
సాక్షి, హైదరాబాద్ : విద్యుత్ సంస్థల కొనుగోళ్లు, ఒప్పందాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ డిమాండ్ చేశారు. విద్యుత్ సంస్థల అవకతవకతలపై రాష్ట్ర ప్రభుత్వం జ్యుడీషియల్ విచారణకు ఆదేశిస్తే ఆధారాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తాము కేంద్రంలో అధికారంలో ఉన్నాం కాబట్టి సీబీఐ విచారణకు ఆదేశించాలని కాంగ్రెస్ అంటోందని, సమాఖ్య వ్యవస్థలో ఇది సాధ్యం కాదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో విద్యుత్‌రంగంపై శుక్రవారం ఇక్కడ బీజేపీ ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించింది.
తెలంగాణ సర్కార్ విద్యుత్ కొనుగోళ్ల కోసం ఓపెన్ బిడ్డింగ్‌లకు వెళ్లకుండా, బయటి మార్కెట్ నుంచి నేరుగా రూ.4.50 – 5.50లకు యూనిట్ చొప్పున స్వల్పకాలిక ఒప్పందాలు చేసుకుందని లక్ష్మణ్ ఆరోపించారు. రెండేళ్లుగా విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ పని చేయడంలేదని అన్నారు. రాష్ట్ర సర్కార్ అవినీతిపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని, స్పందన లేకుంటే కేంద్ర హోంమంత్రిని, రాష్ట్రపతిని కలుస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రానికి కేటాయించిన ఐఏఎస్ అధికారులకు 10 నెలలుగా ఈ సర్కార్ ఎలాంటి పోస్టింగ్‌లు ఇవ్వకపోవడం ఏమిటని ఏపీ ప్రభుత్వ మాజీ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment