పనికిరాని పట్టా | satavahana pharmaceutical college has no pci permission | Sakshi
Sakshi News home page

Published Fri, Feb 9 2018 3:59 PM | Last Updated on Fri, Feb 9 2018 3:59 PM

satavahana pharmaceutical college has no pci permission - Sakshi

శాతవాహనయూనివర్సిటీ: శాతవాహన యూనివర్సిటీ ఫార్మసీ కళాశాలలో అందరూ (అధ్యాపకులతోపాటు ప్రిన్సిపాల్‌ కూడా) కాంట్రాక్టు ఉద్యోగులే.. శాశ్వత అధ్యాపకులు లేనికారణంగా పీసీఐకి బ్రేక్‌ పడింది. గతంలో పీసీఐ కమిటీ యూనివర్సిటీ కళాశాలకు తనిఖీలకు వచ్చినప్పుడు ప్రయోగశాలలు, గ్రంథాలయం, భవనాలు, తరగతి గదులతోపాటు వివిధ అంశాలను పరిశీలించి పలులోపాలు గుర్తించి సరిదిద్దుకోవాలని సూచించారు. వారుచెప్పినట్లు అధ్యాపకుల నియామక ప్రక్రియ మినహా మిగతావన్నీ విషయాల్లో సిద్ధంగా ఉన్నారు. ఇందుకు సంబంధించిన నియమనిబంధనలు ప్రభుత్వం నుంచి రూపొందించి యూనివర్సిటీకి పంపించగా.. త్వరలో వర్సిటీ వివిధ విభాగాల్లో కలిపి 40 పోస్టులకు ప్రకటన విడుదల చేయనుంది. ఇందులో ఫార్మసీ విభాగంలో 18 పోస్టులున్నాయి. ఈ పోస్టులు భర్తీ అయ్యేవరకూ పీసీఐ రావడం కష్టమేనని విద్యావేత్తలు సూచిస్తున్నారు. ఇటీవల పీసీఐ గురించి ఢిల్లీ వెళ్లిన యూనివర్సిటీ అధికారులకు వర్సిటీ త్వరలో వెలువరించే నోటిఫికేషన్‌ ద్వారా 18 పోస్టులను భర్తీచేస్తున్నట్లు సూచించారు. ఇంతలో పీసీఐ అధికారులు మరోసారి శాతవాహనకు వచ్చి తనిఖీలు నిర్వహించి సంతృప్తి చెందితేనే గుర్తింపురానుంది. లేకుంటే పోస్టుల భర్తీ అయ్యాకే పీసీఐ సంగతి తేలనుంది.

238 ఫార్మసిస్ట్‌ పోస్టులు
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్‌సీ) 25 జనవరి 2018న నోటిఫికేషన్‌ నంబర్‌ 04/2018 ద్వారా 238 ఫార్మసిస్ట్‌ గ్రేడ్‌–2 పోస్టులకు ప్రకటన విడుదల చేసింది. ఇందులో డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ ఆండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ విభాగంలో 125 పోస్టులు, డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ విభాగంలో 58 పోస్టులు, తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లో 55 పోస్టులున్నాయి. ప్రకటన విడుదల చేసిన సమయంలో కేవలం ఇంటర్మీడియెట్‌తోపాటు డిఫార్మసీ చేసి ఫార్మసీ కౌన్సిల్‌ రిజిస్ట్రేషన్‌ ఉండాలని తెలపగా.. రెండురోజుల క్రితం డీ ఫార్మసీతోపాటు అంతకంటే హైయ్యర్‌కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు కూడా అవకాశం కల్పించింది. దీంతో శాతవాహన యూనివర్సిటీ ద్వారా బీఫార్మసీ పూర్తి చేసిన విద్యార్థులు  ఈ అవకాశాన్ని వినియోగించుకుందామంటే పీసీఐ గుర్తింపు లేకపోవడంతో అనర్హులుగా మిగిలి నిరాశచెందుతున్నారు. 

200పైగా విద్యార్థులకు అనర్హత
శాతవాహన యూనివర్సిటీ  ఫార్మసీ కళాశాలలో 2009లో బీ ఫార్మసీ కోర్సు ప్రారంభమైంది. అప్పటినుంచి ఇప్పటివరకు ఐదు బ్యాచ్‌లు పూర్తయ్యాయి. 270 మంది కోర్సులో ఉన్నారు. ఇందులో 200పైగా విద్యార్థులు పాసై ఉద్యోగాల వేటలో ఉన్నారు. వీరికి వర్సిటీకి పీసీఐ గుర్తింపు లేకపోవడంతో దరఖాస్తు చేసుకునేందుకు అనర్హులుగా మిగిలిపోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో కేవలం ఫార్మసిస్ట్‌ ఉద్యోగాలే ఉంటాయని, వాటికి కూడా అవకాశం లేదని వాపోతున్నారు. కనీసం మెడికల్‌ షాపులు కూడా పెట్టుకునేందుకు అవకాశం లేక ఉపాధిని కోల్పోతున్నామని మదనపడుతున్నారు. ప్రభుత్వం, అధికారులు విద్యార్థుల సమస్యలపై దృష్టిపెట్టి యూనివర్సిటీకి త్వరగా పీసీఐ గుర్తింపు తీసుకురావాలని, ఈ నోటిఫికేషన్‌కైనా పీసీఐతో సంబందం లేకుండా వారిని దరఖాస్తు చేసుకునేలా అవకాశమివ్వాలని విద్యార్థులు కోరుతున్నారు.

పీసీఐతో సంబంధం పెట్టొద్దు
వర్సిటీలో కోర్సు ప్రారంభించి తొమ్మిదేళ్లు గడిచింది. ఇప్పటివరకు పీసీఐ గుర్తింపు లేదు. సమస్యపై ప్రజాప్రతినిధులు,  మంత్రులు, అధికారులను కలిసి వినతిపత్రాలు ఇచ్చాం. మా గోడు వెల్లబోసుకున్నాం. ఎవరూ స్పందించలేదు. కోర్సు పూర్తిచేసుకున్నవారికి ఫార్మసిస్ట్‌ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుందామంటే అవకాశం లేకుండాపోతోంది. అధికారులు సమస్యను గుర్తించి పీసీఐతో సంబంధం లేకుండా నోటిఫికేషన్‌లోని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేలా అవకాశమివ్వాలి.
– పి.శిరీష, బీఫార్మసీ 

త్వరలోనే పీసీఐ కమిటీ రాక
పీసీఐ అధికారులు గతంలో తనిఖీలకు వచ్చినప్పుడు పలు లోపాలు గుర్తించి సవరించుకోవాలని సూచించారు. వారు అడిగిన సమాచారంతో ఢిల్లీ వెళ్లి వచ్చాం. దీంతోపాటు యూనివర్సిటీలో శాశ్వత అధ్యాపకుల నియామకాలు చేపడుతున్నట్లు వారి దృష్టికి తీసుకెళ్లాం. త్వరలోనే మళ్లీ కమిటీ యూనివర్సిటీకి పరిశీలనకు రానుంది.
– ఎం.కోమల్‌రెడ్డి, శాతవాహన రిజిస్ట్రార్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement