
పాలమూరు జిల్లా ప్రాజెక్టులను ఎండబెట్టిన పాపం బీఆర్‌ఎస్‌దే
తెలంగాణ సీఎం ఎనుముల రేవంత్‌రెడ్డి మండిపాటు
సాక్షి, నాగర్ కర్నూల్ / నారాయణపేట: ఆనాడు వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడు పొక్క 4 వేల క్యూసెక్కుల నుంచి 40 వేల క్యూసెక్కులకు పెంచితే ఆయనకు ఊడిగం చేసి.. చెప్పులు మోసి.. కృష్ణా నది జలాలను రాయలసీమకు తరలించడానికి అనుమతించిన సన్నాసి చంద్రశేఖరరావు అని తెలంగాణ సీఎంరేవంత్‌రెడ్డి మండిపడ్డారు. కృష్ణా జలాలను తరలించుకుపోతుంటే హారతి ఇచ్చింది నువ్వు కాదా.. ఆనాడు మంత్రి వర్గంలో నీ మంత్రులు లేరా.. హరీశ్ రావు ఆ మంత్రి వర్గంలో మంత్రి కాదా.. సమాధానం చెప్పాలని నిలదీశారు.
ఆయన కుమారుడు జగన్సీఎం అయ్యాక, ప్రజల స్వేదంతో నిర్మించిన ఇదే ప్రగతి భవన్ అధికారిక నివాసానికి పిలిపించి పంచభక్ష్య పరమాన్నాలు పెట్టి.. ఆరు గంటలు చర్చించి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పథకం రచించింది నువ్వు కాదా.. ఇది ద్రోహం కాదా.. అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ నీళ్ల కోసమైతే తెలంగాణ తెచ్చుకున్నామో.. ఏ నీళ్ల కోసం శ్రీకాంతచారి లాంటి యువకులు ఆత్మ బలిదానం చేసుకున్నారో ఆ నీళ్లను రాయలసీమకు తరలించుకుపోతుంటే ఏం చేశావని ప్రశ్నించారు.
రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలకు రావాల్సిన నీళ్లను తీసుకెళ్తుంటే ఒక్కరోజైనా నువ్వు అడ్డుకున్నావా అని ధ్వజమెత్తారు. ‘అవ్వాల నువ్వు చేసిన పాపం ఇయ్యాల మాకు శాపమైంది. ఇవాళ మాకు ఉరైంది. తొందర్లోనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తయితే రోజుకు 10 టీఎంసీలు అంటే నెల రోజులు కళ్లు మూసుకుంటే 300 టీఎంసీల శ్రీశైలం నీళ్లు మొత్తం తరలించుకుపోతారు’ అని చెప్పారు.
శుక్రవారం నారాయణపేట జిల్లా అప్పక్‌పల్లిలో మెడికల్ కళాశాల, నర్సింగ్, పారా మెడికల్ కళాశాలలకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment