సాక్షి, అమరావతి: కృష్ణా, గోదావరి జలాల వినియోగంపై తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలకు ముగింపు పలకడమే లక్ష్యంగా రెండు బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ గతేడాది జూలై 15న కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలు ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కు అన్నట్లుగా తయారైంది. కేంద్రం నిర్దేశించిన తుది గడువు ముగిసిపోయి మూడు నెలలు పూర్తయినా నోటిఫికేషన్ అమల్లోకి రాకపోవడం గమనార్హం.
మూడు నెలల క్రితమే ఏపీ ఉత్తర్వులు..
కృష్ణా బోర్డు ఆమోదించిన తీర్మానం మేరకు ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో తమ భూభాగంలోని ఆరు అవుట్‌లెట్లను బోర్డుకు అప్పగించేందుకు అంగీకరిస్తూ గత అక్టోబర్ 14నే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ సర్కార్ మాత్రం తన భూభాగంలోని తొమ్మిది అవుట్‌లెట్లను బోర్డుకు అప్పగించేందుకు నిరాకరిస్తూ వస్తోంది. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి వచ్చాకే బోర్డు పరిధిని నిర్ణయించాలంటూ పాత పాట అందుకుంది.
గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం శ్రీరాంసాగర్ నుంచి సీతమ్మసాగర్ వరకు గోదావరిపై ప్రాజెక్టులన్నీ బోర్డు పరిధిలోకి తేవాలని ఏపీ ప్రభుత్వం ప్రతిపాదిస్తుండగా.. ఉమ్మడి ప్రాజెక్టులే లేనప్పుడు గోదావరి బోర్డుతో అవసరమేముందని, రద్దు చేయాలని తెలంగాణ సర్కార్ వాదిస్తోంది. గెజిట్ నోటిఫికేషన్ అంశాలను తు.చ. తప్పకుండా అమలు చేస్తామని కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్, కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్లు ఎంపీ సింగ్, చంద్రశేఖర్ అయ్యర్ పదేపదే స్పష్టం చేస్తున్నా ఆచరణకు నోచుకోవడం లేదు. దీంతో జల వివాదాలు సమసిపోవడం లేదు.
సమీక్షలతో సరి..
కృష్ణా, గోదావరి బోర్డుల పరిధి, స్వరూపంపై నివేదిక ఇచ్చేందుకు ఇరు బోర్డులు వేర్వేరుగా సబ్ కమిటీలను నియమించాయి. బోర్డుల సభ్య కార్యదర్శుల నేతృత్వంలో ఇరు రాష్ట్రాల అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం సీఈలు, జెన్‌కో సీఈలు సభ్యులుగా ఉన్న ఈ కమిటీలు పలుదఫాలు సమావేశమై నివేదికలు ఇచ్చాయి. వీటి ఆధారంగా బోర్డు పరిధిని ఖరారు చేసి గెజిట్ నోటిఫికేషన్ అమలుకు రెండు బోర్డులు సిద్ధమయ్యాయి. కృష్ణా బేసిన్‌లో ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లోని 15 అవుట్ లెట్లను తొలుత పరిధిలోకి తీసుకుని నిర్వహిస్తామని, ఆ తర్వాత దశల వారీగా ఇతర ప్రాజెక్టులను అధీనంలోకి తీసుకుంటామని కృష్ణా బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్ ప్రతిపాదించారు. ఇందుకు రెండు రాష్ట్రాలు తొలుత అంగీకరించడంతో ఆ మేరకు బోర్డు తీర్మానాన్ని ఆమోదించింది.
గోదావరి ప్రాజెక్టులన్నీ బోర్డు పరిధిలోకి తేవాలన్న ఏపీ
ఉమ్మడి ప్రాజెక్టు అయిన పెద్దవాగును పరిధిలోకి తీసుకుని నోటిఫికేషన్ అమలు ప్రారంభిస్తామని గోదావరి బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ ప్రతిపాదించగా.. శ్రీరాంసాగర్ నుంచి సీతమ్మసాగర్ వరకూ గోదావరి ప్రధాన పాయపై ఉన్న ప్రాజెక్టులన్నీ బోర్డు పరిధిలోకి తీసుకుని నిర్వహిస్తేనే దిగువ రాష్ట్రమైన ఏపీకి ప్రయోజనం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనిపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. బోర్డు చైర్మన్ పలుమార్లు సమీక్షలు నిర్వహించినా ఒక తాటిపైకి తేలేకపోయారు.
నోరుమెదపని జల్‌శక్తి శాఖ
నోటిఫికేషన్ అమలుపై తొలుత కృష్ణా, గోదావరి బోర్డు అధికారులతో కేంద్ర జల్ శక్తి శాఖ అదనపు కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత రెండు రాష్ట్రాల జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించినా ఏకాభిప్రాయాన్ని సాధించలేకపోయారు. గత నెల 28న రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, జలవనరుల శాఖ ఉన్నతాధికారులు, గోదావరి, కృష్ణా బోర్డుల చైర్మన్‌లతో కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి వర్చువల్ విధానంలో సమావేశం నిర్వహించారు.
కృష్ణా బోర్డు పరిధికి ఏపీ సర్కార్ అంగీకరించగా.. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి వచ్చే వరకూ నోటిఫికేషన్ అమలును నిలుపుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం పట్టుబట్టింది. గోదావరి బోర్డు అవసరమే లేదని తెలంగాణ సర్కార్ పేర్కొనగా.. దిగువ రాష్ట్రమైన తమ హక్కుల పరిరక్షణకు బోర్డు అత్యంత ఆవశ్యకమని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. రెండు రాష్ట్రాల వాదనలు విన్న కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి నోటిఫికేషన్‌ను తప్పకుండా అమలు చేస్తామని చెప్పినా ఇప్పటిదాకా ఆ దిశగా అడుగులు పడకపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment