సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ మద్యం కుంభకోణంలో తన పాత్ర లేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితదేనని బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్ స్పష్టం చేశారు. అవినీతి, అక్రమాలపై చట్టం తన పని తాను చేస్తుందని, చట్టం ఎవరికి చుట్టం కాదని ఆయన వ్యాఖ్యానించారు. శనివారం లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ... అక్రమాలపై లభించిన ఆధారాలతో దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతూ, నోటీసులిస్తుంటే తెలంగాణ ప్రజల మీద దాడులు అనే విధంగా చిత్రీకరించాలని కుయుక్తులు పన్నుతున్నారని మండిపడ్డారు.
బీజేపీ నేతలపైనా, తమపైనా ఏమైనా ఏమైనా అనుమానాలుంటే సీబీఐ, ఈడీ వంటి సంస్థలకు కూడా ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న ఐటీ,ఈడీ, సీబీఐ దాడులకు, నోటీసులకు కేంద్ర ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం లేదని ఆయన వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ స్కీమ్స్ అన్ని స్కామ్‌లుగా మారాయని విమర్శించారు.
ఏ ప్రభుత్వాన్నీ పడగొట్టలేదు: బీజేపీ ఏ రాష్ట్రంలోనూ ప్రభుత్వాన్ని పడగొట్టలేదని...కొన్ని రాష్ట్రాల్లోని ఎమ్మెల్యేలు వారి పార్టీలకు రాజీనామా చేసి బీజేపీలో చేరడంతోనే అక్కడ ప్రభుత్వాలను ఏర్పాటు చేశామని లక్ష్మణ్ వివరించారు. తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడే హక్కు టీఆర్‌ఎస్‌కు లేదన్నారు. శ్రీనివాస్ యాదవ్ ఎప్పుడు మంత్రి అయ్యారు?
సబితా ఇంద్రారెడ్డి ఏ పార్టీ నుంచి గెలిచి ఏ పార్టీలో మంత్రిగా ఉన్నారు? అని ప్రశ్నించారు. అసైన్డ్ భూములపై తెలంగాణ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై, ప్రభుత్వం వ్యవహరిస్తున్న అప్రజాస్వామిక, నియంతృత్వ విధానాలపై మేధావులు గొంతు విప్పాలని..ఉద్యమానికి నాంది పలకాలని పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment