10న జరిగే సిద్ధం సభకు
15 లక్షల మంది వస్తారు
సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను సభలో సీఎం జగన్ వివరిస్తారు
ఎన్నికల్లో గెలిచాక ఐదేళ్లపాటు చేపట్టే కార్యక్రమాలు ప్రకటిస్తారు
ఎవరెన్ని పొత్తులు పెట్టుకున్నా వైఎస్సార్‌సీపీకి నష్టంలేదు
ఆదాయం పెరిగింది కాబట్టే తలసరి ఆదాయం పెరిగింది
సభకు వచ్చేవారికి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి వెల్లడి
నేతలతో కలసి సిద్ధం సభా ప్రాంగణం పరిశీలన
మేదరమెట్ల: రానున్న ఎన్నికల్లో ఎంతమంది ఎన్ని పొత్తులతో వచ్చినా నష్టంలేదని, 175 ఎమ్మెల్యేలతో పాటు 25 ఎంపీ స్థానాలను గెలుచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి చెప్పారు. బాపట్ల జిల్లా కొరిశపాడు మండలంలోని పి.గుడిపాడు జాతీయ రహదారి సమీపంలో ఈ నెల 10వ తేదీన నిర్వహించనున్న సిద్ధం సభకు ఏర్పాట్లను ఆయన గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో విజయసాయిరెడ్డి మాట్లాడారు. నాలుగవ సిద్ధం సభను భారీఎత్తున విజయవంతం చేయడానికి సర్వ సన్నద్ధమవుతున్నామని చెప్పారు.
గత ఐదేళ్లలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు, రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి పనుల గురించి సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వివరిస్తారన్నారు. అలాగే వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాక రానున్న ఐదేళ్లలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు చేయబోతుందనే అంశాలను సీఎం ప్రకటిస్తారని పేర్కొన్నారు. ఇప్పటి వరకు జరిగిన సిద్ధం సభలకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందన్నారు.
ఆదివారం జరిగే సిద్ధం మహాసభకు సుమారు 15 లక్షల మంది హాజరవుతారని, వచ్చిన వారందరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల వసతులతో ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఈసభ విజయవంతం చేసేందుకు బూత్ లెవల్ కమిటీలను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. సభ నిర్వహించే వంద ఎకరాలకు పక్కన మరో వంద ఎకరాలను కూడా సిద్ధం చేశామన్నారు.
రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి..
రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి సాధించిందని చెప్పారు. ఇప్పటికే రామాయపట్నం పోర్టును దాదాపు పూర్తిచేశామని.. తీర ప్రాంతంలో మిగిలిన పోర్టుల పనులు అత్యంత వేగంగా సాగుతున్నాయన్నారు. ఎన్నో పారిశ్రామిక సంస్థలు కూడా రాష్ట్రంలో పెట్టుబడి పెడుతున్నాయన్నారు. ఏపీలో తలసరి ఆదాయం పెరుగుదలకు అభివృద్ధి పనులే కారణం అన్నారు. అభివృద్ధి లేకపోతే తలసరి ఆదాయం పెరగదని చెప్పారు.
రాష్ట్రంలో 87 శాతం కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందజేశామని చెప్పారు. గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99 శాతం పైగా అమలు చేశామని తెలిపారు. బీసీలకు తెలివితేటలు లేవని, బీసీలు జడ్జిలుగా పనికిరారు అని గతంలో అన్న చంద్రబాబు ఇప్పుడు బీసీ డిక్లరేషన్ అంటే ఎవరూ నమ్మరని చెప్పారు.
రాష్ట్రంలో జగన్ ప్రభుత్వంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 75 శాతం పదవులు ఇచ్చారని చెప్పారు. వైనాట్ 175 ఎందుకంటున్నామో.. సిద్ధం సభ ద్వారా చూపిస్తామన్నారు. నేషనల్ మీడియా నుంచి కూడా అనేక మంది సిద్ధం సభకు హాజరవుతున్నారని, సిద్ధం సభల గురించి తెలుసుకోవడానికి వారు
ఎంతో ఆసక్తితో ఉన్నారన్నారు.
మేనిఫెస్టో సిద్ధం చేస్తున్నాం
రానున్న ఎన్నికల కోసం మేనిఫెస్టో సిద్ధం చేస్తున్నామని విజయసాయిరెడ్డి తెలిపారు. టీడీపీ, జనసేనలు పొత్తుల కోసం వెంపర్లాడే పార్టీలని.. తాము ముఖ్యమంత్రిని చూపించి ఓట్లు అడుగుతున్నామని చెప్పారు. అభ్యర్థులను వేరే చోటికి మార్చినంత మాత్రాన తమ పార్టీకి ఎటువంటి నష్టం లేదన్నారు. మార్చి 13, 14 లేదా 15 తేదీల్లో ఎన్నికల ప్రకటన రావచ్చన్నారు.
ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రూపొందించిన సిద్ధం టీ షర్టులను విజయసాయిరెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో బాపట్ల ఎంపీ నందిగం సురేష్, అద్దంకి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి పానెం చిన హనిమిరెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, యర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్‌చార్జి తాటిపర్తి చంద్రశేఖర్, పొన్నూరు ఇన్‌చార్జి అంబటి మురళి, గుంటూరు తూర్పు ఇన్‌చార్జి ఫాతిమా, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment