దేశంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పెరగని నీటి లభ్యత
2001లో తలసరి నీటి లభ్యత 1,816 క్యూబిక్ మీటర్లు
2021లో అది 1,486 క్యూబిక్ మీటర్లకు తగ్గుదల
2051 నాటికి 1,228కు తగ్గనున్న లభ్యత
ఇదే పరిస్థితి కొనసాగితే సాగునీటికే కాదు.. తాగునీటికీ కటకట
కేంద్ర జల సంఘం తాజా అధ్యయనంలో వెల్లడి
సాక్షి, అమరావతి: వరద జలాలను ఒడిసి పట్టడం.. భూగర్భ జలాలను పెంపొందించడం వంటి జల సంరక్షణ చర్యలు చేపట్టకపోతే దేశంలో తీవ్ర జల సంక్షోభం తలెత్తే ప్రమాదముందని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఆందోళన వ్యక్తంచేసింది. గ్రీన్‌హౌస్ ప్రభావంవల్ల భూతాపం క్రమేణా పెరుగుతుండటం.. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు అధికమవుతుండటంవల్ల రుతుపవనాల గమనంపై తీవ్ర ప్రభావం చూపుతోందని దేశంలో నీటి లభ్యతపై ఇటీవల చేసిన తన అధ్యయనంలో పేర్కొంది.
పర్యవసానమే అతివృష్టి.. అనావృష్టి పరిస్థితులతోపాటు వర్షపాత విరామాలు ఎక్కువగా ఏర్పడుతున్నాయని తెలిపింది. అతివృíÙ్ణ పరిస్థితులు ఏర్పడినప్పుడు వరద జలాలను ఒడిసిపట్టి జలాశయాలు నింపుకోలేకపోవడం.. భూగర్భ జలాలను పెంపొందించే చర్యలు చేపట్టకపోవడంవల్ల నీటి ఎద్దడికి దారితీస్తోందని వెల్లడించింది. ఫలితంగా సాగునీటితోపాటు తాగునీటికి ఇబ్బందులు తప్పవని హెచ్చరించింది. కర్ణాటక రాజధాని బెంగుళూరులో నెలకొన్న తీవ్రమైన నీటి ఎద్దడిని ఇందుకు ఉదహరిస్తోంది.
ఇలాగైతే కష్టమే..!
పరిస్థితి ఇలానే కొనసాగితే భవిష్యత్తులో సాగునీటికే కాదు.. తాగునీటికి కూడా తీవ్ర ఇబ్బందులు తప్పవని సీడబ్ల్యూసీ ఆందోళన వ్యక్తంచేసింది. సాగునీటి సమస్య పంటల సాగుపై ప్రభావం చూపుతుందని.. ఇది ఆహార సంక్షోభానికి దారితీస్తుందని పేర్కొంది. నీటి లభ్యతను పెంచేలా వరద నీటిని ఒడిసిపట్టి జలాశయాల్లో నిల్వచేయడం, జల సంరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా జల సంక్షోభాన్ని నివారించవచ్చని కేంద్రానికి సూచించింది.
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా దేశంలో మరిన్ని రిజర్వాయర్లు నిర్మించి.. నదీ జలాలను మళ్లించి వాటిని నింపడం ద్వారా నీటి లభ్యతను పెంచుకోవాలని స్పష్టంచేసింది. నీటిపారుదల సౌకర్యాలను మెరుగుపర్చుకోకుంటే ఆహార ధాన్యాల దిగుబడి పెరగదని తేలి్చచెప్పింది. అలాగే, ఏటా జనాభా పెరుగుతున్న నేపథ్యంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి కూడా పెరగకుంటే ఆహార సంక్షోభానికి కూడా దారితీస్తుందని సీడబ్ల్యూసీ హెచ్చరించింది.
తలసరి నీటి లభ్యత తగ్గుముఖం..
ఇక దేశంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా తలసరి నీటి లభ్యత పెరగడంలేదనే అంశాన్ని కూడా సీడబ్ల్యూసీ ప్రస్తావించింది. తలసరి నీటి లభ్యత 2001లో 1,816 క్యూబిక్ మీటర్లు (ఒక క్యూబిక్ మీటర్ వెయ్యి లీటర్లకు సమానం) ఉంటే.. 2021 నాటికి 1,486 క్యూబిక్ మీటర్లకు తగ్గిపోయిందని వెల్లడించింది. అలాగే, నీటి లభ్యతను పెంచే చర్యలు చేపట్టకపోతే 2031 నాటికి 1,367 క్యూబిక్ మీటర్లకు, 2041 నాటికి 1,282 క్యూబిక్ మీటర్లకు, 2051 నాటికి 1,228 క్యూబిక్ మీటర్లకు తగ్గిపోతుందని అంచనా వేసింది.
సీడబ్ల్యూసీ అధ్యయనంలో ఏం తేలిందంటే..
దేశంలో నీటి లభ్యతపై సీడబ్ల్యూసీ అధ్యయనంలో వెల్లడైన అంశాలేమిటంటే..
» దేశంలో ఏటా సగటున 1,298.60 మి.మీ. వర్షపాతం కురుస్తోంది. తద్వారా 1,37,002.08 టీఎంసీల నీరు లభ్యమవుతోంది.
» ఈ వర్షపాతంవల్ల గంగ, బ్రహ్మపుత్ర, గోదావరి, కృష్ణా నదుల్లో ప్రవాహం
రూపంలో 70,591.75 టీఎంసీలు లభిస్తుండగా.. ప్రస్తుతం జలాశయాల ద్వారా 24,367.43 టీఎంసీలను మాత్రమే ఉపయోగించుకుంటున్నాం.
» ఏటా 46,224.32 టీఎంసీలు కడలిలో కలిసిపోతున్నాయి. అంటే.. వాడుకుంటున్న నీటి కంటే దాదాపు రెండు రెట్లు అధికంగా నదీ జలాలు కడలిలో కలుస్తున్నట్లు వెల్లడవుతోంది.
» దేశవ్యాప్తంగా వివిధ నదులపై నిర్మించిన 5,745 డ్యామ్‌ల నీటినిల్వ సామర్థ్యం 9,103.34 టీఎంసీలు. ఈ డ్యామ్‌లలో నీటిని నిల్వచేస్తూ సాగు, తాగునీటి అవసరాల కోసం 24,367.43 టీఎంసీలను వాడుకుంటున్నాం.
» ఆంధ్రప్రదేశ్‌లో 166 డ్యామ్‌ల నిల్వ సామర్థ్యం 983.59 టీఎంసీలు. 1.05 కోట్ల ఎకరాలకు నీళ్లందించేలా ఆయకట్టును రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేసింది.
Comments
Please login to add a commentAdd a comment