రాష్ట్రంలో 9 వృక్షాలకు చారిత్రక ప్రాముఖ్యత
వీటికి వారసత్వ గుర్తింపునకు కృషి
ప్రభుత్వానికి ‘వట’ ఫౌండేషన్ ప్రతిపాదన
చారిత్రక ప్రాధాన్యత ఉన్న వృక్షాలను కంపెనీలు దత్తత తీసుకోవాలి: ఉదయ్ కృష్ణ
సాక్షి, హైదరాబాద్: వరదల నుంచి 150 మంది ప్రాణాలను కాపాడిన చెట్టు ఒకటి.. కొబ్బరికాయ ముడుపు కడితే వీసాలు ప్రసాదించేది మరో చెట్టు.. చేతులెత్తి మొక్కితే మొండి రోగాలను కూడా నయం చేస్తుందని భక్తులు నమ్మేది ఇంకో చెట్టు.. దోపిడీ దొంగల్ని పట్టించిన మరొక చెట్టు.. ఇలా రాష్ట్రంలో దేనికవే ప్రత్యేకమైన 9 పురాతన వృక్షాలున్నాయి.
ఈ చెట్ల పరిరక్షణ కోసం పాటుపడుతున్న స్వచ్ఛంద సంస్థ ‘వట’ ఫౌండేషన్.. ఆయా వృక్షాలకు వారసత్వ సంపద గుర్తింపు ఇవ్వాలని ప్రభుత్వానికి ప్రతిపాదించింది. దేశంలోని పురాతన చెట్ల చరిత్రను డాక్యుమెంట్ చేయాలనే లక్ష్యంతో ‘వట’ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఉదయ్ కృష్ణ ఇప్పటివరకు 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో సుమారు 27 వేల కి.మీ. ప్రయాణించారు.
అతి పురాతన చెట్లను గుర్తించి, వాటిని గూగుల్ ఎర్త్ ప్రో మ్యాప్‌లో నిక్షిప్తం చేస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 150 వృక్షాలను మ్యాపింగ్ చేశారు. మనుగడ కోల్పోయే దశలో ఉన్న వృక్షాలను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ కింద సంస్థలు దత్తత తీసుకోవాలని కోరారు.
తెలంగాణలోని 9 చారిత్రక వృక్షాలివీ..
దొంగల్ని పట్టించిన బావోబాబ్..
హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్‌లో 600 ఏళ్ల నాటి పురాతన బావోబాబ్ చెట్టు ఉంది. గోల్కొండ కోట గోడను ఆనుకొని ఉన్న ఈ వృక్షపు కాండం ఒక రహస్య గది మాదిరిగా ఉంటుంది. ఇందులో 20 మంది దాక్కునేంత కుహరం ఉంది. దీంతో దొంగలు పగటి పూట ఈ రహస్య గదిలో దాక్కొని రాత్రి సమయంలో కోట పరిసర ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడేవారు. ఒకరోజు దొంగలు వంట చేస్తుండగా చెట్టు వెనక నుంచి పొగలు రావడం స్థానికులు గమనించారు. ఈ విషయాన్ని సైనికులకు తెలపడంతోదొంగల గుట్టురట్టయింది.
వరదల నుంచి కాపాడిన చింత..
ఉస్మానియా ఆసుపత్రిలో చింత చెట్టు ఉంది. 1908, సెప్టెంబర్ 28న మూసీ నది వరదలు నగరాన్ని ముంచెత్తాయి. దాదాపు 30 వేల మంది మరణించారు. ఆ సమయంలో ప్రాణాలు రక్షించుకునేందుకు 150 మంది ప్రజలు ఈ చింత చెట్టు ఎక్కి రెండు రోజుల పాటు కొమ్మలపైనే ఉన్నారు. ప్రతీ ఏడాది నవంబర్ 30న హాస్పిటల్ డేను ఈ చెట్టు కిందే ఆసుపత్రి సిబ్బందిజరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
చెట్టుకు రాఖీ..
నాగర్‌కర్నూల్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలోని చీమ చింత చెట్టు భారీ వర్షానికి నేల కూలింది. 2017లో స్కూల్ యాజమాన్యంతో కలిసి ‘వట’ ఫౌండేషన్ దీనికి తిరిగి జీవం పోసింది. భారీ క్రేన్ సహాయంతో ఆ చెట్టును తిరిగి భూమిలో పాతారు. అప్పటినుంచి ఏటా జూన్ 28న విద్యార్థులు, టీచర్లందరూ ఆ చెట్టకు రాఖీ కడుతూ పండగ చేసుకోవడం ఆనవాయితీగా మారింది.
వేయి ఉరుల మర్రి
నిర్మల్‌లోని వేయి ఉరుల మర్రికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో రామ్‌జీ గోండు నాయకత్వంలో స్వయంపాలన ప్రకటించుకున్న గిరిజనులను బ్రిటిష్ పాలకులు దారుణంగా అణచివేశారు. రామ్‌జీ గోండును, అతని వేయి మంది సైన్యాన్ని పట్టుకొని ఈ మర్రి చెట్టుకు1860 ఏప్రిల్ 9న అందరినీ ఒకేసారి ఉరి తీసినట్లు జాన పధ కథల్లో చెబుతుంటారు. అందుకే ఈ చెట్టును ‘వెయ్యి ఉరుల మర్రి’గా పిలుస్తుంటారు. అయితే కాలక్రమేణా ఈ వృక్షం నరికివేతకు గురి కావడంతో ఇక్కడ స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేశారు.
రోగాలు మాన్పించే వృక్షం..
చేవెళ్లలోని దామరిగిద్దలోఉన్న చింత చెట్టు 600 ఏళ్ల నాటిది.ఈ పురాతన చింత చెట్టుకు ఒక బొరియఉంటుంది. అనారోగ్యంతో ఉన్న పిల్లలుఈ బొరియ గుండా వెళితే రోగం నయమవుతుందని గ్రామస్తుల విశ్వాసం.
పర్యాటక పిల్లలమర్రి..
మహబూబ్‌నగర్‌లోని పిల్లలమర్రి సుమారు 800 ఏళ్ల నాటి భారీ వృక్షం. ఒకప్పుడు 4 ఎకరాల్లో విస్తరించి ఉండేది. కానీ, ఆక్రమణ కారణంగా ప్రస్తుతం 2.5 ఎకరాలకు పరిమితమైపోయింది. ఈ చెట్టును చూసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి పర్యాటకులు వస్తుంటారు. భారీ కొమ్మలతో విశాలంగా విస్తరించి ఉండటంతో ఈ ప్రాంతానికే పిల్లల మర్రి అనే పేరు వచ్చింది. వేల కొద్ది మర్రి ఊడల కారణంగా ప్రధాన కాండం ఏదో స్పష్టంగా గుర్తించలేం.
వీసాలు ప్రసాదించే మర్రి
హిమాయత్‌సాగర్‌లోని చిలుకూరు బాలాజీ ఆలయం ఎలాగైతే వీసా గాడ్‌కు పేరు గాంచిందో.. నిజామాబాద్ జిల్లా ముప్కాల్‌లోని మర్రి చెట్టు కూడా వీసాల చెట్టుగా గుర్తింపు పొందింది. విదేశాలకు వెళ్లే విద్యార్థులు, కార్మికులు ఎరుపు లేదా తెలుపు రంగు గుడ్డలో కొబ్బరికాయ కట్టి ఈ చెట్టుకు ముడుపు కడితే వీసా వస్తుందని స్థానికుల విశ్వాసం.
అయితే వడగళ్ల వర్షం కారణంగా ఈ భారీ వృక్షం నెలకొరిగింది. చుట్టుపక్కల నివాసితులకు ముప్పుగా మారడంతో గ్రామస్తులు వృక్షంలోని ఎక్కువ భాగాన్ని నరికివేశారు. కేవలం 15 అడుగుల వరకు విస్తరించి ఉన్న భారీ కాండం మాత్రమే ఇప్పుడు మిగిలి ఉంది. జహీరాబాద్‌లోని గొట్టిగారిపల్లి గ్రామంలోని చెరువు పక్కన ఉన్న మర్రి చెట్టు, నిజామాబాద్‌లోని ఆర్గుల్ గ్రామంలోనిఒక కొండపై ఉన్న మూడు పురాతన చింత చెట్లు కూడావందల ఏళ్ల నాటి వృక్షాలే. చారిత్రక గుర్తింపుతో ఆయావృక్షాలు పర్యాటకలను ఆకర్షిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment