వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి వెల్లడి
10న మేదరమెట్లలో జరిగే సిద్ధం సభకు 15 లక్షల మంది హాజరవుతారు
100 ఎకరాల్లో సభ.. అవసరాన్ని బట్టి మరో 100 ఎకరాలు సిద్ధం
గత మూడు సభలతో 175 సీట్లు గెలుస్తామనే నమ్మకం జనానికి కలిగింది
ఒంగోలు: ఈనెల 10న ప్రకాశం జిల్లా మేదరమెట్ల సమీపంలో నిర్వహించనున్న సిద్ధం సభకు సర్వం సమాయత్తంగా ఉన్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత, గుంటూరు, బాపట్ల జిల్లాల పార్టీ కోఆర్డినేటర్ వి.విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఒంగోలులోని వీకేబీ రెస్టారెంట్ కాన్ఫరెన్స్‌హాలులో సిద్ధం నాలుగో సభ పోస్టర్‌ను, ‘మా నమ్మకం నువ్వే జగనన్న’ పాటను రీజినల్ కోఆర్డినేటర్, ఒంగోలు పార్లమెంట్ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కరరెడ్డి, మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డితోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో కలిసి ఆయన శనివారం ఆవిష్కరించారు.
అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. భీమిలి, ఏలూరు, రాప్తాడులలో నిర్వహించిన సిద్ధం సభలు విజయవంతమయ్యాయని చెప్పారు. ఈ నెల 10వ తేదీన మేదరమెట్ల వద్ద నిర్వహించే సిద్ధం సభలో ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారన్నారు. ఈ నాలుగు సంవత్సరాల పది నెలల కాలంలో బడుగు బలహీన వర్గాలు, పేదలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల అభివృద్ధికి, రాజకీయంగా, సామాజికంగా వారి అభ్యున్నతికి చేసిన కృషిని వివరిస్తారన్నారు. అంతేకాకుండా రాబోయే ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టోలో పొందుపరచబోయే అంశాలను వివరిస్తారని చెప్పారు.
15 లక్షల మందికిపైగా హాజరవుతారు
నాలుగో సిద్ధం సభకు గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల నుంచి 15 లక్షల మందికిపైగా హాజరవుతారని అంచనా వేస్తున్నామన్నారు. 100 ఎకరాల్లో సభా ప్రాంగణం సిద్ధం చేస్తున్నామని, అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని మరో వంద ఎకరాలను కూడా సిద్ధం చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. తొలి సిద్ధం సభకు, ప్రస్తుత సభలకు మధ్య సర్వేల ద్వారా పరిశీలిస్తే పార్టీ గ్రాఫ్ విపరీతంగా పెరిగిందన్నారు. దీనిని బట్టి 175కి 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 పార్లమెంట్ స్థానాల గెలుపు అతిశయోక్తి కాదని ప్రజలు నమ్ముతున్నారని చెప్పారు.
ఈ సభ అనంతరం సాధ్యమైనన్ని ఎక్కువ నియోజకవర్గాల్లో సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, సమన్వయకర్తలు, నియోజకవర్గ ఇన్‌చార్జులు, పరిశీలకులు అందరితో సమన్వయం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. సభకు వచ్చే ప్రతి ఒక్కరికీ ఆహారం, తాగునీరు, మౌలిక సౌకర్యాలు, వారు తిరిగి వెళ్లేందుకు రవాణా సౌకర్యం అందుబాటులో ఉంచుతున్నామన్నారు. ఒక్కొక్కరికి ఒక్కో కార్యక్రమాన్ని అప్పజెప్పడం ద్వారా కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా చర్యలు చేపట్టామన్నారు.
వాహనాల పార్కింగ్, వాటి నిర్వహణ బాధ్యతలను విజయనగరం జిల్లా జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, సభా ప్రాంగణం ఏర్పాట్లను ఎమ్మెల్సీ తలశిల రఘురాం పర్యవేక్షిస్తారన్నారు. గత ప్రభుత్వాల పాలనతో పోల్చిచూసుకుంటే బీసీల అభివృద్ధికి ఎవరు పాటుపడుతున్నారో ప్రతి ఒక్కరికీ అర్థమవుతోందని, ఈ నేపథ్యంలోనే బీసీలంతా వైఎస్సార్‌సీపీ వైపు ఉన్నారన్నారు. బీసీల అభివృద్ధి కాంక్షిస్తూ అటు పార్లమెంట్, ఇటు శాసనసభలో వారికి ఇస్తున్న ప్రాధాన్యత కూడా
ఇందుకు నిదర్శనంగా ఉందన్నారు.
విజయవంతానికి కృషి చేస్తాం: బాలినేని
స్థానిక ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 12 నియోజకవర్గాల నుంచి భారీగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్సార్‌సీపీ అభిమానులు హాజరయ్యేలా చర్యలు చేపడతామన్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన రెండూ కలిసినా వైఎస్సార్‌సీపీకి వచ్చిన నష్టం ఏమీలేదన్నారు. పార్టీలోని ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషిచేయాలన్నారు. అంతకు ముందు విజయసాయిరెడ్డి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్‌చార్జులు, పరిశీలకులు, సమన్వయకర్తలతో భేటీ అయ్యారు. సిద్ధం సభకు సంబంధించి నాయకుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. తనను నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించినందుకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు డాక్టర్ ఆదిమూలపు సురేష్, మేరుగు నాగార్జున, అంబటి రాంబాబు, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి, నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకరరెడ్డి, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్‌రావు, మాజీమంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్, ఎమ్మెల్సీలు పోతుల సునీత, తలశిల రఘురాం, తూమాటి మాధవరావు, శాసనసభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్, కుందూరు నాగార్జునరెడ్డి, అన్నా రాంబాబు, మేకపాటి విక్రమ్‌రెడ్డి, దర్శి ఇన్‌చార్జి బూచేపల్లి శివప్రసాదరెడ్డి, చీరాల ఇన్‌చార్జి కరణం వెంకటేష్, వేమూరు ఇన్‌చార్జి వరికూటి అశోక్‌బాబు, అద్దంకి ఇన్‌చార్జి పాణెం హనిమిరెడ్డి, తిరుపతి జిల్లా అధ్యక్షుడు నేదురుమల్లి రామ్‌కుమార్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ విభాగం ప్రభుత్వ సలహాదారు బత్తుల బ్రహ్మానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment