pci
-
‘ఫార్మా’లిటీస్ కోసం పాట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఫార్మసీ కాలేజీల్లో హడావుడి మొదలైంది. ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) గురువారం నుంచి తనిఖీలు ప్రారంభించనుండటంతో కాలేజీ యాజ మాన్యాలు నానా హైరానా పడుతున్నాయి. పీసీఐ నిబంధనలకు అనుగుణంగా ఫ్యాకల్టీ, మౌలిక వసతులు ఉన్నాయని చూపించేందుకు రకరకాల మార్గాలను అనుసరిస్తున్నాయి. దీనికోసం రికార్డులను కూడా తారుమారు చేసే ప్రయత్నం చేస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. పీసీఐ సిబ్బంది ప్రతి కాలేజీనీ పరిశీలించి వాస్తవ పరిస్థితిపై నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. దీని ఆధారంగానే కాలేజీలకు గుర్తింపు ఇస్తుంటారు. గత రెండేళ్లు కరోనా వల్ల పెద్దగా తనిఖీలు జరగలేదు. ఈసారి ప్రత్యక్ష తనిఖీలను పకడ్బందీగా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు కాలేజీలకు అధికారికంగా ఆదేశాలు కూడా జారీ చేశారు. అద్దె లేబొరేటరీలు చాలా ఫార్మసీ కాలేజీల్లో ఇప్పటికీ పీసీఐ నిబంధనల ప్రకారం లేబొరేటరీలు లేవనే ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో లేబొరేటరీల తనిఖీపై పీసీఐ ప్రధానంగా దృష్టి పెట్టింది. దీంతో ఇప్పటికప్పుడు కెమికల్ లేబొరేటరీలను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. లేబొరేటరీలు ఉన్న కాలేజీలతో మాట్లాడుకొని, తనిఖీ సమయంలో వాటిని తీసుకొచ్చి కాలేజీలో అమర్చుకుని తర్వాత తిరిగిచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. కొన్ని యాజమాన్యాలకు ఒక టి కన్నా ఎక్కువ కాలేజీలున్నాయి. వీళ్లు ఏదో ఒక కాలేజీలోనే లేబొరేటరీని కలిగి ఉన్నారు. ఇలాంటి వాళ్లు తనిఖీ సమయంలో మాయ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫ్యాకల్టీ కోసం పాట్లు చాలా కాలేజీల్లో సబ్జెక్టులో నిష్ణాతులైన అధ్యాపకులను నియమించట్లేదని ఆరోపణలున్నాయి. రికార్డుల్లో పీజీ, పీహెచ్డీ చేసిన అధ్యాపకులు అని పేర్కొంటున్నా విద్యార్థులకు బోధించే అధ్యాపకులు మాత్రం తక్కువ విద్యార్హతలు ఉన్నవాళ్లు ఉంటున్నారని విమర్శలున్నాయి. కాలేజీలో ఎవరు పనిచేస్తున్నారు, వారి అర్హతలేంటో పీసీఐ తనిఖీ చేయాల్సి ఉంది. దీని కోసం అన్ని రికార్డులు, ఫ్యాకల్టీ అందుబాటులో ఉండా లని తెలియజేసింది. దీంతో కాలేజీల యాజమాన్యాలు రికార్డుల్లో పేర్కొన్న వ్యక్తులను తనిఖీ సమయంలో రావాలని చెప్పినట్టు తెలిసింది. దీని కోసం కొంత ముట్టజెప్పేందుకు ఒప్పందమూ చేసుకున్నాయని సమాచారం. ఫ్యాకల్టీ పాన్ కార్డు ఆధారంగా వాళ్లు ఇంకెక్కడైనా ఉపాధి పొందుతున్నారా అని వివరాలు సేకరిస్తే కాలేజీల అసలు బాగోతం బయటపడుతుందని నిపుణులు చెబుతున్నారు. నిబంధనల అమలేదీ? ఫార్మా కాలేజీలు నిలువు దోపిడీ చేస్తున్నాయి. పీసీఐ నిబంధనలు ఎక్కడా అమలు కావట్లేదు. వేతన సంఘం జీతాలు కాదు కదా కనీసం రూ. 20 వేలు ఇచ్చే అవకాశం లేదు. కరోనా సమయంలో ఉద్యోగుల జీతాలు ఇప్పటికీ ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారు. అలాంటప్పుడు డిజిటల్ చెల్లింపులు ఎలా చూపిస్తారు. చిత్తశుద్ధితో తనిఖీలు చేస్తే అవకతవకలు వెలుగు చూస్తాయి. – అయినేని సంతోష్‌కుమార్, ప్రైవేటు సాంకేతిక కాలేజీల అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు -
వర్మ ప్రెస్‌మీట్ నిరాకరణపై నోటీసులు
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మను మీడియా సమావేశం ని ర్వహించకుండా అడ్డుకోవడంపై ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ, డీజీపీ, విజయవాడ పోలీస్ కమి షనర్, విజయవాడలోని ఐలాపురం, నోవాటెల్ హోటళ్ల జనరల్ మేనేజర్లకు భారత ప్రెస్‌కౌన్సి ల్ (పీసీఐ) నోటీసులు జారీ చేసింది. 15 రోజు ల్లోగా దీనిపై రాతపూర్వక సమాధానమివ్వాల ని పీసీఐ కార్యదర్శి అనుపమా భట్నాటర్ ఆదేశించారు. గత నెల 26న విజయవాడలో లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రదర్శకుడు రామ్‌గోపాల్ వర్మ, నిర్మాత రాకేష్‌రెడ్డి తదితరులను మీడియా సమావేశం నిర్వహించకుండా అడ్డుకోవడంపై ఇండియన్ జర్నలిస్టుల యూనియన్ (ఐజే యూ) సీనియర్ నాయకుడు, పీసీఐ మాజీ సభ్యుడు కె.అమర్నాథ్ పీసీఐకి ఫిర్యాదు చేశారు. పీసీఐ చైర్మన్ జస్టిస్ సీకే ప్రసాద్ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించినట్లు కార్య దర్శి అనుపమా తెలియజేశారన్నారు. ఇది భా వప్రకటనా స్వేచ్ఛకు విఘాతం కల్పించడంతో పాటు ముందుస్తు సెన్సార్ షిప్ (ప్రీ సెన్సార్ షిప్) విధించినట్టుగా భావించాల్సి ఉంటుంద ని నోటీసుల్లో పీసీఐ పేర్కొన్నట్లు అమర్నాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం ఎన్టీ రామారావు బయోపిక్ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు సంబంధించి దర్శకుడు, నిర్మాతలు మీడియా సమావేశం నిర్వహించకుండా అడ్డుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు. అధికార పార్టీ, పోలీసుల ఒత్తిళ్ల కారణంగానే మీడియా సమావేశం నిర్వహించేందుకు హాలు బుక్ చేయడానికి కూడా రెండు హోటళ్లు నిరాకరించాయని అమర్నాథ్ తెలిపారు. -
ముదిరిన ‘మీ టూ’ వ్యవహారం
న్యూఢిల్లీ/ముంబై: భారత సినీ, రాజకీయ, మీడియా రంగాల్లో ‘మీ టూ’ ఉద్యమం ప్రకంపనలు సృష్టిస్తోంది. పనిప్రదేశంలో తమను వేధించినవారి వివరాలను పలువురు మహిళలు ‘మీ టూ’ పేరుతో వెలుగులోకి తీసుకొస్తున్నారు. ఇలా ఆరోపణలు ఎదుర్కొన్నవారిలో మాజీ జర్నలిస్ట్, విదేశాంగ సహాయ మంత్రి ఎంజే అక్బర్, నటులు అలోక్‌నాథ్, నానా పటేకర్, బాలీవుడ్ దర్శకులు సాజిద్ ఖాన్, సుభాష్ ఘయ్ ఉన్నారు. తమను ఎంజే అక్బర్ వేధించాడని జర్నలిస్ట్ ప్రియా రమణి సహా 11 మంది మహిళా జర్నలిస్టులు ఆరోపించగా, సీనియర్ నటుడు అలోక్‌నాథ్ తనపై అత్యాచారం చేశాడని దర్శకురాలు, రచయిత్రి వినతా నందా ఆరోపించారు. ఈ నేపథ్యంలో ప్రియా రమణిపై కేంద్ర మంత్రి ఎంజే అక్బర్ సోమవారం ప్రైవేటు క్రిమినల్ పరువునష్టం దావాను దాఖలు చేశారు. ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టులో దాఖలు చేసిన ఈ పిటిషన్లో అక్బర్ న్యాయవాది సందీప్ కుమార్ స్పందిస్తూ.. ‘అక్బర్ జర్నలిస్టుగా సుదీర్ఘకాలం పనిచేశారు. దేశంలో తొలి రాజకీయ వారపత్రికను ఆయనే ప్రారంభించారు. జర్నలిస్ట్ ప్రియా రమణి ఉద్దేశపూర్వకంగా, దురుద్దేశంతో ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం నా క్లయింట్ తనను వేధించాడని ఇప్పుడు ఆరోపిస్తున్నారు. ఆయన రాజకీయ జీవితాన్ని, పేరు ప్రతిష్టలను దెబ్బతీసేందుకు మీడియాలో ఈ విద్వేషపూరిత ప్రచారం సాగుతోంది. ప్రియా రమణి చర్యలతో అక్బర్ పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లడంతో పాటు స్నేహితులు, కుటుంబ సభ్యులు, సహచరులతో ఆయన సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అంతేకాకుండా ప్రియా రమణి ఆరోపణలతో నా క్లయింట్ తీవ్ర మానసిక వేదన, ఒత్తిడికి లోనయ్యారు’ అని కోర్టుకు తెలిపారు. ఈ సందర్భంగా అక్బర్ తరఫున వాదించేందుకు సిద్ధంగా ఉన్న 97 మంది లాయర్ల పేర్లను సందీప్ కుమార్ కోర్టుకు అందజేశారు. మరోవైపు అక్బర్ పరువునష్టం దావా దాఖలు చేయడంపై స్పందించిన ప్రియా రమణి.. తానూ న్యాయపోరాటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. మరోవైపు తనపై అలోక్‌నాథ్ పలుమార్లు అత్యాచారం చేశాడని ఆరోపించిన రచయిత్రి వినతా నందాపై సివిల్ పరువునష్టం దావా దాఖలైంది. వినతా నందా తనకు బహిరంగ క్షమాపణ చెప్పడంతో పాటు నష్టపరిహారంగా రూ.1 చెల్లించాలని కోరుతూ ముంబైలోని దిన్దోషి సెషన్స్ కోర్టులో అలోక్‌నాథ్ పిటిషన్ దాఖలు చేశారు. గొంతు నొక్కేయాలని చూస్తున్నారు.. లైంగికవేధింపులకు గురైన బాధితుల భయాన్ని, బాధను అక్బర్ ఏమాత్రం పట్టించుకోలేదని ప్రియా రమణి దుయ్యబట్టారు. బెదిరించడం, వేధింపులకు గురిచేయడం ద్వారా బాధితుల గొంతును నొక్కేసేందుకు అక్బర్ యత్నిస్తున్నారని ఆరోపించారు. ఎంజే అక్బర్‌కు వ్యతిరేకంగా గతంలో గళమెత్తినవారు వృత్తి, వ్యక్తిగత జీవితంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ప్రియా రమణి అన్నారు. మరోవైపు ఈ కేసు విచారణ పూర్తయ్యే వరకూ అక్బర్ పదవి నుంచి తప్పుకోవాలని ఇండియన్ వుమెన్స్ ప్రెస్ కోర్(ఐడబ్ల్యూపీసీ), ప్రెస్‌క్లబ్ ఆఫ్ ఇండియా(పీసీఐ), ప్రెస్ అసోసియేషన్ అండ్ సౌత్ ఏషియన్ వుమెన్ ఇన్ ఇండియా సంయుక్తంగా డిమాండ్ చేశాయి. నిష్పాక్షిక విచారణ జరిగేందుకు వీలుగా అక్బర్ బాధ్యతల నుంచి తప్పుకోవాలని కోరాయి. లైంగిక వేధింపులపై మహిళా ఉద్యోగులు చేసే ఫిర్యాదులను సీరియఎస్‌గా తీసుకోవాలనీ, వాటిని ఉద్దేశ్యపూర్వక ఫిర్యాదులుగా పరిగణించరాదని విజ్ఞప్తి చేశాయి. కేంద్ర మంత్రి అక్బర్ తక్షణం పదవి నుంచి తప్పుకోవాలని ఇండియన్ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన ఇంటిముందు ఆందోళనకు దిగారు. జర్నలిస్ట్ దువాపై ఆరోపణలు ది వైర్ వెబ్సైట్ కన్సల్టింగ్ ఎడిటర్, సీనియర్ జర్నలిస్ట్ వినోద్ దువా తనను లైంగికంగా వేధించాడని డాక్యుమెంటరీ దర్శకురాలు నిష్టా జైన్ ఆరోపించింది. తాను 1989లో ఓ ఇంటర్వ్యూ సందర్భంగా వినోద్‌కు కలుసుకున్నాననీ, తాను కుర్చీలో కూర్చోకముందే అతను సెక్స్ జోక్ వేశాడని తెలిపారు. ‘‘ఓ రోజు కారు పార్కింగ్ ప్రదేశంలో దువా కనిపించాడు. ‘నీతో మాట్లాడాలి. నా కారులో కూర్చో’ అని కోరాడు. తన ప్రవర్తనకు క్షమాపణలు కోరతాడనుకొని కారులో కూర్చోగానే నా మీద పడిపోయి ముఖమంతా ముద్దులు పెట్టాడు. ఎలాగోలా తప్పించుకున్నా’’ అని తెలిపారు. మిత్రపక్షాల అసంతృప్తి సెగ.. సాక్షి ప్రతినిధి న్యూఢిల్లీ: అక్బర్‌ను తప్పించేందుకు కేంద్రం చొరవ తీసుకోని నేపథ్యంలో మిత్రపక్షాలే తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర విదేశాంగ సహాయ మంత్రిగా ఉన్న అక్బర్ వెంటనే పదవి నుంచి దిగిపోవాలనీ, లైంగిక వేధింపు ఆరోపణలపై విచారణను ఎదుర్కోవాలని ఎన్డీయే మిత్రపక్షం జనతాదళ్ యునైటెడ్(జేడీయూ) డిమాండ్ చేసింది. ‘ఈ విషయంలో అక్బర్ సొంతంగా ఓ నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నా. ఒకవేళ తప్పుకోకుంటే ప్రభుత్వమే మంత్రి బాధ్యతల నుంచి తొలగించాలి’ అని∙జేడీయూ నేత, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అన్నారు. మరోవైపు లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మహిళలపై అక్బర్ న్యాయపోరాటానికి దిగడం కేంద్ర ప్రభుత్వానికి ప్రతికూలంగా మారే అవకాశముందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
ఫార్మ్.డి గ్రాడ్యుయేట్స్ ఎంబీబీఎస్‌తో సమానమే కానీ..
సాక్షి, న్యూఢిల్లీ: ఫార్మ్.డి కోర్సును ఎంబీబీఎస్ కోర్సుతో సమానంగా గుర్తించాలన్న ఏ డిమాండ్ ప్రభుత్వం దృష్టికి రాలేదని ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా మంగళవారం రాజ్య సభకు తెలిపారు. రోగులకు వైద్య సేవలు అందించే విషయంలో ఎంబీబీఎస్‌తో సమానంగా తమ కోర్సును కూడా గుర్తించాలంటూ ఫార్మ్.డి గ్రాడ్యుయేట్ల నుంచి డిమాండ్ వస్తున్న విషయం వాస్తవమేనా అంటూ వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి స్పందిస్తూ ఈ విషయం వెల్లడించారు. ఇంటర్మీడియెట్ అనంతరం ఫార్మ్.డి విద్యార్దులు ఆరేళ్ళపాటు ఈ కోర్సును అధ్యయనం చేస్తారని మంత్రి వివరించారు. కోర్సులో భాగంగా రెండు, మూడు, నాలుగో సంవత్సరంలో విద్యార్ధులకు ఏటా 50 గంటలపాటు ఆస్పత్రిలో అధ్యయనం ఉంటుందని పేర్కొన్నారు. అయిదో సంవత్సరంలో ప్రతి రోజు వార్డు రౌండ్ డ్యూటీ నిర్వహిస్తారని, ఆరవ సంవత్సరంలో 300 పడగకల ఆస్పత్రిలో ఇంటర్న్‌షిప్ చేస్తారని వెల్లడించారు. ఇంటర్న్‌షిప్‌లో భాగంగా అధ్యాపకుడి పర్యవేక్షణలో విద్యార్ధి ఫార్మసీ, హెల్త్ కేర్ ప్రాక్టీస్ చేస్తారని మంత్రి తెలిపారు. ఫార్మ్.డి కోర్సును ఎంబీబీఎస్‌తో సమానంగా గుర్తించాలన్న డిమాండ్ ఏదీ ప్రభుత్వ దృష్టికి రానప్పటికీ ఈ కోర్సు పూర్తి చేసిన గ్రాడ్యుయేట్‌ని క్లినికల్ ఫార్మసిస్ట్‌గా గుర్తించాలంటూ ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ)కి వినతులు వస్తున్నట్లు మంత్రి తెలిపారు. పీసీఐ రూపొందించిన ఫార్మసీ ప్రాక్టీస్ నిబంధనల ప్రకారం లైసెన్స్ పొందిన, రిజిస్టర్ అయిన ఫార్మ్.డి గ్రాడ్యుయేట్లు తమ వృత్తిపరమైన ప్రాక్టీస్‌లో భాగంగా రోగులకు మందులు ఇవ్వవచ్చునని మంత్రి తెలిపారు. ఇంటర్న్‌షిప్‌లో భాగంగా క్లినికల్ ఫార్మసిస్టులు 300 పడకల మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో డాక్టర్లు ఇతర హెల్త్ కేర్ నిపుణులతో కలిసే పని చేస్తారు. ఫార్మసీ ప్రాక్టీస్ నిబంధనల ప్రకారం ఫార్మ్.డి గ్రాడ్యుయేట్లు ప్రభుత్వ లేదా ప్రైవేట్ రంగంలోని మెడికల్ సర్వీసెస్ విభాగాల్లో డ్రగ్ ఇన్ఫర్మేషన్ ఫార్మసిస్ట్, సీనియర్ ఫార్మసిస్ట్, చీఫ్ ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు అర్హులని నడ్డా వెల్లడించారు. అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, యూకే వంటి దేశాలలో ఫార్మ్.డి గ్రాడ్యుయేట్లు క్లినికల్ ఫార్మసిస్ట్‌లుగా పని చేస్తున్నట్లు నడ్డా పేర్కొన్నారు. -
పనికిరాని పట్టా
శాతవాహనయూనివర్సిటీ: శాతవాహన యూనివర్సిటీ ఫార్మసీ కళాశాలలో అందరూ (అధ్యాపకులతోపాటు ప్రిన్సిపాల్ కూడా) కాంట్రాక్టు ఉద్యోగులే.. శాశ్వత అధ్యాపకులు లేనికారణంగా పీసీఐకి బ్రేక్ పడింది. గతంలో పీసీఐ కమిటీ యూనివర్సిటీ కళాశాలకు తనిఖీలకు వచ్చినప్పుడు ప్రయోగశాలలు, గ్రంథాలయం, భవనాలు, తరగతి గదులతోపాటు వివిధ అంశాలను పరిశీలించి పలులోపాలు గుర్తించి సరిదిద్దుకోవాలని సూచించారు. వారుచెప్పినట్లు అధ్యాపకుల నియామక ప్రక్రియ మినహా మిగతావన్నీ విషయాల్లో సిద్ధంగా ఉన్నారు. ఇందుకు సంబంధించిన నియమనిబంధనలు ప్రభుత్వం నుంచి రూపొందించి యూనివర్సిటీకి పంపించగా.. త్వరలో వర్సిటీ వివిధ విభాగాల్లో కలిపి 40 పోస్టులకు ప్రకటన విడుదల చేయనుంది. ఇందులో ఫార్మసీ విభాగంలో 18 పోస్టులున్నాయి. ఈ పోస్టులు భర్తీ అయ్యేవరకూ పీసీఐ రావడం కష్టమేనని విద్యావేత్తలు సూచిస్తున్నారు. ఇటీవల పీసీఐ గురించి ఢిల్లీ వెళ్లిన యూనివర్సిటీ అధికారులకు వర్సిటీ త్వరలో వెలువరించే నోటిఫికేషన్ ద్వారా 18 పోస్టులను భర్తీచేస్తున్నట్లు సూచించారు. ఇంతలో పీసీఐ అధికారులు మరోసారి శాతవాహనకు వచ్చి తనిఖీలు నిర్వహించి సంతృప్తి చెందితేనే గుర్తింపురానుంది. లేకుంటే పోస్టుల భర్తీ అయ్యాకే పీసీఐ సంగతి తేలనుంది. 238 ఫార్మసిస్ట్ పోస్టులు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) 25 జనవరి 2018న నోటిఫికేషన్ నంబర్ 04/2018 ద్వారా 238 ఫార్మసిస్ట్ గ్రేడ్–2 పోస్టులకు ప్రకటన విడుదల చేసింది. ఇందులో డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఆండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగంలో 125 పోస్టులు, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ విభాగంలో 58 పోస్టులు, తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లో 55 పోస్టులున్నాయి. ప్రకటన విడుదల చేసిన సమయంలో కేవలం ఇంటర్మీడియెట్‌తోపాటు డిఫార్మసీ చేసి ఫార్మసీ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ ఉండాలని తెలపగా.. రెండురోజుల క్రితం డీ ఫార్మసీతోపాటు అంతకంటే హైయ్యర్కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు కూడా అవకాశం కల్పించింది. దీంతో శాతవాహన యూనివర్సిటీ ద్వారా బీఫార్మసీ పూర్తి చేసిన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుందామంటే పీసీఐ గుర్తింపు లేకపోవడంతో అనర్హులుగా మిగిలి నిరాశచెందుతున్నారు. 200పైగా విద్యార్థులకు అనర్హత శాతవాహన యూనివర్సిటీ ఫార్మసీ కళాశాలలో 2009లో బీ ఫార్మసీ కోర్సు ప్రారంభమైంది. అప్పటినుంచి ఇప్పటివరకు ఐదు బ్యాచ్‌లు పూర్తయ్యాయి. 270 మంది కోర్సులో ఉన్నారు. ఇందులో 200పైగా విద్యార్థులు పాసై ఉద్యోగాల వేటలో ఉన్నారు. వీరికి వర్సిటీకి పీసీఐ గుర్తింపు లేకపోవడంతో దరఖాస్తు చేసుకునేందుకు అనర్హులుగా మిగిలిపోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో కేవలం ఫార్మసిస్ట్ ఉద్యోగాలే ఉంటాయని, వాటికి కూడా అవకాశం లేదని వాపోతున్నారు. కనీసం మెడికల్ షాపులు కూడా పెట్టుకునేందుకు అవకాశం లేక ఉపాధిని కోల్పోతున్నామని మదనపడుతున్నారు. ప్రభుత్వం, అధికారులు విద్యార్థుల సమస్యలపై దృష్టిపెట్టి యూనివర్సిటీకి త్వరగా పీసీఐ గుర్తింపు తీసుకురావాలని, ఈ నోటిఫికేషన్‌కైనా పీసీఐతో సంబందం లేకుండా వారిని దరఖాస్తు చేసుకునేలా అవకాశమివ్వాలని విద్యార్థులు కోరుతున్నారు. పీసీఐతో సంబంధం పెట్టొద్దు వర్సిటీలో కోర్సు ప్రారంభించి తొమ్మిదేళ్లు గడిచింది. ఇప్పటివరకు పీసీఐ గుర్తింపు లేదు. సమస్యపై ప్రజాప్రతినిధులు, మంత్రులు, అధికారులను కలిసి వినతిపత్రాలు ఇచ్చాం. మా గోడు వెల్లబోసుకున్నాం. ఎవరూ స్పందించలేదు. కోర్సు పూర్తిచేసుకున్నవారికి ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుందామంటే అవకాశం లేకుండాపోతోంది. అధికారులు సమస్యను గుర్తించి పీసీఐతో సంబంధం లేకుండా నోటిఫికేషన్‌లోని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేలా అవకాశమివ్వాలి. – పి.శిరీష, బీఫార్మసీ త్వరలోనే పీసీఐ కమిటీ రాక పీసీఐ అధికారులు గతంలో తనిఖీలకు వచ్చినప్పుడు పలు లోపాలు గుర్తించి సవరించుకోవాలని సూచించారు. వారు అడిగిన సమాచారంతో ఢిల్లీ వెళ్లి వచ్చాం. దీంతోపాటు యూనివర్సిటీలో శాశ్వత అధ్యాపకుల నియామకాలు చేపడుతున్నట్లు వారి దృష్టికి తీసుకెళ్లాం. త్వరలోనే మళ్లీ కమిటీ యూనివర్సిటీకి పరిశీలనకు రానుంది. – ఎం.కోమల్‌రెడ్డి, శాతవాహన రిజిస్ట్రార్ -
ఏపీ పోలీసులపై పీసీఐ ఆగ్రహం
కోల్‌కతా: ఆంధ్రప్రదేశ్ పోలీసులపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీసీఐ) సోమవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజధాని భూముల కొనుగోలు స్కామ్ వెలుగులోకి తెచ్చినందుకు నలుగురు సాక్షి దినపత్రిక జర్నలిస్టులకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు సమన్లు జారీ చేశారు. కుంభకోణాలు వెలుగులోకి తెచ్చిన జర్నలిస్టులకు సమన్లు ఇవ్వడం పత్రికా స్వేచ్ఛను హరించడమేనంటూ ఐజేయూ ప్రధానకార్యదర్శి దేవులపల్లి అమర్ పీసీఐ చైర్మన్ జస్టిస్ ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన పీసీఐ పోలీసులను విచారణకు హాజరుకావాలంటూ ఆదేశించింది. సీఎం పర్యటనను సాకుగా చూపుతూ సోమవారం జరిగిన విచారణకు పోలీసులు హాజరుకాకపోవడంపై జస్టిస్ ప్రసాద్ అసహనం వ్యక్తం చేశారు. తర్వాతి విచారణకు పోలీసులు హాజరుకాకపోతే కఠినచర్యలు తప్పవని పీసీఐ హెచ్చరించింది. -
పీసీఐపై నిషేధం తాత్కాలికంగా ఎత్తివేత!
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన భారత పారా అథ్లెట్లకు ఊరట కలిగించే అంశం ఇది. భారత పారాలింపిక్ కమిటీ (పీసీఐ)పై ఉన్న నిషేధాన్ని తాత్కాలింగా ఎత్తివేస్తున్నట్లు అంతర్జాతీయ పారాలింపిక్ కమిటీ (ఐపీసీ) ప్రకటించింది. దీంతో రియోలో భారత పారా అథ్లెట్లకు దేశం తరఫున బరిలోకి దిగే అవకాశం దక్కింది. సెప్టెంబర్ 7 నుంచి 18 వరకు జరిగే ఈ పోటీలకు 20 మంది పారా అథ్లెట్లు అర్హత సాధించారు. పారాలింపిక్స్ వరకు మాత్రమే నిషేధాన్ని ఎత్తివేసిన ఐపీసీ... సంస్కరణలు అమలు చేయకుంటే మళ్లీ బ్యాన్ కొనసాగుతుందని తెలిపింది. అం తర్గత సమస్యలు, గ్రూప్ రాజకీయాల వల్ల గతేడాది ఏప్రిల్‌లో పీసీఐపై అంతర్జాతీయ బాడీ నిషేధం విధించింది. -
పనిలేక జర్నలిస్టులపై కేసులు పెట్టామా?
కడప: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి భూములపై వార్తలు రాసిన జర్నలిస్టులపై తప్పు లేకుండా కేసులు ఎందుకు పెడతామని డీజీపీ జేవీ రాముడు ప్రశ్నించారు. గురువారం ఆయన వైఎస్ఆర్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ 'మాకేమన్నా కేసులు లేక జర్నలిస్టులపై కేసులు పెట్టామా?. సమాజంలో ఒక హోదా ఉన్న వ్యక్తులపై నిరాధారమైన వార్తలు రాయకూడదు. వార్తలు రాసిన వారే నిరూపించుకోవాల్సిన బాధ్యత ఉంది. జర్నలిస్టులది తప్పుందా? లేదా అనేది విచారణ జరుపుతున్నామని' అన్నారు. కాగా ‘సాక్షి’ దినపత్రిక జర్నలిస్టులను విచారణ పేరిట పోలీసుస్టేషన్‌కు పిలిచి ‘రాజధాని దురాక్రమణ’ వార్తలకు మూలాలు(సోర్స్) ఏమిటో చెప్పాలని పోలీసు అధికారులు ప్రశ్నించడాన్ని భారత ప్రెస్ కౌన్సిల్(పీసీఐ) తీవ్రంగా ఆక్షేపించిన విషయం తెలిసిందే. -
ఏపీ పోలీసుల తీరుపై పీసీఐ తీవ్ర ఆందోళన
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ పోలీసుల తీరుపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సాక్షి దినపత్రికలో ప్రచురించిన ఏపీ రాజధాని అమరావతి భూ దందా కథనాలపై ...ఆ పత్రిక రిపోర్టర్లను పోలీస్ స్టేషన్‌కు పిలిపించడాన్ని పీసీఐ బుధవారం తప్పుబట్టింది. ఆధారాలు బయటపెట్టాలనడం పత్రికా స్వేచ్ఛకు భంగకరమని పీసీఐ వ్యాఖ్యానించింది. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ వ్యవహారాన్ని సుమెటో కేసుగా తీసుకుంది. ఇందుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, డీజీపీ, గుంటూరు ఎస్పీకి నోటీసులు ఇచ్చింది. -
ఫలించిన కల!
ఉద్యమాలు, ధర్నాలకుదక్కిన ప్రతిఫలం ఎంతోమంది విద్యార్థులకు లబ్ధి పాలమూరు యూనివర్సిటీ : పాలమూరు యూనివర్సిటీ (పీయూ)కు ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీసీఐ) గుర్తింపు లభించింది. ఈ మేరకు బుధవారం న్యూఢిల్లీ నుంచి యూనివర్సిటీకి లేఖ పంపారు. ఇక నుంచి దేశంలో ఉన్న అతి ముఖ్యమైన యూనివర్సిటీల సరసన పీయూ నిలవనుంది. దీంతో పాటు ఇక్కడ చదివిన వి ద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉండనుంది. పీసీఐ గు ర్తింపు వచ్చినట్లు లేక రావడంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పీసీఐ గుర్తింపు కోసం పీయూ విద్యార్థులు ఏడేళ్ల కాలం నుంచి రోజుల తరబడి ఎన్నో ఉద్యమాలు.. పరీక్షల బహిష్కరణ..ధర్నాలు.. రాస్తారోకోలు చేశారు. దీంతో వాటికి ప్రతిఫలం దక్కింది. పాలమూరు యూనివర్సిటీ 2008 ఆగస్టులో ప్రారంభం కాగా, ఇందులో ఫార్మసీ కళాశాల 2009లో ఏర్పాటు చేశారు. కళాశాల ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు మూడు బ్యాచ్‌లు చదువు పూర్తి చేసుకున్నా బయటికి వెళ్లిపోయారు. ప్రస్తుతం నాలుగో బ్యాచ్ నడుస్తోంది. పీసీఐ అంటే.. ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీసీఐ)ని పార్లమెట్ నామినేట్ చేస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పని చేస్తుంది. దీనిని 1948లో ప్రారంభించారు. ఆనాటి నుంచి ఇప్పటి వరకు దేశంలో ఉన్న విశ్వవిద్యాలయాల్లో ఫార్మసీ విద్య ఎలా కొనసాగుతుందో అనే విషయాన్ని పరిశీలన చేయడం పీసీఐ బాధ్యత. పీసీఐ గుర్తింపు లేని యూనివర్సిటీలను సందర్శించి అక్కడ కనీస సౌకర్యాలు ఉన్నాయా.. పీసీఐ గుర్తింపు ఇవ్వడానికి ఆ విశ్వవిద్యాలయానికి అర్హత ఉందో లేదో పరిశీలన చేస్తారు. అర్హత ఉంటే ఆ యూనివర్సిటీకి గుర్తింపు ఇస్తారు. గుర్తింపు ఇవ్వడం వల్ల యూనివర్సిటీ ఖ్యాతి పెరగడంతో పాటు అక్కడ చదువుకునే విద్యార్థులకు అన్ని రంగాల్లో అవకాశాలు ఉంటాయి. పీసీఐ వల్లే విద్యార్థులకు జరిగే మేలు.. పీసీఐ గుర్తింపు రావడం వల్ల స్థానికంగా చదువుకునే విద్యార్థులు ఎంతో మేలు చేకూరనుంది.. చదువు పూర్తయిన తర్వాత విద్యార్థులకు ప్రభుత్వ ఆసుపత్రిలో ఫార్మసిస్టు ఉద్యోగ అవకాశం, డ్రగ్గిస్ట్ ఉద్యోగాలు, రైల్వే ఫార్మసిస్ట్, మిలిటరి ఫార్మసిస్టు, స్వతహాగా మెడికల్ దుకాణం పెట్టుకోవడానికి అవకాశం ఇలా ప్రతి ఉద్యోగానికి పీసీఐ గుర్తింపు ఉన్న సర్టిఫికెట్ చాలా ఉపయోగంగా ఉంటుంది. పీసీఐ గుర్తింపు లేకుంటే ప్రభుత్వానికి సంబంధించిన ఎలాంటి ఉద్యోగానికీ వారు అర్హులు కాదు. మార్కెట్లో ఉన్న పెద్ద పెద్ద పరిశ్రమలలో పీసీఐ గుర్తింపు ఉన్న కళాశాలలో చదువుకున్న విద్యార్థులకు మొదటి ప్రాధాన్యం ఇస్తారు. పీయూను రెండుసార్లు సందర్శించిన పీసీఐ పాలమూరు యూనివర్సిటీని పీసీఐ బృందం 2014 జనవరిలో మొదటిసారి పరిశీలించింది. ఇద్దరు సభ్యుల బృందం.. ఫార్మసీ కళాశాల, హాస్టల్, ఫార్మసీ ల్యాబ్‌లు, ఇతర సౌకర్యాలపై పరిశీలన చేసి వెళ్లింది. అప్పుడు పీసీఐ గుర్తింపు ఇవ్వాల్సిన సౌకర్యాలు స్థానికంగా లేవని నివేదిక ఇవ్వడంతో గుర్తింపు రాలేదు. ఆ తర్వాత 2015 డిసెంబర్లో మరోమారు ఇద్దరు సభ్యుల బృందం సందర్శించింది. సభ్యులు స్థానిక సౌకర్యాలపై కొంతవరకు తృప్తి చెంది వెళ్లారు. పీయూ నుంచి పీసీఐ గుర్తింపు కోసం అవసరం అయిన పత్రాలు పంపించడంతో దాదాపు మూడు నెలల తర్వాత గుర్తింపు ఇస్తూ లేఖ పంపించారు. ఫార్మసీలో 4వ బ్యాచ్ రన్నింగ్.. పీయూలో ఫార్మసీ కళాశాల 2009లో ఏర్పాటు చేశారు. మూడు బ్యాచ్‌లలో 180మంది విద్యార్థులు విద్యను పూర్తి చేసి బయటకు వెళ్లారు. ప్రస్తుతం ఫార్మసీలో 4వ బ్యాచ్ నడుస్తుంది. ఆ విద్యారుల్థ చదువు కూడా మేలో ముగుస్తుంది. దీంతో పీసీఐ వల్ల వెళ్లిపోయిన 180మందితో పాటు ప్రస్తుతం చదువుకుంటున్న 60మందికి కూడా పీసీఐ గుర్తింపు దక్కనుంది. -
పీసీఐ చైర్మన్‌గా జస్టిస్ సీకే ప్రసాద్
న్యూఢిల్లీ: ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) చైర్మన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి చంద్రమౌళి కుమార్ ప్రసాద్ నియమితులు కానున్నారు. ప్రస్తుతం పీసీఐ చైర్మన్‌గా జస్టిస్ మార్కండేయ కట్జూ ఉన్నారు. పీసీఐ చైర్మన్ అభ్యర్థిని ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కమిటీ ఎంపిక చేస్తుంది. ఈ మేరకు ప్రసాద్‌ను పీసీఐ చైర్మన్‌గా ఎంపిక చేసినట్లు సమాచారం అందిందని కేంద్ర సమాచార, ప్రసారశాఖ అధికారులు వెల్లడించారు. జస్టిస్ ప్రసాద్ పట్నా నగరంలో పుట్టిపెరిగారు. అక్కడే ఉన్నత విద్యను అభ్యసించారు. ఆయన కొంతకాలం పట్నా హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగానూ పనిచేశారు. త్వరలోనే ఆయన చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.