు నీళ్లందించడం సాధ్యం కాదని అధికారవర్గాలు చెబుతున్నాయి.⇒ కాలువల ద్వారా పూర్తి సామర్థ్యం మేరకు నీటిని తరలించాలంటే ప్రాజెక్టులో 41.15 మీటర్ల కంటే ఎగువన నీటి మట్టం ఉండాలి. అప్పుడే ఎడమ కాలువ కింద 4 లక్షలు.. కుడి కాలువ కింద 3.20 లక్షల ఎకరాలకు నీళ్లందించడడంతోపాటు కృష్ణా డెల్టాకు 80 టీఎంసీలను మళ్లించడానికి అవకాశం ఉంటుంది.⇒ పోలవరం ఆయకట్టు 7.20 లక్షల ఎకరాలతోపాటు కృష్ణా, గోదావరి డెల్టాల ఆయకట్టు స్థిరీకరణ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, విశాఖకు పారిశ్రామిక, తాగునీటి అవసరాలు తీర్చడం అసాధ్యమని స్పష్టం చేస్తున్నారు. 960 మెగావాట్ల జలవిద్యుత్ కూడా ఉత్పత్తి చేయడం సాధ్యం కాదని తేల్చిచెబుతున్నారు.⇒ ఎత్తు తగ్గించడం వల్ల జీవనాడి పోలవరం ప్రాజెక్టును జీవచ్ఛవంగా మార్చేశారని నీటిపారుదలరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.తగ్గించేందుకు తలూపడం వల్లే..పోలవరం ప్రాజెక్టును కనీస నీటిమట్టం 41.15 మీటర్ల వరకూ పూర్తి చేసేందుకు అంచనా వ్యయాన్ని రూ.30,436.95 కోట్లకు సవరిస్తూ ఆగస్టు 28న కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసిందని.. ఈ నేపథ్యంలో ఇప్పటిదాకా చేసిన వ్యయం పోనూ మిగతా రూ.12,157.53 కోట్లు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర జల్ శక్తి శాఖ సీనియర్ జాయింట్ కమిషనర్ దీపక్ చంద్ర భట్ లేఖ రాశారు. ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేయాలని... ఈ క్రమంలో 2024–25లో ఏ మేరకు నిధులు కావాలో ప్రతిపాదనలు పంపాలని ఆ లేఖలో కోరారు. ప్రాజెక్టు ఎత్తును 41.15 మీటర్లకే పరిమితం చేస్తున్నట్లు ఈ లేఖలో కేంద్రం స్పష్టం చేసినా రాష్ట్ర ప్రభుత్వం నోరుమెదపలేదు. అంటే.. ప్రాజెక్టు ఎత్తును తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందన్నది స్పష్టమవుతోంది. ప్రాజెక్టుకు రూ.2,348 కోట్లను అడ్వాన్సుగా విడుదల చేస్తూ ఈనెల 9న రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలోనూ దీపక్ చంద్ర భట్ అదే అంశాన్ని పునరుద్ఘాటించారు. ప్రాజెక్టును పూర్తి చేయడానికి కేంద్ర కేబినెట్ ఆమోదించిన సవరించిన షెడ్యూల్‌ను రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని.. ఆ మేరకు ఎంవోయూ కుదుర్చుకుందని ఆ లేఖలో పేర్కొన్నారు.కేంద్రానికి రూ.23,622 కోట్లకుపైగా మిగులు..కేంద్ర జలసంఘం టీఏసీ ఆమోదించిన ప్రకారం పోలవరం అంచనా వ్యయం 2017–18 ధరల ప్రకారం రూ.55,656.87 కోట్లు. రివైజ్డ్ కాస్ట్ కమిటీ ఖరారు చేసిన దాని ప్రకారం రూ.47,725.74 కోట్లుగా ఉంది. పోలవరానికి ఇప్పటివరకూ కేంద్రం రూ.15,146.28 కోట్లను రీయింబర్స్ చేసింది. 2014 ఏప్రిల్ 1కి ముందు ప్రాజెక్టుకు రూ.4,730.71 కోట్లు ఖర్చు చేశారు. అంటే.. ఇప్పటిదాకా ప్రాజెక్టు కోసం రూ.19,876.99 కోట్లు ఖర్చు చేసినట్లు లెక్క. సీడబ్ల్యూసీ టీఏసీ ఆమోదించిన అంచనా వ్యయం ప్రకారం చూస్తే పోలవరానికి ఇంకా రూ.35,779.88 కోట్లు రావాలి. ప్రస్తుతం రూ.12,157.53 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది. అంటే ఇంకా రూ.23,622.35 కోట్లు విభజన చట్టం ప్రకారం కేంద్రం ఇవ్వాలి. ఆ నిధులు ఇస్తేనే 41.15 మీటర్ల కాంటూరు నుంచి 45.72 మీటర్ల వరకూ నీటిని నిల్వ చేయడానికి అవసరమైన ముంపు గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించవచ్చు. భూమిని సేకరించవచ్చు. కానీ.. పోలవరం ఎత్తును 41.15 మీటర్లకే పరిమితం చేయడంతో కేంద్రానికి రూ.23,622.35 కోట్లు మిగిలినట్లైంది. -
ట్రిబ్యునల్ అంచనా కంటే అధికంగా వంశధార
వంశధారలో ఏటా సగటున 166 టీఎంసీల లభ్యత ఉంటుందని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) తాజాగా తేల్చింది. నదీ పరీవాహక ప్రాంతంలో 2003–04 నుంచి 2022–23 మధ్య 20 ఏళ్ల ప్రవాహాలను ఆధారంగా చేసుకుని వంశధారలో నీటి లభ్యతపై సీడబ్ల్యూసీ ఇటీవల అధ్యయనం చేసింది. వంశధార ట్రిబ్యునల్ 2017లో బేసిన్లో 115 టీఎంసీలు ఉంటుందని తేల్చింది. ట్రిబ్యునల్ తేల్చిన దానికంటే వంశధారలో లభ్యత 51 టీఎంసీలు అధికంగా ఉన్నట్టు సీడబ్ల్యూసీ అధ్యయనంలో వెల్లడైంది. వంశధారలో నీటి లభ్యతపై సీడబ్ల్యూసీ అధ్యయనం చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. - సాక్షి, అమరావతిసీడబ్ల్యూసీ అధ్యయనంలో వెల్లడైన ప్రధానాంశాలివీ..వంశధార బేసిన్లో 2003–04 నుంచి 2022–23 మధ్య 20 ఏళ్లలో సగటున ఏటా 1,342 మి.మీ. వర్షపాతం కురిసింది. దీని పరిమాణం 498.02 టీఎంసీలుబేసిన్లోని జలాశయాల్లో ఏటా ఆవిరి నష్టాలు సగటున 1.06 టీఎంసీలుతాగునీరు, పారిశ్రామిక అవసరాలు, జంతువులకు తాగునీటి అవసరాల కోసం 2022–03లో 0.71 టీఎంసీలు వినియోగించుకున్నారు వంశధార ప్రస్థానం ఇదీ.. జన్మస్థానం: ఒడిశాలో ఉమ్మడి పూల్భణి జిల్లాలో బెలగడ్ వద్ద సముద్ర మట్టానికి 600 మీటర్ల ఎత్తులో ఒడిశాలో ప్రవాహ మార్గం: కంధమాల్, కలహండి, రాయగడ, గజపతి జిల్లాల్లో 125 కి.మీ.ఆంధ్రప్రదేశ్‌లో ప్రవాహ మార్గం: విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 96 కి.మీ. సముద్ర సంగమం: కళింగపట్నం వద్ద బంగాళాఖాతంలో వంశధార బేసిన్ పరిధి: మొత్తం 10,504 చదరపు కిలోమీటర్ల వైశాల్యం -
తుంగభద్రలో ఏటా 699.34 టీఎంసీల లభ్యత
సాక్షి, అమరావతి: కృష్ణా ప్రధాన ఉప నది అయిన తుంగభద్రలో ఏటా సగటున 699.34 టీఎంసీల లభ్యత ఉంటుందని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) తాజాగా తేల్చింది. తుంగభద్ర సబ్ బేసిన్లో 2003–04 నుంచి 2022–23 వరకూ 20 ఏళ్ల ప్రవాహాలను ఆధారంగా తీసుకుని నీటి లభ్యతపై సీడబ్ల్యూసీ అధ్యయనం చేసింది. కృష్ణా నదిలో 38 ఏళ్ల ప్రవాహాలను ఆధారంగా అధ్యయనం చేసిన సీడబ్ల్యూసీ 3,048.37 టీఎంసీల లభ్యత ఉంటుందని ఇటీవల అంచనా వేసింది. ఇందులో గరిష్టంగా తుంగభద్ర సబ్ బేసిన్ నుంచే వస్తుందని లెక్కగట్టింది.తుంగభద్ర సబ్ బేసిన్ ఇదీకర్ణాటక పశ్చిమ కనుమల్లోని వరాహ పర్వత శ్రేణుల్లో సముద్ర మట్టానికి 1,458 మీటర్ల ఎత్తులో గంగమూల వద్ద వేర్వేరు ప్రాంతాల్లో తుంగ, భద్ర జన్మిస్తాయి. తుంగ 147 కి.మీ., భద్ర 171 కి.మీ, దూరం ప్రయాణించాక కూడలి వద్ద సంగమించి తుంగభద్రగా మారిన అనంతరం 531 కి.మీ. దూరం ప్రవహించి.. తెలంగాణలోని జోగులాంబ జిల్లా గుండిమల వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది. తుంగభద్ర సబ్ బేసిన్ 70,764 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించింది. కృష్ణా నదికి అతి పెద్ద ఉప నది తుంగభద్ర.అధ్యయనంలో వెల్లడైన అంశాలివి⇒ 2002–03 నుంచి 2022–23 వరకూ 20 ఏళ్లలో సగటున ఏటా 862.47 మి.మీ. వర్షపాతం కురిసింది. దీని పరిమాణం 2,155.58 టీఎంసీలు.⇒ బాష్ఫీభవనం (ఆవిరి) రూపంలో ఏటా 1,633.20 టీఎంసీలు వాతావరణంలో కలుస్తాయి.⇒ సబ్ బేసిన్లో సాగు చేసిన పంటల ద్వారా ఏటా సగటున 190.02 టీఎంసీలు ఆవిరవుతాయి. ⇒ నదీ పరివాహక ప్రాంతంలోని జలాశయాల్లో ఏటా సగటున 24.02 టీఎంసీలు ఆవిరి రూపంలో వాతావరణంలో కలుస్తాయి.⇒ సాగు, తాగు, పారిశ్రామిక, గృహ అవసరాలకు ఏటా సగటున 699.34 టీఎంసీల లభ్యత ఉంటుంది. ⇒ సబ్ బేసిన్లలో నీటి లభ్యతపై సీడబ్ల్యూసీ అధ్యయనం ఇదే తొలిసారి కావడం గమనార్హం. -
బాబు చారిత్రక తప్పిదం వల్లే.. జీవనాడి.. జీవచ్ఛవం!
సాక్షి, అమరావతి: అవగాహనా రాహిత్యం.. ప్రణాళికా లోపం.. అస్తవ్యస్థ పనులు.. చారిత్రక తప్పిదాలు..! గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా తొలుత స్పిల్‌వే, స్పిల్ ఛానల్‌ను పూర్తి చేయకుండానే.. ప్రధాన డ్యాం పునాది డయాఫ్రం వాల్ పనులను చేపట్టడం! ఎగువ, దిగువ కాఫర్ డ్యాం పనులు ప్రారంభించి చివరకు వాటిని కూడా పూర్తి చేయలేక చేతులెత్తేయడం! కాఫర్ డ్యాంలకు ఇరువైపులా ఖాళీ ప్రదేశాలను వదిలేయడంతో వాటి గుండా గోదావరి కుచించుకుపోయి ప్రవహించాల్సి రావడంతో ఉద్ధృతి పెరిగి డయాఫ్రం వాల్ కోతకు గురై దెబ్బతింది. వెరసి జీవనాడి లాంటి ప్రాజెక్టును జీవచ్ఛవంగా మార్చేశారు!! పోలవరంలో సీఎం చంద్రబాబు నిర్వాకాలపై మరోసారి తేల్చిన అంతర్జాతీయ నిపుణుల కమిటీ నివేదిక సారాంశం ఇదీ! ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రం వాల్ ధ్వంసం కావడానికి.. ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతంలో విధ్వంసం చోటు చేసుకోవడానికి.. ఎగువ కాఫర్ డ్యాంలో సీపేజీ (ఊట నీటి లీకేజ్)కి ముమ్మాటికీ చంద్రబాబు చారిత్రక తప్పిదాలే కారణమని అంతర్జాతీయ నిపుణుల కమిటీ నివేదిక ‘సాక్షి’గా మరోసారి నిర్ధారణ అయింది. ఈమేరకు ఈ ఏడాది ఆగస్టు 12న తాము ఇచ్చిన నివేదికపై పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ), కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ), రాష్ట్ర జలవనరుల శాఖ వ్యక్తం చేసిన పలు సందేహాలను నివృత్తి చేస్తూ ఈ నెల 20వ తేదీన పీపీఏ, సీడబ్ల్యూసీలకు ఇచ్చిన నివేదికలోనూ గతంలో పేర్కొన్న అంశాలనే అంతర్జాతీయ నిపుణుల కమిటీ పునరుద్ఘాటించింది. పోలవరం నిర్మాణంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడంపై సలహాలు, సూచనలు అందించేందుకు డేవిడ్ బి.పాల్, గియాస్ ఫ్రాంకో డి. సిస్కో (యూఎస్ఏ), రిచర్డ్ డొన్నెళ్లీ, సీస్ హించ్‌బెర్గర్ (కెనడా)లతో కూడిన అంతర్జాతీయ నిపుణుల బృందాన్ని పీపీఏ, సీడబ్ల్యూసీ ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జూన్ 29–జూలై 4 మధ్య పోలవరం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి జలవనరులు, సీడబ్ల్యూసీ అధికారులతో చర్చించిన ఈ బృందం జూలై 7న ప్రాథమిక నివేదిక ఇచ్చింది. అనంతరం పూర్తి స్థాయి నివేదికను 12న పీపీఏ, సీడబ్ల్యూసీలకు ఇచ్చింది. అయితే ఆ నివేదికలోని పలు అంశాలపై సందేహాలను వ్యక్తం చేస్తూ ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల పటిష్టత, సీపేజీ, డయాఫ్రం వాల్ నిర్మాణం తదితరాలపై మరింత స్పష్టత ఇవ్వాలని అంతర్జాతీయ నిపుణుల కమిటీని సీడబ్ల్యూసీ, పీపీఏ, రాష్ట్ర జలవనరుల శాఖ కోరాయి. ఈ క్రమంలో వాటిని నివృత్తి చేస్తూ అంతర్జాతీయ నిపుణుల కమిటీ తాజాగా ఇచ్చిన నివేదికలో ప్రధానాంశాలు ఇవీ.. 2018 నాటికే జెట్ గ్రౌటింగ్ వాల్‌కు 27 చోట్ల భారీ చీలికలు⇒ గోదావరిపై గ్యాప్–2లో ప్రధాన డ్యాం నిర్మాణానికి వీలుగా 2,450 మీటర్ల పొడవున ఎగువ కాఫర్ డ్యాం నిర్మించాలి. వరద ఉద్ధృతి (ఫర్మియబులిటీ)ని పక్కాగా లెక్క వేస్తే.. ఎగువ కాఫర్ డ్యాం పునాది జెట్ గ్రౌటింగ్ వాల్‌ను ఏ స్థాయి నుంచి తవ్వాలన్నది నిర్ణయించవచ్చు. కానీ ఎగువ కాఫర్ డ్యాం వద్ద ఫర్మియబులిటీని సెకనుకు కనిష్టంగా 5్ఠ10–2 మీటర్లు ఉండగా.. 5్ఠ10–4 నుంచి 5్ఠ10–5గా లెక్కగట్టారు. ⇒ ఫర్మియబులిటీని తప్పుగా లెక్కించడం వల్ల జెట్ గ్రౌటింగ్ వాల్‌ను 20 మీటర్ల లోతు నుంచే నిర్మించారు. వాస్తవంగా ఆ వాల్‌ను 40 మీటర్ల లోతు నుంచి నిర్మించాలి. దీన్ని బట్టి చూస్తే ఇందులో కమీషన్ల దాహం స్పష్టమవుతోంది.⇒ 2018లో గోదావరి ప్రవాహం జెట్ గ్రౌటింగ్ వాల్ మీదుగానే ప్రవహించింది. ఆ వరద ఉద్ధృతికి జెట్ గ్రౌటింగ్ వాల్లో చెయినేజ్ 1,040 మీటర్ల నుంచి 1,330 మీటర్ల మధ్య 27 చోట్ల భారీగా చీలికలు ఏర్పడ్డాయి. వాటిలో బ్లాక్ కాటన్ సాయిల్ (నల్ల బంక మట్టి) వేసి మరమ్మతు చేసి 2018 డిసెంబర్లో ఎగువ కాఫర్ డ్యాం నిర్మాణ పనులు ప్రారంభించారు. ⇒ ఫర్మియబులిటీని తప్పుగా లెక్కించి తక్కువ లోతు నుంచి జెట్ గ్రౌటింగ్ వాల్‌ను నిర్మించడం వల్లే ఎగువ కాఫర్ డ్యాంలో సీపేజీ (ఊట నీరు) అధికంగా ఉందని అంతర్జాతీయ నిపుణుల కమిటీ పునరుద్ఘాటించింది.ఆ చారిత్రక తప్పిదం వల్లే..⇒ పోలవరం వద్ద భూభౌగోళిక పరిస్థితుల రీత్యా నదికి ఆవల కుడివైపున స్పిల్‌వే నిర్మించి ప్రవాహాన్ని మళ్లించి.. నదికి అడ్డంగా నీటిని నిల్వ చేసే ప్రధాన డ్యాం(ఎర్త్ కమ్రాక్ ఫిల్ డ్యాం)ను నిర్మించేలా సీడబ్ల్యూసీ డిజైన్‌ను ఆమోదించింది.⇒ సీడబ్ల్యూసీ ఆమోదించిన డిజైన్ ప్రకారం తొలుత నదీ ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్ వే, స్పిల్ ఛానల్‌ను పూర్తి చేయాలి. ఆ తర్వాత ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలను పూర్తి చేసి వాటి మధ్యన ప్రధాన డ్యాం పనులు చేపట్టి పూర్తి చేయాలి. ⇒ కానీ.. 2016 డిసెంబర్లో చంద్రబాబు హయాంలో ఒకేసారి స్పిల్ వే, స్పిల్ ఛానల్, ప్రధాన డ్యాం డయాఫ్రం వాల్ పనులను ప్రారంభించారని నిపుణుల కమిటీ ఆక్షేపించింది. గోదావరికి అడ్డంగా 2016 డిసెంబర్ నుంచి 2017 జూలై వరకు చెయినేజ్ 1485.7 నుంచి 480 మీటర్ల వరకూ 1006 మీటర్లు.. 2017 డిసెంబర్ నుంచి 2018 జూన్ వరకూ చెయినేజ్ 480 నుంచి 89 మీటర్ల వరకూ 390.6 మీటర్ల పొడవున మొత్తం 1,396.6 మీటర్ల మేర ప్రధాన డ్యాం గ్యాప్–2లో డయాఫ్రమ్ వాల్‌ను నిర్మించారని పేర్కొంది.⇒ నదీ ప్రవాహాన్ని పూర్తి స్థాయిలో మళ్లించేలా స్పిల్‌వే, స్పిల్ ఛానల్‌ను పూర్తి చేయక పోవడంతో 2018లో గోదావరి ప్రవాహాన్ని డయాఫ్రం వాల్ మీదుగా వదిలేశారని నిపుణులు కమిటీ గుర్తు చేసింది. ఆ ప్రభావం డయాఫ్రం వాల్‌పై పడకుండా ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకపోవడాన్ని ప్రస్తావించింది. దాంతో డయాఫ్రం వాల్ నాలుగు చోట్ల 485 మీటర్ల పొడవున కోతకు గురై దెబ్బతిందని పునరుద్ఘాటించింది.ప్రణాళికాబద్ధంగా పనులు..⇒ నాడు చంద్రబాబు సర్కార్ హయాంలో గాడి తప్పిన పోలవరం పనులను 2019 మే 30న అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం చక్కదిద్దింది. 2020లో ఎగువ, దిగువ కాఫర్ డ్యాం, డయాఫ్రం వాల్‌పై వరద ప్రభావం పడకుండా పూర్తి స్థాయిలో రక్షణాత్మక చర్యలు చేపట్టిందని అంతర్జాతీయ నిపుణుల కమిటీ గుర్తు చేసింది.⇒ 2019 వర్షాలు ప్రారంభానికి ముందే ఎగువ, దిగువ కాపర్ డ్యాంలలో ఖాళీ ప్రదేశాలు వదలడం వల్ల కోతకు గురికాకుండా గత ప్రభుత్వం సమర్థంగా రక్షణాత్మక చర్యలు చేపట్టింది. దీన్ని బట్టి చూస్తే 2018 వరదలలోనే డయాఫ్రమ్ వాల్ జెట్ గౌటింగ్ వాల్ దెబ్బతిన్నట్లు స్పష్టమవుతోంది.⇒ గోదావరి వరద ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్‌వే, స్పిల్ ఛానల్‌ను పూర్తి చేసింది. స్పిల్‌వే, స్పిల్ ఛానల్ పనుల నాణ్యత ప్రమాణాల మేరకు ఉంది. ⇒ ఎగువ కాఫర్ డ్యాంను 42.5 మీటర్ల ఎత్తుతో పూర్తి చేసి 2021 జూన్‌లోనే గోదావరి ప్రవాహాన్ని స్పిల్‌వే మీదుగా మళ్లించింది. గోదావరికి గరిష్ట స్థాయిలో వరద వచ్చినా తట్టుకునేలా ఎగువ కాఫర్ డ్యాం ఎత్తును 44 మీటర్లకు పెంచుతూ 2022లో పనులు చేపట్టి పూర్తి చేసింది.⇒ దిగువ కాఫర్ డ్యాంలో కోతకు గురైన ప్రాంతాన్ని జియో బ్యాగ్‌లలో ఇసుక నింపి పూడ్చింది. 2023 ఫిబ్రవరి నాటికి దిగువ కాఫర్ డ్యామ్‌ను పూర్తి చేసింది. ⇒ ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలు రెండూ పటిష్టంగా ఉన్నాయి. వాటి భద్రతకు వచ్చిన ముప్పేమీ లేదని అంతర్జాతీయ నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. నిజాలను ప్రతిబింబించిన నివేదిక..ప్రపంచంలో ఎక్కడైనా ఏదైనా ప్రాజెక్టు కట్టాలంటే తొలుత నదీ ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్‌వే, స్పిల్ ఛానల్‌ను పూర్తి చేస్తారు. ఆ తర్వాత కాఫర్ డ్యాంలు నిర్మించి నదీ ప్రవాహాన్ని స్పిల్ మీదుగా మళ్లిస్తారు. అప్పుడు ప్రధాన డ్యాం నిర్మాణ పనులకు ఎలాంటి ఆటంకాలు ఉండవు. తద్వారా వరదల్లోనూ పనులు కొనసాగించి ప్రధాన డ్యాం పనులను పూర్తి చేస్తారు. కానీ.. పోలవరంలో మాత్రం చంద్రబాబు అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించారు. గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్‌వే, స్పిల్ ఛానల్‌ను పూర్తి చేయకుండానే.. ప్రధాన డ్యాం పునాది డయాఫ్రం వాల్‌ను పూర్తి చేసి చారిత్రక తప్పిదం చేశారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యాం పనులు ప్రారంభించి వాటిని పూర్తి చేయలేక చేతులెత్తేశారు. కాఫర్ డ్యాంలకు ఇరువైపులా ఖాళీ ప్రదేశాలను వదిలేశారు. వాటి గుండా గోదావరి కుచించుకుపోయి ప్రవహించాల్సి రావడంతో ఉద్ధృతి పెరిగి డయాఫ్రం వాల్ కోతకు గురై దెబ్బతింది. ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతంలో ఇసుక తిన్నెలు కోతకు గురై విధ్వంసం చోటుచేసుకుంది. ఈ పాపం చంద్ర బాబుదేనని నీటిపారుదల రంగ నిపుణులు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆదినుంచి స్పష్టం చేస్తుండగా.. అదే అంశాన్ని ఈ ఏడాది ఆగస్టు 12న ఇచ్చిన నివేదికలో అంతర్జాతీయ నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. తాజాగా ఇచ్చిన నివేదికలోనూ అదే అంశాలను పునరుద్ఘాటించడం గమనార్హం.సకాలంలో కాఫర్ డ్యాంలు పూర్తి చేయకపోవడంతో..⇒ ఎగువ కాఫర్ డ్యాం పనులను 2018 డిసెంబర్లో ప్రారంభించిన టీడీపీ సర్కారు 100 నుంచి 1,780 మీటర్ల మధ్య 35 మీటర్ల ఎత్తుతో 2019 మార్చి నాటికి చేసి ఇరు వైపులా ఖాళీ ప్రదేశాలను వదిలేసింది. ⇒ దిగువ కాఫర్ డ్యాం పునాది జెట్ గ్రౌటింగ్ వాల్‌ను 10 మీటర్ల లోతు నుంచి వేసి.. 540 మీటర్ల పొడవున పనులు చేపట్టి 2019 మార్చి నాటికి సకాలంలో పనులు పూర్తి చేయలేక ఇరువైపులా ఖాళీ ప్రదేశాలను వదిలేసింది. ⇒ కాఫర్ డ్యాంలు, నిర్వాసితులకు పునరావాసం పనులు నత్తనడక సాగుతుండటం.. రుతు పవనాల కాలం సమీపిస్తుండటంతో కాఫర్ డ్యాంలలో వదిలిన ఖాళీ ప్రదేశాలను భర్తీ చేయకుండా వదిలేయాలని 2019 మే 27న పీపీఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.⇒ 2019లో గోదావరి వరద ఎగువ కాఫర్ డ్యాం ఖాళీ ప్రదేశాల గుండా ప్రవహించడంతో వరద ఉద్ధృతి మరింత అధికమై ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతంలో ఇసుక తిన్నెలు కోతకు గురయ్యాయి. 30 మీటర్ల లోతుతో భారీ అగాధాలు ఏర్పడ్డాయని అంతర్జాతీయ నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. -
పెన్నాలో 367.98 టీఎంసీల లభ్యత
సాక్షి, అమరావతి:పెన్నా నదీ పరివాహక ప్రాంతం(బేసిన్)లో కావాల్సినన్ని నీళ్లు ఉన్నాయంటోంది కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ). అధునాతన అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి బేసిన్లో 38 ఏళ్ల ప్రవాహాల ఆధారంగా చేసిన అధ్యయనంలో పెన్నాలో 367.98 టీఎంసీల లభ్యత ఉందని సీడబ్ల్యూసీ తాజాగా తేల్చింది. జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఎఆర్‌ఎస్‌సీ) సహకారంతో 2019లో 25 ఏళ్ల ప్రవాహాల ఆధారంగా పెన్నాలో 395.53 టీఎంసీల లభ్యత ఉందని సీడబ్ల్యూసీ లెక్కకట్టింది. అప్పటి కంటే ఇప్పుడు చేసిన అధ్యయనంలో నీటి లభ్యత 27.55 టీఎంసీల తగ్గిందని తేల్చింది. వర్షఛాయ ప్రాంతం (రెయిన్ షాడో ఏరియా)లో పుట్టి, ప్రవాహించే పెన్నాలో ఈ స్థాయిలో నీటి లభ్యత ఉంటుందా? అని జలవనరుల శాఖలో సుదీర్ఘకాలం పనిచేసిన ఇంజినీర్లు, నీటిపారుదలరంగ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తుపాన్లు, కుండపోత వానలు.. వాటి ప్రభావం వల్ల వచ్చే నీటి పరిమాణాన్ని పరిగణనలోకి తీసుకుని నీటి లభ్యతపై చేసే అధ్యయానికి శాస్త్రీయత ఉండదని చెబుతున్నారు. పెన్నా బేసిన్ ఇదీ..కర్ణాటకలో నంది కొండల్లో పుట్టిన పెన్నా నది కర్ణాటకలోని కోలార్, తుమకూరు, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసత్యసాయి, అనంతపురం, వైఎస్సార్, నెల్లూరు జిల్లాల మీదుగా 697 కిమీల దూరం ప్రవహించి ఊటుకూరు వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. ఎడమ వైపు నుంచి జయమంగళి, కుందేరు.. కుడి వైపు నుంచి చిత్రావతి, పాపాఘ్ని, సగిలేరు, చెయ్యేరు ప్రధాన ఉప నదులు పెన్నాలో కలుస్తాయి. పెన్నా బేసిన్ 54,905 చదరపు కిలోమీటర్ల (ఆంధ్రప్రదేశ్ 87 శాతం, కర్ణాటక 13 శాతం) పరిధిలో విస్తరించింది. ఇది దేశ భౌగోళిక విస్తీర్ణంలో 1.67 శాతానికి సమానం. సీడబ్ల్యూసీ తాజా అధ్యయనంలో ప్రధానాంశాలు» పెన్నా బేసిన్లో 1985–86 నుంచి 2022–23 మధ్య 38 ఏళ్లలో ఏటా సగటున 752.72 మిమీల వర్షపాతం కురిసింది. ఈ వర్షపాతం పరిమాణం 1,459.56 టీఎంసీలు. బేసిన్లో గరిష్టంగా వర్షపాతం 2020–21లో 1,265 మి.మీ.లు కురిసింది. దీని పరిమాణం 2,452.96 టీఎంసీలు.. బేసిన్ కనిష్ట వర్షపాతం 2018–19లో 395 మి.మీ.లు నమోదైంది. దీని పరిమాణం 765.27 టీఎంసీలు.» బేసిన్లో 1996–97లో గరిష్టంగా నీటి లభ్యత 1,067.57 టీఎంసీలు ఉండగా.. 2011–12లో కనిష్టంగా 94.29 టీఎంసీల లభ్యత ఉంది. 38 ఏళ్ల ప్రవాహాల ఆధారంగా చూస్తే ఏటా సగటున 367.98 టీఎంసీల లభ్యత ఉంది. » 1985–86 నుంచి 2022–23 మధ్య సాగునీటి కోసం ఏటా 212.60 టీఎంసీలను వినియోగించారు. » బేసిన్లో రిజర్వాయర్లలో ఏటా సగటున నీటి ఆవిరి నష్టాలు 17.66 టీఎంసీలు.» 2022–23లో గృహ, పారిశ్రామిక అవసరాలు, జంతువులకు తాగునీటి అవసరాల కోసం 17.30 టీఎంసీలు ఉపయోగించారు. -
గోదావరి.. అపార జలసిరి
సాక్షి, అమరావతి: గోదావరిలో జలసిరులు అపారంగా ఉన్నాయని కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) స్పష్టంచేసింది. ఏటా సగటున 4,561.60 టీఎంసీల లభ్యత ఉన్నట్లు తేల్చింది. గోదావరి నదీ పరీవాహక ప్రాంతం(బేసిన్)లో 1985–86 నుంచి 2022–23 మధ్య 38 ఏళ్ల ప్రవాహాలను ఆధారంగా చేసుకుని తాజాగా తాము నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం తేలిందని సీడబ్ల్యూసీ వెల్లడించింది. గోదావరిలో ఇప్పటివరకు ఏడుసార్లు నిర్వహించిన అధ్యయనాల్లో నిర్ధారించిన దానికంటే అధికంగా నీటి లభ్యత ఉందని ప్రకటించింది. దీనిపై అంతర్రాష్ట్ర జలవనరులు, బచావత్ ట్రిబ్యూనల్ సమయంలో పనిచేసిన సుదీర్ఘ అనుభవం గల ఇంజినీర్లు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. నీటి లభ్యతను శాస్త్రీయంగా అంచనా వేయాలంటే వందేళ్లు లేదా కనీసం 50 ఏళ్ల ప్రవాహాలను ఆధారంగా తీసుకోవాలని చెబుతున్నారు. బేసిన్లో కొంతకాలం అధిక వర్షపాతం కురవడం... ఆ సమయంలో ఒకేసారి గరిష్టంగా వరద రావడం తదితర కారణాల వల్లే గోదావరిలో నీటి లభ్యత పెరగడానికి కారణమని నీటిపారుదలరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గోదావరి బేసిన్ ఇదీ.. దేశంలో రెండో అతి పెద్ద నది గోదావరి. మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో నాసిక్ వద్ద త్రయంబకేశ్వర్‌లో సముద్రమట్టానికి 1,067 మీటర్ల ఎత్తులో జని్మంచిన గోదావరి... మహారాష్ట్ర, తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌లలో 1,465 కిలో మీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఏపీలోని డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.గోదావరికి ప్రవర, పూర్ణ, మంజీర, పెన్‌గంగ, ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, సీలేరు ప్రధాన ఉప నదులు. గోదావరి నదీ పరివాహక ప్రాంతం (బేసిన్) మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, పుదుచ్చేరిలలో 3,12,812 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించింది. ఇది దేశ భౌగోళిక విస్తీర్ణంలో 9.5 శాతంతో సమానం. సీడబ్ల్యూసీ తాజా అధ్యయనంలో ముఖ్యాంశాలు ఇవీ..» గోదావరిలో 1985–86 నుంచి 2022–23 వరకు ఏటా సగటున 4,561.60 టీఎంసీల లభ్యత ఉంది. » 2013–14లో గరిష్టంగా 8,664.82 టీఎంసీల లభ్యత ఉండగా... 2009–10లో నీటి లభ్యత కనిష్టంగా 2,066.62 టీఎంసీల లభ్యత ఉంది. » బేసిన్లో సగటున 1,167 మి.మీ. వర్షపాతం కురుస్తుంది. దీనివల్ల గోదావరిలో ఏటా సగటున 12,869.74 టీఎంసీల ప్రవాహం ఉంటుంది. 1994–95లో గరిష్టంగా 1,484 మి.మీ.ల వర్షపాతం కురవడం వల్ల ఆ సంవత్సరంలో గరిష్టంగా 17,054.89 టీఎంసీల ప్రవాహం ఉంది. 2015–16లో బేసిన్లో కనిష్టంగా 914 మి.మీ.ల వర్షపాతం కురవడం వల్ల ఆ సంవత్సరంలో గోదావరిలో కనిష్టంగా 9,608.43 టీఎంసీల ప్రవాహం ఉంది. » 1985–2023 మధ్య ఏటా సగటున 850.38 టీఎంసీలను మాత్రమే సాగునీటి కోసం వినియోగించుకున్నారు. » 2022–23లో గృహ, పారిశ్రామిక అవసరాలు, పశువులకు తాగునీటి కోసం 70.28 టీఎంసీలు వాడుకున్నారు. » బేసిన్లో రిజర్వాయర్లలో ఆవిరి నష్టాలు ఏటా సగటున 181.52 టీఎంసీలుగా సీడబ్ల్యూసీ నిర్ధారించింది. -ఆలమూరు రామగోపాలరెడ్డి -
పోలవరానికి ఈ ఏడాది ఎంత కావాలి?
పోలవరం ప్రాజెక్టు కనీస నీటి మట్టం (41.15 మీటర్ల కాంటూర్) స్థాయిలో ఈ ఆర్థిక సంవత్సరంలో చేపట్టే పనులు, వాటికి ఎంత ఖర్చవుతుంది, ఎప్పుడు ఎంత విడుదల చేయాలో సమగ్ర ప్రతిపాదనలు పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ద్వారా పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం కోరింది. పీపీఏ, కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ)తో చర్చించి ఈ ఆర్థిక సంవత్సరంలో చేపట్టాల్సిన పనులు, వాటికయ్యే వ్యయాన్ని ఖరారు చేసి, ఆ మేరకు నిధులు విడుదల చేయాలని ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపుతామని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌కు కేంద్ర జల్ శక్తి శాఖ సీనియర్ జాయింట్ కమిషనర్ దీపక్ చంద్ర భట్ ఇటీవల లేఖ రాశారు. - సాక్షి, అమరావతినాడు మోకాలడ్డిన చంద్రబాబువైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండగా పోలవరం పూర్తి చేయడానికి తాజా ధరల మేరకు, విభాగాల వారీగా పరిమితి విధించకుండా బడ్జెట్ ద్వారా నిధులు కేటాయించాలని ప్రధానిని కోరారు. అందుకు మోదీ సానుకూలంగా స్పందించారు. ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయాన్ని రీయింబర్స్ చేసేందుకు విభాగాల వారీగా విధించిన పరిమితి ఎత్తేశారు. తాజా ధరల మేరకు నిధులిచ్చేందుకు అంగీకరించారు. తొలి దశ పూర్తికి అవసరమయ్యే నిధులు విడుదల చేయాలని ఆదేశించారు. దాంతో తొలి దశ పనులు పూర్తి, చంద్రబాబు చారిత్రక తప్పిదం వల్ల ధ్వంసమైన గ్యాప్–2లో కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికి రూ.12,911.15 కోట్లు ఇచ్చేందుకు అంగీకరిస్తూ గతేడాది జూన్ 5న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నోట్ జారీ చేశారు. ఈ క్రమంలో పోలవరం తొలి దశ వ్యయాన్ని రూ.30,436.95 కోట్లుగా కేంద్ర జల్ శక్తి శాఖ ఖరారు చేసింది. 2014 ఏప్రిల్ 1 వరకూ చేసిన ఖర్చు రూ.4,730.71 కోట్లు పోనూ రూ.25,706.24 కోట్లు ఇవ్వాలని నిర్ధారించింది. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినప్పటి నుంచి 2024 ఫిబ్రవరి వరకు రూ.15,146.27 కోట్లు రీయింబర్స్ చేసింది. ఇందులో రెండో దశ కింద చేపట్టిన పనులకు రూ.1,597.56 కోట్లు విడుదల చేసింది. ఆ నిధులు పోనూ కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం, తొలి దశ పనుల పూర్తికి రూ.12,157.53 కోట్లు అవసరమని తేల్చింది. ఆ మేరకు నిధులు మంజూరు చేయాలని మార్చి 6న కేంద్ర కేబినెట్‌కు జల్ శక్తి శాఖ ప్రతిపాదనలు పంపింది. అప్పటికే బీజేపీతో పొత్తు పెట్టుకుని, ఎన్డీఏలో చేరిన చంద్రబాబు.. ఆ నిధులు ఇస్తే రాజకీయంగా ఇబ్బందులు వస్తాయని బీజేపీ పెద్దల చెవిలో ఊదారు. దాంతో ఆ ప్రతిపాదన పక్కన పెట్టిన కేంద్ర కేబినెట్ ఆగస్టు 28న ఆమోదం తెలిపింది.నిధుల సంక్షోభం నుంచి గట్టెక్కించిన వైఎస్ జగన్విభజన చట్టం ప్రకారం కేంద్రమే నిరి్మంచాల్సిన పోలవరం ప్రాజెక్టును కమీషన్ల కక్కుర్తితో 2016 సెప్టెంబరు 7న సీఎం చంద్రబాబు తన చేతుల్లోకి తీసుకున్నారు. ఈ క్రమంలో 2013–14 ధరల ప్రకారం నీటిపారుదల విభాగానికి అయ్యే వ్యయం మాత్రమే ఇస్తామన్న కేంద్రం షరతుకు అంగీకరించారు. బడ్జెట్ ద్వారా కాకుండా నాబార్డు నుంచి రుణం తీసుకుని రీయింబర్స్ చేస్తామన్న ప్రతిపాదనకూ తలూపారు. 2013–14 ధరల ప్రకారం పాజెక్టు వ్యయాన్ని రూ.20,398.61 కోట్లుగా లెక్కగట్టి.. 2024 ఏప్రిల్ 1 వరకూ ఖర్చు చేసిన రూ.4,730.71 కోట్లు పోనూ మిగతా రూ.15,667.9 కోట్లు మాత్రమే ఇచ్చేలా 2017 మార్చి 15న కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నిజానికి 2017–18 ధరల ప్రకారం ప్రాజెక్టు వ్యయం రూ.55,656.87 కోట్లు. ఇందులో భూసేకరణ, పునరవాసానికే నికే రూ.33,168.23 కోట్లు అవసరం. కానీ.. రూ.15,667.9 కోట్లు ఇస్తే చాలు ప్రాజెక్టు పూర్తి చేస్తానని చంద్రబాబు అంగీకరించడంలో లోగుట్టు కమీషన్లే. ముడుపుల కోసం ఇష్టారాజ్యంగా పనులు చేపట్టి ప్రాజెక్టును చంద్రబాబు విధ్వసం చేయడమే కాదు.. నిధుల సంక్షోభంలోకి కూడా నెట్టారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక పోలవరం ప్రాజెక్టును గాడిలో పెట్టి పనులను పరుగులు పెట్టించారు. ప్రాజెక్టు పనుల్లో చంద్రబాబు నిర్వాకాలను కేంద్రానికి వివరించారు. తాజా ధరల ప్రకారం నిధులిస్తేనే పోలవరాన్ని పూర్తి చేయడానికి సాధ్యమవుతుందన్న వైఎస్ జగన్ ప్రతిపాదనతో ప్రధాని మోదీ ఏకీభవించారు. ఇలా తాజా ధరల మేరకు నిధులు ఇచ్చేందుకు కేంద్రాన్ని ఒప్పించడం ద్వారా నిధుల సంక్షోభం నుంచి పోలవరాన్ని వైఎస్ జగన్ గట్టెక్కించారు.» గతేడాది జూన్ 5నే తొలి దశ, డయాఫ్రం వాల్‌కు రూ.12,911 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం అంగీకారం» ఈ వివరాలను సమగ్రంగా పీపీఏ ద్వారా పంపండి» అప్పటికే బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్డీఏలో చేరిన చంద్రబాబు చేపట్టాల్సిన పనులు, వాటికయ్యే వ్యయాన్ని ఖరారు చేస్తాం» పోలవరానికి ఆ నిధులిస్తే రాజకీయంగా ఇబ్బందులు వస్తాయని విన్నపం» రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర జల్ శక్తి శాఖ వెల్లడి» దాంతో ఆ ప్రతిపాదనను పక్కన పెట్టిన కేంద్ర కేబినెట్» రూ.12,157.53 కోట్లు విడుదలకు మార్చి 6న కేంద్ర కేబినెట్‌కు జలశక్తి శాఖ ప్రతిపాదన» అదే ప్రతిపాదనపై ఆగస్టు 28న ఆమోదం -
కృష్ణాలో 3,048.37 టీఎంసీలా?
సాక్షి, అమరావతి: కృష్ణా నది పరివాహక ప్రాంతం (బేసిన్)లో ఏటేటా నీటి లభ్యత తగ్గుతోందని.., బచావత్, బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునళ్లు అంచనా వేసినంత కూడా రావడంలేదని నీటి పారుదల రంగ నిపుణులు ఆందోళన చెందుతుంటే.. కృష్ణా బేసిన్లో నీటి లభ్యత పెరిగిందని కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) చెబుతోంది. కృష్ణా బేసిన్లో 1985–86 నుంచి 2022–23 వరకు 38 ఏళ్ల ప్రవాహాల ఆధారంగా నీటి లభ్యతపై తాజాగా అధ్యయనం చేసిన సీడబ్ల్యూసీ బుధవారం ఆ నివేదికను విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం కృష్ణాలో 3,048.37 టీఎంసీల లభ్యత ఉన్నట్లు తేల్చింది. నదిలో 75 శాతం లభ్యత ఆధారంగా బచావత్ ట్రిబ్యునల్ 2,130 టీఎంసీల లభ్యత ఉందని తేల్చితే.. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ 2,173 టీఎంసీలు ఉన్నట్లు నిర్ధారించింది. ఆ రెండు ట్రిబ్యునళ్లు నిర్ధారించిన దానికంటే అధికంగా 875 టీఎంసీల లభ్యత ఉన్నట్లుగా సీడబ్ల్యూసీ తాజాగా వెల్లడించింది. దీనిపై అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం.., బచావత్, బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునళ్ల సమయంలో పని చేసి సుదీర్ఘ అనుభవం ఉన్న ఇంజినీర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణాలో సీడబ్ల్యూసీ చెప్పినంతగా నీటి లభ్యత ఉండదని తేల్చిచెబుతున్నారు. కేవలం 38 ఏళ్ల ప్రవాహాల ఆధారంగా చేసిన అధ్యయనానికి శాస్త్రీయత ఉండదని చెబుతున్నారు. వందేళ్లు లేదా కనీసం 50 ఏళ్ల ప్రవాహాల ఆధారంగా చేసిన అధ్యయనాలకే శాస్త్రీయత ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. కృష్ణా బేసిన్ ఇదీ..మహారాష్ట్రలో పశ్చిమ కనుమల్లో పురుడుపోసుకునే కృష్ణమ్మ.. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మీదుగా 1,400 కిలోమీటర్లు ప్రయాణించి కృష్ణా జిల్లా హంసలదీవి వద్ద సముద్రంలో కలుస్తుంది. కృష్ణా బేసిన్ 2,59,439 చదరపు కిలోమీటర్ల వైశ్యాల్యంలో విస్తరించింది. ఇది దేశ భౌగోళిక విస్తీర్ణంలో 7.9 శాతానికి సమానం. మహారాష్ట్రలో 26.60 శాతం, కర్ణాటకలో 43.80 శాతం, తెలంగాణలో 19.80, ఆంధ్రప్రదేశ్‌లో 9.80 శాతం కృష్ణా బేసిన్ విస్తరించి ఉంది. నదిలో కోయినా, వర్ణ, పంచ్‌గంగా, దూద్‌గంగా, ఘటప్రభ, మలప్రభ, బీమా, తుంగభద్ర, కాగ్నా, మూసీ, మున్నేరు వంటి ప్రధాన ఉప నదులు కలుస్తాయి.తాజా అధ్యయనంలో ముఖ్యాంశాలు..కృష్ణా బేసిన్లో 1985–86 నుంచి 2022–23 మధ్య 38 ఏళ్లలో ఏటా సగటున 843.20 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. దీనివల్ల ఏటా సగటున 7,725.80 టీఎంసీల ప్రవాహం ఉంది. ఈ 38 ఏళ్లలో గరిష్టంగా 2005–06లో 1,169.70 మి.మీ.ల వర్షం కురవడం వల్ల 10,716.60 టీఎంసీల ప్రవాహం ఉంది. కనిష్టంగా 2018–19లో 568.38 మి.మీ.ల వర్షం కురవడం వల్ల 5,207.50 టీఎంసీల ప్రవాహం ఉంది.1985–86 నుంచి 2022–23 మధ్య కృష్ణాలో సగటున 3,048.37 టీఎంసీల లభ్యత ఉంది. 2025–26లో గరిష్టంగా 5,250.70 టీఎంసీల లభ్యత ఉండగా.. 2018–19లో కనిష్టంగా 1,818.70 టీఎంసీల లభ్యత ఉంది.1985–2023 మధ్య బేసిన్లో సాగునీటి అవసరాలకు ఏటా సగటున 1,781.28 టీఎంసీలను వినియోగించుకున్నారు.బేసిన్ పరిధిలోని రిజర్వాయర్లలో ఆవిరి నష్టాలు ఏటా సగటు 96.06 టీఎంసీలు. -
జలవిద్యుదుత్పత్తిలో ఏపీ ముందంజ
సాక్షి, అమరావతి: జల విద్యుత్ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ ముందంజ వేసింది. శ్రీశైలం కుడిగట్టు, లోయర్ సీలేరు, అప్పర్ సీలేరు తదితర జల విద్యుత్ కేంద్రాల ద్వారా ఇప్పటికే 1,610 మెగావాట్లను ఉత్పత్తి చేస్తోంది. పోలవరం ప్రాజెక్టుకు అనుబంధంగా 960 మెగావాట్ల సామర్థ్యంతో జల విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులను 2019 నవంబర్‌లో ప్రారంభించి శరవేగంగా నిర్మిస్తోంది. పోలవరం జల విద్యుత్ కేంద్రం కూడా పూర్తయితే రాష్ట్రంలో 2,570 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుంది. రాష్ట్రంలో 2,596 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉందని అంచనా వేయగా.. అందులో 2,570 మెగావాట్లు(99 శాతం) ఉత్పత్తి చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జల విద్యుత్ ఉత్పత్తిలో ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, తమిళనాడు సరసన ఆంధ్రప్రదేశ్ చేరిందని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) వెల్లడించింది. దేశంలో జల విద్యుత్ ఉత్పత్తికి ఉన్న అవకాశాలు.. ఇప్పటికే పూర్తయిన కేంద్రాల్లో ఉత్పత్తి అవుతున్న విద్యుత్.. నిర్మాణంలో ఉన్న కేంద్రాలు పూర్తయితే అందుబాటులోకి వచ్చే విద్యుత్ తదితర అంశాలపై సీడబ్ల్యూసీ 2017–23 మధ్య సమగ్ర అధ్యయనం చేసింది. అధ్యయనంలో వెల్లడైన అంశాలపై కేంద్రానికి ఇటీవల నివేదిక ఇచి్చంది. ఆ నివేదికలో ప్రధానాంశాలు ఇవీ.. సద్వినియోగం చేసుకున్నది 41.95 శాతమే దేశంలో హిమాలయ నదులు, ఈశాన్య రాష్ట్రాలు, ద్వీపకల్ప నదులు, జలపాతాలపై 1,48,701 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉంది. ఇందులో 25 మెగావాట్లు, అంతకంటే ఎక్కువ సామర్థ్యంతో ఉత్పత్తి చేసే కేంద్రాల్లోనే 1,33,401.03 మెగావాట్లు ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంది. ఇప్పటికే పూర్తయిన జల విద్యుత్ కేంద్రాల ద్వారా 42,104.55 మెగావాట్లు (31.56 శాతం) విద్యుత్ అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న కేంద్రాల ఉత్పత్తి సామర్థ్యం 13,867.50 మెగావాట్లు (10.39 శాతం). అంటే.. ఇప్పటివరకు జల విద్యుత్ ఉత్పత్తికి ఉన్న అవకాశాల్లో 41.95 శాతం మాత్రమే సద్వినియోగం చేసుకున్నట్టు స్పష్టమవుతోంది. వివిధ కారణాల వల్ల నిర్మాణ దశలో ఆగిపోయిన కేంద్రాల ఉత్పత్తి సామర్థ్యం 1,156 మెగావాట్లు (0.87 శాతం). 76,282 మెగావాట్లు (57.18 శాతం) ఉత్పత్తి చేసే కేంద్రాల నిర్మాణాన్ని ఇప్పటికీ చేపట్టలేదు.అరుణాచల్‌లో అవకాశాలు అపారం హిమాలయ నదులు ప్రవహించే రాష్ట్రాల కంటే ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్‌లో జల విద్యుత్ ఉత్పత్తికి అవకాశాలు అపారంగా ఉన్నాయి. ఆ రాష్ట్ర భౌగోళిక పరిస్థితులు జల విద్యుత్ ఉత్పత్తికి అత్యంత అనుకూలం. అరుణాచల్ ప్రదేశ్‌లో 50,394 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉంది. ఇప్పటికి నిర్మాణం పూర్తయిన కేంద్రాల్లో 1,115 మెగావాట్లు (2.21 శాతం) విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. చైనాతో సరిహద్దు సమస్యలు, శాంతిభద్రతల పరిస్థితులు జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణానికి అడ్డంకిగా మారాయి. దేశంలో అత్యధిక సామర్థ్యంతో జల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం హిమాచల్‌ప్రదేశ్. ఆ రాష్ట్రంలో 18,305 మెగావాట్ల ఉత్పత్తికి అవకాశం ఉంటే.. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన కేంద్రాల ద్వారా 10,263 మెగావాట్లు (56.07 శాతం) ఉత్పత్తి అవుతోంది. హిమాచల్‌ప్రదేశ్ తర్వాత అత్యధికంగా జల విద్యుత్ ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో ఉత్తరాఖండ్, కర్ణాటక, జమ్మూకశీ్మర్ నిలిచాయి. -
జాయింట్ సర్వే !
సాక్షి, హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టులో 150 అడుగుల గరిష్ట నీటిమట్టం (ఎఫ్ఆర్ఎల్) మేరకు నీళ్లను నిల్వ చేస్తే తెలంగాణ భూభాగంలో ఏర్పడనున్న ముంపు ప్రభావంపై పోలవరం ప్రాజెక్టు ఆథారిటీ (పీపీఏ) ఆధ్వర్యంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో తక్షణమే జాయింట్ సర్వే నిర్వహించాలని కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) చైర్మన్ కుస్విందర్ సింగ్ వోరా ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టుతో కిన్నెరసాని, ముర్రెడువాగులకు ఏర్పడనున్న ముంపుపై ఎన్జీటీ ఆదేశాల మేరకు ఇప్పటికే జాయింట్ సర్వే నిర్వహించగా, తదుపరిగా క్షేత్ర స్థాయిలో ముంపు ప్రాంతాన్ని గుర్తిస్తూ డీమార్కింగ్ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల తో తక్షణమే జాయింట్ సర్వే నిర్వహించి డీమార్కింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని వోరా ఆదేశించారు.పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రభావాని కి సంబంధించి తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, రాష్ట్ర ప్రభుత్వాల అభ్యంతరాలపై బుధవారం ఢిల్లీలోని సీడబ్ల్యూసీ కార్యాలయంలో వోరా అధ్యక్షతన సాంకేతిక కమిటీ సమావేశం జరిగింది. కమిటీ సభ్యులై న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రా ష్ట్రాల నీటిపారుదల శాఖ ఇంజనీర్లు పాల్గొన్నారు. ఎప్పటికైనా సర్వే చేయాల్సిందే: వోరా పోలవరం ప్రాజెక్టు ఎఫ్ఆర్ఎల్ ఎప్పటికైనా 150 అడుగులే ఉంటుందని, దీనివల్ల తెలంగాణలో ఉండనున్న ముంపు ప్రభావంపై ఎప్పుడైనా సర్వే చేసి నివారణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని సీడబ్ల్యూసీ చైర్మన్ వోరా స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో సర్వే జరగకపోవచ్చని, ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో తెలంగాణ కోరిన మేరకు జాయింట్ సర్వే చేయాల్సిందేనని సూచించారు. జాయింట్ సర్వేను సమన్వయం చేయాలని పీపీఏ ను ఆదేశించారు. 150 అడుగుల నిల్వతో ఏర్పడే ముంపుతో పాటు ప్రాజెక్టు కారణంగా ముర్రెడువాగు, కిన్నెరసాని వాగులకు ఉండే ముంపును గుర్తించి నివేదిక సమర్పిస్తే, ముంపు నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ఏపీ, తెలంగాణతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. తెలంగాణ కోరి న మేరకు.. పోలవరం ప్రాజెక్టుతో మిగిలిన 5 వాగులకు ఉండనున్న ముంపుపై జాయింట్ సర్వే విషయంలో మళ్లీ సమావేశమై నిర్ణయం తీసుకుందా మని చెప్పారు. కాగా పోలవరం ప్రాజెక్టుతో సీడబ్ల్యూసీ సర్వేలో తేలిన దానికి మించి తమ రాష్ట్రంలో ముంపు ప్రభావం ఉందని ఒడిశా నీటిపారుదల శాఖ సీఈ అశుతోష్ దాస్ పేర్కొన్నారు. ఐఐటీ రూ ర్కెలా అధ్యయన నివేదికలో ఇది తేలిందన్నారు. ఈ నివేదికపై అధ్యయనం చేసి తదుపరి సమావేశంలో చర్చిస్తామని సీడబ్ల్యూసీ చైర్మన్ హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో తెలంగాణ అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం సీఈ మోహన్ కుమార్, డిప్యూటీ డైరెక్టర్ సుబ్రమణ్యం, పీపీఏ సీఈఓ అతుల్ జైన్, సీఈ రఘురామ్ తదితరులు పాల్గొన్నారు.ఎలాంటి పురోగతి లేదు: తెలంగాణ గత సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల మేరకు జాయింట్ సర్వేకు ఏపీ ప్రభుత్వం ముందుకు రావడం లేదని తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ (ఓ అండ్ ఎం) బి.నాగేందర్రావు తెలియజేశారు. గత సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి ఎలాంటి పురోగతి లేదని, కాగితాలకే పరిమితమయ్యాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. 150 అడుగుల ఎఫ్‌ఆర్‌ఎల్‌తో తెలంగాణలో 950 ఎకరాలు ముంపునకు గురవుతాయని, దీనిపై జాయింట్ సర్వే చేయాల్సిందేనని ఆయన కోరారు. మరోవైపు జాయింట్ సర్వేకు తెలంగాణ సహకరించడం లేదని, సర్వే రెండు వాగులకే పరిమితం చేయాల్సి ఉండగా, ఏడు వాగులు సర్వే చేయాలని కోరుతోందని ఏపీ అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం సీఈ శ్రీనివాసరావు చెప్పారు. అయితే ముర్రెడువాగు, కిన్నెరసాని వాగుల జాయింట్ సర్వేకు పూర్తిగా సహకరించిన విషయాన్ని తెలంగాణ ఈఎన్సీ గుర్తు చేశారు. -
చెక్‌లిస్టుపై సంతకం కోసం ఒత్తిడి చేశారు
సాక్షి, హైదరాబాద్: ‘కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) మార్గదర్శకాల ప్రకారం సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీఓ)కు అధిపతిగా ఈఎన్సీ ఉండాలి. సీడీఓ కింద హైడ్రాలజీ, ఇన్వెస్టిగేషన్స్, డిజైన్స్ విభాగాలకు వేర్వేరు సీఈలు పనిచేయాలి. డిజైన్లు, డ్రాయింగ్స్‌ను సీడబ్ల్యూసీకి పంపించడా నికి ముందు హైడ్రాలజీ, ఇన్వెస్టిగేషన్స్, డిజైన్స్‌కి సంబంధించిన నిబంధనలన్నీ అమలు చేసినట్టు ధ్రువీకరిస్తూ చెక్‌లిస్టుపై సీడీఓ ఈఎన్సీ సంతకం చేయాల్సి ఉంటుంది. కానీ రాష్ట్రంలో సీడీఓ ఈఎన్సీ లేరు. చెక్‌లిస్టుపై సంతకం చేయాలని కాళేశ్వరం ప్రాజెక్టు సీఈ (హైదరాబాద్) హరి రామ్.. నన్ను కోరగా..హైడ్రాలజీ, ఇన్వెస్టిగేషన్స్ విభాగాలు నా పరిధిలోకి రానందున సంతకం చేసేందుకు నిరాకరించా. బరాజ్‌ల డిజైన్లన్నీ సిద్ధమయ్యాక సంతకం ఎందుకు పెట్టడం లేదు? సమస్యేమిటి? అని నాటి సీఎం (కేసీఆర్), ఇరిగేషన్ మంత్రి (హరీశ్‌రావు) ఫోన్లు చేసి ఒత్తిడి చేశారు..’ అని రాష్ట్ర నీటిపారుదల శాఖలోని సీడీఓ విభాగం రిటైర్డ్ సీఈ డి.నరేందర్‌రెడ్డి.. జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్‌కు తెలిపారు. హైడ్రాలజీ, ఇన్వెస్టిగేషన్లకు సంబంధించిన అంశాలకు పూర్తిగా తనదే బాధ్యత అని అంగీకరిస్తూ హరిరామ్ లేఖ ఇచ్చాకే తాను చెక్‌లిస్టుపై సంతకం చేశానని చెప్పారు. అయితే డిజైన్లు సీడబ్ల్యూసీకి సమర్పించడానికి ముందు ఈ లేఖను తొలగించారని ఇటీవల తనకు తెలిసిందని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌ల నిర్మాణంపై విచారణలో భాగంగా కమిషన్ గురువారం బీఆర్కేఆర్ భవన్‌లోని తన కార్యాలయంలో నరేందర్‌రెడ్డికి క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించింది. ఈ సందర్భంగా సమాచార హక్కు చట్టం కింద సంపాదించిన హరిరామ్ లేఖను నరేందర్‌రెడ్డి కమిషన్‌కు ఆధారంగా అందజేశారు. ఎల్ అండ్ టీ ఇచ్చిన డిజైన్లను మక్కికి మక్కీగా కాపీ ఎందుకు చేశారు? మెదడును ఎందుకు వినియోగించలేదు? అని కమిషన్ నిలదీయగా, ఆయన పైవిధంగా స్పందించారు. కమిషన్ సంధించిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. మేడిగడ్డ డిజైన్ల రూపకల్పనలో ఎల్ అండ్ టీ పాత్ర‘మేడిగడ్డ బరాజ్ డిజైన్ల రూపకల్పనతో తమకు సంబంధం లేదని నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ పేర్కొనడం పూర్తిగా అవాస్తవం. డిజైన్ల ప్రతిదశలో ఎల్ అండ్ టీ పాలుపంచుకుంది. నాటి సీఎం (కేసీఆర్) సమక్షంలో జరిగిన ఓ సమావేశంలో పనిభారం తీవ్రంగా ఉందనే చర్చ జరగగా, మేడి గడ్డ బరాజ్ డిజైన్లు, డ్రాయింగ్స్కు రూపకల్పన చేస్తామని ఎల్ అండ్ టీ సీఎండీ స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. ఆ సంస్థతో కలిసి సీడీఓ ఇంజనీర్లు డిజైన్లు, డ్రాయింగ్స్‌ను రూపొందించారు. ఎల్ అండ్ టీ, సీడీఓ మధ్య ఈ–మెయిల్ ద్వారా జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలతో రూపొందించిన 600 పేజీల బుక్లెట్ సీడీఓ వద్ద ఆధారంగా ఉంది. (రుజువుగా కొన్ని మెయిల్స్‌తో కూడిన పత్రాలను కమిషన్‌కు అందజేశారు). కాళేశ్వరం నిర్మించాలన్న నిర్ణయం ఎవరిదో తెలియదుకాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించాలన్న ఆలోచన ఎవరిదో నాకు తెలియదు. సీఎం వద్ద జరిగిన సమావేశాలకు ఎన్నడూ సీడీఓ ఇంజనీర్లను పిలవలేదు. డిజైన్లు, డ్రాయింగ్స్ రూపకల్పనకే సీడీఓ పాత్ర పరిమితం. బరాజ్‌ల 3డీ మోడల్ స్టడీస్‌ను సీడీఓ డిజైన్లు ఇచ్చిన తర్వాతే చేయాలి. నాటి ప్రభుత్వం, సీఎం, మంత్రి వెంటబడడంతో సీడీఓ డిజైన్లు ఇవ్వడానికి ముందే 3డీ మోడల్ స్టడీస్‌ను తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ (టీఎస్ఈఆర్ఎల్) నిర్వహించింది. 2డీ మోడల్ స్టడీస్ ఫలితాలు మాత్రమే డిజైన్ల తయారీకి ముందు మాకు అందాయి. బరాజ్ నుంచి వరద సెకనుకు 6 మీటర్ల వేగం (షూటింగ్ వెలాసిటీ)తో బయటికి దూసుకొస్తుందనే అంచనాలతో డిజైన్లను రూపొందించాం. కానీ సెకనుకు 15–16 మీటర్ల వేగంతో ప్రయాణి స్తున్నట్టు నిర్ధారణ జరిగింది.నిర్మాణ, నిర్వహణ లోపంతోనే బరాజ్‌లు విఫలంనిర్మాణంలో నాణ్యతా లోపం, నిర్మాణం పూర్తైన తర్వాత వర్షాలకు ముందు, తర్వాత నిర్వహణ, పర్యవేక్షణ చేపట్టకపోవడం, గేట్ల నిర్వహణలో కోడ్ పాటించకపోవడం, మేడిగడ్డ బరాజ్‌లో బుంగలు ఏర్పడితే నాలుగేళ్ల పాటు పూడ్చివేయ కపోవడం వంటి కారణాలతోనే బరాజ్‌లు విఫలమయ్యాయి..’ అని నరేందర్‌రెడ్డి చెప్పారు. -
‘కాళేశ్వరం’ నిర్ణయాలు ఎవరివి?
సాక్షి, హైదరాబాద్: ‘‘కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో అత్యున్నత స్థాయిలో నిర్ణయాలు తీసుకున్నది ఎవరు? ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు బదులు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించాలనే నిర్ణయం ఎవరిది? కాళేశ్వరం డీపీఆర్‌ను కేంద్ర జలసంఘాని(సీడబ్ల్యూసీ)కి పంపిన తర్వాత మళ్లీ ఎందుకు మార్పులు చేశారు?’’అని రాష్ట్ర నీటిపారుదల శాఖ రిటైర్డ్ ఈఎన్సీ (జనరల్) సి.మురళీధర్‌పై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ప్రశ్నల వర్షం కురిపించింది. నిర్ణయాలు ప్రభుత్వం స్థాయిలో జరిగాయని మురళీధర్ బదులివ్వగా.. ‘ప్రభుత్వం అంటే ఎవరు?’అని కమిషన్ తిరిగి ప్రశ్నించింది. ‘హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ (ప్రభుత్వ అధినేత)’అని మురళీధర్ బదులివ్వగా.. ప్రభుత్వఅధినేత అంటే ఎవరని కమిషన్ వివరణ కోరింది. దీంతో నీటిపారుదల శాఖ కార్యదర్శి అని మురళీధర్ బదులిచ్చినట్టు తెలిసింది. కాళేశ్వరం బరాజ్‌లపై విచారణలో భాగంగా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ బుధవారం బీఆర్కేఆర్ భవన్‌లోని తమ కార్యాలయంలో క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియను ప్రారంభించి.. తొలిరోజున రిటైర్డ్ ఈఎన్సీ మురళీధర్‌ను ప్రశ్నించింది. నీటి లభ్యతపై వ్యాప్కోస్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రాణహిత ప్రాజెక్టును రీఇంజనీరింగ్ చేసి.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించినట్టు మురళీధర్ తెలిపారు. క్షేత్రస్థాయి ఇంజనీర్ల ప్రతిపాదనల ప్రకారమే డీపీఆర్‌లో మార్పులు చేసినట్టు వెల్లడించారు. పలు అంశాల్లో కిందిస్థాయి ఇంజనీర్లు తప్పు చేశారని పేర్కొన్న మురళీధర్.. గత ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధుల పాత్రపై ఎలాంటి ప్రస్తావన చేయలేదు. కమిషన్ విచారణ తీరిది.. » బరాజ్‌ల నిర్మాణం పూర్తికాక ముందే కాంట్రాక్టర్లకు సబ్ స్టాన్షియల్ వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్లు ఎలా జారీ చేశారని కమిషన్ ప్రశ్నించగా.. జారీ చేసిన ఇంజనీర్లది వ్యక్తిగత స్థాయిలో తప్పేనని మురళీధర్ పేర్కొన్నారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సర్టిఫికెట్ జారీ చేస్తే సూపరింటెండింగ్ ఇంజనీర్, చీఫ్ ఇంజనీర్ కూడా సంతకాలు చేశారని కమిషన్ ఎత్తిచూపగా.. వారు తప్పుచేశారని బదులిచ్చారు. » బరాజ్‌ల నిర్మాణంలో పర్యవేక్షక ఇంజనీర్లతోపాటు క్వాలిటీ కంట్రోల్ విభాగం ఇంజనీర్లు బాధ్యతల నిర్వహణలో విఫలమయ్యారని కమిషన్ పేర్కొంది. 2016–20 మధ్య బరాజ్‌ల నిర్మాణం జరిగితే.. వరంగల్‌లోని క్వాలిటీ కంట్రోల్ విభాగం ఇంజనీర్లు ఒక్కసారి మాత్రమే తనిఖీ చేయడం ఏమిటని ప్రశ్నించింది. దీనితో సంబంధిత ఇంజనీర్లది తప్పేనని, పక్షం రోజులకోసారి పనుల్లో నాణ్యత పరీక్షించాల్సి ఉంటుందని మురళీధర్ బదులిచ్చారు. బరాజ్‌ల వైఫల్యానికి ఇది ప్రధాన కారణంగా పరిగణించాల్సి ఉంటుందని కమిషన్ తెలపగా.. ఒక కారణం కావచ్చని మురళీధర్ అన్నారు. » బరాజ్‌ల కాంక్రీట్ పనులకు నాణ్యత పరీక్షలు నిర్వహించకుండానే రూ.1,342.72 కోట్ల బిల్లులను ఏ విధంగా చెల్లించారు? బిల్లుల రికార్డుల్లో పాత తేదీలతో ఎంట్రీ ఎందుకు చేశారని కమిషన్ ప్రశ్నించగా.. సంబంధిత ఇంజనీర్లది తప్పేనని సమాధానమిచ్చారు. »డిజైన్ల ప్రకారం బరాజ్‌ల పునాదుల కింద షీట్‌పైల్స్ నిర్మించాల్సి ఉండగా.. సెకెంట్ పైల్స్‌కు ఎందుకు మారారు? నిర్మాణం ప్రారంభించాక డిజైన్లను మార్చవచ్చా? అని కమిషన్ ప్రశ్నించగా.. భూగర్భంలో ఇసుకతోపాటు భారీ రాళ్లు ఉండటంతో మార్చాల్సి వచ్చి0దని మురళీధర్ వివరించారు. నిర్మాణ దశలో డిజైన్లలో మార్పులు జరగడం సాధారణమేనని బదులిచ్చారు. » బరాజ్‌ల నిర్మాణం పూర్తయ్యాక లోపాలు బయటపడితే ఏం చర్యలు తీసుకున్నారని కమిషన్ ప్రశ్నించగా.. సరిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు మురళీధర్ వివరించారు. » కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చడం కోసం భవి ష్యత్తులో అంచనా వ్యయం పెంచుకోవడానికి వీలు కల్పిం చే రీతిలో డిజైన్లను రూ పొందించారా? అని కమిషన్ ప్రశ్నించగా.. లేదని మురళీధర్ బదులిచ్చారు. కాళేశ్వ రం డీపీఆర్‌ను సీడబ్ల్యూసీకి పంపకముందే పనులు ఎందుకు ప్రారంభించారని ప్రశ్నించగా.. ప్యాకేజీ–4 పనులు ప్రారంభించినట్టు మురళీధర్ అంగీకరించారు. -
మరో డయాఫ్రమ్ వాల్ కట్టాల్సిందే
సాక్షి, అమరావతి/పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ఈసీఆర్ఎఫ్) డ్యామ్ గ్యాప్–2లో గోదవరి వరదల ఉధృతికి దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్‌కు సమాంతరంగా కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించాలని అంతర్జాతీయ నిపుణుల బృందం కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ)కి సూచించింది. ప్రస్తుతం ఉన్న డయాఫ్రమ్ వాల్‌కు మరమ్మతులు చేసినా, దెబ్బతిన్న ప్రాంతాల్లో ‘యూ’ ఆకారంలో నిర్మించి అనుసంధానం చేసినా పూర్తి సామర్థ్యం మేరకు పనిచేస్తుందని చెప్పలేమని తేల్చిచెప్పింది. ఇప్పటికే గోదావరి వరదలను మళ్లించేలా స్పిల్ వే, స్పిల్ ఛానల్‌తోపాటు ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను ప్రభుత్వం పూర్తి చేసినందున కొత్త డయాఫ్రమ్ వాల్‌ను సులభంగా నిర్మించవచ్చని నిపుణుల బృందం అభిప్రాయపడింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) నియమించిన యూఎస్ఏకు చెందిన డేవిడ్ బి.పాల్, గియాస్ ఫ్రాంకో డి సిస్కో, కెనడాకు చెందిన రిచర్డ్ డొన్నెళ్లీ, సీస్ హించ్‌బెర్గర్, కాంట్రాక్టు సంస్థ మేఘా నియమించిన అంతర్జాతీయ కన్సల్టెంట్ యాఫ్రి సంస్థ (స్వీడన్) ప్రతినిధులు నాలుగు రోజులపాటు ప్రాజెక్టును పరిశీలించి, అధికారులతో సమీక్షించారు. బుధవారం మరోసారి సమీక్షించిన అనంతరం నిపుణుల బృందంతో సీడబ్ల్యూసీ చైర్మన్ వోరా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. గతంలో వరదను మళ్లించేలా స్పిల్ వే పూర్తి చేయకుండా, ఎగువ కాఫర్ డ్యామ్‌ను చేపట్టి ఇరు వైపులా ఖాళీ వదిలేయడం వల్లే వరద ఉద్ధృతి మరింత పెరిగి డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని అంతర్జాతీయ నిపుణులు సీడబ్ల్యూసీ చైర్మన్‌కు తేల్చి చెప్పారు. గ్యాప్–2లో 1396 మీటర్ల పొడవున డయాఫ్రమ్ వాల్ నాలుగు చోట్ల కోతకు గురై 485 మీటర్ల మేర దెబ్బతిందని నేషనల్ హైడ్రోపవర్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌పీసీ) ఇచ్చిన నివేదికతో ఈ బృందం ఏకీభవించింది. ప్రాజెక్టు భద్రత దృష్ట్యా డయాఫ్రమ్ వాల్‌కు సమాంతరంగా కొత్తది నిర్మించడం శ్రేయస్కరమని సూచించింది.జెట్ గ్రౌటింగ్‌లో లోపం వల్లే లీకేజీలుఎగువ కాఫర్ డ్యామ్ నిర్మాణానికి ముందు జెట్ గ్రౌటింగ్ చేసేటప్పుడు ఆ ప్రదేశంలో ఇసుక సాంద్రతను తప్పుగా అంచనా వేశారని ఈ బృందం తెలిపింది. అందువల్లే తక్కువ లోతు నుంచి స్టోన్ కాలమ్స్ వేసి, జెట్ గ్రౌటింగ్ చేశారని, దీనివల్లే లీకేజీలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. లీకేజీలకు కారణాలు కనుక్కోవడానికి కాఫర్ డ్యామ్ పైనుంచి 100 నుంచి 150 మీటర్లకు ఒక చోట మొత్తం 17 చోట్ల బోర్ హోల్స్ వేసి పరీక్షలు చేయాలని సూచించామని తెలిపింది. యాఫ్రి సంస్థ ఇప్పటికే నాలుగు చోట్ల పరీక్షలు చేసిందని వివరించింది. ఆ పరీక్షల ఫలితాలను విశ్లేషిస్తే.. లీకేజీలను పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయలేమని, కొంతవరకు అడ్డుకోవచ్చని అభిప్రాయపడింది. కొంతవరకు లీకేజీలు ఉన్నప్పటికీ కొత్త డయాఫ్రమ్‌వాల్ నిర్మాణానికి, ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని వివరించింది.ముగిసిన అంతర్జాతీయ నిపుణుల పర్యటనఅంతర్జాతీయ నిపుణుల నాలుగు రోజుల పోలవరం పర్యటన బుధవారం ముగిసింది. వారు బుధవారం విజయవాడ చేరుకున్నారు. గురువారం ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి చేరుకుని, అక్కడి నుంచి వారి దేశాలకు వెళ్తారు. రెండు వారాల్లో మధ్యంతర నివేదికపోలవరం ప్రాజెక్టు పరిశీలన, అధికారులతో సమీక్షలో వెల్లడైన అంశాల ఆధారంగా సవాళ్లను అధిగమించడం, నిర్మాణాల డిజైన్లపై రెండు వారాల్లోగా మధ్యంతర నివేదిక ఇస్తామని నిపుణుల బృందం తెలిపింది. ఆ నివేదిక ఆధారంగా కాంట్రాక్టు సంస్థ అంతర్జాతీయ కన్సల్టెంట్ యాఫ్రి సంస్థ సవాళ్లను అధిగమించడానికి చేపట్టాల్సిన నిర్మాణాల డిజైన్లను రూపొందించి తమకు పంపితే.. తాము పరిశీలించి మార్పులుంటే సూచిస్తామని చెప్పింది. యాఫ్రి, తాము ఏకాభిప్రాయంతో నిర్ణయించిన డిజైన్‌ను సీడబ్ల్యూసీకి పంపుతామని తెలిపింది. ఆ డిజైన్‌ను సీడబ్ల్యూసీ క్షుణ్ణంగా పరిశీలించి, ఆమోదించాకే దాని ప్రకారం పనులు చేపట్టాలని సూచించింది. ఇందుకు సీడబ్ల్యూసీ చైర్మన్ వోరా అంగీకరించారు. నిపుణల బృందం మధ్యంతర నివేదిక ఇచ్చాక ఢిల్లీలో మరోసారి రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు, కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు, అంతర్జాతీయ నిపుణులతో సమావేశం నిర్వహిస్తామని వోరా చెప్పారు. -
జీవనాడిపై దాడి!
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు మన రాష్ట్రానికి జీవనాడి. గరిష్టంగా 194.6 టీఎంసీల సామర్థ్యంతో గోదావరిపై నిర్మిస్తున్న అతి పెద్ద జలాశయం ఇదే. కుడి, ఎడమ కాలువ ద్వారా 7.2 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించడంతో గోదావరి, కృష్ణా డెల్టాల్లో 23.5 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించవచ్చు. ఎడమ కాలువ నుంచి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం ద్వారా 8 లక్షల ఎకరాలకు నీళ్లందించ వచ్చు. విశాఖ నగరం పారిశ్రామిక, తాగునీటి అవసరాలను తీర్చవచ్చు. ప్రాజెక్టులో నిర్మించే జలవిద్యుత్కేంద్రంలో 960 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేయవచ్చు. పోలవరం పూర్తయితే రాష్ట్రం రూపురేఖలు సమూలంగా మారిపోవడం ఖాయం. దేశంలో ఈ స్థాయిలో సాగునీరు, తాగునీరు, విద్యుత్తు అవసరాలను తీర్చే బహుళార్థ సాధక ప్రాజెక్టు మరొకటి లేదు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి 2005లో ప్రారంభించిన పోలవరాన్ని విభజన నేపథ్యంలో 2014లో కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. తామే వంద శాతం ఖర్చుతో పూర్తి చేస్తామని హామీ ఇచి్చంది. విభజన చట్టం ప్రకారం కేంద్రమే పూర్తి చేయాల్సిన పోలవరం నిర్మాణ బాధ్యతలను కేంద్రానికి ప్రత్యేక హోదా తాకట్టు పెట్టి మరీ 2016 సెప్టెంబరు 7న అధికారంలో ఉండగా చంద్రబాబు దక్కించుకున్నారు. 2013–14 ధరల ప్రకారం రూ.20,946 కోట్లతోనే ప్రాజెక్టును పూర్తి చేస్తానని నమ్మబలికి కేంద్రానికి హామీ ఇచ్చారు. 2014 ఏప్రిల్ 1 వరకూ ఖర్చు చేసిన రూ.4,730.71 కోట్లు పోనూ మిగతా రూ.15,667 కోట్లే ఇస్తామని కేంద్రం తెగేసి చెబితే దానికీ చంద్రబాబు తలూపారు. సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) ఖరారు చేసిన ప్రాజెక్టు నిర్మాణ ప్రణాళికను కమీషన్ల దాహంతో తుంగలో తొక్కి పనులు చేపట్టారు. వరదను మళ్లించేలా స్పిల్‌వే, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను పూర్తి చేయకుండానే ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పునాది డయాఫ్రమ్‌వాల్‌ను నిర్మించారు. చివరకు ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను పూర్తి చేయలేక ఇరువైఫులా ఖాళీ ప్రదేశాలను వదిలేసి 2019 ఫిబ్రవరిలో చేతులెత్తేశారు. ఈ నిర్వాకాల కారణంగా 2019 జూన్ తర్వాత గోదావరిలో పోటెత్తిన భారీ వరద కాఫర్ డ్యామ్‌ల ఖాళీల మీదుగా అధిక ఉద్ధృతితో ప్రవహించడంతో డయాఫ్రమ్‌వాల్ దెబ్బతింది. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో ఇసుక తిన్నెలు కోతకు గురై భారీ అగాధాలు ఏర్పడ్డాయి. ఇదే పోలవరం పనులను అత్యంత సంక్లిష్టంగా మార్చింది. స్పిల్‌వే, కాఫర్ డ్యామ్‌ల పనులను చంద్రబాబు గాలికొదిలేసి డయాఫ్రమ్‌వాల్‌ను నిర్మించడమే ఈ క్లిష్ట పరిస్థితికి మూల కారణం. జీవం తీసిన వారే బురద జల్లుతున్నారు తాజాగా పోలవరాన్ని సందర్శించిన సీఎం చంద్రబాబు జీవనాడి లాంటి ప్రాజెక్టును వైఎస్ జగన్ విధ్వంసం చేశారంటూ నిస్సిగ్గుగా బుకాయించారు. కమీషన్లకు ఆశపడి పోలవరం జీవం తీసిన చంద్రబాబు దీన్ని కప్పిపుచ్చి జీవం పోసిన వైఎస్ జగన్‌పై బురద జల్లే యత్నం చేయడాన్ని సాగునీటిరంగ నిపుణులు తప్పుబడుతున్నారు.అక్రమాలు అరికట్టి కీలక పనులు పూర్తి.. 2019 మే 30న వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి టీడీపీ సర్కార్ చేసిన చారిత్రక తప్పిదాలను సరిచేస్తూ ప్రణాళికాబద్ధంగా ప్రాజెక్టు పనులు చేపట్టారు. పీపీఏ, సీడబ్ల్యూసీ అభ్యంతరాలను బేఖాతర్ చేస్తూ రూ.2,917 కోట్ల విలువైన పనులను నవయుగకు నాడు చంద్రబాబు సర్కార్ నామినేషన్‌పై కట్టబెట్టింది. వీటితోపాటు జలవిద్యుత్కేంద్రం పనుల కాంట్రాక్టు ఒప్పందాన్ని రద్దు చేసి రివర్స్ టెండరింగ్ నిర్వహించడం ద్వారా రూ.783 కోట్లను ఖజానాకు వైఎస్ జగన్ ఆదా చేశారు. రాత్రిపూట కాఫర్ డ్యామ్ పనులు చేస్తున్న దృశ్యం (ఫైల్) నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తూ స్పిల్‌వే, స్పిల్ చానల్, అప్రోచ్ ఛానల్, పైలట్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను పూర్తి చేసి 2021 జూన్ 11నే గోదావరి ప్రవాహాన్ని స్పిల్ వే మీదుగా 6.1 కి.మీ. పొడవున మళ్లించారు. కుడి, ఎడమ కాలువలను జలాశయంతో అనుసంధానించే కనెక్టివిటీస్ను పూర్తి చేశారు. ఎడమ కాలువలో వరాహ నదిపై అత్యంత పొడవైన అక్విడెక్టుతోసహా కీలకమైన పనులను విజయవంతంగా పూర్తి చేశారు. జలవిద్యుత్కేంద్రం పనులను సైతం కొలిక్కి తెచ్చారు. ఈసీఆర్ఎఫ్ నిర్మాణ ప్రాంతంలో అగాధాలను సీడబ్ల్యూసీ మార్గదర్శకాల మేరకు ఇసుకతో పూడ్చి వైబ్రో కాంపాక్షన్ చేస్తూ యథాస్థితికి తెచ్చారు. ఇక డయాఫ్రమ్‌వాల్ భవితవ్యాన్ని తేల్చితే 18 నెలల్లోగా ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామని 2022 డిసెంబర్ నుంచి వైఎస్ జగన్ కేంద్రాన్ని కోరుతూ వచ్చారు. అయితే అంతర్జాతీయ సాంకేతిక నిపుణుల సహకారం తీసుకుని డిజైన్లు ఖరారు చేసి పనులు చేపట్టేలా సీడబ్ల్యూసీ ప్రణాళిక రచించింది. 2017–18 ధరల ప్రకారం భూసేకరణ, నిర్వాసితుల పునరావాసం వ్యయమే రూ.33,168.23 కోట్లని, అందువల్ల 2013–14 ధరల ప్రకారం రూ.20,946 కోట్లతో ప్రాజెక్టును పూర్తి చేయడం అసాధ్యమని ప్రధాని మోదీకి నాడు సీఎం హోదాలో వైఎస్ జగన్ అనేక సార్లు విన్నవించారు. ఈ క్రమంలో తాజా ధరల మేరకు నిధులిచ్చి పోలవరం పూర్తికి సహకరించాలన్న వైఎస్ జగన్ వినతిపై ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారు. ప్రధాని ఆదేశాల మేరకు పోలవరం తొలి దశ పూర్తికి రూ.12,157.53 కోట్లు విడుదల చేయాలని కేంద్ర జల్ శక్తి శాఖ మార్చి 6న కేంద్ర కేబినెట్‌కు ప్రతిపాదన పంపింది. అయితే అప్పటికే బీజేపీతో టీడీపీ–జనసేనకు పొత్తు కుదిరింది. ఈ నేపథ్యంలో పోలవరానికి నిధులు మంజూరు చేస్తూ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపితే అది ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి అనుకూలంగా మారుతుందని, అందువల్ల దాన్ని ఆపేయాలని బీజేపీ అధిష్టానంపై చంద్రబాబు ఒత్తిడి తెచ్చారు. ఇలా అడ్డుపుల్ల వేయడంతో నిధుల విడుదల ప్రతిపాదనను కేంద్ర కేబినెట్ పక్కన పెట్టింది. జలవిద్యుత్కేంద్రంపోలవరం ఈసీఆర్ఎఫ్ డ్యామ్‌కు ఎడమ వైపున 960 మెగావాట్ల సామర్థ్యంతో జలవిద్యుత్కేంద్రాన్ని నిర్మించాలి. ఎడమ వైపు ఉన్న కొండను తొలిచి 12 ప్రెజర్ టన్నెల్స్ తవ్వి టర్బైన్లను అమర్చి విద్యుత్కేంద్రాన్ని పూర్తి చేయాలి.2014–19: టీడీపీ హయాంలోజలవిద్యుత్కేంద్రం నిర్మాణ పనుల్లో కొండను తొలిచే పనుల్లో కేవలం 25 శాతం మాత్రమే చేసి టీడీపీ సర్కార్ చేతులు దులుపుకొంది.2019–24: వైఎస్సార్ సీపీ పాలనలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జలవిద్యుత్కేంద్రం పనులు శరవేగంగా సాగాయి. కొండను తొలిచే పనులను యుద్ధప్రాతిపదిక పూర్తి చేసి 12 ప్రెజర్ టన్నెల్స్‌ను పూర్తి చేసింది. టర్బైన్లను అమర్చడానికి అవసరమైన అన్ని పనులు పూర్తి చేసింది. టర్బైన్ల తయారీ బాధ్యతను బీహెచ్ఈఎల్కు అప్పగించింది. జలవిద్యుత్కేంద్రం పనులను దాదాపుగా కొలిక్కి తెచి్చంది. పోలవరం జలాశయం పనులు పూర్తయ్యేలోగా విద్యుదుత్పత్తి ప్రారంభించే విధంగా జలవిద్యుత్కేంద్రం పనులను వేగవంతం చేసింది. 2014–19: టీడీపీ హయాంలో ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను నిర్మించకముందే ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్–2లో పునాది డయాఫ్రమ్‌వాల్‌ను 1,396 మీటర్ల పొడవున పూర్తి చేసిన చంద్రబాబు 2018 జూన్ 11న జాతికి అంకితం చేశారు. ఎగువ కాఫర్ డ్యామ్ నిర్మించాలంటే 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలో ముంపునకు గురయ్యే 54 గ్రామాల్లోని 20,946 కుటుంబాలకు పునరావాసం కల్పించాలి. ఈమేరకు సీడబ్ల్యూసీ, పీపీఏకు హామీ ఇచ్చిన చంద్రబాబు సర్కార్ 2018 నవంబర్‌లో ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల పనులు ప్రారంభించింది. అయితే రూ.484 కోట్లు ఖర్చు చేసి కేవలం 3,110 కుటుంబాలకు మాత్రమే పునరావాసం కల్పించారు. మిగతా నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండా, కాఫర్ డ్యామ్‌లకు ఇరువైపులా ఖాళీ ప్రదేశాన్ని వదిలేసిన చంద్రబాబు సర్కార్ ఆ పనులను పూర్తి చేయలేక చేతులెత్తేసింది. 2019 జూన్‌లో ప్రారంభమైన గోదావరి వరద ప్రవాహానికి ఎగువ కాఫర్ డ్యామ్ అడ్డంకిగా మారింది. దాంతో కాఫర్ డ్యామ్ ఖాళీ ప్రదేశాల గుండా అధిక ఉద్ధృతితో ప్రవహించడంతో గ్యాప్–2లో డయాఫ్రమ్‌వాల్ నాలుగు చోట్ల కోతకు గురై 485 మీటర్ల పొడవున దెబ్బతింది. ఈసీఆర్ఎఫ్ నిర్మాణ ప్రాంతంలో సగటున 26 మీటర్ల నుంచి 36.5 మీటర్ల లోతు వరకు భారీ అగాధాలు ఏర్పడ్డాయి.2019–24: వైఎస్సార్ సీపీ పాలనలో ఎగువ కాఫర్ డ్యామ్ ప్రభావం వల్ల ముంపునకు గురయ్యే 8,446 కుటుంబాలకు రూ.1,670 కోట్లతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం పునరావాసం కల్పించింది. ఆ తర్వాత ఎగువ కాఫర్ డ్యామ్‌ను 43 మీటర్ల ఎత్తుతో, దిగువ కాఫర్ డ్యామ్‌లో కోతకు గురైన ప్రాంతాన్ని సీడబ్ల్యూసీ మార్గదర్శకాల మేరకు 31.5 మీటర్ల ఎత్తుతో పూర్తి చేసింది. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లతోపాటు 2.1 కి.మీ. పొడవున అప్రోచ్ ఛానల్, 2.92 కి.మీ. పొడవున స్పిల్ ఛానల్, వెయ్యి మీటర్ల పొడవున పైలట్ ఛానల్‌ను పూర్తి చేసి 2021 జూన్ 11న గోదావరి ప్రవాహాన్ని మళ్లించింది.స్పిల్ వేగోదావరికి 50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా సులభంగా దిగువకు విడుదల చేసేలా స్పిల్‌వేను నిర్మించాలి. ప్రాజెక్టు పనుల్లో తొలుత పూర్తి చేయాల్సింది స్పిల్ వేనే. 1,118 మీటర్ల పొడవు, 53.32 మీటర్ల ఎత్తుతో నిర్మించే స్పిల్ వేకు 25.72 మీటర్ల నుంచి 45.72 మీటర్ల వరకూ 20 మీటర్ల ఎత్తు, 16 మీటర్ల వెడల్పుతో గేట్లు అమర్చాలి. వరద వచి్చనప్పుడు దిగువకు విడుదల చేయడానికి వీలుగా అత్యాధునిక హైడ్రాలిక్ హాయిస్ట్‌లను గేట్లకు అమర్చాలి. ప్రపంచంలో గరిష్టంగా వరద జలాలను దిగువకు విడుదల చేసే అతి పెద్ద స్పిల్ వే పోలవరంలోనే ఉంది.2014–19: టీడీపీ హయాంలో 2014 జూన్ 8న సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు 2016 డిసెంబర్ 30న స్పిల్ వే పనులను ప్రారంభించారు. టీడీపీ అధికారం కోల్పోయే నాటికి అంటే 2019 మే 29 నాటికి స్పిల్ వే పనులు పునాది స్థాయిని కూడా దాటలేదు. స్పిల్ వేలో కేవలం రెండు (39, 40) పియర్స్‌ను 30 మీటర్ల వరకూ చేసి వాటి మధ్య ఒక ఇనుప రేకు పెట్టి గేట్ అమర్చినట్లు 2018 డిసెంబర్ 24న చంద్రబాబు ఘనంగా ప్రకటించుకున్నారు.2019–2024: వైఎస్సార్సీపీ పాలనలో2019 మే 30న సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేశారు. అదే ఏడాది జూన్‌లో ప్రారంభమైన వరద ప్రవాహం నవంబర్ వరకూ కొనసాగింది. 2020 మార్చి నుంచి 2021 వరకూ కరోనా మహమ్మారి విరుచుకు పడింది. అయితే గోదావరి వరదలు, కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ వైఎస్ జగన్ రికార్డు సమయంలో స్పిల్ వేను పూర్తి చేశారు. లాక్‌డౌన్‌లోనూ జర్మనీ, జపాన్ నుంచి హైడాల్రిక్ హాయిస్ట్ సిలిండర్లను దిగుమతి చేసుకుని స్పిల్ వేకు 48 గేట్లను బిగించారు. 2021 జూన్ 11న గోదావరి వరదను స్పిల్ వే మీదుగా విజయవంతంగా మళ్లించారు. -
జీవనాడి సాక్షిగా నిజాలు గోదాట్లోకి
సాక్షి, అమరావతి: పోలవరం సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు వాస్తవాలను గోదాట్లో కలిపేశారు. 2014–19 మధ్య అధికారంలో ఉండగా కమీషన్లకు ఆశ పడి తాను చేసిన తప్పిదాల వల్ల ప్రాజెక్టులో జరిగిన విధ్వంసం.. ఫలితంగా పనుల్లో జరుగుతున్న జాప్యాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వంపై నెడుతూ నిస్సిగ్గుగా అబద్ధాలు వల్లించారు. చంద్రబాబు సర్కార్ చేసిన తప్పులను సరిదిద్దుతూ.. కరోనా లాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ స్పిల్‌వే, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్, పైలట్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను పూర్తిచేసి 2021 జూన్ 11నే గోదావరి వరద ప్రవాహాన్ని స్పిల్‌వే మీదుగా 6.1 కిమీల పొడవున వైఎస్ జగన్ ప్రభుత్వం మళ్లించింది. గోదావరి వరదను మళ్లించేలా స్పిల్‌వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు పూర్తి చేయకుండా ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ గ్యాప్–2లో 1,396 మీటర్ల పొడవున డయాఫ్రమ్‌వాల్ నిర్మించడం ద్వారా చంద్రబాబు సర్కార్ చారిత్రక తప్పిదానికి పాల్పడిందని.. ఆ తప్పు జరిగి ఉండకపోతే 2022 నాటికే అప్పటి సీఎం వైఎస్ జగన్ పోలవరాన్ని పూర్తి చేసి ఉండేవారని సాగునీటిరంగ నిపుణులు, అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక చంద్రబాబు తొలిసారిగా పోలవరం పనులను సోమవారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. చారిత్రక తప్పిదంతో కోతకు గురైన డయాఫ్రమ్ వాల్⇒ విభజన చట్టం ప్రకారం కేంద్రమే నిర్మించాల్సిన పోలవరాన్ని కమీషన్లకు ఆశ పడి దక్కించుకున్న చంద్రబాబు సర్కార్ ప్రాజెక్టు నిర్మాణ ప్రణాళికను తుంగలో తొక్కింది. సులభంగా చేయగలిగి, కాంట్రాక్టర్లకు అధికంగా లాభాలు వచ్చే పనులకే ప్రాధాన్యత ఇచ్చింది. ⇒ ప్రపంచంలో ఎక్కడైనా వరదను మళ్లించేలా స్పిల్‌వే, కాఫర్ డ్యామ్‌లు కట్టాకే ప్రధాన డ్యామ్ పనులు చేపడతారు. 2014–19 మధ్య పోలవరంలో చంద్రబాబు సర్కార్ అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించింది. గోదావరి వరదను మళ్లించే స్పిల్‌వే పునాది స్థాయి కూడా దాటలేదు. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను ప్రారంభించనే లేదు. కానీ.. డ్యామ్ గ్యాప్–2లో పునాది డయాఫ్రమ్‌వాల్ పనులను 2017లో ప్రారంభించి 2018 జూన్ 11 నాటికి పూర్తి చేశారు. 35 మీటర్ల కాంటూర్ పరిధిలోని నిర్వాసితులకు పునరావాసం కల్పింస్తామంటు హామీ ఇచ్చి 2018 నవంబర్‌లో ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ పనులను ప్రారంభించారు. ఇదే ప్రధాన డ్యామ్‌గా చిత్రీకరించి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ప్రయత్నించారు. ⇒ 2019 ఫిబ్రవరి నాటికి కూడా నిర్వాసితులకు పునరావాసం కల్పింంచకపోవడంతో పోలవరం ప్రాజెక్టు అథారిటీ, సీడబ్ల్యూసీ ఇదే అంశాన్ని ప్రస్తావిస్త⇒ నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తూ కాఫర్ డ్యామ్‌ల పనులు చేయాలని ఆదేశించింది. అయితే పునరావాసం కల్పింంచలేక ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లకు ఇరువైపులా ఖాళీ ప్రదేశాలను వదిలేసి పనులు ఆపేశారు. ⇒ 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించడంతో అదే ఏడాది మే 30న సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టారు. జూన్ రెండో వారంలోనే గోదావరికి వరద ప్రారంభమైంది. అంటే.. వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టడానికి, గోదావరి వరద ప్రారంభం కావడానికి మధ్య కేవలం 10 నుంచి 12 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ వ్యవధిలో కాఫర్ డ్యామ్‌లలో ఖాళీ ప్రదేశాలను భర్తీ చేయడం ఎలా సాధ్యమన్నది చంద్రబాబే చెప్పాలి. ⇒ గోదావరికి 2019లో భారీగా వరదలు వచ్చాయి. పోలవరం ఎగువ కాఫర్ డ్యామ్ వద్ద 2.4 కి.మీ. వెడల్పుతో ప్రవహించాల్సిన గోదావరి వరద.. కాఫర్ డ్యామ్‌లు వదిలిన 800 మీటర్ల ఖాళీ ప్రదేశానికి కుచించుకుపోయి ప్రవహించాల్సి రావడంతో వరద ఉద్ధృతి పెరిగి డయాఫ్రమ్‌వాల్‌లో నాలుగు చోట్ల కోతకు గురై 485 మీటర్ల పొడవున దెబ్బతింది. ఈసీఆర్ఎఫ్ నిర్మాణ ప్రాంతంలో ఇసుక తిన్నెలు కోతకు గురై గ్యాప్–1లో 35 మీటర్ల లోతు, గ్యాప్–2లో 26 నుంచి 36.50 మీటర్ల లోతుతో కూడిన అగాధాలు ఏర్పడ్డాయి. ⇒ వీటిన్నింటినీ అధ్యయనం చేసిన ఐఐటీ–హైదరాబాద్, నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ సంస్థలు మానవ తప్పిదం వల్లే పోలవరంలో విధ్వంసం చోటుచేసుకుందని తేల్చి చెప్పాయి. అంటే ఆ తప్పిదం చేసింది చంద్రబాబేనని తేల్చాయని సాగునీటిరంగ నిపుణులు పేర్కొంటున్నారు. విధ్వంసం వల్లే పనుల్లో జాప్యంనాడు చంద్రబాబు చారిత్రక తప్పిదాన్ని వైఎస్ జగన్ అధికారంలో ఉండగా సరిదిద్దేందుకు శ్రీకారం చుట్టారు. కేంద్ర జల్‌శక్తి శాఖ, పీపీఏ, సీడబ్ల్యూసీ అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ చంద్రబాబు సర్కార్ నిబంధనలకు విరుద్ధంగా నామినేషన్ పద్ధతిలో నవయుగకు అప్పగించిన రూ.2,917 కోట్ల విలువైన కాంట్రాక్టు ఒప్పందాన్ని 2019 జూలైలో వైఎస్ జగన్ రద్దు చేసి రివర్స్ టెండరింగ్ నిర్వహించారు. తద్వారా ఖజానాకు రూ.783.44 కోట్లు ఆదా చేశారు. గోదావరి వరద తగ్గాక 2019 నవంబర్‌లో వడివడిగా పనులు ప్రారంభించారు. అయితే 2020 మార్చి నుంచి 2021 చివరి వరక కరోనా మహమ్మారి విజృంభించడంతో దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించారు. అలాంటి ప్రతికూల పరిస్థితుల్లోన గోదావరి వరదను మళ్లించేలా స్పిల్‌వేను 48 గేట్లు బిగించడంతో సహా ఎగువ కాఫర్ డ్యామ్‌ను పూర్తి చేశారు. అప్రోచ్ ఛానల్, స్పిల్ ఛానల్, పైలట్ చానల్‌ను పూర్తి చేశారు. 2021 జూన్ 11న గోదావరి వరదను స్పిల్‌వే మీదుగా 6.1 కి.మీ.ల పొడవున మళ్లించారు. దిగువ కాఫర్ డ్యామ్‌లో కోతకు గురైన ప్రాంతాన్ని సీడబ్ల్యూసీ మార్గదర్శకాల మేరకు చేపట్టి పూర్తి చేశారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు పూర్తి కావడంతో ఈసీఆర్ఎఫ్ నిర్మాణ ప్రాంతంలో చేరిన నీటిని తోడివేసి వరదల ఉద్ధృతి వల్ల ఏర్పడిన అగాధాలను సీడబ్ల్యూసీ మార్గదర్శకాల మేరకు ఇసుకతో పూడ్చి వైబ్రో కాంపాక్షన్ చేస్త యథాస్థితికి తెచ్చారు. దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ స్థానంలో సమాంతరంగా కొత్తగా డయాఫ్రమ్‌వాల్ నిర్మించాలా? లేదంటే దెబ్బతిన్న చోట్ల ‘యూ’ ఆకారంలో డయాఫ్రమ్ వాల్ నిర్మించి అనుసంధానం చేయాలా? అనే విషయాన్ని సీడబ్ల్యూసీ తేల్చలేదు. సాంకేతికపరమైన ఈ అంశాన్ని తేల్చితే పనులు చేపట్టి వేగవంతంగా ఈసీఆర్ఎఫ్ పనులు పూర్తి చేస్తామని 2022 డిసెంబర్ నుంచి గత ప్రభుత్వం కేంద్ర జల్‌శక్తి శాఖ, సీడబ్ల్యూసీని కోరుత⇒ వచ్చింది. డయాఫ్రమ్ వాల్సహా ప్రాజెక్టు డిజైన్లపై కాంట్రాక్టు సంస్థ ఒక అంతర్జాతీయ ఏజెన్సీ సహకారం తీసుకోవాలని, తాము కూడా ఒక అంతర్జాతీయ ఏజెన్సీని ఏర్పాటు చేస్తామని.. రెండు సంస్థలు ఏకాభిప్రాయం వ్యక్తం చేసిన డిజైన్‌ను ఆమోదించి పనులు చేయాలని సీడబ్ల్యూసీకి చెబుత⇒ వచ్చింది. నాడు చంద్రబాబు చారిత్రక తప్పిదానికి పాల్పడకపోయి ఉంటే విధ్వంసం జరిగేదే కాదని.. ఇప్పుడు పనుల్లో జాప్యానికి అదే కారణమవుతోందని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక 2029 నాటికే.. వరదల ప్రభావం వల్ల నవంబర్ వరక⇒ పోలవరం పనులు చేపట్టడానికి సాధ్యం కాదు. డయాఫ్రమ్ వాల్ భవితవ్యాన్ని సీడబ్ల్యూసీ తేల్చితే నాలుగు సీజన్లలో పోలవరాన్ని పూర్తి చేయవచ్చని అధికారులు చెబుతున్నారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. నాటి టీడీపీ సర్కారు తప్పిదాలను వైఎస్ జగన్ చక్కదిద్దినప్పటికీ పోలవరాన్ని 2029 నాటికి గానీ పూర్తి చేయలేమని చంద్రబాబు అంగీకరించారని సాగునీటిరంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. కాఫర్ డ్యామ్‌ల లీకేజీల పాపం బాబు సర్కార్‌దే ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల పనులు చేపట్టడానికి వీలుగా లీకేజీలకు అడ్డుకట్ట వేయడానికి జెట్ గ్రౌటింగ్ చేయాలి. నిర్మాణ వ్యయాన్ని తగ్గించుకోవడం కోసం గోదావరి నదిలో ఇసుక ఫరి్మయబులిటీ విలువను 2018లో అప్పటి కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్ట్రాయ్ తప్పుగా మదింపు చేసింది. దాన్నే పరిగణనలోకి తీసుకుని 30 నుంచి 35 మీటర్ల లోతువరక⇒ స్టోన్ కాలమ్స్ వేసి జెట్ గ్రౌటింగ్ చేయకుండా కేవలం 20 మీటర్ల లోతు వరక⇒ జెట్ గ్రౌటింగ్ చేసేలా డిజైన్లు రూపొందించింది. నవయుగ సంస్థ ఆ మేరకే జెట్ గ్రౌటింగ్ చేసి కాఫర్ డ్యామ్‌ల నిర్మాణం చేపట్టింది. జెట్ గ్రౌటింగ్ నిబంధనల మేరకు చేసి ఉంటే ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లలో లీకేజీ సమస్య ఉత్పన్నమయ్యేది కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. తన హయాంలో జరిగిన ఈ తప్పిదాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వంపై నెట్టేందుకు సీఎం చంద్రబాబు యతి్నంచడం గమనార్హం. రూ.12,157.53 కోట్లకు మోకాలడ్డు పోలవరం నిర్మాణ బాధ్యతలను దక్కించుకునే క్రమంలో 2013–14 ధరల ప్రకారం ప్రాజెక్టును పూర్తి చేస్తానని 2016 సెపె్టంబరు 7న చంద్రబాబు కేంద్రానికి హామీ ఇచ్చారు. 2013–14 ధరల ప్రకారం పోలవరం అంచనా వ్యయం రూ.20,398.61 కోట్లే. ఇందులో 2014 ఏప్రిల్ 1 వరకు చేసిన వ్యయం రూ.4,730.71 కోట్లుపోను మిగతా రూ.15,667 కోట్లే ఇస్తామని కేంద్రం స్పష్టం చేసింది. అయితే 2017–18 ధరల ప్రకారం పునరావాసం, భూసేకరణ వ్యయమే రూ.33,168.23 కోట్లు ఉంది. అందువల్ల రూ.20,398.61 కోట్లతో ప్రాజెక్టును పూర్తి చేయడం అసాధ్యమని, తాజా ధరల మేరకు నిధులిచ్చి ప్రాజెక్టును పూర్తి చేయడానికి సహకరించాలని 2019 మే 30 నుంచి పలుదఫాలు ప్రధాని మోదీని అప్పటి సీఎం వైఎస్ జగన్ కోరుతూ వచ్చారు. దానికి ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారు. ప్రధాని ఆదేశాల మేరకు తొలి దశ పూర్తికి రూ.12,157.53 కోట్లు అవసరమని కేంద్ర జల్ శక్తి శాఖ తేల్చింది. ఆ మేరకు నిధులు విడుదల చేయాలని మార్చి 6న కేంద్ర కేబినెట్‌కు ప్రతిపాదన పంపింది. అప్పటికే బీజేపీతో పొత్తు కుదరడంతో పోలవరానికి నిధుల విడుదల ప్రతిపాదనను కేంద్ర కేబినెట్ ముందు పెట్టవద్దని, తమకు రాజకీయంగా ఇబ్బందులు వస్తాయంటూ చంద్రబాబు అడ్డుపుల్ల వేశారు. దీంతో అప్పట్లో కేంద్ర కేబినెట్ ఆ ప్రతిపాదనపై ఆమోదముద్ర వేయలేదు. ప్రస్తుతం ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న ఆ ప్రతిపాదనపై కేంద్ర కేబినెట్‌తో ఆమోదముద్ర వేయిస్తే నిధుల సమస్య తీరుతుందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. సాంకేతిక సమస్యల పరిష్కారానికి గత ప్రభుత్వం సీడబ్ల్యూసీ ద్వారా ఒక ప్రణాళికను సిద్ధం చేసింది. ఆ ప్రణాళికను అమలు చేయడం ద్వారా ప్రాజెక్టు పూర్తి చేయడానికి చర్యలు చేపట్టాలని సాగునీటిరంగ నిపుణులు సూచిస్తున్నారు. -
తెలంగాణలో సరైన ఫలితాలు రాలేదు: ఖర్గే అసంతృప్తి
సాక్షి,ఢిల్లీ: పార్టీ పవర్లో ఉన్న హిమాచల్‌ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకల్లో ఆశించిన మేర సీట్లు రాకపోవడంపై కాంగ్రెస్ నేషనల్ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం(జూన్8) ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశంలో ఆయన ఈ మేరకు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.‘అధికారంలో ఉన్న రాష్ట్రాలలో కాంగ్రెస్ సరైన ఫలితాలు సాధించలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మంచి ఫలితాలు లోక్‌సభ ఎన్నికల్లో కొనసాగలేదు. పార్టీ సామర్థ్యానికి, అంచనాలకు తగినట్లు రాణించలేదు. ఇలాంటి రాష్ట్రాలపై త్వరలోనే ప్రత్యేక సమీక్ష నిర్వహిస్తాం. అర్జెంటుగా వీటిని సరిదిద్దాల్సిన అవసరం ఉంది. సాంప్రదాయంగా కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉండే రాష్ట్రాల్లో ఎలాంటి పొరపాట్లు జరగడానికి వీల్లేదు. ఎన్నికల్లో ఇండియా కూటమి మంచి ఫలితాలు సాధించింది. ఇండియా కూటమి భవిష్యత్తులో కొనసాగాలి. ఎన్నికల ప్రచారంలో లేవనెత్తిన అంశాలను పార్లమెంటులో ప్రస్తావించాలి. కాంగ్రెస్ పార్టీపై ప్రజలు ఉంచిన నమ్మకం నిలబెట్టుకోవాలి. నిరంకుషత్వానికి వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారు. గత పదేళ్ల పాలనను ప్రజలు తిరస్కరించారు. భారత్ జోడో యాత్ర వల్ల కాంగ్రెస్ పార్టీ ఓట్లు, సీట్లు పెరిగాయి’అని ఖర్గే అన్నారు. -
ఆదమరిస్తే జల సంక్షోభమే!
సాక్షి, అమరావతి: వరద జలాలను ఒడిసి పట్టడం.. భూగర్భ జలాలను పెంపొందించడం వంటి జల సంరక్షణ చర్యలు చేపట్టకపోతే దేశంలో తీవ్ర జల సంక్షోభం తలెత్తే ప్రమాదముందని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఆందోళన వ్యక్తంచేసింది. గ్రీన్హౌస్ ప్రభావంవల్ల భూతాపం క్రమేణా పెరుగుతుండటం.. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు అధికమవుతుండటంవల్ల రుతుపవనాల గమనంపై తీవ్ర ప్రభావం చూపుతోందని దేశంలో నీటి లభ్యతపై ఇటీవల చేసిన తన అధ్యయనంలో పేర్కొంది. పర్యవసానమే అతివృష్టి.. అనావృష్టి పరిస్థితులతోపాటు వర్షపాత విరామాలు ఎక్కువగా ఏర్పడుతున్నాయని తెలిపింది. అతివృíÙ్ణ పరిస్థితులు ఏర్పడినప్పుడు వరద జలాలను ఒడిసిపట్టి జలాశయాలు నింపుకోలేకపోవడం.. భూగర్భ జలాలను పెంపొందించే చర్యలు చేపట్టకపోవడంవల్ల నీటి ఎద్దడికి దారితీస్తోందని వెల్లడించింది. ఫలితంగా సాగునీటితోపాటు తాగునీటికి ఇబ్బందులు తప్పవని హెచ్చరించింది. కర్ణాటక రాజధాని బెంగుళూరులో నెలకొన్న తీవ్రమైన నీటి ఎద్దడిని ఇందుకు ఉదహరిస్తోంది.ఇలాగైతే కష్టమే..! పరిస్థితి ఇలానే కొనసాగితే భవిష్యత్తులో సాగునీటికే కాదు.. తాగునీటికి కూడా తీవ్ర ఇబ్బందులు తప్పవని సీడబ్ల్యూసీ ఆందోళన వ్యక్తంచేసింది. సాగునీటి సమస్య పంటల సాగుపై ప్రభావం చూపుతుందని.. ఇది ఆహార సంక్షోభానికి దారితీస్తుందని పేర్కొంది. నీటి లభ్యతను పెంచేలా వరద నీటిని ఒడిసిపట్టి జలాశయాల్లో నిల్వచేయడం, జల సంరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా జల సంక్షోభాన్ని నివారించవచ్చని కేంద్రానికి సూచించింది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా దేశంలో మరిన్ని రిజర్వాయర్లు నిర్మించి.. నదీ జలాలను మళ్లించి వాటిని నింపడం ద్వారా నీటి లభ్యతను పెంచుకోవాలని స్పష్టంచేసింది. నీటిపారుదల సౌకర్యాలను మెరుగుపర్చుకోకుంటే ఆహార ధాన్యాల దిగుబడి పెరగదని తేలి్చచెప్పింది. అలాగే, ఏటా జనాభా పెరుగుతున్న నేపథ్యంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి కూడా పెరగకుంటే ఆహార సంక్షోభానికి కూడా దారితీస్తుందని సీడబ్ల్యూసీ హెచ్చరించింది.తలసరి నీటి లభ్యత తగ్గుముఖం.. ఇక దేశంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా తలసరి నీటి లభ్యత పెరగడంలేదనే అంశాన్ని కూడా సీడబ్ల్యూసీ ప్రస్తావించింది. తలసరి నీటి లభ్యత 2001లో 1,816 క్యూబిక్ మీటర్లు (ఒక క్యూబిక్ మీటర్ వెయ్యి లీటర్లకు సమానం) ఉంటే.. 2021 నాటికి 1,486 క్యూబిక్ మీటర్లకు తగ్గిపోయిందని వెల్లడించింది. అలాగే, నీటి లభ్యతను పెంచే చర్యలు చేపట్టకపోతే 2031 నాటికి 1,367 క్యూబిక్ మీటర్లకు, 2041 నాటికి 1,282 క్యూబిక్ మీటర్లకు, 2051 నాటికి 1,228 క్యూబిక్ మీటర్లకు తగ్గిపోతుందని అంచనా వేసింది.సీడబ్ల్యూసీ అధ్యయనంలో ఏం తేలిందంటే..దేశంలో నీటి లభ్యతపై సీడబ్ల్యూసీ అధ్యయనంలో వెల్లడైన అంశాలేమిటంటే.. » దేశంలో ఏటా సగటున 1,298.60 మి.మీ. వర్షపాతం కురుస్తోంది. తద్వారా 1,37,002.08 టీఎంసీల నీరు లభ్యమవుతోంది. » ఈ వర్షపాతంవల్ల గంగ, బ్రహ్మపుత్ర, గోదావరి, కృష్ణా నదుల్లో ప్రవాహం రూపంలో 70,591.75 టీఎంసీలు లభిస్తుండగా.. ప్రస్తుతం జలాశయాల ద్వారా 24,367.43 టీఎంసీలను మాత్రమే ఉపయోగించుకుంటున్నాం. » ఏటా 46,224.32 టీఎంసీలు కడలిలో కలిసిపోతున్నాయి. అంటే.. వాడుకుంటున్న నీటి కంటే దాదాపు రెండు రెట్లు అధికంగా నదీ జలాలు కడలిలో కలుస్తున్నట్లు వెల్లడవుతోంది. » దేశవ్యాప్తంగా వివిధ నదులపై నిర్మించిన 5,745 డ్యామ్‌ల నీటినిల్వ సామర్థ్యం 9,103.34 టీఎంసీలు. ఈ డ్యామ్‌లలో నీటిని నిల్వచేస్తూ సాగు, తాగునీటి అవసరాల కోసం 24,367.43 టీఎంసీలను వాడుకుంటున్నాం. » ఆంధ్రప్రదేశ్‌లో 166 డ్యామ్‌ల నిల్వ సామర్థ్యం 983.59 టీఎంసీలు. 1.05 కోట్ల ఎకరాలకు నీళ్లందించేలా ఆయకట్టును రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేసింది. -
పెన్నాలో అన్ని నీళ్లా?
సాక్షి, అమరావతి: వర్షఛాయ (రెయిన్ షాడో) ప్రాంతంలో పురుడుపోసుకుని ప్రవహించే పెన్నానదిలో 75 శాతం లభ్యత ఆధారంగా ఏటా 210.12 టీఎంసీల నీటి ప్రవాహం ఉందని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) తాజాగా తేల్చింది. 1985 నుంచి 2015 వరకు పెన్నానది పరీవాహక ప్రాంతం (బేసిన్)లో వర్షపాతం, ప్రవాహాల ఆధారంగా నీటిలభ్యతపై సీడబ్ల్యూసీ అధ్యయనం చేసింది. ఏటా పెన్నా బేసిన్లో కురిసే వర్షపాతం పరిమాణం 1,412.58 టీఎంసీలని లెక్కగట్టింది.వరద జలాలతో కలుపుకొంటే ఏటా 389.16 టీఎంసీల ప్రవాహం ఉంటుందని తేల్చింది. కానీ.. పెన్నాలో ఆ స్థాయిలో నీటిలభ్యత లేదని సాగునీటి రంగ నిపుణులు తేల్చి చెబుతున్నారు. బేసిన్లో 30 ఏళ్ల వర్షపాతం, ప్రవాహాల ఆధారంగా నీటిలభ్యతను లెక్కగట్టడం శాస్త్రీయం కాదంటున్నారు. వందేళ్లు లేదా కనీసం 50 ఏళ్ల వర్షపాతం, ప్రవాహాల ఆధారంగా చేసే అధ్యయనానికే శాస్త్రీయత ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. అప్పటికీ ఇప్పటికీ ఇదీ తేడా..పెన్నాలో నీటిలభ్యతపై 1993లో సీడబ్ల్యూసీ తొలిసారి అధ్యయనం చేసింది. 1944–45 సంవత్సరం నుంచి 1983–84 వరకు బేసిన్లో 40 ఏళ్ల వర్షపాతం, ప్రవాహాల ఆధారంగా అప్పట్లో నీటిలభ్యత లెక్కగట్టింది. వరద జలాలతో కలుపుకొంటే పెన్నాలో 223.18 టీఎంసీల లభ్యత ఉంటుందని తేల్చింది. పెన్నా బేసిన్ 55,213 చదరపు కిలోమీటర్లుగా పేర్కొంది. తాజాగా సీడబ్ల్యూసీ పెన్నా బేసిన్లో 1985–2015 మధ్య అంటే 30 ఏళ్లలో కురిసిన వర్షపాతం, ప్రవాహాల ఆధారంగా నీటి లభ్యత లెక్కగట్టింది. వరద జలాలతో కలిపితే 389.16 టీఎంసీల ప్రవాహం ఉంటుందని తేల్చింది.75 శాతం లభ్యత ఆధారంగా చూస్తే నదిలో 210.12 టీఎంసీలు ఉంటుందని పేర్కొంది. కానీ బేసిన్ మాత్రం 54,905 చదరపు కిలోమీటర్లకు తగ్గినట్లు గుర్తించింది. 1993తో పోలిస్తే బేసిన్ విస్తీర్ణం 308 చదరపు కిలోమీటర్లు తగ్గింది. పెన్నా బేసిన్లో 1944–84తో పోల్చితే 1985–2015 మధ్య వర్షపాతం అధికంగా ఉండటంవల్లే నీటిలభ్యత పెరిగిందని సీడబ్ల్యూసీ పేర్కొంది. దీన్ని సాగునీటిరంగ నిపుణులు కొట్టిపారేస్తున్నారు. కేవలం 30 ఏళ్ల వర్షపాతం, ప్రవాహాలను ఆధారంగా తీసుకోవడాన్ని తప్పుపడుతున్నారు. అధ్యయనం పరిధిని తగ్గించుకోవడం వల్లే నీటిలభ్యత పెరిగిందని, ఇది అశాస్త్రీయమని స్పష్టం చేస్తున్నారు. పెన్నా బేసిన్ ఇదీ..కర్ణాటకలో వర్షఛాయ ప్రాంతమైన చిక్‌బళ్లాపూర్ జిల్లా నందికొండల్లోని చెన్నకేశవ పర్వతశ్రేణుల్లో పుట్టిన పెన్నానది.. రాష్ట్రంలో వర్షాభావ ప్రాంతాలైన శ్రీసత్యసాయి, అనంతపురం, వైఎస్సార్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల మీదుగా 597 కిలోమీటర్లు ప్రవహించి ఊటుకూరు వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. ఎడమవైపు నుంచి జయమంగళ, కుందేరు, కుడివైపు నుంచి సగిలేరు, చిత్రావతి, పాపాఘ్ని, చెయ్యేరు ఉపనదులు పెన్నాలో కలుస్తాయి. పెన్నా బేసిన్లో 400 నుంచి 800 మిల్లీమీటర్ల వర్షపాతం కురుస్తుంది. ఈ బేసిన్ విస్టీర్ణం 54,905 చదరపు కిలోమీటర్లని సీడబ్ల్యూసీ తాజాగా తేల్చింది. ఇది దేశ భౌగోళిక విస్తీర్ణంలో 1.67 శాతానికి సమానం. -
మేడిగడ్డను పరిశీలించిన విచారణ కమిషన్
కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ బ్యారేజీ (లక్ష్మి) కుంగిపోయిన అంశంపై ఏర్పాటు చేసిన జ్యుడీíÙయల్ కమిషన్ చైర్మన్, రిటైర్డ్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ మంగళవారం.. మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించారు. ఆయన రాష్ట్ర ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి ప్రశాంత్ జీవన్‌పాటిల్‌తో కలసి మంగళవారం మధ్యాహ్నం 1.40 గంటలకు బ్యారేజీకి వద్దకు చేరుకున్నారు. బ్యారేజీ 7వ బ్లాక్‌లో కుంగిన 20వ నంబర్ పియర్.. దానికి అటూఇటూ ఉన్న 19, 21 పియర్లను.. వాటి కింది భాగంలో వచ్చిన పగుళ్లను పరిశీలించారు. వంతెనపై కాలినడకన వెళ్లి చూశారు. మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతిన్న పరిస్థితులు, పియర్ల కుంగుబాటు, ఇతర అంశాలపై ఇరిగేషన్ అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. తర్వాత ఎల్అండ్టీ క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. భోజనం చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై విచారణ కోసం వచ్చినట్టు తెలిపారు. ఇరిగేషన్ నిపుణులతో కలసి మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించామని, ఇందుకు సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్డీఎస్ఏ బృందం ఇచ్చిన నివేదికలను స్టడీ చేయాల్సి ఉందన్నారు. తాను ఇంజనీర్‌ను కాదని, టెక్నికల్ టీం వాటిని పరిశీలిస్తుందని వివరించారు.మేడిగడ్డకు ఇంకా గండమే!» బ్యారేజీకి మరింత ముప్పును తోసిపుచ్చలేమన్న నిపుణుల కమిటీ» తాత్కాలిక చర్యలను సిఫార్సు చేస్తూ మధ్యంతర నివేదిక» నివారణ చర్యలు తీసుకున్నా తాత్కాలికమేనని వెల్లడి» మూడు బ్యారేజీల గేట్లన్నీ ఎత్తి ఉంచాల్సిందేనని సూచనసాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్ వద్ద ప్రస్తుతం చేపట్టే ఎలాంటి చర్యలైనా తాత్కాలికమే నని.. మరింత దెబ్బతినకుండా ఉండటాకేనని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ పేర్కొంది. 7వ బ్లాక్ మరింత ప్రమాదానికి లోన య్యే అవకాశాలను తోసిపుచ్చలేమని పేర్కొంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై నీటి ఒత్తి డి పడకుండా.. వర్షాకాలం ప్రారంభానికి ముందే అన్ని గేట్లను పూర్తిగా పైకి ఎత్తి ఉంచాలని.. బ్యారేజీ ల దిగువన కొట్టుకుపోయిన సీసీ బ్లాకులు, అప్రాన్ లను పునరుద్ధరించాలని సూచించింది. మేడిగడ్డలో మొరాయించిన గేట్లను అవసరమైతే తొలగించాల ని స్పష్టం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల్లోని లోపాలపై అధ్యయనం చేసి, పునరుద్ధరణకు తీసు కోవాల్సిన చర్యలను సిఫారసు చేయడానికి ‘నేషన ల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ)’ అయ్యర్ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ కమిటీ పరిశీలన జరిపి.. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు అత్యవసరంగా చేపట్టాల్సిన తా త్కాలిక మరమ్మతులు, తదుపరి అధ్యయనా లను సిఫారసు చేస్తూ మధ్యంతర నివేదిక సమర్పించింది. ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్ ఈ నెల 1న రాష్ట్ర నీటిపారుదల శాఖకు ఈ నివేదికను పంపించారు.కుంగిపోయిన 7వ బ్లాక్‌కు సంబంధించి చేసిన సూచనలివీ..» పియర్లు, ర్యాఫ్ట్ ఫ్లోర్‌కు ఏర్పడిన పగుళ్లలో వచ్చే మార్పులను టెల్–టేల్స్ వంటి తగిన సాంకేతిక పరిజ్ఞానంతో నిరంతరం సమీక్షిస్తూ ఉండాలి.» 16 నుంచి 20వ నంబర్ వరకు పియర్లు స్వల్పంగా ఒరిగిపోవడం/ పగుళ్లు ఏర్పడటం జరిగింది. ఆ పగుళ్లు మరింత చీలకుండా తగిన రీతిలో బ్రేసింగ్ చేయాలి. అవసరమైతే బాక్స్ గ్రిడ్డర్, లాటిస్ గ్రిడ్డర్/ట్రస్ వంటిని వాడవచ్చు.» బ్యారేజీ పునాదిలోని ప్రెషర్ రిలీజ్ వాల్వŠస్ దెబ్బతిన్నాయి. మరమ్మతులైనా చేయాలి, కొత్తవైనా ఏర్పాటు చేయాలి.» బ్లాక్–7లోని అన్ని పియర్లపై ఆప్టికల్ టార్గెట్ పరికరాలను ఏర్పాటు చేసి, మార్పులను సమీక్షిస్తూ ఉండాలి.» ఎగువ, దిగువ సెకెంట్ పైల్స్, ఎగువ, దిగువ పారామెట్రిక్ జాయింట్ల పరిస్థితిని సమగ్రంగా మదించాలి.» దెబ్బతిన్న ప్లింత్ శ్లాబును తొలగించి నదీ గర్భాన్ని సరిచేయాలి. బ్యారేజీ కింద ఇసుక కొట్టుకుపోకుండా చూసే ఇన్వర్టెడ్ ఫిల్టర్లను తగిన ప్రాంతంలో ఏర్పాటు చేయాలి.» 7వ బ్లాక్‌కు దిగువన నదీ గర్భంలో షీట్‌పైల్స్‌ను 9 మీటర్ల లోతు వరకు ఏర్పాటు చేయాలి. ర్యాఫ్ట్ చివరి కొన, ప్లింత్ శ్లాబు, షీట్‌పైల్ ఉపరితల భాగం మధ్యలో సిమెంట్, ఇసుక మిశ్రమంతో సీల్ వేసినట్టు జాయింట్లు వేయాలి.» ర్యాఫ్ట్‌కు సాధ్యమైనంత తక్కువ సంఖ్యలో రంధ్రాలు చేసి... దాని దిగువన ఏర్పడిన ఖాళీల్లోకి ఇసుక, సిమెంట్, నీటి మిశ్రమాన్ని పంపి పూడ్చివేయాలి. -
ఎండుతున్న జలకళ
అనుకున్నంతా అయింది. విశ్లేషకులు భయపడుతున్నట్టే జరిగింది. మొన్న మార్చిలోనే దేశంలోని ప్రధాన జలాశయాలన్నీ అయిదేళ్ళలో ఎన్నడూ లేనంత కనిష్ఠ స్థాయికి అడుగంటినట్టు వార్తలు వచ్చి నప్పుడు వేసవిలో ఇంకెంత గడ్డుగా ఉంటుందో అని భయపడ్డారు. సరిగ్గా అప్పుడనుకున్నట్టే ఇప్పుడు దేశం నీటికొరత సంక్షోభంలోకి జారిపోతోంది. ఏప్రిల్ 25 నాటికి దేశవ్యాప్తంగా రిజర్వాయర్లలో నీటిమట్టం ఆందోళనకర స్థాయికి పడిపోయినట్టు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) తాజా లెక్కలు వెల్లడించాయి. ముఖ్యంగా, దక్షిణాదిలో పదేళ్ళలో ఎప్పుడూ లేనంత కనిష్ఠస్థాయికి జలాశ యాల్లో నీటి నిల్వలు పడిపోయాయి. సాగునీటికీ, తాగునీటికీ, జలవిద్యుత్ ఉత్పత్తికీ తిప్పలు తప్పేలా లేవు. ఆ సవాళ్ళకు సంసిద్ధం కావాల్సిన అవసరాన్ని గణాంకాలు గుర్తు చేస్తున్నాయి.దేశం మొత్తం మీద రిజర్వాయర్ల నిల్వ సామర్థ్యంలో కేవలం 30 శాతం వరకే ప్రస్తుతం నీళ్ళున్నాయని లెక్కలు చెబుతున్నాయి. ఇది గత ఏడాది కన్నా తక్కువ. అందుకే ఇప్పుడింతగా ఆందోళన. వర్షాకాలంలో 2018 తర్వాత అతి తక్కువ వర్షాలు పడింది గత ఏడాదే. దానికి తోడు ఎల్‌నినో వాతావరణ పరిస్థితి వల్ల గత వందేళ్ళ పైచిలుకులో ఎన్నడూ లేనంతగా నిరుడు ఆగస్టు గడిచి పోయింది. వర్షాలు కురిసినా, కొన్నిచోట్ల అతివృష్టి, మరికొన్నిచోట్ల అనావృష్టి. ఇవన్నీ కలిసి దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడ్డాయి. దీర్ఘకాలంగా వర్షాలు కొరవడడంతో నీటి నిల్వలు తగ్గి, అనేక ప్రాంతాలు గొంతు తడుపుకొనేందుకు నోళ్ళు తెరుస్తున్నాయి. హెచ్చిన ఉష్ణోగ్రతలు, తీవ్రమైన వడగాడ్పులు సైతం నీటిమట్టాలు వేగంగా పడిపోవడానికి కారణమయ్యాయి. దేశంలో తూర్పు ప్రాంతంలోని అస్సామ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో నీటి నిల్వలు కొంత మెరుగ్గా ఉన్నాయి కానీ, మిగతా ప్రాంతాల్లో పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. ప్రధానంగా తూర్పు, దక్షిణ భారత ప్రాంతాల్లో ఈ ప్రభావం అమితంగా కనిపిస్తోంది. కర్ణాటక, తమిళనాడు, కేరళతో పాటు తెలుగు రాష్ట్రాలకూ తిప్పలు తప్పడం లేదు. దక్షిణాదిలో దాదాపు 42 జలాశయాలను సీడబ్ల్యూసీ పర్యవేక్షిస్తుంటుంది. గత ఏడాది ఇదే సమయానికి వాటిలో 29 శాతం దాకా నీళ్ళున్నాయి. దశాబ్ద కాలపు సగటు గమనిస్తే, ఈ సమయానికి కనీసం 23 శాతమన్నా నీళ్ళుండేవి. కానీ, ఈ ఏడాది కేవలం 17 శాతానికి తగ్గిపోయాయి. దాన్నిబట్టి ప్రస్తుత గడ్డు పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. గుజరాత్, మహారాష్ట్రలున్న పశ్చిమ భారతావనిలోనూ అదే పరిస్థితి. అక్కడ సీడబ్ల్యూసీ పర్యవేక్షించే 49 రిజర్వాయర్లలో పదేళ్ళ సగటు 32.1 శాతం కాగా, నిరుడు నీటినిల్వలు 38 శాతం ఉండేవి. కానీ, ఈసారి అది 31.7 శాతానికి పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది మధ్య, ఉత్తర భారతావనుల్లోనూ జలాశయాల్లో నీళ్ళు అంతంత మాత్రమే. అక్కడ చారిత్రక సగటు నిల్వలతో పోలిస్తే, ఈసారి బాగా తక్కువగా ఉన్నాయట. మొత్తం మీద దేశంలోని ప్రధాన నదీపరివాహక ప్రాంతాల రీత్యా చూస్తే... నర్మద, బ్రహ్మపుత్ర, తాపీ నదీపరివాహక ప్రాంతాల్లో పరిస్థితి మాత్రం సాధారణ నిల్వస్థాయుల కన్నా మెరుగ్గా ఉంది. అయితే, కావేరీ నదీ పరివాహక ప్రాంతం, అలాగే మహానది, పెన్నా నదులకు మధ్యన తూర్పు దిశగా ప్రవహించే పలు నదీ క్షేత్రాలు తీవ్రమైన లోటును ఎదుర్కొంటున్నాయి. ఎండలు ముదిరి, వేసవి తీవ్రత హెచ్చనున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో పరిస్థితులు మరింత గడ్డుగా మారే ప్రమాదం లేకపోలేదు. ఇప్పటికే ఇవన్నీ రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయి. బెంగళూరు కొద్ది వారాలుగా తీవ్ర నీటి ఎద్దడి సమస్యలో కూరుకుపోయింది. విషయం జాతీయ వార్తగా పరిణమించింది. ఇక, తమిళనాట పలు ప్రాంతాల్లో నెర్రెలు విచ్చిన భూములు, ఎండిన జలాశయాలు, తాగునీటి కొరతతో బిందెడు నీళ్ళ కోసం ప్రజలు నిత్యం ఇబ్బంది పడుతున్న దృశ్యాలు ప్రత్యక్షమవుతున్నాయి. సహజంగానే నిత్యజీవితంతో పాటు వ్యవసాయ కార్యకలాపాలనూ ఈ నీటి నిల్వల కొరత బాధిస్తోంది. తగిన నీటి వసతి లేక వివిధ రకాల పంటలు, తోటలు దెబ్బతింటున్నాయి. ఇవాళ్టికీ భారత ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగం కీలకం. జలాశయాల్లో తగ్గిన నీటితో అది పెను సవాళ్ళను ఎదుర్కొంటోంది. ఇప్పటికీ మన దేశంలోని సేద్యపు భూముల్లో దాదాపు సగం వర్షపు నీటిపైనే ఆధారపడ్డాయి. రానున్న వర్షాకాలంలో సాధారణ స్థాయికి మించి వర్షపాతం నమోదవుతుందని అంచనా వెలువడింది. ఫలితంగా, ఋతుపవనాలు ఇప్పుడున్న చిక్కులను తొలగిస్తాయన్నది ఆశ. నిజానికి, దేశంలో జలవిద్యుదుత్పత్తి సైతం తగ్గుతూ వస్తోంది. విద్యుచ్ఛక్తి గిరాకీ విపరీతంగా ఉన్నప్పటికీ, గత ఆర్థిక సంవత్సరం తొలి పది నెలల్లో హైడ్రోపవర్ జనరేషన్ 17 శాతం పడిపోయింది. ఆ మాటకొస్తే, తగ్గుతున్న జలాశయాల నిల్వలు, పెరుగుతున్న ప్రజల నీటి అవసరాల రీత్యా గత కొన్ని దశాబ్దాలుగా ఆసియాలో, ప్రధానంగా చైనా, భారత్‌లలో జలవిద్యుదుత్పత్తి తగ్గుతోంది. ఈ పరిస్థితుల్లో జలసంరక్షణ కీలకం. ప్రభుత్వాలు, పాలకులు తక్షణం స్పందించి, దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే కష్టం. గృహవినియోగం మొదలు వ్యవసాయ పద్ధతులు, పారిశ్రామిక కార్యకలాపాల దాకా అన్ని స్థాయుల్లోనూ నీటి వృథాను తగ్గించి, ప్రతి నీటిబొట్టునూ ఒడిసిపట్టుకోవడం ముఖ్యం. నీటి నిల్వ, పంపిణీలు సమర్థంగా సాగేలా చూడాలి. సుస్థిర వ్యవసాయ విధానాలు, పంటల వైవి ధ్యంతో నీటి వినియోగాన్ని తగ్గించాలి. ఎప్పుడైనా వర్షాలు లేక, దుర్భిక్షం నెలకొన్నా తట్టుకొనే సామర్థ్యం పెంపొందించుకోవాలి. నీటి పొదుపు, ఇంకుడు గుంతల ఆవశ్యకత నుంచి వర్షపునీటి నిల్వల దాకా అన్నిటిపై ప్రజా చైతన్యం కలిగించాలి. గడ్డుకాలం కొనసాగితే, భవిష్యత్తులో నీటి కోసం యుద్ధాలు జరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో సత్వరమే మేలుకోవాలి. -
నాటి సీఎం స్థాయిలోనే నిర్ణయాలు!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంపై 2016లో నిర్వహించిన సమావేశాల్లో నాటి ముఖ్యమంత్రి స్థాయిలో నిర్ణయాలు తీసుకున్నట్టు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేత్వంలోని నిపుణుల కమిటీకి రాష్ట్ర నీటిపారుదల శాఖ నివేదించింది. ఆ నిర్ణయాలకు అనుగుణంగానే సవివర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)లను రూపొందించి కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఆమోదం కోసం పంపించామని తెలిపింది. అయితే ఆమోదం లభించకముందే నిర్మాణ పనులు ప్రారంభించామని వివరించింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల డిజైన్, నిర్మాణాలపై అధ్యయనం కోసం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఇటీవల చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. రెండో విడత రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఆ కమిటీ.. బుధవారం మధ్యాహ్నం 3.30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జలసౌధలో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, మాజీ అధికారులతో సుదీర్ఘంగా సమావేశమైంది. నీటి పారుదల శాఖ ఈఎన్సీ(జనరల్) అనిల్‌కుమార్, ఈఎన్సీ (ఓ అండ్ ఎం) బి.నాగేందర్రావు, మాజీ ఈఎన్సీలు సి.మురళీధర్, నల్లా వెంకటేశ్వర్లు తదితరులు ఈ సమావేశంలో పాల్గొని వివరాలు అందించారు. ‘నీటిపారుదల శాఖలో జనరల్, సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇంజనీర్, హైడ్రాలజీ విభాగాల పనితీరు, బాధ్యతలు ఏమిటి? ప్రభుత్వం–నీటిపారుదలశాఖకు మధ్య ఫైళ్ల రాకపోకలు ఎలా సాగుతాయి?’వంటి అంశాలను నిపుణుల కమిటీ అడిగి తెలుసుకుంది. నాణ్యత పర్యవేక్షణ ఎలా? ‘కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణానికి మూడేళ్ల గడువు ఉండగా.. రెండేళ్లలో ఎందుకు పూర్తి చేశారు? అంత వేగంతో పనులు చేస్తే నాణ్యతను ఎలా పర్యవేక్షించారు? బ్యారేజీల పునాదులు (ర్యాఫ్ట్)కు రక్షణగా తొలుత షీట్ పైల్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించి.. తర్వాత సెకెంట్ పైల్స్‌కు ఎందుకు మారారు? ఈ డిజైన్ మార్పులకు అప్రూవల్స్ తీసుకున్నారా?’అని బ్యారేజీ నిర్మాణంలో భాగస్వాములైన ఇంజనీర్లను అయ్యర్ కమిటీ ప్రశ్నించింది. ఎక్కడో తప్పిదం జరిగింది: మాజీ ఈఎన్సీ మురళీధర్ మేడిగడ్డ బ్యారేజీ పునాదుల(ర్యాఫ్ట్)కు దిగువన ఏర్పాటు చేసిన సెకెంట్ పైల్స్ (నిలువు స్తంభాలు) దిగువ నుంచి, లేదా వాటి మధ్య నుంచి ఇసుక కొట్టుకుపోవడంతోనే బ్యారేజీ కుంగిందని భావిస్తున్నానని అయ్యర్ కమిటీకి మాజీ ఈఎన్సీ (జనరల్) సి.మురళీధర్ వివరించారు. కావాలని ఎవరూ అలా చేయలేదని, అనుకోని రీతిలో ఎక్కడో తప్పిదం జరిగి ఉండవచ్చని కూడా ఆయన పేర్కొన్నట్టు సమాచారం. రామగుండం మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లుతో నిపుణుల కమిటీ విడిగా సమావేశమై బ్యారేజీల నిర్మాణంలో ఆయన అనుసరించిన విధానాన్ని అడిగి తెలుసుకుంది. తప్పులు ఎక్కడ జరిగి ఉంటాయి.. చెప్పండి! ‘బ్యారేజీల నిర్మాణంలో ఎక్కడ తప్పులు జరిగి ఉంటాయి? మీ అభిప్రాయం ఏమిటి?’అని నీటి పారుదల శాఖలోని వివిధ విభాగాల ఇంజనీర్లను అయ్యర్ కమిటీ ప్రశ్నించింది. ‘బ్యారేజీల గేట్లను ఎవరు ఆపరేట్ చేశారు? ఈఎన్సీల నుంచి ఏఈ వరకు వివిధ స్థాయిల్లోని ఇంజనీర్ల జాబ్ చార్ట్ ఏమిటి? నీటిపారుదల శాఖ హైపవర్ కమిటీ నిర్ణయాలు ఎలా తీసుకుంటుంది? డిజైన్లను ఎవరు సిఫారసు చేస్తారు? ఎవరు ఆమోదిస్తారు? బ్యారేజీల నిర్మాణానికి ముందు ఇన్వెస్టిగేషన్ జరిపిన వ్యాప్కోస్ వద్ద ఉన్న సాంకేతికత ఏమిటి? మోడల్ స్టడీస్ చేశారా? క్వాలిటీ కంట్రోల్ ఈఎన్సీ(ఓఅండ్ ఎం) పరిధిలోకి వస్తుందా? లేక ఈఎన్సీ (జనరల్) పరిధిలోకి వస్తుందా?’వంటి అంశాలనూ ఆరా తీసింది. బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి ప్రతి అంశంపై ప్రశ్నలు సంధించి ఎక్కడ లోపాలు జరిగి ఉంటాయనేది గుర్తించేందుకు ప్రయత్నించింది. ఈ పర్యటనలో భాగంగా గురు, శుక్రవారాల్లో సైతం నిపుణుల కమిటీ నీటి పారుదల శాఖ అధికారులతో సమావేశం కానుంది. అత్యవసర మరమ్మతులపై ఇప్పుడే చెప్పలేం.. బ్యారేజీలకు అత్యవసర మరమ్మతులను సూచించాలని ఈఎన్సీ(జనరల్) అనిల్‌కుమార్ విజ్ఞప్తి చేయగా.. ఈ అంశంపై సిఫారసులతో మధ్యంతర నివేదిక ఇవ్వడంపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని చంద్రశేఖర్ అయ్యర్ స్పష్టం చేశారు. బ్యారేజీలపై అధ్యయనం జరిపి, లోపాలను తెలుసుకోవడానికి ఎంత సమయం పడుతుందో ఇప్పుడే చెప్పలేమన్నారు. -
కాళేశ్వరం ఇంజనీర్లకు.. క్రాస్ ఎగ్జామినేషన్!
సాక్షి, హైదరాబాద్: ‘బ్యారేజీలను డిజైన్ల ప్రకారమే కట్టారా. డిజైన్లను ఉల్లంఘించి ఏమైన పనులు చేశారా? నిర్మాణంలో డిజైన్లు మార్చితే ఆమోదం తీసుకున్నారా? సరైన ఇన్వెస్టిగేషన్లు చేశారా ? భూసార పరీక్షల కోసం డైమండ్ డ్రిల్లింగ్ చేశారా ? ప్లానింగ్ ఏ విధంగా చేశారు ? క్వాలిటీ సర్టిఫికెట్ల జారీకి ముందు పరీక్షలు జరిపారా? క్వాలిటీ, ఎగ్జిక్యూషన్ విభాగాలు నిరంతరం క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించాయా? ..అంటూ కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణాల్లో పాల్గొన్న ఇంజనీర్లపై కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) రిటైర్డ్ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ ప్రశ్నించింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల డిజైన్లు, నిర్మాణంపై అధ్యయనం కోసం జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్ఏ) ఈ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. గత రెండు రోజులుగా క్షేత్ర స్థాయిలో బ్యారేజీలను పరిశీలించిన నిపుణుల కమిటీ శనివారం మూడో రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6:40 గంటల వరకు జలసౌధలో నిర్మాణం(ఎగ్జిక్యూషన్), క్వాలిటీ కంట్రోల్, డిజైన్స్ విభాగాల ఇంజనీర్లతో పాటు నిర్మాణ సంస్థతో విడివిడిగా సమావేశమై బ్యారేజీల నిర్మాణంలో వారి పాత్రపై ప్రశ్నలను సంధించింది. ఒక విభాగం ఇంజనీర్లు అందించిన సమాచారంలో నిజానిజాలను నిర్ధారించుకోవడానికి మరో విభాగం ఇంజనీర్లకు సంబంధిత ప్రశ్నలు వేసి క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైన 2016 నుంచి ఇప్పటి దాకా వాటి నిర్మాణంలో పాలుపంచుకున్న ఇంజనీర్లు, రిటైర్డ్ ఇంజనీర్లు, బదిలీ అయిన ఇంజనీర్లను కమిటీ ప్రశ్నించింది. కమిటీ ఇంజనీర్లను ప్రశి్నస్తున్న సమయంలో నీటిపారుదల శాఖ ఈఎన్సీలు, ఇతర ఉన్నత స్థాయి అధికారులను సైతం లోపలికి అనుమతించలేదు. డిజైన్లపై మరింత లోతుగా అధ్యయనం.. బ్యారేజీల నిర్మాణంలో కీలకమైన డిజైన్లపై మరింత లోతుగా అధ్యయనం చేయాల్సి ఉన్నందున వాటితో సంబంధం ఉన్న వారంతా సంబంధిత ఫైళ్లతో ఢిల్లీకి రావాలని చంద్రశేఖర్ అయ్యర్ ఆదేశించారు. భారీ సంఖ్యలో ఫైళ్లు, ఉద్యోగులను ఢిల్లీకి పంపించడం సాధ్యం కాదని, నిపుణుల కమిటీలో నుంచి ఎవరైనా మళ్లీ హైదరాబాద్‌కు వస్తే ఇంజనీర్లందరినీ పిలిపించి అవసరమైన ఇతర సమాచారాన్ని అందిస్తామని నీటిపారుదల శాఖ విజ్ఞప్తి చేయగా, అయ్యర్ సానుకూలంగా స్పందించారు. కమిటీకి ఈఆర్టీ, జీపీఆర్ టెస్టుల నివేదికలు.. మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన 7వ బ్లాక్‌కి సంబంధించిన 20 రకాల సమాచారాన్ని గతంలో ఎన్డీఎస్ఏ కోరింది. తాజాగా నిపుణుల కమిటీ మొత్తంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించిన ఇదే 20 రకాల సమాచారాన్ని సమర్పించాలని కోరగా, నీటిపారుదల శాఖ అందించింది. దాదాపు 90శాతం సమాచారాన్ని వెంటనే నాలుగు బ్యాగుల్లో నింపి అప్పగించామని, వాటి బరువు 100 కేజీల కంటే ఎక్కువే ఉంటుందని అధికారవర్గాలు తెలిపాయి. సాధ్యమైనంత త్వరగా మధ్యంతర నివేదిక ఇవ్వండి: ఈఎన్సీ(జనరల్) అనిల్ ప్రాణహిత నదికి ఏటా మే నుంచే వరదలు ప్రారంభమవుతాయని, బ్యారేజీలకి మరింత నష్టం జరగకుండా ఆ లోపే తీసుకోవాల్సిన తక్షణ చర్యలు, మరమ్మతులను సూచిస్తూ సాధ్యమైనంత త్వరగా మధ్యంతర నివేదికను అందించాలని నీటిపారుదల శాఖ ఈఎన్సీ(జనరల్) అనిల్‌కుమార్ నిపుణుల కమిటీకి విజ్ఞప్తి చేయగా, కమిటీ సానుకూలంగా స్పందించింది. నీటిపారుదల శాఖ అందించిన సమాచారంపై లోతుగా అధ్యయనం జరపడానికే కమిటీకి కనీసం నెల రోజుల సమయం పట్టనుందని అధికారులు అంటున్నారు. జాతీయ డ్యామ్ సేఫ్టీ చట్టం ప్రకారం వేసిన డ్యామ్ సేఫ్టీ రివ్యూప్యానల్(డీఎస్ఆర్పీ) తయారుచేసిన నివేదికను ఎన్డీఎస్ నిపుణుల కమిటీకి అందించారు. అన్నారం, సుందిళ్లలో సీపేజీల కట్టడికి గ్రౌటింగ్ చేయాలని, మేడిగడ్డ బ్యారేజీ అప్/ డౌన్ స్ట్రీమ్ సీసీ బ్లాకులతో పాటు బ్యారేజీ కుంగిన చోట అదనంగా సీకెంట్ పైల్స్, స్టీల్ పైల్స్ వేసి... తాత్కాలికంగా మరమ్మతులు చేయాలని ఆ కమిటీ నివేదిక ఇచ్చింది. ఇక వానాకాలంలో బ్యారేజీల గేట్లన్నీ తెరిచే ఉంచాలని, వరదలన్నీ పూర్తిస్థాయిలో తగ్గాకే గేట్లు దించాలని కమిటీ గుర్తు చేసింది. మాజీ ఈఎన్సీలు దూరం.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వాములైన రిటైర్డ్ ఇంజనీర్లు సైతం నిపుణుల కమిటీ ముందుకు హాజరు కావాలని నీటిపారుదల శాఖ ఆదేశించగా, ఇద్దరు మాజీ ఈఎన్సీలు సి. మురళీధర్, నల్లా వెంకటేశ్వర్లు దూరంగా ఉన్నారు. నిపుణుల కమిటీ పిలిస్తే వస్తానని పూర్వ ఈఎన్సీ (జనరల్) సి.మురళీధర్ సమ్మతి తెలిపి... హైదరాబాద్‌లోనే అందుబాటులో ఉండగా, ఆరోగ్యం బాగాలేదని మాజీ రామగుండం ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు హాజరు కాలేదు.