Doctor of Pharmacy
-
‘ఆ కోర్సు ఎంబీబీఎస్‌కు సమానం కాదు’
సాక్షి, న్యూఢిల్లీ : ఆరేళ్ళ ఫార్మ్.డి కోర్సు ఎంబీబీఎస్‌కు సమానం కాదని ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే మంగళవారం రాజ్య సభలో స్పష్టం చేశారు. ఫార్మ్.డి కోర్సును క్లినికల్ ఫార్మసిస్ట్‌లకు సమానంగా గుర్తించాలన్న డిమాండ్లు ప్రభుత్వం దృష్టికి వస్తున్నా ఎంబీబీఎస్‌తో సమానంగా గుర్తించాలన్న డిమాండ్ మాత్రం లేదన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ ఈ విషయం వెల్లడించారు. ‘ఆరేళ్ళ ఫార్మ్.డి కోర్సులో ప్రతి విద్యార్ధి రెండో సంవత్సరం నుంచి నాలుగో సంవత్సరం వరకు ఏడాదికి 50 గంటలపాటు ఆస్పత్రిలో పని చేయాల్సి ఉంటుంది. అయిదో ఏట ప్రతి రోజు ఒకపూట వార్డు రౌండ్ డ్యూటీ విధిగా నిర్వర్తించాలి. ఆరో ఏట 300 పడకల ఆస్పత్రిలో ఇంటర్న్‌షిప్ చేయాల్సి ఉంటుంద’ని మంత్రి వివరించారు. ఫార్మ్.డి కోర్సు విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్ధులకు వారి ప్రొవిజనల్ సర్టిఫికెట్‌పై డాక్టర్ ఆఫ్ ఫార్మసీగా రాయడంతోపాటు వారి పేరు ముందు డాక్టర్ అని కూడా పెట్టాలని 2012లో ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యూనివర్శిటీలను అదేశించినట్లు మంత్రి తెలిపారు. అలాగే ఫార్మసీ ప్రాక్టీస్ రెగ్యులేషన్ చట్టం కింద ఫార్మ్.డి ఉత్తీర్ణులైన వారిని ఫార్మసీ ప్రాక్టీషనర్‌గా చేర్చడం జరిగినట్లు తెలిపారు. అలాగే డ్రగ్ ఇన్ఫర్మేషన్ ఫార్మసిస్ట్స్, సీనియర్ ఫార్మసిస్ట్, చీఫ్ ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు అవసరమైన విద్యార్హతల కింద ఫార్మ్.డి కోర్సును కూడా చేర్చినట్లు ఆయన వెల్లడించారు. -
పేరుకు ముందు ‘డాక్టర్’ చేర్చాలి...
హైదరాబాద్: ఆరేళ్లపాటు చదివి డిగ్రీలను పొందినా కనీసం ప్రభుత్వ పరంగా చేయూత లేకపోగా... పట్టాలను జారీచేసిన విశ్వవిద్యాలయాలు తమ పేర్ల ముందు డాక్టర్ అనే పదాలను చేర్చేందుకు కూడా నిరాకరిస్తున్నాయంటూ డాక్టర్ ఆఫ్ ఫార్మసీ(ఫార్మా డీ) విద్యార్థులు ఆందోళనకు దిగారు. గురువారం జేఎన్టీయూహెచ్ పరిపాలన భవనం ఎదుట వందలాది విద్యార్థులు ప్రభుత్వానికి, వర్శిటీ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, రాష్ట్ర ఉన్నత విద్యామండలి కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు ఇచ్చే ప్రొవిజనల్, ఫైనల్ డిగ్రీ సర్టిఫికేట్లలో పేరుకు ముందు డాక్టర్ అనే పదాన్ని చేర్చాలని సూచించినప్పటికీ నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇతర చోట్ల పీసీఐ నిబంధనలకు అనుగుణంగా డాక్టర్ అనే పదాన్ని చేర్చి ధృవీకరణ పత్రాలను జారీ చేస్తుండగా ఓయూ, జేఎన్టీయూహెచ్లు మాత్రం పట్టించుకోకపోవడంపై తీవ్ర మనోవేదనను వ్యక్తం చేశారు. అనంతరం రిజిస్ట్రార్ యాదయ్యను కలిసి నెలరోజుల పాటు గడువు ఇస్తున్నామని తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫార్మా డి డాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్‌నాయక్, సత్యసునీల్, బారి నరేష్, అసోసియేషన్ ఫర్ డాక్టర్ ఆఫ్ ఫార్మసీ అధ్యక్షుడు లక్ష్మికాంత్, జగదీశ్, రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.