ఫార్మ్‌.డి గ్రాడ్యుయేట్స్‌ ఎంబీబీఎస్‌తో సమానమే కానీ.. | Central Minister JP Nadda Reply On Vijay Sai Reddy Question | Sakshi
Sakshi News home page

ఫార్మ్‌.డి గ్రాడ్యుయేట్స్‌ ఎంబీబీఎస్‌తో సమానమే కానీ..

Published Tue, Jul 31 2018 8:10 PM | Last Updated on Tue, Jul 31 2018 10:31 PM

Central Minister JP Nadda Reply On Vijay Sai Reddy Question - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఫార్మ్‌.డి కోర్సును ఎంబీబీఎస్‌ కోర్సుతో సమానంగా గుర్తించాలన్న ఏ డిమాండ్‌ ప్రభుత్వం దృష్టికి రాలేదని ఆరోగ్య శాఖ మంత్రి జగత్‌ ప్రకాష్‌ నడ్డా మంగళవారం రాజ్య సభకు తెలిపారు. రోగులకు వైద్య సేవలు అందించే విషయంలో ఎంబీబీఎస్‌తో సమానంగా తమ కోర్సును కూడా గుర్తించాలంటూ ఫార్మ్‌.డి గ్రాడ్యుయేట్ల నుంచి డిమాండ్‌ వస్తున్న విషయం వాస్తవమేనా అంటూ వైఎస్సార్‌ సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి స్పందిస్తూ ఈ విషయం వెల్లడించారు. ఇంటర్మీడియెట్‌ అనంతరం ఫార్మ్‌.డి విద్యార్దులు ఆరేళ్ళపాటు ఈ కోర్సును అధ్యయనం చేస్తారని మంత్రి వివరించారు.

కోర్సులో భాగంగా రెండు, మూడు, నాలుగో సంవత్సరంలో విద్యార్ధులకు ఏటా 50 గంటలపాటు ఆస్పత్రిలో అధ్యయనం ఉంటుందని పేర్కొన్నారు. అయిదో సంవత్సరంలో ప్రతి రోజు వార్డు రౌండ్‌ డ్యూటీ నిర్వహిస్తారని, ఆరవ సంవత్సరంలో 300 పడగకల ఆస్పత్రిలో ఇంటర్న్‌షిప్‌ చేస్తారని వెల్లడించారు. ఇంటర్న్‌షిప్‌లో భాగంగా అధ్యాపకుడి పర్యవేక్షణలో విద్యార్ధి ఫార్మసీ, హెల్త్‌ కేర్‌ ప్రాక్టీస్‌ చేస్తారని మంత్రి తెలిపారు. ఫార్మ్‌.డి కోర్సును ఎంబీబీఎస్‌తో సమానంగా గుర్తించాలన్న డిమాండ్‌ ఏదీ ప్రభుత్వ దృష్టికి రానప్పటికీ ఈ కోర్సు పూర్తి చేసిన గ్రాడ్యుయేట్‌ని క్లినికల్‌ ఫార్మసిస్ట్‌గా గుర్తించాలంటూ ఫార్మసీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (పీసీఐ)కి వినతులు వస్తున్నట్లు మంత్రి తెలిపారు.

పీసీఐ రూపొందించిన ఫార్మసీ ప్రాక్టీస్‌ నిబంధనల ప్రకారం లైసెన్స్‌ పొందిన, రిజిస్టర్‌ అయిన ఫార్మ్‌.డి గ్రాడ్యుయేట్లు తమ వృత్తిపరమైన ప్రాక్టీస్‌లో భాగంగా రోగులకు మందులు ఇవ్వవచ్చునని మంత్రి తెలిపారు.
ఇంటర్న్‌షిప్‌లో భాగంగా క్లినికల్‌ ఫార్మసిస్టులు 300 పడకల మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో డాక్టర్లు ఇతర హెల్త్‌ కేర్‌ నిపుణులతో కలిసే పని చేస్తారు. ఫార్మసీ ప్రాక్టీస్‌ నిబంధనల ప్రకారం ఫార్మ్‌.డి గ్రాడ్యుయేట్లు ప్రభుత్వ లేదా ప్రైవేట్‌ రంగంలోని మెడికల్‌ సర్వీసెస్‌ విభాగాల్లో డ్రగ్‌ ఇన్ఫర్మేషన్‌ ఫార్మసిస్ట్‌, సీనియర్‌ ఫార్మసిస్ట్‌, చీఫ్‌ ఫార్మసిస్ట్‌ ఉద్యోగాలకు అర్హులని నడ్డా వెల్లడించారు. అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, యూకే వంటి దేశాలలో ఫార్మ్‌.డి గ్రాడ్యుయేట్లు క్లినికల్‌ ఫార్మసిస్ట్‌లుగా పని చేస్తున్నట్లు నడ్డా పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement