ముదిరిన ‘మీ టూ’ వ్యవహారం | M.J. Akbar files criminal defamation case against Priya Ramani | Sakshi
Sakshi News home page

ముదిరిన ‘మీ టూ’ వ్యవహారం

Published Tue, Oct 16 2018 3:32 AM | Last Updated on Tue, Oct 16 2018 11:40 AM

M.J. Akbar files criminal defamation case against Priya Ramani - Sakshi

అక్బర్‌ మంత్రిపదవికి రాజీనామా చేయాలంటూ ఢిల్లీలో నినాదాలిస్తున్న కాంగ్రెస్‌ కార్యకర్తలు

న్యూఢిల్లీ/ముంబై: భారత సినీ, రాజకీయ, మీడియా రంగాల్లో ‘మీ టూ’ ఉద్యమం ప్రకంపనలు సృష్టిస్తోంది. పనిప్రదేశంలో తమను వేధించినవారి వివరాలను పలువురు మహిళలు ‘మీ టూ’ పేరుతో వెలుగులోకి తీసుకొస్తున్నారు. ఇలా ఆరోపణలు ఎదుర్కొన్నవారిలో మాజీ జర్నలిస్ట్, విదేశాంగ సహాయ మంత్రి ఎంజే అక్బర్, నటులు అలోక్‌నాథ్, నానా పటేకర్, బాలీవుడ్‌ దర్శకులు సాజిద్‌ ఖాన్, సుభాష్‌ ఘయ్‌ ఉన్నారు. తమను ఎంజే అక్బర్‌ వేధించాడని జర్నలిస్ట్‌ ప్రియా రమణి సహా 11 మంది మహిళా జర్నలిస్టులు ఆరోపించగా, సీనియర్‌ నటుడు అలోక్‌నాథ్‌ తనపై అత్యాచారం చేశాడని దర్శకురాలు, రచయిత్రి వినతా నందా ఆరోపించారు.

ఈ నేపథ్యంలో ప్రియా రమణిపై కేంద్ర మంత్రి ఎంజే అక్బర్‌ సోమవారం ప్రైవేటు క్రిమినల్‌ పరువునష్టం దావాను దాఖలు చేశారు. ఢిల్లీలోని పటియాలా హౌస్‌ కోర్టులో దాఖలు చేసిన ఈ పిటిషన్‌లో అక్బర్‌ న్యాయవాది సందీప్‌ కుమార్‌ స్పందిస్తూ.. ‘అక్బర్‌ జర్నలిస్టుగా సుదీర్ఘకాలం పనిచేశారు. దేశంలో తొలి రాజకీయ వారపత్రికను ఆయనే ప్రారంభించారు. జర్నలిస్ట్‌ ప్రియా రమణి ఉద్దేశపూర్వకంగా, దురుద్దేశంతో ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం నా క్లయింట్‌ తనను వేధించాడని ఇప్పుడు ఆరోపిస్తున్నారు. ఆయన రాజకీయ జీవితాన్ని, పేరు ప్రతిష్టలను దెబ్బతీసేందుకు మీడియాలో ఈ విద్వేషపూరిత ప్రచారం సాగుతోంది. ప్రియా రమణి చర్యలతో అక్బర్‌ పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లడంతో పాటు స్నేహితులు, కుటుంబ సభ్యులు, సహచరులతో ఆయన సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

అంతేకాకుండా ప్రియా రమణి ఆరోపణలతో నా క్లయింట్‌ తీవ్ర మానసిక వేదన, ఒత్తిడికి లోనయ్యారు’ అని కోర్టుకు తెలిపారు. ఈ సందర్భంగా అక్బర్‌ తరఫున వాదించేందుకు సిద్ధంగా ఉన్న 97 మంది లాయర్ల పేర్లను సందీప్‌ కుమార్‌ కోర్టుకు అందజేశారు. మరోవైపు అక్బర్‌ పరువునష్టం దావా దాఖలు చేయడంపై స్పందించిన ప్రియా రమణి.. తానూ న్యాయపోరాటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. మరోవైపు తనపై అలోక్‌నాథ్‌ పలుమార్లు అత్యాచారం చేశాడని ఆరోపించిన రచయిత్రి వినతా నందాపై సివిల్‌ పరువునష్టం దావా దాఖలైంది. వినతా నందా తనకు బహిరంగ క్షమాపణ చెప్పడంతో పాటు నష్టపరిహారంగా రూ.1 చెల్లించాలని కోరుతూ ముంబైలోని దిన్‌దోషి సెషన్స్‌ కోర్టులో అలోక్‌నాథ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

గొంతు నొక్కేయాలని చూస్తున్నారు..
లైంగికవేధింపులకు గురైన బాధితుల భయాన్ని, బాధను అక్బర్‌ ఏమాత్రం పట్టించుకోలేదని ప్రియా రమణి దుయ్యబట్టారు. బెదిరించడం, వేధింపులకు గురిచేయడం ద్వారా బాధితుల గొంతును నొక్కేసేందుకు అక్బర్‌ యత్నిస్తున్నారని ఆరోపించారు. ఎంజే అక్బర్‌కు వ్యతిరేకంగా గతంలో గళమెత్తినవారు వృత్తి, వ్యక్తిగత జీవితంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ప్రియా రమణి అన్నారు.   మరోవైపు ఈ కేసు విచారణ పూర్తయ్యే వరకూ అక్బర్‌ పదవి నుంచి తప్పుకోవాలని ఇండియన్‌ వుమెన్స్‌ ప్రెస్‌ కోర్‌(ఐడబ్ల్యూపీసీ), ప్రెస్‌క్లబ్‌ ఆఫ్‌ ఇండియా(పీసీఐ), ప్రెస్‌ అసోసియేషన్‌ అండ్‌ సౌత్‌ ఏషియన్‌ వుమెన్‌ ఇన్‌ ఇండియా సంయుక్తంగా డిమాండ్‌ చేశాయి. నిష్పాక్షిక విచారణ జరిగేందుకు వీలుగా అక్బర్‌ బాధ్యతల నుంచి తప్పుకోవాలని కోరాయి. లైంగిక వేధింపులపై మహిళా ఉద్యోగులు చేసే ఫిర్యాదులను సీరియఎస్‌గా తీసుకోవాలనీ, వాటిని ఉద్దేశ్యపూర్వక ఫిర్యాదులుగా పరిగణించరాదని విజ్ఞప్తి చేశాయి. కేంద్ర మంత్రి అక్బర్‌ తక్షణం పదవి నుంచి తప్పుకోవాలని ఇండియన్‌ యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆయన ఇంటిముందు ఆందోళనకు దిగారు.  

జర్నలిస్ట్‌ దువాపై ఆరోపణలు
ది వైర్‌ వెబ్‌సైట్‌ కన్సల్టింగ్‌ ఎడిటర్, సీనియర్‌ జర్నలిస్ట్‌ వినోద్‌ దువా తనను లైంగికంగా వేధించాడని డాక్యుమెంటరీ దర్శకురాలు నిష్టా జైన్‌ ఆరోపించింది. తాను 1989లో ఓ ఇంటర్వ్యూ సందర్భంగా వినోద్‌కు కలుసుకున్నాననీ, తాను కుర్చీలో కూర్చోకముందే అతను సెక్స్‌ జోక్‌ వేశాడని తెలిపారు. ‘‘ఓ రోజు కారు పార్కింగ్‌ ప్రదేశంలో దువా కనిపించాడు. ‘నీతో మాట్లాడాలి. నా కారులో కూర్చో’ అని కోరాడు. తన ప్రవర్తనకు క్షమాపణలు కోరతాడనుకొని కారులో కూర్చోగానే నా మీద పడిపోయి ముఖమంతా ముద్దులు పెట్టాడు. ఎలాగోలా తప్పించుకున్నా’’ అని తెలిపారు.

మిత్రపక్షాల అసంతృప్తి సెగ..
సాక్షి ప్రతినిధి న్యూఢిల్లీ: అక్బర్‌ను తప్పించేందుకు కేంద్రం చొరవ తీసుకోని నేపథ్యంలో మిత్రపక్షాలే తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర విదేశాంగ సహాయ మంత్రిగా ఉన్న అక్బర్‌ వెంటనే పదవి నుంచి దిగిపోవాలనీ, లైంగిక వేధింపు ఆరోపణలపై విచారణను ఎదుర్కోవాలని ఎన్డీయే మిత్రపక్షం జనతాదళ్‌ యునైటెడ్‌(జేడీయూ) డిమాండ్‌ చేసింది.   ‘ఈ విషయంలో అక్బర్‌ సొంతంగా ఓ నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నా. ఒకవేళ తప్పుకోకుంటే ప్రభుత్వమే మంత్రి బాధ్యతల నుంచి తొలగించాలి’ అని∙జేడీయూ నేత, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ అన్నారు. మరోవైపు లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మహిళలపై అక్బర్‌ న్యాయపోరాటానికి దిగడం కేంద్ర ప్రభుత్వానికి ప్రతికూలంగా మారే అవకాశముందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement