
సాక్షి, న్యూఢిల్లీ : ఆరేళ్ళ ఫార్మ్.డి కోర్సు ఎంబీబీఎస్‌కు సమానం కాదని ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే మంగళవారం రాజ్య సభలో స్పష్టం చేశారు. ఫార్మ్.డి కోర్సును క్లినికల్ ఫార్మసిస్ట్‌లకు సమానంగా గుర్తించాలన్న డిమాండ్లు ప్రభుత్వం దృష్టికి వస్తున్నా ఎంబీబీఎస్‌తో సమానంగా గుర్తించాలన్న డిమాండ్ మాత్రం లేదన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ ఈ విషయం వెల్లడించారు.
‘ఆరేళ్ళ ఫార్మ్.డి కోర్సులో ప్రతి విద్యార్ధి రెండో సంవత్సరం నుంచి నాలుగో సంవత్సరం వరకు ఏడాదికి 50 గంటలపాటు ఆస్పత్రిలో పని చేయాల్సి ఉంటుంది. అయిదో ఏట ప్రతి రోజు ఒకపూట వార్డు రౌండ్ డ్యూటీ విధిగా నిర్వర్తించాలి. ఆరో ఏట 300 పడకల ఆస్పత్రిలో ఇంటర్న్‌షిప్ చేయాల్సి ఉంటుంద’ని మంత్రి వివరించారు. ఫార్మ్.డి కోర్సు విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్ధులకు వారి ప్రొవిజనల్ సర్టిఫికెట్‌పై డాక్టర్ ఆఫ్ ఫార్మసీగా రాయడంతోపాటు వారి పేరు ముందు డాక్టర్ అని కూడా పెట్టాలని 2012లో ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యూనివర్శిటీలను అదేశించినట్లు మంత్రి తెలిపారు. అలాగే ఫార్మసీ ప్రాక్టీస్ రెగ్యులేషన్ చట్టం కింద ఫార్మ్.డి ఉత్తీర్ణులైన వారిని ఫార్మసీ ప్రాక్టీషనర్‌గా చేర్చడం జరిగినట్లు తెలిపారు. అలాగే డ్రగ్ ఇన్ఫర్మేషన్ ఫార్మసిస్ట్స్, సీనియర్ ఫార్మసిస్ట్, చీఫ్ ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు అవసరమైన విద్యార్హతల కింద ఫార్మ్.డి కోర్సును కూడా చేర్చినట్లు ఆయన వెల్లడించారు.