Projects: వీడని సందిగ్ధత.. ఏవి ఎవరి పరిధిలో..? | Ambiguity On Projects Under Purview Of Krishna And Godavari Boards | Sakshi
Sakshi News home page

Projects: వీడని సందిగ్ధత.. ఏవి ఎవరి పరిధిలో..?

Published Mon, Oct 4 2021 2:06 AM | Last Updated on Mon, Oct 4 2021 2:06 AM

Ambiguity On Projects Under Purview Of Krishna And Godavari Boards - Sakshi

కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య వివాదాలకు చరమగీతం పాడే దిశగా వెలువ రించిన గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలుకు గడువు దగ్గర పడుతున్నా.. బోర్డుల పరిధిలో ఉండే ప్రాజెక్టులపై మాత్రం సందిగ్ధత వీడటం లేదు.

సాక్షి, హైదరాబాద్‌:  కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య వివాదాలకు చరమగీతం పాడే దిశగా వెలువ రించిన గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలుకు గడువు దగ్గర పడుతున్నా.. బోర్డుల పరిధిలో ఉండే ప్రాజెక్టులపై మాత్రం సందిగ్ధత వీడటం లేదు. గెజిట్‌ ప్రకారం కృష్ణా బేసిన్‌లోని 36 ప్రాజెక్టులు, గోదావరి బేసిన్‌లోని 71 ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి రావాల్సి ఉండగా.. ఇన్ని ప్రాజెక్టులను తీసుకోవ డంపై రెండు తెలుగు రాష్ట్రాలు అభ్యంతరాలు లేవ నెత్తుతున్నాయి. కృష్ణా బేసిన్‌లో ఉమ్మడి ప్రాజెక్టు లను మాత్రమే బోర్డు పరిధిలో ఉంచాలని తెలుగు రాష్ట్రాలు కోరుతుంటే.. గోదావరిలో ఒకే ఒక్క ప్రాజెక్టును మాత్రమే బోర్డు పరిధిలో ఉంచాలని తెలంగాణ కోరుతోంది. దీంతో కేంద్రం, బోర్డులు ఎలా స్పందిస్తాయన్నది ఆసక్తిగా మారింది. 

ఒక్కొక్కరిది ఒక్కో వాదన
కేంద్రం వెలువరించిన గెజిట్‌ నోటిఫికేషన్‌ ప్రకారం కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతంలోని  తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులన్నీ అక్టోబర్‌ 14 నుంచి కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిలోకి వెళ్లాల్సి ఉంది. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌ సహా చిన్న, మధ్యతరహా, భారీ ప్రాజెక్టులు, వాటికి అనుబంధంగా ఉన్న విద్యుదుత్పత్తి కేంద్రాలు, సరఫరా వ్యవస్థ (ట్రాన్స్‌మిషన్‌ లైన్స్‌),  ఆయకట్టుకు నీటిని విడుదల చేసే ప్రాంతాలు, ఎత్తిపోతల పథకాల నిర్వహణ తదితర బాధ్యతలను బోర్డులే నిర్వహిస్తాయి. ప్రాజెక్టుల నిర్వహణ విషయంపై రెండు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించే అధికారం బోర్డులకు ఉంటుంది. అయితే శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల పరిధిలోని హెడ్‌వర్క్స్‌ మాత్రమే బోర్డుల పరిధిలో ఉండాలని తెలంగాణ అంటోంది. శ్రీశైలంపై ఆధారపడి చేపట్టిన కల్వకుర్తి, పాలమూరు–రంగారెడ్డి, డిండి వంటి పథకాలు వద్దని అంటోంది. 

బనకచర్ల వద్దు
ఆంధ్రప్రదేశ్‌ మాత్రం.. సాగర్, శ్రీశైలం, పులి చింతలతో పాటు జూరాలను కృష్ణా బోర్డు పరిధిలో ఉంచాలని కోరుతోంది. అయితే బనకచర్లను మా త్రం వద్దంటోంది. ఎందుకంటే పోతిరెడ్డిపాడు ద్వారానే నీళ్లు బనకచర్లను చేరతాయి. పోతిరెడ్డి పాడు ద్వారా జరిగే నీటి వినియోగానికి లెక్కలు ఉంటాయి కాబట్టి,  బనకచర్లను చేర్చాల్సిన అవసరం లేదని వాదిస్తోంది. ఈ మేరకు తన అభి ప్రాయాలను కేంద్రానికి పంపింది. దీనిపై ఇంత వరకు బోర్డు, కేంద్రం నుంచి స్పందన రాలేదు.

పెద్దవాగును ఉంచితే చాలు: తెలంగాణ
గెజిట్‌లో పేర్కొన్న మేరకు పెద్దవాగు రిజర్వాయర్, పోలవరం ప్రాజెక్టు, కృష్ణా డెల్టాకు 80 టీఎంసీ తరలింపు, పోలవరం 960 మెగావాట్ల విద్యుత్‌ ప్రాజెక్టు, తోట వెంకటాచలం పుష్కర, తాడిపూడి, పట్టిసీమ, పురుషోత్తపట్నం ఎత్తిపోతలు, కాటన్‌ బ్యారేజీ, తొర్రిగడ్డ, చింతలపూడి, చాగల నాడు, వెంకటనగరం ఎత్తిపోతలు గోదావరి బోర్డు పరిధిలో ఉండనున్నాయి.

అలాగే ఎస్సారెస్పీ స్టేజ్‌–1, కాళేశ్వరం, కాళేశ్వరం అదనపు టీఎంసీ, దేవాదుల, తుపాకుల గూడెం బ్యారేజీ, ముక్తేశ్వర్, సీతారామ ఎత్తిపోతలు, మాచ్‌ఖండ్‌ జల విద్యుత్‌ ప్రాజెక్టు, సీలేరు విద్యుత్‌ కాంప్లెక్స్‌లు కూడా బోర్డు అధీనంలో ఉండనున్నాయి. అయితే గోదావరిలో తెలుగు రాష్ట్రాల మధ్య ఉమ్మడి ప్రాజెక్టులు లేని దృష్ట్యా వీటిపై బోర్డు పెత్తనం అవసరం లేదని తెలంగాణ అంటోంది. ఒకవేళ పెట్టాల్సి వస్తే ఖమ్మం జిల్లాలో ఇరు రాష్ట్రాలకు ఉమ్మడిగా ఉన్న పెద్దవాగును మాత్రమే ఉంచాలని కోరుతోంది. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోని బోర్డు, ఈ నెల 6,7 తేదీల్లో అక్కడ పర్యటించేందుకు మాత్రం ఏర్పాట్లు చేసుకుంటోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement