సాక్షి, అమరావతి: జలాశయాల నిర్వహణ కమిటీ(ఆర్‌ఎంసీ) నివేదికను ఆమోదించి జల వివాదాలకు కృష్ణా బోర్డు తెరదించుతుందా? లేక యథాప్రకారం నివేదికను అటకెక్కించి జల వివాదాలను కొనసాగనిస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఆర్‌ఎంసీ నివేదికపై చర్చించి, ఆమోదించడమే అజెండాగా జనవరి 6న కృష్ణా బోర్డు 17వ సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్ ఇప్పటికే లేఖలు రాశారు.
రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరాక ఆర్‌ఎంసీ రూపొందించిన నివేదికపై సంతకాలు చేయడంలో తెలంగాణ అధికారులు అడ్డం తిరిగిన నేపథ్యంలో.. సర్వసభ్య సమావేశంలో సమగ్రంగా చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని కృష్ణా బోర్డు నిర్ణయించింది.
నివేదిక తయారీలోనే తీవ్ర జాప్యం
► కృష్ణా జలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య విభేదాలకు ప్రధానంగా కారణమవుతున్న ఉమ్మడి ప్రాజెక్టుల్లో విద్యుదుత్పత్తి, రూల్ కర్వ్స్(ప్రాజెక్టుల నిర్వహణ విధి విధానాలు), మళ్లించిన వరద జలాలను కోటాలో కలపాలా? వద్దా అనే అంశాలపై 2022, మే 6న సర్వ సభ్య సమావేశంలో చర్చించారు. ఈ మూడు సమస్యల పరిష్కారానికి కృష్ణా బోర్డు సభ్యులు ఆర్కే పిళ్లై అధ్యక్షతన రెండు రాష్ట్రాల ఈఎన్‌సీ, జెన్‌కోల డైరెక్టర్లు సభ్యులుగా ఆర్‌ఎంసీని 2022, మే 10న నియమించారు.
► ఉమ్మడి ప్రాజెక్టుల్లో విద్యుదుత్పత్తిపై 15 రోజుల్లోగా.. రూల్ కర్వ్స్, వరద జలాలపై నెలలోగా నివేదిక ఇవ్వాలని ఆర్‌ఎంసీని ఆదేశించారు. కానీ.. గడువులోగా ఆర్‌ఎంసీ నివేదిక ఇవ్వలేదు.
► నివేదికను రూపకల్పనకు ఆరు సార్లు ఆర్‌ఎంసీ సమావేశమైంది. 3న శ్రీశైలంలో కనీస నీటిమట్టం 854 అడుగులుగానూ, ఉత్పత్తయ్యే విద్యుత్‌లో చెరి సగం పంచుకునేలా.. దిగువన సాగు, తాగునీటి అవసరాలు ఉంటేనే విద్యుదుత్పత్తి చేస్తూ నీటిని విడుదల చేసేలా రెండు రాష్ట్రాల మద్య ఏకాభిప్రాయం కుదిరింది. సాగర్ రూల్ కర్వ్స్‌పై సీడబ్ల్యూసీను సంప్రదించి ఖరారు చేసుకునేందుకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. వరద రోజుల్లో మళ్లించే జలాలను లెక్కించినా.. వాటిని నికర జలాల కోటాలో కలపకూడదని నిర్ణయించాయి. ఇదే అంశాలతో 3న నివేదికను రూపొందించింది.
కృష్ణా బోర్డు నిర్ణయమే ఫైనల్
ఆర్‌ఎంసీ నివేదికపై సంతకం చేయడానికి కొంత సమయం కావాలని తెలంగాణ అధికారులు అడిగారు. దాంతో 5న నివేదికపై సంతకాలు చేయడానికి ఆర్‌ఎంసీ సమావేశాన్ని ఏర్పాటు చేయగా, సంతకాలు చేసేదిలేదని తెలంగాణ అధికారులు సమావేశానికి డుమ్మాకొట్టారు. దీంతో నివేదికపై కృష్ణా బోర్డు సభ్యులు ఆర్కే పిళ్లై, మౌతాంగ్, ఏపీ అధికారులు సంతకాలు చేసి 8న బోర్డు చైర్మన్‌కు అందజేశారు. ఈ నివేదికపై జనవరి 6న కృష్ణా బోర్డు తీసుకునే నిర్ణయమే ఫైనల్. నివేదికను అమలు చేస్తే జల వివాదాలకు తెరపడినట్టేనంటున్నారు.
జల వివాదాలకు తెరపడేనా?
Published Mon, Dec 19 2022 5:20 AM | Last Updated on Mon, Dec 19 2022 6:00 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment