Gazette Notification
-
ఆ పేరుతో సర్టిఫికెట్ మార్చి ఇస్తాం
సాక్షి, హైదరాబాద్: పేరు మార్చుకున్నప్పటికీ ప్రభుత్వం తన విద్యా సర్టిఫికెట్లలో ఆ మేరకు మార్పు చేయట్లేదంటూ హైకోర్టును ఆశ్రయించిన ఓ వ్యక్తికి చివరకు న్యాయం లభించింది. రెండు వారాల్లోగా పిటిషనర్‌కు ఎస్ఎస్సీ బోర్డు కొత్త సర్టిఫికెట్ జారీ చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు వెల్లడించింది. పిటిషనర్ విజ్ఞప్తిని సర్కార్ అంగీకరించినందున విచారణ ముగిస్తున్నట్లు న్యాయస్థానం తెలిపింది. ఇదీ నేపథ్యం.. తన పేరు మార్చుకున్నట్లు గెజిట్ నోటిఫికేషన్ జారీ అయినప్పటికీ ఎస్ఎస్సీ, ఇంటర్ బోర్డు, ఉస్మానియా యూనివర్సిటీ ఆ మేరకు సర్టిఫికెట్లలో మార్పులు చేయట్లేదంటూ రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌కు చెందిన వి. మధుసూదన్‌రెడ్డి అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ చర్య 1961 నాటి జీవో 1263 ప్రకారం చట్టవిరుద్ధమన్నారు. ఇది వ్యక్తుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని పేర్కొన్నారు. దీంతో ఆ విద్యార్థికి చెందిన సర్టిఫికెట్లలో పేరు మార్చడానికి వచ్చిన ఇబ్బందేమిటని ప్రభుత్వాన్ని హైకోర్టు గత విచారణ సందర్భంగా ప్రశ్నించింది. ఈ పిటిషన్‌పై మరోసారి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాస్‌రావు ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున న్యాయవాది కె.అరవింద్, ప్రభుత్వం తరఫున స్పెషల్ జీపీ ఎస్.రాహుల్‌రెడ్డి వాదనలు వినిపించారు. పిటిషనర్ కోరినట్లు మారిన పేరుపై రెండు వారాల్లో సర్టిఫికెట్ జారీ చేస్తామని ఎస్‌జీపీ బదులిచ్చారు. దీంతో ధర్మాసనం.. పిటిషన్లో విచారణను ముగించింది. -
జీపీఎస్ గెజిట్‌ను ఉపసంహరించుకోవాలి
అనకాపల్లి/భీమవరం: గ్యారంటీడ్ పెన్షన్ స్కీం (జీపీఎస్) అమలుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీచేయడంపై ఉపాధ్యాయ సంఘాలు ఆదివారం కూడా ఆందోళన బాటపడ్డాయి. రాజపత్రాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పాత పెన్షన్ విధానాన్ని అమలుచేస్తుందని ఆశించామని.. కానీ, మా ఆశలను వమ్ముచేస్తూ జీపీఎస్‌కు చట్టబద్ధత తెచ్చి గెజిట్ నోటిఫికేషన్ జారీచేయడం చాలా అన్యాయమంటూ ఆదివారం అనకాపల్లిలోని సీఐటీయూ కార్యాలయం వద్ద యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వత్సవాయి శ్రీలక్ష్మి, గొంది చినబ్బాయిలు విమర్శించారు. గెజిట్ కాపీలను దగ్థంచేశారు. పైగా.. జీపీఎస్ విధానాన్ని అమలుచేస్తూ పాత తేదీలతో రాజపత్రాన్ని విడుదల చేయడం దుర్మార్గమని చెప్పారు. జీపీఎస్ కంటే మెరుగైన విధానాన్ని అమలుచేస్తామని పవన్‌కళ్యాణ్, నారా లోకేశ్‌లు కూడా హామీ ఇచ్చారని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకుని, పాత పెన్షన్ విధానం అమలుకు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఎల్లయ్యబాబు, ఎంవీ అప్పారావు, జిల్లా కార్యదర్శి శేషుబాబు, కోశాధికారి జోగా రాజేష్, మున్సిపల్ ఉపాధ్యాయుల నాయకులు సతీ‹Ù, మోడల్ స్కూల్ నాయకులు ఆశాలత, ఏపీసీపీఎస్ఈఏ నాయకులు ఉమా మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మరోవైపు, ఉద్యోగ, ఉపాధ్యాయులకు జీవన్మరణ సమస్యగా ఉన్న కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దుచేసి, పాత పెన్షన్ విధానాన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అమలుచేస్తుందని భావించామని.. కానీ, అందుకు విరుద్ధంగా కొత్త ప్రభుత్వం జీపీఎస్‌పై గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడం చాలా అన్యాయమని యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి బి.గోపిమూర్తి, జిల్లా అధ్యక్షుడు పీఎస్ విజయరామరాజు అన్నారు. భీమవరంలో ఆదివారం వారు జీఓ కాపీలను దగ్థం చేశారు. కొలువుదీరిన ఉద్యోగ, ఉపాధ్యాయ వ్యతిరేక విధానాలను అమలుచేయడం దేనికి సంకేతమని వారు ప్రశి్నంచారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆకాంక్షలను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించడం తగదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి సీహెచ్ పట్టాభిరామయ్య, జిల్లా కార్యదర్శులు సీహెచ్ కుమారబాబ్జి, డి. ఏసుబాబు, ఎస్.రత్నరాజు, జి. రామకృష్ణంరాజు పాల్గొన్నారు. -
శాసనసభ రద్దు...తెలంగాణలో మూడో శాసన సభ ఏర్పాటుకు గెజిట్ నోటిఫికేషన్
-
తెలంగాణ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎన్నికల నగారా మోగింది. తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. శుక్రవారం ఉదయం గెజిట్ నోటిఫికేషన్ విడుదల కాగానే.. నామినేషన్ల పర్వం మొదలైంది. రాష్ట్రంలోని 19 ఎస్సీ, 12 ఎస్టీ రిజర్వుడ్ స్థానాలతో సహా మొత్తం 119 నియోజకవర్గాలకు శాసనసభ్యులను ఎన్నుకోవాల్సిందిగా నోటిఫికేషన్లో కోరింది ఈసీ. నేటి నుంచి 10వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. 13వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. అలాగే 15వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించింది ఎన్నికల సంఘం. నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఏర్పాటు చేసిన ఆర్వో(ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్) కార్యాలయాల్లో అభ్యర్థులు నామినేషన్ వేయాల్సి ఉంటుంది. నామినేషన్లు వేసే అభ్యర్థులకు సూచనలు ►నేటి నుంచి నవంబర్ 10వ తేదీ వరకు నామినేషన్ స్వీకరణ ►ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3గంటల వరకు నామినేషన్ స్వీకరణ ►నామినేషన్ దాఖలు చేసే సమయంలో రిటర్నింగ్ ఆఫీసర్ వద్దకు అభ్యర్థి వెంట నలుగురికి అనుమతి ►నామినేషన్ పత్రాలతో పాటు ఆస్తులు, అప్పులు, క్రిమినల్ కేసులు, విద్యా అర్హత వివరాలు పత్రాలను దాఖలు చేయాలి ►నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థి దాఖలుకు ఒకరోజు ముందు కొత్త బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి EC కి వెల్లడించాలి. ►కొత్త బ్యాంక్ అకౌంట్ లోనే అభ్యర్థి ఖర్చు వివరాలను తెలపాలి ►సువిధా యాప్ ద్వారా నామినేషన్ దాఖలు చేసే సదుపాయం కల్పించిన ఎన్నికల సంఘం ►ఆన్లైన్ లో దాఖలు తరువాత పత్రాలను RO కు అప్పగించాలి ►ప్రతిరోజు సాయంత్రం 3 గంటల తరువాత రోజువారీ నామినేషన్ వివరాలు వెల్లడించనున్న RO ►ప్రతిరోజు నామినేషన్ పత్రాలతో పాటు అఫిడేవిట్ పత్రాలను డిస్ప్లే చేయనున్న RO ►నామినేషన్ దాఖలు చేసిన ప్రతి అభ్యర్థి అఫిడేవిట్ పత్రాలను 24గంటల్లోనే CEO వెబ్సైట్ లో పెట్టనున్న ఎన్నికల అధికారులు ►అభ్యర్థులు అవసరమైతే 15వ తేదీ వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు 3 వాహనాలు.. ఐదుగురికే అనుమతి శుక్రవారం ఉదయం 11 గంటలలోపు ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. ఆ వెంటనే అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరించే సహాయ రిటర్నింగ్ అధికారుల (ఏఆర్వోలు) పేరు, రిటర్నింగ్ అధికారి కార్యాలయ చిరునామాను ప్రకటిస్తూ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ‘ఫారం–1’నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఉదయం 11 గంటల నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి 100 మీటర్ల పరిధిలోపు ఒక్కో అభ్యర్థికి సంబంధించిన 3 వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. నామినేషన్‌తో పాటుగా నిర్దేశిత ఫారం–26లో అభ్యర్థులు తమ నేర చరిత్ర, ఆస్తులు, అప్పులు, విద్యార్హతలు వంటి వివరాలను అఫిడవిట్ రూపంలో సమర్పించాల్సి ఉంటుంది. ఎన్నికల వ్యయం పర్యవేక్షణ కోసం నామినేషన్ల దాఖలుకు కనీసం ఒకరోజు ముందు ప్రతి అభ్యర్థి ప్రత్యేక బ్యాంకు ఖాతాను తెరవాల్సి ఉంటుంది. కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన ‘సువిధ’పోర్టల్ ద్వారా ఆన్లైన్లో కూడా నామినేషన్ దాఖలు చేయవచ్చు. అయితే సంతకాలు చేసిన హార్డ్ కాపీని గడువులోగా ఆర్వోకు సమర్పించాల్సి ఉంటుంది. నవంబర్ 30న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రంలోని 35,356 కేంద్రాల్లో పోలింగ్ జరగనుంది. ఇటీవల ప్రకటించిన తుది జాబితా ప్రకారం రాష్ట్రంలోని మొత్తం 3,17,17,389 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. త్వరలో ప్రకటించనున్న అనుబంధ ఓటర్ల జాబితాతో ఈ సంఖ్య స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది. డిసెంబర్ 3వ తేదీన ఓటింగ్ ఫలితాలు వెల్లడవుతాయి. సర్వం సిద్ధం! రాష్ట్ర శాసనసభ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం పూర్తిస్థాయిలో సమాయత్తమైంది. దాదాపుగా ఏడాది ముందు నుంచే అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు ప్రారంభించింది. క్రమంగా ప్రత్యేకంగా ఓటర్ల జాబితా రెండో సవరణ, ఈవీఎంలు సిద్ధం చేయడం, ఎన్నికలు/ పోలింగ్ అధికారులు, సిబ్బంది నియామకం, పోలింగ్ కేంద్రాల గుర్తింపు, పౌలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు కనీస సదుపాయాల కల్పన, దివ్యాంగ ఓటర్లకు ప్రత్యేక సదుపాయాల కల్పన, భద్రత ఏర్పాట్లను పూర్తి చేసింది. పటిష్ట బందోబస్తు, ఎక్కడికక్కడ నిఘా ఎన్నికల్లో ఓటర్లను డబ్బులు, మద్యం, ఇతర కానుకలతో ప్రలోభపెట్టేందుకు జరిగే ప్రయత్నాలను అడ్డుకునేందుకు ఈసారి ఎన్నికల సంఘం పటిష్ట ఏర్పాట్లు చేసింది. 4 రాష్ట్రాలతో సరిహద్దులను పంచుకునే 17 జిల్లాల్లో పటిష్ట నిఘా ఏర్పాటు చేసింది. 89 పోలీసు చెక్‌పోస్టులు, 14 రవాణా, 16 వాణిజ్య పన్నులు, 21 ఎక్సైజు, 8 అటవీ శాఖ చెక్‌పోస్టులను ఏర్పాటు చేసింది. ఎన్నికల కోడ్‌ను పటిష్టంగా అమలు చేసేందుకు అన్ని జిల్లాల్లో వీడియో నిఘా బృందాలు, వీడియో వ్యూయింగ్ టీమ్‌లు, అకౌంటింగ్ బృందాలు, ఫ్లైయింగ్ స్క్వాడ్స్, స్టాటిక్ సర్వైలియన్స్ టీంలు, ఖర్చుల పర్యవేక్షణ బృందాలను ఏర్పాటు చేసింది. ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు 119 నియోజకవర్గాల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన 67 మంది ఐఏఎస్ అధికారులను సాధారణ పరిశీలకులుగా నియమించింది. శాంతిభద్రతల పర్యవేక్షణ, బందోబస్తు ఏర్పాట్లు, పరిపాలన, పోలీసు విభాగాల మధ్య సమన్వయం కోసం 39 మంది ఐపీఎస్ అధికారులను నియమించింది. అభ్యర్థుల ఎన్నికల ఖర్చులపై నిఘా ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వ సర్వీసులో పనిచేస్తున్న సుమారు 50 మందిని వ్యయ పరిశీలకులుగా నియమించింది. పోలింగ్ రోజు అన్ని కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ సదుపాయం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. -
వేతన సవరణనా..ఉన్న బేసిక్నేనా?
సాక్షి, హైదరాబాద్: రెండు విడతల వేతన సవరణ జరపకుండానే విలీన ప్రక్రియ పూర్తిచేస్తే తీవ్రంగా నష్టపోతామన్న ఆందోళనలో ఆర్టీసీ ఉద్యోగులు ఉన్నారు. రెండు రోజుల క్రితమే, విలీనచట్టం అమలులోకి తెస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీచేసిన విషయం విదితమే. విలీనానికి సంబంధించి విధివిధానాలు ఖరారు చేసేందుకు ఉన్నతస్థాయి కమిటీని నియమిస్తూ త్వరలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే అవకాశముంది. ♦ ఆర్టీసీ ఉద్యోగులు ప్రస్తుతం 2013 వేతన సవరణ మీద కొనసాగుతున్నారు. 2015లో జరిగిన ఆ వేతన సవరణలో భాగంగా 44 శాతం ఫిట్మెంట్ పొందారు. వాటికి సంబంధించిన బకాయిలు బాండ్లరూపంలో ఇచ్చే 50 శాతం ఇప్పటికే పెండింగ్‌లో ఉంది. ♦2017లో జరగాల్సిన వేతన సవరణ చేపట్టలేదు. దాని బదులు, నాటి మంత్రులకమిటీ 16 శాతం మధ్యంతర భృతి ప్రకటించింది. ప్రస్తుతం అదే కొనసాగుతోంది. ♦ 2021లో జరగాల్సిన వేతన సవరణ కూడా జరగలేదు. ఈ రెండు వేతన సవరణలు పెండింగ్‌లో ఉండటంతో ఉద్యోగుల జీతాల్లో పెరుగుదల లేదు. ఫలితంగా వారు పదేళ్ల నాటి బేసిక్‌పైనే కొనసాగుతున్నారు. ♦ ఈ రెండు వేతన సవరణలు లేకుండా, ప్రస్తుతమున్న బేసిక్ ప్రాతిపదికగా తీసుకొని వారిని ప్రభుత్వంలోని కేడర్‌లో తత్సమాన బేసిక్ వద్ద ఫిక్స్ చేస్తే భారీగా నష్టపోవాల్సి ఉంటుందనేది ఆర్టీసీ ఉద్యోగుల ఆందోళనకు ప్రధాన కారణం. ♦ 1990లో ప్రభుత్వ ఉపాధ్యాయుల కంటే ఆర్టీసీ ఉద్యోగుల బేసిక్ ఎక్కువ. ఆ సమయంలో కొందరు ఉపాధ్యాయ, ఆర్టీసీలో పోస్టుల్లో చాన్స్ వస్తే.. బేసిక్ ఎక్కువగా ఉన్న ఆర్టీసీ వైపే మొగ్గు చూపారు. ♦ ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ టీచర్ బేసిక్..ఆర్టీసీ డీఎం బేసిక్ కంటే రెట్టింపునకు చేరింది. ఈ తరుణంలో ప్రస్తుత బేసిక్ ఆధారంగా ప్రభుత్వంలోని కేడర్ ఫిక్స్ చేస్తే, సీనియర్ డిపోమేనేజర్ స్థాయి ఆర్టీసీ అధికారి సెకండ్ గ్రేడ్ టీచర్ స్థాయిలో ఉండిపోవాల్సి వస్తుంది. ♦ అదే రెండు వేతన సవరణలు చేసి, ఆ బేసిక్ ఆధారంగా ఫిక్స్ చేస్తే జిల్లాఅధికారి స్థాయిలో ఉంటారు. ఇదే తరహా పరిణామాలు డ్రైవర్, కండక్టర్, అసిస్టెంట్ డీఎం, ఇతర స్థాయి ఉద్యోగుల్లో కూడా ఉంటుంది. ఉద్యమానికి కార్యాచరణ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ వేగంగా జరుగుతున్న నేపథ్యంలో, సంబరాలు చేసుకోవాల్సిన కార్మికులు ఆందోళన బాట పట్టడం ప్రస్తుత పరిణామాలకు అద్దం పడుతోంది. పెండింగ్‌లో ఉన్న వేతన సవరణలు చేయటంతోపాటు, ఇతర బకాయిలు చెల్లించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేక్రమంలో ఈనెల 26న ఆర్టీసీ కా ర్మిక సంఘాల జేఏసీ (3 సంఘాల కూటమి) ఇందిరాపార్కు వద్ద ధర్నాకు పిలుపునిచ్చింది. కొద్ది రోజులుగా అన్ని డిపోల్లో నిరసన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. రెండు వేతన సవరణలు చేయకుంటే తీవ్రంగా నష్టపోవటమే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయటం శుభపరిణామం. కానీ, 2017, 2021 విడతల వేతన సవరణలు ముందు చేపట్టాలి. అప్పుడు ఉద్యోగుల స్థూల వేతనం పెరుగుతుంది. ఆ మొత్తం ప్రభుత్వంలో ఏఏ కేడర్లతో సమంగా ఉందో చూసి ఆయా ఉద్యోగులను ఆయా స్థాయిల్లో ఫిక్స్ చేస్తే అప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో మా జీతాలు కనిపిస్తాయి. అప్పుడే విలీన ప్రక్రియకు న్యాయం జరుగుతుంది. లేదంటే, భారీగా నష్టపోవాల్సి ఉంటుంది. అందుకే ముందు రెండు వేతన సవరణలు చేయాలని ముక్తకంఠంతో కోరుతున్నాం. – వీఎస్‌రావు కార్మిక నేత -
ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులే
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. గత నెల ఆరో తేదీన ఈమేరకు ప్రవేశపెట్టిన బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలపగా, అందులో కొన్ని సందేహాలను నివృత్తి చేసుకుని గత గురువారం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దానిపై సంతకం చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆ బిల్లును చట్టరూపంగా ఇప్పుడు అమలులోకి తెస్తూ, సెప్టెంబరు 15వ తేదీతో మంగళవారం గెజిట్ నోటిఫికేషన్‌ను న్యాయ శాఖ కార్యదర్శి జారీ చేశారు. దీంతో 43,373 మంది ఆర్టీసీ ఉద్యోగులు ఇక ప్రభుత్వ ఉద్యోగులుగా మారినట్టయింది. ఇక విలీన విధివిధానాలను ఖరారు చేసేందుకు కమిటీని నియమిస్తూ ప్రభుత్వం త్వరలో ఉత్తర్వు జారీ చేయనుంది. ఆ కమిటీ కూలంకుషంగా పరిశీలించి, ఆర్టీసీ ఉద్యోగులు– ప్రభుత్వంలో ఏయే కేడర్లతో సమంగా ఉండాలి, వారి పే స్కేల్ ఎలా ఉండాలి, రిటైర్మెంట్ వయసు, పింఛన్ విధానం, ప్రస్తుతం ఆర్టీసీలో కొనసాగుతున్న ప్రత్యేక ఆర్థిక బెనిఫిట్స్ ఉండాలా వద్దా.. వంటి చాలా అంశాలపై స్పష్టతనిస్తూ ప్రభుత్వానికి సిఫారసులు అందించనుంది. వాటిని ఏ రోజు నుంచి అమలులోకి తేవాలో ఓ అపాయింటెడ్ డేæను కూడా ఖరారు చేయాల్సి ఉంది. ఈ నెల జీతాలు ఆర్టీసీ నుంచేనా? గెజిట్ నోటిఫికేషన్ జారీ అయిన నేపథ్యంలో.. వచ్చే నెల జీతాలను ప్రభుత్వం చెల్లిస్తుందని ఉద్యోగులు భావిస్తున్నారు. కానీ, ట్రెజరీ వేతనాలు ఎప్పటి నుంచి చెల్లించాలో స్పష్టం చేస్తూ ప్రభుత్వం ఉత్వర్వు జారీ చేయాల్సి ఉన్నందున, అప్పటి వరకు ఆర్టీసీ నుంచే యథావిధిగా జీతాలు చెల్లించాల్సి ఉంటుందని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. వీలైనంత తొందరలో ఉత్తర్వు జారీ అయితే ఆ సందిగ్ధం వీడుతుందంటున్నారు. కాగా ప్రస్తుతం ఆర్టీసీ ఎంత చెల్లిస్తుందో, ప్రభుత్వం కూడా అంతే చెల్లిస్తుందని, విధివిధానాలు ఖరారయ్యాక అసలు జీతాలపై స్పష్టత వస్తుందని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. -
ఇక ఆ భూములు ఎన్హెచ్ఏఐ ఖాతాలోకి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ రీజినల్ రింగురోడ్డు ఉత్తర భాగానికి సంబంధించి అలైన్మెంటులో గుర్తించిన భూమిని తన పరిధిలోకి తీసుకుంటూ జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) 3డీ నోటిఫికేషన్లు జారీ చేసింది. యాదాద్రి–భువనగిరి, ఆందోల్–జోగిపేట, చౌటుప్పల్ అథారిటీ(కాంపిటెంట్ అథారిటీ ఫర్ లాండ్ అక్విజిషన్–కాలా)లకు సంబంధించి ఏప్రిల్‌లో మూడు గెజిట్లు జారీ చేయగా, తాజాగా భువనగిరి, ఆందోల్–జోగిపేటలోని అనుబంధ నోటిఫికేషన్లు, సంగారెడ్డి, గజ్వేల్, తూప్రాన్ కాలాలకు సంబంధించి 3డీ నోటిఫికేషన్లు జారీ చేసింది. అలైన్‌మెంటు ఖరారు చేసిన తర్వాత భూసేకరణ ప్రక్రియ ప్రారంభించేందుకు వీలుగా తొలుత జారీ చేసిన రెండు గెజిట్లలో దాదాపు 500 ఎకరాలకు సంబంధించిన భూముల వివరాలు గల్లంతైన విషయం తెలిసిందే. ఆ విషయాన్ని ఇటీవలే గుర్తించి వాటికి మళ్లీ నోటిఫికేషన్ల ప్రక్రియ ప్రారంభించారు. అలా గల్లంతైన భూములకు సంబంధించి మినహా మిగతా భూమలుకు సంబంధించి తుది గెజిట్ నోటిపికేషన్లు దాదాపు జారీ అయినట్టే. దీంతో ఈ భూములన్నీ ప్రైవేటు వ్యక్తుల ఆధీనం నుంచి ఎన్హెచ్ఏఐ పరిధిలోకి చేరినట్టయింది. భూ యజమానుల అభ్యంతరాలను తోసిపుచ్చిన ఎన్హెచ్ఏఐ: ఈ భూముల సేకరణ ప్రక్రియపై వాటి యజమానుల నుంచి వ్యక్తమైన అన్ని అభ్యంతరాలను ఎన్హెచ్ఏఐ తోసి పుచ్చింది. ఆయా అభ్యంతరాలకు సంబంధించి గ్రామ సభ ల్లో అధికారికంగా వెల్లడించిన సమాధానాలతో ఇక అభ్యంతరాలు రద్దయినట్టుగానే ఎన్హెచ్ఐఏ పరిగణిస్తుంది. ప్రజో పయోగానికి సంబంధించి రూపొందించిన ప్రాజెక్టు నిర్మాణానికి గాను ఈ భూములను సేకరించాలని నిర్ణయించినందున, ఆ ప్రాజెక్టు పనులు మందుకు సాగేందుకు వీలుగా భూములపై ఉన్న ప్రైవేటు యాజమాన్య హక్కులను రద్దు చేస్తున్నట్టుగా ఎన్హెచ్ఏఐ ప్రకటించింది. వెరసి ఆ భూములన్నీ కేంద్రప్రభుత్వ అధీనంలోకి చేరినట్టయింది. గెజిట్‌లో ఇలా: ‘‘కేంద్ర భూసేకరణ చట్టం సెక్షన్ 3డీలోని సబ్ సెక్షన్(1) ప్రకారం.. నిర్ధారిత గ్రీన్‌ఫీల్డ్ హైవే దిగువ తెలి పిన సర్వే నెంబర్లలోని భూమిని కేటాయించాము. దాని కో సం సేకరించనున్నాము’’ ‘‘కేంద్ర భూసేకరణ చట్టం సెక్షన్ 3డీ సబ్‌సెక్షన్(2) నోటిఫికేషన్ విడుదలైన వెంటనే.. నిర్ధారి త భూమి పూర్తిగా కేంద్రప్రభుత్వ అధీనంలోకి వచ్చినట్టుగా పరిగణించాలి. ’’ అని గెజిట్ నోటిఫికేషన్లో ప్రచురించింది. 158.62 కి.మీ.గాను 2 వేల హెక్టార్ల భూమి సేకరణ రీజినల్ రింగ్‌రోడ్డు ఉత్తరభాగంలో 158.62 కి.మీ. నిడివికి గాను దాదాపు 2 వేల హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉంది. ఇందుకు రూ.5170 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. ఈ మొత్తంలో సగ భాగం.. అంటే రూ.2585 కోట్లు భూసేకరణకు, రూ.363.43 కోట్లు స్తంభాలు లాంటి వాటిని తరలించేందుకు అయ్యే వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంది. నిధులు ముందే జమ కట్టే విషయంలో కేంద్ర–రాష్ట్రప్రభుత్వాల మధ్య అప్పట్లో అభిప్రాయభేదాలు తలెత్తాయి. ఆ తర్వాత రాజీ కుదిరి రూ.100 కోట్ల మొత్తాన్ని జమ చేయటంతో 3 డీ నోటిషికేషన్ జారీకి మార్గం సుగమమైంది. 3ఏ గెజిట్ నోటిఫికేషన్ విడుదలైన ఏడాదిలోపు 3డీ గెజిట్ నోటిఫికేషన్ జారీ కావాల్సి ఉంది. ఈ నెలతో ఏడాది పూర్తి అవుతున్నందున 3డీ గెజిట్ నోటిఫికేషన్లను ఎన్హెచ్ఏఐ జారీ చేయటం విశేషం. పూర్తి వివరాలతో నోటిఫికేషన్ రీజినల్ రింగురోడ్డు నిర్మించే అలైన్మెంట్ పరిధిలోకి వచ్చే భూములను గుర్తించి గతంలోనే సర్వే చేసిన అధికారులు.. తాజా గెజిట్ నోటిఫికేషన్లో ఊరు, సర్వే నెంబరు, భూమి విస్తీర్ణం, పట్టాదారు పేరు.. ఇలా పూర్తి వివరాలను గెజిట్ నోటిఫికేషన్లో ప్రచురించారు. -
అంబేద్కర్ జయంతి.. గెజిటెడ్ హాలీడే
ప్రతీ ఏడాది ఏప్రిల్ 14న డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా.. దేశవ్యాప్తంగా వేడుకలు, రకరకాల కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. భారత రాజ్యాంగ రూపకర్తకు గౌరవసూచీకగా, ప్రజాస్వామ్య దేశమైన భారత్ ఈ తేదీన అంబేద్కర్‌కు ఘనంగా నివాళులు అర్పిస్తుంటుంది కూడా. అయితే.. అంబేద్కర్ జయంతి అనేది పబ్లిక్ హాలీడే అవునా? కాదా? అనే చర్చ తరచూ తెర మీదకు వస్తుంటుంది. అందుకు కారణం.. అంబేద్కర్ జయంతిని చాలాకాలం పాటు జాతీయ సెలవు దినంగా కేంద్రం గుర్తించకపోవడం. రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే, గాంధీ జయంతి.. ఇలా ప్రత్యేక రోజుల్లాగా కాకుండా అంబేద్కర్ జయంతిని పరిమితుల మధ్య జరుపుకుంటోంది దేశం. కొన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత రాష్ట్రాల్లో కొన్ని మాత్రమే పబ్లిక్ హాలీడేగా ఆచరిస్తున్నాయి. అయితే.. 2020 కరోనా టైంలోనే కేంద్రం అంబేద్కర్ జయంతిని గెజిటెడ్ నోటిఫికేషన్ ద్వారా జాతీయ సెలవు దినంగా ప్రకటించింది. ఆ తర్వాత సంవత్సరాల్లో మిగతా సెలవుల్లో అంబేద్కర్ జయంతి కలిసిపోతూ వచ్చింది. ఇదిలా ఉంటే.. తాజాగా కేంద్రం అంబేద్కర్ జయంతిని గెజిటెడ్ పబ్లిక్ హాలీడేగా ప్రకటించింది. 1881 నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ సెక్షన్ 25 ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 14, 2023ను క్లోజ్డ్ హాలీడేగా ప్రకటిస్తూ ఓ గెజిట్ నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. మరోవైపు ఈ నోటిఫికేషన్‌తో సంబంధం లేకుండానే సుప్రీం కోర్టు సెలవు ప్రకటించుకోవడం గమనార్హం. సీజేఐ డీవై చంద్రచూడ్ ఆదేశాలనుసారం దేశ సర్వోన్నత న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు అదే రోజున సిక్కులకు పెద్ద పండుగ వైశాఖి (బైశాఖి) ఉంది. కొన్నిరాష్ట్రాల ప్రభుత్వాలకు ఈ పండుగకు సెలవు ప్రకటించడంతో.. విద్యా సంస్థలు, వ్యాపారాలు స్వచ్ఛందంగా మూతపడనున్నాయి. -
రాష్ట్రంలో ఉపాధి కూలీల వేతనం రూ.15 పెంపు
సాక్షి, అమరావతి: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేసే కూలీలకు కేంద్ర ప్రభుత్వం వేతనాలను పెంచింది. రాష్ట్రంలో ప్రస్తుతం గరిష్టంగా రూ.257 చొప్పున వేతనం చెల్లిస్తుండగా, దానిని ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి రూ.272కు పెంచుతూ కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రంలో రోజువారీ గరిష్ట వేతనాన్ని రూ.15 పెంచింది. ఉపాధి హామీ పథకం కింద వేతనాలను ఈ పథకం ప్రారంభించిన నాటి నుంచే రాష్ట్రాల వారీగా వేర్వేరుగా నిర్ణయిస్తోంది. ప్రతి సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆర్థిక సంవత్సరం ప్రారంభం సందర్భంగా వేతన రేట్లను నిర్ణయిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. ఆయా రాష్ట్రాల్లో వ్యవసాయ రంగంలోని కూలీల కొనుగోలుశక్తి (కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్) ఆధారంగా వేతనాలను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు నిర్ణయిస్తారు. -
పోలీసు ఉద్యోగార్థులకు వయో పరిమితి పెంపుపై గెజిట్ నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు వయో పరిమితిని రెండేళ్ల పాటు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఉద్యోగార్థుల విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం ఈ మేరకు అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో కానిస్టేబుల్ ఉద్యోగాలకు జనరల్ కేటగిరిలో 18 నుంచి 26 ఏళ్ల వరకు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాల వారైతే 18 నుంచి 31 ఏళ్ల వయస్సు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్ఐ ఉద్యోగాలకు జనరల్ కేటగిరిలో 21 నుంచి 29 ఏళ్ల వరకు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాల వారైతే 21 నుంచి 34 ఏళ్ల వయస్సు వారు దరఖాస్తు చేసుకోవచ్చు. 6,100 కానిస్టేబుల్, 411 ఎస్ఐ పోస్టుల భర్తీ కోసం పోలీసు శాఖ అక్టోబర్ 20న నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టులకు తాజాగా వయో పరిమితి రెండేళ్లు పెంచుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి శనివారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడం వల్ల మరింత మందికి దరఖాస్తు చేసుకునే అవకాశం కలుగుతుంది. -
పదేళ్లకోసారి ‘ఆధార్’ అప్డేట్ చేయాల్సిందే
న్యూఢిల్లీ: ఆధార్ నియమ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. ఆధార్ నంబర్ కలిగి ఉన్నవారు ఎన్రోల్మెంట్ తేదీ నుంచి పదేళ్లు పూర్తయ్యాక గుర్తింపు, చిరునామా ధ్రువీకరణ వంటి పత్రాలను (సపోర్టింగ్ డాక్యుమెంట్స్) కనీసం ఒక్కసారైనా అప్డేట్ చేసుకోవాలని వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీనివల్ల సీఐడీఆర్ డేటాబేస్‌లో ఆధార్‌కు సంబంధించిన సమాచారంలో కచ్చితత్వాన్ని కొనసాగింవచ్చని తెలియజేసింది. ఎన్రోల్మెంట్ జరిగాక ప్రతి పదేళ్లకోసారి సపోర్టింగ్ డాక్యుమెంట్లు ఆప్డేట్ చేసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని వివరించింది. పదేళ్ల కంటే ఎక్కువ రోజుల క్రితం ఆధార్ కార్డు పొంది, ఇప్పటిదాకా ఒక్కసారి కూడా గుర్తింపు, నివాస ధ్రువీకరణ పత్రాలను అప్డేట్ చేసుకోనివారు వెంటనే ఆ పూర్తి చేయాలని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) గత నెలలో విజ్ఞప్తి చేసింది. మై ఆధార్ పోర్టల్, మై ఆధార్ యాప్ ద్వారా లేదా ఆధార్ ఎన్రోల్మెంట్ కేంద్రాల్లో డాక్కుమెంట్లు సమర్పించి, వివరాలు ఆప్డేట్ చేసుకోవచ్చని సూచించింది. దేశంలో ఇప్పటిదాకా 134 కోట్ల మందికి ఆధార్ సంఖ్యలను జారీ చేశారు. గుర్తింపు కార్డులు, చిరునామా మారినవారు కూడా సంబంధిత ధ్రువపత్రాలను సమర్పించి, ఆధార్ కార్డుల్లో వివరాలు మార్చుకోవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే ఆధార్ నంబర్ కలిగి ఉండడం తప్పనిసరిగా మారింది. -
ఆ భూముల్ని 22ఏ నుంచి తొలగించవచ్చు
సాక్షి, అమరావతి: షరతులు గల పట్టా భూములను నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించవచ్చని కలెక్టర్లకు స్పష్టం చేస్తూ కొన్ని మార్గదర్శకాలతో ప్రభుత్వం బుధవారం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. భూమి స్వభావం ప్రభుత్వ మెట్ట/మాగాణి/సాగు లభ్యత ఉన్న మెట్ట భూమి అయి ఉండి, రీసర్వే రిజిస్టర్ (ఆర్ఎస్ఆర్)లో షరతుల గల పట్టా అని కొన్ని ప్రత్యేక సూచికలతో ఉన్న భూములను వీటి కింద పరిగణించాలని నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. ఆర్ఎస్ఆర్లోని పట్టాదారు కాలమ్‌లో పట్టాదారుడి పేరు అదే సర్వే నంబరులో ఉన్నట్లు రికార్డుల్లో ఉండాలని సూచించింది. అలాగే ఈ పట్టాలన్నీ 1954 జూన్ 18 లోపు ఇచ్చి ఉండాలని పేర్కొంది. ఈ మూడు అంశాలకు లోబడి రాష్ట్రంలో అన్నిజిల్లాల్లో షరతులు గల పట్టాలను 1908 రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22ఏ నుంచి తొలగించవచ్చని సూచించింది. కృష్ణా జిల్లాలో ఈ తరహా భూములు వేలాదిగా ఉన్నాయని, వాటిని 22ఏ నుంచి తొలగించేందుకు మార్గదర్శకాలు ఇవ్వాలని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇటీవల ప్రభుత్వాన్ని కోరారు. బ్రిటిష్ పాలనలో 1932–34ల్లో కొన్ని షరతులతో ఈ భూములను రైతులకు పంపిణీ చేసినట్లు ఆయన ప్రభుత్వానికి నివేదించారు. రెవెన్యూ కార్యాలయాల రికార్డుల్లో మాత్రం ఈ వివరాలేవీ లేవని పేర్కొన్నారు. రైతులు మాత్రం పూర్వం నుంచి ఈ భూములను సాగు చేసుకుంటూ.. 2016 వరకు వాటి క్రయవిక్రయాలు కూడా నిర్వహించుకున్నారు. ఆ తర్వాత నుంచి ఆ భూములను నిషేధిత భూముల జాబితాలో చేర్చారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ విషయాన్ని పరిశీలించినప్పుడు షరతులు గల పట్టా పేరుతో 18,285 ఎకరాలు రికార్డుల్లో ఉన్నట్లు గుర్తించింది. కృష్ణా జిల్లాలో ఒక్క అవనిగడ్డ నియోజకవర్గంలోనే 15 వేల ఎకరాలకుపైగా ఉన్నట్లు తేల్చారు. మరికొన్ని జిల్లాల్లోనూ షరతుల గల పట్టా భూములు ఉన్నాయని, వాటి విషయంలోనూ స్పష్టత ఇవ్వాలని జేసీలతో నిర్వహించిన సమావేశంలో వారు కోరారు. లోతుగా అధ్యయనం చేశాక వేలాది మంది రైతులకు మేలు చేసే అవకాశం ఉండడంతో ప్రభుత్వం ఈ భూములను నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించేందుకు మార్గదర్శకాలు ఇచ్చింది. -
డీలిమిటేషన్లో మార్పులు చేయలేం
సాక్షి, న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ఆర్డర్ గెజిట్ నోటిఫికేషన్‌ను సవాల్ చేయడం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం, జమ్మూకశ్మీర్(యూటీ) స్పష్టం చేశాయి. ఈ పునర్విభజనకు సంబంధించి కమిషన్ ఏర్పాటు, దాని పరిధి, పదవీకాలం, అధికారాలపై ప్రభుత్వం గెజిట్ విడుదల చేసిన నేపథ్యంలో దీనిపైæ వ్యాఖ్యలు చేయదలచుకోలేదని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను సవాల్ చేస్తూ హజీ అబ్దుల్ గనీ ఖాన్, మహమూద్ మట్టూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు కేంద్రం, జమ్మూకశ్మీర్(యూటీ), ఎన్నికల సంఘం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశాయి. పునర్విభజనపై ఏర్పాటైన కమిషన్ గెజిట్‌లో ప్రచురణ అయిన తర్వాత డీలిమిటేషన్ చట్టం–2002లోని సెక్షన్ 10(2) ప్రకారం సవాల్ చేయడం సాధ్యం కాదని కేంద్రం పేర్కొంది. మేఘరాజ్ కొఠారీ వర్సెస్ డీలిమిటేషన్ కమిషన్ కేసులో ఈ సెక్షన్‌ను ఇప్పటికే కోర్టు సమర్థించిందని గుర్తుచేసింది. పిటిషన్లను అనుమతిస్తే గెజిట్ నిష్ఫలం అవుతుందని, ఇది ఆర్టికల్ 329ని ఉల్లంఘించడమేనని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అసెంబ్లీ సీట్లు పెంపునకు సంబంధించి ఏపీ విభజన చట్టాన్ని అమలు చేయాలని కోరుతూ పురుషోత్తంరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను ఇదే కేసుతో సుప్రీంకోర్టు గతంలో జత చేసింది. -
ప్లాస్టిక్ ఫ్లెక్సీలు, బ్యానర్లపై నిషేధం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నవంబర్ 1వ తేదీ నుంచి ప్లాస్టిక్ ఫ్లెక్సీలు, బ్యానర్లను నిషేధిస్తూ ప్రభుత్వం గురువారం గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. ఈ నిషేధం అమలు, ఉల్లంఘనలు, వాటిపై చర్యలు, ప్రత్యామ్నాయాలు తదితరాలకు సంబంధించిన మార్గదర్శకాలను నోటిఫికేషన్లో వివరించారు. ప్లాస్టిక్ ఫ్లెక్సీల ఉత్పత్తి, దిగుమతులతోపాటు వినియోగం, ముద్రణ, రవాణా, ప్రదర్శనలకు నిషేధం వర్తిస్తుంది. నిషేధం అమలును పట్టణాలు, నగరాల్లో కాలుష్య నియంత్రణ అధికారులు, మునిసిపల్ కమిషనర్లు, శానిటేషన్ సిబ్బంది పర్యవేక్షిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో పర్యవేక్షణ బాధ్యతను కలెక్టర్లు, జెడ్పీ సీఈవోలు, పంచాయతీలు, గ్రామ సచివాలయాల సిబ్బందికి అప్పగించారు. ప్లాస్టిక్ ఫ్లెక్సీలు, బ్యానర్లకు బదులుగా కాటన్, నేత వ్రస్తాలను వినియోగించాలని ప్రభుత్వం సూచించింది. ఉల్లంఘిస్తే జరిమానా నిబంధనలు ఉల్లంఘిస్తే ఫ్లెక్సీ చదరపు అడుగుకు రూ.100 జరిమానా విధిస్తారు. ఉల్లంఘనులపై పర్యావరణ చట్టం–1986 ప్రకారం చర్యలు తీసుకుంటారు. సీజ్చేసిన బ్యానర్లను శాస్త్రీయంగా డిస్పోజ్ చేయడానికి అవసరమైన ఖర్చును నిబంధనలు ఉల్లంఘించిన వారినుంచి వసూలుచేస్తారు. పోలీస్, రెవెన్యూ, ట్రాన్స్పోర్ట్, జీఎస్టీ అధికారులు ప్లాస్టిక్ ఫెక్సీల నిషేధాన్ని పర్యవేక్షించే అధికారులకు సహాయపడతారు. -
RRR: రీజినల్ రింగ్‌రోడ్డు విషయంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగ్‌రోడ్డు ఉత్తర భాగం భూసేకరణకు సంబంధించి కీలకమైన నాలుగు 3ఏ (క్యాపిటల్ ఏ) గెజిట్ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఏప్రిల్ నెలలోనే భూసేకరణకు కాంపిటెంట్ అథారిటీగా ఉన్న యాదాద్రి–భువనగిరి అదనపు కలెక్టర్ పరిధి, ఆందోల్–జోగిపేట ఆర్డీవో, చౌటుప్పల్ ఆర్డీవో పరిధిలోని గ్రామాలకు సంబంధించి నోటిఫికేషన్లు విడుదలవగా.. ఇప్పుడు సంగారెడ్డి, భువనగిరి, గజ్వేల్, నర్సాపూర్ ఆర్డీవోల పరిధిలో భూసేకరణకు వీలుగా గెజిట్ నోటిఫికేషన్లను కేంద్ర జాతీయ రహదారుల శాఖ జారీ చేసింది. ఒక్క తూప్రాన్ ఆర్డీవో పరిధిలో భూసేకరణకు నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉంది. అభ్యంతరాలకు 21 రోజులు గడువు సంగారెడ్డి, భువనగిరి, గజ్వేల్, నర్సాపూర్ ఆర్డీవోల పరిధిలో భూసేకరణ గెజిట్ ప్రచురితమైన రోజు నుంచి 21 రోజులలోపు అభ్యంతరాలు వ్యక్తం చేసేందుకు అవకాశం కల్పించారు. ఆయా ప్రాంతాల వారు రోడ్డు నిర్మాణం వల్ల నష్టాలు, చేయాల్సిన మార్పుచేర్పులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, గ్రామాల వారీగా భూసేకరణపై అభ్యంతరాలు, సూచనలను కాంపిటెంట్ అథారిటీకి అందించవచ్చు. అధికారులు వాటిని పరిశీలించాక.. సభ నిర్వహించి ఆయా అభ్యంతరాలపై సమాధానాన్ని వెల్లడిస్తారు. జాతీయ రహదారుల చట్టం 1956 (48) సెక్షన్ 3సిలోని సబ్ సెక్షన్ 1 ప్రకారం.. అభ్యంతరాలపై కాంపిటెంట్ అథారిటీ ఇచ్చిన ఆదేశమే తుది నిర్ణయం అవుతుందని గెజిట్‌లో పేర్కొన్నారు. హద్దుల గుర్తింపునకు త్వరలో సర్వే.. రీజినల్ రింగ్‌రోడ్డు అలైన్మెంటుకు సంబంధించి ఇప్పటికే మార్కింగ్ చేశారు. గెజిట్లు విడుదలైన నేపథ్యంలో రోడ్డు వెడల్పు 100 మీటర్లు కచ్చితంగా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందనేది గుర్తించి హద్దు రాళ్లు పాతనున్నారు. డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం పరికరాలతో వీటిని ఏర్పాటు చేస్తారు. అభ్యంతరాలపై సమాధానం వెల్లడించిన తర్వాత ఈ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. కాగా ఏయే సర్వే నంబర్లలో ఎంత భూమి సేకరించనున్నారు, దాని యజమాని ఎవరనే వివరాలతో త్వరలో 3డి గెజిట్ నోటిఫకేషన్‌ను విడుదల చేయనున్నారు. ఏయే గ్రామాలు.. ఎంత భూమి? - సంగారెడ్డి ఆర్డీవో పరిధిలోని.. దేవల్ పల్లె, దౌల్తాబాద్–కొత్తపేట, కాసాల, సికిందర్‌పూర్, గిర్మాపూర్, మల్కాపూర్, పెద్దాపూర్, చింతల్‌పల్లి, ఇరిగిపల్లె, కలబ్గూర్, కులబ్గూర్, నాగపూర్, సంగారెడ్డి, తాడ్లపల్లె గ్రామాలకు సంబంధించి 195.129 హెక్టార్లు. - భువనగిరి ఆర్డీవో పరిధిలోని.. రాయగిరి, గౌస్‌నగర్, కేసారం, పెంచికల్ పహాడ్, తుక్కాపూర్ గ్రామాలకు సంబంధించి 199.103 హెక్టార్లు. - గజ్వేల్ ఆర్డీవో పరిధిలోని.. బంగ్లా వెంకటాపూర్, మఖత్ మాసాన్‌పల్లె, మట్రా జ్‌పల్లె, ప్రజ్ఞాపూర్, సంగాపూర్, అల్రాజ్ పేట, ఇటిక్యాల, పీర్లపల్లె, అంగడి కిష్టాపూర్, చేబర్తి, ఎర్రవల్లి, పాముల పర్తి, బేగంపేట, ఎల్కల్, జబ్బాపూర్, మైలారం మక్త, నెమ్టూరు గ్రామాలకు సంబంధించి 389.96 హెక్టార్లు. - నర్సాపూర్ ఆర్డీవో పరిధిలోని.. చిన్న చింతకుంట, కాజీపేట, మహమ్మదాబాద్– జానకంపేట, మూసాపేట, నాగులపల్లె, పెద్ద చింతకుంట, రెడ్డిపల్లి, తిర్మలాపూర్, తుజల్పూర్, గుండ్లపల్లి, కొంతాన్‌పల్లె, కొత్తపేట, లింగోజిగూడ, పాంబండ, పోతుల బోగూడ, రత్నాపూర్, ఉసిరక పల్లె గ్రామాలకు సంబంధించి 303.79 హెక్టార్లు. ఇది కూడా క్లిక్ చేయండి: వెరైటీ కప్పుల గణపయ్య -
శ్రీశైలం, సాగర్‌కు డబ్బులివ్వండి
సాక్షి, అమరావతి: ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌కు మరమ్మతులు, ఆధునికీకరణ పనులను చేపట్టేందుకు రూ.1,123.41 కోట్లు అవసరమని కృష్ణా బోర్డు అంచనా వేసింది. ఇక ఈ రెండు ప్రాజెక్టుల స్పిల్ వేలు, విద్యుత్కేంద్రాలు, ఎత్తిపోతల పథకాల నిర్వహణకు ఏటా మరో రూ.819.62 కోట్లు అవసరమని తేల్చింది. ఈ నేపథ్యంలో కేంద్ర జల్ శక్తి శాఖ గతేడాది జూలై 15న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం ఏపీ, తెలంగాణ చెరో రూ.200 కోట్లు చొప్పున సీడ్ మనీగా బోర్డు ఖాతాలో జమ చేయాలని కోరింది. ఈ మేరకు కేంద్ర జల్ శక్తి శాఖతో పాటు తెలుగు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు ఛైర్మన్ ఎంపీ సింగ్ లేఖ రాశారు. అందులో ప్రధానాంశాలు ఇవీ.. ► శ్రీశైలం ప్రాజెక్టులో ప్రస్తుతం చేపట్టిన పనులను పూర్తి చేసేందుకు రూ.73.66 కోట్లు అవసరం కాగా నాగార్జునసాగర్‌లో పనులను పూర్తి చేసేందుకు రూ.207.25 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ రెండు ప్రాజెక్టుల్లో పనులను పూర్తి చేసేందుకు రూ.280.91 కోట్లు అవసరమవుతాయి. ► శ్రీశైలం ప్రాజెక్టు స్పిల్ వే ఫ్లంజ్ ఫూల్ దెబ్బతింది. స్పిల్ వే మరమ్మతులు, ఆధునికీకరణకు రూ.810.89 కోట్లు అవసరం. సాగర్ స్పిల్‌వే ఆధునికీకరణకు రూ.31.61 కోట్లు అవసరం. ► ప్రస్తుతం చేపట్టిన పనులతో పాటు మరమ్మతులు, ఆధునికీకరణ పనులను పూర్తి చేసేందుకు మూడు నాలుగేళ్ల సమయం పడుతుంది. ఇందుకు రూ.1,123.41 కోట్లు వ్యయం కానుంది. ► ఏటా శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణకు రూ.38.39 కోట్లు, రెండు విద్యుత్ కేంద్రాల నిర్వహణకు రూ.4.13 కోట్లు, శ్రీశైలంపై ఆధారపడిన ఎత్తిపోతల పథకాలు(హంద్రీ–నీవాలో భాగమైన మల్యాల, ముచ్చుమర్రి.. కల్వకుర్తి) నిర్వహణకు రూ.372.89 కోట్లు అవసరం. శ్రీశైలం నిర్వహణకు ఏటా రూ.415.41 కోట్లు అవసరం. ► నాగార్జునసాగర్ స్పిల్ వేకు రూ.17.45 కోట్లు, విద్యుత్కేంద్రాలకు రూ.14.70, ఎత్తిపోతల పథకాలకు రూ.372.06 కోట్లు వెరసి నిర్వహణకు రూ.404.21 కోట్లు కావాలి. ► ఉమ్మడి ప్రాజెక్టులను ఏటా నిర్వహించడం, చేపట్టిన పనులను పూర్తి చేయడం, మరమ్మతులు, ఆధునికీకరణకు రూ.1,943.03 కోట్లు అవ సరం. ► సీడ్ మనీని తగ్గించాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన ప్రతిపాదనను తిరస్కరిస్తున్నాం. గెజిట్ నోటిఫికేషన్ మేరకు ఒక్కో రాష్ట్రం ఒకేసారి రూ.200 కోట్లు చొప్పున బోర్డు ఖాతాలో జమ చేయాలి. వ్యయాన్ని నీటి వాటాలు, విద్యుత్ వాటాల దామాషా పద్ధతిలో రెండు రాష్ట్రాలు భరించాలి. -
వందేళ్లకు సరిపడా వరాలు.. థాంక్యూ జగనన్న..
-
సరికొత్త శకానికి సీఎం జగన్ ప్రభుత్వం శ్రీకారం
-
ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల
-
ఔషధాల ధరల పెంపు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో వివిధ రకాల ఔషధాల ధరలను కేంద్రం పెంచింది. ఈ మేరకు 872 రకాల మందుల ధరలను సవరిస్తూ గురువారం గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. దీంతో కోట్లాది మందిపై భారం పడనుంది. గతంలో ఈ మందులన్నీ నిర్ణయించిన ధరకే అమ్మాలని (ప్రైస్ సీలింగ్) ఎన్పీపీఏ (నేషనల్ ఫార్మ ప్రైజింగ్ అథారిటీ) నిర్ణయించింది. తాజాగా.. ఎన్పీపీఏ ఈ 872 రకాల మందులకు 10 శాతం మేర రేట్లు పెంచుకోవచ్చని అనుమతిచ్చింది. పెంచిన ధరలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. వీటి ధరలు పెరగనున్నాయి.. ఇక తాజాగా రేట్లు పెంచిన ఔషధాల్లో నిత్యం కోట్లాది మంది వాడే పారాసిటమాల్ (జ్వరం), మెట్ఫార్మిన్ (షుగర్) ఇన్సులిన్ (షుగర్)కు వాడేవి ఉన్నాయి. ధరల పెంపుదలవల్ల కోట్లాది మంది నెలసరి ఖర్చు పెరగనుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాక.. ఖరీదైన యాంటిబయోటిక్స్ మందులపైనా భారం పడనుంది. ముడిసరుకు పెరిగిందని.. కరోనా మహమ్మారి దెబ్బకు మందుల్లో వాడే ముడిసరుకు ధరలు అమాంతం పెరిగాయని, దీనివల్ల రేట్లు పెంచక తప్పలేదని ఎన్పీపీఏ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఎన్పీపీఏ పరిధిలోని 872 మందుల ధరలు పెంచామని, అంతకంటే ఎక్కువ వసూలు చేసినట్లయితే అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం గెజిట్‌లో హెచ్చరించింది. మరోవైపు.. ఏపీలోని ప్రభుత్వాసుపత్రుల్లో ఏటా 10 కోట్ల పారాసిటమాల్ మాత్రలు వినియోగమవుతున్నాయి. ఇవన్నీ ప్రభుత్వమే కొనుగోలు చేసి ప్రభుత్వాసుపత్రులకు సరఫరా చేస్తోంది. పారాసిటమాల్ ధరలు పెరగడంతో ప్రభుత్వంపైనా భారం పడనుంది. -
ఆర్ఆర్ఆర్ తొలి గెజిట్‌కు గ్రీన్‌సిగ్నల్.. 113 గ్రామాలు.. 1904 హెక్టార్లు
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) ఉత్తర భాగానికి సంబంధించి తొలి నోటిఫికేషన్ (3ఎ) మరో 2 రోజుల్లో విడుదల కానుంది. గెజిట్ నోటిఫికేషన్‌పై కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆమోదముద్ర వేస్తూ సంతకం చేశారు. దానికి భూసేకరణ నోటిఫికేషన్ జత చేసి విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సోమ–మంగళవారాల్లో గెజిట్ విడుదల కానుందని సమాచారం. ఈ ఉత్తర భాగానికి సంబంధించి కావాల్సిన మొత్తం భూమి, రోడ్డు నిర్మాణం జరిగే భూమి ఉన్న గ్రామా లు ఇతర వివరాలను అందులో పొందుపర్చారు. ఉత్తరభాగానికి సంబంధించిన తుది అలైన్‌మెంటు మ్యాపును కూడా జత చేశారు. నాలుగు జిల్లాల పరిధిలోని 15 మండలాలకు సంబంధించి 113 గ్రామాల మీదుగా రోడ్డు నిర్మాణం జరగనుంది. ఇందుకు మొత్తం 1,904 హెక్టార్ల భూమి అవసరమని గెజిట్‌లో పొందుపరిచినట్లు తెలిసింది. కావాల్సిన భూమి 1,904 హెక్టార్లు.. ఆర్ఆర్ఆర్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం 158.645 కి.మీ. నిడివితో నిర్మితమయ్యే ఉత్తర భాగానికి మాత్రమే ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దక్షిణ భాగానికి సంబంధించి ప్రతిపాదిత ప్రాంతాల మీదుగా వాహనాల ప్రయాణం తక్కువగా ఉన్నందున, అక్కడ ఎక్స్‌ప్రెస్‌వే తరహా రోడ్డు నిర్మాణం అవసరం ఉందా అనే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోంది. ఆమోదముద్ర వేసిన ఉత్తరభాగం రోడ్డుకు.. భవిష్యత్తులో 8 వరసలకు విస్తరించేలా 100 మీటర్ల వెడల్పుతో భూసేకరణ చేసి, ప్రస్తుతానికి నాలుగు వరసలతోనే నిర్మించనున్నారు. 100 మీటర్ల వెడల్పుతో ప్రతిపాదిత అలైన్మెంటుకు 1,904 హెక్టార్ల భూమి అవసరమవుతుందని గెజిట్‌లో ప్రతిపాదించినట్టు తెలిసింది. సంగారెడ్డి టు చౌటుప్పల్.. ఈ ఉత్తర భాగం రోడ్డు సంగారెడ్డి పట్టణం వద్ద ప్రారంభమై చౌటుప్పల్ వద్ద ముగుస్తుంది. ఈ రోడ్డు నిర్మాణానికి కావాల్సిన 1,904 హెక్టార్ల భూమిని ఆయా గ్రామాల వారి నుంచి సేకరించనున్నారు. ఇందుకుగాను ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం 8 మంది అధికారులతో కూడిన కాంపిటెంట్ అథారిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో యాదాద్రి–భువనగిరి జిల్లాకు చెందిన ఒక అదనపు కలెక్టర్‌తో పాటు చౌటుప్పల్, భువనగిరి, గజ్వేల్, సంగారెడ్డి, నర్సాపూర్, తూప్రాన్, జోగిపేట ఆర్టీఓలు ఉన్నారు. 4 జిల్లాలు..15 మండలాలు రీజినల్ రింగురోడ్డు ఉత్తర భాగం సంగారెడ్డి, యాదాద్రి, మెదక్, సిద్దిపేట జిల్లాల పరిధిలో నిర్మితం కానుంది. ఈ నాలుగు జిల్లాల పరిధిలోని 15 మండలాలను అనుసంధానిస్తూ రూపుదిద్దుకుంటుంది. సంగారెడ్డి జిల్లా పరిధిలోని సంగారెడ్డి, చౌటకూరు, హత్నూరు మండలాలు, మెదక్ జిల్లా పరిధిలోని నర్సాపూర్, శివంపేట, తూప్రాన్ మండలాలు, సిద్దిపేట జిల్లా పరిధిలోని గజ్వేల్, వర్గల్, మర్కూక్, జగదేవ్‌పూర్ మండలాలు, యాదాద్రి జిల్లా పరిధిలోని తుర్కపల్లి, యాదాద్రి, భువనగిరి, వలిగొండ, చౌటుప్పల్ మండలాలు దీని పరిధిలోకి వస్తాయి. ఆర్డీఓ పరిధిని యూనిట్‌గా చేసుకుని గ్రామాల వివరాలను గెజిట్‌లో పొందుపరిచారు. 113 గ్రామాల పేర్లను ఇందులో వెల్లడించారు. చౌటుప్పల్ ఆర్డీఓ పరిధిలోని గ్రామాలు చిన్న కొండూరు, వర్కట్‌పల్లి, గోకారం, పొద్దుటూరు, వలిగొండ, సంగెం, చౌటుప్పల్, లింగోజీగూడెం, పంతంగి, పహిల్వాన్పూర్, కంచెనపల్లి, టేకులసోమారం, రెడ్లరేపాక, నేలపట్ల, తాళ్లసింగారం, స్వాములవారి లింగోటం, తంగేడుపల్లి. భువనగిరి ఆర్డీఓ పరిధిలో.. ►రాయగిరి, భువనగిరి, కేసారం, పెంచికల్‌పహాడ్, తుక్కాపూర్, చందుపట్ల, గౌస్‌నగర్, ఎర్రంబల్లె, నందనం. యాదాద్రి–భువనగిరి అదనపు కలెక్టర్ పరిధిలో.. ►గంధమల్ల, వీరారెడ్డిపల్లె, కోనాపూర్, ఇబ్రహీంపూర్, దత్తాయపల్లె, వెలుపుపల్లె, మల్లాపూర్, దత్తార్‌పల్లె. గజ్వేల్ ఆర్డీఓ పరిధిలో.. ►బేగంపేట, యెల్కల్, బంగ్ల వెంకటాపూర్, మఖత్ మాసాన్‌పల్లె, కోమటిబండ, గజ్వేల్, సంగాపూర్, ముట్రాజ్‌పల్లె, ప్రజ్ఞాపూర్, శ్రీగిరిపల్లె, పాములపర్తి, మజీద్‌పల్లె, నెమ్టూరు, జబ్బాపూర్, మైలార్ మక్తా, కొండాయ్పల్లె, మర్కూకు, పాములపర్తి, అంగడి కిష్టాపూర్, చేబర్తి, ఎర్రవల్లి, అల్రాజ్పేట, ఇటిక్యాల, పీర్లపల్లి. తూప్రాన్ ఆర్డీఓ పరిధిలోని గ్రామాలు: ►వట్టూరు, జండాపల్లె, నాగులపల్లె, ఇస్లాంపూర్, దాతర్పల్లి, గుండారెడ్డిపల్లె, మల్కాపూర్, వెంకటాయపల్లె, కిష్టాపూర్, తూప్రాన్, నర్సంపల్లె. నర్సాపూర్ ఆర్డీఓ పరిధిలో.. ►వెంకటాపూర్, లింగోజీగూడ, పాంబండ, పోతులబోగూడ, కొంతాన్‌పల్లె, గుండ్లపల్లె, ఉసిరికపల్లె, రత్నాపూర్, కొత్తపేట, నాగులపల్లి, మూసాపేట్, మహ్మదాబాద్ జానకంపేట, రెడ్డిపల్లి, ఖాజీపేట, తిర్మల్పూర్, గొల్లపల్లి, అచ్చంపేట, చిన్నచింతకుంట, పెద్ద చింతకుంట, సీతారామ్‌పూర్, రుస్తుంపేట, మంతూరు, మాల్పర్తి, తుజల్పూర్. సంగారెడ్డి ఆర్డీఓ పరిధిలో.. ►పెద్దాపూర్, గిర్మాపూర్, మల్కాపూర్, సంగారెడ్డి, నాగాపూర్, ఇర్గిపల్లె, చింతల్పల్లె, కలబ్గూర్, తాళ్లపల్లి, కులబ్గూర్, కాసాల, దేవులపల్లె, హట్నూరు, దౌల్తాబాద్ (కొత్తపేట), సికిందర్‌పూర్. జోగిపేట ఆర్డీఓ పరిధిలో.. ►శివంపేట, వెండికోల్, అంగడి కిష్టాపూర్, లింగంపల్లి, కోర్పోల్. -
స్నేహశీలీ.. సెలవిక!
సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి చిన్ననాటి నుంచే గౌతమ్‌రెడ్డి నాకు బాగా పరిచయం. నా రాజకీయ ప్రయాణంలో తోడుగా నిలిచారు. రాష్ట్రంలో పారిశ్రామిక రంగం, వాణిజ్యం, ఐటీ అభివృద్ధికి విశేష కృషి చేశారు. ఒక స్నేహితుడినే కాకుండా సమర్థుడైన మంత్రి, విద్యాధికుడ్ని కోల్పోయాను. ఆయన మరణం వ్యక్తిగతంగా నాకే కాకుండా రాష్ట్రానికి కూడా తీరని లోటు. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: స్నేహశీలి.. సౌమ్యుడు.. మృదుభాషి మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సోమవారం ఉదయం హైదరాబాద్‌లో హఠాన్మరణం చెందారు. ఊహించని ఈ విషాదం మేకపాటి కుటుంబంతోపాటు ప్రజలు, అభిమానులు, రాజకీయ నాయకులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు రూ.వేల కోట్ల పెట్టుబడులను సాధించి దుబాయ్ పర్యటనను విజయవంతంగా ముగించుకుని ఆదివారం ఉదయమే తిరిగి వచ్చిన ఆయన అంతలోనే అందరినీ వీడి వెళ్లిపోవడం ప్రతి ఒక్కరినీ కలచివేస్తోంది. ఈ విషాద వార్త తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దంపతులు విజయవాడ నుంచి హుటాహుటిన విమానంలో హైదరాబాద్ చేరుకుని మేకపాటి గౌతమ్‌రెడ్డి నివాసం వద్ద పార్ధీవ దేహానికి నివాళులర్పించారు. కాగా మంగళవారం నెల్లూరుకు భౌతికకాయాన్ని తరలించి బుధవారం ఉదయగిరిలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అమెరికాలో చదువుకుంటున్న గౌతమ్‌రెడ్డి తనయుడు కృష్ణార్జున్‌రెడ్డి మంగళవారం రాత్రి చెన్నై విమానాశ్రయానికి చేరుకోనున్నారు. మంచినీళ్లు అడిగి.. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 48లోని తన నివాసంలో ఉదయం లేచిన తరువాత చలాకీగానే ఉన్న మంత్రి గౌతమ్‌రెడ్డి ఫోన్లో పలువురితో మాట్లాడారు. రెండో అంతస్తులో సోఫాలో కూర్చున్న ఆయనకు 7.15 గంటల సమయంలో ఒక్కసారిగా ఛాతీలో నొప్పిరావడం.. సోఫాలో పక్కకు ఒరిగిపోవడంతో గౌతమ్‌రెడ్డి సతీమణి భార్య శ్రీకీర్తి గట్టిగా కేకలు వేయడంతో డ్రైవర్, సిబ్బంది తక్షణమే వచ్చారు. డ్రైవర్ నాగేశ్వరరావు తదితరులు ఆయన ఛాతీపై గట్టిగా రుద్దడం ద్వారా ఉపశమనం కల్పించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆయన కోరిక మేరకు మంచినీళ్లు అందించినా తాగలేకపోయారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో హుటాహుటిన అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆ వెంటనే ఆయన్ను అడ్వాన్స్డ్ కార్డియో లైఫ్ సపోర్ట్‌తో ఎమర్జెన్సీ వార్డులో చేర్చారు. ఎమర్జెన్సీ మెడికల్ టీమ్‌తో పాటు ఆస్పత్రి కార్డియాలజిస్ట్‌లు, స్పెషలిస్ట్‌లు గౌతమ్‌రెడ్డిని బతికించేందుకు ప్రయత్నించారు. 90 నిమిషాల పాటు కార్డియో పల్మనరీ రిససిటేషన్ (సీపీఆర్) చికిత్స నిర్వహించినా ఫలితం దక్కలేదు. ఉదయం 9.15 గంటల ప్రాంతంలో ఆయన మృతి చెందినట్లు అపోలో వైద్యులు ప్రకటించారు. 11.50 గంటలకు గౌతమ్‌రెడ్డి పార్థివ దేహాన్ని అపోలో ఆస్పత్రి నుంచి జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి తరలించారు. పెట్టుబడులతో తిరిగి వచ్చి... ఆంధ్రప్రదేశ్‌ను పారిశ్రామికంగా ప్రగతి పథంలో ముందుకు నడిపేందుకు గత వారం రోజులుగా దుబాయ్ నిర్వహించిన ఎక్స్‌పోలో పాల్గొన్న పరిశ్రమలు, వాణిజ్య, ఐటీ శాఖల మంత్రి గౌతమ్‌రెడ్డి ఏపీలో పెట్టుబడులు పెట్టేలా పారిశ్రామిక వేత్తలను ఒప్పించి రూ.ఐదు వేల కోట్లకు పైగా విలువైన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అక్కడి నుంచి ఆదివారం ఉదయమే హైదరాబాద్ తిరిగి వచ్చారు. బంధువుల ఇంట్లో ఓ కార్యక్రమానికి హాజరైన అనంతరం రాత్రి 9.45 గంటలకు ఇంటికి చేరుకున్నారు. ఉదయం యథావిధిగా కార్యక్రమాలు ముగించుకుని సోఫాలో కూర్చున్న సమయంలో హఠాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. కాగా వ్యాయామం చేస్తుండగా ఆయన ఇబ్బందికి గురైనట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని మేకపాటి కుటుంబ సభ్యులు ఖండించారు. పలువురు ప్రముఖుల నివాళులు.. మృదు స్వభావి మంత్రి గౌతమ్‌రెడ్డి అకాల మృతి పట్ల తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆపోలో ఆస్పత్రిలో, నివాసం వద్ద పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. మేకపాటి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని), ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, కారుమూరి వెంకట నాగేశ్వరరావు, మధుసూదన్‌రెడ్డి, ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య, ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ఎంపీ గల్లా జయదేవ్, జేసీ సోదరులు, మాజీ ఎంపీలు కేవీపీ, మైసూరారెడ్డి, సుబ్బరామిరెడ్డి, తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్, తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, తెలంగాణ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి, ఏ.ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, వి.శ్రీనివాస్‌గౌడ్, కొప్పుల ఈశ్వర్, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల, బ్రదర్ అనిల్‌కుమార్, వైఎస్ అనిల్‌రెడ్డి, పువ్వాడ అజయ్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎంపీ కే.ఆర్.సురేష్‌రెడ్డి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్యే వి.నారాయణరెడ్డి, ప్రొటెం చైర్మన్ ఆమీనుల్ జాఫ్రీ, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, జానారెడ్డి, నిర్మాత సురేష్‌బాబు, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాజీ ఎంపీలు మధుయాష్కీ, పొన్నం ప్రభాకర్ తదితరులు నివాళులర్పించారు. ఓదార్చిన సీఎం జగన్ దంపతులు హైదరాబాద్‌లోని మేకపాటి నివాసం వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దంపతులు విషణ్ణ వదనంతో నివాళులర్పించారు. సీఎం జగన్‌ను చూసి గౌతమ్‌రెడ్డి తల్లి కన్నీరుమున్నీరయ్యారు. గౌతమ్‌రెడ్డి తండ్రి మేకపాటి రాజమోహన్‌రెడ్డిని ఓదార్చిన ముఖ్యమంత్రి జగన్ దాదాపు అరగంట పాటు అక్కడే గడిపి ధైర్యం చెప్పారు. గౌతమ్‌రెడ్డి సతీమణి, ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చారు. సీఎం జగన్ సతీమణి భారతి కూడా వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు. ముఖ్యమంత్రి వెంట ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, టీటీడీ బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, మంత్రులు అనిల్‌కుమార్‌యాదవ్, ఆదిమూలపు సురేష్ తదితరులున్నారు. మేకపాటి భౌతికకాయం వద్ద విషణ్ణ వదనంతో సీఎం వైఎస్ జగన్, ఆయన సతీమణి భారతి గౌతమ్‌రెడ్డి మృతి విచారకరం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం సాక్షి, అమరావతి: రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ, స్కిల్ డెవలప్మెంట్, శిక్షణ, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మృతి అత్యంత విచారకరమని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ సోమవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. -
నదీజలాలపై కేంద్ర గెజిట్ చెల్లదు!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీజలాలపై హక్కులను స్వాధీనం చేసుకుంటూ 2021 జూలై 15న కేంద్రం రీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ రాజ్యాంగ విరుద్ధమని కేంద్ర సమాచార మాజీ కమిషనర్, న్యాయ నిపుణుడు మాడభూషి శ్రీధర్ తేల్చి చెప్పారు. వేల కోట్లు ఖర్చు చేసి నిర్మించిన ప్రాజెక్టులను తీసుకునే అధికారం కేంద్రానికి లేదని, ఇలా చేయడం రాష్ట్రాన్ని తీవ్రంగా అవమానించడమేనని స్పష్టం చేశారు. మహారాష్ట్ర, కర్ణాటకలో కూడా ఈ నదులు ప్రవహిస్తున్నా.. అక్కడ కేంద్రం తీసుకోలేదని, ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 (సమానత్వ హక్కు)కు విరుద్ధమని పేర్కొన్నారు. కేంద్రం తక్షణమే ఆ గెజిట్‌ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆదివారం తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం, తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన మీడియా సమావేశంలో మాడభూషి శ్రీధర్ మాట్లాడారు. నీటివనరులు రాష్ట్రాల జాబితాలో ఉన్న అంశమని.. అందువల్ల నదీజలాల వినియోగంపై రాష్ట్రాలే సంపూర్ణ హక్కు, అధికారాలను కలిగి ఉంటాయని గుర్తు చేశారు. అంతర్రాష్ట్ర వివాదాల పరిష్కారానికే కేంద్ర ప్రభుత్వం పరిమితం కావాల్సి ఉంటుందని తెలిపారు. అంతర్రాష్ట జల వివాదాల పరిష్కార చట్టం కింద ట్రిబ్యునల్‌ను ఏర్పాటుచేసి సమస్యను పరిష్కరించవచ్చని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం.. కృష్ణా, గోదావరి బోర్డులను కేంద్రం ఏడేళ్ల కిందే ఏర్పాటు చేసినా, వాటి విధులేమిటో ఖరారు చేయకపోవడంతో ప్రయోజనం లేకుండా పోయిందని వివరించారు. ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణాజలాల పంపిణీ కోసం కొత్త ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేస్తే సమస్య పరిష్కారం అవుతుందని.. కానీ దీనిపై కేంద్రం మీనమేషాలు లెక్కిస్తోందని విమర్శించారు. తక్షణమే కేంద్రం కృష్ణా, గోదావరి అపెక్స్ కౌన్సిళ్ల భేటీలను ఏర్పాటు చేయాలని కోరారు. తెలంగాణకు కృష్ణా జలాల కేటాయింపు తన పరిధిలో లేదని కృష్ణా అవార్డ్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ పేర్కొనడం దారుణమన్నారు. కేంద్రం గెజిట్‌ను ఉపసంహరించుకోవాలంటూ ఫోరం ఆధ్వర్యంలో రాష్ట్రపతికి వినతిపత్రం ఇస్తామని.. ప్రధాని, కేంద్ర మంత్రులకూ పంపుతామని తెలిపారు. ఒకవేళ కేంద్రం స్పందించకుంటే సుప్రీంకోర్టులో పిల్ వేస్తామన్నారు. గెజిట్ అమలైతే.. తాగునీటికి కటకటే! ఏపీ, తెలంగాణలకు నీటివాటాలను కేటాయించకుండానే కృష్ణా, గోదావరి బోర్డులను ఏర్పాటు చేస్తే ప్రయోజనం లేదని రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరం కార్యదర్శి శ్యాంప్రసాద్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణకు కేటాయింపులు జరగపోతే.. కృష్ణానదిపై నిర్మిస్తున్న ప్రాజెక్టులకు కేంద్ర జలసంఘం నుంచి అనుమతులు లభించవని గుర్తుచేశారు. అనుమతులు లేని ప్రాజెక్టులను నిలిపేయాలని గెజిట్‌లో పేర్కొన్న నేపథ్యంలో.. పాలమూరు–రంగారెడ్డి, డిండి, ఎస్ఎల్బీసీ, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, ఉదయ సముద్రం వంటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని అర్థాంతరంగా ఆపాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. హైదరాబాద్, రంగారెడ్డితోపాటు నల్లగొండ, మహబూబ్‌నగర్ వంటి ప్రాంతాలకు తాగునీరిచ్చే ప్రాజెక్టులనూ నిలిపేయాల్సి ఉంటుందని, అదే జరిగితే రాష్ట్రంలో సగం జనాభాకు తాగునీటి కొరత ఏర్పడుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కెప్టెన్ పాండురంగారెడ్డి, టీడీఎఫ్ ఇండియా అధ్యక్షుడు వి.రాజారెడ్డి, చైర్మన్ బి.రణధీర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గెజిట్ అమలుపై గజిబిజి
సాక్షి, అమరావతి: కృష్ణా, గోదావరి జలాల వినియోగంపై తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలకు ముగింపు పలకడమే లక్ష్యంగా రెండు బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ గతేడాది జూలై 15న కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలు ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కు అన్నట్లుగా తయారైంది. కేంద్రం నిర్దేశించిన తుది గడువు ముగిసిపోయి మూడు నెలలు పూర్తయినా నోటిఫికేషన్ అమల్లోకి రాకపోవడం గమనార్హం. మూడు నెలల క్రితమే ఏపీ ఉత్తర్వులు.. కృష్ణా బోర్డు ఆమోదించిన తీర్మానం మేరకు ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో తమ భూభాగంలోని ఆరు అవుట్లెట్లను బోర్డుకు అప్పగించేందుకు అంగీకరిస్తూ గత అక్టోబర్ 14నే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ సర్కార్ మాత్రం తన భూభాగంలోని తొమ్మిది అవుట్లెట్లను బోర్డుకు అప్పగించేందుకు నిరాకరిస్తూ వస్తోంది. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి వచ్చాకే బోర్డు పరిధిని నిర్ణయించాలంటూ పాత పాట అందుకుంది. గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం శ్రీరాంసాగర్ నుంచి సీతమ్మసాగర్ వరకు గోదావరిపై ప్రాజెక్టులన్నీ బోర్డు పరిధిలోకి తేవాలని ఏపీ ప్రభుత్వం ప్రతిపాదిస్తుండగా.. ఉమ్మడి ప్రాజెక్టులే లేనప్పుడు గోదావరి బోర్డుతో అవసరమేముందని, రద్దు చేయాలని తెలంగాణ సర్కార్ వాదిస్తోంది. గెజిట్ నోటిఫికేషన్ అంశాలను తు.చ. తప్పకుండా అమలు చేస్తామని కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్, కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్లు ఎంపీ సింగ్, చంద్రశేఖర్ అయ్యర్ పదేపదే స్పష్టం చేస్తున్నా ఆచరణకు నోచుకోవడం లేదు. దీంతో జల వివాదాలు సమసిపోవడం లేదు. సమీక్షలతో సరి.. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధి, స్వరూపంపై నివేదిక ఇచ్చేందుకు ఇరు బోర్డులు వేర్వేరుగా సబ్ కమిటీలను నియమించాయి. బోర్డుల సభ్య కార్యదర్శుల నేతృత్వంలో ఇరు రాష్ట్రాల అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం సీఈలు, జెన్కో సీఈలు సభ్యులుగా ఉన్న ఈ కమిటీలు పలుదఫాలు సమావేశమై నివేదికలు ఇచ్చాయి. వీటి ఆధారంగా బోర్డు పరిధిని ఖరారు చేసి గెజిట్ నోటిఫికేషన్ అమలుకు రెండు బోర్డులు సిద్ధమయ్యాయి. కృష్ణా బేసిన్లో ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లోని 15 అవుట్ లెట్లను తొలుత పరిధిలోకి తీసుకుని నిర్వహిస్తామని, ఆ తర్వాత దశల వారీగా ఇతర ప్రాజెక్టులను అధీనంలోకి తీసుకుంటామని కృష్ణా బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్ ప్రతిపాదించారు. ఇందుకు రెండు రాష్ట్రాలు తొలుత అంగీకరించడంతో ఆ మేరకు బోర్డు తీర్మానాన్ని ఆమోదించింది. గోదావరి ప్రాజెక్టులన్నీ బోర్డు పరిధిలోకి తేవాలన్న ఏపీ ఉమ్మడి ప్రాజెక్టు అయిన పెద్దవాగును పరిధిలోకి తీసుకుని నోటిఫికేషన్ అమలు ప్రారంభిస్తామని గోదావరి బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ ప్రతిపాదించగా.. శ్రీరాంసాగర్ నుంచి సీతమ్మసాగర్ వరకూ గోదావరి ప్రధాన పాయపై ఉన్న ప్రాజెక్టులన్నీ బోర్డు పరిధిలోకి తీసుకుని నిర్వహిస్తేనే దిగువ రాష్ట్రమైన ఏపీకి ప్రయోజనం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనిపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. బోర్డు చైర్మన్ పలుమార్లు సమీక్షలు నిర్వహించినా ఒక తాటిపైకి తేలేకపోయారు. నోరుమెదపని జల్‌శక్తి శాఖ నోటిఫికేషన్ అమలుపై తొలుత కృష్ణా, గోదావరి బోర్డు అధికారులతో కేంద్ర జల్ శక్తి శాఖ అదనపు కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత రెండు రాష్ట్రాల జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించినా ఏకాభిప్రాయాన్ని సాధించలేకపోయారు. గత నెల 28న రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, జలవనరుల శాఖ ఉన్నతాధికారులు, గోదావరి, కృష్ణా బోర్డుల చైర్మన్లతో కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి వర్చువల్ విధానంలో సమావేశం నిర్వహించారు. కృష్ణా బోర్డు పరిధికి ఏపీ సర్కార్ అంగీకరించగా.. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి వచ్చే వరకూ నోటిఫికేషన్ అమలును నిలుపుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం పట్టుబట్టింది. గోదావరి బోర్డు అవసరమే లేదని తెలంగాణ సర్కార్ పేర్కొనగా.. దిగువ రాష్ట్రమైన తమ హక్కుల పరిరక్షణకు బోర్డు అత్యంత ఆవశ్యకమని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. రెండు రాష్ట్రాల వాదనలు విన్న కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి నోటిఫికేషన్‌ను తప్పకుండా అమలు చేస్తామని చెప్పినా ఇప్పటిదాకా ఆ దిశగా అడుగులు పడకపోవడం గమనార్హం. -
ఆర్ఆర్ఆర్.. 4,400 ఎకరాలు.. కసరత్తు మొదలైంది
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగు రోడ్డు ఉత్తర భాగానికి భూసేకరణ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. దీని కసరత్తు మొదలైంది. 158.6 కి.మీ. ఈ భాగానికి సమీకరించాల్సిన భూమి ఏయే సర్వే నంబర్లలో ఎంతెంత ఉందన్న వివరాల నమోదు పూర్తయింది. గెజిట్ జారీకి వీలుగా దీన్ని ఈ నెల 15న ఢిల్లీలోని ఎన్హెచ్ఏఐ ప్రధాన కేంద్రంలో అందజేయనున్నట్లు సమాచారం. భూసేకరణలో ఇదే తొలి ప్రక్రియ. ఆ వివరాలను పరిశీలించి, కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ అనుమతి తీసుకున్నాక గెజిట్ విడుదల చేయనున్నారు. ఆ తర్వాత భూసేకరణ వివరాలు ప్రజల ముంగిటికి అధికారికంగా రానున్నాయి. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగానికి కేంద్రం అనుమతి మంజూరు చేసిన నేపథ్యంలో, ఇటీవలే దాని అలైన్‌మెంట్‌ను కూడా ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ రోడ్డుకు దాదాపు 4,400 ఎకరాల భూమి అవసరమవుతుందని గుర్తించారు. అలైన్మెంట్ ఆధారంగా ఈ భూమి ఏయే గ్రామాల పరిధిలో ఎంత అవసరమో ఆ వివరాలతో ఓ నివేదికను తాజాగా సిద్ధం చేశారు. అభ్యంతరాలకు 21 రోజులు.. గెజిట్ విడుదల తర్వాత పత్రికా ముఖంగా ప్రచురించి ప్రజల ముంగిట ఉంచుతారు. ఈ జాబితాపై అభ్యంతరాలు తెలిపేందుకు ప్రజలకు 21 రోజుల గడువు ఇవ్వనున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే కాంపిటెంట్ అథారిటీ ముందు అభ్యంతరాలను వ్యక్తం చేసే వెసులుబాటు కల్పిస్తున్నారు. మండలాలవారీగా (ఇంకా తేల్చలేదు) పబ్లిక్ హియరింగ్ సమావేశాలు (గ్రామసభ తరహా) ఏర్పాటు చేసి అభ్యంతరాలు స్వీకరించనున్నారు. ఆ మేరకు కాంపిటెంట్ అథారిటీ మార్పుచేర్పులకు అవకాశం కల్పించేందుకు దాదాపు నెల రోజుల సమయమివ్వనున్నారు. ఆ తర్వాత రెవెన్యూ యంత్రాంగం క్షేత్రస్థాయిలో హద్దుల నిర్ధారణతో పాటు భూ వివరాలను నమోదుచేస్తారు. దీని కోసం ఒక్కో గ్రామానికి 10 మంది వరకు రెవెన్యూ సిబ్బందిని నియమించనున్నట్లు ఆ శాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఈ లెక్కన దాదాపు 2వేల మందిని ఈ అథారిటీకి అప్పగించనున్నారు. దీని అధారంగా మరో జాబితాను ప్రచురించి పత్రికాముఖంగా ప్రజల ముందు ఉంచుతారు. దీనిపైనా ప్రజా అభ్యంతరాలకు 2 నెలల గడువు ఇవ్వనున్నారు. ఆ అభ్యంతరాల ఆధారంగా పొరపాట్లను సరిదిద్దుతారు. ఆ తర్వాత.. ఆ భూమిలోని చెట్లు, పైపులైన్లు, ఇతర ఆస్తుల వివరాలు సేకరించి ప్రచురిస్తారు. ఇక ఏ పట్టాదారుకు ఎంత పరిహారం ఇవ్వనున్నారో లెక్కించి ఆ వివరాలను కూడా బహిరం గంగా ప్రచురిస్తారు. దీనిపై కూడా అభ్యంతరాలు స్వీకరిస్తారు. పరిష్కరించగలిగినవి పరిష్కరించి.. వారికి రావాల్సిన పరిహారం వివరాలు పొందు పరుస్తూ (భూమి, అందులోని ఇతర ఆస్తులు కలిపి) అవార్డు పాస్ చేస్తారు. ఈ సందర్భంగా ఆ భూ యజమానుల లిఖితపూర్వక అంగీకారాన్ని అధికారులు సేకరిస్తారు. అంగీకరించని వారికి కూడా రెవెన్యూ అధికారులతో ఓ జాయింట్ ఖాతా తెరిచి అందులో పరిహారాన్ని జమచేస్తారు. వారి అభ్యంతరాలు వీగిపోయిన తర్వాత నిర్బంధంగా భూమిని సమీకరించి పరిహారాన్ని చెల్లిస్తారు. ఏడాది నుంచి రెండేళ్లు పట్టే అవకాశం.. ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టులో ఇదే అత్యంత కీలక ప్రక్రియ. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయ్యేందుకు ఏడాది నుంచి రెండేళ్ల సమయం పట్టే అవకాశం ఉంది. అనుకున్నది అనుకున్నట్లు సవ్యంగా సాగితే 6 నెలలు పడుతుందని అంచనా. కానీ.. న్యాయపరంగా, ఇతర ఇబ్బందులను అధిగమించేందుకు రెండేళ్ల వరకు సమయం పట్టే అవకాశం ఉంది. కాంపిటెంట్ అథారిటీ.. భూసేకరణ ప్రక్రియకు ప్రత్యేకంగా ఓ కాంపిటెంట్ అథారిటీని ఏర్పాటు చేయనున్నారు. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం 4 జిల్లాల పరిధిలో ఉండనుంది. సాధారణంగా జిల్లా అదనపు కలెక్టర్ (పరిపాలన) ఆధ్వర్యంలో డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారి భూ సేకరణను పర్యవేక్షిస్తారు. ఈ రోడ్డు విషయంలో జాప్యం ఉండకూడదని అథారిటీని ఏర్పాటు చేస్తు న్నారు. ఇందులో ఆర్డీఓ స్థాయి (ఖరారు కాలేదు) ముగ్గురిని నియమించనున్నట్లు సమాచారం. దీని అనుమతి కోసం ఇటీవలే అధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరారు. ఒక్కో అధికారికి 50 కి.మీ. నిడివి అప్పగించనున్నట్లు ఓ రెవెన్యూ ఉన్నతాధికారి ‘సాక్షి’తో చెప్పారు. ఒక్కో అధికారికి మూడునాలుగు మండలాల పరిధి రానుంది. పరిహారం.. ప్రభుత్వ విలువపై 3 రెట్ల విలువను పరిహారంగా లెక్కగట్టనున్నారు. లేదా స్థానికంగా ఇటీవల ఏదైనా ప్రాజెక్టు కోసం జరిగిన భూసేకరణలో లెక్కగట్టిన మొత్తాన్ని పరిగణనలోకి తీసుకునే వీలుంది. ఏడాదిలోపు పరిహారం అందివ్వలేని పక్షంలో 12 శాతం వడ్డీ కలుపుకొని చెల్లిస్తారు. -
11 ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో స్థానిక సంస్థల నియోజకవర్గాల నుంచి 11 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు మంగళవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ అయింది. దీంతో మంగళవారం నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. మంగళవారం ఎటువంటి నామినేషన్లు దాఖలు కాలేదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం వెల్లడించింది. గతంలో ఎన్నికైన ఎమ్మెల్సీల పదవీ కాలం ఈ ఏడాది ఆగస్టు 11తో ముగిసిన నేపథ్యంలో.. 11 ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలను నిర్వహిస్తోంది. గుంటూరు, కృష్ణా, విశాఖపట్నం స్థానిక సంస్థల నుంచి రెండేసి ఎమ్మెల్సీ స్థానాలకు, అనంతపురం, తూర్పు గోదావరి, విజయనగరం, చిత్తూరు, ప్రకాశం స్థానిక సంస్థల నుంచి ఒక్కో ఎమ్మెల్సీ స్థానాలకు డిసెంబర్ 10న పోలింగ్ నిర్వహించనున్నారు. ఎమ్మెల్యేల కోటా స్థానాలకు వైఎస్సార్సీపీ అభ్యర్థుల నామినేషన్లు ఇక ఎమ్మెల్యేల కోటాలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు వైఎస్సార్సీపీ అభ్యర్థులు పాలవలస విక్రాంత్, ఇషాక్ బాషా, దేవసాని గోవిందరెడ్డిలు మంగళవారం నామినేషన్లు దాఖలు చేశారు. వెలగపూడిలోని అసెంబ్లీ సచివాలయంలో శాసన మండలి ఉప కార్యదర్శి, రిటర్నింగ్ అధికారి పీవీ సుబ్బారెడ్డికి నామినేషన్ పత్రాలతోపాటూ వైఎస్సార్సీపీ బీ–ఫామ్‌లను కూడా అందజేశారు. ముగ్గురు అభ్యర్థుల నామినేషన్ పత్రాలను పరిశీలించిన రిటర్నింగ్ అధికారి వారితో ఎన్నికల నియమావళిని అనుసరించి వ్యవహరిస్తామంటూ ప్రతిజ్ఞ చేయించారు. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ స్థానాలకు వైఎస్సార్సీపీ అభ్యర్థులుగా పోటీచేస్తున్న ముగ్గురిలో తొలుత పాలవలస విక్రాంత్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. అనంతరం దేవసాని గోవిందరెడ్డి, ఇషాక్ బాషా సమర్పించారు. వీరి వెంట డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు, చీఫ్‌విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధ, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డి ఉన్నారు. అభ్యర్థులకు బీఫారాలు అందజేసిన సీఎం వైఎస్ జగన్ అంతకుముందు.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు బీఫారాలు అందజేశారు. సీఎం క్యాంపు కార్యాలయంలో మంగళవారం వారు ముఖ్యమంత్రిని కలిశారు. ఎమ్మెల్యేల కోటాలో ఖాళీ అయిన ఎమ్మెల్సీల స్ధానాలకు తమను ఎంపిక చేయడంతో వారు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉంటే.. పోటీలో వీరు ముగ్గురే ఉండడంతో వీరి ఎన్నిక ఏకగ్రీవం కానుంది. రిటర్నింగ్ అధికారి పీవీ సుబ్బారెడ్డి ప్రకటించడం లాంఛనమే. -
‘మురుగు’ పన్ను మరిచారా బాబూ!?
సాక్షి, అమరావతి: ‘చెత్త’ పన్ను.. ‘చెత్త’ పన్ను అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఊరూవాడా ఊకదంపుడు ఉపన్యాసాలిస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు.. అసలు ఆ తరహా పన్నుల విధానానికి శ్రీకారం చుట్టింది ఆయనే. ఎందుకంటే.. గ్రామాల్లో నివసించే ప్రజలు గత 20 ఏళ్లుగా మురుగు కాల్వలు వాడుతున్నందుకు పన్ను కడుతున్నారు. ఉమ్మడి ఏపీకి చంద్రబాబు సీఎంగా పనిచేస్తున్నప్పుడు ఇలాంటి పన్నునే ఆయన కొత్తగా ప్రవేశపెట్టారు. అప్పటి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు 2002 మార్చి 14న ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ జారీచేశారు. ఏపీ గ్రామ పంచాయతీ నియమావళి పేరుతో.. గ్రామాల్లో ఇంటి పన్ను రూపంలో వసూలుచేస్తున్న దాంట్లో కొంత మొత్తం అదనంగా ‘యూజర్ ఛార్జెస్ ఫర్ డ్రెయినేజీ ఫెసిలిటీ’కి వసూలుచేయడానికి అప్పట్లో ఆ నోటిఫికేషన్‌ను జారీచేశారు. మురుగు కాల్వలపై యూజర్ చార్జీల వసూలుకు అప్పటివరకు అమలులో ఉన్న పంచాయతీరాజ్ చట్టానికి నాటి చంద్రబాబు ప్రభుత్వం పలు సవరణలు కూడా చేసింది. అంతేకాదు.. గ్రామాల్లో వీధి దీపాలు, పక్కా మురుగుపారుదల సదుపాయాలు, మంచినీటి సరఫరా వంటి వసతుల కల్పన సహా స్థానికంగా కల్పించే సౌకర్యాలపై అక్కడ నివసించే ప్రజల నుంచి యూజర్ ఛార్జీలను వసూలుచేయాలని ఆ గెజిట్ నోటిఫికేషన్లోనే పేర్కొన్నారు. ఆయా సదుపాయాలు నిర్వహించడానికి అయ్యే వ్యయాన్ని, ఆ సేవలను వినియోగించుకునే అన్ని కుటుంబాలకు విభజించి యూజర్ ఛార్జీలను లెక్కగట్టాలని అందులో వివరించారు. 2014–19 మధ్య కూడా ఇలాగే.. ఇక 2014–19 మధ్య ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలోనూ చంద్రబాబు సర్కారు ప్రజల నడ్డి విరిచింది. కొత్తకొత్త పన్నులు విధిస్తూ ఆదేశాలను జారీచేసింది. ఉదా.. ► ప్రమాదాల సమయంలో ఫైర్ ఇంజన్ల ద్వారా సేవలు అందిస్తున్నందుకు గాను ప్రత్యేకంగా ఫైర్ టాక్స్ వసూలుకు 2014 డిసెంబరు 3న అప్పటి పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి ఆదేశాలు జారీచేశారు. గ్రామాల్లో ప్రజలు ఇంటి పన్ను రూపంలో చెల్లించే మొత్తానికి అదనంగా ఒక శాతం చొప్పున ఈ ఫైర్ టాక్స్‌ను లెక్కించి వసూలుచేయాలని ఆదేశించారు. ► అలాగే.. గ్రామాల్లో వసూలుచేసే ఇంటి పన్నులో 3 శాతం చొప్పున స్పోర్ట్స్ ఫీజు (ఆటలపై పన్ను) రూపంలో లెక్కించి, స్పోర్ట్స్ ఆధారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్)కు జమచేయాలంటూ 2014 నవంబరు 18న మరో జీఓను కూడా చంద్రబాబు సర్కారు జారీచేసింది. ఇలా తన హయాంలో ఎడాపెడా పన్నులను బాదేసిన చంద్రబాబు ఇప్పుడు పన్నులను విమర్శించడంపై రాష్ట్ర ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. -
అప్పగింతపై చెరోదారి
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి బోర్డుల గెజిట్ నోటిఫికేషన్ అమలు అంశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పరస్పర భిన్న వైఖరులను అవలంబిస్తున్నాయి. గత బోర్డు సమావేశంలో తీర్మానించిన మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం, నాగార్జున సాగర్‌లపై ఉన్న 6 ఔట్లెట్లను బోర్డుకు అప్పగిస్తూ గురువారం అధికారిక ఉత్తర్వులు జారీ చేయగా.. తెలంగాణ మాత్రం తన వైఖరిని వెల్లడించలేదు. శ్రీశైలం, సాగర్‌లపై ఉన్న తమ పవర్ హౌస్‌లను మినహాయించి మిగతా ఔట్లెట్లను అప్పగించేందుకు ప్రభుత్వ స్థాయిలో కొంత సానుకూలత కనిపిస్తున్నా...ఇదివరకే నియమించిన ఏడుగురు సభ్యుల సబ్‌కమిటీ నివేదిక ఆధారంగానే ప్రాజెక్టుల అప్పగింతపై తుది నిర్ణయం చేయనుంది. ఈ నేపథ్యంలో గెజిట్ అమలుపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. దసరా తర్వాత ప్రస్తుత పరిస్థితిని కేంద్ర జల శక్తి శాఖకు నివేదించి దాని అభిప్రాయం మేరకు కృష్ణా బోర్డు ముందుకెళ్లనుంది. తెలంగాణ అప్పగించాకే.. గోదావరిలో పెద్దవాగు, కృష్ణాలో 15 ఔట్లెట్లను తమకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని బోర్డులు ఇదివరకే రెండు రాష్ట్రాలను కోరిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టుల అప్పగింతకు ముందునుంచి సంసిద్ధంగానే ఉన్న ఏపీ.. తీర్మానం మేరకు శ్రీశైలం స్పిల్‌వే, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, హంద్రీనీవా (మల్యాల), ముచ్చిమర్రి ఎత్తిపోతలను కృష్ణా బోర్డుకు అప్పగిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే శ్రీశైలం కుడి విద్యుత్ కేంద్రం, సాగర్ కుడికాల్వ విద్యుత్ కేంద్రాలను సైతం అప్పగిస్తూ ఆ రాష్ట్ర జల వనరులు, ఇంధన శాఖ కార్యదర్శులు శ్యామలరావు, నాగులపల్లి శ్రీకాంత్ ఉత్తర్వులు జారీ చేశారు. వీటి పరిధిలో పనిచేసే 181 మంది సిబ్బందిని బోర్డు పరిధిలోకి తెస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కానీ కృష్ణా బోర్డు సమావేశంలో చేసిన తీర్మానం మేరకు తెలంగాణలోని శ్రీశైలం, సాగర్‌లపై ఉన్న 9 అవుట్లెట్లను స్వాధీనం చేసుకున్నప్పుడే..తమ ప్రాజెక్టులను స్వాధీనం చేసుకోవాలనే షరతు విధించారు. శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువున ఉన్న జూరాల ప్రాజెక్టుతో పాటు దాన్నుంచి నేరుగా నీటిని తీసుకునేలా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను సైతం అవి పూర్తయిన వెంటనే స్వాధీనం చేసుకోవాలని పేర్కొన్నారు. వాటిని స్వాధీనం చేసుకోకపోతే దిగువన ఉన్న శ్రీశైలం, సాగర్లకు వచ్చే ప్రవాహాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని తెలిపారు. రెండు రాష్ట్రాల్లోనూ నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తయిన వెంటనే వాటిని సైతం స్వాధీనం చేసుకోవాలని స్పష్టం చేశారు. గోదావరికి సంబంధించిన పెద్దవాగుపై మాత్రం ఇంకా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు. పవర్‌హౌస్‌లపై తెలంగాణ ససేమిరా పెద్దవాగును బోర్డుకు అప్పగించేందుకు సిధ్దంగా ఉన్న తెలంగాణ.. కృష్ణా బేసిన్ ప్రాజెక్టులపై మాత్రం తర్జనభర్జనలు పడుతోంది. అయితే శ్రీశైలం, నాగార్జునసాగర్‌పై ఉన్న 3 పవర్‌హౌస్‌లను అప్పగించేందుకు ఏమాత్రం అంగీకరించేది లేదని స్పష్టం చేస్తోంది. ఇవి మినహాయిస్తే మిగతా 6 ఔట్లెట్ల విషయంలో మాత్రం కొంత సానుకూలంగా ఉంది. ఈ మేరకు ఇంజనీర్ ఇన్ చీఫ్ నుంచి ప్రభుత్వ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి ఓ లేఖ సైతం వెళ్లింది. అయితే దీనిపై ఎలాంటి నిర్ణయం తెలుపని రాష్ట్ర ప్రభుత్వం, ప్రస్తుత పరిణామాలను అధ్యయనం చేసి జూరాల, శ్రీశైలం, సాగర్ల అపరేషన్ ప్రోటోకాల్ ముసాయిదాను నిర్దేశించేందుకు ఇప్పటికే ఈఎన్సీ మురళీధర్ నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో సబ్ కమిటీని నియమించింది. సబ్ కమిటీలో సీనియర్ ఇంజనీర్లు, రిటైర్డ్ ఇంజనీర్లు, న్యాయవాదులు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ 15 రోజల్లో తన నివేదికను అందించాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో దసరా సెలవుల అనంతరం కమిటీ భేటీ కానుంది. అనంతరం తన పరిశీనలను ప్రభుత్వానికి అందజేస్తే దానిపై ప్రభుత్వ స్థాయిలో మరోమారు చర్చించాక ప్రాజెక్టుల అప్పగింతపై నిర్ణయం చేయనుంది. ఒకవేళ కమిటీ ఏవైనా అభ్యంతరాలు లేవనెత్తితే.. వాటిపై స్పష్టత కోరుతూ బోర్డులు, కేంద్రానికి లేఖలు రాయనుంది. తమ అభ్యంతరాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారాలు చూపితేనే అప్పగింతపై సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. -
రెండు బోర్డుల గెజిట్ నోటిఫికేషన్ అమలుపై అనిశ్చితి
సాక్షి, అమరావతి: కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ జూలై 15న కేంద్ర జల్‌శక్తి శాఖ జారీచేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలుపై అనిశ్చితి నెలకొంది. గెజిట్ నోటిఫికేషన్ అమలే అజెండాగా ఈనెల 11, 12 తేదీల్లో నిర్వహించిన ప్రత్యేక సమావేశాల మినిట్స్‌ను (చర్చించిన అంశాలను) కృష్ణా, గోదావరి బోర్డు సభ్య కార్యదర్శులు డీఎం రాయ్‌పురే, బీపీ పాండే బుధవారం రెండు రాష్ట్రాలకు పంపారు. సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల మేరకు.. ప్రాజెక్టులను అప్పగించేందుకు ఏపీ ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసేందుకు అంగీకరించింది. కానీ శ్రీశైలం, సాగర్ జలవిద్యుత్ కేంద్రాలను కృష్ణాబోర్డుకు అప్పగించడంపై తెలంగాణ సర్కార్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రాజెక్టులను కృష్ణా, గోదావరి బోర్డులకు అప్పగించేలా ఉత్తర్వులు జారీచేసేందుకు మొగ్గుచూపలేదు. 2 రాష్ట్రాలు ప్రాజెక్టులను అప్పగిస్తూ ఉత్తర్వులు జారీచేస్తేగానీ.. వాటిని బోర్డులు తమ పరిధిలోకి తీసుకోలేవు. తెలంగాణ సహాయ నిరాకరణ నేపథ్యంలో నిర్దేశించిన రోజు గురువారం నుంచి (నేటి నుంచి) గెజిట్ నోటిఫికేషన్‌ను అమలు చేయలేని పరిస్థితిని కేంద్ర జల్‌శక్తి శాఖ దృష్టికి తీసుకెళ్లినట్లు 2 బోర్డుల అధికారవర్గాలు తెలిపాయి. కేంద్ర మార్గదర్శకాల మేరకు చర్యలు చేపట్టాలని నిర్ణయించాయి. ఏపీ రెడీ.. తెలంగాణ నో.. రెండు రాష్ట్రాల వాదనలు విన్న తర్వాత తొలుత ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను పూర్తిస్థాయి (15 అవుట్లెట్లు)లో బోర్డు పరిధిలోకి తీసుకుంటామని కృష్ణాబోర్డు ఛైర్మన్ ఎంపీ సింగ్ మంగళవారం జరిగిన సమావేశంలో తీర్మానం ప్రవేశపెట్టారు. దీన్ని ఏపీ ప్రభుత్వం ఆమోదించింది. తన భూభాగంలోని ఆరు అవుట్లెట్లను బోర్డుకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీచేసేందుకు అంగీకరించింది. కానీ తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రాజెక్టుల వారీగా ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు చేసేవరకు గెజిట్ నోటిఫికేషన్‌ను అమలు చేయకూడదంటూ తెలంగాణ సర్కార్ పాత పల్లవి అందుకుంది. ఈ క్రమంలోనే తమ రాష్ట్రంలో విద్యుత్ అవసరాలు అధికంగా ఉన్నాయని, శ్రీశైలం, సాగర్ విద్యుత్ కేంద్రాలను బోర్డుకు అప్పగించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. శ్రీశైలం ఎడమగట్టు, సాగర్ విద్యుత్ కేంద్రాలను తెలంగాణ సర్కార్ బోర్డుకు అప్పగించకపోతే.. గెజిట్ నోటిఫికేషన్ అమలు వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని ఏపీ సర్కార్ స్పష్టం చేసింది. విద్యుదుత్పత్తి పేరుతో తెలంగాణ సర్కార్ అనధికారిక నీటి వినియోగాన్ని నియంత్రించినప్పుడే రెండు రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరుతుందని స్పష్టం చేసింది. పెద్దవాగుకు, కృష్ణా ప్రాజెక్టులకు లంకె ఇక పెద్దవాగు ప్రాజెక్టును గోదావరి బోర్డుకు అప్పగించేందుకు 2 రాష్ట్రాలు అంగీకరించాయి. దాన్ని గోదావరి బోర్డుకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసేందుకు ఏపీ సర్కార్ సిద్ధమైంది. కానీ తెలంగాణ సర్కార్ పెద్దవాగును అప్పగిస్తూ ఉత్తర్వులు జారీచేయడానికి వెనుకడుగు వేస్తోంది. పెద్దవాగును గోదావరి బోర్డుకు అప్పగిస్తే శ్రీశైలం, సాగర్‌లలో 9 అవుట్లెట్లను కృష్ణాబోర్డుకు అప్పగించేలా ఉత్తర్వులు జారీచేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతుందని తెలంగాణ సర్కార్ భావిస్తోంది. కేంద్రం కోర్టులో బంతి గెజిట్ నోటిఫికేషన్ అమలుకు ఏపీ సర్కార్ సహకరిస్తుండగా.. తెలంగాణ ప్రభుత్వ దాటవేత వైఖరిని రెండు బోర్డులు కేంద్ర జల్‌శక్తి శాఖ దృష్టికి తీసుకెళ్లాయి. ప్రత్యేక సమావేశాల్లో చర్చించిన అంశాలను వివరించి.. బోర్డులకు ప్రాజెక్టులను అప్పగించడంపై తెలంగాణ సర్కార్ తీరును కేంద్రానికి వివరించాయి. ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రమే. ప్రత్యేక సమావేశాల్లో తీసుకున్న నిర్ణయం మేరకు ఉమ్మడి ప్రాజెక్టులతో గెజిట్ నోటిఫికేషన్ అమలుకు ముందడుగు వేసేలా కేంద్రం ఏం చర్యలు తీసుకుంటుందన్నది చర్చనీయాంశంగా మారింది. -
గెజిట్ అమలుపై అనిశ్చితి!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ కేంద్ర జలశక్తి శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలుపై అనిశ్చితి నెలకొంది. ప్రాజెక్టుల అప్పగింత విషయంగా తెలంగాణ ముం దుకురాకపోవడం, పలు అభ్యంతరాల నేపథ్యంలో గందరగోళం నెలకొంది. గెజిట్ నోటిఫికేషన్ అమలు ఎజెండాతో ఈనెల 11, 12 తేదీల్లో నిర్వహించిన ప్రత్యేక సమావేశాల మినిట్స్ (చర్చించిన అంశాలు)ను కృష్ణా, గోదావరి బోర్డుల సభ్యకార్యదర్శులు డీఎం రాయ్‌పురే, బీపీ పాండే బుధవారం రెండు రాష్ట్రాలకు పంపారు. ఈ మినిట్స్ ప్రకారం.. ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టులను అప్పగించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. అయితే శ్రీశైలం, సాగర్ జలవిద్యుత్ కేంద్రాలను అప్పగించడంపై తెలంగాణ సర్కారు అభ్యంతరం వ్య క్తం చేసింది. ప్రాజెక్టులను బోర్డులకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసేందుకు మొగ్గుచూపలేదు. రెండు రాష్ట్రాలు కూడా ప్రాజెక్టులను అప్పగిస్తూ ఉత్తర్వులిస్తే గానీ.. వాటిని బోర్డులు తమ పరిధిలోకి తీసుకోలేవు. తెలంగాణ అభ్యంతరాల నేపథ్యంలో.. నిర్దేశించిన గడువు అయిన గురువారం (అక్టోబర్ 14న) రోజు న గెజిట్ నోటిఫికేషన్‌ను అమలు చేయలేని పరిస్థితి ఏర్పడిందని కేంద్ర జలశక్తి శాఖ దృష్టికి తీసుకెళ్లినట్టు రెండు బోర్డుల అధికారవర్గాలు తెలిపాయి. ఈ విషయంలో కేంద్రం జారీ చేసే మార్గదర్శకాల మేరకు చర్యలు చేపడతామని వెల్లడించాయి. ఏపీ రెడీ.. తెలంగాణ నో.. మంగళవారం జరిగిన సమావేశంలో ఇరురాష్ట్రాల వాదనలు విన్న కృష్ణాబోర్డు చైర్మన్ ఎంపీ సింగ్.. తొలుత ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను పూర్తిస్థాయిలో బోర్డు పరిధిలోకి తీసుకుంటామని తీర్మానం ప్రవేశపెట్టారు. దానిని ఏపీ ప్రభుత్వం ఆమోదించింది. తమ భూభాగంలోని ఆరు ఔట్లెట్లను బోర్డుకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసేందుకు అంగీకరించింది. కానీ తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. ట్రిబ్యునల్ ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేసే వరకు గెజిట్ నోటిఫికేషన్ అమలు చేయవద్దని వాదించింది. తెలంగాణకు విద్యుత్ అవసరాలు అధికంగా ఉన్నాయని.. శ్రీశైలం, సాగర్ విద్యుత్ కేంద్రాలను బోర్డుకు అప్పగించాలనడం సరికాదని పేర్కొంది. అయితే తెలంగాణ విద్యుత్ ప్లాంట్లను బోర్డుకు అప్పగించకపోతే.. గెజిట్ నోటిఫికేషన్ అమలు వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని ఏపీ సర్కారు అభిప్రాయం వ్యక్తం చేసింది. విద్యుదుత్పత్తి పేరుతో తె లంగాణ సర్కారు అనధికారికంగా నీటిని వినియోగిస్తోందని, దీనిని నియంత్రించినప్పుడే రెండు రా ష్ట్రాలకు ప్రయోజనం చేకూరుతుందని పేర్కొంది. పెద్దవాగుకు కృష్ణా ప్రాజెక్టులకు లంకె.. గోదావరి బోర్డుకు పెద్దవాగు ప్రాజెక్టును అప్పగించేందుకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసేందుకు ఏపీ సర్కారు సిద్ధమైనా.. తెలంగాణ మాత్రం వెనుకడుగు వేస్తోంది. పెద్దవాగును గోదావరి బోర్డుకు అప్పగిస్తే.. శ్రీశైలం, సాగర్‌లలో పది ఔట్లెట్లను కృష్ణాబోర్డుకు అప్పగించేలా ఉత్తర్వులు జారీ చేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతుందని భావిస్తున్నట్టు తెలిసింది. ‘గెజిట్’పై తెలంగాణ నిపుణుల కమిటీ కృష్ణా, గోదావరి బోర్డులు గెజిట్ నోటిఫికేషన్ అమలు విషయంగా ప్రతిపాదించిన అంశాలపై సమగ్ర అధ్యయనం చేయాలని తెలంగాణ నిర్ణయించింది. దీనిపై సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు.. ఈఎన్సీ మురళీధర్ నేతృత్వంలో పలువురు సీనియర్ ఇంజనీర్లతో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు నీటిపారుదల శాఖ ప్రకటించింది. కృష్ణా, గోదావరి బోర్డులు ప్రతిపాదిస్తున్న ప్రాజెక్టులు, సిబ్బంది, విద్యుత్ కేంద్రాలు, ఇతర ఔట్లెట్లను అప్పగిస్తే.. ఏర్పడే పరిణామాలు, పరిస్థితులపై సమగ్రంగా అధ్యయనం చేసి 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ముఖ్యంగా ప్రాజెక్టులను బోర్డులకు స్వాధీనం చేస్తే.. వరదల నిర్వహణ (ఫ్లడ్ మేనేజ్మెంట్), విపత్తుల నిర్వహణ (డిజాస్టర్ మేనేజ్మెంట్) ఏవిధంగా చేయాల్సి ఉంటుంది, బోర్డుకు ఉండే అధికారాలేమిటి, రాష్ట్రాలకు ఉండే అధికారాలేమిటన్న అంశాలపై పరిశీలన జరపాలని సూచించింది. ప్రాజెక్టుల అప్పగింతకు సంబంధించి అంతా అనుకూలంగా ఉందని కమిటీ పరిశీలనలో వెల్లడైతేనే.. రాష్ట్ర ప్రభుత్వం అంగీకరిస్తుందని, లేకుంటే అభ్యంతరాలను మరోసారి బోర్డులు, కేంద్రం దృష్టికి తీసుకెళుతుందని అధికారవర్గాలు తెలిపాయి. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో గెజిట్ అమలుకు తెలంగాణ ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకొనే పరిస్థితి కనిపించడం లేదని.. ఈ అనిశ్చితి మరికొంత కాలం కొనసాగే అవకాశం ఉందని పేర్కొన్నాయి. కేంద్రం కోర్టులో బంతి! గెజిట్ నోటిఫికేషన్ అమలుకు ఏపీ సర్కారు సహకరిస్తోందని, తెలంగాణ ప్రభుత్వం దాటవేత వైఖరి అవలంబిస్తోందని.. కృష్ణా, గోదావరి బోర్డులు కేంద్ర జలశక్తి శాఖకు విన్నవించాయి. ప్రత్యేక సమావేశాల్లో చర్చించిన అంశాల(మినిట్స్)ను కేంద్రానికి పంపాయి. దీంతో ఈ అంశం కేంద్రం పరిధిలోకి వెళ్లింది. గెజిట్ నోటిఫికేషన్ అమలు దిశగా కేంద్రం ఏ చర్యలు తీసుకుంటుందన్నది చర్చనీయాంశంగా మారింది. -
కుదరని ఏకాభిప్రాయం
సాక్షి, అమరావతి: గోదావరి, కృష్ణా బోర్డు పరిధిపై ఏకాభిప్రాయం కుదరలేదు. ఆదివారం జరిగిన సబ్ కమిటీల సమావేశాల్లో రెండు రాష్ట్రాల అధికారులు భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేశారు. పరిధిపై నిర్ణయాధికారాన్ని సోమవారం జరిగే గోదావరి బోర్డు ప్రత్యేక సమావేశానికి గోదావరి బోర్డు సబ్ కమిటీ అప్పగించగా.. కృష్ణా సబ్ కమిటీ సోమవారం మరోసారి సమావేశమై పరిధిని కొలిక్కి తెచ్చే యత్నం చేయాలని నిర్ణయించింది. రెండు బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ జులై 15న కేంద్ర జల్‌శక్తి శాఖ జారీచేసిన గెజిట్ నోటిఫికేషన్ ఈనెల 14 నుంచి అమల్లోకి వస్తుంది. దీని అమలు కోసం బోర్డు పరిధి, స్వరూపంపై ముసాయిదా నివేదిక ఇచ్చేందుకు రెండు బోర్డుల చైర్మన్లు సబ్ కమిటీలను ఏర్పాటుచేశారు. ఇవి ఇప్పటికే పలుమార్లు సమావేశమయ్యాయి. గోదావరి బోర్డు సమావేశం సోమవారం.. కృష్ణా బోర్డు ప్రత్యేక సమావేశం మంగళవారం జరగనున్న నేపథ్యంలో వాటి పరిధి, స్వరూపంపై ముసాయిదా నివేదిక రూపొందించేందుకు ఆదివారం సబ్ కమిటీలు మరోసారి సమావేశమయ్యాయి. గోదావరి బోర్డు పరిధి పెద్దవాగుతో మొదలు.. కన్వీనర్ బీపీ పాండే నేతృత్వంలో గోదావరి బోర్డు సబ్ కమిటీ ఆదివారం హైదరాబాద్‌లో సమావేశమైంది. అందులో తేలింది ఏమిటంటే.. ► రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు అయిన పెద్దవాగును తొలుత బోర్డు పరిధిలోకి తీసుకుని.. ఆ తర్వాత దశల వారీగా ఇతర ప్రాజెక్టులను తీసుకుంటామని బీపీ పాండే తెలిపారు. దీనిపై ఏపీ జలవనరుల శాఖ అంతర్రాష్ట్ర విభాగం సీఈ శ్రీనివాసరెడ్డి అభ్యంతరం వ్యక్తంచేశారు. కేవలం 16 వేల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించే పెద్దవాగు ప్రాజెక్టును మాత్రమే బోర్డు పరిధిలోకి తీసుకోవడంవల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. తెలంగాణలో శ్రీరాంసాగర్ నుంచి సీతమ్మసాగర్ (సీతారామ ఎత్తిపోతల్లో అంతర్భాగం) వరకూ అన్ని ప్రాజెక్టులను గోదావరి బోర్డు పరిధిలోకి తీసుకుని.. నీటి వినియోగాన్ని నియంత్రిస్తేనే దిగువనున్న పోలవరం, గోదావరి డెల్టా హక్కులను పరిరక్షించడానికి సాధ్యమవుతుందని స్పష్టంచేశారు. దాంతో పరిధిపై నిర్ణయాధికారాన్ని సోమవారం జరిగే గోదావరి బోర్డు ప్రత్యేక సమావేశానికి అప్పగించాలని సబ్ కమిటీ నిర్ణయించింది. ► బోర్డు నిర్వహణకు సీడ్ మనీ కింద రెండు రాష్ట్రాలు చెరో రూ.200 కోట్లను డిపాజిట్ చేయాలని బీపీ పాండే కోరారు. ఈ అంశంపై ప్రభుత్వాలతో చర్చించి చెబుతామని ఏపీ, తెలంగాణ సీఈలు శ్రీనివాసరెడ్డి, మోహన్‌కుమార్‌లు తెలిపారు. కృష్ణా సబ్ కమిటీకి వివరాలివ్వని తెలంగాణ.. మరోవైపు.. కన్వీనర్ ఆర్కే పిళ్లై నేతృత్వంలో కృష్ణా బోర్డు సబ్ కమిటీ ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో సమావేశమైంది. ఇందులో.. ► గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొన్న మేరకు షెడ్యూల్–2లో అన్ని ప్రాజెక్టులు, సిబ్బంది తదితర వివరాలన్నీ ఏపీ అధికారులు ఇప్పటికే సబ్ కమిటీకి అందజేశారు. కానీ.. తెలంగాణ ఇవ్వకపోవడంపై పిళ్లై అసహనం వ్యక్తంచేశారు. ► జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల స్పిల్ వేలు, వాటిపై ఉన్న విద్యుత్కేంద్రాలు, కాలువలకు నీటిని విడుదలచేసే రెగ్యులేటర్లు, ఎత్తిపోతల పథకాలను బోర్డు పరిధిలోకి తీసుకోవాలని ఏపీ అధికారులు ప్రతిపాదించారు. దీనిపై తెలంగాణ అధికారులు అభ్యంతరం వ్యక్తంచేశారు. జూరాల ఉమ్మడి ప్రాజెక్టు కాదని.. దాన్ని బోర్డు పరిధిలోకి తీసుకోకూడదని స్పష్టంచేశారు. అయితే.. సుంకేశుల బ్యారేజీ, కేసీ కెనాల్‌ను బోర్డు పరిధిలోకి ఇచ్చేదిలేదని ఏపీ అధికారులు స్పష్టంచేశారు. అలాగే, శ్రీశైలంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్కే పరిమితం కావాలని.. బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్‌ను బోర్డు పరిధిలోకి తీసుకోకూడదన్నారు. ► శ్రీశైలం ఎడమ గట్టు, సాగర్, పులిచింతల విద్యుత్కేంద్రాలను బోర్డు పరిధిలోకి తీసుకోవాలా? వద్దా? అన్నది ప్రభుత్వంతో చర్చించి చెబుతామని తెలంగాణ అధికారులు చెప్పారు. ఇలా.. రెండు రాష్ట్రాల అధికారుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తంకావడం, తెలంగాణ అధికారులు సమాచారం ఇవ్వకపోవడంతో కృష్ణా బోర్డు సబ్ కమిటీ సమావేశాన్ని సోమవారం మరోసారి నిర్వహించాలని కన్వీనర్ ఆర్కే పిళ్లై నిర్ణయించారు. ఈ సమావేశంలో పరిధి నిర్ణయాధికారాన్ని మంగళవారం జరిగే కృష్ణా బోర్డు ప్రత్యేక సమావేశానికి అప్పగించనున్నారు. -
Projects: వీడని సందిగ్ధత.. ఏవి ఎవరి పరిధిలో..?
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య వివాదాలకు చరమగీతం పాడే దిశగా వెలువ రించిన గెజిట్ నోటిఫికేషన్ అమలుకు గడువు దగ్గర పడుతున్నా.. బోర్డుల పరిధిలో ఉండే ప్రాజెక్టులపై మాత్రం సందిగ్ధత వీడటం లేదు. గెజిట్ ప్రకారం కృష్ణా బేసిన్‌లోని 36 ప్రాజెక్టులు, గోదావరి బేసిన్‌లోని 71 ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి రావాల్సి ఉండగా.. ఇన్ని ప్రాజెక్టులను తీసుకోవ డంపై రెండు తెలుగు రాష్ట్రాలు అభ్యంతరాలు లేవ నెత్తుతున్నాయి. కృష్ణా బేసిన్లో ఉమ్మడి ప్రాజెక్టు లను మాత్రమే బోర్డు పరిధిలో ఉంచాలని తెలుగు రాష్ట్రాలు కోరుతుంటే.. గోదావరిలో ఒకే ఒక్క ప్రాజెక్టును మాత్రమే బోర్డు పరిధిలో ఉంచాలని తెలంగాణ కోరుతోంది. దీంతో కేంద్రం, బోర్డులు ఎలా స్పందిస్తాయన్నది ఆసక్తిగా మారింది. ఒక్కొక్కరిది ఒక్కో వాదన కేంద్రం వెలువరించిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతంలోని తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులన్నీ అక్టోబర్ 14 నుంచి కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిలోకి వెళ్లాల్సి ఉంది. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్ సహా చిన్న, మధ్యతరహా, భారీ ప్రాజెక్టులు, వాటికి అనుబంధంగా ఉన్న విద్యుదుత్పత్తి కేంద్రాలు, సరఫరా వ్యవస్థ (ట్రాన్స్మిషన్ లైన్స్), ఆయకట్టుకు నీటిని విడుదల చేసే ప్రాంతాలు, ఎత్తిపోతల పథకాల నిర్వహణ తదితర బాధ్యతలను బోర్డులే నిర్వహిస్తాయి. ప్రాజెక్టుల నిర్వహణ విషయంపై రెండు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించే అధికారం బోర్డులకు ఉంటుంది. అయితే శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల పరిధిలోని హెడ్‌వర్క్స్ మాత్రమే బోర్డుల పరిధిలో ఉండాలని తెలంగాణ అంటోంది. శ్రీశైలంపై ఆధారపడి చేపట్టిన కల్వకుర్తి, పాలమూరు–రంగారెడ్డి, డిండి వంటి పథకాలు వద్దని అంటోంది. బనకచర్ల వద్దు ఆంధ్రప్రదేశ్ మాత్రం.. సాగర్, శ్రీశైలం, పులి చింతలతో పాటు జూరాలను కృష్ణా బోర్డు పరిధిలో ఉంచాలని కోరుతోంది. అయితే బనకచర్లను మా త్రం వద్దంటోంది. ఎందుకంటే పోతిరెడ్డిపాడు ద్వారానే నీళ్లు బనకచర్లను చేరతాయి. పోతిరెడ్డి పాడు ద్వారా జరిగే నీటి వినియోగానికి లెక్కలు ఉంటాయి కాబట్టి, బనకచర్లను చేర్చాల్సిన అవసరం లేదని వాదిస్తోంది. ఈ మేరకు తన అభి ప్రాయాలను కేంద్రానికి పంపింది. దీనిపై ఇంత వరకు బోర్డు, కేంద్రం నుంచి స్పందన రాలేదు. పెద్దవాగును ఉంచితే చాలు: తెలంగాణ గెజిట్‌లో పేర్కొన్న మేరకు పెద్దవాగు రిజర్వాయర్, పోలవరం ప్రాజెక్టు, కృష్ణా డెల్టాకు 80 టీఎంసీ తరలింపు, పోలవరం 960 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు, తోట వెంకటాచలం పుష్కర, తాడిపూడి, పట్టిసీమ, పురుషోత్తపట్నం ఎత్తిపోతలు, కాటన్ బ్యారేజీ, తొర్రిగడ్డ, చింతలపూడి, చాగల నాడు, వెంకటనగరం ఎత్తిపోతలు గోదావరి బోర్డు పరిధిలో ఉండనున్నాయి. అలాగే ఎస్సారెస్పీ స్టేజ్–1, కాళేశ్వరం, కాళేశ్వరం అదనపు టీఎంసీ, దేవాదుల, తుపాకుల గూడెం బ్యారేజీ, ముక్తేశ్వర్, సీతారామ ఎత్తిపోతలు, మాచ్‌ఖండ్ జల విద్యుత్ ప్రాజెక్టు, సీలేరు విద్యుత్ కాంప్లెక్స్‌లు కూడా బోర్డు అధీనంలో ఉండనున్నాయి. అయితే గోదావరిలో తెలుగు రాష్ట్రాల మధ్య ఉమ్మడి ప్రాజెక్టులు లేని దృష్ట్యా వీటిపై బోర్డు పెత్తనం అవసరం లేదని తెలంగాణ అంటోంది. ఒకవేళ పెట్టాల్సి వస్తే ఖమ్మం జిల్లాలో ఇరు రాష్ట్రాలకు ఉమ్మడిగా ఉన్న పెద్దవాగును మాత్రమే ఉంచాలని కోరుతోంది. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోని బోర్డు, ఈ నెల 6,7 తేదీల్లో అక్కడ పర్యటించేందుకు మాత్రం ఏర్పాట్లు చేసుకుంటోంది. -
ఏపీ, తెలంగాణల్లో నాలుగు గుర్తులకు నో
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల గుర్తులను సవరిస్తూ శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. ఎన్నికల సంఘం జాతీయ, రాష్ట్ర పార్టీలకు శాశ్వత గుర్తులు కేటాయించింది. ఎన్నికల సంఘం గుర్తింపు లేని పార్టీల కోసం కేటాయించే ఫ్రీ సింబల్స్ విషయంలో కొన్ని ఆంక్షలను విధించింది. వివిధ రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఆయా రాష్ట్రాల్లో పలు గుర్తులను ఉపయోగించకుండా ఉండేలా చర్యలు తీసుకుంటూ తాజా ఉత్తర్వులు జారీచేసింది. అందులో భాగంగా ఆటోరిక్షా, టోపీ, ఇస్త్రీపెట్టె, ట్రక్కు గుర్తులను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వినియోగించుకోకుండా ఆంక్షలు విధించింది. ఈ గుర్తులను ఏపీ, తెలంగాణ మినహా దేశంలోని ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వినియోగించుకునేందుకు అవకాశం కల్పించింది. కాగా, గతంలో జనసేనకు కేటాయించిన గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్స్ కేటగిరీలో ఉంచింది. -
10 రోజుల్లో ప్రాజెక్టుల వివరాలివ్వండి
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ బేసిన్లలోని ప్రాజెక్టుల వివరాలు, ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది వివరాలను 10 రోజుల్లోగా తమకు సమర్పించాలని రెండు బోర్డులు తెలుగు రాష్ట్రాలను మరోసారి ఆదేశించాయి. అలాగే నిర్మాణంలోని ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించిన వివరాలు, వాటి బాధ్యతలు చూస్తున్న ఏజెన్సీల జాబితా, వాటి నిర్వహణకు చేస్తున్న ఖర్చుల వివరాలను సైతం సమర్పించాలని కోరాయి. గెజిట్ నోటిఫికేషన్ల అమలుపై చర్చించేందుకు బోర్డులు ఏర్పాటు చేసిన సబ్ కమిటీలు శుక్రవారం హైదరాబాద్‌లోని జలసౌధలో వేర్వేరుగా భేటీ అయ్యాయి. ఈ భేటీలకు బోర్డుల సభ్య కార్యదర్శులు డీఎం రాయ్‌పురే, బీపీ పాండేతోపాటు తెలంగాణ తరఫున అంతర్రాష్ట్ర జల విభాగం సీఈ మోహన్‌కుమార్, ఎస్ఈ కోటేశ్వర్రావు, ఏపీ అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం సీఈ శ్రీనివాస్‌రెడ్డి హాజరయ్యారు. ప్రాజెక్టుల వివరాలను 10 రోజుల్లో ఇచ్చేందుకు తెలంగాణ అంగీకరించగా కొన్ని ప్రాజెక్టుల వివరాలపై ఏపీ అభ్యంతరం తెలిపింది. ముఖ్యంగా బనకచర్లకు సంబంధించి వివరాలు అవసరం లేదని ఏపీ ఇంజనీర్లు చెప్పినట్లు తెలిసింది. అయితే అన్ని వివరాలు సమర్పించాలని, అక్కర్లేని వాటిపై తదుపరి భేటీలో చర్చిద్దామని బోర్డు ఇంజనీర్లు చెప్పినట్లు సమాచారం. వచ్చే వారం కేంద్రం కొత్తగా నియమించిన ఇద్దరు సీఈలు విధుల్లో చేరుతున్నారని, వారికి అన్ని వివరాలు తెలియజేయాల్సి ఉందని బోర్డుల అధికారులు వివరించారు. ఏయే ప్రాజెక్టులు ఏ బోర్డు పరిధిలో ఉండాలన్న విషయం తేలాక కేంద్ర బలగాల భద్రత అంశాన్ని చర్చిద్దామని ఇరు రాష్ట్రాలు తెలిపినట్లు సమాచారం. సీడ్ మనీ అందించడంపై ప్రభుత్వ స్థాయిలో చర్చించాకే నిర్ణయం తీసుకుంటామని ఇరు రాష్ట్రాల అధికారులు తెలపగా అందుకు బోర్డులు అంగీకరించాయి. ఈ భేటీలో ప్రాజెక్టుల డీపీఆర్‌ల అంశంపై చర్చించలేదని తెలిసింది. -
ఆస్తి పన్ను మదింపు విధానాన్ని మార్చండి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఆస్తి పన్నును భూములు, భవనాల అద్దె విలువ ఆధారంగా కాకుండా.. వాటి మూలధన విలువ ఆధారంగా మదింపు చేసేందుకు వీలు కల్పిస్తూ ప్రభుత్వం గతేడాది నవంబర్ 24న జారీ చేసిన జీవో 198, అదే రోజున జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలైంది. జీవో 198తో పాటు గెజిట్ నోటిఫికేషన్‌ను రాజ్యాంగ విరుద్ధంగా, చట్ట విరుద్ధంగా ప్రకటించి, వాటిని రద్దు చేయాలని కోరుతూ స్వచ్ఛంద సంస్థ ‘అవగాహన’ కార్యదర్శి కె.శివరామిరెడ్డి, మరో ముగ్గురు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇందులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శిని ప్రతివాదులుగా పేర్కొన్నారు. పాత విధానంలోనే ఆస్తి పన్ను వసూలు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కోర్టును కోరారు. ఈ వ్యాజ్యంపై సోమవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపే అవకాశం ఉంది. -
ప్రీపెయిడ్ కరెంట్‌కు డెడ్‌లైన్!
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ పంపిణీ రంగ సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం పదునుపెట్టింది. విద్యుత్ పంపిణీ రంగ ప్రైవేటీకరణే లక్ష్యంగా విద్యుత్ చట్ట సవరణ ముసాయిదా బిల్లును ప్రకటించిన కేంద్రం.. బిల్లు ఆమోదానికి ముందే అందులోని లక్ష్యాల సాధన దిశగా చర్యలను వేగిరం చేసింది. విద్యుత్ వినియోగదారులకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల ఏర్పాటు విషయంలో రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు గడువులను నిర్దేశిస్తూ కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ తాజాగా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. కమ్యూనికేషన్ నెట్వర్క్ లభ్యత ఉన్న ప్రాంతాల్లో వ్యవసాయం మినహా ఇతర అన్ని కేటగిరీల వినియోగదారులకు అంతర్జాతీయ ప్రమాణాల(ఐఎస్–16444) మేరకు కింద పేర్కొన్న గడువుల్లోగా ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ►అన్ని కేంద్రపాలిత ప్రాంతాలు, 50 శాతానికి మించి పట్టణ ప్రాంత వినియోగదారులను కలిగి ఉండి 2019–20లో 15 శాతానికి మించిన సాంకేతిక, వాణిజ్యపర(ఏటీఅండ్‌సీ) నష్టాలున్న విద్యుత్ డివిజన్లలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులకు.. 2023, డిసెంబర్ నాటికి ప్రీపెయిడ్ పద్ధతిలో విద్యుత్ సరఫరా చేయాలి. 2019–20లో 25 శాతానికి మించిన ఏటీఅండ్‌సీ నష్టాలు కలిగిన ఇతర విద్యుత్ డివిజన్లు, మండల(బ్లాక్), ఆపై స్థాయిల్లో కూడా ఇదే గడువులోపు అందరికీ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగించాలి. ఒక్కోసారి ఆరు నెలలకు మించకుండా నోటిఫికేషన్ ద్వారా రెండు పర్యాయాలు ఈ గడువు పొడిగించడానికి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ)కి అవకాశం కల్పించింది. అయితే దీనికి సరైన కారణాలు చూపాలి. ►ఇతర అన్ని ప్రాంతాల్లో 2025 మార్చి నాటికి ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగించడంతో పాటు ప్రీపెయిడ్ పద్ధతిలోనే విద్యుత్ సరఫరా చేయాలి. ►అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల సామర్థ్యానికి మించి అధిక మోతాదులో విద్యుత్ వినియోగించే వినియోగదారులకు ఆటోమేటిక్ మీటర్ రీడింగ్(ఏఎంఆర్) సదుపాయం గల స్మార్ట్ మీటర్లను బిగించాలి. ►అన్ని ఫీడర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల(డీటీ)కు ఈ కింద పేర్కొన్న గడువుల్లోగా ఏఎంఆర్/ఏఎంఐ సదుపాయం ఉన్న మీటర్లను ఏర్పాటు చేయాలి. ►2022, డిసెంబర్‌లోగా అన్ని ఫీడర్లకు మీటర్లు బిగించాలి. ►50 శాతానికి మించి పట్టణ వినియోగదారులు కలిగి ఉండి... 2019–20లో 15 శాతానికి మించిన ఏటీఅండ్‌సీ నష్టాలు కలిగిన అన్ని డివిజన్ల పరిధిలోని అన్ని డీటీలకు, 2019–20లో 25శాతానికి మించిన ఏటీఅండ్‌సీ నష్టాలు కలిగిన అన్ని డివిజన్ల పరిధిలోని డీటీలకు డిసెంబర్ 2023లోగా మీటర్లు బిగించాలి. ►ఇతర అన్ని డివిజన్లలోని డీటీలకు 2025 మార్చిలోగా మీటర్లు ఏర్పాటు చేయాలి. ►25కేవీఏ కన్నా తక్కువ సామర్థ్యం గల డీటీలు, హెచ్‌వీడీఎస్‌లకు పైన పేర్కొన్న గడువుల నుంచి మినహాయింపు. -
నేడు కృష్ణా బోర్డు 14వ సర్వసభ్య సమావేశం
-
నేడు కృష్ణా బోర్డు 14వ సర్వసభ్య సమావేశం
సాక్షి, అమరావతి: ప్రస్తుత నీటి సంవత్సరంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకం, విద్యుదుత్పత్తి, బోర్డు పరిధిని ఖరారుచేస్తూ జూలై 15న కేంద్ర జల్‌శక్తి శాఖ జారీచేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలు తదితర పది అంశాలు అజెండాగా బుధవారం కృష్ణాబోర్డు సమావేశమవుతోంది. కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను పరిరక్షించుకోవడమే లక్ష్యంగా బలమైన వాదనలు విన్పించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. తెలంగాణ సర్కార్ దుందుడుకు వైఖరిని బోర్డు సమావేశం వేదికగా మరోసారి ఎండగట్టాలని నిర్ణయించింది. కృష్ణా బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్ అధ్యక్షతన హైదరాబాద్‌లో బుధవారం 14వ సర్వసభ్య సమావేశం జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున జలవనరుల శాఖ కార్యదర్శి జె. శ్యామలరావు, ఈఎన్సీ సి. నారాయణరెడ్డి.. తెలంగాణ సర్కార్ తరఫున నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్, ఈఎన్సీ మురళీధర్ తదితరులు సమావేశంలో పాల్గొననున్నారు. పరిధిలోలేని అంశంపై చర్చకు కళ్లెం? ఉమ్మడి రాష్ట్రానికి ప్రాజెక్టుల వారీగా బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీల్లో ఏపీకి 512.04, తెలంగాణకు 298.96 టీఎంసీల చొప్పున పంపిణీ చేస్తూ 2015, జూన్ 18–19 తేదీల్లో కేంద్ర జల్‌శక్తి శాఖ తాత్కాలిక సర్దుబాటు చేసింది. ఈ ఒప్పందంపై రెండు రాష్ట్రాలు సంతకాలు చేశాయి. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి వచ్చేవరకూ రెండు రాష్ట్రాలు ఇదే పద్ధతిలో కృష్ణా జలాలను వినియోగించుకోవాలని 2020, అక్టోబర్ 6న జరిగిన అపెక్స్ కౌన్సిల్ భేటీలో కేంద్ర జల్‌శక్తి శాఖ స్పష్టంచేసింది. కానీ, ఈ నీటి సంవత్సరంలో కృష్ణా జలాలను రెండు రాష్ట్రాలకు చెరి సగం పంపిణీ చేయాలని తెలంగాణ సర్కార్ కృష్ణా బోర్డుకు ప్రతిపాదించింది. దీన్ని ఏపీ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. నదీ జలాల పంపిణీ అధికారం కేవలం ట్రిబ్యునళ్లకు మాత్రమే ఉందని.. పరిధిలోకి రాని ఈ అంశంపై చర్చించేందుకు ఆస్కారం ఇవ్వకూడదని బోర్డుకు ఇప్పటికే తేల్చిచెప్పింది. చిన్న నీటివనరుల విభాగంలో తెలంగాణకు 89.15 టీఎంసీల కేటాయింపు ఉంటే.. 175 టీఎంసీలు వాడుకుంటున్న నేపథ్యంలో ఏపీ వాటాను 79.88 టీఎంసీలకు పెంచాలని డిమాండ్ చేసింది. ఇదే అంశాన్ని బోర్డు సమావేశంలో తెగేసి చెప్పాలని నిర్ణయించింది. విద్యుదుత్పత్తితో రెండు రాష్ట్రాలకూ నష్టమే.. శ్రీశైలం, సాగర్, పులిచింతల ప్రాజెక్టుల దిగువన సాగు, తాగునీటి అవసరాలు ఉన్నప్పుడే విద్యుదుత్పత్తి చేస్తూ నీటిని విడుదల చేయాలి. కానీ.. దిగువన నీటి అవసరాలు లేకున్నా తెలంగాణ సర్కార్ ఏకపక్షంగా శ్రీశైలం, సాగర్, పులిచింతల్లో విద్యుదుత్పత్తి చేస్తూ తమ హక్కులను కాలరాస్తోందని కృష్ణా బోర్డుకు ఏపీ ప్రభుత్వం అనేకసార్లు ఫిర్యాదు చేసింది. ఈ విషయంలో తెలంగాణ సర్కార్‌ను కట్టడి చేయాలని కోరింది. అంతేకాక.. ప్రధాని మోదీ, కేంద్ర జల్‌శక్తి శాఖల దృష్టికీ ఈ అంశాన్ని తీసుకెళ్లి.. రాష్ట్ర హక్కులను పరిరక్షించాలని విజ్ఞప్తి చేసింది. అయినా.. తెలంగాణ సర్కార్ తీరు మారకపోవడంతో రాష్ట్ర హక్కులను పరిరక్షించుకోవడానికి సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తోంది. ఈ ఏడాది ఇప్పటికే ప్రకాశం బ్యారేజీ నుంచి 185.78 టీఎంసీలు సముద్రం పాలయ్యాయి. దీని ఫలితంగా శ్రీశైలంలో నీటినిల్వ 158.63 టీఎంసీలకు తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో.. తెలంగాణ వైఖరితో రెండు రాష్ట్రాలకూ నష్టం వాటిల్లుతుందనే అంశాన్ని బోర్డు సమావేశంలో మరోసారి ఎలుగెత్తాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఉత్పత్తయ్యే విద్యుత్‌లో ఏపీకి 66, తెలంగాణకు 34 శాతం పంపిణీ చేయాలని డిమాండ్ చేయనుంది. సీడబ్ల్యూసీ ప్రతిపాదన మేరకే.. ఒక నీటి సంవత్సరంలో వినియోగించుకోని వాటా నీళ్లను మరుసటి ఏడాది వాడుకోవడానికి అనుమతివ్వాలన్న తెలంగాణ సర్కార్ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తోసిపుచ్చింది. వాటిని క్యారీ ఓవర్‌గానే పరిగణించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనతో సీడబ్ల్యూసీ ఏకీభవించింది. క్యారీ ఓవర్ జలాలపై రెండు రాష్ట్రాలకు హక్కు ఉంటుందని.. వాటిని ఏకాభిప్రాయంతో పంచుకోవడం లేదంటే బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌లో తేల్చుకోవాలని సీడబ్ల్యూసీ స్పష్టంచేసింది. ఆ మేరకే క్యారీ ఓవర్ జలాలను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి డిమాండ్ చేయనుంది. శ్రీశైలం, సాగర్, పులిచింతల గేట్లు ఎత్తేసి.. ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలోకి వృథాగా వరద జలాలు కలుస్తున్నప్పుడు రెండు రాష్ట్రాల్లో ఎవరు ఆ నీటిని వాడుకున్నా వాటిని కోటా కింద పరిగణించకూడదని మరోసారి ఏపీ ప్రతిపాదించనుంది. తేల్చాల్సింది బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునలే.. కృషాడెల్టాకు మళ్లించే 80 టీఎంసీల గోదావరి జలాలకుగానూ సాగర్‌కు ఎగువన కృష్ణా జలాల్లో అదనంగా 45 టీఎంసీలను వాడుకోవడానికి ఉమ్మడి రాష్ట్రానికి గోదావరి ట్రిబ్యునల్ అనుమతిచ్చింది. వాటిని తమకే కేటాయించాలంటున్న తెలంగాణ వాదనను ఏపీ తోసిపుచ్చింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆ జలాలు రెండు రాష్ట్రాలకు దక్కుతాయని.. ఈ అంశాన్ని తేల్చాల్సింది బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునలేగానీ బోర్డుకాదని తెగేసి చెప్పనుంది. ఇక కృష్ణా బేసిన్‌కు తెలంగాణ సర్కార్ మళ్లిస్తున్న 211 టీఎంసీల గోదావరి జలాలకుగానూ కృష్ణా జలాల్లో అదనపు వాటా కేటాయించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేయాలని నిర్ణయించింది. నేడు గోదావరి బోర్డు భేటీ గోదావరి బోర్డు పరిధిని ఖరారుచేస్తూ జూలై 15న కేంద్ర జల్‌శక్తి శాఖ జారీచేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలే ప్రధాన అజెండాగా బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లో బోర్డు సమావేశమవుతోంది. బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున జలవనరుల శాఖ కార్యదర్శి జె. శ్యామలరావు, ఈఎన్సీ సి. నారాయణరెడ్డి, తెలంగాణ సర్కార్ తరఫున ఆ రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్, ఈఎన్సీ మురళీధర్‌లు పాల్గొననున్నారు. గత నెల 3న జరిగిన సమన్వయ కమిటీ, 9న జరిగిన ఉమ్మడి బోర్డుల సమావేశాలకు తెలంగాణ సర్కార్ ప్రతినిధులు గైర్హాజరైన నేపథ్యంలో ఈ భేటీకి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. -
‘పాలమూరు’ రుణాలపై తర్జనభర్జన
సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తి పోతల పథకం పనుల పూర్తికి నిధుల కొరత వెంటాడుతోంది. కేంద్రం ఇటీవల విడుదల చేసిన కృష్ణా బోర్డు గెజిట్ నోటిఫికేషన్లో ‘పాలమూరు’ను అనుమతిలేని ప్రాజెక్టుగా పేర్కొనడంతో నిధుల విడుదలపై రుణ సంస్థలు, రుణాల సాధనకు ఇరిగేషన్ శాఖ తర్జనభర్జన పడుతున్నాయి. దీనిపై ఇప్పటికే పలుమార్లు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ) తో చర్చలు జరిపిన ఇరిగేషన్ శాఖ... నిధుల విడుదలకు ఆటంకాలు లేకుండా చూడాలని కోరగా దీని పై స్పష్టత వస్తే తప్ప ముందుకెళ్లలేమని పీఎఫ్సీ తేల్చిచెబుతుండటంతో సందిగ్ధత కొనసాగుతోంది. మరో రూ. 2,183 కోట్లు బ్యాలెన్స్.. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును రూ. 32,200 కోట్ల అంచనా వ్యయంతో 2016–17లో చేపట్టగా ప్రస్తుతం దీని అంచనా వ్యయం రూ. 50 వేల కోట్లకు చేరుతోంది. భారీ నిధుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ ఏడాది డిసెంబర్ నాటికి ప్రాజెక్టులోని నార్లాపూర్ నుంచి కనీసం ఒక టీఎంసీని ఉద్ధండాపూర్ రిజర్వాయర్ వరకు తరలించేలా ప్రభుత్వం ప్రణాళిక రచించింది. దీనికైనా రూ. 30 వేల కోట్ల మేర నిధుల అవసరాలున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా పాలమూరు–రంగారెడ్డికి సైతం రూ. 6,160.46 కోట్ల రుణాలను పీఎఫ్సీ నుంచే తీసుకొనేలా ఒప్పందాలు చేసుకుంది. ఇందులో ఇప్పటికే రూ. 3,976.98 కోట్ల మేర రుణాలను పీఎఫ్సీ విడుదల చేసింది. మరో రూ. 2,183.48 కోట్లు విడుదల చేయాల్సి ఉండగా కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ నేపథ్యంలో రుణాల విడుదలను పీఎఫ్సీ నిలిపివేసింది. అన్ని అనుమతులున్నాయంటూ రాష్ట్రం లేఖ.. రుణాల విడుదల కోరుతూ తెలంగాణ ప్రభు త్వం పీఎఫ్సీకి రెండ్రోజుల కిందట లేఖ రాసిన ట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇందులో ప్రాజె క్టు పనులను ప్రస్తుతానికి తాగునీటి అవసరాలు తీర్చేలాగానే చేపడుతున్నామని, ఇందుకు అను మతులు అవసరం లేదని చెప్పినట్లు సమాచా రం. గతంలో జాతీయ హరిత ట్రిబ్యునల్ సైతం తాగునీటి వరకు పనులు చేపట్టుకోవచ్చని, పర్యావరణ అనుమతులు వచ్చాకే సాగునీటి పనులు చేపట్టాలని పేర్కొన్న విషయాన్ని పీఎఫ్సీ దృష్టికి తీసుకెళ్లింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లోగా ప్రాజెక్టు కు పర్యావరణ అనుమతులు సాధించే దిశగా చర్యలు మొదలుపెట్టామని, ఆ తర్వాతే సాగు నీటి కాల్వల నిర్మాణ పనులు చేపడతామని వివరించింది. ఈ దృష్ట్యా తాగునీటిని సరఫరా చేసే లా చేపట్టిన ఎలక్ట్రో మెకానికల్, పంపులు, మో టార్ల పనుల కొనసాగింపునకు వీలుగా రుణా లను విడుదల చేయాలని కోరినట్లు తెలిసింది. -
ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల బిగింపునకు గడువు
సాక్షి, న్యూఢిల్లీ: వ్యవసాయేతర విద్యుత్తు వినియోగదారులకు ప్రీపెయిడ్ సౌకర్యం ఉండే స్మార్ట్ మీటర్ల ద్వారా మాత్రమే విద్యుత్తు సరఫరా చేయాల్సి ఉంటుందని పేర్కొంటూ ఆయా మీటర్ల బిగింపునకు నిర్దిష్ట కాల వ్యవధిని నోటిఫై చేస్తూ కేంద్ర విద్యుత్తు శాఖ గురువారం గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. 2023 డిసెంబర్ నాటికి గడువు ఉన్న కేటగిరీలు ► 50 శాతం కంటే ఎక్కువగా వినియోగదారులు పట్టణ ప్రాంతాల్లో ఉండి, 2019–20 ఆర్థిక సంవత్సరంలో మొత్తం సాంకేతిక, వాణిజ్య నష్టాలు (ఏటీఅండ్‌సీ) 15 శాతానికంటే మించిన ఎలక్ట్రిక్ డివిజన్లలో పాత మీటర్లలో స్థానంలో కొత్తగా ప్రీపెయిడ్ సౌకర్యం ఉన్న స్మార్ట్ మీటర్లు అమర్చాలి. ► అలాగే 2019–20 ఆర్థిక సంవత్సరంలో మొత్తం సాంకేతిక, వాణిజ్య నష్టాలు 25 శాతం మించిన ఎలక్ట్రికల్ డివిజన్లలో కూడా స్మార్ట్ మీటర్లు అమర్చాలి. ► బ్లాక్ స్థాయి, ఆపైస్థాయి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఈ స్మార్ట్ మీటర్లు అమర్చాలి. ► పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులందరికీ స్మార్ట్ మీటర్లు అమర్చాలి. ► స్టేట్ రెగ్యులేటరీ కమిషన్ తగిన కారణాలు చూపి ఈ కాలవ్యవధిని రెండుసార్లు మాత్రమే పొడిగించవచ్చు. ఒక్కో విడత ఆరు నెలల కంటే ఎక్కువగా పొడిగింపు ఉండరాదు. ► ఇతర అన్ని ప్రాంతాల్లో స్మార్ట్ మీటర్లను 2025 మార్చి వరకు అమర్చాలి. ఫీడర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లకు ► అన్ని ఫీడర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లకు ఆటోమేటిక్ మీటర్ రీడింగ్ సౌకర్యం ఉన్న మీటర్లుగానీ, అడ్వాన్స్డ్ మీటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వసతి ఉన్న మీటర్లు గానీ అమర్చుతారు. 2022 డిసెంబర్ నాటికి ఈ మీటర్లను అమర్చాలి. ► 50 శాతం కంటే ఎక్కువగా వినియోగదారులు పట్టణ ప్రాంతాల్లో ఉండి, 2019–20 ఆర్థిక సంవత్సరంలో మొత్తం సాంకేతిక, వాణిజ్య నష్టాలు(ఏటీఅండ్‌సీ) 15 శాతాని కంటే మించిన ఎలక్ట్రిక్ డివిజన్లలోని డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లకు, 25 శాతానికి మించి నష్టాలు ఉన్న ఇతర అన్ని ఎలక్ట్రికల్ డివిజన్లలో పాత మీటర్లలో స్థానంలో డిసెంబర్ 2023 నాటికి కొత్తగా మీటర్లు అమర్చాలి. ఇతర ప్రాంతాల్లో 2025 మార్చి నాటికి మీటర్లు అమర్చాలి. -
కేంద్ర గెజిట్ నోటిఫికేషన్‌పైనే ప్రధాన చర్చ
సాక్షి, అమరావతి: కృష్ణా బోర్డు పరిధిని ఖరారు చేస్తూ కేంద్రం గత నెల 15వ తేదీన జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలుపైనే బోర్డు సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ నెల 27న కృష్ణా బోర్డు సమావేశాన్ని నిర్వహించనున్నట్లు సోమవారం ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే లేఖ రాశారు. సమావేశంలో కృష్ణా జలాలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయడం, క్యారీ ఓవర్, వరద జలాల వినియోగం, కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలు తదితర పది అంశాలపై చర్చించనున్నట్లు తెలిసింది. ఉమ్మడి రాష్ట్రానికి బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీల్లో ఆంధ్రప్రదేశ్‌కు 512, తెలంగాణకు 299 టీఎంసీలను పంపిణీ చేస్తూ జూన్ 19, 2015న కేంద్రం తాత్కాలిక సర్దుబాటు చేసింది. దీని ప్రకారమే నాటి నుంచి 2020–21 వరకూ రెండు రాష్ట్రాలకు బోర్డు కృష్ణా జలాలను పంపిణీ చేస్తోంది. అయితే ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన కృష్ణా జలాలను రెండు రాష్ట్రాలకు చెరి సగం పంపిణీ చేయాలని ఇటీవల తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ కృష్ణా బోర్డుకు లేఖ రాశారు. నాడు కేంద్రం నిర్ణయానికి ఒప్పుకుని ఇప్పుడు ఇలా చేయడాన్ని ఏపీ ప్రభుత్వం తప్పుపడుతోంది. అంతర్రాష్ట్ర నదీ జలవివాదాల చట్టం–1956లో సెక్షన్–6(2) ప్రకారం.. బచావత్ ట్రిబ్యునల్ తీర్పును పునఃసమీక్షించడం చట్టవిరుద్ధమని పేర్కొంటోంది. ఈ అంశంపై బోర్డు సమావేశంలో చర్చించాలని నిర్ణయించింది. బోర్డు సంస్థాగత నిర్మాణంపై కసరత్తు కృష్ణా బోర్డు పరిధిని ఖరారు చేస్తూ కేంద్రం గత నెల 15న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలుకు నిర్వహించిన సమావేశాలకు తెలంగాణ సర్కార్ డుమ్మా కొట్టింది. ఏపీ ప్రభుత్వం తన ప్రతినిధులను పంపి.. గెజిట్ నోటిఫికేషన్ అమలుకు సహకరిస్తామని పేర్కొంది. తెలంగాణ గైర్హాజరైన నేపథ్యంలో బోర్డు పరిధి, స్వరూపం ఖరారు ప్రక్రియ అసంపూర్తిగా ఉంది. ఈ నేపథ్యంలో గెజిట్ నోటిఫికేషన్ అమలుపై బోర్డు సమావేశంలో ప్రధానంగా చర్చించాలని కృష్ణా బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్ నిర్ణయించారు. కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అక్టోబర్ 14 నుంచి అమల్లోకి వస్తున్న నేపథ్యంలో ఈలోగా బోర్డు సంస్థాగత నిర్మాణాన్ని ఖరారు చేయాలని కృష్ణా బోర్డు నిర్ణయించింది. నోటిఫికేషన్లో పేర్కొన్న మేరకు షెడ్యూల్–2లోని ప్రాజెక్టులను బోర్డు తన అధీనంలోకి తీసుకుని నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో ఏపీ, తెలంగాణల్లోని 12 ప్రాజెక్టులు, వాటిలోని 66 విభాగాలను బోర్డు తన అధీనంలోకి తీసుకుని, నిర్వహించడంపై దృష్టి పెట్టింది. గెజిట్ నోటిఫికేషన్ వెలువడే నాటికి ఈ ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, అవుట్‌సోరి్సంగ్ ఉద్యోగుల వివరాలను తక్షణమే అందజేయాలని బోర్డు ఇరు రాష్ట్రాలకు సోమవారం లేఖ రాసింది. ఈ ప్రాజెక్టులను నిర్వహిస్తోన్న సంస్థల వివరాలను అందజేయాలని కోరింది. రెండు రాష్ట్రాలు ఇచ్చే వివరాల ఆధారంగా సంస్థాగత నిర్మాణాన్ని బోర్డు ఖరారు చేయనుంది. ఏపీ వాదనకే సీడబ్ల్యూసీ మద్దతు ఒక నీటి సంవత్సరంలో వాడుకోని కోటా జలాలను ఆ తర్వాత నీటి సంవత్సరంలో వాడుకోవడానికి అవకాశం ఇవ్వాలని తెలంగాణ చేస్తున్న వాదనను ఏపీ సర్కార్ కొట్టిపారేస్తోంది. వాటిని క్యారీ ఓవర్ జలాలుగానే పరిగణించాలని.. వాటిపై రెండు రాష్ట్రాలకు హక్కు ఉంటుందని స్పష్టం చేసింది. కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) సైతం ఏపీ వాదననే బలపరిచింది. బోర్డు సమావేశంలో చర్చించి.. ఏకాభిప్రాయంతో క్యారీ ఓవర్ జలాలను రెండు రాష్ట్రాలు పంచుకోవాలని సూచించింది. జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల గేట్లు ఎత్తేసి.. ప్రకాశం బ్యారేజీ నుంచి వరద జలాలు సముద్రంలో కలుస్తున్న సమయంలో రెండు రాష్ట్రాలు ఎవరు ఎన్ని నీళ్లు మళ్లించుకున్నా.. వాటిని పరిగణనలోకి తీసుకోకూడదని ఏపీ సర్కార్ కోరుతోంది. కానీ.. దీన్ని తెలంగాణ సర్కార్ వ్యతిరేకిస్తోంది. ఈ అంశాన్ని కూడా బోర్డు అజెండాలో చేర్చింది. అలాగే కృష్ణా బేసిన్‌కు మళ్లించే గోదావరి జలాలకుగానూ.. కృష్ణా జలాల్లో అదనంగా వాటా కేటాయింపు అంశం కూడా అజెండాలో ఉంది. నిబంధనలకు విరుద్ధంగా విద్యుదుత్పత్తి చేయడం, బోర్డుకు నిధులు మంజూరు, ఖాళీలను భర్తీ చేయడంపై కూడా సమావేశంలో చర్చించనుంది. -
అక్టోబర్ 14 నుంచి గెజిట్ అమలుకు సహకరిస్తాం: శ్యామలరావు
సాక్షి, హైదరాబాద్: జలసౌధలో సోమవారం కృష్ణా, గోదావరి బోర్డుల సంయుక్త సమావేశం జరిగింది. కేంద్రం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్‌లోని అంశాల అమలుపై చర్చించారు. ఈ సమావేశానికి ఏపీ ఇరిగేషన్ అధికారులు హాజరు కాగా.. తెలంగాణ అధికారులు మరోసారి గైర్హాజరయ్యారు. జలసౌధలో నిర్వహించిన సమావేశంలో ఏపీ అధికారులు తమ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ఏపీ ఇరిగేషన్ కార్యదర్శి శ్యామలరావు మాట్లాడుతూ.. ‘‘నోటిఫికేషన్‌ను స్వాగతిస్తున్నాం. కేఆర్ఎమ్బీ, జీఆర్ఎమ్బీ బోర్డు సమావేశంలో అధికారుల నియామకం.. సదుపాయాల కల్పనపై చర్చించాం. కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన గెజిట్‌లో మార్పులు కోరుతున్నాం. షెడ్యూల్ 1,2,3లో మార్పులు చేయాలని కోరుతున్నాం..అక్టోబర్ 14 నుంచి గెజిట్ అమలుకు సహకరిస్తాం’’ అన్నారు. -
గెజిట్ నోటిఫికేషన్ అమలే అజెండా
సాక్షి, అమరావతి: కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ గత నెల 15న కేంద్ర జల్ శక్తి శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలే అజెండాగా సోమవారం సంయుక్తంగా సమావేశం నిర్వహించేందుకు రెండు బోర్డులు సిద్ధమయ్యాయి. పరిధిలో కొన్ని అంశాలపై అభ్యంతరాలను ప్రస్తావించడంతోపాటు ఏపీకి న్యాయబద్ధంగా దక్కాల్సిన నీటి కోటా కోసం బోర్డుల సమావేశంలో బలమైన వాదనలు వినిపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమావేశానికి హాజరు కాలేమని తెలంగాణ సర్కార్ తొలుత లేఖ పంపగా.. గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన 30 రోజుల్లోగా బోర్డుల స్వరూపాన్ని ఖరారు చేయాలని, సమయం తక్కువగా ఉన్నందున తప్పనిసరిగా హాజరు కావాలని బోర్డులు తేల్చి చెప్పాయి. సోమవారం ఎన్జీటీలో కేసుల విచారణకు హాజరు కావాల్సి ఉన్నందున సమావేశాన్ని మరో రోజుకు వాయిదా వేయాలని రెండు బోర్డులకు తెలంగాణ సర్కార్ ఆదివారం మరోసారి వేర్వేరుగా లేఖలు రాసింది. అయితే దీన్ని పరిగణనలోకి తీసుకోని బోర్డులు సోమవారం సమావేశాన్ని యథాతథంగా నిర్వహించాలని నిర్ణయించాయి. అక్టోబర్ 14 నుంచి అమల్లోకి గెజిట్ నోటిఫికేషన్ బోర్డుల సమన్వయ కమిటీ సమావేశానికి ఈనెల 3న తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు గైర్హాజరయ్యారు. అయినప్పటికీ ఆ సమావేశాన్ని బోర్డులు యథాతథంగా నిర్వహించాయి. పూర్తి స్థాయి బోర్డుల సమావేశాన్ని నిర్వహించిన తర్వాతే సమన్వయ కమిటీల భేటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ సర్కార్ ఆ భేటీకి గైర్హాజరైంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఈఎన్సీ సి.నారాయణరెడ్డి నేతృత్వంలోని అధికారుల బృందం సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొని బోర్డుల పరిధిపై కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని, వాటిని కేంద్ర జల్ శక్తి శాఖ దృష్టికి తీసుకెళ్తామని తెలిపింది. జల్ శక్తి శాఖ స్పందన ఆధారంగా మిగిలిన అంశాలపై ముందుకెళ్తామని స్పష్టం చేశారు. తెలంగాణ సర్కార్ హాజరు కాకపోవడంతో సమన్వయ కమిటీ సమావేశం అసంపూర్తిగా ముగిసింది. అక్టోబర్ 14 నుంచి గెజిట్ నోటిఫికేషన్ అమల్లోకి వస్తుందని కేంద్రం పేర్కొంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ ప్రతిపాదించిన మేరకు పూర్తి స్థాయి బోర్డుల సమావేశాన్ని నిర్వహించాలని కృష్ణా, గోదావరి బోర్డుల ఛైర్మన్లు ఎంపీ సింగ్, చంద్రశేఖర్ అయ్యర్లు నిర్ణయించారు. ఆ మేరకు సోమవారం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కానీ దీనికి సైతం గైర్హాజరు కావాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించడం గమనార్హం. -
కృష్ణా, గోదావరి బోర్డుల దూకుడు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి బోర్డులు గెజిట్ నోటిఫికేషన్ అమలు విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. గత నెల 29న సమన్వయ కమిటీని ఏర్పాటు చేసిన గోదావరి బోర్డు కమిటీ భేటీని మంగళవారం నిర్వహించనున్నట్లు 30న రెండు తెలుగు రాష్ట్రాలకు లేఖ రాసింది. అయితే దీనిపై సోమవారం తెలంగాణ ప్రభుత్వం స్పందిస్తూ ప్రాజెక్టులను గోదావరి బోర్డు పరిధిలోకి తీసుకెళ్తే రాష్ట్రాలకు తీవ్ర దుష్పరిణామాలు ఉంటాయని, అందుకే వీటిని పూర్తిస్థాయి బోర్డు భేటీలో చర్చించాల్సి ఉందని పేర్కొంది. బోర్డు భేటీలో అభిప్రాయాలు, మార్గదర్శకాలు తెలుసుకోకుండా నేరుగా సమన్వయ కమిటీ భేటీలో గెజిట్‌పై చర్చించడం సాధ్యం కాదని తెలిపింది. అయితే దీనిపై గోదావరి బోర్డు వెంటనే స్పందించి గత నెల 28న కేంద్ర జల శక్తి శాఖ జాయింట్ సెక్రటరీ సంజయ్ అవస్థీ రాసిన లేఖను ప్రస్తావిస్తూ తెలంగాణకు లేఖ రాసింది. ‘గెజిట్ నోటిఫికేషన్ అమలుకు ఒక నిర్ధిష్ట సమయాన్ని పేర్కొన్నాం. దీనికి అనుగుణంగా అవసరమైన సమగ్ర కార్యాచరణ ప్రణాళిక, తగిన సమాచారం ఆగస్టు 2లోగా మాకు ఇవ్వాలి’ అని కేంద్రం రాసిన లేఖను బోర్డు తన లేఖలో ప్రస్తావించింది. ఈ నేపథ్యంలోనే సమన్వయ కమిటీ భేటీని అత్యవసరంగా నిర్వహిస్తున్నామని వెల్లడించింది. కృష్ణా బోర్డు సైతం... గోదావరి బోర్డు మాదిరిగానే కృష్ణా బోర్డు సైతం 12 మంది సభ్యులతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తూ సోమవారమే లేఖ రాసింది. ఆ వెంటనే గోదావరి బోర్డు కమిటీతోపాటే ఉమ్మడి కృష్ణా బోర్డు ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీ భేటీ ఉంటుందని సాయంత్రానికి మరో లేఖ రాసింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం పదకొండున్నర గంటలకు హైదరాబాద్ జలసౌధలో ఉమ్మడి భేటీ జరగనుంది. అనుమతుల్లేని ప్రాజెక్టులు, బోర్డులకు ఇవ్వాల్సిన నిధులు, సీఐఎస్ఎఫ్ భద్రత, విద్యుదుత్పత్తి విషయమై గెజిట్‌లో పేర్కొన్నట్లుగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. అయితే భేటీకి తెలంగాణ ఇంజనీర్లు హాజరవుతారా? అన్నది మంగళవారం ఉదయానికే స్పష్టత రానుంది. ఏపీ ఇంజనీర్లు మాత్రం హాజరవుతారని చెబుతున్నారు. -
ప్రతిపక్ష పార్టీలు అనవసర రాద్ధాంతం ఆపాలి : సీ.రామచంద్రయ్య
-
ఇద్దరి హక్కులకూ భద్రత
సాక్షి, అమరావతి: కృష్ణా, గోదావరి జలాలపై రెండు రాష్ట్రాల హక్కులను పరిరక్షించేలా బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ కేంద్ర జల్ శక్తి శాఖ నోటిఫికేషన్ జారీ చేయడాన్ని స్వాగతిస్తూనే అందులో కొన్ని అంశాలపై సవరణలను ప్రతిపాదించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన జలాల్లో ఆంధ్రప్రదేశ్‌కు దక్కిన 512, తెలంగాణకు దక్కిన 299 టీఎంసీలను పంపిణీ చేయడంపైనే కృష్ణా బోర్డు ప్రధానంగా దృష్టి కేంద్రీకరించేలా చూడాలని విజ్ఞప్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. కృష్ణా డెల్టా, నాగార్జునసాగర్ కుడి, ఎడమ కాలువ ఆయకట్టుకు గోదావరి వరద జలాలను మళ్లించగా.. అక్కడ మిగిలే కృష్ణా నీటిని తీవ్ర దుర్భిక్ష ప్రాంతాలైన రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు మళ్లించుకునే స్వేచ్ఛ కల్పించడం ద్వారా ఆ ప్రాంతాల సాగు, తాగునీటి ఇబ్బందులను అధిగమించడానికి మార్గం సుగమం చేయాలని కేంద్రాన్ని కోరాలని భావిస్తోంది. విభజన చట్టం 11వ షెడ్యూల్లో అప్పటికే నిర్మాణంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగుగంగ, గాలేరు–నగరి, వెలిగొండ, హంద్రీ–నీవా, తెలంగాణలోని నెట్టెంపాడు (22 టీఎంసీలు), కల్వకుర్తి (25 టీఎంసీలు) కేంద్రం అనుమతి ఇచ్చిందని.. ఇప్పుడు వాటికి ఆర్నెళ్లలోగా మళ్లీ అనుమతి తీసుకోవాలంటూ విధించిన నిబంధనను ఉపసంహరించుకోవాల్సిందిగా కోరనుంది. విభజన చట్టం ద్వారా ఆ ప్రాజెక్టులకు కల్పించిన రక్షణను కొనసాగించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని గుర్తు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం జలవనరుల శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి తదితరులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. బోర్డులను ఏర్పాటు చేసిన ఏడేళ్ల తర్వాత వాటి పరిధిని ఖరారు చేయడాన్ని స్వాగతిస్తూనే కొన్ని మార్పులు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే తుంగభద్ర బోర్డు పరిధిలో హెచ్చెల్సీ, ఎల్లెల్సీ.. తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ (హెచ్చెల్సీ), దిగువ ప్రధాన కాలువ (ఎల్లెల్సీ) ఇప్పటికే తుంగభద్ర బోర్డు పరిధిలో ఉన్నాయి. తుంగభద్ర జలాశయంలో నీటి లభ్యత ఆధారంగా హెచ్చెల్సీకి కేటాయించిన 32.5, ఎల్లెల్సీకి కేటాయించిన 29.5 టీఎంసీలను దామాషా పద్ధతిలో తుంగభద్ర బోర్డు పంపిణీ చేస్తోంది. వాటికి తుంగభద్ర జలాశయంలో నీటిని విడుదల చేసినప్పుడు రాష్ట్ర సరిహద్దులోనూ టెలీమీటర్ల ద్వారా ఎప్పటికప్పుడు లెక్కిస్తోంది. ఈ నేపథ్యంలో హెచ్చెల్సీ, ఎల్లెల్సీలను మళ్లీ కృష్ణా బోర్డు పరిధిలోకి తేవాల్సిన అవసరం లేదని, వాటిని పరిధి నుంచి తప్పించాలని కేంద్రానికి వి/æ్ఞప్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద లెక్కిస్తే చాలు.. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా తెలుగుగంగ, ఎస్సార్బీసీ, గాలేరు–నగరి ప్రాజెక్టులకు నీటిని విడుదల చేస్తారు. ఈ ప్రాజెక్టులకు నీటిని విడుదల చేసే ప్రాంతమైన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌ను కృష్ణా బోర్డు పరిధిలోకి తీసుకుని కేటాయించిన నీటిని విడుదల చేసేటప్పుడు టెలీమీటర్ల ద్వారా లెక్కిస్తే సరిపోతుంది. ఈ నేపథ్యంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన ఉన్న బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్, నిప్పులవాగు ఎస్కేప్ ఛానల్, వెలిగోడు రిజర్వాయర్, తెలుగుగంగ లింక్ కెనాల్, ఎస్సార్బీసీ నుంచి అవుకు రిజర్వాయర్ వరకు కాలువల వ్యవస్థలను కృష్ణా బోర్డు పరిధిలోకి తీసుకుని అక్కడ నీటిని లెక్కించాల్సిన అవసరం లేదని నీటిపారుదల రంగ నిపుణులు పేర్కొంటున్నారు. దీనివల్ల బోర్డుకు భారం మినహా ఎలాంటి ప్రయోజనం ఉండదని స్పష్టం చేస్తున్నారు. అందువల్ల పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వరకే కృష్ణా బోర్డు పరిధిని పరిమితం చేసేలా కేంద్రానికి సూచించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆయకట్టుకు నీళ్లందిస్తున్న ప్రాజెక్టులకు అనుమతి లేదంటే ఎలా? వెంకటనగరం ఎత్తిపోతల 2006 నాటికే పూర్తయిందని, తెలుగుగంగ ఆయకట్టును స్థిరీకరించడానికి చేపట్టిన సిద్ధాపురం ఎత్తిపోతల, ఎల్లెల్సీ ఆయకట్టు స్థిరీకరణకు చేపట్టిన గురు రాఘవేంద్ర ఎత్తిపోతల పథకం 2008 నాటికే పూర్తైందని, ఆయకట్టుకు నీళ్లందిస్తున్న ఆ ప్రాజెక్టులకు అనుమతి లేదనడం సరి కాదని కేంద్రానికి వివరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే పూర్తై ఆయకట్టుకు నీళ్లందిస్తున్న ప్రాజెక్టులకు ఆర్నెళ్లలోగా అనుమతి తీసుకోవాలనే నిబంధనను ఉపసంహరించుకోవాల్సిందిగా ప్రతిపాదించనుంది. ఎగువ రాష్ట్రాలతో సంబంధం లేని ప్రాజెక్టులు బోర్డు పరిధిలోకి ఎందుకు? కృష్ణా డెల్టాకు నీళ్లందించే ప్రకాశం బ్యారేజీ, గోదావరి డెల్టాకు నీళ్లందించే ధవళేశ్వరం బ్యారేజీ, పోలవరం, పోలవరం దిగువన తొర్రిగడ్డ పంపింగ్ స్కీం, వెంకటనగరం ఎత్తిపోతల, పుష్కర, పురుషోత్తపట్నం, తాడిపూడి, పట్టిసీమ, చింతలపూడి ఎత్తిపోతల వల్ల ఎగువ రాష్ట్రాల ప్రయోజనాలకు ఎలాంటి విఘాతం కలగదని నీటిపారుదలరంగ నిపుణులు గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వాటిని కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిలోకి తేవడం వల్ల అదనపు భారం మినహా ఎలాంటి ప్రయోజనం ఉండదని పేర్కొంటున్నారు. ఈ దృష్ట్యా వాటిని బోర్డుల పరిధి నుంచి తప్పించాలని కేంద్రానికి ప్రతిపాదించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి ప్రయోజనాలున్న ప్రాజెక్టులు బోర్డు పరిధిలోకి తీసుకుంటే సరి.. గోదావరి పరీవాహక ప్రాంతం(బేసిన్)లో ఉమ్మడి ప్రాజెక్టులు ఏవీ లేవు. కానీ.. కృష్ణా బేసిన్లో శ్రీశైలం, నాగార్జునసాగర్‌లు ఉమ్మడి ప్రాజెక్టులు. జూరాల, పులిచింతల ఉమ్మడి ప్రయోజనాలతో ముడిపడిన ప్రాజెక్టులు. ఇందులో శ్రీశైలం, నాగార్జునసాగర్, జూరాల ప్రాజెక్టుల స్పిల్ వేలు, వాటికి అనుబంధంగా ఉన్న విద్యుదుత్పత్తి కేంద్రాలు, వాటిపై ఆధారపడ్డ ఆయకట్టుకు నీటిని విడుదల చేసే ప్రధాన ప్రాంతాలు(ఇన్‌టేక్‌లు), ఎత్తిపోతల పథకాల పంప్‌హౌస్‌లను కృష్ణా బోర్డు పరిధిలోకి తీసుకుని నీటి వినియోగాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం, పులిచింతలలో విద్యుదుత్పత్తి కేంద్రాన్ని బోర్డు పరిధిలోకి తీసుకుని నిర్వహిస్తే సరిపోతుందని నీటిపారుదలరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దీనివల్ల బోర్డుపై అదనపు భారం తగ్గుతుందని పేర్కొంటున్నారు. బోర్డుల పరిధి విస్తృతమైతే వాటి పరిధిలోని ప్రాజెక్టులు, కాలువల వ్యవస్థ నిర్వహణకు భారీ ఎత్తున వ్యయం అవుతుందని, దీనివల్ల రెండు రాష్ట్రాలపైనా ఆర్థికంగా తీవ్ర భారం పడుతుందని విశ్లేషిస్తున్నారు. నీటి లభ్యత ఆధారంగా దామాషాలో పంపిణీ.. రెండు రాష్ట్రాల్లోని కృష్ణా బేసిన్లో నీటి లభ్యత బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన మేరకు 811 టీఎంసీలు ఉంటే 66 : 34 నిష్పత్తిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు పంపిణీ చేయాలని, ఒకవేళ వర్షాభావంతో లభ్యత తగ్గితే అదే నిష్పత్తిలో దామాషా పద్ధతిలో నీటి పంపిణీ చేసేలా కృష్ణా బోర్డుకు నిర్దేశించాలని కేంద్రాన్ని కోరేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైంది. 2019–20, 2020–21 తరహాలోనే బేసిన్లో భారీ ఎత్తున వరద వస్తే.. శ్రీశైలం, సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తివేసి వరద జలాలు సముద్రంలో కలిసే సమయంలో రెండు రాష్ట్రాల్లో ఎవరు ఏ స్థాయిలో నీటిని మళ్లించుకున్నా వాటిని పరిగణలోకి తీసుకోకూడదని వి/æ్ఞప్తి చేయనుంది. తద్వారా దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ హక్కులను పరిరక్షించాలని కోరనుంది. -
గెజిట్ నోటిఫికేషన్‌ను స్వాగతించిన తెలంగాణ బీజేపీ
వేములవాడ: కృష్ణా, గోదావరి జలాలపై కేంద్ర జలశక్తి శాఖ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ అన్నారు. శుక్రవారం వేములవాడలో జరిగిన రాష్ట్రస్థాయి దళితమోర్చా కార్యవర్గ సమావేశానికి హాజరైన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. సుప్రీంకోర్టులో కృష్ణాజలాల వివాదం నడుస్తుండగా, ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయడం, 8 నెలల తర్వాత వెనక్కి తీసుకోవడంలో మతలబేంటో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. రెండు రాష్ట్రాల మధ్య గొడవలు సృష్టించేందు కు ప్రయత్నాలు జరుగుతున్నాయని, హుజూరాబాద్ ఎన్నికల కోసమే ఇద్దరు సీఎంలు హైడ్రామా చేస్తున్నారని విమర్శించారు. -
కేంద్రం గెజిట్ నోటిఫికేషన్‌ను ఆహ్వానిస్తున్నాం: సజ్జల
-
నోటిఫికేషన్ ఏపీ హక్కులను కాపాడుతుంది: శ్యామలరావు
సాక్షి, అమరావతి: కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ హక్కులను కాపాడుతుందన్నారు ఏపీ జల వనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు. అయితే నోటిఫికేషన్లో కొన్ని తప్పిదాలున్నాయని.. వాటిని సరిచేయమని కేంద్రాన్ని కోరతామన్నారు. కేఆర్ఎంబీ కార్యాలయాన్ని ఏపీలోనే ఏర్పాటు చేయాలని విభజన చట్టంలో ఉందని శ్యామలరావు గుర్తు చేశారు. ఏపీలోని కొన్ని ప్రాజెక్ట్‌లను బోర్డు పరిధిలోకి తీసుకురావడం అనవసరం అన్నారు శ్యామలరావు. ప్రాజెక్ట్‌ల నుంచి నీటిని విడుదల చేశాక.. ఎలా వినియోగించుకోవాలనేది దిగువ రాష్ట్రంగా ఏపీకున్న హక్కన్నారు శ్యామలరావు. దిగువనున్న ఏపీలో ప్రాజెక్ట్‌లు, కాల్వలు బోర్డు పర్యవేక్షణలో ఉంటే పంటలు దెబ్బతింటాయని తెలిపారు. రాయలసీమ ఎత్తిపోతల అంశం చాలా సున్నితమైనదని.. దాన్ని నోటిఫై చేస్తే ఒక లాభం.. చేయకుంటే మరో లాభం అన్నారు శ్యామలరావు. -
కేంద్రం గెజిట్ నోట్ విడుదల చేయడం శుభపరిణామం
-
కేంద్రం గెజిట్ నోటిఫికేషన్‌ను ఆహ్వానిస్తున్నాం: సజ్జల
సాక్షి, అమరావతి: కేంద్రం గెజిట్ నోటిఫికేషన్‌ను ఆహ్వానిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, న్యాయం తమ పక్కనే ఉందని.. విభజన సమయంలోనే బోర్డుల పరిధిని నిర్ణయించి ఉంటే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ పూర్తయ్యేది కాదన్నారు. విద్యుత్ ఉత్పత్తి కోసం నీళ్లను అడ్డగోలుగా వదిలేశారని.. తెలంగాణ ప్రభుత్వం ఏపీ ప్రయోజనాలకు గండి కొట్టిందని మండిపడ్డారు. తెలంగాణ దూకుడుగా ఉన్నా సంయమనం పాటించామన్నారు. సీఎం జగన్ రాజ్యాంగబద్ధంగా ఒత్తిడితెచ్చి విజయం సాధించారని అన్నారు. ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘‘ గెజిట్ నోటిఫికేషన్లో కొన్ని మార్చాల్సిన విషయాలున్నాయి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌పై టీడీపీ అపోహలు సృష్టిస్తోంది. రాయలసీమకు సంబంధించి చంద్రబాబు వైఖరేంటి?. నామినేటెడ్ పదవుల్లో సామాజిక న్యాయం చేయాల్సి ఉంది. మహిళలకు 50శాతం ఇస్తున్నాం.. కసరత్తులో కొంత ఆలస్యం అయ్యింది. రేపు ఉదయం ప్రకటిస్తాం. విశాఖ స్టీల్స్ విషయంలో నిజాయితీతో పోరాటం చేస్తున్నాం’’ అని అన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఇక జల వివాదాలు ఉండవు.. గెజిట్‌తో చాలా సమస్యలకు పరిష్కారం లభించిందని ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఇక జల వివాదాలు ఉండవన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య భేదాభిప్రాయాలు ఉండకూడదన్నారు. తెలుగు రాష్ట్రాల్లో రైతులెవరూ ఇబ్బంది పడకూడదని.. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవడమే తమ కర్తవ్యమని ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు. -
జల వివాదాలకు చెక్.. కేంద్రం కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: గోదావరి, కృష్ణా ప్రాజెక్టుల్లో తరచూ రేగుతున్న జల వివాదాలకు చెక్‌పెట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏడేళ్లుగా ఎటూ తేలకుండా వాయిదా పడుతూ వస్తున్న కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ గురువారం అర్ధరాత్రి కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. కృష్ణా బోర్డు సమర్ధవంతంగా పనిచేసేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) బ్యాంక్ అకౌంట్లోకి 60 రోజుల్లోగా తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు చెరో రూ.200 కోట్ల చొప్పున జమ చేయాలని సూచించింది. నోటిఫికేషన్ విడుదలతో కృష్ణా, గోదావరి బేసిన్‌లోని ఉమ్మడి ప్రాజెక్టులు, వాటి నిర్వహణ, విద్యుదుత్పత్తి కేంద్రాలు, సిబ్బంది అంతా బోర్డుల పరిధిలోకి వచ్చాయి. ప్రాజెక్టుల నీటి నిర్వహణతో పాటు భద్రతను కేంద్ర బలగాలు పర్యవేక్షించనున్నాయి. ఈ నోటిఫికేషన్ జారీ చేసే నాటికి కేంద్రం ఆమోదించని ప్రాజెక్టుల పనులన్నింటిని ఇరు రాష్టాలు నిలిపివేయాలని పేర్కొంది. రెండో అపెక్స్ కౌన్సిల్ భేటీలో నిర్ణయించిన మేరకు అనుమతులు లేని ప్రాజెక్టులను అపెక్స్ కౌన్సిల్‌కు పంపి 6 నెలల్లోగా అనుమతులు తీసుకోవాలని సూచించింది. ఆరు నెలల్లో అనుమతి పొందకపోతే ఆ ప్రాజెక్టులను రద్దు చేసుకోవాలని, వాటి ద్వారా ఎలాంటి నీటిని తీసుకోరాదని స్పష్టం చేసింది. ఈ నోటిఫికేషన్ ఈ ఏడాది అక్టోబర్ 14 నుంచి అమల్లోకి వస్తుందని కేంద్రం వివరించింది. బోర్డుల పరిధిపై కుదరని అభిప్రాయం.. కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగంలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తకుండా చూసేందుకు విభజన చట్టంలో సెక్షన్ 85(1) ప్రకారం కేంద్రం.. బోర్డులను ఏర్పాటు చేసింది. అయితే బోర్డులకు.. వాటి పరిధిని ఖరారు చేయకపోవడం, వర్కింగ్ మాన్యువల్‌ను నోటిఫై చేయకపోవడంతో వీటికి ఎలాంటి అధికారాలు లేవు. దీంతో రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలు తరచూ ఉత్పన్నమవుతున్నా బోర్డులు ఏమీ చేయలేకపోతున్నాయి. ఈ క్రమంలో తమ పరిధిని ఖరారు చేసి ప్రాజెక్టులపై పెత్తనం ఇవ్వాలని బోర్డులు కోరాయి. దీనిపై తెలంగాణ, ఏపీ మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. ప్రాజెక్టులను బోర్డు నియంత్రణలోకి తేవడాన్ని తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకించింది. ముఖ్యంగా కృష్ణా బేసిన్లో ఉమ్మడి రాష్ట్రానికి ఇచ్చిన జలాలను ప్రాజెక్టుల వారీగా కేటాయించలేదని, ఈ అంశంపై ప్రస్తుతం బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ విచారణ చేస్తోందని పేర్కొంది. విభజన చట్టం సెక్షన్–87 ప్రకారం ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేశాకనే బోర్డు పరిధిని నోటిఫై చేయాలని.. 2016, సెప్టెంబర్ 21న జరిగిన తొలి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనూ, 2020, అక్టోబర్ 6న జరిగిన రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనూ ఇదే అంశాన్ని స్పష్టం చేసింది. అయితే ప్రాజెక్టులను బోర్డు నియంత్రణలోకి తేవాల్సిందేనని ఏపీ ఎప్పటి నుంచో కోరుతోంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు తెలంగాణ పరిధిలో ఉన్న కారణంగా ఆ రాష్ట్ర అధికారులు ప్రాజెక్టుపై పెత్తనం చేస్తున్నారని, తమ రాష్ట్రానికి నీరందించే కుడి కాల్వపై వారి పెత్తనమే కొనసాగుతున్న దృష్ట్యా బోర్డు నియంత్రణ అవసరమని చెబుతూ వచ్చింది. ఈ వైరుధ్యాలు ఉన్నా.. రెండో అపెక్స్ భేటీలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ బోర్డుల పరిధిని ఖరారు చేసే అధికారం తమకుందని స్పష్టం చేశారు. అనంతరం ఈ ఏడాది ఏప్రిల్‌లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన సమావేశంలో దీనిపై చర్చించి నోటిఫికేషన్ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. గోదావరి.. బోర్డు పరిధిలోకి ఎందుకు... ఇక గోదావరి బేసిన్ ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తెచ్చుకోవడాన్ని తెలంగాణ తప్పుపడుతోంది. గోదావరి బేసిన్లో తెలంగాణ, ఏపీల మధ్య ఉమ్మడి ప్రాజెక్టులు లేవని, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి నీటిని విడుదల చేసే రెగ్యులేటర్లు లేక ఇరురాష్ట్రాల మధ్య సంయుక్తంగా నిర్మించిన ప్రాజెక్టులు లేనందున దీని పరిధిని ఖరారు చేయ రాదని గతంలో కేంద్రానికి లేఖలు రాసింది. రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 87 ప్రకారం గతంలో ఉన్న అవార్డులు, అంతర్రాష్ట్ర నదీ వివా దాల చట్టం–1956 మేరకు ఏర్పడ్డ ట్రిబ్యునల్ల తీర్పులకు లోబడి కేంద్రం బోర్డుల పరిధిని నోటిఫై చేయాల్సి ఉంటుందని గుర్తు చేసింది. గోదావరి ట్రిబ్యునల్ అవార్డులో ప్రాజెక్టులను బోర్డుల పరిధికి తీసుకోవడానికి సంబంధించి ఎలాంటి అంశాలు లేవని దృష్టికి తెచ్చింది. కొత్త మార్గదర్శకాలను తెలంగాణ, ఏపీలోని గోదావరి ప్రాజెక్టులపై రుద్దరాదని స్పష్టం చేసింది. అయినా దీని పరిధిపైనా గెజిట్ ఇచ్చేందుకే కేంద్రం మొగ్గు చూపింది. కృష్ణా బోర్డు పరిధిలో.. కృష్ణా బోర్డు పరిధి నోటిఫై కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులన్నీ దాని పరిధిలోకి వెళ్లాయి. అందులో తుంగభద్ర జలాలపై ఆధారపడి ఉన్న హెచ్ఎల్సీ(హైలెవల్ కెనాల్), ఎల్ఎల్సీ(లోలెవల్ కెనాల్), కేసీ కెనాల్, తుమ్మిళ్ల, ఆర్డీఎస్, జూరాలపై ఆధారపడి ఉన్న విద్యుత్ కేంద్రం, బీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, శ్రీశైలంపై ఆధారపడ్డ తెలుగుగంగ, ఎస్ఆర్బీసీ, గాలేరు–నగరి, హంద్రీనీవా, ముచ్చు మర్రి, వెలిగొండ, కల్వకుర్తి, ఎస్ఎల్బీసీ, పాలమూరు-రంగారెడ్డి, డిండి, శ్రీలైలం కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాలు, సాగర్‌పై ఆధారపడిన కుడి, ఎడమ కాల్వలు, విద్యుదుత్పత్తి కేంద్రాలు, ఏఎంఆర్పీ, హెచ్ఎండబ్ల్యూఎస్, పులిచింతల వంటి ప్రాజెక్టులన్నీ బోర్డు పరిధిలోకి వచ్చాయి. అలాగే కాళేశ్వరం, దేవాదుల, నిజాంసాగర్, సింగూరు, ఎస్సారెస్పీ, లోయర్‌మానేరు, ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, పోలవరం, ధవళేశ్వరం బ్యారేజీ, చింతలపూడి, పురుషోత్తపట్నం గోదావరి బోర్డు పరిధిలోకి వెళ్లాయి. ప్రధానికి రెండు దఫాలు సీఎం జగన్ లేఖలు బోర్డు పరిధి ఖరారైనందున కృష్ణా జలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు తలెత్తే అవకాశం ఉండదని నీటిపారుదలరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం కనీస స్థాయి కంటే దిగువన ఉన్నప్పటికీ తెలంగాణ సర్కార్ అక్రమంగా ఎడమ గట్టు కేంద్రంలో జూన్ 1నే విద్యుదుత్పత్తిని ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ విద్యుదుత్పత్తిని నిలుపుదల చేయాలని కృష్ణా బోర్డుకు లేఖ రాసింది. అయితే తెలంగాణ సర్కారు కృష్ణా బోర్డు ఉత్తర్వులను తుంగలో తొక్కుతూ శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతలలో యథేచ్ఛగా విద్యుదుత్పత్తిని చేపట్టింది. కృష్ణా జలాలు వృథాగా సముద్రంలో కలిసే పరిస్థితిని సృష్టించి రాష్ట్ర హక్కులను కాలరాస్తున్న తెలంగాణ సర్కార్ తీరుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండుదఫాలు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌సింగ్ షెకావత్‌లకు లేఖలు రాశారు. గతేడాది అక్టోబర్ 6న అపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు కృష్ణా బోర్డు పరిధిని తక్షణమే ఖరారు చేసి ఉమ్మడి ప్రాజెక్టులను బోర్డు అధీనంలోకి తేవాలని, వాటికి సీఐఎస్ఎఫ్ బలగాలతో భద్రత కల్పించి బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపుల మేరకు ఇరు రాష్ట్రాలకు నీటిని విడుదల చేయాలని కోరారు. కానీ.. తెలంగాణ సర్కార్ తీరులో మార్పు రాకపోవడంతో రాష్ట్ర హక్కులను పరిరక్షించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. విభజన చట్టం ప్రకారం కృష్ణా బోర్డు పరిధిని ఖరారు చేసేలా కేంద్రానికి నిర్దేశం చేయాలని సుప్రీం కోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో రెండు బోర్డుల పరిధిని కేంద్రం ఖరారు చేసింది. -
రేపు కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిపై గెజిట్లు విడుదల
న్యూఢిల్లీ: కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిపై కేంద్ర జలశక్తి శాఖ రేపు(శుక్రవారం) గెజిట్లు విడుదల చేయనుంది. రేపు మధ్యాహ్నం 1 గంట తర్వాత కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిపై గెజిట్లు విడుదల చేయనుంది. రెండు బోర్డులకు వేర్వేరుగా కేంద్రం గెజిట్లు విడుదల చేయనున్నారు. తెలుగు రాష్ట్రాల జల వివాదం నేపథ్యంలో గెజిట్లకు ప్రాధాన్యమేర్పడింది. ఆంధ్ర ప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం జల బోర్డుల పరిధి నిర్ధేశించే అధికారం కేంద్రానిదే. దీనిలో భాగంగానే వాటి పరిధిపై కేంద్రం వేర్వేరుగా గెజిట్లు విడుదల చేయడానికి సమాయత్తమైంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఆ లేఖలో తెలంగాణ ప్రభుత్వం చట్టవిరుద్ధంగా ఆపరేషన్ ప్రొటోకాల్ ఉల్లంఘిస్తోందని, కేఆర్ఎంబీ పరిధిని తక్షణమే నోటిఫై చేసేలా జలశక్తి శాఖకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అదే సమయంలో శ్రీశైలంలో నీటిమట్టం పెరగకుండా తెలంగాణ అక్రమంగా నీటిని తోడేస్తోందని కేంద్రానికి తెలిపారు. పోతిరెడ్డిపాడుకు సాగునీరు రాకుండా తెలంగాణ అడ్డుకుంటోందని, కేఆర్ఎంబీకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే.. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతలలో తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. దీంతో కృష్ణా డెల్టా, రాయలసీమ ప్రాంతానికి ఇబ్బంది కలుగుతుందని, రెండు రాష్ట్రాల ప్రయోజనాలను పరిరక్షించేలా.. సీఐఎస్ఎఫ్ బలగాల పరిధిలోకి ప్రాజెక్ట్‌లను తేవడమే కాకుండా తక్షణమే తెలంగాణ ప్రభుత్వాన్ని కట్టడి చేసేలా.. కేంద్ర జలశక్తి శాఖకు ఆదేశాలు ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ కోరారు. -
వరంగల్ జిల్లాల పేర్ల మార్పుపై గెజిట్
సాక్షి, హైదరాబాద్: వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల పేర్లను మార్చడానికి ప్రభుత్వం సోమవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. వరంగల్ అర్బన్ జిల్లా పేరును హన్మకొండగా, వరంగల్ రూరల్ జిల్లా పేరును వరంగల్‌గా మార్పు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ నోటిఫికేషన్ ఇచ్చారు. 30 రోజుల్లోగా ప్రజలు తమ అభ్యంతరాలను సంబంధిత కలెక్టర్లకు లిఖిత పూర్వకంగా అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
క్లినికల్ ఫార్మసిస్ట్‌లుగా.. ఫార్మా–డి అభ్యర్థులు
సాక్షి, అమరావతి: గత కొన్ని సంవత్సరాలుగా తమకు ప్రత్యేక కేడర్ ఇవ్వాలని పోరాటం చేస్తున్న ఫార్మా–డి కోర్సు చేసిన అభ్యర్థుల కల ఫలించింది. ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం ఫార్మా–డి అభ్యర్థులను క్లినికల్ ఫార్మసిస్ట్‌లుగా గుర్తిస్తూ, వారికి ప్రత్యేక కేడర్‌ను ఇస్తూ ఆదేశాలిచ్చింది. కొన్నేళ్ల కిందట కోర్సును ప్రవేశపెట్టినా దీనికి సంబంధించిన కేడర్ లేకపోవడం, వారికి ఏ ప్రభుత్వ ఉద్యోగాలివ్వాలనే దానిపై స్పష్టత లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి పార్లమెంటులో పలు దఫాలు ప్రత్యేకంగా వీరి గురించి ప్రస్తావించారు. వారికి తగిన న్యాయం చేయాలని, కోర్సులు పూర్తి చేసిన వారు నిరుద్యోగులుగా ఉన్నారని ఆయన పార్లమెంటులో గట్టిగా మాట్లాడారు. దీంతో ఎట్టకేలకు కేంద్రం తాజాగా గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. విధుల నిర్వహణ ఇలా.. వైద్యులకు సురక్షితమైన, సమర్థవంతమైన మందుల వాడకం గురించి వివరించడం, నాణ్యమైన మందుల కోసం పరిశోధనా ప్రాజెక్టులు చేపట్టడం, ఔషధాలకు సంబంధించి వ్యయ విశ్లేషణ చేయడం, మందుల మోతాదుపై స్పష్టత ఇవ్వడం, మందుల వల్ల వచ్చే దుష్ప్రభావాలు, సరైన మందుల గురించి వివరించడం వంటివన్నీ చేయాల్సి ఉంటుంది. పర్యవేక్షణ కోసం క్లినికల్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరించాలి. అన్ని రకాల ఫార్మసీ క్లెయిమ్ డేటాను అంచనా వేసి, ప్రత్యేక ప్రొటోకాల్‌ను అనుసరించాల్సి ఉంటుంది. ఎంపీ కృషి వల్లే సాధ్యమైంది దేశవ్యాప్తంగా వేలాదిమంది ఫార్మా–డి చదివిన వారు ఉన్నారు. వీళ్లందరికీ ఉద్యోగాలు లేక ఇబ్బంది పడేవారు. దీనిపై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి విన్నవించాం. ఆయన స్పందించి పలు సార్లు పార్లమెంటులో ప్రస్తావించారు. దీనివల్ల ప్రత్యేక కేడర్ (క్లినికల్ ఫార్మసిస్ట్)గుర్తిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. – హేమంత్‌కుమార్, ఉపాధ్యక్షుడు, డాక్టర్ ఆఫ్ ఫార్మసీ అసోసియేషన్ -
తెలంగాణలో జూలై 1 నుంచి పాఠశాలలు ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రత్యక్ష తరగతులకు తాత్కాలిక బ్రేక్ పడింది. స్కూళ్లు, కాలేజీల్లో ప్రత్యక్ష బోధన కాకుండా కేవలం ఆన్లైన్లోనే తరగతుల నిర్వహణ చేపట్టాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది. 9, 10 తరగతులకు కూడా ఆన్లైన్లోనే బోధన నిర్వహించనుంది. 50 శాతం టీచర్లు ఒకరోజు.. మరో 50 శాతం టీచర్లు తర్వాతి రోజు హజరయ్యేలా చూడనున్నారు. దీనికి సంబంధించి నేడో, రేపో అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉంది. (చదవండి: కూకట్‌పల్లిలో విషాదం: ఆట మధ్యలో ఫోన్ లాక్కున్నారని బాలుడు ఆత్మహత్య) -
ఏపీ హైకోర్టు సీజే నియామకం; నోటిఫికేషన్ జారీ
సాక్షి, న్యూఢిల్లీ/అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అరూప్ గోస్వామి నియామకానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు. ఇందుకు సంబంధించిన గెజిట్‌ను కేంద్ర న్యాయశాఖ గురువారం విడుదల చేసింది. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరీ బదిలీపై కేంద్ర న్యాయశాఖ సంయుక్త కార్యదర్శి నోటిఫికేషన్ జారీ చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో చర్చల అనంతరం రాష్ట్రపతి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఏపీ హైకోర్టు, సిక్కిం హైకోర్టు అధికారులకు జారీ చేసిన నోటిఫికేషన్ వివరాలు ఇందులో పొందుపరిచారు. సిక్కిం హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా బాధ్యతలు స్వీకరించాలని జస్టిస్ మహేశ్వరీకి సూచించారు.(చదవండి: నన్ను తప్పుకోమని కోరటం ధిక్కారపూర్వక చర్యే! ) కాగా జస్టిస్ అరూప్ గోస్వామి 1961 మార్చి 11న అసోంలోని జోర్హాట్లో జన్మించారు. గువాహటి ప్రభుత్వ న్యాయకళాశాల నుంచి 1985లో న్యాయశాస్త్ర పట్టా పొందారు.1985 ఆగస్టు 16న న్యాయవాదిగా తన పేరు నమోదు చేసుకున్నారు. సివిల్, క్రిమినల్, రాజ్యాంగం, ఉద్యోగ సేవలకు సంబంధించిన విభిన్న కేసులను ఆయన వాదించారు. గువాహటి హైకోర్టులో 2011లో అదనపు న్యాయమూర్తిగా, 2012లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2019 అక్టోబరు 15న పదోన్నతిపై సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు 2004 డిసెంబరు 21న గువాహటి హైకోర్టు నుంచి సీనియర్ అడ్వొకేట్ హోదా పొందారు. 2011 నుంచి 2013 వరకు నాగాలాండ్ రాష్ట్ర న్యాయసేవా సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా వ్యవహరించారు. 2018 నుంచి రెండుసార్లు గువాహటి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు. -
పీజీ ఆయుర్వేద వైద్యులూ సర్జరీలు చేయొచ్చు
న్యూఢిల్లీ: పోస్టు గ్రాడ్యుయేట్ ఆయుర్వేద వైద్యులు కూడా ఇకపై శస్త్రచికిత్సలు(సర్జరీలు) చేయొచ్చు. ఇందుకోసం వారు శిక్షణ పొందవచ్చు. ఈ మేరకు కేంద్ర ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్(సీసీఐఎం) నవంబర్ 20న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నిర్ణయం ఆధునిక వైద్యశాస్త్ర రంగంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పీజీ ఆయుర్వేద వైద్యులు చేయాల్సిన 39 సాధారణ శస్త్రచికిత్స పద్ధతులను ఐఐసీఎం తన జాబితాలో పేర్కొంది. ఇందులో 19 పద్ధతులు విధానాలు కన్ను, చెవి, ముక్కు, గొంతుకు సంబంధించినవే ఉన్నాయి. ఇందుకోసం ఇండియన్ మెడిసిన్ సెంట్రల్ కౌన్సిల్(పోస్టు గ్రాడ్యుయేట్ ఆయుర్వేద మెడిసిన్)–2016 నిబంధనలను సైతం కేంద్రం సవరించింది. తమ గెజిట్ నోటిఫికేషన్‌పై విమర్శలు వస్తుండడంతో ఆయుష్ శాఖ సెక్రెటరీ వైద్య రాజేశ్ కొటెచా స్పందించారు. ఇందులో కొత్త నిర్ణయం ఏదీ లేదని, నిబంధనలను ఉల్లంఘించడం లేదని చెప్పారు. పీజీ ఆయుర్వేద వైద్యులందరినీ సర్జరీలు చేయడానికి అనుమతించడం లేదన్నారు. కేవలం శల్య, శలక్య విభాగాల్లో ప్రావీణ్యం సంపాదించిన వారికే అనుమతి ఇచ్చినట్లు వెల్లడించారు. ఆయుర్వేద సంస్థల్లో 20 ఏళ్లుగా శస్త్రచికిత్సలు జరుగుతున్నాయని సీసీఐఎం బోర్డు ఆఫ్ గవర్నర్స్ చైర్మన్ వైద్యజయంత్ దేవ్‌పూజారి తెలిపారు. తమ నోటిఫికేషన్‌తో వాటికి చట్టబద్ధ గుర్తింపు లభిస్తుందన్నారు. అది తిరోగమన చర్య: ఐఎంఏ సీసీఐఎం అనుమతిపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అది తిరోగమన చర్య అని స్పష్టం చేసింది. సదరు ఉత్తర్వును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. ఆధునిక వైద్యానికి చెందిన శస్త్రచికిత్స పద్ధతులు కాకుండా పురాతన ఆయుర్వేద గ్రంథాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా సొంత శస్త్రచికిత్స విధానాలను రూపొందించుకోవాలని ఐఐసీఎంకు ఐఎంఏ సూచించింది. భారతీయ వైద్య శాస్త్రానికి సంబంధించిన కాలేజీల్లో ఆధునిక వైద్య శాస్త్ర వైద్యులను నియమించరాదని ఐఎంఏ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. వేర్వేరు వైద్య శాస్త్రాలను కలిపేయడం మంచి పద్ధతి కాదని తేల్చిచెప్పింది. అది ముమ్మాటికీ తిరోగమని చర్య అంటూ ఐఎంఏ ఒక ప్రకటన విడుదల చేసింది. -
ఏపీ : జెడ్పీ రిజర్వేషన్లు.. 6 స్థానాలు మహిళలకే
-
ఏపీ : జెడ్పీ రిజర్వేషన్లు.. 6 స్థానాలు వారికే
తాడేపల్లి: స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలనే రాష్ట్ర హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి జిల్లా పరిషత్ చైర్మన్ రిజర్వేషన్లకు సంబంధించి శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. స్ధానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, రిజర్వేషన్లు అంశంపై పంచాయతీరాజ్ కార్యాలయంలో పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ, పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై ఈనెల 7వ తేదీ లోపు ఎన్నికల కమిషన్‌కు నివేదిక అందించాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈనెల 8వ తేదీన స్థానిక సంస్థల షెడ్యూల్ అందించాలని హైకోర్టు స్పష్టం చేసింది. -
బార్ లైసెన్స్ గెజిట్ నోటిఫికేషన్ జారీ
సాక్షి, అమరావతి : రాష్ట్రవ్యాప్తంగా బార్ లైసెన్సులకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం శుక్రవారం సచివాలయంలో జారీ చేసింది. ఈ మేరకు వచ్చే జనవరి 1నుంచి కొత్త బార్ పాలసీని అమలు చేయాలని ప్రభుత్వం ఇదివరకే నిర్ణయించిన సంగతి తెలిసిందే. కాగా కొత్త బార్ పాలసీ విధానం కింద రూ. 10 లక్షలు బార్ లైసెన్స్ దరఖాస్తు ఫీజుగా ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే జనవరి 1 నుంచి 2021 డిసెంబర్ 31 వరకు రెండేళ్ల పాటు లైసెన్సులు జారీ చేయనున్నట్లు తెలిపింది. రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలను యూనిట్లుగా నిర్థారించి ప్రభుత్వం బార్లను కేటాయించనుంది. నేటి నుంచి డిసెంబర్ 6 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొంది. కాగా, డిసెంబర్ 7న మధ్యాహ్నం 2 గంటలకు లాటరీ తీయనున్న కలెక్టర్లు అదేరోజు రాత్రి 7 గంటలకు బార్ల కేటాయింపుల జాబితాను విడుదల చేయనున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన కొత్త బార్ల నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్, లైసెన్సు ఫీజుల వివరాలు ఇలా ఉన్నాయి 50 వేలు లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో బార్ల కు ఏడాదికి రూ. 25 లక్షలు 5 లక్షల లోపు జనాభా ఉన్న పట్టణాల్లో బార్ల కు రూ. 50 లక్షలు 5 లక్షల కంటే అధిక జనాభా ఉన్న ప్రాంతాల్లో బార్లకు రూ. 75 లక్షలు -
‘లోకల్ స్టేటస్’ మరో రెండేళ్లు పొడిగింపు
సాక్షి, అమరావతి : రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి విద్య, ఉద్యోగాల్లో స్థానిక(లోకల్) కోటా రిజర్వేషన్లు పొందాలనుకుంటున్న వారికి శుభవార్త. తెలంగాణ నుంచి ఏపీకి వచ్చేవారు స్థానిక హోదా(లోకల్ స్టేటస్) పొందడానికి గడువును కేంద్ర ప్రభుత్వం మరో రెండేళ్లు పొడిగించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చేవారికి 2021 జూన్ ఒకటో తేదీ వరకూ స్థానిక హోదా పొందడానికి అవకాశం లభించనుంది. తెలంగాణలో నివాసం ఉంటూ ఆంధ్రప్రదేశ్‌కు వచ్చేవారికి ఇక్కడ లోకల్ స్టేటస్ పొందడానికి కేంద్ర ప్రభుత్వం మొదట మూడేళ్లు గడువు ఇచ్చింది. ఇందుకోసం రాజ్యాంగంలోని ఆర్టికల్ 370(డి)లోని ప్రెసిడెన్షియల్ ఆర్డర్‌ను రాష్ట్రపతి ఆమోదంతో సవరించింది. దీనిప్రకారం రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ రోజైన 2014 జూన్ 2 నుంచి 2017 జూన్ 1 వరకు లోకల్ స్టేటస్ సర్టిఫికెట్లు పొందవచ్చని 2016 జూన్ 16న కేంద్ర హోంశాఖ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. తదుపరి ఏపీ రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు గడువును మరో రెండేళ్లు పొడిగిస్తూ 2017 అక్టోబర్ 30న మరో గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం గడువు 2019 జూన్ 1వ తేదీతో ముగిసింది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య తొమ్మిది, పదో షెడ్యూళ్లలోని సంస్థల ఆస్తులు, అప్పులు, ఉద్యోగుల విభజన పూర్తికాకపోవడం వల్ల చాలామంది ఏపీ ఉద్యోగులు ఇప్పటికీ తెలంగాణలోనే ఉండిపోయారు. కొందరు ఉద్యోగులు ఏపీకి వచ్చినప్పటికీ తమ కుటుంబాలను హైదరాబాద్‌లోనే ఉంచారు. పునర్వ్యవస్థీకరణ చట్టంలో సైతం హైదరాబాద్‌ను పదేళ్ల వరకూ ఉమ్మడి రాజధానిగా అప్పట్లో కేంద్రం పేర్కొంది. విద్యా సంస్థలు, ఉద్యోగ నియామకాల్లో స్థానిక కోటా తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే వారికి రాష్ట్రంలో స్థానిక హోదా పొందడానికి గడువును మరో రెండేళ్లు పొడిగించాలంటూ రాష్ట్ర సర్కారు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న కేంద్రం రాష్ట్రపతి అనుమతి తీసుకుని లోకల్ స్టేటస్ పొందడానికి గడువును మరో రెండేళ్లు పొడిగించింది. ఇందుకోసం రాజ్యాంగంలోని ఆర్టికల్ 371 (డి)లోని 1, 2 క్లాజ్‌లను సవరిస్తూ ‘ఆంధ్రప్రదేశ్ విద్యా సంస్థల(నియంత్రణ, ప్రవేశాలు) సవరణ చట్టం–2019’ చేసింది. ఇది ఉన్నత విద్యా సంస్థల్లో విద్యార్థుల ప్రవేశాలకు స్థానికత హోదా కల్పనకు వర్తిస్తుంది. అలాగే ఉద్యోగాల్లో స్థానిక హోదాను మరో రెండేళ్లు పొడిగించడం కోసం ఇదే తరహాలో రాష్ట్రపతి ఆమోదంతో ‘ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ (ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ కేడర్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్) అమెండ్మెంట్ ఆర్డర్–2019’ చేసింది. దీంతో తెలంగాణ నుంచి 2021 జూన్ 1వ తేదీలోగా ఆంధ్రప్రదేశ్‌కు వచ్చినవారు నిబంధనల ప్రకారం స్థానికత సర్టిఫికెట్లు తీసుకోవచ్చు. ఉన్నత విద్యా సంస్థల్లో, ప్రత్యక్ష ఉద్యోగ నియామకాల్లో స్థానిక కోటా కింద రిజర్వేషన్లు పొందవచ్చు. ఈ మేరకు కేంద్ర హోం శాఖ జాయింట్ సెక్రటరీ ఎస్కే షాహి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. స్థానిక హోదా సర్టిఫికెట్ పొందడమెలా? తెలంగాణ నుంచి ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి స్థిరపడినవారు, ఇప్పుడు రావాలనుకుంటున్న వారు స్థానిక హోదా పొందాలంటే కొన్ని మార్గదర్శకాలను తప్పనిసరిగా అనుసరించాలి. ఆ రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రానికి వచ్చేశాం కదా ఆటోమేటిగ్గా లోకల్ స్టేటస్ వర్తిస్తుందనుకుంటే పొరపాటే. 2021 జూన్ 1వ తేదీలోగా తహసీల్దార్ నుంచి లోకల్ స్టేటస్ సర్టిఫికెట్లు పొందిన వారికి మాత్రమే విద్య, ఉద్యోగాల్లో స్థానిక కోటా రిజర్వేషన్లు వర్తిస్తాయి.ఈ సర్టిఫికెట్ పొందగోరేవారు తెలంగాణలో నివాసం ఉంటూ ఇక్కడికి వచ్చినట్లు ఆధారాలతో దరఖాస్తు (ఫారం–1) సమర్పించాలి. గతంలో తెలంగాణలో నివాసం ఉన్నట్లు ఆధారాలుగా రేషన్ కార్డు, ఆధార్‌కార్డు, బ్యాంకు పాస్ పుస్తకం లాంటివి జత చేయాలి. దీంతోపాటు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోఫలానా ప్రాంతంలో నివాసం ఉంటున్నామని, అందువల్ల లోకల్ స్టేటస్ సర్టిఫికెట్ ఇవ్వాలంటూ ఫారం–2 సమర్పించాలి. మీ–సేవా ద్వారా దరఖాస్తు చేసుకుంటే వారం రోజుల్లోగా సంబంధిత తహసీల్దార్ డిజిటల్ సంతకంతో కూడిన లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ జారీ చేస్తారు. -
మద్యం పాలసీపై మల్లగుల్లాలు
సాక్షి, ఆదిలాబాద్ : కొత్త మద్యం పాలసీపై పలువురు ఆశావహులు మల్లగుల్లాలు పడుతున్నారు. గెజిట్ నోటిఫికేషన్ ఇంకా విడుదల కానందునా మార్పులేమైనా ఉంటాయా? అన్న మీమాంస వారిలో కనిపిస్తోంది. శనివారం కలెక్టర్ ఆధ్వర్యంలో డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. అలాగే 9న గెజిట్ నోటిఫికేషన్ రానుంది. శుక్రవారం ఎక్సైజ్ కమిషనర్‌తో డిప్యూటీ కమిషనర్లు, డీపీఈఓలు హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. కాని నోటిఫికేషన్‌తోనే స్పష్టత రానుంది. నిరుత్సాహం.. మద్యం దుకాణం కోసం దరఖాస్తు చేసుకోవాలంటే రూ.2లక్షల ఫీజు నిర్ధారించడంపై ఆశావహుల్లో నిరుత్సాహం వ్యక్తమవుతోంది. ప్రధానంగా పలువురు కొత్తవారు మద్యం వ్యాపారంలోకి రావాలని ఉత్సాహం చూపిస్తున్నా మొదటి మెట్టులోనే ఫీజు భారీగా ఉండడంతో వెనుకాముందు అవుతున్నారు. కొంతమంది యువకులు గ్రూప్‌గా ఏర్పడి ఒకరి పేరిట దరఖాస్తు ఫీజు కట్టడం ద్వారా మద్యం టెండర్లలో పాల్గొనాలని ఉత్సాహం చూపుతున్నారు. ఒకవేళ అదృష్టం కలిసొచ్చి లక్కీడ్రాలో షాపు దక్కితే ఇప్పటికే వ్యాపారంలో ఉన్నవారు ఇచ్చే గుడ్‌విల్ పొంది వారికే షాపును నడుపుకునేందుకు ఇవ్వడం ద్వారా ప్రయోజనం పొందాలనే ఉత్సాహం వారిలో కనిపిస్తోంది. ఇదివరకు లక్కీడ్రాలో ఇలాంటి సంఘటనలు జరగడంతో పలువురు గ్రూప్‌గా ఏర్పడి దరఖాస్తు ఫీజు చెల్లించేందుకు సిద్ధమవుతున్నారు. 2017–19 ఎక్సైజ్ పాలసీ సమయంలో ఆదిలాబాద్ జిల్లాలో ఏడెనిమిది షాపులకు గాను 559 మంది దరఖాస్తు చేసుకున్నారు. అప్పుడు రూ.లక్ష దరఖాస్తు ఫీజు ఉండగా, దీని ద్వారానే ప్రభుత్వానికి రూ.5.59 కోట్ల ఆదాయం సమకూరింది. ఇప్పుడు ప్రభుత్వం దరఖాస్తు ఫీజు దశలోనే రెట్టింపు ఆదాయంపై దృష్టి సారించింది. దీంతో రూ.లక్ష ఉన్న ఫీజును రూ.2లక్షలకు పెంచింది. ఎక్సైజ్ ట్యాక్స్ భారం.. కొత్త ఎక్సైజ్ పాలసీలో స్పెషల్ రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ రూ.5లక్షలు ఏడాదికి నిర్ణయించడంపై వ్యాపారుల్లో నిరుత్సాహం కనిపిస్తోంది. ఇప్పటికే మద్యం వ్యాపారంలో ఉన్నవారు తిరిగి షాపులు దక్కించుకునేందుకు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. అయితే ఇటు ఏడాదికి చెల్లించే లైసెన్స్ ఫీజు పెరగడం, దీనికితోడు దరఖాస్తు ఫీజు పెంచడం, ఇవన్ని వారికి భారంగా కనిపిస్తున్నాయి. ఆదిలాబాద్ పట్టణంలో గతంలో ఏడాదికి లైసెన్స్ ఫీజు రూ.55 లక్షలు ఉండగా, కొత్త పాలసీలో రూ.65 లక్షలకు పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో రూ.45లక్షలు ఉండగా, రూ.50లక్షలకు పెరిగింది. పెరిగిన లైసెన్స్ ఫీజులతో మద్యం వ్యాపారులు తర్జనభర్జన పడుతుండగా, మరోవైపు ఏడాదికి ఎక్సైజ్ పన్ను రూ.5లక్షలు కొత్తగా విధించడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్లకు కలిపి ఇది రూ.10 లక్షలు చెల్లించాల్సి వస్తుందని వాపోతున్నారు. పర్మిట్ రూమ్ ఉందా?.. లేదా? వైన్‌షాపులకు పర్మిట్ రూమ్ విషయంలో కొత్తపాలసీలో ఎలాంటి అంశం పొందుపర్చకపోవడంతో ఈ విషయంలో సందిగ్ధం కొనసాగుతోంది. అధికారులు మాత్రం పాత పాలసీకి అనుగుణంగానే పర్మిట్ రూమ్ ఉంటుందని చెబుతున్నారు. అయితే నోటిఫికేషన్లోనే దీనిపై స్పష్టత రానుంది. ఇక కొత్త పాలసీలో బీరుపై కమిషన్ 25 శాతం నుంచి 20 శాతానికి తగ్గించడంపై వ్యాపారస్తులు నిరుత్సాహానికి గురయ్యారు. అసలే ఆదాయం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమకు కమిషన్ తగ్గించడం ఏవిధంగా సబబన్న ప్రశ్న వారి నుంచి వ్యక్తమవుతోంది. వైన్ దగ్గర పార్కింగ్ సౌకర్యం కల్పించాలని పొందుపర్చారు. ఇది పట్టణ ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్నటువంటి వైన్స్‌లన్నీ రోడ్ల సమీపంలో ఉన్నాయి. వాటికి పార్కింగ్ సౌకర్యం అసలే లేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న షాపులను మార్చాల్సిన పరిస్థితి వస్తుంది. దీన్ని అంతా సీరియస్‌గా పరిగణించకపోతే ఆ స్థలాల్లోనే కొనసాగే అవకాశం లేకపోలేదు. -
‘విద్యుత్’పై శ్వేతపత్రం ఇవ్వాలి
సాక్షి, హైదరాబాద్ : విద్యుత్ సంస్థల కొనుగోళ్లు, ఒప్పందాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ డిమాండ్ చేశారు. విద్యుత్ సంస్థల అవకతవకతలపై రాష్ట్ర ప్రభుత్వం జ్యుడీషియల్ విచారణకు ఆదేశిస్తే ఆధారాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తాము కేంద్రంలో అధికారంలో ఉన్నాం కాబట్టి సీబీఐ విచారణకు ఆదేశించాలని కాంగ్రెస్ అంటోందని, సమాఖ్య వ్యవస్థలో ఇది సాధ్యం కాదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో విద్యుత్‌రంగంపై శుక్రవారం ఇక్కడ బీజేపీ ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించింది. తెలంగాణ సర్కార్ విద్యుత్ కొనుగోళ్ల కోసం ఓపెన్ బిడ్డింగ్‌లకు వెళ్లకుండా, బయటి మార్కెట్ నుంచి నేరుగా రూ.4.50 – 5.50లకు యూనిట్ చొప్పున స్వల్పకాలిక ఒప్పందాలు చేసుకుందని లక్ష్మణ్ ఆరోపించారు. రెండేళ్లుగా విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ పని చేయడంలేదని అన్నారు. రాష్ట్ర సర్కార్ అవినీతిపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని, స్పందన లేకుంటే కేంద్ర హోంమంత్రిని, రాష్ట్రపతిని కలుస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రానికి కేటాయించిన ఐఏఎస్ అధికారులకు 10 నెలలుగా ఈ సర్కార్ ఎలాంటి పోస్టింగ్‌లు ఇవ్వకపోవడం ఏమిటని ఏపీ ప్రభుత్వ మాజీ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు ప్రశ్నించారు. -
దుబ్బాక మాయం!
సాక్షి, దుబ్బాక: జిల్లాల పునర్వ్యస్థీకరణ గెజిట్ నోటిఫికేషన్లో జిల్లాలోని దుబ్బాక మండలమే లేకపోవడం ప్రజల్లో తీవ్ర గందరగోళాన్ని రేకెత్తించింది. దుబ్బాక మండలంలో దుబ్బాక మున్సిపల్‌తో పాటుగా మొత్తం 30 గ్రామ పంచాయతీలున్నాయి. దీంట్లో మండలంలోని 26 గ్రామాలు రికార్డుల్లో లేవన్న వార్తతో మా గ్రామం ఉందో లేదో అన్న ఆందోళనలో ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు, ప్రజలు ఉన్నారు. ‘ఊళ్లకు ఊళ్లు మాయం’ అనే కథనంతో ‘సాక్షి’లో ప్రచురితమవడం దుబ్బాక మండలంలో తీవ్ర సంచలనంగా మారింది. రెవెన్యూ రికార్డుల్లో దుబ్బాక మండలం కూడా మాయమైందని ఉండటం, అందులో 26 గ్రామాలు గల్లంతు కావడంతో అసలు ఏమయిందో అర్థం గాక ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, ప్రజలు అయోమయం చెందుతున్నారు. అసలు తమ గ్రామం రికార్డుల్లో ఉందో లేదో తెలుసుకునేందుకు మండలంలోని పలు గ్రామాల వారు రెవెన్యూ కార్యాలయానికి పోతే శని, ఆది వారాలు సెలవుదినాలు కావడంతో ఇంకా గందరగోళం నెలకొంది. అసలు రెవెన్యూ రికార్డుల్లో నుంచి మండలంలోని 26 గ్రామాలు ఎలా మాయం అవుతాయి, అధికారుల తప్పిదమా లేక ఎవరన్నా కావాలని చేశారా..? అన్న అనుమనాలు ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి. గజిట్లో లేకుంటే మరి పరిస్థితి ఏంటని జనాభా లెక్కల్లో తమ గ్రామాలు, తాము ఎలా గల్లంతయ్యామని కొత్త జనాభా లెక్కల్లో తాము తమ గ్రామాలు ఉంటాయా అన్న ఆందోళన ప్రజల్లో నెలకొంది. అసలు ఆ 26 గ్రామాలు ఏవీ? రెవెన్యూ రికార్డుల్లో మాయమైన దుబ్బాక మండలంలోని 26 గ్రామాలు ఏవో తెలియక ప్రజా ప్రతినిధులు, ప్రజలు అయోమయం చెందుతున్నారు. మండలంలో 30 గ్రామాలుండగా రికార్డుల్లో మాత్రం దుబ్బాక మండలం పేరు గల్లంతు కావడం అందులో 26 గ్రామాలు కనిపించకుండా పోవడంతో తీవ్ర గందరగోళంగా తయారైంది. తమ గ్రామం రికార్డుల్లో ఉందా అని ఎక్కడ తెలుసుకోవాలో తెలియక పలు గ్రామాల నాయకులు అధికారులకు ఫోన్లు చేస్తున్నారు. శని, ఆదివారాలు వరుస సెలవు దినాలు కావడంతో గ్రామాల్లో ఇంకా అయోమయంగా తయారైంది. మాకేం తెలియదంటున్న రెవెన్యూ అధికారులు రెవెన్యూ రికార్డుల్లో దుబ్బాక మండలం మాయంపై రెవెన్యూ అధికారులు తమకేం తెలియదంటూ పొంతన లేని సమాధానాలు చెబుతున్నారు. అలా ఎలా జరుగుతుంది, తమ దృష్టికి ఏం రాలేదు అని అర్థం లేని మాటలు చెబుతున్నారు. దుబ్బాక మండలం రికార్డుల్లో అసలు ఉందా లేదా అన్న విషయాన్ని అధికారులు ఫోన్లో క్లారిటీగా చెప్పలేకపోతున్నారు. ఉన్నతాధికారులను అడుగుతామని సోమవారం ఆఫీసుకు వచ్చాక తెలుసుకుంటామంటూ విషయంపై క్లారిటీ లేకుండా మాట్లాడుతుండటం చూస్తుంటే ఈ విషయంపై వారికి సరైన అవగాహన లేదన్నట్లు స్పష్టమవుతోంది. ఉన్నతాధికారులతో మాట్లాడుతా.. రికార్డుల్లో దుబ్బాక మండలం మాయం కావడంపై సంబంధిత రాష్ట్ర ఉన్నతాధికారులతో మాట్లాడుతా. ఇలా జరగడానికి కారణం ఏంటి అనే విషయం పూర్తి స్థాయిలో తెలుసుకుంటా. రెవెన్యూ రికార్డుల్లో మండలంతో పాటు 26 గ్రామాలు లేవన్న విషయం తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసింది. ఖచ్చితంగా దీనిపై క్లారిటీ తీసుకుంటే గాని ఏం జరిగిందనేది తెలుస్తుంది. – సోలిపేట రామలింగారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే మా దృష్టికి రాలేదు రికార్డుల్లో దుబ్బాక మండలం మాయమైందన్న విషయం మా దృష్టికి రాలేదు. దీనిపై ఉన్నతాధికారులను సంప్రదించి తెలుసుకుంటాం. ఇలా జరగడానికి వీలు లేదు. సోమవారం కార్యాలయానికి వచ్చాక క్లారిటీగా ఈ విషయంపై తెలుసుకుంటాం. – అన్వర్, తహసీల్దార్, దుబ్బాక -
అవినీతిపై బ్రహ్మాస్త్రం
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో అవినీతికి అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా వైఎస్ జగన్ సర్కారు లోకాయుక్త ఏర్పాటుకు చకచకా ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వం ఏర్పాటైన రెండు నెలల్లోనే లోకాయుక్త నియామకానికి వీలుగా శాసనసభ, శాసన మండలిలో చట్ట సవరణ చేసి గురువారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. స్వతంత్ర ప్రతిపత్తిగల రాజ్యాంగ బద్ధమైన లోకాయుక్త ఉంటే తాను, తన కిచెన్ కేబినెట్ సభ్యులు సాగించే అవినీతి బట్టబయలయ్యే ప్రమాదం ఉందనే భయంతోనే ఇదివరకటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయిదేళ్లపాటు ఆ నియామకాన్ని గాలికి వదిలేశారు. ఎక్కడ అక్రమాలు జరిగినా, ప్రజాధనం దుర్వినియోగమైనా తనంతట తానుగా (సుమోటో) దర్యాప్తు చేసే అధికారం లోకాయుక్తకు ఉంటుంది. అవినీతి, అక్రమాలకు సంబంధించి పత్రికల్లో, టీవీల్లో, సోషల్ మీడియాలో వచ్చే వార్తలను, ఆకాశ రామన్న ఉత్తరాలను కూడా పరిగణనలోకి తీసుకుని విచారణ జరిపించే విస్తృతాధికారం లోకాయుక్తకు ఉంటుంది. అందువల్లే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లోకాయుక్త ఉండరాదనే ఉద్దేశంతో వ్యవహరించారు. భయంతోనే నాడు బాబు వెనుకంజ అవినీతి రహిత, పారదర్శక పాలన అందిస్తానని ఎన్నికల ముందు చెప్పినట్లుగానే వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆచరించి చూపుతున్నారు. తన మాటను విశ్వసించి అఖండ విజయం అందించిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని, ప్రతి రూపాయి ప్రజా ధనాన్ని పారదర్శకంగా, జవాబుదారీగా ఖర్చు చేయాలని అంకిత భావంతో పని చేస్తున్నారు. అధికారంలోకి రాగానే లోకాయుక్త నియామకం కోసం చట్ట సవరణ చేయడం, రూ.వంద కోట్లు దాటిన ప్రతి పనికి సంబంధించిన టెండర్లను న్యాయ సమీక్ష తర్వాత సవరణలు చేసి నిర్వహించాలని అసెంబ్లీలో సాహసోపేత బిల్లును ఆమోదించడం ఇందుకు ప్రత్యక్ష నిదర్శనాలు. హైకోర్టు సిట్టింగ్ జడ్డి, రిటైర్డు ప్రధాన న్యాయమూర్తి దొరకడం లేదనే సాకుతోనే చంద్రబాబు సర్కారు లోకాయుక్తను నియమించకుండా వదిలేసింది. గతంలో కర్ణాటక రాష్ట్రంలో ఇనుప ఖనిజ లైసెన్సుల జారీలో, తవ్వకాల్లో జరిగిన అక్రమాలను అక్కడి లోకాయుక్త ఎండగట్టింది. దీనిని సుమోటోగా తీసుకుని దర్యాప్తు జరిపి నిగ్గుతేల్చింది. ఈ దృష్ట్యా లోకాయుక్తను నియమిస్తే ఎప్పటికైనా తనకూ ఇదే గతి పడుతుందని భయంతోనే చంద్రబాబు ఆ పని చేయలేదని అప్పట్లో అధికార వర్గాలు బహిరంగంగానే వ్యాఖ్యానించాయి. రెండు నెలల్లోనే ఆచరణ మే 30న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి జూన్ 8న మంత్రివర్గం ఏర్పాటు చేశారు. తర్వాత నెల రోజులకే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త సవరణ బిల్లును శాసనసభ, శాసనమండలిలో పెట్టారు. దీనిని ఆమోదించి ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త సవరణ చట్టం – 2019 తెచ్చారు. హైకోర్టు సిట్టింగ్ జడ్జి లేదా హైకోర్టు రిటైర్డు చీఫ్ జస్టిస్లను లోకాయుక్తగా నియమించాలని గతంలో చట్టం ఉండేది. వీరు తగు సంఖ్యలో అందుబాటులో లేనందున హైకోర్టు రిటైర్డు జడ్జిలను లోకాయుక్తగా నియమించడానికి వీలు కల్పిస్తూ చట్ట సవరణ చేశారు. తక్షణమే ఈ చట్టం అమల్లోకి వచ్చినట్లు సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ఆర్పీ సిసోడియా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారమే గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. దీంతో ప్రభుత్వం లోకాయుక్త నియామకానికి నోటిఫికేషన్ ఏ క్షణమైనా జారీ చేసే అవకాశం ఉంది. -
బార్ కౌన్సిళ్ల ఎన్నికల షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బార్ కౌన్సిళ్ల చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికతోపాటు ఇరు రాష్ట్రాల తరఫున బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ)కు ప్రాతినిధ్యం వహించే సభ్యుల ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్, వైస్ చైర్మన్, బీసీఐ సభ్యుడి ఎంపిక కోసం 24న, ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ చైర్మన్, వైస్ చైర్మన్, బీసీఐ సభ్యుడి ఎన్నిక కోసం 25న ఎన్నికలు నిర్వహించనున్నారు. తెలంగాణ బార్ కౌన్సిల్ విషయానికొస్తే 23న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు చైర్మన్, వైస్ చైర్మన్, బీసీఐ సభ్యుడి పోస్టు కోసం నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చు. అదే రోజున నామినేషన్లను పరిశీలించి, సాయంత్రం 4.15 గంటలకు పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. 24వ తేదీ ఉదయం 11 గంటల్లోపు నామినేషన్‌ను ఉపసంహరించుకోవచ్చు. 12 గంటలకు తుది జాబితా ప్రకటించి, 12.30కు ఎన్నిక నిర్వహించి, మధ్యాహ్నం 1.30 గంటలకు ఫలితాలను ప్రకటిస్తారు. ఇదే రీతిలో ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ చైర్మన్, వైస్ చైర్మన్, బీసీఐ సభ్యుడి ఎన్నిక ప్రక్రియ 23వ తేదీన ప్రారంభమవుతుంది. నామినేషన్ల ఉపసంహరణ, తుది జాబితా ప్రకటన, ఎన్నిక, ఫలితాల వెల్లడి 25వ తేదీన ఉంటుంది. ఈ ఏడాది జూన్ 29న ఉభయ రాష్ట్రాల బార్ కౌన్సిళ్లకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఒక్కో బార్ కౌన్సిల్‌కు 25 మంది సభ్యులు ఎన్నికయ్యారు. ఇప్పుడు వీరిలో నుంచి చైర్మన్, వైస్ చైర్మన్, బీసీఐ సభ్యుడిగా ఒక్కరి చొప్పున ఎన్నుకుంటారు. అయితే బార్ కౌన్సిల్ సభ్యుల ఎన్నికను గెజిట్ ద్వారా నోటిఫై చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పటివరకు గెజిట్ విడుదల కాలేదు. సాంకేతికంగా గెజిట్ నోటిఫికేషన్లు రాకుండా ఎన్నికలు జరపడానికి వీల్లేదు. ఇప్పుడు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో గెజిట్ నోటిఫికేషన్లు రాకుండా చైర్మన్, వైస్ చైర్మన్, బీసీఐ సభ్యుల ఎన్నిక కోసం ఎన్నికలు జరుగుతాయా? లేక వాయిదా పడతాయా? అన్న దానిపై న్యాయవాద వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
తొలి రోజు 48 నామినేషన్లు
సాక్షి, హైదరాబాద్/కొత్తగూడెం: రాష్ట్రంలో డిసెంబర్ 7న జరుగనున్న శాసనసభ ఎన్నికలకు ఈసీ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనుంది. ఈ నెల 19 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 20న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు 22తో ముగియనుంది. డిసెంబర్ 7న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. డిసెంబర్ 11న ఓట్ల లెక్కింపు జరగనుంది. కాగా 13 నియోజకవర్గాల్లో పోలింగ్ సమయాన్ని గంట ముందుగానే ముగించాలని ఈసీ నిర్ణయించింది. 106 నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. కానీ గోదావరి పరీవాహక ప్రాంతంలోని ఐదు జిల్లాల్లోని 13 నియోజకవర్గాల్లో 4 గంటల వరకే పోలింగ్ జరపాలని నిర్ణయించింది. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలకు సరిహద్దులో ఉన్న ఈ నియోజకవర్గాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉండడంతో హోంశాఖ సూచనల మేరకు ఎన్నికల సంఘం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. భద్రత కారణాల నేపథ్యంలో ఈవీఎంలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తీసుకొచ్చేందుకు వీలుగా షెడ్యూల్ రూపొందించారు. వీటిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం, కొత్తగూడెం, పినపాక, అశ్వారావుపేట, ఇల్లెందు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ములుగు, భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లా పరిధిలోని మంథని, మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు, మంచిర్యాల, బెల్లంపల్లి, కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా పరిధిలోని సిర్పూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో ఉన్నాయి. డేగకళ్లతో నిఘా.. భద్రాచలం నియోజకవర్గంలోని చర్ల, వెంకటాపురం మండలాల్లో గతంలో ఉనికిలో లేకుండా పోయిన డివిజన్ కమిటీలు ఇప్పుడు క్రియాశీలకంగా మారాయని స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదికలు ఇచ్చింది. ఎన్నికలు బహిష్కరించాలంటూ మావోయిస్టులు బ్యానర్లు కట్టడంతో పాటు వాటి కింద మందుపాతరలు ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో గెరిల్లా దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి, ఐజీ నాగిరెడ్డి ఈ ఐదు జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర పోలీసులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. తొలి రోజు నామినేషన్లు పార్టీల వారీగా.. తొలి రోజు 38 నియోజకవర్గాల పరిధిలో 48 నామినేషన్లు దాఖలయ్యాయి. టీఆర్ఎస్ నుంచి 10 మంది, బీజేపీ నుంచి 9, కాంగ్రెస్ నుంచి 6, టీడీపీ, పీపీఐ, ఆప్, బీఎల్ఎఫ్ నుంచి చెరో ఇద్దరు, సీపీఐ, సీపీఎం, ఎంసీపీఐ, బీఎస్పీ నుంచి ఒక్కొక్కరు, 11 మంది స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేశారు. -
వాజ్‌పేయి మరణాన్ని ధ్రువీకరిస్తూ గెజిట్ నోటిఫికేషన్
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి మరణాన్ని ధ్రువీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్ గౌబ ఈ నోటిఫికేషన్‌ను ఇంగ్లిష్, హిందీ భాషల్లో జారీ చేశారు. న్యూఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో 2018 ఆగస్టు 16న సాయంత్రం 5.05 గంటలకు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి మరణించారని నోటిఫికేషన్లో పేర్కొంది. ఏడు రోజుల సంతాప దినాల్లో భాగంగా దేశవ్యాప్తంగా జాతీయ పతాకాన్ని అవనతం చేయాలని తెలిపింది. మాజీ ప్రధాని మరణిస్తే వారి మరణాన్ని ధ్రువీకరిస్తూ నిబంధనల ప్రకారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడం ఆనవాయితీగా వస్తోందని కేంద్ర హోం శాఖ అధికారులు తెలిపారు. -
అధికార మెహర్బానీ
అధికార పార్టీ నేతల మెహర్బానీ చివరి ఆయకట్టు రైతులకు శాపంగా మారనుం. గెజిట్ నోటిఫికేషన్ రాకుండానే కనిగిరి రిజర్వాయర్ నుంచి 450 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. నవంబరు రెండో తేదీ నుంచి విడుదల చేయాల్సిన నీటిని జిల్లా మంత్రి ఆదేశాలతో ముందుగా విడుదల చేయడంపై చివరి ఆయకట్టు రైతుల నుంచి నిరసన వ్యక్తమవుతోంది బుచ్చిరెడ్డిపాళెం: జిల్లాలో 4.98 లక్షల ఎకరాలను సాగునీరందించేలా శనివారం నెల్లూరు గోల్డెన్ జూబ్లీ హాల్లో జరిగిన ఐఏబీ సమావేశంలో తీర్మానించారు. నవంబరు రెండో తేదీన అధికారికంగా సోమశిల నుంచి నీటి విడుదల చేయాలని నిర్ణయించారు. చివరి ఆయకట్టు రైతులకు నీరందేలా చూడాలని తీర్మానం చేశారు. అయితే కనిగిరి రిజర్వాయర్ నుంచి ఇరిగేషన్ అధికారులు ఆదివారం ముందస్తుగానే నీటిని విడుదల చేశారు. మంత్రి ఆదేశాల మేరకు నీటిని విడుదల చేశామని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం కనిగిరి రిజర్వాయర్ నుంచి పైడేర్ ఎస్కేప్ చానల్‌కు 300 క్యూసెక్కులు, ఈస్ట్రన్ చానల్‌కు 150 క్యూసెక్కులు విడుదల చేశారు. వాస్తవానికి ఐఏబీలో జరిగిన తీర్మానం కాపీ ప్రభుత్వానికి అంది అక్కడి నుంచి నీటి విడుదలకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ విడుదల కావాలి. అయితే మంత్రి మాటలతో ఇరిగేషన్ అధికారులు మాత్రం నీటిని ముందుగా విడుదల చేసి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. ఆందోళనలో చివరి ఆయకట్టు రైతులు కనిగిరి రిజర్వాయర్ నుంచి నీటి విడుదల తెలుసుకున్న చివరి ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రతి ఏడాదీ చివరి ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరందడం ప్రశ్నార్థకంగా మారుతోంది. ఈ క్రమంలో సోమశిల జలాశయంలో నీరు పుష్కలంగా ఉండటంతో చివరి ఆయకట్టుకు నీరందుతుందని సంబరపడ్డారు. అయితే ముందస్తుగా నీటి విడుదల చేయడంతో తమ పొలాల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. టీడీపీ నేతలు మెహర్బానీ కోసం చివరి ఆయకట్టు రైతులను ఇబ్బందులకు గురిచేశారని అంటున్నారు. చివరి ఆయకట్టుకు నీరందాలి ఐఏబీ తీర్మానం జరగడమే ఆలస్యమైంది. చివరి ఆయకట్టు వరకు నీరందాలి. గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వకుండా నీటిని విడుదల చేయడం సరికాదు. అయితే నారుమళ్లు వేసుకున్న రైతులకు మంచిదే. చివరి ఆయకట్టుకు నీరందేలా ఇరిగేషన్ అధికారులు నీటి విడుదలపై తగిన జాగ్రత్తలు పాటించి, రైతులకు నీరందేలా చూడాలి. –జొన్నలగడ్డ వెంకమరాజు, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మిగిలిన కాలువలకు ఎందుకు వదల్లేదు డెల్టా ప్రాంతంలో అన్ని కాలు వలకు సాగునీరందాలి. కొంతమంది ఒత్తిళ్లకు లొంగి కొన్ని కాలువలకు నీరు వదలడం సరికాదు. ఐఏబీ సమావేశంలో తీర్మానాలను గౌరవించాలి. రైతులందరినీ సమాన దృష్టితో చూడాలి. –నెల్లూరు నిరంజన్‌రెడ్డి, కోశాధికారి, జిల్లా రైతు సంక్షేమ సమాఖ్య కమిటీ చైర్మన్ల కోరిక మేరకు నీటి విడుదల ఈస్ట్రన్ చానల్, పైడేరు కాలువ డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ల కోరిక మేరకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ రెండు కాలువలకు నీటిని విడుదల చేశాం. రైతులు ముందుగానే నారుమడులు పోసుకుంటారన్న చైర్మన్ల వాదతో నీటిన విడుదల చేశాం. –షేక్ అహ్మద్‌బాషా, ఇరిగేషన్ ఏఈ, కొడవలూరు -
గెజిట్ నోటిఫికేషన్లను కోర్టు ముందుంచండి
భూసేకరణ చట్టం సవరణలపై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: కేంద్ర భూసేకరణ చట్టం 2013కు సవరణలు చేస్తూ తెలంగాణ రాష్ట్ర భూసేకరణ నిబంధనలను తీసుకొచ్చే ముందు గెజిట్‌లో ముసాయిదా నిబంధనలను ప్రచురించారో లేదో తెలియచేయాలని హైకోర్టు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిం ది. ఈ విషయంలో స్పష్టత కోసం గెజిట్ నోటిఫికేషన్లను తమ ముందుంచాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. విచారణను ఆగస్టు 8కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్‌రంగనాథన్, జస్టిస్ జె.ఉమాదేవిల ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర భూసేకరణ చట్ట నిబంధనల తుది నోటిఫికేషన్ ను రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ప్రధా న కార్యదర్శి ఆర్.వెంకటరాములు ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. అభ్యంతరాలు స్వీకరించలేదు... పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. చట్ట ప్రకారం ముందు ముసాయిదా నిబంధనలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని, వారి అభ్యంతరాలను తెలుసుకున్న తర్వాతనే తుదిరూపు ఇవ్వాల్సి ఉందన్నారు. కానీ అభ్యంతరాలు స్వీకరించకుండానే ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చేసిందన్నారు. వాదనలు విన్న ధర్మాసనం... భూ సేకరణపై అభ్యంతరాలు పెం డింగ్‌లో ఉండగా జిల్లా కలెక్టర్ ఆయా భూముల యజమానులతో సేకరణ కు ఒప్పందం కుదుర్చుకోవచ్చా.. లేదా.. అన్న విషయంపై లోతుగా విచారణ జరుపుతామని తెలిపింది. విచారణను ఆగస్టు 17కి వాయిదా వేసింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో నిర్మించతలపెట్టిన కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్ కోసం సిద్దిపేట జిల్లా తానేదార్పల్లి, తానేదార్పల్లి తాండా, మామిడ్యాల, భైలాంపూర్ గ్రామాల్లో రైతుల అభ్యంతరాలను పట్టించుకో కుండా భూసేకరణ చేయడంపై మామిడ్యాలకి చెందిన టి.శ్రీనివాస్ మరో ఐదుగురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
‘ఏకీకృత’ రాజముద్ర
- టీచర్ల ఏకీకృత సర్వీసు నిబంధనల గెజిట్ జారీ - 1998 నుంచి వర్తింపు సాక్షి, న్యూఢిల్లీ: ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు నిబంధనలకు సంబంధించి కేంద్ర హోం శాఖ శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. 1975 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులను సవరిస్తూ పంచాయతీరాజ్ టీచర్లను ప్రభుత్వోపాధ్యాయులతో పాటు ఒకే క్యాడర్‌గా నిర్ధారిస్తూ ఈ ఉత్తర్వులు జారీచేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఉపాధ్యాయులకు సంబంధించి మొత్తం నాలుగు గెజిట్లను విడుదల చేసింది. గెజిటెడ్ ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు విధానం 1998 నవంబరు 16 నుంచి అమలవుతుందని, నాన్ గెజిటెడ్ టీచర్ల ఏకీకృత సర్వీసు నిబంధనల విధానం 1998 నవంబరు 20 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది. తెలంగాణ గెజిటెడ్ టీచర్లకు సంబంధించి... తెలంగాణ గెజిటెడ్ టీచర్ల క్యాడర్‌ను 637(ఇ) గెజిట్ నోటిఫికేషన్లో నిర్ధారించారు. రాష్ట్రపతి ఉత్తర్వుల్లో పేర్కొన్న ప్రభుత్వోద్యోగులతో పాటు పంచాయ తీరాజ్ విభాగానికి చెందిన గెజిటెడ్ ఉపాధ్యాయులను కూడా చేరుస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. వాటి సారాంశం ఏమిటంటే... ‘రాజ్యాంగంలోని 371డి అధికరణం పరిధిలోని 1, 2 నిబంధనలు దఖలు పరిచిన అధికారం మేరకు 1975 నాటి ఏపీ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ ఉత్తర్వులను రాష్ట్రపతి సవరిం చారు. నాటి ఉత్తర్వుల్లోని మూడో షెడ్యూల్లో క్రమసంఖ్య 23 తరువాత 23–ఏను చేర్చి, మండల విద్యాధికారి, ప్రభుత్వ, జడ్పీ ఉన్నత పాఠశాలల ప్రధానో పాధ్యాయులను ఇందులో పొందుపరిచారు. 26–ఏను చేర్చి, డైట్ సీనియర్ లెక్చరర్లను దీని పరిధిలో పొందుపరిచారు. 26–బీని చేర్చి, డైట్ లెక్చరర్లను దీని పరిధిలో పొందుపరిచారు. ఈ ఉత్తర్వులు 1998 నవంబరు 16 నుంచి వర్తిస్తా యి. వీటి అమలుకు వీలుగా గత ఉత్తర్వులను సవరించాల్సి ఉంటుంది. ఇది తెలంగాణ మొత్తానికి వర్తిస్తుంది’’. తెలంగాణ నాన్ గెజిటెడ్ టీచర్లకు సంబంధించి... తెలంగాణ నాన్ గెజిటెడ్ టీచర్లకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ నెంబరు 639(ఇ)ని కేంద్ర హోం శాఖ విడుదల చేసింది. ‘‘1975 నాటి ఏపీ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ ఉత్తర్వుల్లోని పేరా 3లో రెండో ఉప పేరా తరువాత 2–ఏ పేరాను చేర్చాలి. ప్రతి జిల్లాలోని మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు, ప్రభుత్వ పాఠశాలల్లోని నాన్ గెజిటెడ్ టీచర్లను ప్రత్యేక సమీకృత కేడర్‌గా ఆర్గనైజ్ చేస్తూ 2–ఏ పేరాలో పొందుపరచడం జరిగింది. ఈ సవరించిన ఉత్తర్వులు 1998 నవంబరు 20 నుంచి అమల్లోకి వస్తాయి. ఇందుకు వీలుగా పూర్వ జీవోలను సవరించాల్సి ఉంటుంది’’ అని పేర్కొంది. ఏపీ గెజిటెడ్ టీచర్ల కేడర్‌ను 636 (ఇ) నోటిఫికేషన్లో, నాన్ గెజిటెడ్ టీచర్ల కేడర్‌ను 638 (ఇ)లో కేంద్ర హోం శాఖ పొందుపరిచింది. చరిత్రాత్మకం: వెంకయ్య ఉపాధ్యాయ ఏకీకృత సర్వీసులకు రాష్ట్రపతి ఆమోదాన్ని చరిత్రాత్మక ఘటనగా కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి ఎం.వెంకయ్య నాయుడు అభివర్ణించారు. గెజిట్ నోటిఫికేషన్ వెలువడ్డాక ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు. ‘తెలంగా ణ, ఏపీ ఉపాధ్యాయుల దీర్ఘకాల సమస్యకు ఇది పరిష్కారం. సంబంధిత ఫైలు పలు దశల్లో వేగంగా కదిలేందుకు సహకరించిన కేంద్ర హోం, న్యాయ శాఖలకు అభినందనలు. ఉపాధ్యాయుల 20 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతామన్న ఎన్నికల వాగ్దానాన్ని నెరవేర్చాం’’ అని అందులో పేర్కొన్నారు. -
‘ఏకీకృతం’ అమలుకు ప్రత్యేక కమిటీ
ఉప ముఖ్యమంత్రి కడియం వెల్లడి.. గెజిట్ నోటిఫికేషన్ విడుదల కాగానే విధి విధానాలు సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు నిబంధనలకు రాష్ట్రపతి ఆమోదం లభించడంతో తదుపరి కార్యాచరణపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఏకీకృత రూల్స్‌ను ఎలా అమలు చేయాలన్న విషయంలో ప్రత్యే కంగా కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయా నికి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫి కేషన్ జారీ చేయగానే కమిటీని ఏర్పాటు చేసి అమలు విషయంలో విధి విధానాలను రూపొందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇదే విషయాన్ని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. శుక్రవారం వివిధ ఉపాధ్యాయ సంఘాల నేతలు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు సుధాకర్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, రవీం దర్ తదితరులు కడియంను కలిశారు. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ ఏకీకృత సర్వీసు రూల్స్‌కు గెజిట్ నోటిఫికేషన్ రాగానే కార్యాచరణ ప్రారంభిస్తామని, అమలు కు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. దీనిపై ఉపాధ్యాయ సంఘాలతోనూ సమావే శమై సలహాలు, సూచనలు తీసుకుంటామ న్నారు. టీచర్ల బదిలీలపై కూడా సంఘాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. 2013లోనే సెల్‌పై ఆంక్షలు తరగతి గదిలో ఉపాధ్యాయులు సెల్ ఫోన్ మాట్లాడవద్దని 2013లోనే సర్క్యులర్ వచ్చిం దని కడియం అన్నారు. ఈ నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని ప్రధానోపాధ్యా యులకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు. ప్రధానోపాధ్యాయుని గదిలోగానీ, స్టాఫ్ రూమ్ లోగానీ, తరగతి బయటగానీ ఉపాధ్యా యులు సెల్ ఫోన్ మాట్లాడుకోవచ్చని, పాఠాలు చెప్పే తరగతి గదిలో మాత్రం ఫోన్ మాట్లాడవద్దని స్పష్టంచేశారు. ఏకీకృత నిబంధనలు గత 20 ఏళ్లుగా లేకపోవడం వల్ల విద్యావ్యవస్థలో పదోన్నతులు ఆగి, నిర్వహణ వ్యవస్థ కొంత ఇబ్బందిగా మారిందన్నారు. అనేక పోస్టులు ఖాళీగా ఉన్నాయని కడియం పేర్కొన్నారు. ఇప్పుడు ఈ నిబంధనలకు ఆమోదం లభించడంతో పదోన్నతులు వస్తాయన్నారు. దీంతో ఉపాధ్యాయ సంఘాల ప్రధాన డిమాండ్లు అన్నీ కొలిక్కి వస్తున్నాయ న్నారు. ఇప్పటికే ఉపాధ్యాయ ఖాళీలన్నింటినీ భర్తీ చేయాలని నిర్ణయించామని, నోటిఫికేషన్లు కూడా వస్తున్నాయని తెలిపారు. పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపడుతున్నాయని, ఇందుకోసం పెద్ద ఎత్తున నిధులు విడుదల చేశామని వివరించారు. నమ్మకాన్ని పెంచుతున్నాం.. ప్రధానంగా మూడు కారణాల వల్ల ప్రజలకు ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం సన్నగిల్లిందని, ఆ నమ్మకాన్ని పెంచేందుకు చర్యలు చేపడుతున్నామని కడియం పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సరైన వసతులు లేకపోవడం అందులో ప్రధానమైందన్నారు. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ పాఠశాలల్లో మౌలిక వసతుల కోసం పెద్ద ఎత్తున నిధులు విడుదల చేశారని, ప్రతి పాఠశాలలో ప్రైవేట్‌కు దీటుగా వసతులు కల్పిస్తున్నామని ఆయన చెప్పారు. తమ పిల్లలను ఇంగ్లిషు మీడియంలో చదివించాలనే కోరికతో కూడా చాలా మంది తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రైవేట్ బడుల్లో చేర్పిస్తున్నారన్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది 5,000 పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియంను ప్రవేశపెట్టిందని, ఈ ఏడాది కూడా అవసరమైన మేరకు ఆ సంఖ్యను పెంచుతున్నామని కడియం వెల్లడించారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల కొరత లేకుండా నియామకాలు చేపడుతున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలలను పూర్తి స్థాయిలో పటిష్టం చేస్తున్నామన్నారు. తల్లిదం డ్రులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వంపై సమష్టిగా ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. మరోవైపు దసరా సెలవుల్లో టీచర్ల బదిలీలు, పదోన్నతులు కల్పించేందుకు చర్యలు చేపడతామని కడియం శ్రీహరి హామీ ఇచ్చినట్లు యూటీఎఫ్ వెల్లడించింది. -
‘గన్నవరం’ ఇక అంతర్జాతీయం
ఎయిర్‌పోర్ట్‌పై గెజిట్ విడుదల చేసిన కేంద్రం సాక్షి, న్యూఢిల్లీ: విజయవాడ గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా గుర్తించిన కేంద్రం అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. గతంలోనే కేంద్ర క్యాబినెట్ గన్నవరం విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా కల్పించేందుకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఇప్పుడు అధికారికంగా గెజిట్ విడుదల చేసిన ప్రభుత్వం ఆగస్టు 8వ తేదీ నుంచి అంతర్జాతీయ సేవలు ప్రారంభమవుతాయని పేర్కొంది. అలాగే తిరుపతి విమానాశ్రయానికి కూడా అంతర్జాతీయ హోదా కల్పిస్తూ అధికారికంగా గెజిట్ వెలువరించింది. -
ఉచిత గ్యాస్‌కు ఆధార్ తప్పనిసరి
ఆధార్‌నంబర్ లేని మహిళలు మే 31లోగా దరఖాస్తు చేసుకోవాలి న్యూఢిల్లీ: ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద ఉచిత వంటగ్యాస్ (ఎల్పీజీ) కనెక్షన్ పొందాలనుకునే నిరుపేద మహిళలు తప్పనిసరిగా ఆధార్ కార్డు కలిగి ఉండాలని కేంద్రం స్పష్టం చేసింది. గత ఏడాది అక్టోబర్‌లో ఎల్పీజీ సబ్సిడీలు పొందే ప్రతిఒక్కరికీ విశిష్ట గుర్తింపు సంఖ్యను తప్పనిసరి చేసిన ప్రభుత్వం.. తాజాగా దారిద్య్రరేఖకు దిగువున ఉన్న కుటుంబాల మహిళలు ఉచిత గ్యాస్ కనెక్షన్ పొందేందుకు కూడా ఆధార్‌ను తప్పనిసరి చేసింది. స్వచ్ఛమైన వంట ఇంధనాన్ని అందజేసే లక్ష్యంతో.. మూడేళ్లలో ఐదు కోట్ల మంది నిరుపేద మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చేందుకు గత ఏడాది ప్రధానమంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై)కు కేంద్రం శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో తాజాగా పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ ఓ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పీఎంయూవై కింద ప్రయోజనం పొందాలని భావించే లబ్ధిదారు ఆధార్ నంబర్‌ను కలిగి ఉన్నట్టుగా ధ్రువీకరణ పత్రం సమర్పించాలని లేదా ఆధార్ కోసం నమోదు చేసుకోవాలంది. ఆధార్ లేనివారు మే 31లోగా దరఖాస్తు చేసుకోవాలి. పంట బీమాకూ... న్యూఢిల్లీ: రాబోయే ఖరీఫ్ సీజన్ నుంచి పంటల బీమా పొందే రైతులకు ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. తమ ఈ నిబంధనకు కట్టుబడి ఉండాలని కేంద్ర వ్యవసాయ శాఖ గ్రామీణ ఆర్థిక సంస్థల(ఆర్ఎఫ్ఐ)కి ఆదేశాలు జారీచేసింది. ‘వ్యవసాయ శాఖ అమలు చేస్తున్న పంటల బీమా సౌకర్యం పొందుతున్న రైతులంతా 2017 ఖరీఫ్ నుంచి ఆధార్ వివరాలు సమర్పించాలి’ అని ఆదేశాల్లో పేర్కొన్నారు. రైతులు బ్యాంకును సందర్శించినపుడు లేదా రుణాలు మంజూరు చేసే సమయంలో ఆధార్ సమర్పించేలా వారిని ఒప్పించాలని బ్యాంకులను కోరారు. ఆధార్ లేని రైతులు దాన్ని పొందే వరకూ బ్యాంక్ పాస్‌బుక్, ఓటర్ గుర్తింపు కార్డు, ఉపాధి హామీ కార్డు, ఆధార్ దరఖాస్తు కాపీతోపాటు డ్రైవింగ్ లైసెన్స్ లాంటి గుర్తింపు కార్డులను చూపి బీమా ప్రయోజనాలు పొందవచ్చన్నారు. -
సైబరాబాద్ కమిషనరేట్లకు రాజముద్ర
* సైబరాబాద్ ఈస్ట్, వెస్ట్ విభజన, పరిధి పెంపు ఇక అధికారికం * గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసిన గవర్నర్ * జూన్ 15 నుంచి అమల్లోకి వచ్చినట్టుగా ఆర్డినెన్స్ * ఇక నూతన కమిషనరేట్ల నుంచే కొత్త ఠాణాల పాలన సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ల విభజన, పరిధి పెంపు పరిపూర్ణమైంది. జూన్ 15న సైబరాబాద్ కమిషనరేట్‌ను సైబరాబాద్ ఈస్ట్, సైబరాబాద్ వెస్ట్గా విభజిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినప్పటి నుంచి ఆర్డినెన్స్ అమల్లోకి వచ్చినట్టుగా గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ శని వారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. 2 కమిషనరేట్ల పరిధి, విధివిధానాలకు సంబంధించిన చట్టాన్ని శాసనసభ ఆమోదించాల్సి ఉండటం.. ఈ ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉండటంతో శాంతిభద్రతల కోణంలో దీని ఆవశ్యకతను గుర్తించి గవర్నర్ ‘రాజముద్ర’ వేశారు. కాగా, నగర శివారు ప్రాంతాల్లో పట్టణీకరణ ఊపందుకుంటుండటంతో పాటు భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగాఅవసరాలను బట్టి ఇతర జిల్లాలోని ఠాణాలను కలుపుకునేలా, లేదంటే ఇతర ప్రాంత పరిధిలోకి ఠాణాలు ఇచ్చేలా అధికారాలు కల్పిస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. సైబరాబాద్ ఈస్ట్ కమిషనరేట్‌ను రాచకొండ పోలీసు కమిషనరేట్‌గా, సైబరాబాద్ వెస్ట్ కమిషనరేట్‌ను సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌గా మార్చేందుకు కేబినెట్ ఆమోదముద్ర వేయడంతో తాజా ఆర్డినెన్స్ ప్రకారం త్వరలోనే ఉత్తర్వులు రానున్నాయి. ఇప్పటికే సైబరాబాద్ ఈస్ట్ పోలీసు కమిషనర్‌గా మహేష్ ఎం.భగవత్, సైబరాబాద్ వెస్ట్ పోలీసు కమిషనర్‌గా నవీన్ చంద్ బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. జోన్‌కు ఎస్పీ స్థాయి అధికారి డీసీపీ హోదాలో, డివిజన్‌కు డీఎస్పీ స్థాయి అధికారి ఏసీపీ హోదాలో నేతృత్వం వహిస్తారు. సైబరాబాద్ ఈస్ట్‌లోకి భువనగిరి జోన్.. సైబరాబాద్ ఈస్ట్ పరిధిలో ఎల్బీనగర్, మల్కాజిగిరి జోన్లు ఉండగా తాజాగా భువనగిరి జోన్ వచ్చి చేరనుంది. భువనగిరి జోన్లో భువనగిరి, చౌటుప్పల్ డివిజన్లు ఉండనున్నాయి. మల్కాజిగిరి జోన్లో మల్కాజిగిరి, కుషాయిగూడ డివిజన్లు ఉంటాయి. ఎల్బీనగర్ జోన్లో ఎల్బీనగర్, వనస్థలిపురం, ఇబ్రహీంపట్నం డివిజన్లు ఉండనున్నాయి. మల్కాజిగిరి జోన్ పరిధిలో ఉన్న కీసర, ఘట్కేసర్ పోలీసుస్టేషన్లతో పాటు భువనగిరి టౌన్ అండ్ రూరల్, బొమ్మలరామారం, బీబీ నగర్ ఠాణాలు భువనగిరి జోన్లోకి వచ్చాయి. మ ల్కాజ్గిరి జోన్ పరిధిలోని అల్వాల్ డివిజన్‌ను కుషాయిగూడ డివిజన్‌గా పిలుస్తారు. శంషాబాద్ జోన్లోకి షాద్‌నగర్ డివిజన్.. సైబరాబాద్ వెస్ట్ పరిధిలో శంషాబాద్, మాదాపూర్, బాలానగర్ జోన్లు ఉండనున్నాయి. శంషాబాద్ జోన్లో శంషాబాద్, రాజేంద్రనగర్ డివిజన్లతో పాటు కొత్తగా మహబూబ్‌నగర్‌కు చెందిన షాద్‌నగర్ డివిజన్ చేరనుంది. మాదాపూర్ జోన్లో మాదాపూర్, కూకట్పల్లి డివిజన్లతో పాటు కొత్తగా మియాపూర్ డివిజన్ ఏర్పాటు చేస్తున్నారు. బాలానగర్ జోన్లో పేట్ బషీరాబాద్, బాలానగర్ డివిజన్లు ఉంటాయి. షాద్‌నగర్, కొందుర్గు, కేశంపేట్, కొత్తూరు ఠాణాలు షాద్‌నగర్ డివిజన్ పరిధిలో ఉంటాయి. శంషాబాద్ డివిజన్లో ప్రస్తుతమున్న శంషాబాద్, ఆర్జీఐ పోలీసు స్టేషన్లతో పాటు రంగారెడ్డి జిల్లాకు చెందిన చేవేళ్ల, షాబాద్ ఠాణాలు చేరనున్నాయి. బాధ్యత మరింత పెరిగింది.. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లకు పూర్తి స్వేచ్ఛను కల్పిస్తూ గవర్నర్ ఆర్డినెన్స్ తీసుకురావడం ఆనందంగా ఉంది. ఇతర జిల్లాల్లోని మరిన్ని ఠాణాలు మా పరిధిలోకి రానుండటంతో మరింత బాధ్యత పెరిగినట్టైంది. ఇది మాకు చాలెంజ్ లాంటిదైనా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నాం. కమిషనరేట్ల పరిధి పెంపుతో ఇక నుంచి సమర్థవంతంగా పనిచేస్తాం. ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో ప్రజలకు చేరువవుతాం. - మహేష్ భగవత్, నవీన్ చంద్, సైబరాబాద్ కమిషనర్లు -
ఏపీ ఎంసెట్‌పై ‘స్థానికత’ ప్రభావం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే వారికి ఆ రాష్ట్ర స్థానికతను వర్తింపచేసేలా శుక్రవారం రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడంతో ఆ ప్రభావం ప్రస్తుతం జరుగుతున్న ఎంసెట్ కౌన్సెలింగ్‌పై పడుతుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ ఎంసెట్ రాసి కౌన్సెలింగ్‌కు హాజరవుతున్న తెలంగాణ ప్రాంత అభ్యర్థులు ఏపీకి వెళ్తే కనుక అక్కడి స్థానికత ఆధారంగా వారికి లోకల్ కోటాలో సీట్లు కేటాయిస్తారా? లేదా? అన్నది సందిగ్ధంగా మారింది. దీనిపై ఉన్నతాధికారవర్గాల్లోనూ తర్జనభర్జన సాగుతోంది. గతనెలలో జరిగిన ఏపీ ఎంసెట్‌లో తెలంగాణ(ఓయూ రీజియన్) నుంచి ఇంజనీరింగ్‌లో 17,548 మంది, మెడికల్ విభాగంలో 22,591 మంది పరీక్ష రాశారు. ఇంజనీరింగ్‌లో దాదాపు 1.60 లక్షల సీట్లుండగా, ఎంబీబీఎస్‌లో 3,900 సీట్లు, డెంటల్ కోర్సులో 1,300 సీట్లు ఉన్నాయి. వీటిలో 371 డీ ప్రకారం ఆయా రీజియన్ల పరిధిలోని సీట్లలో 85 శాతం స్థానికులకు, 15 శాతం సీట్లు మెరిట్లో ఓపెన్ టు ఆల్ ప్రాతిపదికన భర్తీచేయాలి. ఏపీ ఎంసెట్‌కు సంబంధించి 371 డీ ప్రకారం ఏపీలోని ఆంధ్రా యూనివర్సిటీ, శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ, తెలంగాణలోని ఉస్మానియా వర్సిటీల రీజియన్లుగా ఉన్నాయి. ఈ లెక్కన హైదరాబాద్, తెలంగాణలో ఇంటర్ వరకు చదివి ఎంసెట్‌లో ఉత్తీర్ణులైన వారికి ఏపీలోని ఇంజనీరింగ్, మెడికల్ సీట్లలో 15 శాతం కోటా మాత్రమే వస్తుంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్‌లో ఉస్మానియా పరిధి నుంచి ఉత్తీర్ణులైన వారిని ఎంసెట్ అడ్మిషన్ల కమిటీ అధికారులు 15 శాతం ఓపెన్ కోటాకు అనుమతించేలా చర్యలు తీసుకున్నారు. ఆన్లైన్ సీట్ల కేటాయింపులో ఆమేరకు సాఫ్ట్‌వేర్‌ను రూపొందించి కౌన్సెలింగ్‌ను కొనసాగిస్తున్నారు. ఇప్పటికే 1 నుంచి 35 వేల ర్యాంకులు సాధించిన అభ్యర్థులు ఆప్షన్ల నమోదు పూర్తిచేశారు. వీరిలో అత్యధిక శాతం మంది తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్‌కు చెందిన అభ్యర్థులున్నారు. ఈ తరుణంలో తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే వారికి స్థానికతను వర్తింపచేసే ఫైలుకు రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో కౌన్సెలింగ్‌పై దాని ప్రభావం పడుతోంది. 85 శాతమా..? 15 శాతమా..? ప్రస్తుతం ఏపీ ఎంసెట్‌లో అర్హత సాధించిన ఓయూ రీజియన్ అభ్యర్థుల్లో అనేక మంది తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే అవకాశముంటుందని పలువురు పేర్కొంటున్నారు. అలా అయితే వారికి ఏపీ స్థానికత వర్తిస్తుంది. అపుడు ఎంసెట్‌లో వారికి 85 శాతం స్థానిక కోటాలో సీట్లు కేటాయిస్తారా? లేక ఇంటర్ హైదరాబాద్, తెలంగాణలో చదివినందున 15 శాతం స్థానికేతర కోటాలో సీట్లు కేటాయిస్తారా? అన్నది సందిగ్ధంగా మారింది. ఏపీకి వెళ్లే ఈ విద్యార్థులకు ఏ రీజియన్ పరిధిలో స్థానికత వర్తిస్తుందన్నది కూడా మరో ప్రశ్నగా ఉంది. ఎందుకంటే ఏపీలోని ఏయూ, ఎస్వీయూలు రెండు రీజియన్లుగా ఉన్నాయి. ఏయూ పరిధిలోని ఇంజనీరింగ్, మెడికల్ సీట్లలో ఎస్వీయూ పరిధిలో స్థానికత ఉన్నవారికి 15 శాతం ఓపెన్ కోటాలో మాత్రమే కేటాయింపులు చేస్తారు. అలాగే ఎస్వీయూ పరిధిలోని సీట్లలో ఏయూ పరిధి స్థానికత ఉన్నవారిని 15 శాతం సీట్లలో మాత్రమే అనుమతిస్తారు. రాష్ట్రపతి ఉత్తర్వుల అమలుకనుగుణంగా రాష్ట్రప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకోవాలి. ఆ తరువాత తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే వారికి ఏ రీజియన్‌కు సంబంధించిన స్థానికత వర్తిస్తుందో తేలాలి. అప్పటికి గానీ ఆయా అభ్యర్థుల స్థానికతపై ఒక స్పష్టత రాదు. ఇందుకు చాలా సమయం పట్టనుంది. ఉన్నత స్థాయిలో చర్చించాకే స్పష్టత.. ఏపీ ఎంసెట్‌కు సంబంధించి ఈనెల 22న మొదటి విడత కౌన్సెలింగ్ సీట్ల అలాట్‌మెంటు పూర్తవుతుంది. ఆలోగా ఈ వ్యవహారమంతా తేలదు. ఈ నేపథ్యంలో దీనిపై ఏంచేయాలా? అని అధికారులు ఆలోచనల్లో పడుతున్నారు. ఎంసెట్ అడ్మిషన్ల కమిటీ అధికారులు దీనిపై స్పందిస్తూ దీనిపై ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. ప్రభుత్వ ఆదేశాలననుసరించి ముందుకు వెళ్తాం. దీనిపై మంత్రి గంటా శ్రీనివాసరావు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తాం అని వివరించారు. ఉన్నత స్థాయిలో చర్చించాకే దీనిపై ఒక స్పష్టత వస్తుంది అని పేర్కొన్నారు. ఎంసెట్ కౌన్సెలింగ్ రాష్ట్రపతి ఉత్తర్వులు రాకముందే ప్రారంభమైనందున ఆ ఉత్తర్వులు ఈ కౌన్సెలింగ్‌కు అమలు చేయాలా? లేదా అన్నది ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవలసి ఉందని వివరించారు. -
కొత్తగా 12 పంచాయతీరాజ్ డివిజన్లు
నిజామాబాద్, మెదక్ మినహా అన్ని జిల్లాల్లో అదనపు డివిజన్లు సాక్షి, హైదరాబాద్ : పంచాయతీరాజ్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసే ఉద్దేశంతో రాష్ట్రంలో మరో 12 పంచాయతీరాజ్ డివిజన్లు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్పీసింగ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ శాఖలో 40, పంచాయతీరాజ్ విభాగంలో 28 డివిజన్లు ఉన్నాయి. దీంతో పరిపాలనాపరమైన ఇబ్బందులతోపాటు ఉన్నతాధికారులు ప్రజలకు అందుబాటులో ఉండలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో వివిధ జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన విజ్ఞాపనలను పరిశీలించిన ప్రభుత్వం, రెవెన్యూ డివిజన్లతో సమానంగా పంచాయతీరాజ్ డివిజన్లను ఏర్పాటు చేసింది. మెదక్, నిజామాబాద్ జిల్లాలు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో అదనపు డివిజన్లు ఏర్పాటయ్యాయి. కొత్త డివిజన్ల ఇవే... ఆదిలాబాద్ జిల్లాలో 187 గ్రామాలతో మంచిర్యాల, 115 గ్రామాలతో ఉట్నూర్ పంచాయతీరాజ్ డివిజన్లు ఏర్పాటు చేశారు. కరీంనగర్ జిల్లాలో 211 గ్రామాలతో సిరిసిల్ల, 122 గ్రామాలతో మంథని, ఖమ్మం జిల్లాలో 93 గ్రామాలతో పాల్వంచ, వరంగల్ జిల్లాలో 200 గ్రామాలతో జనగాం, 119 గ్రామాలతో నర్సంపేట, మహబూబ్‌నగర్ జిల్లాలో 165 గ్రామాలతో వనపర్తి, రంగారెడ్డి జిల్లాలో 82 గ్రామాలతో మల్కాజిగిరి, 38 గ్రామాలతో రాజేంద్రనగర్, నల్లగొండ జిల్లాలో 253 గ్రామాలతో సూర్యాపేట, 151 గ్రామాలతో దేవరకొండ పంచాయతీరాజ్ డివిజన్లను కొత్తగా ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు తెలుగు, ఇంగ్లిష్భాషల్లో గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లను సర్కారు ఆదేశించింది. కొత్త డివిజన్లకు అవసరమైన సిబ్బంది, బడ్జెట్ ప్రతిపాదనలను వెంటనే సిద్ధం చేయాలని పంచాయతీరాజ్‌శాఖ డెరైక్టర్‌కు ప్రభుత్వం సూచించింది. ప్రభుత్వం నిర్ణయంపై పంచాయతీరాజ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం హర్షం వ్యక్తం చేసింది. -
‘పునర్విభజన’ కేసులన్నీ ఇకపై ధర్మాసనానికి..
* రిట్ నిబంధనలకు హైకోర్టు సవరణ * గెజిట్ నోటిఫికేషన్ జారీ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట పరిధిలోకి వచ్చే కేసులన్నింటినీ హైకోర్టు తాజాగా ధర్మాసనం పరిధిలోకి తీసుకొచ్చింది. ఈ మేరకు రిట్ నిబంధనలను సవరించింది. గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ అయింది. దీని ప్రకారం ఇకపై పునర్విభజన చట్ట పరిధిలోకి వచ్చే అన్ని కేసులను ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన హైకోర్టు ధర్మాసనం విచారించనుంది. ఇప్పటివరకు ఏ చట్టానికి సంబంధించిన నిబంధనలనైనా సరే సవాలు చేస్తూ దాఖలయ్యే వ్యాజ్యాలను, విభజన చట్టానికి సంబంధించి దాఖలయ్యే పిల్లను మాత్రమే ధర్మాసనం విచారిస్తూ వస్తోంది. అయితే పునర్విభజన చట్టానికి సంబంధించిన ఏ అంశంపైనైనా దాఖలయ్యే వ్యాజ్యాలను సింగిల్ జడ్జిలే విచారిస్తూ వస్తున్నారు. ఇలా సింగిల్ జడ్జిలు విచారించి తీర్పులివ్వడం, ఆ తీర్పులపై ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు కావడం, ధర్మాసనం తీర్పులివ్వడం వంటి ప్రక్రియ అంతటికి సమయం పడుతోంది. పునర్విభజన చట్టం విషయంలో ఇరు రాష్ట్రాల ప్రయోజనాలు ముడిపడి ఉండటంతో.. ఈ పరిస్థితిని నివారించేందుకు వీలుగా పునర్విభజన చట్ట సంబంధిత వ్యాజ్యాలన్నింటినీ ధర్మాసనమే విచారించాలనే అభ్యర్థనలు న్యాయవాదుల నుంచి వచ్చాయి. ఈ నేపథ్యంలో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి దిలీప్ బి.బొసాలే నేతృత్వంలోని పరిపాలన కమిటీ సానుకూలంగా స్పందించింది. ఆ మేరకు హైకోర్టు రిట్ ప్రొసీడింగ్ రూల్స్ 1977 రూల్ 14(ఏ), (4)కు బుధవారం సవరణలు చేసింది. విద్యుత్ ఉద్యోగుల విభజన కేసు ధర్మాసనానికి? విద్యుత్ ఉద్యోగుల విభజనకు సంబంధించిన మార్గదర్శకాలకు ఆమోద ముద్ర వేస్తూ తెలంగాణ విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి జారీ చేసిన ఉత్తర్వులను, ఆ ఉత్తర్వులకు అనుగుణంగా టీఎస్ ట్రాన్స్‌కో చైర్మన్ రూపొందించిన తుది జాబితా అమలును సవాలు చేస్తూ.. ఉద్యోగులు (ఏపీ స్థానికత కలిగినవారిగా తెలంగాణ ప్రభుత్వం చెబుతున్నవారు) దాఖలు చేసిన పిటిషన్లు కూడా ధర్మాసనానికి బదిలీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వ్యాజ్యాలు బుధవారం న్యాయమూర్తి రెడ్డి కాంతారావు ముందు విచారణకు వచ్చాయి. టీ విద్యుత్ సంస్థల తరఫున వాదనలు వినిపిస్తున్న సీనియర్ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి రిట్ రూల్స్‌కు హైకోర్టు చేసిన సవరణలను న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. ఈ సవరణల ప్రకారం ఈ వ్యాజ్యాలను ధర్మాసనానికి నివేదించాల్సి ఉంటుందన్నారు. దీనిపై ఉద్యోగుల తరఫు న్యాయవాదుల్లో ఒకరైన డాక్టర్ లక్ష్మీనర్సింహ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. టీ ట్రాన్స్‌కో జారీ చేసిన ఉత్తర్వులను తాము సవాలు చేశామే తప్ప, పునర్విభజన చట్ట నిబంధనలను సవాలు చేయలేదని, అందువల్ల తమ వ్యాజ్యాలు పునర్విభజన చట్ట పరిధిలోకి రావని తెలిపారు. ఈ వాదనతో జస్టిస్ కాంతారావు ఏకీభవించలేదు. ఈ వ్యాజ్యాలు పునర్విభజన చట్ట పరిధిలోకి వస్తాయి కాబట్టి వాటిని ధర్మాసనానికి నివేదిస్తానని చెప్పారు. ఈ సమయంలో పిటిషనర్ల తరఫు మరో న్యాయవాది ఎస్.శ్రీరాంరెడ్డి జోక్యం చేసుకుని విచారణను గురువారానికి వాయిదా వేస్తే తమ అభ్యంతరాలను తెలియచేస్తామని చెప్పడంతో న్యాయమూర్తి అందుకు అంగీకరించారు. -
శ్రీలంక పార్లమెంటు రద్దు
కొలంబో: శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన శుక్రవారం ఆ దేశ పార్లమెంటును రద్దు చేశారు. షెడ్యూలు ప్రకారం 2016 ఏప్రిల్‌లో పార్లమెంటు ఎన్నికలు జరగాల్సి ఉండగా, 8 నెలలు ముందుగానే ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమం చేస్తూ పార్లమెంటును రద్దు చేశారు. సంబంధిత గెజిట్ నోటిఫికేషన్‌పై అధ్యక్షుడు శుక్రవారం సంతకం చేశారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. లంక పార్లమెంటులో 225 మంది సభ్యులు ఉన్నారు. అయితే, పార్లమెంటును రద్దు చేస్తానని ఏప్రిల్ 23నే ప్రకటించిన సిరిసేన రాజ్యాంగ, ఎన్నికల సంస్కరణలను ప్రవేశపెట్టేందుకు నిర్ణయాన్ని వాయిదా వేశారు. రాజ్యాంగానికి 19వ సవరణ ఏప్రిల్ చివర్లోనే పార్లమెంటు ఆమోదం పొందినా, ఎన్నికల సంస్కరణల విషయంలో మాత్రం పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. కాగా, జనవరిలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో మహీంద రాజపక్సపై విజయం సాధించిన సిరిసేన ప్రధాని రణిల్ విక్రమసింఘే నేతృత్వంలోని మైనార్టీ సర్కారును నియమించారు.