సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఒక్క పెద్దవాగు మినహా ఇతర సాగునీటి ప్రాజెక్టుల అప్పగింతపై ఎలాంటి హామీ ఇవ్వలేమని గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ)కి తెలంగాణ నీటిపారుదల శాఖ మరోసారి స్పష్టం చేసింది. ప్రాజెక్టుల డీపీఆర్‌లు, ప్లాంట్లు, యంత్రాలు, పరికరాలు, కార్యాలయాలు, ఫర్నిచర్, వాహనాలు, మంజూరైన పోస్టులు, ఇతర రికార్డులను బోర్డులకు అప్పగించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఆదేశాల్లేవని పేర్కొంది.
తెలంగాణలోని రెండు, ఏపీలోని రెండు నీటి విడుదల పాయింట్లను బోర్డుల చేతికి అప్పగించే అంశంపై గోదావరి బోర్డు సబ్ కమిటీ బుధవారం జలసౌధలో సమావేశమై చర్చించింది. ఈ సందర్భంగా తెలంగాణ అధికారులు రాష్ట్ర వాదనను వినిపించారు. దేవాదుల పథకానికి సంబంధించిన ఇన్‌టెక్ పంపుహౌజ్ వద్ద గోదావరి బోర్డు జరిపిన క్షేత్రస్థాయి పర్యటనలో సబ్‌కమిటీని దూరంగా ఉంచిన నేపథ్యంలో.. ఆ ప్రాజెక్టు అప్పగింతకు సంబంధించిన నివేదికను తెలంగాణ అధికారులు వ్యతిరేకించారు.
గోదావరిపై రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టులేవీ లేనందున.. ప్రాజెక్టుల వద్ద కేంద్ర బలగాల(సీఐఎస్‌ఎఫ్)ను మోహరించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. దానివల్ల రాష్ట్ర ఖజానాపై అనవసర భారం పడుతుందని వివరించారు. ‘‘గోదావరి ట్రిబ్యునల్ తీర్పులోని క్లాజ్–4 ప్రకారం.. తమ వాటాలోని ఏదైన భాగాన్ని ఇతర బేసిన్లకు బదిలీ చేసుకునే స్వేచ్ఛ రాష్ట్రాలకు ఉంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, దేవాదుల పథకాలు ఉమ్మడి రాష్ట్రంలో కట్టినవే. గోదావరి నీటిని కృష్ణాబేసిన్ ప్రాంతాలకు తరలించడంపై అప్పట్లో ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరాలు లేవు.
రాష్ట్ర విభజన అనంతరం ఏపీ లేవనెత్తుతున్న అభ్యంతరాలు తెలంగాణకు ఏమాత్రం ఆమోదయోగ్యం కావు. గోదావరి ట్రిబ్యునల్ తీర్పుకు సైతం అది వ్యతిరేకం’’ అని వివరించారు. ఇక ప్రాజెక్టుల అప్పగింతపై గోదావరి బోర్డు రూపొందించిన నివేదికపై అధ్యయనం కోసం కొంత సమయం కావాలని రాష్ట్ర అధికారులు కోరగా.. ఇందుకు బోర్డు చైర్మన్ సానుకూలంగా స్పందించారు. అప్పగింత నివేదికపై చర్చను తదుపరి సమావేశానికి వాయిదా వేశారు. సమావేశంలో తెలంగాణ తరఫున సీఎం ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే, ఇంటర్‌స్టేట్ విభాగం ఎస్‌ఈ కోటేశ్వరరావు, ఈఈ సుబ్రమణ్య ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment