ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అమరావతి: గత కొన్ని సంవత్సరాలుగా తమకు ప్రత్యేక కేడర్ ఇవ్వాలని పోరాటం చేస్తున్న ఫార్మా–డి కోర్సు చేసిన అభ్యర్థుల కల ఫలించింది. ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం ఫార్మా–డి అభ్యర్థులను క్లినికల్ ఫార్మసిస్ట్‌లుగా గుర్తిస్తూ, వారికి ప్రత్యేక కేడర్‌ను ఇస్తూ ఆదేశాలిచ్చింది. కొన్నేళ్ల కిందట కోర్సును ప్రవేశపెట్టినా దీనికి సంబంధించిన కేడర్ లేకపోవడం, వారికి ఏ ప్రభుత్వ ఉద్యోగాలివ్వాలనే దానిపై స్పష్టత లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి పార్లమెంటులో పలు దఫాలు ప్రత్యేకంగా వీరి గురించి ప్రస్తావించారు. వారికి తగిన న్యాయం చేయాలని, కోర్సులు పూర్తి చేసిన వారు నిరుద్యోగులుగా ఉన్నారని ఆయన పార్లమెంటులో గట్టిగా మాట్లాడారు. దీంతో ఎట్టకేలకు కేంద్రం తాజాగా గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది.
విధుల నిర్వహణ ఇలా..
వైద్యులకు సురక్షితమైన, సమర్థవంతమైన మందుల వాడకం గురించి వివరించడం, నాణ్యమైన మందుల కోసం పరిశోధనా ప్రాజెక్టులు చేపట్టడం, ఔషధాలకు సంబంధించి వ్యయ విశ్లేషణ చేయడం, మందుల మోతాదుపై స్పష్టత ఇవ్వడం, మందుల వల్ల వచ్చే దుష్ప్రభావాలు, సరైన మందుల గురించి వివరించడం వంటివన్నీ చేయాల్సి ఉంటుంది. పర్యవేక్షణ కోసం క్లినికల్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరించాలి. అన్ని రకాల ఫార్మసీ క్లెయిమ్ డేటాను అంచనా వేసి, ప్రత్యేక ప్రొటోకాల్‌ను అనుసరించాల్సి ఉంటుంది.
ఎంపీ కృషి వల్లే సాధ్యమైంది
దేశవ్యాప్తంగా వేలాదిమంది ఫార్మా–డి చదివిన వారు ఉన్నారు. వీళ్లందరికీ ఉద్యోగాలు లేక ఇబ్బంది పడేవారు. దీనిపై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి విన్నవించాం. ఆయన స్పందించి పలు సార్లు పార్లమెంటులో ప్రస్తావించారు. దీనివల్ల ప్రత్యేక కేడర్ (క్లినికల్ ఫార్మసిస్ట్)గుర్తిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
– హేమంత్‌కుమార్, ఉపాధ్యక్షుడు, డాక్టర్ ఆఫ్ ఫార్మసీ అసోసియేషన్
Comments
Please login to add a commentAdd a comment