శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన శుక్రవారం ఆ దేశ పార్లమెంటును రద్దు చేశారు. షెడ్యూలు ప్రకారం 2016 ఏప్రిల్‌లో...
కొలంబో: శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన శుక్రవారం ఆ దేశ పార్లమెంటును రద్దు చేశారు. షెడ్యూలు ప్రకారం 2016 ఏప్రిల్‌లో పార్లమెంటు ఎన్నికలు జరగాల్సి ఉండగా, 8 నెలలు ముందుగానే ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమం చేస్తూ పార్లమెంటును రద్దు చేశారు. సంబంధిత గెజిట్ నోటిఫికేషన్‌పై అధ్యక్షుడు శుక్రవారం సంతకం చేశారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. లంక పార్లమెంటులో 225 మంది సభ్యులు ఉన్నారు.
అయితే, పార్లమెంటును రద్దు చేస్తానని ఏప్రిల్ 23నే ప్రకటించిన సిరిసేన రాజ్యాంగ, ఎన్నికల సంస్కరణలను ప్రవేశపెట్టేందుకు నిర్ణయాన్ని వాయిదా వేశారు. రాజ్యాంగానికి 19వ సవరణ ఏప్రిల్ చివర్లోనే పార్లమెంటు ఆమోదం పొందినా, ఎన్నికల సంస్కరణల విషయంలో మాత్రం పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. కాగా, జనవరిలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో మహీంద రాజపక్సపై విజయం సాధించిన సిరిసేన ప్రధాని రణిల్ విక్రమసింఘే నేతృత్వంలోని మైనార్టీ సర్కారును నియమించారు.