సాక్షి, హైదరాబాద్: గోదావరిలో ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి నీటి లభ్యతపై స్పష్టత లేనందున కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ)తో అధ్యయనం జరిపించాలని గోదావరి నది యాజమాన్య బోర్డు(జీఆర్‌ఎంబీ) నిర్ణయించింది. ఇందుకు సీడబ్ల్యూసీకి ప్రతిపాదనలు పంపించనుంది. గోదావరి బోర్డు చైర్మన్ ముఖేష్‌కుమార్ సిన్హా అధ్యక్షతన మంగళవారం జలసౌధలో జరిగిన గోదావరి బోర్డు సమావేశంలో ఈ మేరకు పలు నిర్ణయాలు తీసుకుంది.
తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్, ఈఎన్‌సీ సి.మురళీధర్, ఏపీ రాష్ట్ర జలవనరుల శాఖ ఈఎన్‌సీ సి.నారాయణ రెడ్డి, ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొని తమ రాష్ట్రాల తరఫున వాదనలు వినిపించారు. సీడబ్ల్యూసీ డైరెక్టర్(హైడ్రాలజీ) నిత్యానంద రాయ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.
మళ్లీ అధ్యయనం అనవసరం: సీడబ్ల్యూసీ హైడ్రాలజీ డైరెక్టర్
సీడబ్ల్యూసీ ఆధ్వర్యంలో 2020–21 నాటి వరకు వర్షపాతాన్ని ప్రామాణికంగా తీసుకుని అధ్యయనం జరిపించగా, గోదావరిలో 75 శాతం డిపెండబిలిటీ ఆధారంగా 1430–1480 టీఎంసీల నీటి లభ్యత ఉందని తేలిందని నిత్యానంద రాయ్ వెల్లడించారు. ఐదేళ్ల మూవింగ్ యావరేజీ ప్రకారం1,430–1,600 టీఎంసీల నీటి లభ్యత ఉందన్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ అధ్యయనం జరపాల్సిన అవసరం లేదని హైడ్రాలజీ డైరెక్టర్‌గా తన అభిప్రాయమని స్పష్టం చేశారు.
ఏపీ అధికారులు ఢిల్లీకి వస్తే అధ్యయన నివేదికలు చూపిస్తామన్నారు. మళ్లీ అధ్యయనం జరపాలని ప్రతిపాదనలు పంపితే సీడబ్ల్యూసీ చైర్మన్ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. పోలవరంతో సహా ఏపీ ప్రాజెక్టులకు 484.5 టీఎంసీల జలాలు అవసరమని, ఈ మేరకు ఏపీలోని అన్ని ప్రాజెక్టుల అవసరాలను పరిరక్షిస్తూనే తెలంగాణలోని ఒక్కో ప్రాజెక్టు క్లియరెన్స్ విషయంలో సీడబ్ల్యూసీ ముందుకు వెళ్తుందన్నారు.
ఈ విషయంలో ఏపీకి ఆందోళన అవసరం లేదన్నారు. ఏపీ ప్రాజెక్టులకు ఢోకా లేదన్నారు. 75శాతం డిపెండబిలిటీ ఆధారంగా గోదావరిలో మిగులు జలాలు లేవని తేలిందన్నారు. గోదావరిలో నీటి లభ్యతపై అధ్యయనం జరిపించే అధికారం, పరిధి గోదావరి బోర్డుకు లేదని, సీడబ్ల్యూసీతో అధ్యయనం జరిపిస్తే తమకు అభ్యంతరం ఉండదని తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ తెలిపారు. కేవలం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు నీటి లభ్యతపై మాత్రమే కాకుండా గోదావరి పరీవాహకంలోని మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు నీటి లభ్యతపై సైతం అధ్యయనం చేస్తేనే సరైన ఫలితం ఉంటుందని ఆయన సూచించారు. అయితే కేవలం తెలంగాణ, ఏపీకి లభ్యతపైనే అధ్యయనం జరపాలని ఏపీ ఈఎన్‌సీ కోరారు.
అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడం లేదన్న ఏపీ ఈఎన్‌సీ
‘ఏ విషయాల్లో మా అభిప్రాయాలు అడగడం లేదు. అడిగినా వాటిని పరిగణనలోకి తీసుకోవడం లేదు. మేము లేవనెత్తిన అంశాలను తేల్చకుండానే తెలంగాణ ప్రాజెక్టులకు క్లియరెన్స్‌లు ఇస్తున్నారు. సీడబ్ల్యూసీలోని టెక్నికల్ అడ్వైయిజరీ కమిటీ(టీఎంసీ) ఇటీవల సమావేశమై తెలంగాణలోని మూడు ప్రాజెక్టులకు క్లియరెన్స్ ఇచ్చింది. ఈ సమావేశానికి ఏపీని అహ్వానించలేదు. ఇకపై టీఏసీ సమావేశాలకు ఏపీని పిలవాలి.
మేము లేవనెత్తిన ప్రతి అంశాన్ని తేల్చిన తర్వాతే ప్రాజెక్టులకు క్లియరెన్స్ ఇవ్వాలి’అని ఏపీ ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏపీ లేవనెత్తిన అంశాలపై సాంకేతికంగా గోదావ రి బోర్డు చైర్మన్ అధ్యయనం జరపాలని, ఆ తర్వాతే తెలంగాణ ప్రాజెక్టులకు క్లియరెన్స్ విషయంలో ముందుకు వెళ్లాలని ఆయన డిమాండ్ చేయగా, గోదావరి బోర్డు చైర్మన్ అంగీకరించలేదు. ప్రాజెక్టుల డీపీఆర్‌లను మదింపు చేయడం వరకే తన బాధ్యత అని ఆయన బదులిచ్చారు.
ఏపీవి అన్నీ అపోహలేనన్న తెలంగాణ ఈఎన్‌సీ
ఏపీ లేవనెత్తిన అన్ని అంశాలనూ సీడబ్ల్యూసీ పరిగణనలోకి తీసుకుందని, ప్రతి అంశాన్ని తేల్చిందని, ఏపీ ప్రాజెక్టులపై ఎలాంటి ప్రభావం లేకుండా చూసుకున్న తర్వాతే తెలంగాణ ప్రాజెక్టులకు క్లియరెన్స్‌లు ఇచ్చిందని తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్ బదులిచ్చారు. ఏపీవి అన్నీ అపోహలే అని కొట్టిపారేశారు. ప్రాజెక్టుల డీపీఆర్‌లకు క్లియరెన్స్‌ల జారీలో జాప్యం కారణంగా ఆయా ప్రాజెక్టుల అంచనా వ్యయం 20–25 శాతం పెరిగిందని రజత్‌కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు
జీ–5 సబ్ బేసిన్‌తో ఏపీకి సంబంధం లేదు..
రాష్ట్రంలోని కడెం–గూడెం, మొడికుంటవాగు ప్రాజెక్టుల డీపీఆర్‌లపై ఏపీ, తెలంగాణ అభిప్రాయాలతో సీడబ్ల్యూసీలోని టీఏసీ క్లియరెన్స్ కోసం పంపించాలని ఈ సమావేశంలో గోదావరి బోర్డు నిర్ణయం తీసుకుంది. కడెం ప్రాజెక్టుకు 14.75 టీఎంసీలు అవసరం కాగా 15 టీఎంసీల లభ్యత ఉన్నందున గూడెం ఎత్తిపోతల అవసరం లేదని ఏపీ ఈఎన్‌సీ నారాయణరెడ్డి అంతకు ముందు జరిగిన చర్చలో అభ్యంతరం తెలిపారు.
గోదావరిలోని జీ–5 సబ్ బేసిన్ పరిధిలో కడెం ప్రాజె క్టు వస్తుందని, ఏపీలోని ప్రాజెక్టులకు జీ–5 సబ్ బేసిన్ నుంచి నీళ్లు వెళ్లవని, తెలంగాణ అవసరాలకే సరిపోతాయని .. కడెం ప్రాజెక్టుకు ఇచ్చిన అనుమతుల్లో సీడబ్ల్యూసీ స్పష్టంగా చెప్పిందని తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ బదులిచ్చారు. జీ–1 నుంచి జీ–6 సబ్ బేసిన్‌ల నీళ్లు ఏపీకి పోవని, జీ–7 నుంచి జీ–12 సబ్ బేసిన్ల నీళ్లను ఆధారంగా చేసుకుని పోలవరం ప్రాజెక్టుకు అనుమతులిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఏపీ అభ్యంతరాలకు విలువ లేదని కొట్టిపారేశారు. అయినా, కడెం–గూడెం ఎత్తిపోతలకు అంగీకరించమని ఏపీ స్పష్టం చేసింది.
సరిహద్దుల్లో 5 టెలిమెట్రీ స్టేషన్లు
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు పెద్దవాగుకు తక్షణ మరమ్మతులు చేపట్టడానికి రెండు రాష్ట్రాలు ఈ సమావేశంలో అంగీకరించాయి. గోదావరిపై 23 చోట్ల టెలిమెట్రీ స్టేషన్లు పెట్టాలని ప్రతిపాదనలు రాగా, తొలుత ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లోని పెద్దవాగు, పెద్దవాగు ఎడమ కాల్వ, పెద్దవాగు కుడి కాల్వ, కిన్నెరసానితో పాటు మరో వాగుపై మాత్రమే ఏర్పాటు చేయాలని తెలంగాణ సూచన మేరకు ఈ సమావేశంలో నిర్ణయించారు. సాధ్యమైనంత ఎక్కువ ప్రాంతాల్లో పెట్టాలని ఏపీ కోరింది. టెలిమెట్రీ స్టేషన్ల ద్వారా రెండు రాష్ట్రాల నీటి వినియోగం లెక్కలను నమోదు చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment