సాక్షి, అమరావతి: గోదావరి, కృష్ణా బోర్డు పరిధిపై ఏకాభిప్రాయం కుదరలేదు. ఆదివారం జరిగిన సబ్ కమిటీల సమావేశాల్లో రెండు రాష్ట్రాల అధికారులు భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేశారు. పరిధిపై నిర్ణయాధికారాన్ని సోమవారం జరిగే గోదావరి బోర్డు ప్రత్యేక సమావేశానికి గోదావరి బోర్డు సబ్ కమిటీ అప్పగించగా.. కృష్ణా సబ్ కమిటీ సోమవారం మరోసారి సమావేశమై పరిధిని కొలిక్కి తెచ్చే యత్నం చేయాలని నిర్ణయించింది. రెండు బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ జులై 15న కేంద్ర జల్‌శక్తి శాఖ జారీచేసిన గెజిట్ నోటిఫికేషన్ ఈనెల 14 నుంచి అమల్లోకి వస్తుంది. దీని అమలు కోసం బోర్డు పరిధి, స్వరూపంపై ముసాయిదా నివేదిక ఇచ్చేందుకు రెండు బోర్డుల చైర్మన్లు సబ్ కమిటీలను ఏర్పాటుచేశారు. ఇవి ఇప్పటికే పలుమార్లు సమావేశమయ్యాయి. గోదావరి బోర్డు సమావేశం సోమవారం.. కృష్ణా బోర్డు ప్రత్యేక సమావేశం మంగళవారం జరగనున్న నేపథ్యంలో వాటి పరిధి, స్వరూపంపై ముసాయిదా నివేదిక రూపొందించేందుకు ఆదివారం సబ్ కమిటీలు మరోసారి సమావేశమయ్యాయి.
గోదావరి బోర్డు పరిధి పెద్దవాగుతో మొదలు..
కన్వీనర్ బీపీ పాండే నేతృత్వంలో గోదావరి బోర్డు సబ్ కమిటీ ఆదివారం హైదరాబాద్‌లో సమావేశమైంది. అందులో తేలింది ఏమిటంటే..
► రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు అయిన పెద్దవాగును తొలుత బోర్డు పరిధిలోకి తీసుకుని.. ఆ తర్వాత దశల వారీగా ఇతర ప్రాజెక్టులను తీసుకుంటామని బీపీ పాండే తెలిపారు. దీనిపై ఏపీ జలవనరుల శాఖ అంతర్రాష్ట్ర విభాగం సీఈ శ్రీనివాసరెడ్డి అభ్యంతరం వ్యక్తంచేశారు. కేవలం 16 వేల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించే పెద్దవాగు ప్రాజెక్టును మాత్రమే బోర్డు పరిధిలోకి తీసుకోవడంవల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. తెలంగాణలో శ్రీరాంసాగర్ నుంచి సీతమ్మసాగర్ (సీతారామ ఎత్తిపోతల్లో అంతర్భాగం) వరకూ అన్ని ప్రాజెక్టులను గోదావరి బోర్డు పరిధిలోకి తీసుకుని.. నీటి వినియోగాన్ని నియంత్రిస్తేనే దిగువనున్న పోలవరం, గోదావరి డెల్టా హక్కులను పరిరక్షించడానికి సాధ్యమవుతుందని స్పష్టంచేశారు. దాంతో పరిధిపై నిర్ణయాధికారాన్ని సోమవారం జరిగే గోదావరి బోర్డు ప్రత్యేక సమావేశానికి అప్పగించాలని సబ్ కమిటీ నిర్ణయించింది.
► బోర్డు నిర్వహణకు సీడ్ మనీ కింద రెండు రాష్ట్రాలు చెరో రూ.200 కోట్లను డిపాజిట్ చేయాలని బీపీ పాండే కోరారు. ఈ అంశంపై ప్రభుత్వాలతో చర్చించి చెబుతామని ఏపీ, తెలంగాణ సీఈలు శ్రీనివాసరెడ్డి, మోహన్‌కుమార్‌లు తెలిపారు.
కృష్ణా సబ్ కమిటీకి వివరాలివ్వని తెలంగాణ..
మరోవైపు.. కన్వీనర్ ఆర్కే పిళ్‌లై నేతృత్వంలో కృష్ణా బోర్డు సబ్ కమిటీ ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో సమావేశమైంది. ఇందులో..
► గెజిట్ నోటిఫికేషన్‌లో పేర్కొన్న మేరకు షెడ్యూల్–2లో అన్ని ప్రాజెక్టులు, సిబ్బంది తదితర వివరాలన్నీ ఏపీ అధికారులు ఇప్పటికే సబ్ కమిటీకి అందజేశారు. కానీ.. తెలంగాణ ఇవ్వకపోవడంపై పిళ్‌లై అసహనం వ్యక్తంచేశారు.
► జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల స్పిల్ వేలు, వాటిపై ఉన్న విద్యుత్కేంద్రాలు, కాలువలకు నీటిని విడుదలచేసే రెగ్యులేటర్లు, ఎత్తిపోతల పథకాలను బోర్డు పరిధిలోకి తీసుకోవాలని ఏపీ అధికారులు ప్రతిపాదించారు. దీనిపై తెలంగాణ అధికారులు అభ్యంతరం వ్యక్తంచేశారు. జూరాల ఉమ్మడి ప్రాజెక్టు కాదని.. దాన్ని బోర్డు పరిధిలోకి తీసుకోకూడదని స్పష్టంచేశారు. అయితే.. సుంకేశుల బ్యారేజీ, కేసీ కెనాల్‌ను బోర్డు పరిధిలోకి ఇచ్చేదిలేదని ఏపీ అధికారులు స్పష్టంచేశారు. అలాగే, శ్రీశైలంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌కే పరిమితం కావాలని.. బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్‌ను బోర్డు పరిధిలోకి తీసుకోకూడదన్నారు.
► శ్రీశైలం ఎడమ గట్టు, సాగర్, పులిచింతల విద్యుత్కేంద్రాలను బోర్డు పరిధిలోకి తీసుకోవాలా? వద్దా? అన్నది ప్రభుత్వంతో చర్చించి చెబుతామని తెలంగాణ అధికారులు చెప్పారు.
ఇలా.. రెండు రాష్ట్రాల అధికారుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తంకావడం, తెలంగాణ అధికారులు సమాచారం ఇవ్వకపోవడంతో కృష్ణా బోర్డు సబ్ కమిటీ సమావేశాన్ని సోమవారం మరోసారి నిర్వహించాలని కన్వీనర్ ఆర్కే పిళ్‌లై నిర్ణయించారు. ఈ సమావేశంలో పరిధి నిర్ణయాధికారాన్ని మంగళవారం జరిగే కృష్ణా బోర్డు ప్రత్యేక సమావేశానికి అప్పగించనున్నారు.
కుదరని ఏకాభిప్రాయం
Published Mon, Oct 11 2021 5:10 AM | Last Updated on Mon, Oct 11 2021 5:10 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment