హైదరాబాద్: కృష్ణా నదీ జలాల వివాదం పరిష్కారంపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నీటి పారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్‌సీ)ల మధ్య జరిగిన సమావేశం తూతూమంత్రంగా జరిగింది. కేవలం పది నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో ఎవరి అవసరాలను వారు మరోమారు చర్చకు తేవడంతో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే సమావేశాన్ని మంగళవారానికి వాయిదా వేశారు.
సాగర్ జలాల వినియోగంపై చర్చించేందుకు సోమవారం తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్, ఏపీ ఈఎన్‌సీ వెంకటేశ్వరరావు భేటీ అయ్యారు. రాత్రి 7 గంటల సమయంలో ఏపీ ఈఎన్‌సీ తెలంగాణ ఈఎన్‌సీ కార్యాలయానికి వెళ్లారు. అప్పటికే అధికారులంతా కార్యాలయం నుంచి వెళ్లిపోవడంతో మంగళవారం మరోసారి భేటీ కావాలని ఇద్దరు అధికారులు నిర్ణయించారు.