ఎన్నికల షెడ్యూల్‌తో అభ్యర్థులకు సరిపడా సమయం
అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలి
సిద్ధం సభల తరహాలో బస్సు యాత్ర సభలు విజయవంతం కావాలి
పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తల సమావేశంలో సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం
సాక్షి, అమరావతి : ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూలుతో అభ్యర్థులకు మరింత సమయం లభించిందని, ప్రతి గ్రామ సచివాలయాన్ని సందర్శించి.. ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిశా నిర్దేశం చేశారు. ఈ వెసులుబాటును అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సోమవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలతో సీఎం జగన్ సమావేశమయ్యారు. మే 13న ఎన్నికల పోలింగ్ జరుగుతున్నందున అభ్యర్థులకు సరిపడా సమయం ఉందన్నారు.
ఈ సమయాన్ని చక్కగా వినియోగించుకోవాలన్నారు. తమ నియోజకవర్గపరిధిలోని ప్రతి గ్రామ సచివాలయాన్ని సందర్శించి.. వీలైనంత ఎక్కువ మంది ప్రజలను కలిసేలా అభ్యర్థులు కార్యక్రమాలు రూపొందించుకోవాలని సూచించారు. దీనిపై అభ్యర్థులకు మార్గనిర్దేశం చేయాలని ప్రాంతీయ సమన్వయకర్తలను ఆదేశించారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా 81 అసెంబ్లీ నియోజకవర్గాల్లో, 18 పార్లమెంటు నియోజకవర్గాల్లో మార్పులు చేశామన్నారు. అభ్యర్థులకు ఇప్పుడున్న సమయం చాలా చక్కగా ఉపయోగపడుతుందన్నారు.
ఆయా నియోజకవర్గాల్లోని పార్టీ శ్రేణులు, నాయకత్వాన్ని సంఘటిత పరిచి, వారిని ఏకతాటిపైకి తీసుకువచ్చి కలిసికట్టుగా ముందుకు సాగాలని దిశా నిర్దేశం చేశారు. 175కు 175 శాసనసభ, 25కు 25 లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు నడవాలని లక్ష్య నిర్దేశం చేశారు. ఈ దిశగా కలిసి వచ్చే ప్రతి అంశాన్నీ వినియోగించుకుని, ఘన విజయాలు నమోదు చేయాలని పిలుపునిచ్చారు. ప్రాంతీయ సమన్వయకర్తలు ఎప్పటికప్పుడు తమ తమ ప్రాంతాల్లో పరిస్థితులను తెలుసుకుంటూ అభ్యర్థులకు చేదోడు, వాదోడుగా నిలవాలని సూచించారు. బస్సు యాత్రను విజయవంతం చేయడానికి అన్ని రకాలుగా సిద్ధం కావాలని ఆదేశించారు. బస్సు యాత్రలో భాగంగా జరిగే సభలు.. సిద్ధం సభల తరహాలోనే చరిత్రాత్మకం కావాలని దిశా నిర్దేశం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment