మాట్లాడుతున్న సజ్జల. చిత్రంలో తలశిల రఘురాం, పేర్ని నాని, లేళ్ల అప్పిరెడ్డి
బస్సు యాత్ర ద్వారా కార్యకర్తలను ఎన్నికల సంగ్రామానికి సన్నద్ధం చేస్తాం
ఇడుపులపాయ నుంచి ఉత్తరాంధ్రవరకు విరామం లేకుండా బస్సు యాత్ర
నిత్యం వివిధ వర్గాల ప్రజలతో ముఖాముఖి.. సాయంత్రం భారీ బహిరంగ సభ
27న ఇడుపులపాయ నుంచి ప్రారంభం.. తొలిరోజు ప్రొద్దుటూరులో భారీ బహిరంగ సభ
28న నంద్యాల, 29న కర్నూలు లోక్‌సభ నియోజకవర్గాల్లో యాత్ర
ప్రజా సంకల్ప పాదయాత్ర తరహాలోనే బస్సు యాత్ర
మా బ్రాండ్ సీఎం జగనే
నోటిఫికేషన్ తరువాత సీఎం జగన్ మలివిడత ప్రచారం
వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడి
సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, రాష్ట్ర సీఎం జగన్ నిత్యం వివిధ వర్గాల ప్రజలతో మమేకమవుతూ, కార్యకర్తలను ఎన్నికల సంగ్రామానికి సన్నద్ధులను చేస్తూ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర సాగుతుందని పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. సీఎం జగన్ చేపట్టే ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ఈ నెల 27వ తేదీన వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో ప్రారంభమై ఉత్తరాంధ్ర వరకు కొనసాగుతుందని తెలిపారు. 27న ఇడుపుల పాయలోని దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద సీఎం జగన్ నివాళులర్పిస్తారని, అనంతరం బస్సు యాత్ర ప్రారంభమవుతుందని చెప్పారు.
యాత్రలో ప్రతి రోజూ ఉదయం వివిధ వర్గాల ప్రజలతో ముఖాముఖి (ఇంటరాక్షన్), సాయంత్రం భారీ బహిరంగ సభ కామన్‌గా ఉంటాయని తెలిపారు. ఆయన మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో జరిగే తొలి 3 రోజుల బస్సు యాత్ర షెడ్యూల్‌ను విడుదల చేశారు. తర్వాత జరగబోయే యాత్ర వివరాలు త్వరలో వెల్లడిస్తామని చెప్పారు. సిద్ధం సభలు జరిగిన నాలుగు నియోజకవర్గాలు పోను మిగిలిన నియోజకవర్గాలన్నింటిలో బస్సు యాత్ర జరుగుతుందన్నారు.
ప్రజా సంకల్ప పాదయాత్ర తరహాలోనే బస్సు యాత్ర కూడా జరుగుతుందని తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే (సుమారు ఏప్రిల్ 18) వరకు సీఎం విరామం లేకుండా పూర్తిగా యాత్రలోనే ఉంటారని, పండుగలు, సెలవుల్లోనూ యాత్ర కొనసాగుతుందని చెప్పారు. నోటిఫికేషన్ వచ్చిన తరువాత సీఎం జగన్ మలివిడత ఎన్నికల ప్రచారం చేస్తారన్నారు. ఎంత మంది కూటమి కట్టినా తమ బ్రాండ్ సీఎం జగనే అని చెప్పారు. అన్ని రకాల శక్తులు, ప్రత్యర్ధులు ఏకమై వస్తున్నారని, వారందరినీ తాము
ఒంటరిగానే ఎదుర్కొంటున్నామని తెలిపారు.
కార్యకర్తల్లో చైతన్యం నింపే కార్యక్రమమిది
‘మేమంతా సిద్ధం’ అంటూ కార్యకర్తలందరినీ ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు, వారిలో చైతన్యం నింపేందుకు ఈ బస్సు యాత్ర చేస్తున్నారని తెలిపారు. ప్రతి జిల్లా మేమంతా సిద్ధం అని డిక్లేర్ చేసేలా గతంలో ఎన్నడూ జరగని విధంగా చాలా పెద్ద ఎత్తున మహా సభలు జరుగుతాయన్నారు. పార్టీ పెట్టినప్పటి నుంచీ సీఎం జగన్ అట్టడుగు వర్గాల వైపు నిలబడ్డారని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఐదేళ్లూ వారి కోసమే తపన పడ్డారని తెలిపారు. యాత్రలో రోజూ ఉదయం వివిధ వర్గాలతో జరిగే ముఖాముఖిలో ప్రభుత్వం ప్రజలకు మరింతగా సేవ చేసేందుకు అవసరమైన సలహాలు, సూచనలు కూడా తీసుకుంటారని చెప్పారు. మధ్యాహ్నం తర్వాత పార్టీ వారిని కలుస్తారన్నారు. సాయంత్రం మహా సభ జరుగుతుందని తెలిపారు. వీలైనంత వరకూ ఒక లోక్‌సభ నియోజకవర్గంలో 2 అసెంబ్లీ సెగ్మెంట్లలో సభలు పెట్టాలని భావిస్తున్నట్లు చెప్పారు.
సిద్ధం ప్రతిధ్వనికి కొనసాగింపుగా సీఎం జగన్ బస్సు యాత్ర...
వైఎస్సార్‌సీపీ ఉత్తరాంధ్ర నుంచి అనంతపురం వరకూ నిర్వహించిన 4 సిద్ధం సభలు జరిగిన తీరు నభూతో నభవిష్యతి అని, అక్కడికి వచ్చిన లక్షలాది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు సీఎం జగన్‌కి నీరాజనాలు పట్టారని తెలిపారు. చెప్పిన మాట మీద నిలబడి, విశ్వసనీయతకు మారు పేరుగా ఐదేళ్ల పాలనలో ప్రజలకు 20 ఏళ్ల పాటు జరగనంత అభివృద్ధి, సంక్షేమాన్ని అందించారన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99% అమలు చేసి మేనిఫెస్టోలకే కొత్త అర్ధం ఇచ్చి, ఒక రాజకీయ పార్టీ, ఒక నాయకుడు ఇలా ఉండాలి అనే మార్గదర్శకత్వం ఇచ్చారని తెలిపారు.
ఇప్పుడు సిద్ధం ప్రతిధ్వనికి కొనసాగింపుగా ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర చేపడుతున్నారన్నారు. సిద్ధం సభలతో జాతీయ స్థాయిలో కూడా అందరి దృష్టి ఏపీ వైపు పడిందన్నారు. దానికి కొనసాగింపుగా క్షేత్ర స్థాయిలో ‘మేము సిద్ధం, మా బూత్ సిద్ధం’ అని బూత్ స్థాయిలో కూడా చైతన్యవంతులయ్యారన్నారు. మాజీ మంత్రి పేర్ని నాని, సీఎం ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, శాసన మండలిలో విప్ లేళ్ల అప్పిరెడ్డి పాల్గొన్నారు.
సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ తొలి 3 రోజుల యాత్ర ఇలా..
27వ తేదీ (తొలి రోజు యాత్ర): ఉదయం ఇడుపులపాయలో మహానేత వైఎస్సార్ ఘాట్ వద్ద వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులు.
అనంతరం యాత్రకు శ్రీకారం.
సాయంత్రం ప్రొద్దుటూరులో తొలి ‘మేమంతా సిద్ధం’ భారీ బహిరంగ సభ.
28వ తేదీ (రెండో రోజు) : ఉదయం నంద్యాల లేదా ఆళ్లగడ్డలో వివిధ వర్గాల ప్రజలతో ముఖాముఖి.
సాయంత్రం నంద్యాలలో భారీ బహిరంగ సభ.
29వ తేదీ (మూడో రోజు): కర్నూలు పార్లమెంటు నియోజకవర్గంలోకి ప్రవేశిస్తారు. పలు రంగాల ప్రముఖులతో ముఖాముఖి. సాయంత్రం ఎమ్మిగనూరులో భారీ బహిరంగ సభ.
Comments
Please login to add a commentAdd a comment