Pharmacists
-
తెర వెనుక వైద్యుడు! వ్యాధులను నివారించడంలో వారిదే కీలక పాత్ర!
ఆరోగ్యం పదికాలాల పాటు పదిలంగా ఉండాలంటే అందులో ఫార్మసిస్ట్ పాత్ర అత్యంత ప్రధానం. ప్రపంచవ్యాప్తంగా నానాటికీ పలెరిగిపోతున్న వ్యాధులను దృష్టిలో ఉంచుకొని, దానికి తగినట్లుగా కొత్త మందులను తయారు చేయడం, నివారణా మార్గాలు కనుగొనడంలో ఫార్మసిస్ట్ పాత్ర కీలకం. ఔషధాల తయారీ, వాటి నాణ్యతా ప్రమాణాలను పర్యవేక్షించడం, తగిన సాంకేతిక పరిజ్ఞానంతో ఔషధాలను నిల్వచేయడం, వ్యాధి గ్రస్థులకు మందుల వినియోగ విధానం పట్ల తగిన సూచనలు, సలహాలు అందజేయడం, వాటి దుష్ఫలితాల పట్ల అవగాహన కల్పించడం లాంటి అనేక విషయాల్లో ఫార్మసిస్ట్ పాత్ర విస్మరించలేనిది. వ్యాధిని గుర్తించి, దానికి తగిన మందును సూచించేవాడు వైద్యుడైతే, ఔషధ ఎంపిక, మోతాదు, వినియోగ విధానం సమస్తమూ అవగాహన కల్పించేది ఫార్మసిస్టు. నిజం చెప్పాలంటే తెర వెనుక వైద్యుడు ఫార్మసిస్టే. అందుకే ఆరోగ్యకేంద్రాల్లో అత్యవసర పరిస్థితుల్లో వైద్యాధికారులు అందుబాటులో లేనప్పుడు చికిత్స అందించే బాధ్యత ఫార్మసిస్టులదే. కేంద్ర ఆరోగ్యశాఖ ‘జాతీయ ఆరోగ్య విధానం–2017’ ఫార్మసిస్టులకు సామాజిక ఆరోగ్యంపై శిక్షణ ఇచ్చి వారి సేవలను క్షేత్రస్థాయిలో వినియోగించుకోవాలని సూచించింది. కొన్ని సమయాల్లో వైద్యులు రాసిన మందులను సమీక్షించే అధికారం కూడా ఫార్మసిస్టుకు ఉంటుంది. మందుల వినియోగంలో ఫార్మసిస్టుల పాత్రను విస్మరించడంవల్ల వాటి వినియోగం విచ్చలవిడిగా పెరిగిపోయింది. తద్వారా అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టి ప్రాణాంతకమైన దుష్ప్రభావాలు సంభవిస్తున్నాయి. జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్, ఇటలీ లాంటి యూరోపియన్ దేశాల్లో, సౌదీ అరేబియా లాంటి అరబ్ దేశాల్లో ఫార్మసిస్టులకు పెద్దపీట వేస్తారు. ఆ యా దేశాల్లోని వైద్యులు పరీక్షల అనంతరం వ్యాధిని గుర్తించి, ఫలానా వ్యాధి, ఫలానా మందు అని నిర్ధారణ చేస్తారు. ఆ వ్యాధికి ఏ ఔషధం సరిపోతుందో, అది ఏయే సమయాల్లో, ఏ మోతాదులో, ఏ విధంగా వినియోగించాలో ఫార్మసిస్టే రోగికి సూచిస్తాడు. కొన్ని యూరప్ దేశాల్లో రోగి వ్యాధిని గుర్తించి, ఔషధాన్ని సిఫారసు చేసే అధికారం కూడా ఫార్మసిస్ట్దే. కానీ మనదేశంలో పరిస్థితి దీనికి పూర్తి భిన్నం. భారత్‌లో ఫార్మసిస్టులకు సరైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక, సొంత ఫార్మసీలు పెట్టుకొనే స్థోమత లేక తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ఖాళీగా ఉన్న ఫార్మసిస్టు పోస్టులను భర్తీ చేయాలి. నిరుద్యోగులైన ఫార్మసిస్టులకు ఫార్మసీలు ఏర్పాటు చేసు కోడానికి వడ్డీ రహిత రుణ సౌకర్యం కల్పించాలి. ఆ విధంగా ఫార్మసిస్ట్‌ల సేవలను మరింతగా ఉపయోగించుకోవచ్చు. – ఎమ్.డి. ఉస్మాన్ ఖాన్, సీనియర్ జర్నలిస్ట్ – కెమిస్ట్ (చదవండి: భారత సంతతి చిన్నారికి అత్యంత అరుదైన కిడ్నీ మార్పిడి..! బ్రిటన్‌లోనే తొలిసారిగా..) -
క్లినికల్ ఫార్మసిస్ట్‌లుగా.. ఫార్మా–డి అభ్యర్థులు
సాక్షి, అమరావతి: గత కొన్ని సంవత్సరాలుగా తమకు ప్రత్యేక కేడర్ ఇవ్వాలని పోరాటం చేస్తున్న ఫార్మా–డి కోర్సు చేసిన అభ్యర్థుల కల ఫలించింది. ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం ఫార్మా–డి అభ్యర్థులను క్లినికల్ ఫార్మసిస్ట్‌లుగా గుర్తిస్తూ, వారికి ప్రత్యేక కేడర్‌ను ఇస్తూ ఆదేశాలిచ్చింది. కొన్నేళ్ల కిందట కోర్సును ప్రవేశపెట్టినా దీనికి సంబంధించిన కేడర్ లేకపోవడం, వారికి ఏ ప్రభుత్వ ఉద్యోగాలివ్వాలనే దానిపై స్పష్టత లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి పార్లమెంటులో పలు దఫాలు ప్రత్యేకంగా వీరి గురించి ప్రస్తావించారు. వారికి తగిన న్యాయం చేయాలని, కోర్సులు పూర్తి చేసిన వారు నిరుద్యోగులుగా ఉన్నారని ఆయన పార్లమెంటులో గట్టిగా మాట్లాడారు. దీంతో ఎట్టకేలకు కేంద్రం తాజాగా గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. విధుల నిర్వహణ ఇలా.. వైద్యులకు సురక్షితమైన, సమర్థవంతమైన మందుల వాడకం గురించి వివరించడం, నాణ్యమైన మందుల కోసం పరిశోధనా ప్రాజెక్టులు చేపట్టడం, ఔషధాలకు సంబంధించి వ్యయ విశ్లేషణ చేయడం, మందుల మోతాదుపై స్పష్టత ఇవ్వడం, మందుల వల్ల వచ్చే దుష్ప్రభావాలు, సరైన మందుల గురించి వివరించడం వంటివన్నీ చేయాల్సి ఉంటుంది. పర్యవేక్షణ కోసం క్లినికల్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరించాలి. అన్ని రకాల ఫార్మసీ క్లెయిమ్ డేటాను అంచనా వేసి, ప్రత్యేక ప్రొటోకాల్‌ను అనుసరించాల్సి ఉంటుంది. ఎంపీ కృషి వల్లే సాధ్యమైంది దేశవ్యాప్తంగా వేలాదిమంది ఫార్మా–డి చదివిన వారు ఉన్నారు. వీళ్లందరికీ ఉద్యోగాలు లేక ఇబ్బంది పడేవారు. దీనిపై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి విన్నవించాం. ఆయన స్పందించి పలు సార్లు పార్లమెంటులో ప్రస్తావించారు. దీనివల్ల ప్రత్యేక కేడర్ (క్లినికల్ ఫార్మసిస్ట్)గుర్తిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. – హేమంత్‌కుమార్, ఉపాధ్యక్షుడు, డాక్టర్ ఆఫ్ ఫార్మసీ అసోసియేషన్ -
మందులోళ్లే.. మాయలోళ్లు!
సాక్షి, హైదరాబాద్: ఇది మందులోళ్ల మాయాజాలం.. మందుల కొను‘గోల్మాల్’.. కమీషన్ల కహానీ. కాసుల కక్కుర్తి.. ఇదీ సర్కార్ ఆసుపత్రుల్లో సాగుతున్న తతంగం. ప్రభుత్వాసుపత్రిలో అవసరమున్నా లేకపోయినా ఇష్టారాజ్యంగా మందులకు ఇండెంట్లు పెట్టడం, తద్వారా కంపెనీల నుంచి కమీషన్లు పొం దడం వైద్య, ఆరోగ్య శాఖలోని కొందరు అధికారులకు, ఫార్మసిస్టులకు అలవాటుగా మారింది. ఈ నేపథ్యంలో జరిగిందే నాంపల్లి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఘటన. ఈ కేంద్రానికి 500 ట్రెమడాల్ మాత్రలు అవసరంకాగా, ఏకంగా 10 వేల మాత్రలు పంపించారు. ఆ మాత్రల వల్లే ఇటీవల ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా తేలిందేంటంటే, ఆసుపత్రి ప్రధానాధికారి వద్ద మం దుల ఇండెంట్ పెట్టేందుకుగాను ఆన్‌లైన్‌కు సంబం ధించిన యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లను కొందరు ఫార్మసిస్టులు దొంగిలించి ఇండెంట్లు పెట్టడం. ఈ వ్యవహా రం ఆ శాఖలో సంచలనంగా మారింది. దీంతో సద రు ఫార్మసిస్టులపై చర్యలకు ప్రభుత్వం సిద్ధమైంది. కింది నుంచి పైస్థాయి వరకు కమీషన్ల కక్కుర్తి మందుల కొనుగోలుకు సంబంధించి ప్రతి ఆస్పత్రికి ఒక యూజర్ ఐడీ, పాస్వర్డ్ కేటాయిస్తారు. అది ఆసుపత్రి ప్రధానాధికారికి మాత్రమే తెలుస్తుంది. గతంలో పీహెచ్‌సీల్లోని మెడికల్ ఆఫీసర్ మందులకు ఇండెంట్ పెడితే అది జిల్లా వైద్యాధికారికి చేరేది. అక్కడి నుంచి ప్రజారోగ్య సంచాలకులకు అవి చేరేవి. బోధనాసుపత్రులైతే వైద్య విద్య సంచాలకుల (డీఎంఈ)కు, తెలంగాణ వైద్యవిధాన పరిషత్ ఆధ్వర్యంలోని ఆసుపత్రులైతే సంబంధిత కమిషనర్‌కు చేరేవి. ఈ ముగ్గురు తెలంగాణ రాష్ట్ర వైద్యసేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్ఎంఎస్ఐడీసీ)కు ఇండెంట్ పెట్టేవారు. వారికి కేటాయించిన బడ్జెట్ ఆధారంగా మందుల సరఫరా జరిగేది. దీని స్థానంలో ఆన్లైన్ విధానం తీసుకువచ్చారు. దీంతో ఏ ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి మందులు కావాలన్నా నేరుగా టీఎస్ఎంఎస్ఐడీసీకి ఇండెంట్ పెడుతున్నారు. అయితే, టీఎస్ఎంఎస్ఐడీసీకి మందుల సరఫరా చేసే కంపెనీలతో ఫార్మసిస్టులు, డాక్టర్లు కుమ్మక్కు అవుతున్నారన్న ఆరోపణలున్నాయి. అవసరం లేకపోయినా ఫలానా మందు లు కావాలని ఇండెంట్ పెడుతున్నారు. మరికొన్ని చోట్ల ఏకంగా ఫార్మసిస్టులే ఆసుపత్రి ప్రధానాధికారి వద్ద ఉండే యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లను సేకరించి టీఎస్ఎంఎస్ఐడీసీకి నేరుగా మందుల ఇండెంట్ పెడుతున్నారు. ఆ మందులను వాడకపోతే ఎందుకు తెప్పించారో సర్కారుకు సమాధానం చెప్పాల్సి ఉం టుంది. అందుకే తెప్పించిన మందులను గడువుకు కొద్దినెలలు ముందుగా టీఎస్ఎంఎస్ఐడీసీకి వెనక్కు పంపిస్తున్నారు. అక్కడి నుంచి మళ్లీ ఏవో కొన్ని పీహెచ్‌సీలకు అవి వెళ్తుంటాయి. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో.. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఇద్దరు ఫార్మసిస్టులు యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను తస్కరించి టీఎస్ఎంఎస్ఐడీసీకి భారీగా మందుల కొనుగోలు ఇండెంట్ పెట్టారు. విషయాన్ని గ్రహించిన ఎంజీఎం వైద్యాధికారులు అంతర్గతంగా విచారణ జరిపారు. ఫార్మసిస్టులు అక్రమాలకు పాల్పడ్డారని గుర్తించి ఒక నివేది కను డీఎంఈకి పంపారు. దాని ఆధారంగా ఆ ఫార్మ సిస్టులను సస్పెండ్ చేయాల్సిందిగా డీఎంఈ రెండు రోజుల క్రితం ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఆస్ప త్రులు పెట్టే మందుల ఇండెంట్లను పరిశీలించి, పర్యవేక్షించేందుకు టీఎస్ఎంఎస్ఐడీసీలో ఒక వ్యవస్థ ఉం టుంది. ఆ అధికారులు ఇండెంట్లను పర్యవేక్షించాలి. కానీ వారు కూడా కంపెనీలతో కుమ్మక్కయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. Government hospitals Pharmacists Passwords Indents Department of Health -
ఫార్మ్.డి గ్రాడ్యుయేట్స్ ఎంబీబీఎస్‌తో సమానమే కానీ..
సాక్షి, న్యూఢిల్లీ: ఫార్మ్.డి కోర్సును ఎంబీబీఎస్ కోర్సుతో సమానంగా గుర్తించాలన్న ఏ డిమాండ్ ప్రభుత్వం దృష్టికి రాలేదని ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా మంగళవారం రాజ్య సభకు తెలిపారు. రోగులకు వైద్య సేవలు అందించే విషయంలో ఎంబీబీఎస్‌తో సమానంగా తమ కోర్సును కూడా గుర్తించాలంటూ ఫార్మ్.డి గ్రాడ్యుయేట్ల నుంచి డిమాండ్ వస్తున్న విషయం వాస్తవమేనా అంటూ వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి స్పందిస్తూ ఈ విషయం వెల్లడించారు. ఇంటర్మీడియెట్ అనంతరం ఫార్మ్.డి విద్యార్దులు ఆరేళ్ళపాటు ఈ కోర్సును అధ్యయనం చేస్తారని మంత్రి వివరించారు. కోర్సులో భాగంగా రెండు, మూడు, నాలుగో సంవత్సరంలో విద్యార్ధులకు ఏటా 50 గంటలపాటు ఆస్పత్రిలో అధ్యయనం ఉంటుందని పేర్కొన్నారు. అయిదో సంవత్సరంలో ప్రతి రోజు వార్డు రౌండ్ డ్యూటీ నిర్వహిస్తారని, ఆరవ సంవత్సరంలో 300 పడగకల ఆస్పత్రిలో ఇంటర్న్‌షిప్ చేస్తారని వెల్లడించారు. ఇంటర్న్‌షిప్‌లో భాగంగా అధ్యాపకుడి పర్యవేక్షణలో విద్యార్ధి ఫార్మసీ, హెల్త్ కేర్ ప్రాక్టీస్ చేస్తారని మంత్రి తెలిపారు. ఫార్మ్.డి కోర్సును ఎంబీబీఎస్‌తో సమానంగా గుర్తించాలన్న డిమాండ్ ఏదీ ప్రభుత్వ దృష్టికి రానప్పటికీ ఈ కోర్సు పూర్తి చేసిన గ్రాడ్యుయేట్‌ని క్లినికల్ ఫార్మసిస్ట్‌గా గుర్తించాలంటూ ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ)కి వినతులు వస్తున్నట్లు మంత్రి తెలిపారు. పీసీఐ రూపొందించిన ఫార్మసీ ప్రాక్టీస్ నిబంధనల ప్రకారం లైసెన్స్ పొందిన, రిజిస్టర్ అయిన ఫార్మ్.డి గ్రాడ్యుయేట్లు తమ వృత్తిపరమైన ప్రాక్టీస్‌లో భాగంగా రోగులకు మందులు ఇవ్వవచ్చునని మంత్రి తెలిపారు. ఇంటర్న్‌షిప్‌లో భాగంగా క్లినికల్ ఫార్మసిస్టులు 300 పడకల మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో డాక్టర్లు ఇతర హెల్త్ కేర్ నిపుణులతో కలిసే పని చేస్తారు. ఫార్మసీ ప్రాక్టీస్ నిబంధనల ప్రకారం ఫార్మ్.డి గ్రాడ్యుయేట్లు ప్రభుత్వ లేదా ప్రైవేట్ రంగంలోని మెడికల్ సర్వీసెస్ విభాగాల్లో డ్రగ్ ఇన్ఫర్మేషన్ ఫార్మసిస్ట్, సీనియర్ ఫార్మసిస్ట్, చీఫ్ ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు అర్హులని నడ్డా వెల్లడించారు. అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, యూకే వంటి దేశాలలో ఫార్మ్.డి గ్రాడ్యుయేట్లు క్లినికల్ ఫార్మసిస్ట్‌లుగా పని చేస్తున్నట్లు నడ్డా పేర్కొన్నారు. -
పనికిరాని పట్టా
శాతవాహనయూనివర్సిటీ: శాతవాహన యూనివర్సిటీ ఫార్మసీ కళాశాలలో అందరూ (అధ్యాపకులతోపాటు ప్రిన్సిపాల్ కూడా) కాంట్రాక్టు ఉద్యోగులే.. శాశ్వత అధ్యాపకులు లేనికారణంగా పీసీఐకి బ్రేక్ పడింది. గతంలో పీసీఐ కమిటీ యూనివర్సిటీ కళాశాలకు తనిఖీలకు వచ్చినప్పుడు ప్రయోగశాలలు, గ్రంథాలయం, భవనాలు, తరగతి గదులతోపాటు వివిధ అంశాలను పరిశీలించి పలులోపాలు గుర్తించి సరిదిద్దుకోవాలని సూచించారు. వారుచెప్పినట్లు అధ్యాపకుల నియామక ప్రక్రియ మినహా మిగతావన్నీ విషయాల్లో సిద్ధంగా ఉన్నారు. ఇందుకు సంబంధించిన నియమనిబంధనలు ప్రభుత్వం నుంచి రూపొందించి యూనివర్సిటీకి పంపించగా.. త్వరలో వర్సిటీ వివిధ విభాగాల్లో కలిపి 40 పోస్టులకు ప్రకటన విడుదల చేయనుంది. ఇందులో ఫార్మసీ విభాగంలో 18 పోస్టులున్నాయి. ఈ పోస్టులు భర్తీ అయ్యేవరకూ పీసీఐ రావడం కష్టమేనని విద్యావేత్తలు సూచిస్తున్నారు. ఇటీవల పీసీఐ గురించి ఢిల్లీ వెళ్లిన యూనివర్సిటీ అధికారులకు వర్సిటీ త్వరలో వెలువరించే నోటిఫికేషన్ ద్వారా 18 పోస్టులను భర్తీచేస్తున్నట్లు సూచించారు. ఇంతలో పీసీఐ అధికారులు మరోసారి శాతవాహనకు వచ్చి తనిఖీలు నిర్వహించి సంతృప్తి చెందితేనే గుర్తింపురానుంది. లేకుంటే పోస్టుల భర్తీ అయ్యాకే పీసీఐ సంగతి తేలనుంది. 238 ఫార్మసిస్ట్ పోస్టులు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) 25 జనవరి 2018న నోటిఫికేషన్ నంబర్ 04/2018 ద్వారా 238 ఫార్మసిస్ట్ గ్రేడ్–2 పోస్టులకు ప్రకటన విడుదల చేసింది. ఇందులో డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఆండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగంలో 125 పోస్టులు, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ విభాగంలో 58 పోస్టులు, తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లో 55 పోస్టులున్నాయి. ప్రకటన విడుదల చేసిన సమయంలో కేవలం ఇంటర్మీడియెట్‌తోపాటు డిఫార్మసీ చేసి ఫార్మసీ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ ఉండాలని తెలపగా.. రెండురోజుల క్రితం డీ ఫార్మసీతోపాటు అంతకంటే హైయ్యర్కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు కూడా అవకాశం కల్పించింది. దీంతో శాతవాహన యూనివర్సిటీ ద్వారా బీఫార్మసీ పూర్తి చేసిన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుందామంటే పీసీఐ గుర్తింపు లేకపోవడంతో అనర్హులుగా మిగిలి నిరాశచెందుతున్నారు. 200పైగా విద్యార్థులకు అనర్హత శాతవాహన యూనివర్సిటీ ఫార్మసీ కళాశాలలో 2009లో బీ ఫార్మసీ కోర్సు ప్రారంభమైంది. అప్పటినుంచి ఇప్పటివరకు ఐదు బ్యాచ్‌లు పూర్తయ్యాయి. 270 మంది కోర్సులో ఉన్నారు. ఇందులో 200పైగా విద్యార్థులు పాసై ఉద్యోగాల వేటలో ఉన్నారు. వీరికి వర్సిటీకి పీసీఐ గుర్తింపు లేకపోవడంతో దరఖాస్తు చేసుకునేందుకు అనర్హులుగా మిగిలిపోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో కేవలం ఫార్మసిస్ట్ ఉద్యోగాలే ఉంటాయని, వాటికి కూడా అవకాశం లేదని వాపోతున్నారు. కనీసం మెడికల్ షాపులు కూడా పెట్టుకునేందుకు అవకాశం లేక ఉపాధిని కోల్పోతున్నామని మదనపడుతున్నారు. ప్రభుత్వం, అధికారులు విద్యార్థుల సమస్యలపై దృష్టిపెట్టి యూనివర్సిటీకి త్వరగా పీసీఐ గుర్తింపు తీసుకురావాలని, ఈ నోటిఫికేషన్‌కైనా పీసీఐతో సంబందం లేకుండా వారిని దరఖాస్తు చేసుకునేలా అవకాశమివ్వాలని విద్యార్థులు కోరుతున్నారు. పీసీఐతో సంబంధం పెట్టొద్దు వర్సిటీలో కోర్సు ప్రారంభించి తొమ్మిదేళ్లు గడిచింది. ఇప్పటివరకు పీసీఐ గుర్తింపు లేదు. సమస్యపై ప్రజాప్రతినిధులు, మంత్రులు, అధికారులను కలిసి వినతిపత్రాలు ఇచ్చాం. మా గోడు వెల్లబోసుకున్నాం. ఎవరూ స్పందించలేదు. కోర్సు పూర్తిచేసుకున్నవారికి ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుందామంటే అవకాశం లేకుండాపోతోంది. అధికారులు సమస్యను గుర్తించి పీసీఐతో సంబంధం లేకుండా నోటిఫికేషన్‌లోని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేలా అవకాశమివ్వాలి. – పి.శిరీష, బీఫార్మసీ త్వరలోనే పీసీఐ కమిటీ రాక పీసీఐ అధికారులు గతంలో తనిఖీలకు వచ్చినప్పుడు పలు లోపాలు గుర్తించి సవరించుకోవాలని సూచించారు. వారు అడిగిన సమాచారంతో ఢిల్లీ వెళ్లి వచ్చాం. దీంతోపాటు యూనివర్సిటీలో శాశ్వత అధ్యాపకుల నియామకాలు చేపడుతున్నట్లు వారి దృష్టికి తీసుకెళ్లాం. త్వరలోనే మళ్లీ కమిటీ యూనివర్సిటీకి పరిశీలనకు రానుంది. – ఎం.కోమల్‌రెడ్డి, శాతవాహన రిజిస్ట్రార్ -
మందుల దుకాణం..అక్రమాల మకాం
∙ ఇష్టారాజ్యంగా నిర్వహణ ∙ ఫార్మసిస్టులు లేని దుకాణాలే ఎక్కువ ∙ డాక్టర్ చీటీ లేకుండానే విక్రయాలు ∙ నామమాత్రంగా పర్యవేక్షణ నెల్లూరు (బారకాసు): జిల్లాలో మందుల దుకాణాల నిర్వహణ ఇష్టారాజ్యంగా తయారైంది. ఏమాత్రం అవగాహన లేనివారు మందులను విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. దుకాణం నిర్వహించే వ్యక్తి ఫార్మసిస్టు అయి ఉండాలన్న నిబంధన ఎక్కడా అమలు కావడం లేదు. కనీసం ఇంటర్మీడియెట్ స్థాయి వరకు చదివిన వారైనా ఉండకపోవడం గమనార్హం. డాక్టర్ ధ్రువీకరించిన చీటి ఉంటేనే మందులు ఇవ్వాల్సి ఉంది. ఎటువంటి చీటీ లేకుండానే మందులు విక్రయిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 2,420 మెడికల్ షాపులున్నాయి. ఇందులో హోల్‌సేల్ 432 కాగా, రిటైల్ దుకాణాలు 1,196. నెల్లూరులో 495 రిటైల్, 340 హోల్‌సేల్, గూడూరులో 330 రిటైల్, 23 హోల్‌సేల్, కావలిలో 371 రిటైల్, 69 హోల్‌సేల్ దుకాణాలున్నాయి. ఇవికాక గ్రామాల్లో దాదాపు 700 మెడికల్ షాపులు రిటైల్వి కాగా, 92 హోల్‌సేల్ దుకాణాలు ఉన్నాయి. దాదాపు 80శాతం దుకాణాలు ఫార్మసిస్టులు లేకుండానే నడుస్తున్నాయి. ఎక్కడైనా కొత్తగా ఆస్పత్రి ఏర్పాటు చేస్తున్నారంటే దానికి అనుసంధానంగా మందుల దుకాణం పెట్టడానికి పోటీ విపరీతంగా ఉంటుంది. పట్టణాల్లోనే ఫార్మసిస్ట్ లేకుండా విక్రయాలు కొనసాగుతుంటే.. గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. జలుబు, జ్వరం వంటి చిన్న రుగ్మతలకు సైతం ఎంబీబీఎస్ వైద్యులు సిఫార్సు చేసిన చీటీ ఆధారంగానే మందులు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ.. చిన్న పిల్లలు వెళ్లి అడిగినా మందు బిళ్లలు ఇచ్చేస్తున్నారు. ఇదిలా ఉంటే డాక్టర్ సూచన మేరకు ఇచ్చే మందులకు బిల్లులు తప్పకుండా ఇవ్వాలి. బిల్లు కావాలంటే నిర్వాహకులు అదనంగా పది శాతం సొమ్ము వసూలు చేస్తున్నారు. నామమాత్రపు తనిఖీలు జిల్లా వ్యాప్తంగా మందుల దుకాణాల నిర్వాహణపై ఔషధ నియంత్రణ శాఖ సహాయక సంచాలకుడి పర్యవేక్షణ ఉంటుంది. ఈ అధికారితోపాటు డ్రగ్ ఇన్స్పెక్టర్ల పర్యవేక్షణ కూడా ఉంటుంది. వారు నామమాత్రపు తనిఖీలతో అప్పుడప్పుడూ కేసులు నమోదు చేస్తూ చేతులు దులుపుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. ఇప్పటివరకు నెలకు 10 కేసుల చొప్పున నమోదు చేస్తూ అపరాధ రుసుం వసూలు చేస్తున్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించిన మందుల దుకాణాలపై 16 క్రిమినల్ కేసులు నమోదు చేశారు. చిత్తశుద్ధితో విధులు నిర్వర్తిస్తే వందలకొద్దీ కేసులు నమోదు చేసే అవకాశం ఉంటుందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. తనిఖీలు నిర్వహిస్తున్నాం జిల్లాలోని మందుల దుకాణాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తున్నాం. ఫార్మసిస్టులు లేకుండా మందుల దుకాణాలు నిర్వహించకూడదని ఆదేశిం చాం. డాక్టర్ల సూచనల మేరకే మందులు ఇవ్వాలని మెడికల్ షాపుల యజమానులకు తెలిపాం. లేకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించాం. మందులు కొనే వారికి తప్పనిసరిగా బిల్లు అడిగి తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. – డి.సురేష్‌బాబు, అసిస్టెంట్ డైరెక్టర్,జిల్లా ఔషధ నియంత్రణ శాఖ -
బయోమెట్రిక్ తప్పనిసరి
డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ అనంతపురం మెడికల్ : జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి అని డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ అన్నారు. ప్రతి క్లస్టర్ ఆఫీసర్ పీహెచ్‌సీలను తనిఖీ చేసి హాజరును పరిశీలించాలన్నారు. తన చాంబర్లో బుధవారం డిప్యూటీ డీఎంహెచ్ఓలు, ప్రోగ్రాం ఆఫీసర్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రతి ఆస్పత్రిలో రోగులకు అవసరమైన పరికరాలు అందుబాటులో ఉంచాలన్నారు. ఫార్మసిస్టులు తా ము ఇచ్చిన మందుల వివరాలు కంప్యూటర్లో నమోదు చేయాలన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వడదెబ్బ, మృతుల వివరాలను ప్రతి రోజూ పంపాలన్నారు. వైద్యాధికారులు, సూపర్వైజర్లు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, వడదెబ్బ మృతులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఎన్హెచ్ఎం డీపీఎం డాక్టర్ అనిల్‌కుమార్, డీసీటీఓ డాక్టర్ సుధీర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.