water disputes
-
జల వివాదాలకు తెరపడేనా?
సాక్షి, అమరావతి: జలాశయాల నిర్వహణ కమిటీ(ఆర్ఎంసీ) నివేదికను ఆమోదించి జల వివాదాలకు కృష్ణా బోర్డు తెరదించుతుందా? లేక యథాప్రకారం నివేదికను అటకెక్కించి జల వివాదాలను కొనసాగనిస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఆర్ఎంసీ నివేదికపై చర్చించి, ఆమోదించడమే అజెండాగా జనవరి 6న కృష్ణా బోర్డు 17వ సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్ ఇప్పటికే లేఖలు రాశారు. రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరాక ఆర్ఎంసీ రూపొందించిన నివేదికపై సంతకాలు చేయడంలో తెలంగాణ అధికారులు అడ్డం తిరిగిన నేపథ్యంలో.. సర్వసభ్య సమావేశంలో సమగ్రంగా చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని కృష్ణా బోర్డు నిర్ణయించింది. నివేదిక తయారీలోనే తీవ్ర జాప్యం ► కృష్ణా జలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య విభేదాలకు ప్రధానంగా కారణమవుతున్న ఉమ్మడి ప్రాజెక్టుల్లో విద్యుదుత్పత్తి, రూల్ కర్వ్స్(ప్రాజెక్టుల నిర్వహణ విధి విధానాలు), మళ్లించిన వరద జలాలను కోటాలో కలపాలా? వద్దా అనే అంశాలపై 2022, మే 6న సర్వ సభ్య సమావేశంలో చర్చించారు. ఈ మూడు సమస్యల పరిష్కారానికి కృష్ణా బోర్డు సభ్యులు ఆర్కే పిళ్లై అధ్యక్షతన రెండు రాష్ట్రాల ఈఎన్సీ, జెన్కోల డైరెక్టర్లు సభ్యులుగా ఆర్ఎంసీని 2022, మే 10న నియమించారు. ► ఉమ్మడి ప్రాజెక్టుల్లో విద్యుదుత్పత్తిపై 15 రోజుల్లోగా.. రూల్ కర్వ్స్, వరద జలాలపై నెలలోగా నివేదిక ఇవ్వాలని ఆర్ఎంసీని ఆదేశించారు. కానీ.. గడువులోగా ఆర్ఎంసీ నివేదిక ఇవ్వలేదు. ► నివేదికను రూపకల్పనకు ఆరు సార్లు ఆర్ఎంసీ సమావేశమైంది. 3న శ్రీశైలంలో కనీస నీటిమట్టం 854 అడుగులుగానూ, ఉత్పత్తయ్యే విద్యుత్‌లో చెరి సగం పంచుకునేలా.. దిగువన సాగు, తాగునీటి అవసరాలు ఉంటేనే విద్యుదుత్పత్తి చేస్తూ నీటిని విడుదల చేసేలా రెండు రాష్ట్రాల మద్య ఏకాభిప్రాయం కుదిరింది. సాగర్ రూల్ కర్వ్స్‌పై సీడబ్ల్యూసీను సంప్రదించి ఖరారు చేసుకునేందుకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. వరద రోజుల్లో మళ్లించే జలాలను లెక్కించినా.. వాటిని నికర జలాల కోటాలో కలపకూడదని నిర్ణయించాయి. ఇదే అంశాలతో 3న నివేదికను రూపొందించింది. కృష్ణా బోర్డు నిర్ణయమే ఫైనల్ ఆర్ఎంసీ నివేదికపై సంతకం చేయడానికి కొంత సమయం కావాలని తెలంగాణ అధికారులు అడిగారు. దాంతో 5న నివేదికపై సంతకాలు చేయడానికి ఆర్ఎంసీ సమావేశాన్ని ఏర్పాటు చేయగా, సంతకాలు చేసేదిలేదని తెలంగాణ అధికారులు సమావేశానికి డుమ్మాకొట్టారు. దీంతో నివేదికపై కృష్ణా బోర్డు సభ్యులు ఆర్కే పిళ్లై, మౌతాంగ్, ఏపీ అధికారులు సంతకాలు చేసి 8న బోర్డు చైర్మన్‌కు అందజేశారు. ఈ నివేదికపై జనవరి 6న కృష్ణా బోర్డు తీసుకునే నిర్ణయమే ఫైనల్. నివేదికను అమలు చేస్తే జల వివాదాలకు తెరపడినట్టేనంటున్నారు. -
ముగింపా? కొనసాగింపా?
సాక్షి, అమరావతి: కృష్ణా నదీజలాల వినియోగంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య తరచుగా వివాదాలకు దారితీస్తున్న సమస్యల పరిష్కారానికి రిజర్వాయర్ మేనేజ్మెంట్ కమిటీ (ఆర్ఎంసీ) వచ్చే నెల 3న నివేదిక ఇవ్వనుంది. ఈ నివేదికతోనైనా జల వివాదాలకు తెరపడుతుందా లేదా అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, సాగర్ల నిర్వహణ నియమావళి, విద్యుదుత్పత్తి, మళ్లించిన వరదజలాలను కోటాలో కలపడం ప్రధానమైన మూడు సమస్యలని మే 6న జరిగిన కృష్ణా బోర్డు 16వ సర్వ సభ్య సమావేశంలో బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్ గుర్తించారు. ఆ సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇచ్చేందుకు బోర్డు సభ్యులు ఆర్కే పిళ్లై అధ్యక్షతన రెండు రాష్ట్రాల ఈఎన్సీలు, జెన్కోల సీఈలు సభ్యులుగా ఆర్ఎంసీని ఏర్పాటు చేశారు. సమస్య –1: రూల్ కర్వ్‌పై తలో మాట బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపుల ఆధారంగా ఆంధ్రప్రదేశ్‌కు 512, తెలంగాణకు 299 టీఎంసీలు నీటిని కేటాయిస్తూ కేంద్రం తాత్కాలిక సర్దుబాటు చేసింది. దీని ఆధారంగా శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో ఏ ప్రాజెక్టు ఆయకట్టుకు ఎప్పుడు నీటిని విడుదల చేయాలనే నియమావళి (రూల్ కర్వ్) ముసాయిదాను కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) రూపొందించింది. ఈ రూల్ కర్వ్‌పై ఆర్ఎంసీ చర్చించింది. సీడబ్ల్యూసీ రూపొందించిన రూల్ కర్వ్‌ను ఏపీ ప్రభుత్వం ఆమోదించగా, తెలంగాణ వ్యతిరేకించింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 114 టీఎంసీలు (చెన్నైకి తాగునీరు, ఎస్సార్బీసీ, తెలుగుగంగ, గాలేరు– నగరి) బచాత్ ట్రిబ్యునల్, విభజన చట్టం కేటాయింపులు చేశాయని ఏపీ ప్రభుత్వం గుర్తు చేస్తోంది. ఆ మేరకు నీటి కేటాయింపులు ఉండాల్సిందేనని స్పష్టం చేస్తోంది. సీడబ్ల్యూసీ కూడా ఏపీ వాదననే సమర్థిస్తోంది. సమస్య–2: విద్యుదుత్పత్తిపై తకరారు సాగర్, కృష్ణా డెల్టా ఆయకట్టులో సాగు, తాగునీటి అవసరాలున్నప్పుడు, కృష్ణా బోర్డు కేటాయించిన నీటిని మాత్రమే శ్రీశైలం నుంచి దిగువకు విడుదల చేస్తూ విద్యుదుత్పత్తి చేయాలన్నది నిబంధన. శ్రీశైలంలో ఉత్పత్తయ్యే విద్యుత్ నీటి కేటాయింపుల మేరకు 64% వాటా తమకు రావాలని ఏపీ స్పష్టం చేస్తుండగా.. తెలంగాణ మాత్రం తమకు 76% వాటా కావాలని ప్రతిపాదిస్తోంది. సమస్య–3: వరద జలాల మళ్లింపు.. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతలలో నీటి మట్టం గరిష్ట స్థాయిలో ఉండి, దిగువకు విడుదల చేస్తున్నప్పుడు.. ప్రకాశం బ్యారేజ్ ద్వారా కడలిలో జలాలు కలుస్తున్నప్పుడు.. అంటే వరద రోజుల్లో రెండు రాష్ట్రాలు ఏ మేరకు జలాలు మళ్లించినా వాటిని కోటాలో కలపకూడదని ఏపీ ప్రభుత్వం ఆది నుంచి ప్రతిపాదిస్తోంది. దీన్ని తెలంగాణ వ్యతిరేకిస్తోంది. -
గడువు ముగిసినా గొడవలే..!
సాక్షి, అమరావతి: కృష్ణా, గోదావరి జలాలపై ఏపీ, తెలంగాణ మధ్య వివాదాలకు చరమగీతం పాడటానికి కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ కేంద్రం గతేడాది జూలై 15న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ల అమలు ప్రశ్నార్థకంగా మారింది. ప్రాజెక్టుల అప్పగింత, పరిధిపై రెండు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి రాకపోవడంతో నోటిఫికేషన్ అమలును కేంద్రం పొడిగించిన ఆరు నెలల గడువు కూడా జూలై 15కే పూర్తయింది. అయినా రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయాన్ని సాధించడంలో బోర్డులు విఫలమయ్యాయి. దీనిపై బోర్డులు, కేంద్ర జల్ శక్తి శాఖ స్పందించడం లేదు. దాంతో రెండు రాష్ట్రాల మధ్య జలవివాదాలు సద్దుమణగడం లేదు. రెండు బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ నోటిఫికేషన్ జారీ చేయాలని 2020 అక్టోబర్ 6న జరిగిన అపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశంలో కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ కోరారు. గతేడాది శ్రీశైలంలోకి వరద ప్రవాహం లేకున్నా, నీటి నిల్వ కనిష్ట స్థాయిలో ఉన్నా.. దిగువన సాగు, తాగునీటి అవసరాలు లేకున్నప్పటికీ, బోర్డు అనుమతి తీసుకోకుండానే తెలంగాణ విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు నీటిని వదిలేసింది. దీనివల్ల కృష్ణా జలాలు వృథాగా కడలిపాలయ్యాయి. కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను తెలంగాణ సర్కారు హరిస్తుండటంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దాంతో కేంద్రంలో కదలిక వచ్చింది. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ గతేడాది జూలై 15న నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ షెడ్యూల్–2లో పేర్కొన్న ప్రాజెక్టులను ఆర్నెల్లలో కృష్ణా, గోదావరి బోర్డులకు రెండు రాష్ట్రాలు అప్పగించాలి. అనుమతి లేని ప్రాజెక్టులకు ఆర్నెల్లలో అనుమతి తెచ్చుకోవాలి. లేదంటే ఆ ప్రాజెక్టుల నుంచి నీటి వినియోగానికి అనుమతించరు. కృష్ణా బేసిన్లో ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను బోర్డుకు అప్పగించేందుకు రెండు రాష్ట్రాలు తొలుత అంగీకరించాయి. ఏపీ భూభాగంలోని శ్రీశైలం, సాగర్ విభాగాలను కృష్ణా బోర్డుకు అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా, తెలంగాణ సర్కారు దాని పరిధిలోని విభాగాలను అప్పగించబోమని స్పష్టం చేసింది. నోటిఫికేషన్ అమలు గడువు జనవరి 15తో పూర్తయినా, ఏకాభిప్రాయ సాధన కుదరలేదు. దీంతో కేంద్ర జల్‌శక్తి శాఖ ఈ గడువును జూలై 15 వరకు పొడిగించింది. ఈ క్రమంలోనే విభజన చట్టంలో పేర్కొన్న హంద్రీ–నీవా, వెలిగొండ, తెలుగుగంగ, గాలేరు–నగరి, కల్వకుర్తి (పాతది), నెట్టెంపాడు (పాతది) ప్రాజెక్టులకు అనుమతి ఉన్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. మిగతా ప్రాజెక్టులకు అనుమతి తెచ్చుకోవాలని ఆదేశించింది. కేంద్రం పొడిగించిన గడువు కూడా పూర్తయి మూడు నెలలు దాటింది. అయినా తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బేసిన్లో అనుమతి లేకుండా చేపట్టిన తుమ్మిళ్ల ఎత్తిపోతల, పాలమూరు–రంగారెడ్డి, భక్త రామదాస, మిషన్ భగీరథ తదితర ప్రాజెక్టులకు అనుమతి తెచ్చుకోలేదు. గోదావరి బేసిన్లో అనుమతి లేకుండా చేపట్టిన ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలని రెండు రాష్ట్రాలు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ)కు డీపీఆర్‌లు సమర్పించాయి. శ్రీశైలం, సాగర్ నిర్వహణకు రిజర్వాయర్ల మేనేజ్మెంట్ కమిటీ రూపొందించిన విధి విధానాలను ఏపీ ప్రభుత్వం ఆమోదించగా, తెలంగాణ వ్యతిరేకిస్తోంది. ఇదే అదనుగా తెలంగాణ ఇటీవల వరద తగ్గాక కూడా శ్రీశైలంలో యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు నీటిని వదిలేస్తోంది. దీనివల్ల పది రోజుల్లోనే సుమారు 32 టీఎంసీల జలాలు ప్రకాశం బ్యారేజి మీదుగా సముద్రంలో కలిసిపోయాయి. అయినా కేంద్ర జల్‌శక్తి శాఖ గానీ, బోర్డులు గానీ పట్టించుకోవడంలేదు. -
‘కృష్ణా’లో మా వాటా తేల్చండి
సాక్షి, హైదరాబాద్: అపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటాను ఖరారు చేసే అంశాన్ని తక్షణమే కృష్ణా ట్రిబ్యునల్–2కు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేసింది. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సెక్షన్ 84 (3) (4) కింద జల వివాదాలను నదీ జలాల వివాదాల ట్రిబ్యునల్‌కు అప్పగించాలని అపెక్స్ కౌన్సిల్ తీసుకు న్న నిర్ణయమే అంతిమమని స్పష్టం చేసింది. ఈ విషయంలో విరుద్ధమైన నిర్ణయం తీసుకోవడానికి కేంద్రంతో సహా ఏ అథారిటీకి అధికారం లేదంది. అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం (ఐఎస్ఆర్డబ్ల్యూడీ) 1956లోని సెక్షన్–3 కింద 2014 జూలై 14న ఏపీపై చేసిన ఫిర్యాదును దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉంచడం.. కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా హక్కులను తెలంగాణకు నిరాకరించడమేనని అభిప్రాయపడింది. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ గురువారం కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. 574.6 టీఎంసీలు కేటాయించాలి కృష్ణా జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీలు కేటాయిస్తూ 2015లో తీసుకున్న తాత్కాలిక నిర్ణయం ఆధారంగానే ఇప్పటికీ కృష్ణా బోర్డు రెండు రాష్ట్రా లకు కేటాయింపులు చేయడంపై రాష్ట్రం అభ్యంతరం తెలిపింది. రాష్ట్ర పరిధిలోని కృష్ణా బేసిన్లో సాగు విస్తీర్ణం, కరువు ప్రభావిత ప్రాంతాలు, జనాభాను పరిగణనలోకి తీసుకుని రాష్ట్రానికి 574.6 టీఎంసీలను కేటాయించాలని కోరినా బోర్డు పట్టించుకోవడం లేదంది. ఈ అంశం తమ పరిధిలో లేదని, ట్రిబ్యునల్ మాత్రమే సమీక్షించగలదని బోర్డు పేర్కొందని వెల్లడించింది. ట్రిబ్యునల్‌కు అప్పగించండి: సుప్రీంకోర్టులో కేసును ఉపసంహరించుకుంటే ఫిర్యాదును ట్రిబ్యునల్‌కు అప్పగించాలని 2020 అక్టోబర్ 6న జరిగిన రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు కేసును ఉపసం హరించుకున్నామని తెలంగాణ తెలిపింది. న్యాయ సల హా మేరకు కొత్త ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలా లేదా కృష్ణా ట్రిబ్యునల్–2కు బాధ్యత అప్పగించాలా అనే అం శంపై నిర్ణయిస్తామని అప్పట్లో అపెక్స్ కౌన్సిల్ నిర్ణయించిందని గుర్తు చేసింది. కృష్ణా ట్రిబ్యునల్–2 రద్దు కానందున తెలంగాణ ఫిర్యాదును దీనికే అప్పగించడం సముచితమని అభిప్రాయపడింది. కృష్ణా జలాల్లో తమ చట్ట బద్ధ హక్కులనే కోరామని.. ఇతర రాష్ట్రాల హక్కులు, ప్ర యోజనాలకు భంగం కలుగుతుందని భావించొద్దని స్ప ష్టం చేసింది. రాష్ట్ర పునర్విభజన చట్టానికి పరిమితులుండటంతోనే ఐఎస్ఆర్డబ్ల్యూడీ–1956 చట్టం కింద ఫిర్యాదు చేసినట్టు తెలిపింది. 75 శాతం డిపెండబిలిటీ ఆధారంగా పరీవాహక ప్రాంతంలోని రాష్ట్రాలకు కృష్ణా జలాల పంపకాలు జరుపుతూ కృష్ణా ట్రిబ్యునల్–2 జారీ చేసిన మధ్యంతర నివేదికలకు సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందని, కర్ణాటక, మహారాష్ట్రల ప్రయోజనాలకు ఈ కేసుతో నష్టం ఉండదని అభిప్రాయపడింది. -
గెజిట్ అమలుపై గజిబిజి
సాక్షి, అమరావతి: కృష్ణా, గోదావరి జలాల వినియోగంపై తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలకు ముగింపు పలకడమే లక్ష్యంగా రెండు బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ గతేడాది జూలై 15న కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలు ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కు అన్నట్లుగా తయారైంది. కేంద్రం నిర్దేశించిన తుది గడువు ముగిసిపోయి మూడు నెలలు పూర్తయినా నోటిఫికేషన్ అమల్లోకి రాకపోవడం గమనార్హం. మూడు నెలల క్రితమే ఏపీ ఉత్తర్వులు.. కృష్ణా బోర్డు ఆమోదించిన తీర్మానం మేరకు ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో తమ భూభాగంలోని ఆరు అవుట్లెట్లను బోర్డుకు అప్పగించేందుకు అంగీకరిస్తూ గత అక్టోబర్ 14నే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ సర్కార్ మాత్రం తన భూభాగంలోని తొమ్మిది అవుట్లెట్లను బోర్డుకు అప్పగించేందుకు నిరాకరిస్తూ వస్తోంది. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి వచ్చాకే బోర్డు పరిధిని నిర్ణయించాలంటూ పాత పాట అందుకుంది. గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం శ్రీరాంసాగర్ నుంచి సీతమ్మసాగర్ వరకు గోదావరిపై ప్రాజెక్టులన్నీ బోర్డు పరిధిలోకి తేవాలని ఏపీ ప్రభుత్వం ప్రతిపాదిస్తుండగా.. ఉమ్మడి ప్రాజెక్టులే లేనప్పుడు గోదావరి బోర్డుతో అవసరమేముందని, రద్దు చేయాలని తెలంగాణ సర్కార్ వాదిస్తోంది. గెజిట్ నోటిఫికేషన్ అంశాలను తు.చ. తప్పకుండా అమలు చేస్తామని కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్, కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్లు ఎంపీ సింగ్, చంద్రశేఖర్ అయ్యర్ పదేపదే స్పష్టం చేస్తున్నా ఆచరణకు నోచుకోవడం లేదు. దీంతో జల వివాదాలు సమసిపోవడం లేదు. సమీక్షలతో సరి.. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధి, స్వరూపంపై నివేదిక ఇచ్చేందుకు ఇరు బోర్డులు వేర్వేరుగా సబ్ కమిటీలను నియమించాయి. బోర్డుల సభ్య కార్యదర్శుల నేతృత్వంలో ఇరు రాష్ట్రాల అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం సీఈలు, జెన్కో సీఈలు సభ్యులుగా ఉన్న ఈ కమిటీలు పలుదఫాలు సమావేశమై నివేదికలు ఇచ్చాయి. వీటి ఆధారంగా బోర్డు పరిధిని ఖరారు చేసి గెజిట్ నోటిఫికేషన్ అమలుకు రెండు బోర్డులు సిద్ధమయ్యాయి. కృష్ణా బేసిన్లో ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లోని 15 అవుట్ లెట్లను తొలుత పరిధిలోకి తీసుకుని నిర్వహిస్తామని, ఆ తర్వాత దశల వారీగా ఇతర ప్రాజెక్టులను అధీనంలోకి తీసుకుంటామని కృష్ణా బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్ ప్రతిపాదించారు. ఇందుకు రెండు రాష్ట్రాలు తొలుత అంగీకరించడంతో ఆ మేరకు బోర్డు తీర్మానాన్ని ఆమోదించింది. గోదావరి ప్రాజెక్టులన్నీ బోర్డు పరిధిలోకి తేవాలన్న ఏపీ ఉమ్మడి ప్రాజెక్టు అయిన పెద్దవాగును పరిధిలోకి తీసుకుని నోటిఫికేషన్ అమలు ప్రారంభిస్తామని గోదావరి బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ ప్రతిపాదించగా.. శ్రీరాంసాగర్ నుంచి సీతమ్మసాగర్ వరకూ గోదావరి ప్రధాన పాయపై ఉన్న ప్రాజెక్టులన్నీ బోర్డు పరిధిలోకి తీసుకుని నిర్వహిస్తేనే దిగువ రాష్ట్రమైన ఏపీకి ప్రయోజనం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనిపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. బోర్డు చైర్మన్ పలుమార్లు సమీక్షలు నిర్వహించినా ఒక తాటిపైకి తేలేకపోయారు. నోరుమెదపని జల్‌శక్తి శాఖ నోటిఫికేషన్ అమలుపై తొలుత కృష్ణా, గోదావరి బోర్డు అధికారులతో కేంద్ర జల్ శక్తి శాఖ అదనపు కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత రెండు రాష్ట్రాల జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించినా ఏకాభిప్రాయాన్ని సాధించలేకపోయారు. గత నెల 28న రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, జలవనరుల శాఖ ఉన్నతాధికారులు, గోదావరి, కృష్ణా బోర్డుల చైర్మన్లతో కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి వర్చువల్ విధానంలో సమావేశం నిర్వహించారు. కృష్ణా బోర్డు పరిధికి ఏపీ సర్కార్ అంగీకరించగా.. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి వచ్చే వరకూ నోటిఫికేషన్ అమలును నిలుపుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం పట్టుబట్టింది. గోదావరి బోర్డు అవసరమే లేదని తెలంగాణ సర్కార్ పేర్కొనగా.. దిగువ రాష్ట్రమైన తమ హక్కుల పరిరక్షణకు బోర్డు అత్యంత ఆవశ్యకమని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. రెండు రాష్ట్రాల వాదనలు విన్న కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి నోటిఫికేషన్‌ను తప్పకుండా అమలు చేస్తామని చెప్పినా ఇప్పటిదాకా ఆ దిశగా అడుగులు పడకపోవడం గమనార్హం. -
ఏమిటీ డ్రామాలు?
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలకు సంబంధించి కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు అంశం కోర్టు పరిధిలో ఉండగా జరిగిన ఆలస్యానికి కేంద్రం ఎలా బాధ్యత వహిస్తుందని జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ప్రశ్నించారు. దీనిపై 2015లో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు సుప్రీంకోర్టు గత నెల 6న అనుమతి ఇచ్చిన తర్వాతే ట్రిబ్యునల్ విషయంలో కేంద్రం పాత్ర ప్రారంభమైందని షెకావత్ స్పష్టత ఇచ్చారు. ఈ జాప్యానికి తెలంగాణ ప్రభుత్వం కోర్టులో పిటిషన్ దాఖలు చేయడమే కారణమని, అలాంటప్పుడు కేంద్రాన్ని ఎలా తప్పుబడతారని ప్రశ్నించారు. దీనిపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం ఢిల్లీలో కేంద్ర జల్‌శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాంతో కలసి షెకావత్ మీడియాతో మాట్లాడారు. 2 రోజులని చెప్పి 8 నెలలకు.. కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రిగా తాను బాధ్యతలు స్వీకరించిన తరువాత చొరవ తీసుకుని గతేడాది అక్టోబర్ 6న అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించినట్లు షెకావత్ తెలిపారు. ఆ సందర్భంగా కేసీఆర్ కొత్త ట్రిబ్యునల్ ప్రస్తావన తీసుకురాగా ఆ విషయం కోర్టు పరిధిలో ఉందని గుర్తు చేయడంతో 2 రోజుల్లో పిటిషన్ ఉపసంహరణకు దరఖాస్తు చేసుకుంటామని హామీ ఇచ్చారన్నారు. అయితే 7–8 నెలల తర్వాత తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ వెనక్కి తీసుకుంటామని సుప్రీంకోర్టులో దరఖాస్తు చేసుకుందని చెప్పారు. ఇందుకు న్యాయస్థానం అంగీకరించిన తర్వాతే ట్రిబ్యునల్ ఏర్పాటుకు సంబంధించి కేంద్రం నిర్వర్తించాల్సిన కార్యక్రమం మొదలైందని తెలిపారు. చర్చించాకే బోర్డుల పరిధిపై నిర్ణయం... విభజన చట్టం ప్రకారం కృష్ణా, గోదావరి బోర్డులు ఏర్పడినప్పటికీ పరిధి నోటిఫై చేయని కారణంగా ఇన్నాళ్లూ అధికారంలేని సంస్థలుగానే ఉండిపోయాయని షెకావత్ పేర్కొన్నారు. గతేడాది అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో రెండు బోర్డుల పరిధి నోటిఫై ప్రక్రియ ప్రారంభించేందుకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంగీకరించారని తెలిపారు. ఆ తర్వాత ఇరు రాష్ట్ర ప్రభుత్వాలతో సుదీర్ఘ చర్చల తర్వాతే బోర్డుల పరిధిని నిర్ణయించామని వివరించారు. కానీ ఇప్పుడు హఠాత్తుగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఇలా వ్యాఖ్యానించడం పెద్ద డ్రామాలా కనిపిస్తోందని షెకావత్ విమర్శించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో సీఎం హోదాలో రాష్ట్రాన్ని పాలించే వ్యక్తి ఈ విధంగా మాట్లాడటం తగదన్నారు. ఇరు రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపిన తర్వాతే బోర్డులను నోటిఫై చేసినప్పటికీ ఇదంతా ఒక డ్రామా అని కేసీఆర్ మాట్లాడటం ప్రజాస్వామ్య, రాజ్యాంగ వ్యవస్థపై విధ్వంసకరమైన దాడి చేయడమేనని చెప్పారు. నూతన ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలా? లేక ఉన్న ట్రిబ్యునల్‌కే బాధ్యత అప్పగించాలా? అనే అంశంపై న్యాయశాఖ తన అభిప్రాయాన్ని వెల్లడించాక ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు. ఏవో కొన్ని కాగితాలు పంపుతున్నారు.. బోర్డులు సమర్థంగా పనిచేసేలా రెండు రాష్ట్రాలు తమ బాధ్యతలను నిర్వర్తించాలని షెకావత్ కోరారు. విద్యుత్ ప్రాజెక్ట్‌ల నిర్వహణ విషయంలో ఎలాంటి గందరగోళం లేదని, నోటిఫికేషన్లో పూర్తి స్పష్టత ఉందన్నారు. నోటిఫికేషన్ ప్రకారం ప్రాజెక్టులను బోర్డులకు అప్పగించడం, అనుమతులు లేని ప్రాజెక్టులకు సంబంధించి డీపీఆర్‌లను వెంటనే బోర్డుల ద్వారా సీడబ్ల్యూసీకి అందించాలని, మూలనిధి డిపాజిట్ చేయాలని, మానవ వనరులు, మౌలిక వసతుల కల్పనపై దృష్టిపెట్టాలని సూచించారు. నోటిఫికేషన్ కటాఫ్ తేదీని వాయిదా వేయాల్సిన అవసరం లేదన్నారు. అయితే డీపీఆర్‌ల పేరుతో ప్రాజెక్టులకు సంబంధించి ఏవో కొన్ని కాగితాలను పంపడం సరికాదని, నిర్దిష్ట ఫార్మాట్లో ఇవ్వాలని సూచించారు. నోటిఫికేషన్లో వెలిగొండ ప్రాజెక్టు పేరులో వచ్చిన తప్పుని సవరించాలంటే ప్రక్రియ పార్లమెంట్లో జరగాలని, ఇది ఇప్పటికీ అనుమతులు లేని ప్రాజెక్టుల జాబితాలోనే ఉందని షెకావత్ పేర్కొన్నారు. -
Andhra Pradesh: జలదౌత్యం!
సాక్షి, అమరావతి: దశాబ్దాలుగా ఒడిశాతో నెలకొన్న జల వివాదాలను పరిష్కరించే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అడుగులు వేస్తున్నారు. పోలవరం, జంఝావతి రిజర్వాయర్ ముంపు సమస్యల పరిష్కారంతోపాటు రెండు రాష్ట్రాల్లో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి దిక్సూచిలా నిలిచే నేరడి బ్యారేజీ నిర్మాణానికి మార్గం సుగమం చేయడమే లక్ష్యంగా ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో చర్చించేందుకు ఈనెల 9న భువనేశ్వర్ వెళ్లనున్నారు. ఇద్దరు సీఎంలు కలసి జలవనరుల శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తారని అధికారవర్గాలు వెల్లడించాయి. సరిహద్దు రాష్ట్రాలతో స్నేహపూర్వక సంబంధాలను నెరపడం, సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకుని అందరూ అభివృద్ధి చెందడమే తమ అభిమతమని సీఎం వైఎస్ జగన్ పలుదఫాలు వెల్లడించారు. ఈ క్రమంలో సమయం కేటాయిస్తే తానే వస్తానని ఈ ఏడాది ఏప్రిల్ 17న ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌కు లేఖ రాశారు. దీనిపై ఒడిశా సీఎం సానుకూలంగా స్పందించి ఆహ్వానించడంతో సీఎం జగన్ వచ్చే వారం భువనేశ్వర్ వెళ్లనున్నారు. జంఝావతిపై కాంక్రీట్ డ్యామ్.. ► జంఝావతిలో 75 శాతం లభ్యత ఆధారంగా 8 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని అంచనా వేసి ఒడిశా, ఏపీ చెరి సగం వాడుకునేలా 1978 డిసెంబర్ 25న రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది. ► ఈ ఒప్పందం ప్రకారం 4 టీఎంసీలను వాడుకుని విజయనగరం జిల్లాలో కొమరాడ, పార్వతీపురం, మక్కువ, సీతానగరం, గరుగుబిల్లి మండలాల్లోని 75 గ్రామాల్లో 24,640 ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించేలా జంఝావతి ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో జలయ/æ్ఞంలో భాగంగా చేపట్టారు. ► 3.40 టీఎంసీల సామర్థ్యంతో విజయనగరం జిల్లాలో కొమరాడ మండలం రాజ్యలక్ష్మీపురం వద్ద జంఝావతిపై ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టారు. ఈ ప్రాజెక్టుతో ఒడిశాలోని 1,175 ఎకరాల భూమి ముంపునకు గురవుతుంది. ఈ భూమిని సేకరించి ఇస్తే పరిహారం చెల్లిస్తామని అప్పట్లోనే ఒడిశా సర్కార్‌ను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. కానీ.. ఒడిశా నిరాకరించడంతో జంఝావతి ప్రాజెక్టు ఫలాలను ముందస్తుగా అందించడానికి కాంక్రీట్ డ్యామ్ స్థానంలో రబ్బర్ డ్యామ్‌ను నిర్మించి 2006 జనవరి 1న నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జాతికి అంకితం చేశారు. అప్పట్లో తొమ్మిది వేల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించారు. ► ముంపునకు గురయ్యే భూమిని సేకరించి ఇవ్వడానికి ఒడిశా సర్కార్‌ను ఒప్పించడం ద్వారా రబ్బర్ డ్యామ్ స్థానంలో శాశ్వతమైన కాంక్రీట్ డ్యామ్‌ను నిర్మించి విజయనగరం జిల్లాలో వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. నేరడితో ఇరు రాష్ట్రాలు సస్యశ్యామలం.. ► వంశధార ప్రాజెక్టు ఫేజ్–2 స్టేజ్–2 ద్వారా 2.45 లక్షల ఎకరాలకు నీళ్లందించే పనులను దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో చేపట్టారు. నేరడి బ్యారేజీకి ఒడిశా సర్కార్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆయకట్టు రైతులకు ముందస్తుగా ఫలాలను అందించడానికి కాట్రగడ్డ వద్ద సైడ్ వియర్ నిర్మించి వంశధార జలాలను మళ్లించేలా పనులు చేపట్టారు. ఈ క్రమంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదాన్ని పరిష్కరించేందుకు కేంద్రం వంశధార ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసింది. ► జల వివాదాలకు చరమగీతం పాడుతూ ఈ ఏడాది జూన్ 23న కేంద్రానికి వంశధార ట్రిబ్యునల్ తుది నివేదిక అందజేసింది. శ్రీకాకుళం జిల్లాలో నేరడి వద్ద వంశధారపై బ్యారేజీ నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. నేరడి బ్యారేజీ వద్ద లభ్యమయ్యే 115 టీఎంసీల్లో రెండు రాష్ట్రాలకు చెరి సగం పంపిణీ చేసింది. నేరడి బ్యారేజీతో ముంపునకు గురయ్యే 106 ఎకరాల భూమిని సేకరించి ఏపీ ప్రభుత్వానికి అందజేయాలని ఒడిశా సర్కార్‌ను ఆదేశించింది. నేరడి బ్యారేజీ కుడి వైపున కాలువ ద్వారా రోజూ ఎనిమిది వేల క్యూసెక్కులు వాడుకోవడానికి ఏపీ సర్కార్‌కు అనుమతి ఇచ్చింది. ఎడమ వైపున నీటిని వాడుకోవడానికి ఒడిశాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బ్యారేజీ నిర్మాణ వ్యయాన్ని ఆయకట్టు ఆధారంగా దామాషా పద్ధతిలో భరించాలని ఆదేశించింది. ఈ బ్యారేజీ పూర్తయితే శ్రీకాకుళం జిల్లాలో వంశధార ప్రాజెక్టు ఆయకట్టులో రెండు పంటలకు, ఒడిశాలో వెనుకబడిన ప్రాంతాలకు నీళ్లందించి సస్యశ్యామలం చేయవచ్చు. ► రెండు రాష్ట్రాలకు ఉపయోగపడే ఈ బ్యారేజీ నిర్మాణానికి ఒడిశాను ఒప్పించే దిశగా సీఎం వైఎస్ జగన్ చర్యలు చేపట్టారు. పోలవరంలో నీటి నిల్వే లక్ష్యంగా.. ► పోలవరం ప్రాజెక్టులో 45.72 మీటర్లలో 194.6 టీఎంసీలను నిల్వ చేసినా ముంపు ప్రభావం తమ భూభాగంలో పడకుండా చూడాలని 2007 ఏప్రిల్ 3న అంతర్రాష్ట్ర సమావేశంలో ఒడిశా, ఛత్తీస్‌గఢ్ కోరాయి. ► ఆంధ్రప్రదేశ్, నాటి మధ్యప్రదేశ్, ఒడిశా మధ్య 1980 ఏప్రిల్ 2న కుదిరిన ఒప్పందం ప్రకారం పోలవరం ముంపు ప్రభావం లేకుండా సీలేరు, శబరి నదులకు కరకట్టలు నిర్మించాలని గోదావరి ట్రిబ్యునల్ ఉత్తర్వులు జారీ చేసింది. ► ట్రిబ్యునల్ ఉత్తర్వుల ప్రకారం ఒడిశాలో సీలేరుపై 12 కి.మీ, శబరిపై 18.2 కి.మీ. వెరసి 30.2 కి.మీ. పొడవున సగటున 50 మీటర్ల వెడల్పు, 8 మీటర్ల ఎత్తుతో కరకట్టలు నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకు తాజా ధరల ప్రకారం రూ.378.696 కోట్లు వ్యయం కానుందని అంచనా. ఇదే రీతిలో ఛత్తీస్‌గఢ్‌లో శబరిపై 25.19 కి.మీ.ల పొడవున, ఇతర వాగులపై 3.93 వెరసి 29.12 కి.మీ. పొడవున సగటున 50 మీటర్ల వెడల్పు, 8 మీటర్ల ఎత్తుతో కరకట్టల నిర్మాణానికి రూ.332.30 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ► కరకట్టల నిర్మాణానికి పర్యావరణ అనుమతి కోసం ఒడిశాలోని మల్కనగరి, ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాల్లోని ముంపు ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ సదస్సులు నిర్వహించాలని 2005 నుంచి ఒడిశా, ఛత్తీస్‌గఢ్, కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం అనేక సార్లు లేఖలు రాసినా ప్రయోజనం కానరాలేదు. ► పోలవరం ప్రాజెక్టును 2022 నాటికి పూర్తి చేసే దిశగా సీఎం వైఎస్ జగన్ పనులను వేగవంతం చేశారు. గోదావరిలో వరద ప్రవాహం తగ్గగానే ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల మధ్యన ఎర్త్ కమ్ రాక్ ఫిల్(ఈసీఆర్ఎఫ్) డ్యామ్ నిర్మాణాన్ని చేపట్టి 2022 నాటికి పూర్తి చేసేందుకు సర్వం సిద్ధం చేశారు. అయితే ప్రాజెక్టులో నీటిని నిల్వ చేయాలంటే ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లలో ముంపు సమస్యను పరిష్కరించాలి. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది పోలవరంలో నీటిని నిల్వ చేయడానికి మార్గం సుగమం చేసేందుకు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో సీఎం జగన్ చర్చించనున్నారు. -
Projects: వీడని సందిగ్ధత.. ఏవి ఎవరి పరిధిలో..?
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య వివాదాలకు చరమగీతం పాడే దిశగా వెలువ రించిన గెజిట్ నోటిఫికేషన్ అమలుకు గడువు దగ్గర పడుతున్నా.. బోర్డుల పరిధిలో ఉండే ప్రాజెక్టులపై మాత్రం సందిగ్ధత వీడటం లేదు. గెజిట్ ప్రకారం కృష్ణా బేసిన్‌లోని 36 ప్రాజెక్టులు, గోదావరి బేసిన్‌లోని 71 ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి రావాల్సి ఉండగా.. ఇన్ని ప్రాజెక్టులను తీసుకోవ డంపై రెండు తెలుగు రాష్ట్రాలు అభ్యంతరాలు లేవ నెత్తుతున్నాయి. కృష్ణా బేసిన్లో ఉమ్మడి ప్రాజెక్టు లను మాత్రమే బోర్డు పరిధిలో ఉంచాలని తెలుగు రాష్ట్రాలు కోరుతుంటే.. గోదావరిలో ఒకే ఒక్క ప్రాజెక్టును మాత్రమే బోర్డు పరిధిలో ఉంచాలని తెలంగాణ కోరుతోంది. దీంతో కేంద్రం, బోర్డులు ఎలా స్పందిస్తాయన్నది ఆసక్తిగా మారింది. ఒక్కొక్కరిది ఒక్కో వాదన కేంద్రం వెలువరించిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతంలోని తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులన్నీ అక్టోబర్ 14 నుంచి కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిలోకి వెళ్లాల్సి ఉంది. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్ సహా చిన్న, మధ్యతరహా, భారీ ప్రాజెక్టులు, వాటికి అనుబంధంగా ఉన్న విద్యుదుత్పత్తి కేంద్రాలు, సరఫరా వ్యవస్థ (ట్రాన్స్మిషన్ లైన్స్), ఆయకట్టుకు నీటిని విడుదల చేసే ప్రాంతాలు, ఎత్తిపోతల పథకాల నిర్వహణ తదితర బాధ్యతలను బోర్డులే నిర్వహిస్తాయి. ప్రాజెక్టుల నిర్వహణ విషయంపై రెండు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించే అధికారం బోర్డులకు ఉంటుంది. అయితే శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల పరిధిలోని హెడ్‌వర్క్స్ మాత్రమే బోర్డుల పరిధిలో ఉండాలని తెలంగాణ అంటోంది. శ్రీశైలంపై ఆధారపడి చేపట్టిన కల్వకుర్తి, పాలమూరు–రంగారెడ్డి, డిండి వంటి పథకాలు వద్దని అంటోంది. బనకచర్ల వద్దు ఆంధ్రప్రదేశ్ మాత్రం.. సాగర్, శ్రీశైలం, పులి చింతలతో పాటు జూరాలను కృష్ణా బోర్డు పరిధిలో ఉంచాలని కోరుతోంది. అయితే బనకచర్లను మా త్రం వద్దంటోంది. ఎందుకంటే పోతిరెడ్డిపాడు ద్వారానే నీళ్లు బనకచర్లను చేరతాయి. పోతిరెడ్డి పాడు ద్వారా జరిగే నీటి వినియోగానికి లెక్కలు ఉంటాయి కాబట్టి, బనకచర్లను చేర్చాల్సిన అవసరం లేదని వాదిస్తోంది. ఈ మేరకు తన అభి ప్రాయాలను కేంద్రానికి పంపింది. దీనిపై ఇంత వరకు బోర్డు, కేంద్రం నుంచి స్పందన రాలేదు. పెద్దవాగును ఉంచితే చాలు: తెలంగాణ గెజిట్‌లో పేర్కొన్న మేరకు పెద్దవాగు రిజర్వాయర్, పోలవరం ప్రాజెక్టు, కృష్ణా డెల్టాకు 80 టీఎంసీ తరలింపు, పోలవరం 960 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు, తోట వెంకటాచలం పుష్కర, తాడిపూడి, పట్టిసీమ, పురుషోత్తపట్నం ఎత్తిపోతలు, కాటన్ బ్యారేజీ, తొర్రిగడ్డ, చింతలపూడి, చాగల నాడు, వెంకటనగరం ఎత్తిపోతలు గోదావరి బోర్డు పరిధిలో ఉండనున్నాయి. అలాగే ఎస్సారెస్పీ స్టేజ్–1, కాళేశ్వరం, కాళేశ్వరం అదనపు టీఎంసీ, దేవాదుల, తుపాకుల గూడెం బ్యారేజీ, ముక్తేశ్వర్, సీతారామ ఎత్తిపోతలు, మాచ్‌ఖండ్ జల విద్యుత్ ప్రాజెక్టు, సీలేరు విద్యుత్ కాంప్లెక్స్‌లు కూడా బోర్డు అధీనంలో ఉండనున్నాయి. అయితే గోదావరిలో తెలుగు రాష్ట్రాల మధ్య ఉమ్మడి ప్రాజెక్టులు లేని దృష్ట్యా వీటిపై బోర్డు పెత్తనం అవసరం లేదని తెలంగాణ అంటోంది. ఒకవేళ పెట్టాల్సి వస్తే ఖమ్మం జిల్లాలో ఇరు రాష్ట్రాలకు ఉమ్మడిగా ఉన్న పెద్దవాగును మాత్రమే ఉంచాలని కోరుతోంది. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోని బోర్డు, ఈ నెల 6,7 తేదీల్లో అక్కడ పర్యటించేందుకు మాత్రం ఏర్పాట్లు చేసుకుంటోంది. -
కృష్ణా, గోదావరి బోర్డులే బాస్‌లు!
సాక్షి, అమరావతి: కృష్ణా, గోదావరి జలాల వినియోగంలో తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలకు తెరదించేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విభజన చట్టం ప్రకారం ఏర్పాటైన కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ గురువారం రాత్రి కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతం(బేసిన్)లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రాజెక్టులన్నీ ఈ ఏడాది అక్టోబర్ 14 నుంచి కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిలోకి వెళ్లనున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ కృష్ణా బేసిన్‌లోని 36 ప్రాజెక్టులు, గోదావరి బేసిన్లో 71 ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి వస్తాయి. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్సహా చిన్న, మధ్యతరహా, భారీ ప్రాజెక్టులు, వాటికి అనుబంధంగా ఉన్న విద్యుదుత్పత్తి కేంద్రాలు, సరఫరా వ్యవస్థ(ట్రాన్స్మిషన్ లైన్స్), ఆయకట్టుకు నీటి విడుదల చేసే ప్రాంతాలు, ఎత్తిపోతల పథకాల నిర్వహణ బాధ్యతలను బోర్డులే నిర్వహిస్తాయి. బేసిన్ పరిధిలోని ప్రాజెక్టుల నిర్వహణపై రెండు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించే అధికారం బోర్డులకు ఉంటుంది. ఈ మేరకు కృష్ణా, గోదావరి బోర్డుల పరిధి, నిర్వహణ నియమావళిని ఖరారు చేస్తూ కేంద్ర జల్ శక్తి శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ అక్టోబర్ 14 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది. అనుమతి తీసుకోకుండానే పూర్తి చేసినవి, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను నోటిఫికేషన్లో పేర్కొన్నంత మాత్రాన వాటిని ఆమోదించినట్లు కాదని కేంద్రం స్పష్టం చేసింది. ఎలాంటి అనుమతి తీసుకోకుండా చేపట్టిన, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల పనులను ఆపివేయాలని పేర్కొంది. ఈ నోటిఫికేషన్ ప్రచురించిన రోజు నుంచి ఆర్నెల్లలోగా వాటికి అనుమతి తెచ్చుకోవాలని సూచించింది. ఒకవేళ అనుమతులు పొందడంలో విఫలమైతే ఆ ప్రాజెక్టులు పూర్తయినా వాటిని నిలిపివేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. కృష్ణా, గోదావరి బోర్డులు సమర్థంగా పని చేసేందుకు 60 రోజుల్లోగా ఒక్కో బోర్డు ఖాతాలో సీడ్ మనీ కింద ఒకేసారి రూ.200 కోట్ల చొప్పున జమ చేయాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. కృష్ణా / గోదావరి బోర్డు ఛైర్మన్ ఆమోదంతో నిర్వహణ ఖర్చుల్ని విడుదల చేయాలని కోరిన 15 రోజుల్లోగా చెల్లించాల్సి ఉంటుందని, ఒకవేళ చెల్లించడంలో విఫలమైతే బోర్డుల నిర్వహణలో ఎదురయ్యే పరిణామాలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. గెజిట్ నోటిఫికేషన్లో ముఖ్యాంశాలు ఇవీ.. విభజన చట్టం ప్రకారం.. విభజన చట్టం సెక్షన్–85(1) ప్రకారం నదీ జలాల వినియోగంలో తెలుగు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తకుండా 2014 మే 28న కృష్ణా, గోదావరి బోర్డులను ఏర్పాటు చేస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ బోర్డులు అపెక్స్ కౌన్సిల్ పర్యవేక్షణలో పని చేస్తాయి. కృష్ణా, గోదావరి బోర్డుల ౖచైర్మన్లుగా రెండు రాష్ట్రాలకు చెందని వారినే నియమించాలి. రెండు రాష్ట్రాలకు చెందని వారినే బోర్డు సభ్య కార్యదర్శులుగా, చీఫ్ ఇంజనీర్లుగా నియమించాలి. కృష్ణా, గోదావరి బోర్డుల స్వరూపాన్ని నిర్ణయించుకునే అధికారం ఆ బోర్డులకే ఉంటుంది. గెజిట్ నోటిఫికేషన్ ప్రచురించిన రోజు నుంచి 30 రోజుల్లోగా బోర్డులు నిర్దేశించుకున్న స్వరూపం, వాటిలో పనిచేసేందుకు ఆయా విభాగాల ఉద్యోగులను కేంద్రం నియమించాలి. బోర్డుల పరిధి ఇదీ.. 2020 అక్టోబర్ 6న జరిగిన అపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నోటిఫై చేస్తూ కేంద్ర జల్ శక్తి శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. విభజన చట్టం సెక్షన్–87(1) ప్రకారం రెండు రాష్ట్రాల్లో కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలోని షెడ్యూల్–1, షెడ్యూల్–2, షెడ్యూల్–3లో పేర్కొన్న ప్రకారం పూర్తయిన, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, బ్యారేజీలు, కాలువల వ్యవస్థలో విభాగాలు, విద్యుదుత్పత్తి కేంద్రాలు, సరఫరా వ్యవస్థ(ట్రాన్స్మిషన్ లైన్స్) బోర్డు పరిధిలోకి వస్తాయి. ప్రాజెక్టుల పరిధిలోని రెండు రాష్ట్రాల ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతోసహా అందరూ బోర్డు పర్యవేక్షణలోనే పనిచేయాలి. ప్రాజెక్టులకు సీఐఎస్ఎఫ్ బలగాలతో భద్రత కల్పిస్తారు. ప్రాజెక్టుల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించే అధికారం బోర్డులకు ఉంటుంది. ►బోర్డులు తమ స్వాధీనంలోకి తీసుకునే షెడ్యూల్–1 ప్రాజెక్టులకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ ప్రచురితమైన రోజు నాటికి హైకోర్టు, సుప్రీం కోర్టు, ట్రిబ్యునళ్లలో ఏవైనా కేసులు విచారణలో ఉన్నా, భవిష్యత్‌లో కేసులు దాఖలైనా వాటికి రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలి. ►షెడ్యూల్–3 ప్రాజెక్టులను బోర్డుల ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించాలి. ►ప్రకృతి వైపరీత్యాలు తలెత్తినప్పుడు ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలను రెండు రాష్ట్రాలు చేపట్టాలి. గెజిట్ ప్రకారం అనుమతి లేనివంటే...?. 1. బోర్డు అనుమతి తీసుకోనివి, అపెక్స్ కౌన్సిల్ ఆమోదించని ప్రాజెక్టులు. 2. కేంద్ర జల్ శక్తి శాఖ, కేంద్ర జలసంఘం సాంకేతిక సలహా మండలి ఆమోదించని సాగునీటి, బహుళార్ధసాధక, వరద నియంత్రణ ప్రాజెక్టులు. 3. బోర్డు, అపెక్స్ కౌన్సిల్, సీడబ్ల్యూసీ సాంకేతిక సలహా మండలి ఆమోదించిన మేరకు కాకుండా మార్పు చేసిన నిర్మించినవి, నిర్మిస్తున్న ప్రాజెక్టులు. బోర్డుల విధి విధానాలు .. ►కృష్ణా, గోదావరి నదీ వివాదాల ట్రిబ్యునళ్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన నీటిని రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయడం. ►ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలతో కుదుర్చుకున్న ఒప్పందాలను అనుసరించి నీటిని పంపిణీ చేయడం. è ప్రాజెక్టుల్లో ఉత్పత్తయ్యే విద్యుత్‌ను రెండు రాష్టాలకు పంపిణీ చేయడం. ►కృష్ణా, గోదావరిపై రాష్ట్ర ప్రభుత్వాలు కొత్తగా చేపట్టే ప్రాజెక్టుల డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక)ను పరిశీలించి కేంద్ర జలసంఘం సాంకేతిక సలహా మండలికి బోర్డు పంపుతుంది. బోర్డుల పరిశీలనకు పంపని డీపీఆర్‌లను సీడబ్ల్యూసీ టీఏసీ పరిగణనలోకి తీసుకోదు. è ఏదైనా ఒక ప్రాజెక్టును బోర్డులకు ప్రతిపాదించినప్పుడు పరిధిపై వివాదం తలెత్తితే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తుంది. దీనిపై నిర్ణయాధికారం కేంద్రానిదే. ఎట్టకేలకు ఏడేళ్ల తర్వాత.. గతేడాది అక్టోబర్ 6న జరిగిన అపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశంలో కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని ఖరారు చేయాలని సీఎం వైఎస్ జగన్ ప్రతిపాదించగా తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యతిరేకించారు. ఈ క్రమంలో నదీ జలాలపై తెలుగు రాష్ట్రాల మధ్య పలు పరిణామాలు చోటు చేసుకున్నాయి. తాజాగా ముఖ్యమంత్రి జగన్ ప్రతిపాదనతో ఏకీభవిస్తూ రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలకు తెరదించేలా కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీకి చర్యలు చేపట్టారు. బోర్డులు ఏర్పాటైన ఏడేళ్ల తర్వాత ఎట్టకేలకు కేంద్రం వాటి పరిధిని ఖరారు చేయడం గమనార్హం. -
ఇద్దరి హక్కులకూ భద్రత
సాక్షి, అమరావతి: కృష్ణా, గోదావరి జలాలపై రెండు రాష్ట్రాల హక్కులను పరిరక్షించేలా బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ కేంద్ర జల్ శక్తి శాఖ నోటిఫికేషన్ జారీ చేయడాన్ని స్వాగతిస్తూనే అందులో కొన్ని అంశాలపై సవరణలను ప్రతిపాదించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన జలాల్లో ఆంధ్రప్రదేశ్‌కు దక్కిన 512, తెలంగాణకు దక్కిన 299 టీఎంసీలను పంపిణీ చేయడంపైనే కృష్ణా బోర్డు ప్రధానంగా దృష్టి కేంద్రీకరించేలా చూడాలని విజ్ఞప్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. కృష్ణా డెల్టా, నాగార్జునసాగర్ కుడి, ఎడమ కాలువ ఆయకట్టుకు గోదావరి వరద జలాలను మళ్లించగా.. అక్కడ మిగిలే కృష్ణా నీటిని తీవ్ర దుర్భిక్ష ప్రాంతాలైన రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు మళ్లించుకునే స్వేచ్ఛ కల్పించడం ద్వారా ఆ ప్రాంతాల సాగు, తాగునీటి ఇబ్బందులను అధిగమించడానికి మార్గం సుగమం చేయాలని కేంద్రాన్ని కోరాలని భావిస్తోంది. విభజన చట్టం 11వ షెడ్యూల్లో అప్పటికే నిర్మాణంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగుగంగ, గాలేరు–నగరి, వెలిగొండ, హంద్రీ–నీవా, తెలంగాణలోని నెట్టెంపాడు (22 టీఎంసీలు), కల్వకుర్తి (25 టీఎంసీలు) కేంద్రం అనుమతి ఇచ్చిందని.. ఇప్పుడు వాటికి ఆర్నెళ్లలోగా మళ్లీ అనుమతి తీసుకోవాలంటూ విధించిన నిబంధనను ఉపసంహరించుకోవాల్సిందిగా కోరనుంది. విభజన చట్టం ద్వారా ఆ ప్రాజెక్టులకు కల్పించిన రక్షణను కొనసాగించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని గుర్తు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం జలవనరుల శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి తదితరులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. బోర్డులను ఏర్పాటు చేసిన ఏడేళ్ల తర్వాత వాటి పరిధిని ఖరారు చేయడాన్ని స్వాగతిస్తూనే కొన్ని మార్పులు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే తుంగభద్ర బోర్డు పరిధిలో హెచ్చెల్సీ, ఎల్లెల్సీ.. తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ (హెచ్చెల్సీ), దిగువ ప్రధాన కాలువ (ఎల్లెల్సీ) ఇప్పటికే తుంగభద్ర బోర్డు పరిధిలో ఉన్నాయి. తుంగభద్ర జలాశయంలో నీటి లభ్యత ఆధారంగా హెచ్చెల్సీకి కేటాయించిన 32.5, ఎల్లెల్సీకి కేటాయించిన 29.5 టీఎంసీలను దామాషా పద్ధతిలో తుంగభద్ర బోర్డు పంపిణీ చేస్తోంది. వాటికి తుంగభద్ర జలాశయంలో నీటిని విడుదల చేసినప్పుడు రాష్ట్ర సరిహద్దులోనూ టెలీమీటర్ల ద్వారా ఎప్పటికప్పుడు లెక్కిస్తోంది. ఈ నేపథ్యంలో హెచ్చెల్సీ, ఎల్లెల్సీలను మళ్లీ కృష్ణా బోర్డు పరిధిలోకి తేవాల్సిన అవసరం లేదని, వాటిని పరిధి నుంచి తప్పించాలని కేంద్రానికి వి/æ్ఞప్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద లెక్కిస్తే చాలు.. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా తెలుగుగంగ, ఎస్సార్బీసీ, గాలేరు–నగరి ప్రాజెక్టులకు నీటిని విడుదల చేస్తారు. ఈ ప్రాజెక్టులకు నీటిని విడుదల చేసే ప్రాంతమైన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌ను కృష్ణా బోర్డు పరిధిలోకి తీసుకుని కేటాయించిన నీటిని విడుదల చేసేటప్పుడు టెలీమీటర్ల ద్వారా లెక్కిస్తే సరిపోతుంది. ఈ నేపథ్యంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన ఉన్న బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్, నిప్పులవాగు ఎస్కేప్ ఛానల్, వెలిగోడు రిజర్వాయర్, తెలుగుగంగ లింక్ కెనాల్, ఎస్సార్బీసీ నుంచి అవుకు రిజర్వాయర్ వరకు కాలువల వ్యవస్థలను కృష్ణా బోర్డు పరిధిలోకి తీసుకుని అక్కడ నీటిని లెక్కించాల్సిన అవసరం లేదని నీటిపారుదల రంగ నిపుణులు పేర్కొంటున్నారు. దీనివల్ల బోర్డుకు భారం మినహా ఎలాంటి ప్రయోజనం ఉండదని స్పష్టం చేస్తున్నారు. అందువల్ల పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వరకే కృష్ణా బోర్డు పరిధిని పరిమితం చేసేలా కేంద్రానికి సూచించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆయకట్టుకు నీళ్లందిస్తున్న ప్రాజెక్టులకు అనుమతి లేదంటే ఎలా? వెంకటనగరం ఎత్తిపోతల 2006 నాటికే పూర్తయిందని, తెలుగుగంగ ఆయకట్టును స్థిరీకరించడానికి చేపట్టిన సిద్ధాపురం ఎత్తిపోతల, ఎల్లెల్సీ ఆయకట్టు స్థిరీకరణకు చేపట్టిన గురు రాఘవేంద్ర ఎత్తిపోతల పథకం 2008 నాటికే పూర్తైందని, ఆయకట్టుకు నీళ్లందిస్తున్న ఆ ప్రాజెక్టులకు అనుమతి లేదనడం సరి కాదని కేంద్రానికి వివరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే పూర్తై ఆయకట్టుకు నీళ్లందిస్తున్న ప్రాజెక్టులకు ఆర్నెళ్లలోగా అనుమతి తీసుకోవాలనే నిబంధనను ఉపసంహరించుకోవాల్సిందిగా ప్రతిపాదించనుంది. ఎగువ రాష్ట్రాలతో సంబంధం లేని ప్రాజెక్టులు బోర్డు పరిధిలోకి ఎందుకు? కృష్ణా డెల్టాకు నీళ్లందించే ప్రకాశం బ్యారేజీ, గోదావరి డెల్టాకు నీళ్లందించే ధవళేశ్వరం బ్యారేజీ, పోలవరం, పోలవరం దిగువన తొర్రిగడ్డ పంపింగ్ స్కీం, వెంకటనగరం ఎత్తిపోతల, పుష్కర, పురుషోత్తపట్నం, తాడిపూడి, పట్టిసీమ, చింతలపూడి ఎత్తిపోతల వల్ల ఎగువ రాష్ట్రాల ప్రయోజనాలకు ఎలాంటి విఘాతం కలగదని నీటిపారుదలరంగ నిపుణులు గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వాటిని కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిలోకి తేవడం వల్ల అదనపు భారం మినహా ఎలాంటి ప్రయోజనం ఉండదని పేర్కొంటున్నారు. ఈ దృష్ట్యా వాటిని బోర్డుల పరిధి నుంచి తప్పించాలని కేంద్రానికి ప్రతిపాదించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి ప్రయోజనాలున్న ప్రాజెక్టులు బోర్డు పరిధిలోకి తీసుకుంటే సరి.. గోదావరి పరీవాహక ప్రాంతం(బేసిన్)లో ఉమ్మడి ప్రాజెక్టులు ఏవీ లేవు. కానీ.. కృష్ణా బేసిన్లో శ్రీశైలం, నాగార్జునసాగర్‌లు ఉమ్మడి ప్రాజెక్టులు. జూరాల, పులిచింతల ఉమ్మడి ప్రయోజనాలతో ముడిపడిన ప్రాజెక్టులు. ఇందులో శ్రీశైలం, నాగార్జునసాగర్, జూరాల ప్రాజెక్టుల స్పిల్ వేలు, వాటికి అనుబంధంగా ఉన్న విద్యుదుత్పత్తి కేంద్రాలు, వాటిపై ఆధారపడ్డ ఆయకట్టుకు నీటిని విడుదల చేసే ప్రధాన ప్రాంతాలు(ఇన్‌టేక్‌లు), ఎత్తిపోతల పథకాల పంప్‌హౌస్‌లను కృష్ణా బోర్డు పరిధిలోకి తీసుకుని నీటి వినియోగాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం, పులిచింతలలో విద్యుదుత్పత్తి కేంద్రాన్ని బోర్డు పరిధిలోకి తీసుకుని నిర్వహిస్తే సరిపోతుందని నీటిపారుదలరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దీనివల్ల బోర్డుపై అదనపు భారం తగ్గుతుందని పేర్కొంటున్నారు. బోర్డుల పరిధి విస్తృతమైతే వాటి పరిధిలోని ప్రాజెక్టులు, కాలువల వ్యవస్థ నిర్వహణకు భారీ ఎత్తున వ్యయం అవుతుందని, దీనివల్ల రెండు రాష్ట్రాలపైనా ఆర్థికంగా తీవ్ర భారం పడుతుందని విశ్లేషిస్తున్నారు. నీటి లభ్యత ఆధారంగా దామాషాలో పంపిణీ.. రెండు రాష్ట్రాల్లోని కృష్ణా బేసిన్లో నీటి లభ్యత బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన మేరకు 811 టీఎంసీలు ఉంటే 66 : 34 నిష్పత్తిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు పంపిణీ చేయాలని, ఒకవేళ వర్షాభావంతో లభ్యత తగ్గితే అదే నిష్పత్తిలో దామాషా పద్ధతిలో నీటి పంపిణీ చేసేలా కృష్ణా బోర్డుకు నిర్దేశించాలని కేంద్రాన్ని కోరేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైంది. 2019–20, 2020–21 తరహాలోనే బేసిన్లో భారీ ఎత్తున వరద వస్తే.. శ్రీశైలం, సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తివేసి వరద జలాలు సముద్రంలో కలిసే సమయంలో రెండు రాష్ట్రాల్లో ఎవరు ఏ స్థాయిలో నీటిని మళ్లించుకున్నా వాటిని పరిగణలోకి తీసుకోకూడదని వి/æ్ఞప్తి చేయనుంది. తద్వారా దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ హక్కులను పరిరక్షించాలని కోరనుంది. -
జల వివాదం: పర్మిషన్ లేకుంటే ప్రాజెక్టుల మూత!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి జలాలను వినియోగించుకుంటూ తెలంగాణ, ఏపీ చేపట్టిన కొత్త ప్రాజెక్టులకు ఆరు నెలల్లోగా అనుమతులు తీసుకోవాలని బోర్డుల పరిధిపై వెలువరించిన గెజిట్‌లో కేంద్రం స్పష్టం చేసింది. గెజిట్ నోటిఫికేషన్లో ప్రస్తావించినంత మాత్రాన అనుమతి లేని ప్రాజెక్టులను ఆమోదించినట్టు కాదని పేర్కొంది. ఆరు నెలల్లోగా అనుమతి తీసుకోవడంలో విఫలమైతే ఆ ప్రాజెక్టులను పక్కన పెట్టాల్సి ఉంటుందని.. అవి పూర్తయినా కూడా నీటి వినియోగించుకోవడానికి వీల్లేదని హెచ్చరించింది. గెజిట్‌లో పేర్కొన్న మేరకు అనుమతి లేకుండా చేపట్టిన ప్రాజెక్టులివే కృష్ణా నదిపై తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులు శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) ఎస్ఎల్బీసీ సామర్థ్యం మరో పది టీఎంసీలు పెంపు కల్వకుర్తి ఎత్తిపోతల కల్వకుర్తి ఎత్తిపోతల సామర్థ్యం అదనంగా 15 టీఎంసీలు పెంపు పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ డిండి ఎత్తిపోతల ఎలిమినేటి మాధవరెడ్డి లిఫ్టు భక్త రామదాస ఎత్తిపోతల తుమ్మిళ్ల ఎత్తిపోతల నెట్టెంపాడు ఎత్తిపోతల నెట్టెంపాడు సామర్థ్యం అదనంగా 3.4 టీఎంసీలు పెంపు దేవాదుల లిఫ్టు ద్వారా గోదావరి జలాలు కృష్ణా బేసిన్‌కు మళ్లించే ప్రాజెక్టు (వీటిలో కల్వకుర్తి, నెట్టెంపాడు ఎత్తిపోతలను విభజన చట్టం 11వ షెడ్యూల్లో కేంద్రం అధికారికంగా గుర్తించింది) కృష్ణానదిపై ఏపీ చేపట్టిన ప్రాజెక్టులు తెలుగు గంగ వెలిగొండ హంద్రీ-నీవా గాలేరు-నగరి ముచ్చుమర్రి ఎత్తిపోతల సిద్ధాపురం ఎత్తిపోతల గురు రాఘవేంద్ర (ఇందులో మొదటి నాలుగింటిని విభజన చట్టం 11వ షెడ్యూల్లో కేంద్రం అధికారికంగా గుర్తించింది) ఉమ్మడిగా చేపట్టిన ప్రాజెక్టు మున్నేరు పునర్ నిర్మాణం గోదావరిపై తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులు కంతనపల్లి బ్యారేజీ కాళేశ్వరంలో అదనపు టీఎంసీ పనులు రామప్ప- పాకాల మళ్లింపు తుపాకులగూడెం బ్యారేజీ మోదికుంటవాగు ప్రాజెక్టు చౌట్పల్లి హన్మంతరెడ్డి ఎత్తిపోతల కందుకుర్తి ఎత్తిపోతల బీఆర్ అంబేడ్కర్ ప్రాణహిత గూడెం ఎత్తిపోతల ముక్తేశ్వర్ ఎత్తిపోతల సీతారామ ఎత్తిపోతల (రాజీవ్ దుమ్ముగూడెం) పట్టిసీమ ఎత్తిపోతల పురుషోత్తపట్నం ఎత్తిపోతల చింతలపూడి ఎత్తిపోతల వెంకటనగరం ఎత్తిపోతల -
కీలక ప్రాజెక్టులన్నీ బోర్డుల ఆధీనంలోకి..
సాక్షి, హైదరాబాద్: గెజిట్ నోటిఫికేషన్లో కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టులను 3 షెడ్యూళ్లుగా విభజించారు. రెండు రాష్ట్రాల్లో ఈ నదులు, ఉప నదులపై ఉన్న అన్ని ప్రాజెక్టులను మొదటి షెడ్యూల్లో ప్రస్తావించారు. మొత్తంగా కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిలో ఉండే ప్రాజెక్టులను షెడ్యూల్-2లో పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులకు సంబంధిం చిన ప్రతి అంశంపై బోర్డులకు పూర్తి నియంత్రణ ఉంటుంది. ప్రాజెక్టులు, కాల్వల వ్యవస్థ, విద్యుదుత్పత్తి కేంద్రాలు, సరఫరా చేసే వ్యవస్థలు, కార్యాలయాల ప్రాంగణాలు, సమగ్ర ప్రాజెక్టు నివేదికలు, ఫర్నీచర్ సహా అన్నింటినీ బోర్డులు తమ ఆధీనంలోకి తీసుకుని నిర్వహణ బాధ్యతలు చేపడతాయి. ఆ ప్రాజెక్టుల్లోని రెగ్యులర్, ఔట్ సోర్సింగ్ సహా ఉద్యోగులంతా బోర్డు పర్యవేక్షణలోనే పనిచేయాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టులకు సీఐఎస్ఎఫ్ బలగాలతో భద్రత కల్పిస్తారు. బోర్డులు ప్రాజెక్టులను తమ స్వాధీనంలోకి తీసుకున్నా.. గెజిట్ వచ్చేనాటికి ఉన్న కేసులు, అప్పటికే జరిగిన విషయాలపై భవిష్యత్‌లో దాఖలయ్యే కేసులకు రాష్ట్ర ప్రభుత్వాలదే బాధ్యత. షెడ్యూల్ -3లో పేర్కొన్న ప్రాజెక్టులను బోర్డుల ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించుకోవాలి. ప్రకృతి వైపరీత్యాలు ఉత్పన్నమైనప్పుడు ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలను రెండు రాష్ట్రాలు తీసుకోవాలి. కృష్ణా బోర్డు అధీనంలో ఉండే ప్రాజెక్టులు శ్రీశైలం రిజర్వాయర్, దానిపై ఆధారపడిన ప్రాజెక్టులు.. స్పిల్‌వే, ఎడమ, కుడిగట్టు విద్యుత్ కేంద్రాలు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్, నిప్పులవాగు ఎస్కేప్ కెనాల్, ఎస్ఆర్బీసీ, వెలిగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, తెలుగుగంగ, వెలిగొండ, ఎస్ఎల్బీసీ టన్నెల్, డిండి, హంద్రీనీవా, కల్వకుర్తి, పాలమూరు–రంగారెడ్డి, ముచ్చుమర్రి, జీఎన్ఎస్ఎస్ నాగార్జున సాగర్ పరిధిలో.. సాగర్ ప్రధాన విద్యుత్ కేంద్రం, కుడి, ఎడమ కాల్వలు, ఇతర బ్రాంచ్ కెనాల్లు, ఏఎమ్మార్పీ, హైదరాబాద్ తాగునీటి సరఫరా, సాగర్ టెయిల్ పాండ్. తుంగభద్ర, దాని పరిధిలోని హై లెవల్, లో లెవల్ కెనాల్లు, ఆర్డీఎస్, తుమ్మిళ్ల, కేసీ కెనాల్, సుంకేశుల ఎగువ కృష్ణాలో.. జూరాల, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్, పులిచింతల రిజర్వాయర్, విద్యుత్ కేంద్రం, మున్నేరు ప్రాజెక్టు గోదావరి నుంచి కృష్ణాకు నీటిని మళ్లించే పథకాలు (కాళేశ్వరంలోని కొండపోచమ్మసాగర్ నుంచి శామీర్‌పేటకు నీటిని తరలించే కాల్వ, గంధమల రిజర్వాయర్, దేవాదులలోని దుబ్బవాగు - పాకాల ఇన్‌ఫాల్ రెగ్యులేటర్, సీతారామలోని మూడో పంపుహౌస్, ఎస్సారెస్పీ స్టేజ్ -2లోని మైలవరం రిజర్వాయర్ వేంపాడు, బుడమేరు మళ్లింపు పథకం, పోలవరం ఆర్ఎంసీ-ఎన్ఎస్-ఎల్ఎంసీ లింకు, పోలవరం–కృష్ణాలింకు,కృష్ణాడెల్టా,గుంటూరు కెనాల్. గోదావరి బోర్డు అధీనంలో ఉండే ప్రాజెక్టులు శ్రీరాంసాగర్ స్టేజ్–1, కాళేశ్వరం, కాళేశ్వరం ప్రాజెక్టు అదనపు టీఎంసీ పనులు, చొక్కారావు ఎత్తిపోతలు, తుపాకుల గూడెం బ్యారేజీ, ముక్తేశ్వర్ ఎత్తిపోతలు, సీతారామ లిఫ్టు, మాచ్‌ఖండ్ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టు, సీలేరు విద్యుత్ కాంప్లెక్స్. పెద్దవాగు రిజర్వాయర్ స్కీం, పోలవరం ప్రాజెక్టు, కృష్ణా డెల్టాకు 80 టీఎంసీల తరలింపు ప్రాజెక్టు, హెడ్ రెగ్యులేటర్ ద్వారా కృష్ణాకు గోదావరి నీళ్ల తరలింపు. పోలవరం 960 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు, తోట వెంకటాచలం పుష్కర ఎత్తిపోతలు, తాడిపూడి ఎత్తిపోతలు, పట్టిసీమ, పురుషోత్తమపట్నం లిఫ్టు, సర్ ఆర్ధర్ కాటన్ బ్యారేజ్. తొర్రిగడ్డ, చింతలపూడి, చాగలనాడు, వెంకటనగరం ఎత్తిపోతలు. -
జల జగడాలతో రెండు రాష్ట్రాలకూ నష్టం
జల వివాదాల పేరుతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య ఉభయ పాలకులు ఉద్వేగాలను రెచ్చగొడుతున్నారు. ఇండియా, చైనా సరిహద్దుల్లో సైన్యాన్ని మోహ రించినట్లుగా సాగర్, శ్రీశైలం, పులి చింతల ప్రాజెక్టుల వద్ద పోలీసు బలగాలు మోహరించి యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నారు. ఈ జగడానికి రాయలసీమ ఎత్తిపోతల పథకం ఒక కారణమైతే, రెండవది తెలంగాణ లోనున్న ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ అవసరం ఉందని చెప్పి తెలంగాణ ప్రభుత్వం జల విద్యుత్ కేంద్రాలలో నూటికి నూరు శాతం విద్యుత్ ఉత్పాదన చేయాలని నిర్ణయించడం. రెండు రాష్ట్రాలు కయ్యం పెట్టుకుంటే కేంద్ర ప్రభుత్వానికి ఉండే రాజకీయ ప్రయోజనాలు దానికి ఉండి సమస్య పరిష్కారం కాకుండా జాప్యం చేయడం వల్లనే సమస్య మరింత జటిలమౌతోంది. కృష్ణానది పుట్టిన మహారాష్ట్ర, ఆ తర్వాత పరివాహక ప్రాంతమైన కర్ణాటక, చివరి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వాలకు మధ్య జలవివాదాలు రగిలాయి. ఎగువనున్న రెండు రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్ ఎక్కువ నీటిని విని యోగించుకుంటున్నదనే వివాదాన్ని పై రాష్ట్రాలు రెండు లేవనెత్తాయి. అది పరిష్కరించడం కోసం కేంద్ర ప్రభుత్వం 1969లో ఆర్ఎస్ బచావత్ కమిటీని, జలవివాదాల పరి ష్కారం కోసం ప్రత్యేక ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసింది. ట్రిబ్యునల్ వందేళ్ల జల పరివాహకాన్ని పరిగణనలోకి తీసు కొని మూడు రాష్ట్రాల వాటాలను తేల్చింది. బచావత్ ప్రముఖ ఇంజినీర్ కావడంతో, 75 శాతం డిపెండబిలిటీని ఆధారంగా వేసుకొని నికరజలాలను తేల్చారు. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం కృష్ణానదీ పరివాహక ప్రాంతంలో 2060 టీఎంసీలు నికరజలాలుగా నిర్ణయించారు. మహా రాష్ట్రకు 560 టీఎంసీలు, కర్ణాటకకు 700 టీఎంసీలు, ఆంధ్ర ప్రదేశ్‌కు 811 టీఎంసీలు కేటాయింపులు చేస్తూ 1976లో తీర్పునిచ్చారు. బచావత్ కమిటీ తీర్పు 2000 జూన్ 31 నాటికి ముగిసింది. మిగులు వరద జలాలను దిగువన ఉన్న వారు వాడుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కలిసి వచ్చింది. 1983లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభు త్వంలో ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తమిళ తంబీల రుణం తీర్చుకోవడం కోసం ‘తెలుగుగంగ’ పథకాన్ని ప్రారం భించారు. దీనికోసం 15 టీఎంసీల నీటిలో ఎగువ రాష్ట్రాలు చెరో ఐదు టీఎంసీలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఐదు టీఎంసీలు కేటాయిస్తూ ఆనాటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ సమక్షంలో ఒప్పందం కుదుర్చుకున్నారు. దాని ఆధారంగా శ్రీశైలం ఎగువన పోతిరెడ్డిపాడు వద్ద హెడ్ రెగ్యులేటర్‌ను ప్రారంభించారు. 2004లో ముఖ్యమంత్రిగా వచ్చిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తెలుగుగంగ హెడ్ రెగ్యు లేటర్‌ను వెడల్పు చేసి 11 వేల క్యూసెక్కుల ప్రవాహాన్ని తరలించుకుపోయే ఏర్పాటు చేశారు. ఆ తర్వాత రెగ్యులేటర్ గేట్లను పెంచి 44 వేల క్యూసెక్కులకు పైగా జలాలను తరలించే ఏర్పాటు చేశారు. బచావత్ కమిటీ ముగిసిన తర్వాత 2004లో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏర్పాటైంది. 65 శాతం డిపెండ బులిటీగా తీసుకొని, 2060గా ఉన్న నికర జలాలను 2,578 టీఎంసీలుగా ట్రిబ్యునల్‌గా గుర్తించింది. దాని ప్రకారం ఎగువన కర్ణాటకకు 700+211=911 టీఎంసీలు, మహారాష్ట్రకు 560+106=666 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రానికి 811+190=1001 టీఎంసీలు కేటా యించింది. ఇప్పుడు అదనంగా కేటాయించిన 190 టీఎంసీల్లో సగం వాటా తెలంగాణా కావాలన్నది ప్రధానాంశంగా మారింది. రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత అంతకుముందు 811 టీఎంసీలలో 512 ఆంధ్రప్రదేశ్‌కు, 299 టీఎంసీలు తెలంగాణకు కేటా యించారు. కమిటీ అదనంగా కేటాయించిన నీటిలో తమకు తక్కువ ఇవ్వడం కుదరదని తెలంగాణ వాదిస్తున్నది. అంతేకాదు, మొత్తం కేటాయింపులలో చెరి సగం వాటాను పంచుకోవాలని డిమాండ్ చేస్తున్నది. గత సంవత్సరం పోతిరెడ్డిపాడు ఎగువన సిద్ధేశ్వరం వద్ద కేంద్ర అనుమతులు లేని రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ నిధులు కేటాయించారు. దీని ద్వారా మరో నాలుగు టీఎంసీల నీటిని తెలుగుగంగ కాల్వకు లింక్ చేయడం ద్వారా రోజుకు ఎనిమిది టీఎంసీల నీటిని అంటే 80 వేల క్యూసెక్కుల జలాలను తోడుకుపోవచ్చు. దీనికి తెలంగాణ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. వరద సమయంలో రోజుకు 80 వేల క్యూసెక్కులకు పైగా నీటిని తరలిస్తే పాలమూరు రంగారెడ్డి మొదలగు పథకాలకు నీళ్లు మిగలవని తెలంగాణ వాదన. రాయలసీమ పథకంపై గ్రీన్ ట్రిబ్యునల్ అనుమ తులు లేనందున నిలుపుదల చేయాలంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా జూరాల ఎగువన ప్రాజెక్టు నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించే ప్రాజెక్టులు ఆపకపోతే తాము కూడా కృష్ణానదిపై ప్రాజెక్టులు కట్టుకొని నీటిని తీసుకుపోతామంటోంది. వాస్తవంగా కృష్ణా పరివాహక ప్రాంతం 68 శాతంకు పైగా తెలంగాణలో ఉంది. దీని ప్రకారం జలాల్లో వాటా 548 టీఎంసీలు దక్కాలని తెలం గాణ అంటున్నది. 32 శాతం మాత్రమే ఆంధ్ర ప్రాంతంలో కృష్ణా పరివాహక ప్రాంతం ఉన్నది. అయినా 512 టీఎంసీలు పొందుతున్నది. ఇది న్యాయమా అని ప్రశ్నిస్తు న్నది. పరివాహక ప్రాంతాన్ని అనుసరించి కేటా యింపులు జరపాలని తెలంగాణ కోరుతున్నది. అయితే, ప్రాజెక్టులు నిండకముందే, 834 అడుగులు శ్రీశైలం జలాలు చేరక ముందే తెలంగాణ అక్రమంగా విద్యుత్తును ఉత్పాదన చేసి రోజుకు 30 వేల క్యూసెక్కులు వాడు కుంటోందని ఆంధ్రప్రదేశ్ వాదన. కేంద్ర అనుమతులు లేకుండా అనేక ఎత్తిపోతల పథకాలను తెలంగాణ చేపట్టిం దని ఆరోపిస్తున్నది. తెలంగాణ విద్యుత్ ఉత్పాదన చేయడం వల్ల రోజుకు ఎనిమిది వేల క్యూసె క్కులకు పైగా నీరు సముద్రంలో వృథాగా పోతోందని కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ విన్నవించుకుంది. కేంద్ర ప్రభుత్వం, జల సంఘం, కృష్ణా రివర్ బోర్డు నీటి కేటాయింపులను జరిపినప్పుడే సమస్యకు శాశ్వత పరి ష్కారం లభిస్తుంది. గత సమావేశాల్లో తెలంగాణకు ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామని కేంద్రం హామీనిచ్చింది. అందుకు సుప్రీంకోర్టులో వేసిన కేసును ఉపసంహరించు కోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. కేంద్రం ఇచ్చిన హామీతో కేసును ఉపసంహరించుకుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేతుల్లో పరిష్కారం ఉంది. జూలకంటి రంగారెడ్డి వ్యాసకర్త మాజీ శాసనసభ్యులు, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు -
జల జగడం
సాక్షి నెట్వర్క్: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల నేపథ్యంలో ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లోని సాగునీటి ప్రాజెక్టుల వద్ద గురువారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల పోలీసులు శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల వద్ద భారీగా మోహరించారు. అడ్డుకున్న తెలంగాణ పోలీసులు తెలంగాణ ప్రభుత్వం నాగార్జునసాగర్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం వద్ద పోలీసుల పహారా పెట్టి మరీ విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తోంది. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఏపీ ప్రభుత్వం కూడా డ్యామ్ వ ద్ద దాదాపు 240 మంది పోలీసులను మోహరించింది. విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాలంటూ టీఎస్ జెన్కో అధికారులకు వినతిపత్రం ఇవ్వడానికి ఏపీ జలవనరులశాఖ అధికారులు బయలుదేరగా కుడి కా లువ ఎస్ఈ గంగరాజును తెలంగాణ సరిహద్దుల్లో ఆ రాష్ట్ర పోలీసులు అడ్డుకున్నారు. కాగా సాగర్ నూతన బ్రిడ్జి వద్ద గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ శాంతిభద్రతలను పరిశీలించారు. పులిచింతలలో వినతిపత్రం అందజేత మరోవైపు పులిచింతలలోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. తెలంగాణ ప్రభుత్వం భారీగా పోలీసులను మోహరించింది. ఏపీ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు 300 మంది పోలీసులను ఉంచింది. పులి చింతల ప్రాజెక్టు ఎస్ఈ రమేష్ బాబు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం వద్దకు వెళ్లి వెంటనే విద్యుత్ ఉత్పత్తిని నిలుపుదల చేయాలని టీఎస్ జెన్కో అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. చెక్‌పోస్టులు.. ముమ్మరంగా తనిఖీలు.. కర్నూలు జిల్లాలోని రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్), పోతిరెడ్డిపాడు, శ్రీశైలం జలాశయం వద్ద భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప పర్యవేక్షించారు. -
అక్రమ ప్రాజెక్టులు ఆపండి, మాపైనే నిందలా
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ‘‘కృష్ణానదిపై ఏపీ అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను ఆపాలని మేం అంటున్నాం. కానీ తెలంగాణలో ఉన్న సీమాంధ్రులు ఇబ్బందులు పడతారన్న ఉద్దేశంతోనే తాము ఎక్కువగా మాట్లాడడం లేదని ఏపీ సీఎం, మంత్రులు అనడం విచారకరం. తెలంగాణ ఏర్పాటయ్యాక హైదరాబాద్‌లోగానీ, ఇతర ప్రాంతాల్లో గానీ నివసిస్తున్న సీమాంధ్రులు ఎక్కడైనా ఇబ్బందులు పడ్డారా? రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాల్లో ఇబ్బందులు పడ్డామని ఎవరైనా అన్నారా? ట్యాంక్ బండ్‌పై ఉన్న ఏ ఒక్క సీమాంధ్ర నాయకుడి విగ్రహాన్ని అయినా తొలగించామా? తెలంగాణలో ఉన్న సీమాంధ్రులను ఇక్కడివారు కలుపుకొని పోయి.. వ్యవసాయం చేసుకుంటున్నారు. కానీ ఏపీలో మమ్మల్ని ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తున్నారు. టీఎస్ ఆర్టీసీ బస్సులను అక్కడి స్టేషన్లలో ఆపనివ్వలేదు. తిరుపతిలో ఓ అధికారి మమ్మల్ని అవమాన పరిచిన ఘటన కూడా ఉంది..’’అని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. గురువారం మహబూబ్‌నగర్ కలెక్టరేట్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీ పాలమూరును ఎడారి చేసేలా అక్రమ ప్రాజెక్టులతో నీటిని దోచుకెళ్లే ప్రయత్నం చేస్తోందని, పైగా తెలంగాణపై నిందలు మోపుతోందని శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. పొరుగు రాష్ట్రాలతో సుహృద్భావ వాతావరణం ఉండాలనేదే సీఎం కేసీఆర్ సంకల్పమని.. మహారాష్ట్రకు నష్టం వాటిల్లకుండా వారిని ఒప్పించి కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేశామని చెప్పారు. ఏపీ కూడా అలాగే పైన ఉన్న వారికి ఇబ్బంది కలగకుండా చూసుకుంటుందని భావించామన్నారు. శ్రీశైలం పూర్తిగా విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు అని, అలాంటిది విద్యుత్ ఉత్పత్తి చేస్తే ఇంత రాద్ధాంతం ఎందుకని ప్రశ్నించారు. -
నీళ్లపై గరంగరం!
♦ ప్రాజెక్టుల్లో సరిపడా జలాలు లేకున్నా తెలంగాణ విద్యుదుత్పత్తి చేస్తోందని, నీళ్లు వృథాగా పోతున్నాయని, ఆపాలని ఏపీ సర్కారు అంటోంది. తమ హక్కు మేరకే ప్రాజెక్టుల్లో జల విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటున్నామని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. దీనిపై ఇరు రాష్ట్రాల రాజకీయ నాయకుల మధ్య విమర్శల పర్వం నడుస్తోంది. ♦ శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల వద్ద రెండు వైపులా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా పోలీసులను మోహరించాయి. తెలంగాణ సర్కారు జూరాల వద్ద నిఘా పెట్టింది. ♦ ఏపీ ప్రభుత్వం కర్నూలు జిల్లాలోని ఆర్డీఎస్, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుల వద్ద రెండు ప్లటూన్ల చొప్పన బలగాలను మోహరించింది. చెక్‌పోస్టులు పెట్టి తనిఖీలు నిర్వహిస్తోంది. నాగార్జునసాగర్/ధరూరు/అమరచింత/హుజూర్నగర్ (చింతలపాలెం)/దోమలపెంట (అచ్చంపేట): కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టుల్లో తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి.. దానిని ఆపాలంటూ ఆంధ్రప్రదేశ్ అధికారుల విజ్ఞప్తులు, ప్రయత్నాలతో పరిస్థితి వేడెక్కుతోంది. ఇరు రాష్ట్రాల రాజకీయ నాయకుల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు వివాదాస్పదంగా మారుతున్నాయి. ఇప్పటికే ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రాజెక్టుల వద్ద తమవైపు సరిహద్దుల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించాయి. విద్యుత్ ఉత్పత్తి ఆపాలంటూ ఏపీ అధికారులు గురువారం ఆయా ప్రాజెక్టుల వద్ద తెలంగాణ అధికారులకు వినతిపత్రాలు ఇచ్చేందుకు ప్రయత్నించారు. వారిని ఇక్కడి పోలీసులు అడ్డుకుని, వెనక్కి పంపేశారు. ప్రాజెక్టుల సమీపంలో ఏపీ నుంచి వస్తున్న వాహనాలను క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. దీనితో టెన్షన్ వాతావరణం నెలకొంది. మరోవైపు ఏపీ కూడా తమవైపు బందోబస్తు కట్టుదిట్టం చేసింది. నాగార్జునసాగర్ డ్యామ్ వద్ద 240 మందిని, పులిచింతల వద్ద 300 మందిని మోహరించింది. నాగార్జునసాగర్ వద్ద హడావుడి నాగార్జునసాగర్‌లో విద్యుదుత్పత్తిని నిలిపివేయాలని కోరుతూ.. గురువారం తెలంగాణ జెన్కో అధికారులకు వినతిపత్రం ఇచ్చేందుకు వస్తున్న ఏపీ అధికారులను ఇక్కడి పోలీసులు అడ్డుకుని వెనక్కి పంపించారు. ఏపీ అధికారుల నుంచి వినతిపత్రం తీసుకునేందుకు తెలంగాణ అధికారులు నిరాకరించారు. ఇదే సమయంలో ఏపీ నుంచి తెలంగాణకు వస్తున్న వాహనాలను పోలీసులు క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఇరువైపులా రెండు రాష్ట్రాలు పోలీసులను మోహరించాయి. పులిచింతల వద్ద 250 మందితో గస్తీ పులిచింతల ప్రాజెక్టులోని తెలంగాణ పవర్ హౌజ్‌లో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలంటూ ప్రాజెక్ట్ ఎస్ఈ రమేశ్‌బాబు గురువారం టీఎస్ జెన్కో ఎస్ఈ దేశ్యానాయక్‌కు వినతిపత్రం అందజేశారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలో ఉన్న పులిచింతల ప్రాజెక్టు డ్యాం వద్ద వారు భేటీ అయ్యారు. ప్రాజెక్టులో నీరు తక్కువగా ఉన్నప్పుడు విద్యుత్ ఉత్పత్తి చేస్తూ నీటిని వదిలితే.. సముద్రంలో కలవడం తప్ప ప్రయోజనం లేదని, విద్యుత్ ఉత్పత్తి ఆపాలని ఏపీ అధికారులు కోరారు. అయితే ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని జెన్కో ఎస్ఈ చెప్పారు. కాగా పులిచింతల డ్యామ్, పవర్‌హౌజ్ ప్రాంతాల్లో దాదాపు 250 మంది సాయుధ పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. సాగర్‌లో విద్యుత్ ఉత్పత్తితో పులిచింతలకు 36వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లోగా వస్తోంది. పులిచింతల టీఎస్ జెన్కో కేంద్రంలో 30 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తూ, 4 వేల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నట్టు అధికారులు తెలిపారు. జూరాల దగ్గర భద్రత పెంపు కృష్ణా ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి అంశం వేడెక్కడంతో.. జోగుళాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టు ఎగువ, దిగువ జల విద్యుత్ కేంద్రాల వద్ద ప్రభుత్వం భద్రతను మరింతగా పెంచింది. మూడు రోజులుగా ఇక్కడ పోలీసు బందోబస్తు కొనసాగుతోంది. ప్రాజెక్టుపైకి వెళ్లే జీరో పాయింట్ దగ్గర, ప్రాజెక్టు కంట్రోల్ రూం సమీపంలో, జెన్కో జల విద్యుత్ కేంద్రం వద్ద పహారా ఏర్పాటు చేశారు. ఇక ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసులు గురువారం ఉదయమే జూరాల ప్రాజెక్టుపై రాకపోకలను నిలిపివేశారు. అయితే ముందస్తు సమాచారం ఇవ్వకుండా గేట్లు మూసి, వాహనాలను నిలిపేస్తే ఎలాగని స్థానికులు, వాహనదారులు నిలదీయడంతో రాకపోకలకు అనుమతించారు. శుక్రవారం ఉదయం నుంచి రాకపోకలను పూర్తిగా ఆపేస్తామని పోలీసులు స్పష్టం చేశారు. నిఘా నీడలో శ్రీశైలం ఎడమ ప్లాంట్ తెలంగాణ జెన్కో పరిధిలోని శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రం, ఆ పరిసర ప్రాంతాలన్నీ పోలీస్ వలయంలో ఉన్నాయి. వంద మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏపీ నుంచి తెలంగాణలోకి ప్రవేశించే మార్గాల్లో నిఘా పెట్టారు. ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలోని ఐదు యూనిట్లలో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. విద్యుత్ కేంద్రంలోకి ఇంజనీర్లు, ఉద్యోగులకు తప్ప ఇతరులెవరినీ అనుమతించడం లేదు. గురువారం అచ్చంపేట డీఎస్పీ నర్సింహులు భూగర్భకేంద్రాన్ని సందర్శించి సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
ఆ అధికారం అపెక్స్ కౌన్సిల్‌దే: షెకావత్
సాక్షి, న్యూఢిల్లీ: రెండు రాష్ట్రాల మధ్య జలవివాదాలను పూర్తిగా చర్చించామని, చాలా అంశాలపై ఏకాభిప్రాయంతో ఒక పరిష్కారానికి వచ్చామని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. మంగళవారం జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కృష్ణా, గోదావరి నదులపై ఏ ప్రాజెక్ట్‌లు కట్టాలన్నా.. వాటికి అనుమతులు ఇచ్చే అధికారం అపెక్స్ కౌన్సిల్‌దేనని షెకావత్ స్పష్టం చేశారు. (చదవండి: ముగిసిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం) ‘‘కృష్ణా, గోదావరి రివర్ బోర్డుల పరిధిని నోటిఫై చేయడంపై చర్చ జరిగింది. ఆరేళ్లుగా వివాదాల కారణంగా వీటిని నోటిఫై చేయలేదు. ఈ రోజు రెండు రాష్ట్రాల సీఎంల ఏకాభిప్రాయంతో వీటిని నోటిఫై చేస్తున్నాం. కృష్ణా, గోదావరి నదులకు సంబంధించిన కొత్త ప్రాజెక్ట్‌లపై డీపీఆర్‌లను సమర్పించడానికి ఇరురాష్ట్రాల సీఎంలు ఒప్పుకున్నారని’’ షెకావత్ వెల్లడించారు. కృష్ణా, గోదావరి రివర్ బోర్డులకు ముందుగా డీపీఆర్‌లను సమర్పించిన తర్వాతనే కొత్త ప్రాజెక్ట్‌ల ప్రతిపాదనలు తేవాలని చర్చించామని ఆయన పేర్కొన్నారు. కృష్ణా, గోదావరి జలాల పంపిణీకి సంబంధించి సమగ్రమైన ప్రణాళికపై చర్చ జరిగిందని, కృష్ణా రివర్ బోర్డ్‌ను హైదరాబాద్ నుంచి ఏపీకి తరలించేందుకు ఇరురాష్ట్రాలు ఒప్పుకున్నాయని చెప్పారు. జల పంపిణీ వివాదంపై సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటామని కేసీఆర్ ఒప్పుకున్నారని తెలిపారు. ఆ తర్వాత ఈ అంశంపై ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామని చెప్పామని షెకావత్ తెలిపారు. త్వరలో పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తామని ఆయన పేర్కొన్నారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం (రాష్ట్ర విభజన చట్టం) ప్రకారం “అపెక్స్ కౌన్సిల్” ఏర్పడిందని, నాలుగు సంవత్సరాల అనంతరం ఈ సమావేశం జరిగిందని షెకావత్ అన్నారు. 2016 లో తొలిసారి అప్పటి కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమా భారతి నేతృత్వంలో “అపెక్స్ కౌన్సిల్” సమావేశం జరిగిందన్నారు. కృష్ణా, గోదావరి నదుల నీటి పంపకం, వివాదాల పరిష్కారం ఈ కౌన్సిల్ బాధ్యత అని పేర్కొన్నారు. సమావేశం చాలా సుహృద్భావ వాతావరణంలో జరిగిందని, అన్ని సమస్యల పరుష్కర కోసం చాలా విపులంగా చర్చించామని ఆయన తెలిపారు. ఇద్దరు ముఖ్య మంత్రులూ సమస్యల పరిష్కారానికి సిద్ధంగా ఉన్నారని షెకావత్ వెల్లడించారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఐదు కీలక నిర్ణయాలు.. ►కేఆర్ఎంబీ,జీఆర్ఎంబీ బోర్డుల పరిధి నోటిఫై చేస్తున్నాం ►కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లు పంపడానికి అంగీకారం ►న్యాయ సలహా తర్వాత కృష్ణా, గోదావరి నదీ జలాల పంపిణీకి నూతన ట్రిబ్యునల్ ఏర్పాటు పై నిర్ణయం ►సుప్రీం కోర్టు నుంచి కేసు ఉపసంహరణ చేస్తే నది జలాల పంపిణీ పై ట్రిబ్యునల్ ఏర్పాటు. కేసు ఉపసంహరణకు సీఎం కేసీఆర్ అంగీకారం ►కేఆర్ఎంబీ ప్రధాన కార్యాలయం ఆంధ్రాకు తరలింపు -
ఢిల్లీ: అపెక్స్ కౌన్సిల్ సమావేశం ప్రారంభం
-
ముగిసిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి మంగళవారం మధ్యాహ్నం ప్రారంభమైన అపెక్స్ కౌన్సిల్ సమావేశం ముగిసింది. కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీ నుంచి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు. దాదాపు రెండు గంటలపాటు సమావేశం కొనసాగింది. సీఎం జగన్‌తోపాటు నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్, కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ కూడా సమావేశంలో పాల్గొన్నారు. ట్రిబ్యునల్ కేటాయింపుల ప్రకారం.. న్యాయబద్ధంగా నీటిని వాడుకోనున్నట్లు సీఎం వైఎస్ జగన్ తన వాదన వినిపించినట్టు తెలిసింది. రాయలసీమ, ప్రకాశం దుర్భిక్ష ప్రాంతాలకు సాగునీరు, తాగునీరు అందించడం.. రాయలసీమ, ఎత్తిపోతల పథకం ద్వారా పాత ఆయకట్టుకు నీటి తరలింపు విషయాలను ఆయన అపెక్స్ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. (చదవండి: బాలాజీ రిజర్వాయర్ నిర్మాణానికి సహకారం) ముగిసిన సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగిసింది. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షతన జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న అనంతరం సీఎం జగన్ విమానాశ్రయానికి బయల్దేరారు. ఆయన వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బాలశౌరీ ఉన్నారు. -
అరవై ఏళ్లుగా గోస పడ్డాం...
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల విషయంలో రాష్ట్రానికి న్యాయం చేయాల్సిన బాధ్యత కేంద్రం పైనే ఉందని సీఎంకె.చంద్రశేఖర్‌రావు పునరుద్ఘాటించారు. ఆరు దశాబ్దా లుగా నీళ్లు లేక తెలంగాణ తీవ్ర అన్యాయానికి గురైందని, దీన్ని సవరించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. కొత్తగా ఏర్పాటైన తెలుగు రాష్ట్రాలకు కృష్ణా జలాల్లో సమన్యాయం జరిగేలా.. ప్రస్తుతమున్న ట్రిబ్యునల్‌తో నీటి కేటాయింపులు చేయించాలని డిమాండ్ చేశారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి నీటిని తీసుకునే సామ ర్థ్యాన్ని పెంచేలా ఆంధ్రప్రదేశ్ చేపట్టిన పనులు... పునర్వ్యవస్థీకరణ చట్టానికి పూర్తి విరుద్ధంగా, తెలంగాణ ప్రజల హక్కులను కాలరాసేలా ఉన్నాయని, ఈ విషయంలో జోక్యం చేసుకొని ఆ పనులను తక్షణమే నిలుపుదల చేయాలని కోరారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ శుక్రవారం రాత్రి కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కు 14 పేజీల లేఖ రాశారు. రాత్రి 11 గంటలకు ఈ లేఖను మీడియాకు విడుదల చేశారు. ఈ లేఖలో ఇంతవరకు కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని మరోమారు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నెల 6న అపెక్స్ కౌన్సిల్ భేటీ జరుగనున్న నేపథ్యంలో... సీఎం ముందుగానే లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది. తెలంగాణ ప్రజల మనో నివేదనం.. కృష్ణా, గోదావరీ నదీ జలాల వినియోగం విషయంలో పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ అనుసరిస్తున్న తీరును, ఏడేండ్లుగా మౌనం వహిస్తున్న కేంద్రం వైఖరిని ఎండగడుతూ, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అద్దంపట్టేలా కేసీఆర్ లేఖ రాశారు. అత్యున్నతస్థాయి పాలనా యంత్రాంగం, జల వనరులశాఖ నిపుణులు, అధికారులతో కూడిన బృందం 48గంటలపాటు శ్రమించి సీఎం కేసీఆర్ సూచనల మేరకు ఈ ఉత్తరాన్ని రూపొందించింది. ఈ క్రమంలో అంతర్జాతీయ, జాతీయ, అంతర్ రాష్ట్ర జలన్యాయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి, 60 ఏండ్లుగా తెలంగాణకు జరిగిన అన్యాయాలను పునఃపరిశీలించి, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను ఎత్తిచూపుతూ కేంద్రానికి ఈ లేఖను ఎక్కుపెట్టారు. కేంద్రం తాత్సారం... అంతర్ రాష్ట్ర నదీజలాల వివాద చట్టం 1956 సెక్షన్–3 కింద తెలంగాణ ఫిర్యాదును ఏడేండ్లుగా ట్రిబ్యునల్‌కు నివేదించకుండా కేంద్రం తాత్సారం చేయడాన్ని సీఎం కేసీఆర్ ఈ లేఖలో ఎత్తిచూపారు. కేంద్రం నిర్లక్ష్యం కారణంగా కృష్ణా జలాల్లో న్యాయమైన వాటాను తెలంగాణ ఇప్పటిదాకా పొందలేకపోయిందని, రెండు రాష్ట్రాల మధ్య జల పంపిణీని సుగమం చేసే బదులు.. కేంద్రం వైఖరి వివాదాలకు ఆజ్యం పోసిందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే తమ ఫిర్యాదును సెక్షన్–3 క్రింద నివేదించాలని కేంద్రాన్ని కోరారు. పోతిరెడ్డిపాడు నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా కృష్ణా జలాలను కృష్ణా బేసిన్ అవతల ఉన్న ప్రాంతాలకు పెద్దఎత్తున తరలించుకుపోతుంటే కృష్ణా నదీ జలాల యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) ఏం చేస్తున్నదని నిలదీశారు. పోతిరెడ్డిపాడును 80వేల క్యూసెక్కుల సామర్థ్యానికి విస్తరించడాన్ని, రోజుకు 3 టీఎంసీలు తరలించడానికి రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా తీసుకుంటున్న చర్యలను కేఆర్ఎంబీ నిరోధించలేకపోవడాన్ని కేసీఆర్ ఈ లేఖలో ఎత్తిచూపారు. పోతిరెడ్డిపాడును ఆపండి.. వాస్తవంగా పోతిరెడ్డిపాడు ద్వారా 11,150 క్యూసెక్కుల నీటిని తీసుకునేందుకే అనుమతి ఉంది. కానీ, ఏపీ కుట్రపూరితంగా దాని సామర్థ్యాన్ని 44వేల క్యూసెక్కులకు పెంచిందని లేఖలో సీఎం కేంద్రం దృష్టికి తెచ్చారు. ఇదే అక్రమమంటే... దీన్ని 80వేల క్యూసెక్కులకు విప్తరించడం పూర్తిగా అక్రమం. శ్రీశైలం అట్టడుగు స్థాయి నుంచి రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోసేలా చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పనులను మొత్తంగా రూ.24 వేల కోట్లతో చేపట్టింది. వీటిపై కేంద్రం, బోర్డుకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదు. పనులను నిలుపుదల చేయడంలో బోర్డు విఫలమైంది. ఈ పనులను తక్షణమే ఆపాలని సీఎం కోరారు. 2019– 20వ ఏడాదిలో 179 టీఎంసీల కృష్ణా జలాలను పోతిరెడ్డిపాడు ద్వారా పెన్నా బేసిన్‌కు తరలించారు. ఇది పూర్తిగా అక్రమమైనా బోర్డు పట్టించుకోలేదు. కావున తక్షణమే శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతను తెలంగాణకు అప్పగించాలి. పోతిరెడ్డిపాడు నుంచి అక్రమ నీటి తరలింపును ఆపడానికి కేంద్రం తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలన్నారు. శ్రీశైలం దిగువన ఉన్న నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఆయకట్టుకు అవసరమైన సాగునీటితో పాటు, హైదరాబాద్ నగరానికి తాగునీటి కోసం ఇబ్బందులు రాకుండా చూడాలని కేంద్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. వాటా జలాల మేరకే ప్రాజెక్టులు చేపట్టామని, ఏపీ ప్రాజెక్టులతో తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతింటాయన్నారు. ఇది తెలంగాణ హక్కులను హరించడమేనని, కావున ఏపీ ప్రాజెక్టులను అంగీకరించమన్నారు. ఈ విషయంలో కేంద్రం నిష్పక్షపాతంగా వ్యవహరించి న్యాయం చేయాలన్నారు. అవన్నీ పాతవే... తెలంగాణ రాష్ట్రం గోదావరిపై నిర్మిస్తున్న కాళేశ్వరం, దేవాదుల, సీతారామ వంటి ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిర్యాదు చేయడాన్ని ఈ లేఖలో కేసీఆర్ ఎద్దేవా చేశారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నపుడు గోదావరి జలాల్లో తెలంగాణకు కేటాయించిన 967.94 టీఎంసీలలో నుంచే ఈ ప్రాజెక్టుల ద్వారా నీటిని వినియోగించుకుంటున్నామని, ఇవేవీ కొత్తవి కావని లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి చేసిన ఫిర్యాదు, పోతిరెడ్డిపాడు విస్తరణ, రాయలసీమ ఎత్తిపోతల పథకం సహా వారు అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులపై నుంచి దృష్టిని మరలించడానికి వేసిన ఎత్తుగడగానే తాము భావిస్తున్నామని స్పష్టం చేశారు. గోదావరిపై తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులేవీ కొత్తవి కావని, అవి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభించినవేనని సీఎం కేసీఆర్ ఆధారాలతో సహా వివరించారు. -
‘వన్ ట్రిబ్యునల్’ వచ్చేనా?
సాక్షి, హైదరాబాద్: అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలను త్వరితగతిన పరిష్కరించడం, అవి వెలువరించిన తీర్పులను పక్కాగా అమలు చేసే దిశగా కేంద్రం తెస్తున్న ‘వన్ నేషన్–వన్ ట్రిబ్యునల్’పై ఇంకా అనిశ్చితి వీడటం లేదు. అంతర్రాష్ట్ర నదీజల వివాదాలను విచారించడానికి ప్రస్తుతమున్న వివిధ ట్రిబ్యునళ్లను రద్దు చేసి, ఒకే శాశ్వత ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసే బిల్లు ఇప్పటికే లోక్‌సభలో ఆమోదం పొందినా రాజ్యసభలో ఎప్పటిలోగా ఆమోదం దక్కుతుందనే సందిగ్ధత వీడటం లేదు. ప్రస్తుతం మొదలుకానున్న బడ్జెట్ సమావేశాల్లో అయినా దీనికి ఆమోదం దక్కుతుందా? అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. మూడేళ్లలో తీర్పులు.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కృష్ణా, కావేరి, వంశధార, మహదాయి, రావి నదీ వివాదాలు సహా మొత్తంగా 8 ట్రిబ్యునళ్లు పనిచేస్తున్నాయి. అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం–1956 ప్రకారం ఏదైనా రాష్ట్రం వివాదాలపై చేసిన వినతిపై సంతృప్తి చెందినప్పుడు కేంద్ర ప్రభుత్వం ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేస్తూ వస్తోంది. అలాగే ఏర్పాటు చేసిన కృష్ణా ట్రిబ్యునల్ విచారణలు పదేళ్లుగా సాగుతూనే ఉన్నాయి. అయినా వివాదాలకు పరిష్కారం దొరకడం లేదు. దీన్ని దృష్ట్యా రాష్ట్రాల ఫిర్యాదులను వేగంగా పరిష్కరించే దిశగా ఒకే ట్రిబ్యునల్ అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఇందుకోసం ప్రస్తుతం ఉన్న చట్టాలను సవరించనుంది. ప్రతిపాదిత శాశ్వత ట్రిబ్యునల్‌కు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి చైర్‌పర్సన్‌గా ఉండనున్నారు. ఈ ట్రిబ్యునల్ రెండేళ్లలో తన తీర్పును వెలువరించాల్సి ఉంటుంది. ఈ బిల్లును 2017లోనే లోక్‌సభ ముందుకు తెచ్చినా, 2019 ఆగస్టులో సభ ఆమోదం పొందింది. ప్రస్తుతం కృష్ణా జలాల వివాదాన్ని చూస్తున్న బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌లో తెలంగాణకు న్యాయం జరిగే అవకాశం లేకపోవడంతో శాశ్వత ట్రిబ్యునల్ ఏర్పాటును తెలంగాణ గట్టిగా సమ్మతించింది. రాజ్యసభలో మాత్రం ఈ బిల్లు ఇంకా ఆమోదం పొందలేదు. దీంతో వన్ ట్రిబ్యునల్ ఇంకా అమల్లోకి రాలేదు. ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో అయినా దీనికి ఆమోదం దక్కుతుందా? అని వేచి చూడాలి. ఆర్నెల్లుగా జరగని బ్రిజేశ్ ట్రిబ్యునల్ విచారణ.. ప్రస్తుతం కృష్ణానదీ జలాలను విచారిస్తున్న జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ విచారణ ఆర్నెల్లుగా పూర్తిగా నిలిచిపోయింది. ఇప్పటికే కృష్ణా వివాదాలపై పదేళ్లుగా విచారిస్తున్నా ఇంతవరకూ తుది తీర్పును ఇవ్వని ట్రిబ్యునల్.. ఆర్నెల్లుగా అయితే ఒక్క భేటీ నిర్వహించలేదు. ట్రిబ్యునల్‌లోని ఒక సభ్యుడు రాజీనామాతో ఖాళీ అయిన స్థానాన్ని కేంద్రం ఇంతవరకు భర్తీ చేయకపోవడంతో విచారణ వాయిదా పడుతూ వస్తోంది. ఫిబ్రవరి 23న మళ్లీ భేటీ నిర్వహించాల్సి ఉన్నా అది జరిగేది అనుమానంగానే ఉంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం తెస్తున్న వన్ ట్రిబ్యునల్ బిల్లుతోనే వివాదాలకు పరిష్కారం దొరుకుతుందనే అభిప్రాయంతో తెలంగాణ ఉంది. -
జల వివాదాలపై కదిలిన కేంద్రం
సాక్షి, హైదరాబాద్: దక్షిణాది రాష్ట్రాల్లోని జల వివాదాలపై కేంద్రం దృష్టి పెట్టింది. జల సమస్యలపై ఆయా రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాలను చక్కబెట్టడం, కేంద్రం ప్రతిపాదిస్తున్న నదుల అనుసంధానంపై రాష్ట్రాల అభిప్రాయాలను సేకరించడం, వాటి పరిష్కారాలు, గ్రామీణ తాగునీటి వ్యవస్థ, పారిశుద్ధ్య నిర్వహణ వంటి అంశాలపై చర్చించేందుకు నిర్ణయించింది. ఇందులో భాగంగా నవంబర్ 11న హైదరాబాద్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలతో కేంద్ర జలశక్తి శాఖ కీలక సమావేశం ఏర్పాటు చేసింది. ఈ భేటీకి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ హాజరుకానున్నారు. కేంద్ర మంత్రి పర్యటనపై గురువారం తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం లేఖ రాసింది. కృష్ణా, గోదావరి, కావేరి నదులకు సంబంధించి దక్షిణాది రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారానికి గత ప్రభుత్వ హయాంలో ఒకసారి సమావేశం జరిగింది. గతేడాది ఫిబ్రవరి 20న జరిగిన ఈ భేటీకి అప్పటి కేంద్ర జలవనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి అర్జున్ మేఘ్వాల్ హాజరయ్యారు. ఈ భేటీ సందర్భంగానే కృష్ణా బేసిన్లో నీటి లభ్యత క్రమంగా తగ్గిపోతోందని, భవిష్యత్తులో గోదావరి నదిపైనే ఎక్కువగా ఆధారపడాల్సిన అవసరాన్ని తెలంగాణ నొక్కి చెప్పింది.గోదావరిలో నీరు ఎంత ఉందనే విషయంపై హైడ్రాలజీ సర్వే నిర్వహించాలని, తర్వాత మిగులు నీరు ఉంటేనే నదుల అనుసంధానంపై కేంద్రం ఆలోచించాలని సూచించింది. -
‘జల వివాదాల’ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
న్యూఢిల్లీ: అంతర్ రాష్ట్ర జల వివాదాలను వేగంగా, ఓ క్రమపద్ధతిలో పరిష్కరించేందుకు ఉద్దేశించిన బిల్లును లోక్‌సభ బుధవారం ఆమోదించింది. అంతర్ రాష్ట్ర నదీ జల వివాదాల (సవరణ) బిల్లు–2019 బిల్లును లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. బిల్లును కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ప్రవేశపెడుతూ, వివిధ రాష్ట్రాల మధ్య తలెత్తిన జల వివాదాలను పరిష్కరించడంలో ప్రస్తుతం ఉన్న ట్రిబ్యునళ్లు విఫలమయ్యాయనీ, కాబట్టి పరిష్కార విధా నంలో మార్పు అవసరమన్నారు. ఓ కేసులో అయితే 33 ఏళ్లయినా వివాదాన్ని ట్రిబ్యునల్ పరిష్కరించలేకపోయిందని చెప్పారు. కోర్టులు లేదా ట్రిబ్యునళ్లు నీటిని సృష్టించలేవనీ, అందరూ జల సంరక్షణపై దృష్టిపెట్టాలని మంత్రి పేర్కొన్నారు. ప్రపంచంలోని జనాభాలో 18 శాతం మంది ఇండియాలోనే ఉన్నారనీ, కానీ ప్రపంచంలోని మంచి నీళ్లలో 4 శాతమే మన దేశంలో ఉండటంతో ఇది తీవ్ర సమస్యగా మారనుందని మంత్రి చెప్పారు. సభలో చర్చ సందర్భంగా కావేరీ జల వివాదంపై తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సభ్యులు వాగ్వాదానికి దిగడంతో స్పీకర్ ఓం బిర్లా వారిని సముదాయించారు. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ తదితర పార్టీల సభ్యులు మాట్లాడుతూ, రాష్ట్రాలను సంప్రదించేలా ఈ బిల్లులో నిబంధనలు లేవనీ, ఇది సమాఖ్య వ్యవస్థపై దాడి అని అన్నారు. బిల్లులో ఏముంది?: అంతర్ రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టం–1956ను సవరించేం దుకు కేంద్రం ఈ బిల్లును తెచ్చింది. వేర్వేరు ధర్మాసనాలతో ఒకే ట్రిబ్యునల్‌ను ఏర్పాటుచేయడం, వివాదాలను పరిష్కరించేందుకు ఓ కాలపరిమితి విధించి, కచ్చితంగా ఆ సమయంలోపు సమస్య పరిష్కారమయ్యేలా చూడటం ఈ బిల్లు ప్రత్యేకతలు. సుప్రీంకోర్టు రిటైర్డు జడ్జి ట్రిబ్యునల్‌కు నేతృత్వం వహిస్తారు. అవసరమైనప్పుడు ధర్మాసనాలను ఏర్పాటు చేస్తా రు. వివాదం పరిష్కారమయ్యాక అవి రద్దవుతాయి. గరిష్టంగా రెండేళ్లలోపు వివాదాన్ని ట్రిబ్యునల్ పరిష్కరించాల్సి ఉంటుంది. -
కదిలిన కృష్ణా బోర్డు!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల పంపిణీపై వాటర్ ఇయర్ దగ్గర పడుతున్నా ఇంకా కేంద్రం, బోర్డు దృష్టి సారించలేదంటూ ఈ నెల 9న ‘సాక్షి’లో ప్రచురితమైన ‘వాటా’ర్ వార్! కథనంపై కృష్ణా బోర్డు స్పందించింది. వాటర్ ఇయర్ ఆరంభానికి ముందే సమస్యలు పరిష్కరించుకోకుంటే మళ్లీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య నీటి వివాదాలు తప్పవన్న కథనం నేపథ్యంలో ఈ నెలాఖరులోగా బోర్డు సమావేశం ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఈ నెల 29 నుంచి 31 వరకు బోర్డు సమావేశాన్ని నిర్వహించే తేదీని ఖరారు చేసి తమకు తెలియజేయాలంటూ బోర్డు సభ్య కార్యదర్శి పరమేశం శుక్రవారం ఇరు రాష్ట్రాల ఇంజనీర్ ఇన్ చీఫ్‌లకు లేఖలు రాశారు. మొత్తంగా 13 అంశాలను సమావేశపు ఎజెండాలో చర్చించాలని పేర్కొన్న ఆయన ఇతర అంశాలు ఏవైనా సూచిస్తే వాటిని ఈ నెల 18లోగా తమకు పంపాలని రెండు రాష్ట్రాలకు సూచించారు. వాటా.. నియంత్రణ.. టెలిమెట్రీలే కీలకం ఎజెండాలో 13 అంశాలను పేర్కొన్న బోర్డు ఇందులో ప్రధానంగా వర్కింగ్ మాన్యువల్, 2017–18 ఏడాదిలో నీటి వినియోగం, వచ్చే ఏడాది నీటి వాటాల వినియోగం, టెలిమెట్రీ అంశాలను చేర్చింది. ఇందులో వాటాల అంశం చాలా కీలకంగా ఉండనుంది. గతేడాది కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టుల్లో నీటి వాటాలను ఏపీ, తెలంగాణలు 66:34 నిష్పత్తిలో పంచుకున్నాయి. అయితే ఈ నిష్పత్తిని మార్చా లని తెలంగాణ కోరుతోంది. పట్టిసీమ, పోలవరంతో దక్కే వాటాలను దృష్టిలో పెట్టుకొని 61:39 నిష్పత్తి లో పెంచాలని కోరే అవకాశముంది. దీంతో పాటే కృష్ణాలో తమ వాటా 299 టీఎంసీలకు పట్టిసీమతో దక్కే వాటా 45 టీఎంసీలను కలపాలని ఎప్పటినుంచో పట్టుబడుతోంది. ఈ అంశమే బోర్డు సమావేశంలో అత్యంత కీలకంగా ఉండనుంది. బోర్డు వర్కింగ్ మాన్యువల్‌పైనా భిన్నాభిప్రాయం వ్యక్తమైంది. ప్రాజెక్టులన్నింటినీ తామే నియంత్రిస్తామని ఇప్పటికే బోర్డు కేంద్ర జలవనరుల శాఖ ముసాయిదాను పంపింది. దీన్ని తెలంగాణ తప్పుపడుతోంది. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు లేకుండా నియంత్రణ అక్కర్లేదని ఇప్పటికే కేంద్రానికి లేఖ రాసింది. అయితే ఏపీ.. నియంత్రణ అవసరమంటూ పట్టుదలగా ఉండటంతో బోర్డు ఎలా స్పందిస్తుందన్నది వేచి చూడాల్సిందే. మరోవైపు ఇప్పటికీ టెలీమెట్రీ మొదటి విడత ఏర్పాటుపై స్పష్టత లేదు. దీన్ని కూడా ఎజెండా అంశాల్లో బోర్డు చేర్చింది. -
ఒక దేశం.. ఒక ట్రిబ్యునల్!
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి జాతీయ స్థాయిలో ఒకే ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర జల వనరుల శాఖ సహాయ మంత్రి అర్జున్‌రాం మేఘవాల్ ప్రకటించారు. నదీ జలాల వివాదాలన్నింటినీ ఇదే ట్రిబ్యునల్ పరిధిలోకి తెస్తామన్నారు. మార్చి–ఏప్రిల్‌లో జరిగే రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో ఈ మేరకు బిల్లును ఆమోదిస్తామని వెల్లడించారు. ‘‘ఒక్కో నది పరిధిలో ఒక్కో ట్రిబ్యునల్ ఉంది. ట్రిబ్యునల్ తీర్పులు వెలువరించాక సైతం కొన్ని రాష్ట్రాలు హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నాయి. నదుల వారీగా ట్రిబ్యునల్స్ ఉండడం వల్ల డబ్బు, కాలం వృథా అవుతోంది. దీనికి విరుగుడుగా ఒకే ట్రిబ్యునల్ అవసరం. అన్ని నదీ వివాదాలను దీని పరిధిలోకి తెస్తాం. ఇకపై రాష్ట్ర స్థాయిలో ట్రిబ్యునళ్లు ఉండవు. ఇప్పటికే ఆయా ట్రిబ్యునళ్ల పరిధిలో ఉన్న కేసులన్నింటినీ ఒకే ట్రిబ్యునల్ కిందకు తెచ్చి సమస్యలను త్వరగా పరిష్కరిస్తాం’’అని మేఘవాల్ అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని తాజ్ వివాంటా హోటల్లో దక్షిణాది రాష్ట్రాల ఇరిగేషన్ సదస్సు జరిగింది. దీనికి తెలంగాణ నుంచి మంత్రి హరీశ్‌రావు, సీఎస్ ఎస్కే జోషి, పాండిచ్చేరి మంత్రి మల్లాది కృష్ణారావు, కేరళ మంత్రి థామస్ మాథ్యూలు హాజరు కాగా ఏపీ సహా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మంత్రులు గైర్హాజరయ్యారు. ఏపీ తరఫున అంతర్రాష్ట్ర జల వ్యవహారాల సలహాదారు రామకృష్ణ, కర్ణాటక, తమిళనాడు తరఫున జల వనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలు హాజరయ్యారు. సమావేశం అనంతరం మంత్రి హరీశ్‌రావు, పాండిచ్చేరి మంత్రి మల్లాది కృష్ణారావు, కేరళ మంత్రి థామస్ మాథ్యూ, కేంద్ర జల వనరుల శాఖ సంయుక్త కార్యదర్శి సంజయ్ కుందూ, సీడబ్ల్యూసీ చైర్మన్ మాజిద్ హుస్సేన్‌తో కలసి మేఘవాల్ మీడియాతో మాట్లాడారు. దక్షిణాదికి చెందిన ఆరు రాష్ట్రాల తొలి సమావేశం జయప్రదంగా ముగిసిందన్నారు. దీన్ని దక్షిణాది రాష్ట్రాల జలవనరుల సమా వేశం హైదరాబాద్ డిక్లరేషన్‌గా పిలవవచ్చన్నారు. తమిళనాడు–కర్ణాటక రాష్ట్రాల మధ్య సుప్రీంకోర్టు తీర్పు దరిమిలా ఆరు వారాల్లో కావేరి మేనేజ్మెంటు బోర్డు, కావేరి రెగ్యులేటరీ అథారిటీని ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. రాష్ట్రాలో సాగునీటి ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులు పెంచుతామని, నా బార్డు వంటి సంస్థలు లేదా ప్రపంచ బ్యాంకు నుంచి నిధులు మంజూరు చేయిస్తామని తెలిపారు. కాగా, తెలంగాణలో మిషన్ కాకతీ య మాదిరే తమ రాష్ట్రంలోని 1,200 చిన్న, 80 పెద్ద చెరువుల పునరుద్ధరణకు కేంద్రం సహకరించాలని కోరినట్లు పాండిచ్చేరి మంత్రి మల్లాది కృష్ణారావు తెలిపారు.