
కల్వకుర్తిటౌన్: బాధితురాలి కదలికలను గుర్తించే నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారని నాగర్‌కర్నూల్ ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ అన్నారు. ఊర్కొండ మండలంలోని ఊర్కొండపేట శివారులో జరిగిన ఆ ఘటన వివరాలను బుధవారం కల్వకుర్తిలోని డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వెల్లడించారు. జడ్చర్లకు చెందిన ఓ వివాహిత తన తల్లిదండ్రులు, పిల్లలతో కలిసి మార్చి 29న (శనివారం) మధ్యాహ్నం ఊర్కొండపేటకు వచ్చి దైవదర్శనం చేసుకొని రాత్రి అక్కడే బస చేశారు.
అదేరోజు రాత్రి 9 గంటల సమయంలో మరో బంధువు అక్కడకు రాగా.. ఆయనతో మాట్లాడుతూ 150 మీటర్ల దూరంలో ఆలయానికి ముందు భాగంలో ఉన్న గుట్ట ప్రాంతంలోకి వెళ్లడాన్ని నిందితులు గమనించారు. ఈ క్రమంలో నిందితులు అక్కడకు వెళ్లి బా ధితులను బెదిరించి, ఆ వ్యక్తిని చెట్టుకు కట్టేసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల్లో మార్పాకుల ఆంజనేయులు, సిద్ధిఖ్ బాబా, వాగుల్దాస్ మణికంఠ, కార్తీక్ మొదట అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఈ నలుగురు.. మట్ట మహేష్‌గౌడ్, హరీశ్‌గౌడ్, మట్ట ఆంజనేయులును ఘటనా ప్రాంతానికి పిలిపించగా, మద్యం తాగి వారు సైతం అత్యాచారం చేశారు.
బాధిత మహిళ తాగడానికి నీరు అడగ్గా, కార్తీక్ బాటిల్‌లో మూత్రం పోసి ఇచ్చాడని ఎస్పీ పేర్కొన్నారు. నిందితులంతా 28 ఏళ్లలోపు వారేనని, మహిళపై రాత్రి 12 గంటల వరకు అత్యాచారం చేశారని, ఈ విషయాన్ని బయటకు చెబితే మీరు కలిసి ఉన్న ఫొటోలను పబ్లిక్ చేస్తామని హరీశ్‌గౌడ్ బెదిరించారని చెప్పారు. మార్చి 30న (ఆదివారం) తెల్లవారుజామున బాధితురాలు తన బంధువుతో కలిసి వెళ్తుండగా విషయాన్ని బయటకు చెప్పకుండా వారిని బెదిరించి ఆలయ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి మహేశ్‌గౌడ్ వారి వద్ద రూ.6 వేలు డిమాండ్ చేసి వసూలు చేశాడు.
బాధితురాలు తన ఊరికి వెళ్లి, తిరిగి సోమవారం ఊర్కొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు. అత్యాచార ఘటనలో నిందితులను కల్వకుర్తి కోర్టులో హాజరుపరిచామని, జడ్జి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించినట్టు ఎస్పీ వెల్లడించారు. అత్యాచార ఘటనలో బాధితురాలి నుంచి నిందితులు బంగారం, నగదు తీసుకున్నారని చెప్పినా.. అందుకు సంబంధించిన రికవరీని పోలీసులు చూపించలేదు. ఈ సమావేశంలో కల్వకుర్తి డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐలు నాగార్జున, విష్ణువర్ధన్‌రెడ్డి, ఎస్‌ఐలు మాధవరెడ్డి, కృష్ణదేవ, కురుమూర్తి, సిబ్బంది పాల్గొన్నారు.
