గోదావరి.. అపార జలసిరి | Godavari has huge water bodies | Sakshi
Sakshi News home page

గోదావరి.. అపార జలసిరి

Published Fri, Sep 27 2024 5:38 AM | Last Updated on Fri, Sep 27 2024 5:38 AM

Godavari has huge water bodies

ఏటా సగటున 4,561.60 టీఎంసీల లభ్యత

తాజా అధ్యయనంలో తేల్చిన కేంద్ర జలసంఘం 

38 ఏళ్ల ప్రవాహాలను ఆధారంగా తీసుకుని అధ్యయనం.. ఇప్పటివరకు చేసిన అధ్యయనాలు చెప్పినదానికన్నా అధికంగా 
నీటి లభ్యత ఉన్నట్లు వెల్లడి

 సాక్షి, అమరావతి: గోదావరిలో జలసిరులు అపారంగా ఉన్నాయని కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) స్పష్టంచేసింది. ఏటా సగటున 4,561.60 టీఎంసీల లభ్యత ఉన్నట్లు తేల్చింది. గోదావరి నదీ పరీవాహక ప్రాంతం(బేసిన్‌)లో 1985–86 నుంచి 2022–23 మధ్య 38 ఏళ్ల ప్రవాహాలను ఆధారంగా చేసుకుని తాజాగా తాము నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం తేలిందని సీడబ్ల్యూసీ వెల్లడించింది. 

గోదావరిలో ఇప్పటివరకు ఏడుసార్లు నిర్వహించిన అధ్యయనాల్లో నిర్ధారించిన దానికంటే అధికంగా నీటి లభ్యత ఉందని ప్రకటించింది. దీనిపై అంతర్రాష్ట్ర జలవనరులు, బచావత్‌ ట్రిబ్యూనల్‌ సమయంలో పనిచేసిన సుదీర్ఘ అనుభవం గల ఇంజినీర్లు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. 

నీటి లభ్యతను శాస్త్రీయంగా అంచనా వేయాలంటే వందేళ్లు లేదా కనీసం 50 ఏళ్ల ప్రవాహాలను ఆధారంగా తీసుకోవాలని చెబుతున్నారు. బేసిన్‌లో కొంతకాలం అధిక వర్షపాతం కురవడం... ఆ సమయంలో ఒకేసారి గరిష్టంగా వరద రావడం తదితర కారణాల వల్లే గోదావరిలో నీటి లభ్యత పెరగడానికి కారణమని నీటిపారుదలరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  

గోదావరి బేసిన్‌ ఇదీ.. 
దేశంలో రెండో అతి పెద్ద నది గోదావరి. మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో నాసిక్‌ వద్ద త్రయంబకేశ్వర్‌లో సముద్రమట్టానికి 1,067 మీటర్ల ఎత్తులో జని్మంచిన గోదావరి... మహారాష్ట్ర, తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌లలో 1,465 కిలో మీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఏపీలోని డాక్టర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.

గోదావరికి ప్రవర, పూర్ణ, మంజీర, పెన్‌గంగ, ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, సీలేరు ప్రధాన ఉప నదులు. గోదావరి నదీ పరివాహక ప్రాంతం (బేసిన్‌) మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, పుదుచ్చేరిలలో 3,12,812 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించింది. ఇది దేశ భౌగోళిక విస్తీర్ణంలో 9.5 శాతంతో సమానం.  

సీడబ్ల్యూసీ తాజా అధ్యయనంలో ముఖ్యాంశాలు ఇవీ..
»  గోదావరిలో 1985–86 నుంచి 2022–23 వరకు ఏటా సగటున 4,561.60 టీఎంసీల లభ్యత ఉంది.  
» 2013–14లో గరిష్టంగా 8,664.82 టీఎంసీల లభ్యత ఉండగా... 2009–10లో నీటి లభ్యత కనిష్టంగా 2,066.62 టీఎంసీల లభ్యత ఉంది.  
»  బేసిన్‌లో సగటున 1,167 మి.మీ. వర్షపాతం కురుస్తుంది. దీనివల్ల గోదావరిలో ఏటా సగటున 12,869.74 టీఎంసీల ప్రవాహం ఉంటుంది. 1994–95లో గరిష్టంగా 1,484 మి.మీ.ల వర్షపాతం కురవడం వల్ల ఆ సంవత్సరంలో గరిష్టంగా 17,054.89 టీఎంసీల ప్రవాహం ఉంది. 2015–16లో బేసిన్‌లో కనిష్టంగా 914 మి.మీ.ల వర్షపాతం కురవడం వల్ల ఆ సంవత్సరంలో గోదావరిలో కనిష్టంగా 9,608.43 టీఎంసీల ప్రవాహం ఉంది.  
»  1985–2023 మధ్య ఏటా సగటున 850.38 టీఎంసీలను మాత్రమే సాగునీటి కోసం వినియోగించుకున్నారు.  
»   2022–23లో గృహ, పారిశ్రామిక అవసరాలు, పశువులకు తాగునీటి కోసం 70.28 టీఎంసీలు వాడుకున్నారు. 
»  బేసిన్‌లో రిజర్వాయర్లలో ఆవిరి నష్టాలు ఏటా సగటున 181.52 టీఎంసీలుగా సీడబ్ల్యూసీ నిర్ధారించింది.  

-ఆలమూరు రామగోపాలరెడ్డి 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement