Godavari river management board
-
గౌరవెల్లిని ఆపేయండి
సాక్షి, హైదరాబాద్: గౌరవెల్లి రిజర్వాయర్ పనులను తక్షణమే నిలుపుదల చేయాలని, ఒక వేళ పనులు పూర్తయితే నీటిని నిల్వ చేయొద్దని తెలంగాణ రాష్ట్రాన్ని గోదావరి నది యాజమాన్య బోర్డు(జీఆర్ఎంబీ) ఆదేశించింది. ఇప్పటికే నీటిని నిల్వ చేసి ఉంటే కాల్వలకు విడుదల చేయొద్దని కోరింది. ఈ మేరకు గోదావరి బోర్డు సభ్య కార్యదర్శి ఆర్.అఝగేషన్ శుక్రవారం రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌కు లేఖ రాశారు. పర్యావరణ అనుమతి తీసుకోకుండా గౌరవెల్లి రిజర్వాయర్ నిర్మాణాన్ని చేపట్టడాన్ని సవాలు చేస్తూ జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ)లో దాఖలైన కేసులో గోదావరి బోర్డు ప్రతివాదిగా ఉంది. ఎన్జీటీ ఆదేశాల మేరకు గౌరవెల్లి రిజర్వాయర్ పనులపై యథాస్థితిని కొనసాగించాలని, కొత్త పనులు చేపట్టరాదని తాజాగా గోదావరి బోర్డు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ‘‘ఆ క్లాజుల ప్రకారం నడుచుకోవాలి’’ గోదావరి బోర్డు అధికార పరిధిని నిర్దేశిస్తూ 2021 జూలై 15న కేంద్ర జలశక్తి శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌లోని క్లాజులు 1(డీ)(3), 2(ఎఫ్), 2(జీ) ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నడుచుకోవాలని స్పష్టం చేసింది. క్లాజు 1(డీ) ప్రకారం అనుమతి లేని ప్రాజెక్టులకు గోదావరి బోర్డు, అపెక్స్ కౌన్సిల్, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ(టీఏసీ)ల నుంచి అనుమతులు పొందే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. ప్రాజెక్టుల సామర్థ్యం పెంపు, ఇతర మార్పులు, రెగ్యులేటర్లు, అప్రోచ్ చానల్, సొరంగం పనులు, డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ పనులు చేపట్టాలన్నా గోదావరి బోర్డు, టీఏసీ, అపెక్స్ కౌన్సిల్ అనుమతులు తప్పనిసరి అని గుర్తు చేసింది. క్లాజు 2(ఎఫ్) ప్రకారం అనుమతి లేని ప్రాజెక్టుల పనులు నిలుపుదల చేసి, గెజిట్ విడుదలైన ఆరు నెలల్లోపు అనుమతులు తెచ్చుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. క్లాజు 2(జీ) ప్రకారం అనుమతి రాని ప్రాజెక్టులను వినియోగించుకోకుండా పక్కనబెట్టాల్సి ఉంటుందని తెలిపింది. రాష్ట్రం వచ్చాక పెరిగిన గౌరవెల్లి సామర్థ్యం ఉమ్మడి రాష్ట్రంలో ఇందిరమ్మ వరద కాల్వ ప్రాజెక్టులో భాగంగా 1.04 టీఎంసీల సామ ర్థ్యంతో గౌరవెల్లి రిజర్వాయర్‌ను నిర్మించారు. తెలంగాణ వచ్చాక ప్రాజెక్టుల రీడి జైనింగ్‌లో భాగంగా గౌరవెల్లి సామ ర్థ్యాన్ని 8.5 టీఎంసీలకు పెంచాలని నిర్ణ యం తీ సుకున్నారు. ఇందుకోసం 1960 ఎక రాలను సేకరించారు. రిజర్వాయర్ పనులు పూర్తి కాగా, 1.02 టీఎంసీలను నింపారు. రిజ ర్వాయర్ సామర్థ్యం 8.5 టీఎంసీలకు పెరి గినా ప్రధాన కాల్వ సామర్థ్యం 1.04 టీ ఎంసీలే ఉంది. పర్యావరణ అనుమతులు లే కుండా ప్రాజెక్టు పనులు చేపట్టారని గ్రా మ స్తులు కొందరు కేసు వేయగా, ఎన్జీటీ గతంలో ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. -
గోదావరిలో నీటి లభ్యతపై అధ్యయనం!
సాక్షి, హైదరాబాద్: గోదావరిలో ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి నీటి లభ్యతపై స్పష్టత లేనందున కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ)తో అధ్యయనం జరిపించాలని గోదావరి నది యాజమాన్య బోర్డు(జీఆర్ఎంబీ) నిర్ణయించింది. ఇందుకు సీడబ్ల్యూసీకి ప్రతిపాదనలు పంపించనుంది. గోదావరి బోర్డు చైర్మన్ ముఖేష్‌కుమార్ సిన్హా అధ్యక్షతన మంగళవారం జలసౌధలో జరిగిన గోదావరి బోర్డు సమావేశంలో ఈ మేరకు పలు నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్, ఈఎన్సీ సి.మురళీధర్, ఏపీ రాష్ట్ర జలవనరుల శాఖ ఈఎన్సీ సి.నారాయణ రెడ్డి, ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొని తమ రాష్ట్రాల తరఫున వాదనలు వినిపించారు. సీడబ్ల్యూసీ డైరెక్టర్(హైడ్రాలజీ) నిత్యానంద రాయ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. మళ్లీ అధ్యయనం అనవసరం: సీడబ్ల్యూసీ హైడ్రాలజీ డైరెక్టర్ సీడబ్ల్యూసీ ఆధ్వర్యంలో 2020–21 నాటి వరకు వర్షపాతాన్ని ప్రామాణికంగా తీసుకుని అధ్యయనం జరిపించగా, గోదావరిలో 75 శాతం డిపెండబిలిటీ ఆధారంగా 1430–1480 టీఎంసీల నీటి లభ్యత ఉందని తేలిందని నిత్యానంద రాయ్ వెల్లడించారు. ఐదేళ్ల మూవింగ్ యావరేజీ ప్రకారం1,430–1,600 టీఎంసీల నీటి లభ్యత ఉందన్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ అధ్యయనం జరపాల్సిన అవసరం లేదని హైడ్రాలజీ డైరెక్టర్‌గా తన అభిప్రాయమని స్పష్టం చేశారు. ఏపీ అధికారులు ఢిల్లీకి వస్తే అధ్యయన నివేదికలు చూపిస్తామన్నారు. మళ్లీ అధ్యయనం జరపాలని ప్రతిపాదనలు పంపితే సీడబ్ల్యూసీ చైర్మన్ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. పోలవరంతో సహా ఏపీ ప్రాజెక్టులకు 484.5 టీఎంసీల జలాలు అవసరమని, ఈ మేరకు ఏపీలోని అన్ని ప్రాజెక్టుల అవసరాలను పరిరక్షిస్తూనే తెలంగాణలోని ఒక్కో ప్రాజెక్టు క్లియరెన్స్ విషయంలో సీడబ్ల్యూసీ ముందుకు వెళ్తుందన్నారు. ఈ విషయంలో ఏపీకి ఆందోళన అవసరం లేదన్నారు. ఏపీ ప్రాజెక్టులకు ఢోకా లేదన్నారు. 75శాతం డిపెండబిలిటీ ఆధారంగా గోదావరిలో మిగులు జలాలు లేవని తేలిందన్నారు. గోదావరిలో నీటి లభ్యతపై అధ్యయనం జరిపించే అధికారం, పరిధి గోదావరి బోర్డుకు లేదని, సీడబ్ల్యూసీతో అధ్యయనం జరిపిస్తే తమకు అభ్యంతరం ఉండదని తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ తెలిపారు. కేవలం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు నీటి లభ్యతపై మాత్రమే కాకుండా గోదావరి పరీవాహకంలోని మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు నీటి లభ్యతపై సైతం అధ్యయనం చేస్తేనే సరైన ఫలితం ఉంటుందని ఆయన సూచించారు. అయితే కేవలం తెలంగాణ, ఏపీకి లభ్యతపైనే అధ్యయనం జరపాలని ఏపీ ఈఎన్సీ కోరారు. అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడం లేదన్న ఏపీ ఈఎన్సీ ‘ఏ విషయాల్లో మా అభిప్రాయాలు అడగడం లేదు. అడిగినా వాటిని పరిగణనలోకి తీసుకోవడం లేదు. మేము లేవనెత్తిన అంశాలను తేల్చకుండానే తెలంగాణ ప్రాజెక్టులకు క్లియరెన్స్‌లు ఇస్తున్నారు. సీడబ్ల్యూసీలోని టెక్నికల్ అడ్వైయిజరీ కమిటీ(టీఎంసీ) ఇటీవల సమావేశమై తెలంగాణలోని మూడు ప్రాజెక్టులకు క్లియరెన్స్ ఇచ్చింది. ఈ సమావేశానికి ఏపీని అహ్వానించలేదు. ఇకపై టీఏసీ సమావేశాలకు ఏపీని పిలవాలి. మేము లేవనెత్తిన ప్రతి అంశాన్ని తేల్చిన తర్వాతే ప్రాజెక్టులకు క్లియరెన్స్ ఇవ్వాలి’అని ఏపీ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏపీ లేవనెత్తిన అంశాలపై సాంకేతికంగా గోదావ రి బోర్డు చైర్మన్ అధ్యయనం జరపాలని, ఆ తర్వాతే తెలంగాణ ప్రాజెక్టులకు క్లియరెన్స్ విషయంలో ముందుకు వెళ్లాలని ఆయన డిమాండ్ చేయగా, గోదావరి బోర్డు చైర్మన్ అంగీకరించలేదు. ప్రాజెక్టుల డీపీఆర్‌లను మదింపు చేయడం వరకే తన బాధ్యత అని ఆయన బదులిచ్చారు. ఏపీవి అన్నీ అపోహలేనన్న తెలంగాణ ఈఎన్సీ ఏపీ లేవనెత్తిన అన్ని అంశాలనూ సీడబ్ల్యూసీ పరిగణనలోకి తీసుకుందని, ప్రతి అంశాన్ని తేల్చిందని, ఏపీ ప్రాజెక్టులపై ఎలాంటి ప్రభావం లేకుండా చూసుకున్న తర్వాతే తెలంగాణ ప్రాజెక్టులకు క్లియరెన్స్‌లు ఇచ్చిందని తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ బదులిచ్చారు. ఏపీవి అన్నీ అపోహలే అని కొట్టిపారేశారు. ప్రాజెక్టుల డీపీఆర్‌లకు క్లియరెన్స్‌ల జారీలో జాప్యం కారణంగా ఆయా ప్రాజెక్టుల అంచనా వ్యయం 20–25 శాతం పెరిగిందని రజత్‌కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు జీ–5 సబ్ బేసిన్‌తో ఏపీకి సంబంధం లేదు.. రాష్ట్రంలోని కడెం–గూడెం, మొడికుంటవాగు ప్రాజెక్టుల డీపీఆర్‌లపై ఏపీ, తెలంగాణ అభిప్రాయాలతో సీడబ్ల్యూసీలోని టీఏసీ క్లియరెన్స్ కోసం పంపించాలని ఈ సమావేశంలో గోదావరి బోర్డు నిర్ణయం తీసుకుంది. కడెం ప్రాజెక్టుకు 14.75 టీఎంసీలు అవసరం కాగా 15 టీఎంసీల లభ్యత ఉన్నందున గూడెం ఎత్తిపోతల అవసరం లేదని ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి అంతకు ముందు జరిగిన చర్చలో అభ్యంతరం తెలిపారు. గోదావరిలోని జీ–5 సబ్ బేసిన్ పరిధిలో కడెం ప్రాజె క్టు వస్తుందని, ఏపీలోని ప్రాజెక్టులకు జీ–5 సబ్ బేసిన్ నుంచి నీళ్లు వెళ్లవని, తెలంగాణ అవసరాలకే సరిపోతాయని .. కడెం ప్రాజెక్టుకు ఇచ్చిన అనుమతుల్లో సీడబ్ల్యూసీ స్పష్టంగా చెప్పిందని తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ బదులిచ్చారు. జీ–1 నుంచి జీ–6 సబ్ బేసిన్ల నీళ్లు ఏపీకి పోవని, జీ–7 నుంచి జీ–12 సబ్ బేసిన్ల నీళ్లను ఆధారంగా చేసుకుని పోలవరం ప్రాజెక్టుకు అనుమతులిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఏపీ అభ్యంతరాలకు విలువ లేదని కొట్టిపారేశారు. అయినా, కడెం–గూడెం ఎత్తిపోతలకు అంగీకరించమని ఏపీ స్పష్టం చేసింది. సరిహద్దుల్లో 5 టెలిమెట్రీ స్టేషన్లు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు పెద్దవాగుకు తక్షణ మరమ్మతులు చేపట్టడానికి రెండు రాష్ట్రాలు ఈ సమావేశంలో అంగీకరించాయి. గోదావరిపై 23 చోట్ల టెలిమెట్రీ స్టేషన్లు పెట్టాలని ప్రతిపాదనలు రాగా, తొలుత ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లోని పెద్దవాగు, పెద్దవాగు ఎడమ కాల్వ, పెద్దవాగు కుడి కాల్వ, కిన్నెరసానితో పాటు మరో వాగుపై మాత్రమే ఏర్పాటు చేయాలని తెలంగాణ సూచన మేరకు ఈ సమావేశంలో నిర్ణయించారు. సాధ్యమైనంత ఎక్కువ ప్రాంతాల్లో పెట్టాలని ఏపీ కోరింది. టెలిమెట్రీ స్టేషన్ల ద్వారా రెండు రాష్ట్రాల నీటి వినియోగం లెక్కలను నమోదు చేస్తారు. -
ప్రాజెక్టుల అప్పగింతపై మళ్లీ పాతపాటే!
సాక్షి, హైదరాబాద్: గోదావరి నదీయాజమాన్య బోర్డు(జీఆర్ఎంబీ) అధికార పరిధిని నిర్వచిస్తూ కేంద్రం జారీ చేసిన గెజిట్‌లోని షెడ్యూల్–2లో పొందుపర్చిన 11 ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించే విషయంపై తెలుగు రాష్ట్రాలు మళ్లీ పాతపాటే వినిపించాయి. గోదావరి పరీవాహక ప్రాంతంలో ఉన్న ఏకైక ఉమ్మడి ప్రాజెక్టు పెద్దవాగు మినహా మరే ప్రాజెక్టును అప్పగించే ప్రసక్తేలేదని తెలంగాణ మరోసారి తేల్చి చెప్పింది. తెలంగాణ పరిధిలోని ప్రాజెక్టులన్నింటినీ స్వాధీనం చేసుకుంటేనే తమ ప్రాజెక్టులను స్వాధీనం చేసుకోవాలని ఏపీ పట్టుబట్టింది. దీంతో ప్రాజెక్టుల అప్పగింతపై గోదావరి బోర్డు మెంబర్ కన్వీనర్ అజగేషన్ నేతృ త్వంలో గురువారం జలసౌధలో నిర్వహించిన సబ్ కమిటీ సమావేశం ఫలితం లేకుండానే ముగి సింది. ఈ సమావేశానికి తెలంగాణ నుంచి నీటిపారుదల శాఖ అంతర్రాష్ట్ర వ్యవహారాల సీఈ మోహ న్‌కుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సుబ్రమణ్య ప్రసాద, ఏపీ నుంచి సీఈ పుల్లారావు పాల్గొన్నారు. ఏపీ తమ పరిధిలోని తోట వెంకటాచలం లిఫ్టు, తాడిపూడి పంప్‌హౌస్, సీలేరు పవర్ కాంప్లెక్స్‌ల అప్పగింతపై బోర్డుకు నోట్‌ను అందించింది. అయితే తెలంగాణ ప్రాజెక్టులను సైతం స్వాధీనం చేసుకుంటేనే తమ ప్రాజెక్టులను అప్పగించేందుకు అంగీకరిస్తామని షరతు విధించింది. తెలంగాణ లోని ఎస్సారెస్పీ ప్రాజెక్టులో ఉన్న కాకతీయ క్రాస్ రెగ్యులేటర్, మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంప్ హౌస్, చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం లోని గంగారం పంప్‌హౌస్, దుమ్ముగూడెం వెయిర్, నావిగేషన్ చానల్, లాక్స్లను అప్పగిం చాలని గోదావరి బోర్డు కోరగా, తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకించింది. సీడ్‌మనీ కింద రూ.200 కోట్లు కోరిన బోర్డు సీడ్‌మనీ కింద రూ.200 కోట్ల చొప్పున రెండు రాష్ట్రాలు విడుదల చేయాలని బోర్డు కోరగా, ఖర్చుల ప్రతిపాదనలను సమర్పిస్తే పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని ఏపీ తెలిపింది. పెద్దవాగు నిర్వహణకు సీడ్‌మనీగా రూ.1.45 కోట్లతోపాటు సిబ్బందిని సమకూర్చడానికి సిద్ధంగా ఉన్నామని తెలంగాణ బదులిచ్చింది. పెద్దవాగు ఆధునీకరణకు రూ.78 కోట్ల వ్యయం కానుందని, దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సమర్పిస్తే బోర్డుకు నిధులిస్తామని తెలిపింది. ఒక ఎస్ఈ, ఇద్దరు ఈఈ, నలుగురు జేఈ, ఇతర ఉద్యోగులను బోర్డుకు కేటాయించేందుకు తెలంగాణ అంగీకరించింది. -
ఏకపక్ష వైఖరిని ఒప్పుకోం.. గోదావరి బోర్డు తీరును ఆక్షేపిస్తూ తెలంగాణ లేఖ
సాక్షి, హైదరాబాద్: ప్రాజెక్టుల సందర్శన, ప్రాజెక్టుల అప్పగింత నోట్ రూపకల్పన ప్రక్రియల్లో గోదావరి నది యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) ఏకపక్షంగా వ్యవహరిస్తోందని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఆక్షేపించింది. జీఆర్ఎంబీ సబ్ కమిటీ సభ్యులెవరినీ ఇందులో భాగస్వాములుగా చేయకపోవడాన్ని తప్పుబట్టింది. సాధారణ ప్రక్రియకు విరుద్ధమైన ఈ వ్యవహార శైలిని అంగీకరించబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ సి.మురళీధర్ సోమవారం జీఆర్ఎంబీ బోర్డు చైర్మన్‌కు లేఖ రాశారు. ప్రాజెక్టు సైట్ల సందర్శన, అప్పగింత నోట్ తయారీకి బోర్డు/సబ్ కమిటీ నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి అని ఆ లేఖలో తెలిపింది. బోర్డు/సబ్ కమిటీ నిర్ణయాల మేరకే బోర్డు అధికారులు పనిచేయాలని కోరింది. బోర్డు సచివాలయం అధికారులెవరు సందర్శనకు వచ్చినా తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తుందని, బోర్డు అనుమతి లేకుండా సందర్శన జరిపే అధికారుల అభిప్రాయాలను ఏమాత్రం అంగీకరించబోమని తెలిపింది. కాగా, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు అయిన పెద్దవాగు మినహా తెలంగాణలోని ఇతర ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించాల్సిన అవసరం లేదని మరోసారి స్పష్టం చేసింది. -
ప్రాజెక్టుల అప్పగింతపై హామీ ఇవ్వలేం..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఒక్క పెద్దవాగు మినహా ఇతర సాగునీటి ప్రాజెక్టుల అప్పగింతపై ఎలాంటి హామీ ఇవ్వలేమని గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ)కి తెలంగాణ నీటిపారుదల శాఖ మరోసారి స్పష్టం చేసింది. ప్రాజెక్టుల డీపీఆర్‌లు, ప్లాంట్లు, యంత్రాలు, పరికరాలు, కార్యాలయాలు, ఫర్నిచర్, వాహనాలు, మంజూరైన పోస్టులు, ఇతర రికార్డులను బోర్డులకు అప్పగించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఆదేశాల్లేవని పేర్కొంది. తెలంగాణలోని రెండు, ఏపీలోని రెండు నీటి విడుదల పాయింట్లను బోర్డుల చేతికి అప్పగించే అంశంపై గోదావరి బోర్డు సబ్ కమిటీ బుధవారం జలసౌధలో సమావేశమై చర్చించింది. ఈ సందర్భంగా తెలంగాణ అధికారులు రాష్ట్ర వాదనను వినిపించారు. దేవాదుల పథకానికి సంబంధించిన ఇన్‌టెక్ పంపుహౌజ్ వద్ద గోదావరి బోర్డు జరిపిన క్షేత్రస్థాయి పర్యటనలో సబ్‌కమిటీని దూరంగా ఉంచిన నేపథ్యంలో.. ఆ ప్రాజెక్టు అప్పగింతకు సంబంధించిన నివేదికను తెలంగాణ అధికారులు వ్యతిరేకించారు. గోదావరిపై రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టులేవీ లేనందున.. ప్రాజెక్టుల వద్ద కేంద్ర బలగాల(సీఐఎస్ఎఫ్)ను మోహరించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. దానివల్ల రాష్ట్ర ఖజానాపై అనవసర భారం పడుతుందని వివరించారు. ‘‘గోదావరి ట్రిబ్యునల్ తీర్పులోని క్లాజ్–4 ప్రకారం.. తమ వాటాలోని ఏదైన భాగాన్ని ఇతర బేసిన్లకు బదిలీ చేసుకునే స్వేచ్ఛ రాష్ట్రాలకు ఉంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, దేవాదుల పథకాలు ఉమ్మడి రాష్ట్రంలో కట్టినవే. గోదావరి నీటిని కృష్ణాబేసిన్ ప్రాంతాలకు తరలించడంపై అప్పట్లో ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరాలు లేవు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీ లేవనెత్తుతున్న అభ్యంతరాలు తెలంగాణకు ఏమాత్రం ఆమోదయోగ్యం కావు. గోదావరి ట్రిబ్యునల్ తీర్పుకు సైతం అది వ్యతిరేకం’’ అని వివరించారు. ఇక ప్రాజెక్టుల అప్పగింతపై గోదావరి బోర్డు రూపొందించిన నివేదికపై అధ్యయనం కోసం కొంత సమయం కావాలని రాష్ట్ర అధికారులు కోరగా.. ఇందుకు బోర్డు చైర్మన్ సానుకూలంగా స్పందించారు. అప్పగింత నివేదికపై చర్చను తదుపరి సమావేశానికి వాయిదా వేశారు. సమావేశంలో తెలంగాణ తరఫున సీఎం ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే, ఇంటర్‌స్టేట్ విభాగం ఎస్ఈ కోటేశ్వరరావు, ఈఈ సుబ్రమణ్య ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
వరుస పరిణామాలతో తెలంగాణ నీటిపారుదల యంత్రాంగం బిజీబిజీ
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిపై కేంద్రం వెలువరించిన గెజిట్ నోటిఫికేషన్ అమలు విషయంలో బోర్డులు పెడుతున్న తొందర, ప్రాజెక్టులు, సంబంధిత పరిణామాలు రాష్ట్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గెజిట్ వెలువడిన మరుసటి రోజునుంచే దాని అమలుపై కార్యాచరణ మొదలు పెట్టాల్సిందిగా బోర్డులు లేఖల మీద లేఖలు రాయడం మొదలు పెట్టాయి. ప్రాజెక్టుల వివరాలు, ఇతర అంశాలకు సంబంధించి వివరాలు కోరుతున్నాయి. వీటిపై చర్చించేందుకు వరుస భేటీలు నిర్వహిస్తున్నాయి. బోర్డులు కోరుతున్న ప్రతి సమాచారం సున్నితమైన కీలక అంశాలకు సంబంధించినది కావ డంతో, అధికారులు ప్రతి విషయాన్నీ అటు ప్రభుత్వం, ఇటు న్యాయవాదులతో చర్చించి ఖరారు చేయాల్సి వస్తోంది. మరోపక్క కోర్టులు, ట్రిబ్యునల్ కేసుల విచారణకు వాదనలు, పార్లమెంటులో ప్రశ్నలకు జవాబులు సిద్ధం చేయాల్సి ఉండటంతో తెలంగాణ ఇరిగేషన్ శాఖకు ఊపిరి సలపడం లేదు. లేఖాస్త్రాలతో పెరుగుతున్న ఒత్తిడి గత నెల 16న గెజిట్ నోటిఫికేషన్ వెలువడిందే ఆలస్యం.. బోర్డులు వీటి అమలుకు పూనుకున్నాయి. నోటిఫికేషన్ వెలువడిన మరుసటి రోజే.. అందులోని అంశాల అమలుకు చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్రాలను కోరాయి. ఆ తర్వాత బోర్డులకు నిధులు విడుదలపై లేఖలు రాశాయి. ఆ వెంటనే రాష్ట్రాల్లో ఆమోదం లేని ప్రాజెక్టుల డీపీఆర్‌లు కోరుతూ లేఖలు రాశాయి. ఆ మరుసటి రోజే సమన్వయ కమిటీ ఏర్పాటు చేసిన సమాచారంతో రెండు లేఖలు, ఆ వెంటనే కమిటీ భేటీని నిర్వహిస్తామంటూ మరో రెండు లేఖాస్త్రాలు సంధించాయి. ఇదే క్రమంలో ఈనెల 3న కమిటీ సమావేశాన్ని నిర్వహించాయి. ఈ భేటీకి తెలంగాణ గైర్హాజరు కాగా, ఏపీ తన అభిప్రాయాన్ని చెప్పింది. అయితే గెజిట్ నోటిఫికేషన్‌లోని అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తూ ఒక్కో అంశంపై అభిప్రాయాలను సిద్ధం చేసుకుంటున్న సమయంలో, 9న పూర్తి స్థాయి భేటీ నిర్వహిస్తామని రెండు బోర్డులు తెలంగాణకు లేఖలు రాశాయి. ఇలావుండగా 9వ తేదీనే కృష్ణా జలాలపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వేసిన రిట్ పిటిషన్ ఉపసంహరణకు సంబంధించి విచారణ జరగనుంది. ఏ కారణాలతో పిటిషన్ ఉపసంహరించుకుంటున్నారో తెలంగాణ కోర్టుకు వివరించాల్సి ఉంది. అదే రోజున రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్ సైతం విచారణకు రానుంది. ఇక్కడ తెలంగాణ తన వాదనలు వినిపించాల్సి ఉంది. మరోవైపు గెజిట్‌లో పేర్కొన్న అంశాలు, అనుమతుల్లేని ప్రాజెక్టులు, వాటికి రుణాలు, గెజిట్‌తో ఏర్పడే పరిణామాలపై పార్లమెంట్లో వరుస ప్రశ్నలు వస్తున్నాయి. ముఖ్యంగా అనుమతుల్లేవని చెబుతున్న గోదావరి, కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్, నాబార్డ్‌ల రుణాలపై ఇప్పటికే ప్రశ్నలు లిస్ట్ అయ్యాయి. ఈ ప్రశ్నలపై కేంద్ర జల్‌శక్తి శాఖ రాష్ట్ర ఇరిగేషన్ ఇంజనీర్ల నుంచి సమాధానాలు కోరుతోంది. మరోపక్క ప్రాజెక్టుల అనుమతులు, వాటిపై ఖర్చు చేస్తున్న నిధులపై సమాచారం కోరుతూ కుప్పలు కుప్పలుగా ఆర్టీఐ దరఖాస్తులు వస్తున్నాయి. ఇంకోపక్క రుణాలు ఇస్తున్న బ్యాంకులు, ఇతర రుణ సంస్థలన్నీ అనుమతుల్లేని ప్రాజెక్టులు, వీటికి అనుమతుల సాధనలో రాష్ట్రానికి ఉన్న ప్రణాళికపై వరుస లేఖలు రాస్తున్నాయి. నాలుగురోజులుగా తలమునకలు ఇలా కోర్టు కేసులు, కృష్ణా, గోదావరి బోర్డుల భేటీలు, వాటికి వివరాల సమర్పణ, లేఖలకు సమాధానాలు, పార్లమెంటులో ప్రశ్నలకు జవాబులు సిద్ధం చేయడం తదితర పనుల్లో రాష్ట్ర ఇరిగేషన్ ఇంజనీర్లు గడిచిన నాలుగు రోజులుగా తల మునకలుగా ఉన్నారు. ఓవైపు న్యాయవాదులతో చర్చిస్తూనే మరోవైపు అవసరమైన నివేదికలు సిద్ధం చేసే పనిలో ఉన్నారు. కోర్టు కేసులు, తదితర అంశాలపై రిటైర్ట్ అడ్వొకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి, అదనపు అడ్వొకేట్ జనరల్ రామచందర్రావులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు. పంపుల సరఫరా చేస్తే డబ్బులిస్తారా? తాజాగా కాళేశ్వరం అదనపు టీఎంసీ, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు పంపులు, మోటార్లను సరఫరా చేస్తున్న బీహెచ్ఈఎల్ సైతం పలు సందేహాలు వ్యక్తం చేస్తూ రాష్ట్రానికి లేఖలు రాసినట్లు తెలుస్తోంది. కేంద్రం గెజిట్‌లో అనుమతి లేని ప్రాజెక్టులుగా పేర్కొన్న వీటికి అనుమతులు వస్తాయా? అనుమతులు వచ్చేంతవరకూ పనులు నిలిపివేయాలా? ఒకవేళ పంపులు, మోటార్లు సరఫరా చేస్తే చెల్లింపులు యధావిధిగా కొనసాగుతాయా? అనే ప్రశ్నలకు వివరణ కోరినట్లు సమాచారం. -
తెలుగు రాష్ట్రాలకు ‘గోదావరి’ బోర్డు లేఖ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) శుక్రవారం లేఖ రాసింది. ఆగస్టు 3వ తేదీన నిర్వహించే సమావేశానికి హాజరుకావాలని జీఆర్ఎంబీ కోరింది. గోదావరి నదీ జలాల విషయమై సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల మధ్య ఏర్పడిన జల వివాదాలు కూడా చర్చిస్తారని సమాచారం. బోర్డు నిర్వహించే ఈ సమావేశంపై తెలుగు రాష్ట్రాలు హాజరవుతాయో లేదో తెలియాల్సి ఉంది. -
గోదావరి బోర్డుకు డీపీఆర్‌లు ఇవ్వలేదు
సాక్షి, హైదరాబాద్ : గోదావరి నదీ బేసిన్ల పరిధిలోని ఆయా ప్రాజెక్టుల ‘సమగ్ర ప్రాజెక్టు నివేదిక’(డీపీఆర్)లను ఈనెల 10లోగా ఇవ్వా లని గోదావరి బోర్డు ఆదేశించినా తెలుగు రాష్ట్రాల నుంచి స్పందన కరువైంది. ఇప్పటికే బోర్డు పెట్టిన గడువు ముగిసినా ఇరు రాష్ట్రాలు ప్రాజెక్టుల డీపీఆర్‌లను సమర్పించలేదు. ఈ నెల 5న జరిగిన బోర్డు భేటీలో గోదావరి బేసిన్ పరిధిలో కొత్తగా చేపడుతున్న ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఇస్తామని ఇరు రాష్ట్రాలు అంగీకరించిన విషయం తెలిసిందే. ఈనెల 10 వరకు బోర్డు గడువు పెట్టినా డీపీఆర్‌లు సమర్పించలేదు. ప్రాజెక్టుల డీపీఆర్‌ల అంశంపై కేంద్ర జలశక్తి శాఖ సైతం సీరియస్‌గానే ఉంది. అన్ని ప్రాజె క్టుల డీపీఆర్‌లు తీసుకోవాలని రెండ్రోజుల కిందట నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్రమంత్రి షెకావత్ సైతం బోర్డులకు సూచించారు. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాలకు మరోమారు లేఖలు రాయాలని నిర్ణయించినట్లు గోదావరి బోర్డు వర్గాలు వెల్లడించాయి. -
డీపీఆర్‌లు ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: గోదావరి బేసిన్ పరిధిలో చేపట్టిన కొత్త ప్రాజెక్టుల సమగ్ర నివేదిక (డీపీఆర్)లను ఈ నెల 10లోగా సమర్పించాలని గోదావరి నదీ యాజమాన్య బోర్డు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను ఆదేశించింది. అదే సమయంలో అనుమతిలేని ప్రాజెక్టులపై ముందుకెళ్లరాదని స్పష్టం చేసింది. బోర్డు ఆదేశంతో ప్రాజెక్టుల సాంకేతిక అనుమతి కోసం గోదావరి నదీ యాజమాన్య బోర్డు, కేంద్ర జల సంఘానికి, వాటి ఆమోదం కోసం అపెక్స్ కౌన్సిల్‌కు నివేదికలు సమర్పించేందుకు తెలంగాణ అంగీకరించగా ఏపీ ఇప్పటికే కొన్ని డీపీఆర్‌లను ఇచ్చింది. మిగిలిన ప్రాజెక్టుల డీపీఆర్‌లను సాంకేతిక అనుమతి బోర్డు, సీడబ్ల్యూసీ, అపెక్స్ కౌన్సిల్‌కు ఇచ్చేందుకు ఇరు రాష్ట్రాలు అంగీకరించాయి. గోదా వరి బేసిన్ పరిధిలో ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలు, నీటి వాటాలు, కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌ల సమర్పణ, మళ్లింపు జలాల్లో వాటా, టెలిమెట్రీ వ్యవస్థల ఏర్పాటు అంశాలపై చర్చించేందుకు గోదావరి బోర్డు శుక్రవారం హైదరాబాద్‌లోని ‘జలసౌధ’లో సమావేశమైంది. బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి తెలంగాణ, ఏపీ నీటిపారుదల శాఖ కార్యదర్శులు రజత్‌కుమార్, ఆదిత్యనాథ్దాస్లతోపాటు ఈఎన్సీలు మురళీధర్, నారాయణరెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బోర్డు ఎజెండా అంశాలతోపాటు ఇరు రాష్ట్రాలు ప్రతిపాదించిన అంశాలపై నాలుగు గంటలపాటు చర్చిం చారు. ఈ భేటీలో కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లపై వాడివేడిగా చర్చ జరిగింది. ఆ ప్రాజెక్టులన్నీ రీ ఇంజనీరింగ్ చేసినవే: తెలంగాణ బోర్డు భేటీలో పలు అంశాలపై ఇరు రాష్ట్రాల అధికారులు వాదనలు బలంగా వినిపించారు. ముఖ్యంగా గోదావరి నదిలో తమకు 967 టీఎంసీల మేర వాటా ఉందని, ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించిన విషయాన్ని తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి రజత్‌కుమార్ గుర్తుచేశారు. తమ వాటా మేరకే నీటి వినియోగాన్ని చేసుకునేలా ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని తెలిపారు. తమ వాటాల్లోంచే నీటిని వినియోగిస్తామన్నారు. అయితే దీనిపై ఏపీ అభ్యంతరం తెలిపింది. బచావత్ అవార్డు ప్రాజెక్టులవారీగా నీటి కేటాయింపులు చేయలేదని బోర్డు దృష్టికి తెచ్చింది. కాళేశ్వరం, సీతారామ, తుపాకులగూడెం, తమ్మిడిహెట్టి, ఛనాకా–కొరటా, రాజంపేట, పింపార్డ్ ప్రాజెక్టులన్నీ కొత్తవేనని, వాటికి ఎలాంటి అనుమతులు లేవని వాదించింది. ఏపీ వాదనపై అభ్యంతరం తెలిపిన తెలంగాణ... ఉమ్మడి రాష్ట్రంలో అనుమతులు ఇచ్చిన ప్రాజెక్టులనే రీ ఇంజనీరింగ్ చేశామని, వాటన్నింటికీ కేంద్ర ప్రభుత్వం అటవీ, పర్యావరణ సహా అన్ని అనుమతులు ఇచ్చిందని స్పష్టం చేసింది. దీన్ని ఏపీ ఖండించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం అనుమతులిచ్చే ముందు దిగువ రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందని, అదేమీ జరగని దృష్ట్యా తెలంగాణకు ఇచ్చిన అనుమతులను పునఃపరిశీలించాలని కోరుతూ కేంద్రానికి ఇప్పటికే లేఖలు రాసినట్లు వివరించింది. పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు ఏపీ మళ్లిస్తున్నందున తమకు 45 టీఎంసీల వాటా రావాలని తెలంగాణ మరోమారు కోరింది. అయితే దీనికి అభ్యంతరం చెప్పిన ఏపీ... ఉమ్మడి రాష్ట్రానికి 45 టీఎంసీలని అవార్డులో ఉందని, ఈ మళ్లింపు జలాల్లో తమకు వాటా దక్కుతుందని స్పష్టం చేసింది. అయితే ఇప్పటికే ఈ అంశాన్ని కేంద్ర జలశక్తి శాఖ పరిశీలనకు పంపినందున అక్కడి నుంచి వచ్చే ఆదేశాల వరకు ఆగాలని బోర్డు ఇరు రాష్ట్రాలకు సూచించింది. పోలవరం బ్యాక్ వాటర్ సర్వే చేయాలని తెలంగాణ కోరింది. గరిష్ట వరదలు నమోదైనప్పుడు తెలంగాణలోని పలు ప్రాంతాలు ముంపునకు గురవుతాయని చెప్పగా ఇప్పటికే కేంద్ర జల సంఘం అధ్యయనం చేసి తెలంగాణకు ఎలాంటి ముంపు లేదని నిర్ధారించిందని ఏపీ స్పష్టం చేసింది. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతున్న గోదావరి బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ టెలిమెట్రీపై నిపుణులతో కమిటీ.. అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద ప్రధాన ప్రాంతాల్లో నీటి ప్రవాహ లెక్కల నమోదు కోసం టెలిమెట్రీ వ్యవస్థల ఏర్పాటుకు ఇరు రాష్ట్రాలు అంగీకరించాయి. ఏయే ప్రాంతాల్లో వాటిని ఏర్పాటు చేయాలనే విషయమై ఇరు రాష్ట్రాలతోపాటు సీడబ్ల్యూసీ, పుణేలోని సీడబ్ల్యూపీఆర్ఎస్లోని ఇంజనీర్లతో బోర్డు ఓ కమిటీని నియమించింది. సత్వరమే ‘అపెక్స్’ఎజెండా: చంద్రశేఖర్ అయ్యర్ కొత్తగా చేపడుతున్న ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఇచ్చేందుకు ఇరు రాష్ట్రాలు అంగీకరించినట్లు గోదావరి నదీ యాజమాన్య బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ మీడియాతో మాట్లాడుతూ ప్రకటించారు. తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులపై ఏపీ అభ్యంతరాల గురించి వివరణ ఇవ్వాలని తెలంగాణను ఆదేశించినట్లు వెల్లడించారు. అలాగే అపెక్స్ భేటీలో చర్చించాల్సిన ఎజెండా అంశాలను సత్వరమే పంపాలని కోరగా ఇరు రాష్ట్రాలు అంగీకరించాయన్నారు. తెలంగాణ చేపట్టిన పెద్దవాగు ఆధునీకరణ పనులను సామరస్యంగా పరిష్కరించుకొనేందుకు ఏపీ ఒప్పుకున్నట్లు తెలిపారు. అనుమతులు లేని ప్రాజెక్టుల విషయంలో ముందుకెళ్లరాదని ఇదివరకే ఇరు రాష్ట్రాలను కోరామని, అదే విషయాన్ని మరోమారు స్పష్టం చేసినట్లు తెలిపారు. ఎస్సారెస్పీ డీపీఆర్‌నూ అడగటం విచిత్రం... రాష్ట్రంలో ఎలాంటి కొత్త ప్రాజెక్టులు లేవని బోర్డుకు చెప్పాం. పాత ప్రాజెక్టులకే రీ ఇంజనీరింగ్ చేశాం తప్పితే కొత్త ప్రాజెక్టులు చేపట్టలేదని వివరించాం. కాళేశ్వరం పాత ప్రాజెక్టేనని కేంద్రం లేఖ సైతం ఇచ్చింది. ప్రాజెక్టుల డీపీఆర్‌లపై ప్రభుత్వానికి సమాచారం ఇచ్చాక తేలుస్తాం. రాష్ట్రానికి 967 టీఎంసీల వాటా ఉంది. ఈ వాటాల్లోంచే నీటిని వినియోగిస్తాం. ఇక ఎస్సారెస్పీ ప్రాజెక్టు డీపీఆర్‌ను అడగటం విచిత్రం. 2014 జూన్ 2కు ముందు పూర్తయిన డీపీఆర్‌లు అడగొద్దని స్పష్టంగా చెప్పాం.– రజత్‌కుమార్, నీటిపారుదల శాఖ కార్యదర్శి -
సర్వ వివాద నివారిణి.. ‘అపెక్స్ కౌన్సిల్’
► కేంద్ర జల వనరుల శాఖకు లేఖలు రాసిన కృష్ణా, గోదావరి బోర్డులు ► తక్షణమే ఇరు రాష్ట్రాల సీఎంలతో సమావేశం నిర్వహించాలని సూచన సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ జలాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారానికి కేంద్ర జల వనరుల శాఖ నేతృత్వాన ఇరు రాష్ట్రాల సీఎంలతో అపెక్స్ కౌన్సిల్ భేటీ నిర్వహించ డమే పరిష్కార మార్గమని కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు కేంద్ర జల వనరుల శాఖకు స్పష్టం చేశాయి. కొత్త ప్రాజెక్టులపై వివాదం సమసిపోవాలన్నా, మళ్లింపు జలాలకు పరిష్కారం దొరకాలన్నా, నీటి వాటాలపై స్పష్టత రావాలన్నా అపెక్స్ కౌన్సిల్ భేటీ అత్యావశ్యమని తెలిపాయి. ఈ మేరకు రెండు బోర్డులు శుక్రవారం విడివిడిగా కేంద్ర జల వనరుల శాఖకు లేఖలు రాశాయి. అన్నింటికీ అదే మందు... కృష్ణా, గోదావరి బేసిన్‌లోని వివాదాలపై గత రెండేళ్లలో అపెక్స్ కౌన్సిల్ భేటీ నిర్వహించిన కేంద్రం.. ఇరు రాష్ట్రాల మధ్య ఓ అవగాహన కుదర్చడంతో తాత్కాలిక పరిష్కారం దొరికిం ది. ఈ ఏడాది ఎలాంటి భేటీ జరగలేదు. దీంతో జల వివాదాలు మరింత ముదిరాయి. తెలంగాణ రీ–ఇంజనీరింగ్ చేస్తున్న పాల మూరు–రంగారెడ్డి, డిండి, సీతారామ, భక్తరామదాస, తుమ్మిళ్ల, కంతనపల్లి వంటి ప్రాజెక్టులను కేంద్రం, బోర్డు అనుమతులు లేవని ఏపీ అంటోంది. ప్రతిగా ఏపీ చేపట్టిన పులికనుమ, సిద్ధాపురం, గాజులదిన్నె, గుండ్రే వుల, శివభాష్యం సాగర్, మున్నేరు, ముచ్చు మర్రి, గురు రాఘవేంద్ర, ఆర్డీఎస్ కుడి కాల్వ అంశాలని తెలంగాణ తెరపైకి తెచ్చింది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 85(సి) నిబం« ధన కింద ఏదైనా కొత్త ప్రాజెక్టు చేపడితే దానికి బోర్డు నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉన్నా, ఎలాంటి అనుమతులు, కేటాయింపు లు లేకుండా చేపడుతున్న ఈ ప్రాజెక్టులను కేంద్రం నిలుపుదల చేసేలా చర్యలు తీసుకోవా లని కోరింది. దీనిపై బోర్డు ముందు వాదనలు జరిగినప్పటికీ పరిష్కారం దొరకలేదు. జలాల మళ్లింపు మరింత జటిలం... ఇక నదీ జలాల మళ్లింపు అంశం మరింత వివాదాస్పదంగా మారింది. పట్టిసీమ ద్వారా ఏపీ తరలిస్తున్న నీటిలో తెలంగాణకు 45 టీఎంసీలు రావాలని, పోలవరం ద్వారా మరో 45 టీఎంసీలు దక్కాలని తెలంగాణ అంటోం ది. దీనికి బదులుగా ఏపీ సరికొత్త వాదనను తెరపైకి తెచ్చింది. గోదావరి ట్రిబ్యునల్ తీర్పు నకు విరుద్ధంగా తెలంగాణ సర్కార్ పలు ప్రాజెక్టుల ద్వారా 163 టీఎంసీల జలాలను కృష్ణా నదీ పరీవాహక ప్రాంతానికి మళ్లిస్తోం దని అంటోంది. బచావత్ ట్రిబ్యునల్ తీర్పులో 14(బీ) క్లాజ్ ప్రకారం 163 టీఎంసీల మళ్లింపు జలాల్లో ఏపీకి వాటా ఇవ్వాలని అంటోంది. కృష్ణా బేసిన్లో ఉమ్మడి ఏపీకి లభించే 811 టీఎంసీల్లో తెలంగాణకు 299, ఏపీకి 512 టీఎంసీలు దక్కుతాయని ఒప్పందం ఉంది. గోదావరిలో లభ్యంగా ఉన్న 1,480 టీఎంసీలకు సంబంధించి ఎలాంటి ఒప్పందం లేదు. నీటి లభ్యత, పరీవాహకం ఆధారంగా తెలంగాణకు 954 టీఎంసీ, మిగితావి ఏపీవన్న అవగాహనతో ముందు కెళుతున్నాయి. ఈ నేపథ్యంలో అపెక్స్ కౌన్సిల్ భేటీ వీటన్నిటికీ మార్గం చూపుతుందని బోర్డులు కేద్రానికి సూచించాయి. -
గోదావరి బోర్డు ముందుకు ‘పట్టిసీమ’!
సమావేశం ఎజెండాలో చేర్చిన రాష్ట్ర ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: గోదావరి నదిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన పట్టిసీమ ఎత్తిపోతల పథకం అంశం గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు చేరనుంది. ఈ ప్రాజెక్టుపై ఇప్పటివరకు ఉత్తర ప్రత్యుత్తరాలకే పరి మితమైన ఇరు రాష్ట్రాలు.. ఈ నెల 27న జరగనున్న గోదావరి బోర్డు భేటీలో ముఖాముఖి తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. పట్టిసీమ అంశాన్ని సమావేశం ఎజెండాలో చేరుస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. గోదావరి బోర్డు అనుమతి లేకుండానే, కనీస సమాచారం ఇవ్వకుండానే.. ఏపీ ప్రభుత్వం ఆ ప్రాజెక్టుకు పరిపాలనా అనుమతులివ్వడం, పనులు కూడా చేపట్టడంపై తెలంగాణ అభ్యంతరాలను లేవనెత్తనుంది. దీంతోపాటు గోదావరి నీటిపై ఆధారపడ్డ సీలేరులో విద్యుత్ ఒప్పందాలను ఏపీ ఉల్లంఘిస్తుండడంపై ఎండగట్టనుంది. కృష్ణా నీటిని వాడుకుంటూ రాష్ట్రం చేపట్టిన పాలమూరు, డిండి ఎత్తిపోతల పథకాలపై ఏపీ అభ్యంతరాలను లేవనెత్తుతుండగా.. పట్టిసీమను రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. పాలమూరు, డిండి పథకాలను తప్పుపడుతూ ఏపీ ఇటీవల పదేపదే కేంద్రానికి ఫిర్యాదులు చేసింది. వాటిని ఎట్టిపరిస్థితుల్లోనూ అడ్డుకుంటామని చెబుతోంది. దీనిపై దీటుగానే స్పందించాలన్న సీఎం కేసీఆర్ సూచన మేరకు అధికారులు కూడా ఏపీ చేపట్టిన ‘పట్టిసీమ’ ఉల్లంఘనలను ఎత్తిచూపుతున్నారు. 1978లో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల మధ్య జరిగిన ఒప్పందం మేరకు పోలవరం ప్రాజెక్టు నుంచి మాత్రమే 80టీఎంసీల నీటిని మళ్లించాలని... అంతకుమించి నీటిని మళ్లిస్తే, ఆ నీటిని మూడు రాష్ట్రాలు సమానంగా పంచుకోవాలని స్పష్టం చేస్తున్నారు. ఈ ఒప్పందాన్ని ఏపీ ఉల్లంఘిస్తోందని పేర్కొంటున్నారు. పట్టిసీమ ప్రాజెక్టు పోలవరంలో అంతర్భాగమే అయితే దీనికి సంబంధించిన 80 టీఎంసీల్లో ఎగువ రాష్ట్రాలకు ఉన్న 35 టీఎంసీల వాటాను కర్ణాటక, మహారాష్ట్రలు కృష్ణా జలాల్లో మినహాయించుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. మిగతా 45 టీఎంసీల వాటా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినవి కాగా.. అందులో తెలంగాణ వాటాగా 19 టీఎంసీలు ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. 27న జరిగే సమావేశంలో ఈ అంశాలన్నింటినీ లేవనెత్తనున్నారు. సీలేరు నివేదికపైనా..: గోదావరి జలాల వినియోగంతో ఎగువ, దిగువ సీలేరు ప్రాజెక్టుల్లో ఏపీ కొనసాగిస్తున్న విద్యుదుత్పత్తి వాటాలను తేల్చేందుకు ఉద్దేశించిన నీరజా మాథుర్ కమిటీ నివేదికను కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ(సీఈఏ) ఇంకా బహిర్గతం చేయని అంశాన్ని ఈ సమావేశంలో తెలంగాణ అధికారులు ప్రస్తావించే అవకాశాలున్నాయి. -
ప్రాజెక్టుల పర్యవేక్షణపై ఏమంటారు?
గోదావరి బోర్డు పరిధిలోకి తేవాల్సినవేవి? రెండు వారాల్లో తెలపాలని ఇరు రాష్ట్రాలను కోరిన కేంద్ర జలసంఘం మార్గదర్శకాలను సూచిస్తూ వేర్వేరుగా లేఖలు పర్యవేక్షణ అవసరం లేదంటున్న తెలంగాణ కుదరదంటున్న ఏపీ సర్కారు సాక్షి, హైదరాబాద్: గోదావరి నదీ యాజమాన్య బోర్డు పరిధిలోకి తేవాల్సిన ప్రాజెక్టుల వివరాలను అందించాలని ఇరు రాష్ర్ట ప్రభుత్వాలను కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) కోరింది. బోర్డు పరిధిలోకి తెచ్చే ప్రాజెక్టుల ఎంపిక విషయంలో నాలుగు మార్గదర్శకాలను కూడా సూచించింది. వీటిపై ఇరు రాష్ట్రాల అభిప్రాయాలను తెలపాలని, రెండు వారాల్లో ప్రాజెక్టుల వివరాలను సమర్పించాలని పేర్కొంది. అక్టోబర్ 15లోగా కృష్ణా, గోదావరి బోర్డుల సమావేశాన్ని నిర్వహించి, వాటి పరిధిలోని ప్రాజెక్టుల అంశంతో పాటు, కార్యాలయాల కూర్పుపై ఓ అవగాహనకు రావాలని ఇరు రాష్ట్రాలకు సీడబ్ల్యూసీ సూచించినట్లు తెలిసింది. ప్రత్యేకంగా గోదావరి పరిధిలోని ప్రాజెక్టుల విషయంలో ఎలాంటి ప్రాతిపదిక తీసుకోవాలన్న దానిపై ఇటీవలే లేఖలు కూడా రాసింది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు నీటిని అందించే ప్రాజెక్టులు, ఉమ్మడిగా నీరందించే కాలువలు ఉన్న ప్రాజెక్టులు, విద్యుత్ ఉత్పత్తి జరిగేవి, రెండు రాష్ట్రాల పర్యవేక్షణ అవసరమున్న ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకురావాలని ఆ లేఖల్లో అభిప్రాయపడింది. దీనిపై ఇరు రాష్ర్ట ప్రభుత్వాలు తమ అభిప్రాయాలను చెప్పాలని కోరింది. వివాదం లేనప్పుడు బోర్డు పర్యవేక్షణ అనవసరం: తెలంగాణ సర్కారు సీడబ్ల్యూసీ లేఖపై తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. గోదావరిలో నీరు సమృద్ధిగా ఉండటం, ఎక్కడా వివాదం లేని కారణంగా బోర్డు పర్యవేక్షణలోకి తీసుకురావాల్సిన ప్రాజెక్టులేవీ ఉండవని రాష్ర్ట ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. ఆంధ్రప్రదేశ్ నిర్మించ తలపెట్టిన పోలవరం ప్రాజెక్టు విషయంలో కాస్త వివాదం ఉన్నా, ముంపు ప్రాంతాలను పూర్తిగా ఆంధ్రాలో కలిపినందున ఇక సమస్య ఉండబోదని భావిస్తోంది. పోలవరం ప్రాజెక్టుతో కృష్ణా బేసిన్‌లోకి వచ్చే 80 టీఎంసీల నీటిలో ఇప్పటికే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలకు పంపకాలు జరిగాయి. ఇందులో ఏపీకి కేటాయించిన 45 టీఎంసీల నీటిలో తెలంగాణ వాటా విషయాన్ని ట్రిబ్యునల్ మాత్రమే తేల్చుతుందని రాష్ర్ట వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇదే అంశాన్ని బోర్డుకు నివేదిక ద్వారా తెలియజేస్తామని, అయితే ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తేవాలని పట్టుబడితే అందుకు అనుగుణంగా చేపట్టాల్సిన కార్యాచరణపై బోర్డు సమావేశంలో చర్చిస్తామని నీటి పారుదల శాఖ ముఖ్యుడొకరు తెలిపారు. రెండు బోర్డులకు ఒకే విధానం: ఏపీ ఇక ఆంధ్రప్రదేశ్ మాత్రం గోదావరిపై ఎప్పుడో నిర్మితమైన నిజాంసాగర్, శ్రీరాంసాగర్, సింగూర్, లోయర్ మానేరు, కడెం, ఘనపూర్ మొదలు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాణహిత, ఇచ్చంపల్లి తదితర ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తేవాల్సిందేనని వాదిస్తోంది. వివాదాలు నెలకొన్న రెండు బేసిన్ల పరిధిలోని బోర్డులకు ఒకే మార్గదర్శకాలను పాటించాలని, వేర్వేరు మార్గదర్శకాలు సరికాదని అభిప్రాయపడుతోంది. సుంకేశుల, రాజోలిబండ, పోతిరెడ్డిపాడు, శ్రీశైలం ప్రాజెక్టులను కృష్ణా బోర్డు పరిధిలోకి తేవాలని తెలంగాణ సర్కారు కోరుతున్నందున... గోదావరి ప్రాజెక్టులను కూడా బోర్డు పరిధిలోకి తేవాల్సిందేనని ఏపీ అంటోంది.