‘వారికి పునరావాసం కల్పించే బాధ్యత రాష్ట్రానిదే’ | AP Government Take Responsibility To Polavaram Project Expats Central Minister Says | Sakshi
Sakshi News home page

‘పోలవరం ప్రాజెక్ట్‌ పునరావాసం బాధ్యత కూడా రాష్ట్రానిదే’

Published Mon, Jul 15 2019 4:13 PM | Last Updated on Mon, Jul 15 2019 5:30 PM

AP Government Take Responsibility To Polavaram Project Expats Central Minister Says - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులకు పునరావాసం కల్పించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సోమవారం రాజ్య సభలో స్పష్టం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ నిర్వాసితులకు పరిహారం,  పునరావాసం సంబంధించిన సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ ఇతర అధికారుల ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక యంత్రాంగాన్ని నెలకొల్పిందని తెలిపారు. గిరిజన నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటైనట్లు మంత్రి చెప్పారు.

‘నిర్వాసితుల కోసం 2014-2019 మధ్య నాటి ప్రభుత్వం హయాంలో చేపట్టిన సహయ, పునరావాస కార్యక్రమాలలో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్న విషయం వాస్తవమేనా? ఈ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నదా’ అంటూ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ వాటిపై తగిన చర్యలు చేపట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని అన్యాపదేశంగా చెప్పారు.

‘అనేక అవరోధాలు, అవాంతరాలను అధిగమించి ఈ దశకు చేరిన పోలవరం ప్రాజెక్ట్ అంచనా వ్యయం 55 వేల కోట్లకు చేరింది. సవరించిన అంచనాల ప్రతిపాదనలను ప్రాజెక్ట్‌కు సంబంధించిన అన్ని విభాగాల ఆమోదం పొందడానికి సుమారు ఏడాది కాలం పట్టింది. ఇప్పుడు మళ్ళీ ఈ ప్రతిపాదనలను రివైజ్డ్‌ కాస్ట్‌ ఎస్టిమేట్స్‌ కమిటీకి పంపించడానికి కారణం, ఆవశ్యకత ఏమిటి? ఈ కమిటీ తన ప్రతిపాదనలను ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదానికి పంపించడానికి ఇంకెంత కాలం పడుతుంది​’ అని మంత్రిని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు.

దీనికి మంత్రి జవాబిస్తూ..‘ ఆంధ్ర ప్రదేశ్‌ పునర్విభజన చట్టం ప్రకారం ఏప్రిల్‌ 2014 నాటికి పోలవరం ప్రాజెక్ట్‌ కింద ఇరిగేషన్‌ అంశానికి అయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వం భరించాలి. ఆ మేరకు ఇప్పటి వరకు 5000 కోట్ల రూపాయలు ఇరిగేషన్‌ అంశం కింద ఖర్చయింది. మరో 7168 కోట్ల రూపాయలు మాత్రమే కేంద్రం చెల్లించాలి. అయితే ప్రాజెక్ట్‌ నిర్మాణ వ్యయం పెరిగిన దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం సవరించిన అంచనాలను సమర్పించింది. ఈ అంచనాలను ప్రాధమికంగా ఆమోదించిన పిమ్మట తదుపరి ఆమోదం కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపించడం జరిగింది. అంచనా వ్యయం పెంపుకు దారితీసిన కారణాలపై లోతుగా అధ్యయనం చేసి తగిన సిఫార్సులు చేసేందుకు రివైజ్డ్‌ కాస్ట్‌ ఎస్టిమేట్స్‌ కమిటీని ఏర్పాటు చేయవలసిందిగా ఆర్థిక మంత్రిత్వ శాఖ కోరింది. ఆ మేరకు తమ మంత్రిత్వ శాఖ జాయింట్‌ సెక్రటరీ అధ్యక్షతన ఈ కమిటీని ఏర్పాటు చేయవలసి వచ్చింది’  అని మంత్రి వివరించారు. ఈ కమిటీ జూన్‌ 26న తొలిసారిగా సమావేశం అయింది. తదుపరి సమావేశాలు కూడా త్వరితగతిన నిర్వహించడానికి మావంతు కృషి చేస్తామని మంత్రి చెప్పారు. 

పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ పనుల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం 2014కు ముందు చేసిన 5 వేల కోట్ల ఖర్చును కూడా ఆడిట్‌ చేసి బ్యాలెన్స్‌ షీట్లను సమర్పించవలసిందిగా ఆర్థిక మంత్రిత్వ శాఖ కోరిన మీదట ఇప్పటి వరకు 3 కోట్ల రూపాయల ఖర్చుకు సంబంధించిన ఆడిట్‌ పూర్తి చేయడం జరిగింది. ఈ ఆడిట్‌ పనులను త్వరితగతిన పూర్తి చేయడానికి సహకరించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నానని మంత్రి ఈ సందర్భంగా చెప్పారు.ఇక రాష్ట్ర ప్రభుత్వం 2017-18 ధరల స్థాయికి అనుగుణంగా కేంద్ర జల సంఘానికి  సమర్పించిన సవరించిన వ్యయ అంచనాల ప్రకారం ప్రాజెక్ట్‌ పూర్తి చేయడానికి రూ. 57 వేల కోట్లు కావాలని అడిగింది. ముంపుకు గురయ్యే భూములు, నష్టపరిహారం చెల్లించాల్సిన భూములు, మిగిలిన పనుల నిర్వహణకు నిర్ణయించి రేట్లు వంటి అంశాలపై జరిగిన సర్దుబాట్లతో సవరించిన అంచనా వ్యయం 55 వేల కోట్లకు తగ్గించినట్లు మంత్రి వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement