Press Council of India
-
Best Newspaper Art: మహాత్మా గాంధీ 150వ జయంతి.. సాక్షి కార్టూన్‌కు జాతీయ అవార్డు..
న్యూఢిల్లీ: మహాత్మా గాంధీజీ 150వ జయంతి సందర్భంగా 2019 అక్టోబర్ 2న సాక్షి దినపత్రికలో ప్రచురించిన బాపు కార్టూన్‌ను ప్రతిష్టాత్మక ప్రెస్ కౌన్సిల్ జాతీయ అవార్డు వరించింది. సాక్షి దినపత్రిక చీఫ్ కార్టూనిస్టు శంకర్ ఈ కారికేచర్‌ను గీశారు. 'భారత భాగ్య విధాతా!' పేరుతో బాపు బొమ్మను ఆనాటి స్వాతంత్య్ర ఉద్యమానికి అద్దం పట్టేలా చిత్రీకరించారు. బక్కపల్చటి గాంధీ రూపానికి సమున్నత స్వాతంత్య్ర ఆకాంక్షను కలిపి స్వేచ్ఛాభారతం కోసం మరికొందరు నాయకులతో వేస్తున్న అడుగులను ఈ కారికేచర్‌లో శంకర్ తీర్చిదిద్దారు. "ఐదున్నర అడుగుల ఆ రూపం ఈ దేశానికి చెక్కు చెదరని ప్రతిరూపం అయ్యింది. ఆ పెదాల మీది బోసినవ్వు బ్రిటీష్ సామ్రాజ్యాన్నే హడలెత్తించగలిగింది. ఆయన వేసిన ప్రతి అడుగూ చెదిరి ఉన్న మతాలను, జాతులను, భాషలను, సంస్కృతులను ఒక్క చోటుకు చేర్చగలిగింది. సమస్త భారతీయుల దీక్షను చేతికర్రగా ధరించి ఆయన ఈ దేశాన్ని స్వతంత్ర భారతదేశం చేశారు. దేశీయతను భారతీయతగా మలిచారు. ప్రజలను జాతిగా సంఘటితం చేశారు. మొలన ఉన్న గడియారంలోని పెద్దముల్లు లక్ష్యంగా, చిన్నముల్లు కర్తవ్యంగా ఆయన చేసినది మహా పరిశ్రమ. ఆయన కప్పుకున్న ధవళ వస్త్రం స్వచ్ఛతకు చిహ్నం. ఆయన అహింసను గెలిచే ఆయుధం లేదు. ఆయన సత్యాగ్రహాన్ని ఓడించేదే లేదు. తన సులోచనాలతో అనునిత్యం దర్శించినది ఒకే ఒక స్వప్నం" స్వేచ్ఛాభారతం.. సహన భారతం.. జ్ఞాన భారతం.. ఆధ్యాత్మిక భారతం.. సాక్షి ప్రచురించిన భారత భాగ్య విధాత ప్రజంటేషన్ను బెస్ట్ న్యూస్‌పేపర్ ఆర్ట్ : కవరింగ్ కార్టూన్స్, కారికేచర్స్ అండ్ ఇల్లస్ట్రేషన్ కేటగిరీ కింద 'నేషనల్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ జర్నలిజం 2020'కి గాను ప్రెస్ కౌన్సిల్ ప్రకటించింది. ఈ అవార్డు ఒక్క సాక్షి మీడియా గ్రూపుదే కాదు.. సాక్షిని ఆదరిస్తున్న పాఠకులు, అభిమానిస్తున్న సాక్షి కుటుంబానిది. ఫిబ్రవరి 28 న డిప్యూటీ స్పీకర్ హాల్, కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా, రఫీ మార్గ్, న్యూఢిల్లీలో జరిగే కార్యక్రమంలో ఈ అవార్దు ప్రదానోత్సవం జరుగుతుంది. భారత భాగ్య విధాతా! పీడీఎఫ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
సెక్స్ వర్కర్లను గౌరవించండి.. వేధించొద్దు!
న్యూఢిల్లీ: ‘‘సెక్స్ వర్కర్లూ అందరిలాంటి మనుషులే. వారికి తగిన గౌరవమివ్వాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వారిపై వేధింపులకు పాల్పడరాదు’’ అని పోలీసులకు సుప్రీంకోర్టు సూచించింది. మనుషుల మర్యాదకు కనీస భద్రత కల్పించడం బాధ్యతగా గుర్తించాలని పేర్కొంది. సెక్స్ వర్కర్లకు గౌరవం, భద్రత కల్పించడానికి చట్టమేదీ లేదు. అందుకే తాము జోక్యం చేసుకుంటున్నామని పేర్కొంది. సెక్స్‌వర్కర్లపై వేధింపులపై 2016లో దాఖలైన వ్యాజ్యంపై జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, జస్టిస్ బి.ఆర్.గావై, జస్టిస్ ఎ.ఎస్.బోపన్నతో కూడిన ధర్మాసనం తాజాగా విచారణ చేపట్టింది. దీనిపై సుప్రీంకోర్టు ప్యానెల్ సిఫార్సులను అమలు చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. వేధించడం, దూషించడం గానీ, భౌతికంగా గానీ సెక్స్‌వర్కర్ల మీద దాడి చేసే హక్కు గానీ పోలీసులకు ఉండబోదని కోర్టు పేర్కొంది. సెక్స్ వర్కర్ల పనిని ‘‘వృత్తి’’గా గుర్తించే ముఖ్యమైన క్రమంలో.. చట్టం ప్రకారం గౌరవం, సమాన రక్షణకు సెక్స్ వర్కర్లు అర్హులని వ్యాఖ్యానించింది. అలాగే సెక్స్ వర్కర్లను వ్యభిచార కూపం నుంచి రక్షించే సమయంలో.. సెక్స్‌వర్కర్ల ఫొటోలు, గుర్తింపును బయటపెట్టొద్దంటూ కోర్టు మీడియాకు ఆదేశాలు జారీ చసింది. ఐపీసీ సెక్షన్ 354సీ voyeurism (ఇతరులు నగ్నంగా ఉన్నప్పుడు.. శారీరకంగా కలుసుకున్నప్పుడు తొంగి చూడడం లాంటి నేరం) కిందకే వస్తుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను మీడియాకు జారీ చేయాలని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ద్వారా సంక్రమించిన అధికారాన్ని ఉపయోగించుకొని సుప్రీంకోర్టు ఈ మేరకు పోలీసులకు, మీడియాకు ఆదేశాలిచ్చింది. -
నా పరువు తీస్తున్నారు!
న్యూఢిల్లీ: రియా చక్రవర్తి డ్రగ్స్ కేసులో తన పేరును అనవసరంగా మీడియాలో ప్రచారం చేస్తున్నారని, దీన్ని నిలిపివేయాలని సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. రకుల్ దాఖలు చేసిన పిటిషన్‌పై కేంద్రం వైఖరి వెల్లడించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో తమ వైఖరిని చెప్పాలని పిటిషన్ విచారించిన జస్టిస్ నవీన్ చావ్లా కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖకు, ప్రసారభారతికి, ప్రెస్ కౌన్సిల్‌కు, న్యూస్ బ్రాడ్కాస్ట్ అసోసియేషన్‌కు నోటీసులు జారీ చేశారు. రకుల్ పిటిషన్‌ను ఫిర్యాదుగా స్వీకరించి ఈ నాలుగు సంస్థలు ఒక నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. తదుపరి విచారణను అక్టోబర్ 15కు వాయిదా వేశారు. డ్రగ్స్ కేసులో విచారణ వేళ సంబంధిత ఆఫీసర్లకన్నా ముందే మీడియాకు కొన్ని అంశాలు లీకవుతున్నాయని, దీనిపై విచారణ జరగాలని అభిప్రాయపడ్డారు. ముందుగా ఫిర్యాదు చేయాల్సింది.. కేసులో కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ చేతన్ శర్మ వాదనలు వినిపించారు. రకుల్ కోరుకున్నట్లు ఇంజంక్షన్ లేదా బ్లాంకెట్ బ్యాన్ లాంటి ఆదేశాలివ్వద్దని కోరారు. కోర్టుకు వచ్చేముందు ఆమె ప్రభుత్వానికి కానీ సంబంధిత అథార్టీకి కానీ ఫిర్యాదు చేయలేదని, ఏదో ఒక్క మీడియా హౌస్ లేదా చానల్‌ను ప్రత్యేకంగా ఆమె పేర్కొనలేదని చెప్పారు. దీనిపై రకుల్ న్యాయవాది స్పందిస్తూ రకుల్ పేరు తాను చెప్పలేదని రియా చక్రవర్తి వివ రించినా మీడియా రిపోర్టులు రకుల్‌ను డ్రగ్స్ కేసుతో లింక్ చేసే రాస్తున్నాయన్నారు. సోషల్ మీడియాలో విపరీత ప్రచారం జరుగుతుండడంతో ప్రభుత్వానికి ఫిర్యాదు చేసే సమయం లేక నేరుగా కోర్టును ఆశ్రయించామని చెప్పారు. -
పీసీఐ అనుమతి లేకుండా కేసులొద్దు
న్యూఢిల్లీ: ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీసీఐ) లేదా ఇతర జ్యుడీషియరీ అథారిటీ అనుమతి లేకుండా జర్నలిస్టులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం తగదని, ఈ మేరకు ప్రభుత్వానికి తగిన ఆదేశాలివ్వాలని కోరుతూ అడ్వొకేట్ ఘనశ్యామ్ ఉపాధ్యాయ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సంఘ విద్రోహ, జాతి వ్యతిరేక శక్తుల బండారం బయటపెడుతున్న న్యూస్ చానళ్లను కొందరు లక్ష్యంగా చేసుకుంటున్నారని, పాత్రికేయులపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామి, జీ న్యూస్ ఎడిటర్ సుధీర్ చౌదరిపై ఇలాగే కేసులు పెట్టారని గుర్తుచేశారు. జర్నలిస్టులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటే పీసీఐ అనుమతిని తప్పనిసరి చేయాలని కోరారు. ఈ విషయంలో ప్రభుత్వానికి మార్గదర్శకాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. -
ఒత్తిళ్లు ఉంటే ఫిర్యాదు చేయండి
సాక్షి, హైదరాబాద్ : పాత్రికేయులు ఎక్కడైనా ఇబ్బందులకు గురైనా, వారిపై ఒత్తిళ్లు ఉంటే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని ప్రెస్ కౌన్సిల్ అఫ్ ఇండియా చైర్మన్ చంద్రమౌళికుమార్ ప్రసాద్ తెలిపారు. అదేవిధంగా వార్తలు రాసే ముందు పాత్రికేయులు ఒకటికి రెండు సార్లు వాస్తవాలను తెలుసుకోవాలని, ఆరోపణలు ప్రచురించేముందు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. పాత్రికేయులపై రాజకీయ వేధింపులు, కక్ష సాధింపులు, అరెస్టులు వంటి చర్యలకు పాల్పడవద్దని రాజకీయ నేతలు, ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ దేశంలోని వివిధ పత్రికలపై దాదాపుగా 37 కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. రెండ్రోజులుగా హైదరాబాద్ వేదికగా కేసుల విచారణ జరిగిందని తెలిపారు. ఈ కేసులలో 9 మంది ఫిర్యాదుదారులు పత్రికారంగానికి చెందినవారని, 27 మంది సాధారణ పౌరులని వివరించారు. పాత్రికేయులపై వేధింపులకు పాల్పడితే తామే స్పందించి సుమోటోగా కేసులు నమోదు చేస్తామన్నారు. పాత్రికేయుల సంక్షేమానికి కృషి చేయడం తమ బాధ్యతన్నారు. తమిళనాడు, తెలంగాణలో పాత్రికేయుల అరెస్టులపై తాము ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను నివేదిక కోరామన్నారు. హైదరాబాద్ కేంద్రంగా నడిచే ఓ ఆంగ్ల దినపత్రికపై నమోదైన ఫిర్యాదుల ఆధారంగా వారిపై విచారణ జరిపామని, వారి సమాధానం సంతృప్తికరంగా లేకపోవడంతో సదరు దినపత్రికను సెన్సార్ చేస్తున్నామని చెప్పారు. సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అన్ని మీడియాలను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని ప్రభుత్వానికి ఐదేళ్లుగా సిఫారసు చేస్తున్నామని తెలిపారు. యాడ్లు రాకుండా ఆర్థికంగా చితికిపోతున్న చిన్న పత్రికలకు ప్రభుత్వం నుంచి సహకారం లభించేలా నూతన యాడ్ విధానాన్ని రూపొందిస్తున్నామన్నారు. -
ఆంధ్రజ్యోతికి ప్రెస్ కౌన్సిల్ షోకాజ్ నోటీసు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ మళ్లీ అధికారంలోకి రాబోతోందంటూ బోగస్ సర్వే ప్రచురించిన ఆంధ్రజ్యోతి దినపత్రికకు భారత ప్రెస్ కౌన్సిల్ (పీసీఐ) షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఈ ఫేక్ న్యూస్ ప్రచురణపై 15 రోజుల్లో రాతపూర్వక సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. బుధవారం పీసీఐ కార్యదర్శి అనుపమ భట్నాగర్ షోకాజ్ నోటీసును ఆంధ్రజ్యోతి సంపాదకులకు పంపించారు. ఈ వార్తకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులపై స్పందించి ఈ నోటీసును జారీ చేసినట్టు తెలిపారు. నోటీసు పంపిన తేదీ నుంచి నిర్ణీత గడువులోగా ఆ పత్రిక నుంచి స్పందన రాకపోతే తగిన చర్యలు తీసుకునేందుకు ఈ అంశాన్ని ప్రెస్ కౌన్సిల్ విచారణ కమిటీ ముందు ఉంచుతామని స్పష్టం చేశారు. ఇదీ నేపథ్యం... లోక్‌నీతి–సీఎస్డీఎస్ సంస్థలు నిర్వహించినట్టుగా పేర్కొన్న బోగస్ సర్వేలో టీడీపీ 126–135 ఎమ్మెల్యే స్థానాలు, 18–22 ఎంపీ సీట్లను గెలుచుకోబోతోందని ఈ నెల 2న ఆంధ్రజ్యోతి పత్రికలో వార్త ప్రచురితమైన విషయం విదితమే. తాము ఏపీలో ఎలాంటి సర్వే నిర్వహించలేదని, తమ సంస్థ పేరును దుర్వినియోగం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని లోక్‌నీతి–సీఎస్డీఎస్ సంస్థ హెచ్చరించింది. ఈ వార్తతో తమ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని కూడా స్పష్టం చేసింది. ఈ బోగస్ సర్వే వార్తపై కేంద్ర ఎన్నికల సంఘానికి, ప్రెస్ కౌన్సిల్ ఇండియాకు సైతం పలువురు ఫిర్యాదు చేశారు. బోగస్ సర్వేలతో వార్తలు ప్రచురించడాన్ని తాను పెయిడ్ న్యూస్‌గా అనుమానిస్తున్నట్టు, ఈ వార్త ›ప్రచురణకు గాను ఆంధ్రజ్యోతి పత్రికపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ జస్టిస్ సీకే ప్రసాద్‌కు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరాలకు సీనియర్ జర్నలిస్టు, భారత ప్రెస్ కౌన్సిల్ మాజీ సభ్యుడు కె.అమర్నాథ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదుతోపాటు ఆంధ్రజ్యోతి బోగస్ సర్వే వార్త, దాని ఇంగ్లిష్ అనువాదం, లోక్‌నీతి–సీఎస్డీఎస్ సంస్థ ఖండన ఇతర వివరాలను కూడా జతచేశారు. ప్రత్యేకంగా ఒక పార్టీకి అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేసేలా వార్తను ప్రచురించడం సరికాదని ఈ విషయంలో ఆంధ్రజ్యోతి పత్రికపై న్యాయపరంగా చర్య తీసుకోవాలని కోరారు. ఇలాంటి వార్తలు ఎన్నికల ప్రక్రియను స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగకుండా ప్రభావితం చేసే అవకాశమున్నందున వెంటనే చర్యలు తీసుకోవాలని అమర్నాథ్ విజ్ఞప్తి చేశారు. -
ముదిరిన ‘మీ టూ’ వ్యవహారం
న్యూఢిల్లీ/ముంబై: భారత సినీ, రాజకీయ, మీడియా రంగాల్లో ‘మీ టూ’ ఉద్యమం ప్రకంపనలు సృష్టిస్తోంది. పనిప్రదేశంలో తమను వేధించినవారి వివరాలను పలువురు మహిళలు ‘మీ టూ’ పేరుతో వెలుగులోకి తీసుకొస్తున్నారు. ఇలా ఆరోపణలు ఎదుర్కొన్నవారిలో మాజీ జర్నలిస్ట్, విదేశాంగ సహాయ మంత్రి ఎంజే అక్బర్, నటులు అలోక్‌నాథ్, నానా పటేకర్, బాలీవుడ్ దర్శకులు సాజిద్ ఖాన్, సుభాష్ ఘయ్ ఉన్నారు. తమను ఎంజే అక్బర్ వేధించాడని జర్నలిస్ట్ ప్రియా రమణి సహా 11 మంది మహిళా జర్నలిస్టులు ఆరోపించగా, సీనియర్ నటుడు అలోక్‌నాథ్ తనపై అత్యాచారం చేశాడని దర్శకురాలు, రచయిత్రి వినతా నందా ఆరోపించారు. ఈ నేపథ్యంలో ప్రియా రమణిపై కేంద్ర మంత్రి ఎంజే అక్బర్ సోమవారం ప్రైవేటు క్రిమినల్ పరువునష్టం దావాను దాఖలు చేశారు. ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టులో దాఖలు చేసిన ఈ పిటిషన్లో అక్బర్ న్యాయవాది సందీప్ కుమార్ స్పందిస్తూ.. ‘అక్బర్ జర్నలిస్టుగా సుదీర్ఘకాలం పనిచేశారు. దేశంలో తొలి రాజకీయ వారపత్రికను ఆయనే ప్రారంభించారు. జర్నలిస్ట్ ప్రియా రమణి ఉద్దేశపూర్వకంగా, దురుద్దేశంతో ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం నా క్లయింట్ తనను వేధించాడని ఇప్పుడు ఆరోపిస్తున్నారు. ఆయన రాజకీయ జీవితాన్ని, పేరు ప్రతిష్టలను దెబ్బతీసేందుకు మీడియాలో ఈ విద్వేషపూరిత ప్రచారం సాగుతోంది. ప్రియా రమణి చర్యలతో అక్బర్ పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లడంతో పాటు స్నేహితులు, కుటుంబ సభ్యులు, సహచరులతో ఆయన సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అంతేకాకుండా ప్రియా రమణి ఆరోపణలతో నా క్లయింట్ తీవ్ర మానసిక వేదన, ఒత్తిడికి లోనయ్యారు’ అని కోర్టుకు తెలిపారు. ఈ సందర్భంగా అక్బర్ తరఫున వాదించేందుకు సిద్ధంగా ఉన్న 97 మంది లాయర్ల పేర్లను సందీప్ కుమార్ కోర్టుకు అందజేశారు. మరోవైపు అక్బర్ పరువునష్టం దావా దాఖలు చేయడంపై స్పందించిన ప్రియా రమణి.. తానూ న్యాయపోరాటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. మరోవైపు తనపై అలోక్‌నాథ్ పలుమార్లు అత్యాచారం చేశాడని ఆరోపించిన రచయిత్రి వినతా నందాపై సివిల్ పరువునష్టం దావా దాఖలైంది. వినతా నందా తనకు బహిరంగ క్షమాపణ చెప్పడంతో పాటు నష్టపరిహారంగా రూ.1 చెల్లించాలని కోరుతూ ముంబైలోని దిన్దోషి సెషన్స్ కోర్టులో అలోక్‌నాథ్ పిటిషన్ దాఖలు చేశారు. గొంతు నొక్కేయాలని చూస్తున్నారు.. లైంగికవేధింపులకు గురైన బాధితుల భయాన్ని, బాధను అక్బర్ ఏమాత్రం పట్టించుకోలేదని ప్రియా రమణి దుయ్యబట్టారు. బెదిరించడం, వేధింపులకు గురిచేయడం ద్వారా బాధితుల గొంతును నొక్కేసేందుకు అక్బర్ యత్నిస్తున్నారని ఆరోపించారు. ఎంజే అక్బర్‌కు వ్యతిరేకంగా గతంలో గళమెత్తినవారు వృత్తి, వ్యక్తిగత జీవితంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ప్రియా రమణి అన్నారు. మరోవైపు ఈ కేసు విచారణ పూర్తయ్యే వరకూ అక్బర్ పదవి నుంచి తప్పుకోవాలని ఇండియన్ వుమెన్స్ ప్రెస్ కోర్(ఐడబ్ల్యూపీసీ), ప్రెస్‌క్లబ్ ఆఫ్ ఇండియా(పీసీఐ), ప్రెస్ అసోసియేషన్ అండ్ సౌత్ ఏషియన్ వుమెన్ ఇన్ ఇండియా సంయుక్తంగా డిమాండ్ చేశాయి. నిష్పాక్షిక విచారణ జరిగేందుకు వీలుగా అక్బర్ బాధ్యతల నుంచి తప్పుకోవాలని కోరాయి. లైంగిక వేధింపులపై మహిళా ఉద్యోగులు చేసే ఫిర్యాదులను సీరియఎస్‌గా తీసుకోవాలనీ, వాటిని ఉద్దేశ్యపూర్వక ఫిర్యాదులుగా పరిగణించరాదని విజ్ఞప్తి చేశాయి. కేంద్ర మంత్రి అక్బర్ తక్షణం పదవి నుంచి తప్పుకోవాలని ఇండియన్ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన ఇంటిముందు ఆందోళనకు దిగారు. జర్నలిస్ట్ దువాపై ఆరోపణలు ది వైర్ వెబ్సైట్ కన్సల్టింగ్ ఎడిటర్, సీనియర్ జర్నలిస్ట్ వినోద్ దువా తనను లైంగికంగా వేధించాడని డాక్యుమెంటరీ దర్శకురాలు నిష్టా జైన్ ఆరోపించింది. తాను 1989లో ఓ ఇంటర్వ్యూ సందర్భంగా వినోద్‌కు కలుసుకున్నాననీ, తాను కుర్చీలో కూర్చోకముందే అతను సెక్స్ జోక్ వేశాడని తెలిపారు. ‘‘ఓ రోజు కారు పార్కింగ్ ప్రదేశంలో దువా కనిపించాడు. ‘నీతో మాట్లాడాలి. నా కారులో కూర్చో’ అని కోరాడు. తన ప్రవర్తనకు క్షమాపణలు కోరతాడనుకొని కారులో కూర్చోగానే నా మీద పడిపోయి ముఖమంతా ముద్దులు పెట్టాడు. ఎలాగోలా తప్పించుకున్నా’’ అని తెలిపారు. మిత్రపక్షాల అసంతృప్తి సెగ.. సాక్షి ప్రతినిధి న్యూఢిల్లీ: అక్బర్‌ను తప్పించేందుకు కేంద్రం చొరవ తీసుకోని నేపథ్యంలో మిత్రపక్షాలే తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర విదేశాంగ సహాయ మంత్రిగా ఉన్న అక్బర్ వెంటనే పదవి నుంచి దిగిపోవాలనీ, లైంగిక వేధింపు ఆరోపణలపై విచారణను ఎదుర్కోవాలని ఎన్డీయే మిత్రపక్షం జనతాదళ్ యునైటెడ్(జేడీయూ) డిమాండ్ చేసింది. ‘ఈ విషయంలో అక్బర్ సొంతంగా ఓ నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నా. ఒకవేళ తప్పుకోకుంటే ప్రభుత్వమే మంత్రి బాధ్యతల నుంచి తొలగించాలి’ అని∙జేడీయూ నేత, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అన్నారు. మరోవైపు లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మహిళలపై అక్బర్ న్యాయపోరాటానికి దిగడం కేంద్ర ప్రభుత్వానికి ప్రతికూలంగా మారే అవకాశముందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
పీసీఐ, ఎడిటర్స్ గిల్డ్‌పై సుప్రీం అసంతృప్తి
న్యూఢిల్లీ: అత్యాచారాలు, లైంగిక దాడుల వార్తల రిపోర్టింగ్‌లో నిబంధనల ఉల్లంఘనపై విచారణకు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీసీఐ), ఎడిటర్స్ గిల్డ్, ఇండియన్ బ్రాడ్‌కాస్టింగ్ ఫెడరేషన్ ప్రతినిధులు తమ ముందు హాజరుకాకపోవడం పట్ల సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో తమకు సహకరించాలని గతంలోనే కోర్టు పైన పేర్కొన్న మీడియా నియంత్రణ సంస్థలకు లేఖలు పంపింది. కాగా, గురువారం జరిగిన విచారణకు న్యూస్ బ్రాడ్‌కాస్టింగ్ స్టాండర్డ్స్ అథారిటీ(ఎన్బీఎస్ఏ) తరఫు లాయర్ మాత్రమే హాజరయ్యారు. లైంగిక దాడులు, రేప్ ఘటనలను రిపోర్ట్చేస్తున్న సమయంలో చట్టబద్ధ నిబంధనల్ని ఉల్లంఘించిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని జస్టిస్ మదన్ బి.లోకూర్ నేతృత్వంలోని బెంచ్..ఎన్బీఎస్ఏ లాయర్‌ను ప్రశ్నించింది. -
ప్రెస్ కౌన్సిల్ సభ్యులుగా అమర్, మాజిద్
సాక్షి, హైదరాబాద్: ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) సభ్యులుగా తెలంగాణ నుంచి ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) జాతీయ అధ్యక్షుడు దేవులపల్లి అమర్, కార్యవర్గ సభ్యుడు ఎంఏ మాజిద్ నియమితులయ్యారు. పీసీఐకి దేశవ్యాప్తంగా వర్కింగ్ జర్నలిస్టుల కోటా నుంచి ఏడుగురు సభ్యులను ఎంపిక చేయగా.. అందులో ఐజేయూ నుంచి అమర్, మాజిద్‌లతోపాటు బల్వీందర్‌సింగ్ జమ్మూ (పంజాబ్), ప్రభాత్‌దాస్, శరత్ బెహెరా (ఒడిశా)లు నియమితులయ్యారు. వీరితోపాటు వార్తా పత్రికల యాజమాన్యాల కేటగిరీ కింద నలుగురికి, సంపాదకుల కేటగిరీ కింద మరో నలుగురికి, వార్తా సంస్థల కేటగిరీ నుంచి ఒకరికి కలిపి మొత్తం 18 మందికి పీసీఐ సభ్యులుగా అవకాశం లభించింది. వీరంతా మూడేళ్లపాటు పీసీఐ సభ్యులుగా కొనసాగుతారు. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసారశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. హర్షం వ్యక్తం చేసిన టీఎస్‌యూడబ్ల్యూజే.. తమ సంస్థ సభ్యులు దేవులపల్లి అమర్, ఎంఏ మాజిద్‌లు ప్రెస్ కౌన్సిల్ సభ్యులుగా నియామకం కావడంపై తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ (టీఎస్‌యూడబ్ల్యూజే) హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు యూనియన్ అధ్యక్షుడు ఎన్.శేఖర్, ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ ఒక ప్రకటన విడుదల చేశారు. పీసీఐ సభ్యులుగా నియమితులైన వారికి అభినందనలు తెలిపారు. వారు పత్రికా స్వేచ్ఛను కాపాడటానికి, జర్నలిజంలో నైతిక విలువలను పెంపొందించడానికి కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక పీసీఐ సభ్యులుగా నియమితులైన ఐజేయూ నాయకులకు పీసీఐ మాజీ సభ్యుడు కె.అమర్నాథ్ అభినందనలు తెలిపారు. -
ఆన్లైన్ ద్వారానే పీసీఐకి ఫీజు చెల్లించాలి
సాక్షి, హైదరాబాద్ : ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ)కు వార్తాపత్రికలు, ఏజెన్సీలు చెల్లించే మొత్తాన్ని ఆన్లైన్ ద్వారానే చెల్లించాలని పీసీఐ సూచించింది. ఆ మొత్తాన్ని Sabpaisa& Allbank Qwikcollect లింకు ద్వారా అలహాబాద్ బ్యాంకు అకౌంటు నంబర్‌కు చెల్లించాలని పేర్కొంది. ఆన్లైన్ లింకు, ఇతర చెల్లింపు వివరాలను http://presscouncil.nic.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. ప్రతి వార్తా పత్రికకు శాశ్వత యూనిక్ ఐడీని కేటాయిస్తామని, దాని ద్వారా చెల్లింపులు జరపాలని పేర్కొంది. ఆఫ్‌లైన్ ద్వారా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాలను వెంటనే నిలిపేస్తున్నట్లు వెల్లడించింది. -
పీసీఐ సభ్యులుగా ముగ్గురు ఎంపీలు
న్యూఢిల్లీ: లోక్‌సభ సభ్యులు టీజీ వెంకటేశ్ బాబు (అన్నాడీఎంకే), మీనాక్షి లేఖి (బీజేపీ) , ప్రతాప్ సింహ (బీజేపీ)లను ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ)కు స్పీకర్ సుమిత్రా మహాజన్ నామినేట్ చేశారు. నిబంధనల ప్రకారం పీసీఐలో 28 మంది సభ్యులు ఉండాలి. వారిలో ముగ్గురు లోక్‌సభ, ఇద్దరు రాజ్యసభ ఎంపీలు అయ్యుండాలి. లోక్‌సభ సభ్యులను లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ సభ్యులను రాజ్యసభ అధ్యక్షుడైన ఉప రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. -
విలేకరిపై దాడి ఘటనలో 'నోటీసులు'
-
విలేకరిపై దాడి ఘటనలో 'నోటీసులు'
విశాఖపట్నం: నాతవరం సాక్షి విలేకరిపై దాడి ఘటనను ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సుమోటోగా స్వీకరించింది. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా.. ఏపీ సీఎస్, డీజీపీ, విశాక కమిషనర్‌కు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నోటీసులు జారీ చేసింది. ఈ నెల 25న సాక్షి టీవీ విలేకరి ఏడీ బాబుపై లాటరైట్ మాఫియా దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దాడిలో ఏడీ బాబు తల, భుజానికి తీవ్రగాయాలు అయ్యాయి. నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. చదవండి: ‘సాక్షి’ విలేకరిపై హత్యాయత్నం -
‘దళిత’ పద వినియోగం సమంజసమేనా?
న్యూఢిల్లీ: సమాజంలో అసమతుల్యాన్ని సృష్టిస్తున్న ‘దళిత’ పదాన్ని వార్తా కథనాల్లో వినియోగించటంపై అభిప్రాయాన్ని తెలపాలంటూ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ)ని ఢిల్లీ హైకోర్టు కోరింది. పీసీఐ నిబంధనల ప్రకారం ‘షెడ్యూల్డ్ కులాలు’ అనే పదాన్ని కూడా వినియోగించటం నిషేధమని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గీతామిట్టల్, జస్టిస్ అను మల్హోత్రాల ధర్మాసనం తెలిపింది. దళిత పదం వినియోగంపై దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా.. ఈ విషయంలో అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రెస్ కౌన్సిల్‌ను ఆదేశించింది. కేసు తదుపరి విచారణను సెప్టెంబర్ 19కి వాయిదా వేసింది. -
పాత్రికేయులు పోరాటయోధుల్లా ఉండాలి
-
పాత్రికేయులు పోరాటయోధుల్లా ఉండాలి
ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ జస్టిస్ సీకే ప్రసాద్ ప్రభుత్వంతో పాత్రికేయులకు సంఘర్షణ ఉండాల్సిందే విశ్వసనీయత కోల్పోతే విలువ ఉండదని వ్యాఖ్య ‘సమకాలీన జర్నలిజంలో నైతిక విలువలు’ అంశంపై సదస్సు సాక్షి, హైదరాబాద్: జర్నలిస్టులు సత్యం కోసం పోరాటం చేసే యోధులుగా ఉండాలని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ జస్టిస్ చంద్రకుమార్ ప్రసాద్ అన్నారు. ‘సమకాలీన జర్న లిజంలో నైతిక విలువలు’ అంశంపై గురు వారం హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన జాతీ య సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొ న్నారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రభుత్వంతో పాత్రికేయులకు సంఘర్షణ వాతావరణం ఉండాల్సిందేనని, అలాంటి వైఖరి లోపించిన రోజు ప్రజాస్వామ్యానికి అత్యంత విచారక రమైన రోజవుతుందని పేర్కొన్నారు. రామ రాజ్యం ఎలా ఉండా లనే దానిపై విస్తృతమైన చర్చ జరుగుతూ వచ్చిందని చెప్పారు. రామరాజ్యం ఏర్పడేంతవరకు ప్రభుత్వానికి, మీడియాకు మధ్య ఘర్షణ వైఖరి తప్పదని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్న వారితో జర్నలిస్టుల స్నేహపూర్వక సంబంధాలను వ్యక్తి గతంగా తాను వ్యతిరేకిస్తానన్నారు. పాత్రికేయులు సమాజానికి చేస్తున్న సేవను చూసి దేశం గర్వపడుతోందని వ్యాఖ్యానించారు. ప్రశ్నించడం పాత్రికేయుని విశిష్ట లక్షణం ఎంతటి సంపన్నులనైనా, శక్తిమంతులనైనా ప్రశ్నించగలగడమనేది జర్నలిస్టులకు ఉండే ప్రత్యేక లక్షణమని, ఈ విశిష్టతను యువ జర్నలిస్టులు మరింతగా సొంతం చేసుకో వాలని జస్టిస్ ప్రసాద్ సూచించారు. ఎవరినైనా సరే ప్రశ్నించగలిగే జర్నలిస్టు ఆత్మవిశ్వాసం తనను ఎంతగానో ప్రభావితం చేసిందని తెలిపారు. రాజకీయ నాయకులు ఇచ్చిన ప్రకటనను తప్పుగా అర్థం చేసుకోవడంపై పలు ఫిర్యాదులు ప్రెస్ కౌన్సిల్‌కు అందు తున్నాయని చెప్పారు. ‘హరియాణాలో దళితుల హత్యలను వీధి కుక్కలను రాళ్లతో కొట్టి చంపడం వంటిదని ఓ కేంద్ర మంత్రి చెప్పి నట్లుగా మీడియాలో రావడంతో దేశంలో పెద్ద అలజడి రేగింది. దీనిపై పరిశీలన జరిపితే.. మంత్రి ప్రకటనను మీడియా తప్పుగా అన్వ యించుకున్నట్లు తేలింది’ అని పేర్కొన్నారు. కోడ్ ఆఫ్ కాండక్ట్ అవసరమే.. జర్నలిస్టులకు కూడా ప్రవర్తన నియమావళి అవసరమని జస్టిస్ ప్రసాద్ అన్నారు. చట్ట విరుద్ధమైన పనులు చేయడానికి, ప్రజలను బెదిరించి సంపాదించుకోవడానికి కొందరు జర్నలిస్టులు తమ వృత్తిని కవచంగా వాడుకుంటున్నారని ఈ ప్రాంతం నుంచే కొన్ని ఫిర్యాదులు అందాయని చెప్పారు. విశ్వసనీయతను కోల్పోయిన పాత్రికేయు డికి విలువ ఉండదని చెప్పారు. మీడియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ మీడియా కమిషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. సదస్సులో ఐజేయూ అధ్యక్షుడు సిన్హా, ఐజేయూ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్, ప్రెస్ కౌన్సిల్ సభ్యులు ప్రకాశ్ దూబే, అమర్నాథ్, ఎడిటర్స్ గిల్డ్ ప్రెసిడెంట్ కృష్ణప్రసాద్ తదితరులు ప్రసంగించారు. జస్టిస్ ప్రసాద్‌ను టీయూడబ్ల్యూజే, హైదరాబాద్ ప్రెస్ క్లబ్, వెటరన్ జర్నలిస్ట్ అసోసియేషన్, మీడియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. -
‘సాక్షి’పై కక్ష సాధింపుపై 8న ప్రెస్ కౌన్సిల్ విచారణ
సాక్షి, హైదరాబాద్: ‘సాక్షి’ పత్రికపై ప్రభుత్వం సాగిస్తున్న కక్ష సాధింపు చర్యలపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీసీఐ) ఈ నెల 8వ తేదీన విచారణ చేపట్టనుంది. రాష్ట్ర రాజధాని నిర్మాణం పేరిట మం త్రులు, అధికార పార్టీ నేతలు సాగించిన భూదందాను ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. పత్రికలో రాసిన వార్తలకు ఆధారాలు చూపాలంటూ సంబంధిత విలేకరులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీనిపై జోక్యం చేసుకోవాలని కోరుతూ ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ) సెక్రెటరీ జనరల్ మార్చి 22న ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీసీఐ)కు లేఖ రాశారు. ఈ వ్యవహారంపై వాస్తవాలను నివేదిక రూపంలో ఇవ్వాలని ప్రెస్ కౌన్సిల్ ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై గుంటూరు అర్బన్ ఎస్పీ స్పందించారు. జూలై 11న కౌన్సిల్‌కు లేఖ రాశారు. ఎర్రబాలెం గ్రామస్తుల ఫిర్యాదు మేరకు విలేకరులకు నోటీసులు జారీ చేశామన్నారు. సాక్షి పట్ల సర్కారు తీరుపై 8న పీసీఐ విచారణ జరపనుంది. -
పనిలేక జర్నలిస్టులపై కేసులు పెట్టామా?
కడప: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి భూములపై వార్తలు రాసిన జర్నలిస్టులపై తప్పు లేకుండా కేసులు ఎందుకు పెడతామని డీజీపీ జేవీ రాముడు ప్రశ్నించారు. గురువారం ఆయన వైఎస్ఆర్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ 'మాకేమన్నా కేసులు లేక జర్నలిస్టులపై కేసులు పెట్టామా?. సమాజంలో ఒక హోదా ఉన్న వ్యక్తులపై నిరాధారమైన వార్తలు రాయకూడదు. వార్తలు రాసిన వారే నిరూపించుకోవాల్సిన బాధ్యత ఉంది. జర్నలిస్టులది తప్పుందా? లేదా అనేది విచారణ జరుపుతున్నామని' అన్నారు. కాగా ‘సాక్షి’ దినపత్రిక జర్నలిస్టులను విచారణ పేరిట పోలీసుస్టేషన్‌కు పిలిచి ‘రాజధాని దురాక్రమణ’ వార్తలకు మూలాలు(సోర్స్) ఏమిటో చెప్పాలని పోలీసు అధికారులు ప్రశ్నించడాన్ని భారత ప్రెస్ కౌన్సిల్(పీసీఐ) తీవ్రంగా ఆక్షేపించిన విషయం తెలిసిందే. -
ఏపీ పోలీసుల తీరుపై పీసీఐ తీవ్ర ఆందోళన
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ పోలీసుల తీరుపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సాక్షి దినపత్రికలో ప్రచురించిన ఏపీ రాజధాని అమరావతి భూ దందా కథనాలపై ...ఆ పత్రిక రిపోర్టర్లను పోలీస్ స్టేషన్‌కు పిలిపించడాన్ని పీసీఐ బుధవారం తప్పుబట్టింది. ఆధారాలు బయటపెట్టాలనడం పత్రికా స్వేచ్ఛకు భంగకరమని పీసీఐ వ్యాఖ్యానించింది. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ వ్యవహారాన్ని సుమెటో కేసుగా తీసుకుంది. ఇందుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, డీజీపీ, గుంటూరు ఎస్పీకి నోటీసులు ఇచ్చింది. -
2 నిమిషాలు వార్తలు ఆపేయండి
న్యూఢిల్లీ: జర్నలిస్టులపై రోజురోజుకు పెరుగుతున్న దాడులపై భారత ప్రెస్ కౌన్సిల్(పీసీఐ) ఆందోళన వ్యక్తం చేసింది. పాత్రికేయులపై దాడి చేసిన వారిని చట్టం ముందు నిలబెట్టడంలో విఫలమవుతున్న ప్రభుత్వాల తీరును వ్యతిరేకించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రతి ఏడాది నవంబర్ 2న రెండు నిమిషాల పాటు వార్తలు నిలిపివేయాలని(న్యూస్ సైలెన్స్) పీసీఐ పేర్కొంది. 'జర్నలిస్టులపై హింసకు పాల్పడినవారిపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వాలు అలసత్వం ప్రదర్శిస్తున్నాయి. దీనికి నిరసనగా నవంబర్ 2న దేశవ్యాప్తంగా 2 నిమిషాల పాటు వార్తలు ప్రసారం ఆపేయాలని సూచిస్తున్నామ'ని పీసీఐ తెలిపింది. ఉత్తరప్రదేశ్ జర్నలిస్ట్ జగేంద్ర సింగ్ హత్య కేసులో సుప్రీంకోర్టు సమర్పించిన అఫిడవిట్ లో ఈ మేరకు పేర్కొంది. భావప్రకటన స్వేచ్ఛకు భంగం కలగకుండా ఉండాలంటే జర్నలిస్టుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని పీసీఐ సూచించింది. గడచిన రెండు దశాబ్దాల్లో 80 మంది జర్నలిస్టులు హత్యకు గురయ్యారని, దాదాపు అన్ని కేసులు విచారణ దశలోనే పెండింగ్ లో ఉన్నాయని పీసీఐ తెలిపింది. -
ఖట్జు వ్యాఖ్యలపై రాజ్యసభలో గందరగోళం
న్యూఢిల్లీ : మహాత్మ గాంధీపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ చైర్మన్ మార్కండేయ ఖట్జు చేసిన వ్యాఖ్యలు బుధవారం రాజ్యసభలో గందరగోళానికి తెరలేపాయి. ఆయన జాతిపితను బ్రిటిష్ ఏజెంట్ అనడంపై విపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. ఖట్జుపై తక్షణం చర్యలు తీసుకోవాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. వీలుంటే మార్కండేయ ఖట్జును జైల్లో పెట్టాలని విపక్షాలు కోరాయి. గతంలోనూ ఖట్జు ఎన్నో సార్లు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశాయి. దీనిపై స్పందించిన డిప్యూటీ చైర్మన్...విపక్ష సభ్యులను వారించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఖట్టు జడ్జిగా లేనందున ఏ రూల్ కింద ఆయనపై.... చర్యలు తీసుకోవాలో చెప్పాలని సభ్యులను ప్రశ్నించారు. -
భయంతో జర్నలిస్టులు.. యాజమాన్యాలు
న్యూఢిల్లీ: తెలంగాణలో ఆంధ్రప్రాంతానికి చెందిన జర్నలిస్టులు, సీమాంధ్రకు చెందిన మీడియా సంస్థల యాజమాన్యాలు భయం భయంగా గడుపుతున్నారని ప్రెస్‌కౌన్సిల్ ఆఫ్ ఇండియా నియమించిన త్రిసభ్యకమిటీ అభిప్రాయపడింది. 2014 సెప్టెంబర్ 9న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వరంగల్ సభలో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కౌన్సిల్ ఏర్పాటు చేసిన కమిటీ తన నివేదికను మంగళవారం సమర్పించింది. ‘మెడలు విరిచేస్తాం.. పాతర పెడతాం’ వంటి పదాలు మీడియా స్వేచ్ఛకు విఘాతం కలిగేలా ఉన్నాయని తన నివేదికలో పేర్కొంది. తెలంగాణలో రెండు చానళ్ల ప్రసారాలు నిలిపివేయటం, రాజ్యసభలో చర్చ జరిగినా, సమాచార ప్రసార శాఖ పలుమార్లు హెచ్చరించినా, అప్పిలేట్ ట్రిబ్యునల్ ఆదేశించినా కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదని కమిటీ పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వం చట్టబద్ధంగా వ్యవహరించేలా, జర్నలిస్టులకు, మీడియా సంస్థలకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకుండా ప్రెస్‌కౌన్సిల్ ఆఫ్ ఇండియా, కేంద్రప్రభుత్వం తగిన మార్గదర్శకాలు ఇవ్వాలని సిఫారసు చేసింది. టీవీల ప్రసారాల నిలిపివేతపై ఆందోళనలు చేపట్టిన సందర్భంగా పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని, ఈ సందర్భంగా సదరు జర్నలిస్టులకు కలిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని రాజీవ్ రంజన్ నాగ్, కృష్ణప్రసాద్, కె.అమర్‌నాధ్‌లతో కూడిన ఈ కమిటీ తన నివేదికలో సూచించింది. -
‘మీడియా స్వేచ్ఛ పరిరక్షణకే ప్రాధాన్యత’
న్యూఢిల్లీ: మీడియా స్వేచ్ఛను పరిరక్షించడమే తన ప్రాధాన్యమని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీ ఐ) నూతన చైర్పర్సన్ జస్టిస్ చంద్రమౌళి కుమార్ ప్రసాద్ చెప్పారు. ప్రజాస్వామ్యంలో నియంత్రిత మీడియా కన్నా బాధ్యతారాహిత్య మీడియాను భరించటం మేలన్నారు. గురువారమిక్కడ పీసీఐ చీఫ్‌గా జస్టిస్ మార్కండేయ కట్జూ నుంచి బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన పీటీఐతో మాట్లాడారు. మీడియా బాధ్యతారాహిత్యంగా ఉంటే ప్రజలు దానికి తమ మేధావితనంతో తీర్పు చెబుతారని, అయితే మీడియాపై నియంత్రణ విధిస్తే మాత్రంప్రజాస్వామ్యం మనుగడ సాగించలేదనిప్రసాద్ అన్నారు. -
పీసీఐ చైర్మన్‌గా జస్టిస్ సీకే ప్రసాద్
న్యూఢిల్లీ: ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) చైర్మన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి చంద్రమౌళి కుమార్ ప్రసాద్ నియమితులు కానున్నారు. ప్రస్తుతం పీసీఐ చైర్మన్‌గా జస్టిస్ మార్కండేయ కట్జూ ఉన్నారు. పీసీఐ చైర్మన్ అభ్యర్థిని ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కమిటీ ఎంపిక చేస్తుంది. ఈ మేరకు ప్రసాద్‌ను పీసీఐ చైర్మన్‌గా ఎంపిక చేసినట్లు సమాచారం అందిందని కేంద్ర సమాచార, ప్రసారశాఖ అధికారులు వెల్లడించారు. జస్టిస్ ప్రసాద్ పట్నా నగరంలో పుట్టిపెరిగారు. అక్కడే ఉన్నత విద్యను అభ్యసించారు. ఆయన కొంతకాలం పట్నా హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగానూ పనిచేశారు. త్వరలోనే ఆయన చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. -
‘గ్రహణం’లో మీడియా
డేట్లైన్ హైదరాబాద్: రాజకీయ పార్టీల కార్యకలాపాలను గురించి తెలుసుకునే పూర్తి స్వేచ్ఛ, అధికారం ప్రజలకు ఉన్నాయి. రాజకీయ పార్టీల నిర్వహణ ప్రైవేట్ వ్యవహారం కాదు. ఈ వ్యవహారంలో కూడా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జోక్యానికంటే ముందు ముఖ్యమంత్రి స్వచ్ఛందంగా ఆ నిషేధాన్ని కూడా తొలగిస్తారని ఆశిద్దాం. పత్రికలు చదవాలా వద్దా అనే విషయాన్ని ప్రజలు నిర్ణయించుకుంటారు. దేశవ్యాప్తంగా కొన్ని ప్రాంతీయ పార్టీలు, ఉప ప్రాంతీయ పార్టీలు రాజకీయాలు తమ ప్రైవేట్ వ్యవహారం అనుకుంటూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన మానసపుత్రిక ‘జన్మభూమి’ కార్యక్రమాన్ని మళ్లీ ప్రారంభించడానికి గత వారం విజయవాడ వెళ్లినప్పుడు మీడియా స్వేచ్ఛ అంటే తనకు ఎంత గౌరవమో విలేకరుల గోష్టిలో వివరించారు. ‘నేను భావ ప్రకటనా స్వేచ్ఛను, పత్రికా స్వేచ్ఛను గౌరవిస్తాను కాబట్టి మీరు నన్ను ఇన్ని ప్రశ్నలు వేయగలుగుతున్నా’రని ఉదాహరణ కూడా చూపించారు. ఆయన విజయవాడలో విలేకరులతో ఈ మాటలు చెబుతున్న ప్పుడు ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ తలుపులు సాక్షి దినపత్రిక, సాక్షి న్యూస్ చానల్ విలేకరులకు, కెమెరామాన్కు నో ఎంట్రీ పలుకుతూనే ఉన్నాయి. ఒక సంవత్సర కాలం పైగా సాక్షి మీద ఈ నిషేధం కొనసాగుతూనే ఉన్నది. మీడియా మీద ఆంక్షలు రాజకీయ నిర్ణయమా? మొన్న జూన్‌లో పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి చంద్రబాబు పత్రికా గోష్టులకు తన ఇంటి వద్ద కానీ, క్యాంపు కార్యాలయం అయిన లేక్‌వ్యూ అతిథి గృహానికి కానీ సాక్షి గ్రూపుతో బాటు నమస్తే తెలంగాణ దినపత్రిక, టీ న్యూస్ చానళ్ల విలేకరులను అనుమతించడంలేదు. మరీ అవమానకరమైన విషయం - ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమాచార శాఖ కమిషనర్ నుంచి ఈ మీడియా సంస్థలకు ముఖ్యమంత్రి పత్రికా గోష్టికి ఆహ్వానం అందుతుంది. అక్కడికి వెళ్లిన విలేకరు లను మాత్రం సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకుని వెనక్కు పంపిస్తారు. ఇదీ నాలుగు రోజుల క్రితం వరకూ నడుస్తూ వచ్చిన తతంగం. జన్మభూమి కార్యక్రమం కోసం విజయవాడ వెళ్లే ముందురోజు మంత్రివర్గ సమావేశ వివరాలను తెలిపేందుకు నిర్వహించిన పత్రికా గోష్టికి మాత్రం ఈ నాలుగు మీడియా సంస్థల ప్రతినిధులను అనుమతించారు. చంద్రబాబు మనసు మార్చుకున్నం దుకు అభినందించాల్సిందే. ఈ నిర్ణయం కొనసాగుతుందని ఆశిద్దాం. ఆయన ఎందుకు తన నిర్ణయాన్ని మార్చుకున్నారనే వివరాలలోకి మళ్లీ వెళదాం. ఏడాదికి పైగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు, నాలుగు మాసాలుగా ముఖ్యమంత్రి పత్రికా గోష్టులకు సాక్షి బృందాన్ని, మరి కొన్ని మీడియా సంస్థలను ఎందుకు అనుమతించడం లేదు? అన్న విషయం ముందు తెలుసుకోవాలి కదా. ఆయనే స్వయంగా చెప్పిన కారణం ఏమిటంటే ‘ఇది నా రాజకీయ నిర్ణయం’ అని. ఇది సంపా దకులతో జరిపిన గోష్టిలో చెప్పారాయన. మీడియా మీద ఆంక్షలు విధించడం రాజకీయ నిర్ణయం ఎట్లా అవుతుందని నివ్వెరపోయి ఉంటారు సంపాదకులు. తనకు నచ్చని వార్తలు రాసే పత్రికలనూ, ప్రసారం చేసే చానళ్లనూ కట్టడి చేయడానికో, దారికి తెచ్చుకోవడానికో రకరకాల మార్గాలు అనుసరించిన పాలకులను గతంలో అనేక మందిని చూశాం. అటువంటి వాళ్లు అన్ని వేళలా విజయం సాధించిన దాఖలాలు లేవు. అటువంటిది సమాచార సేకరణను అడ్డుకుని ఇది నా రాజకీయ నిర్ణయం అని చెప్పుకోవడాన్ని ఏ విధంగా చూడాలి? కొన్ని మీడియా సంస్థల ప్రతినిధులను తన పార్టీ కార్యక్రమాలకు, ముఖ్య మంత్రిగా తన అధికారిక పత్రికా గోష్టులకు అనుమతించకపోవడానికి చంద్ర బాబు చూపుతున్న కారణం రాజకీయంగా తమకు వ్యతిరేక వార్తలను రాస్తు న్నారనీ, ప్రసారం చేస్తున్నారనీ. ఇతర రాజకీయ పక్షాలకు వ్యతిరేకంగా, అధి కార పక్షానికి అనుకూలంగా వార్తలు రాసే, వ్యాఖ్యలు చేసే మీడియా సంస్థలను వాళ్లూ నిషేధిస్తే ఏం జరుగుతుంది? అందుకే చంద్రబాబు వాదన సబబు కాదు. సబబే అని ఆయన అనుకుంటే పక్క రాష్ట్రం తెలంగాణలో రెండు తెలుగు చానళ్ల మీద నాలుగు మాసాలుగా కొనసాగుతున్న అప్రకటిత నిషేధాన్ని వ్యతిరేకించ కూడదు. మీడియా స్వేచ్ఛ ఆంధ్రప్రదేశ్‌లో ఒక విధంగా, తెలంగాణలో మరో విధంగా, ఢిల్లీలో ఇంకో విధంగా ఉండదు కదా. సరే, తెలంగాణ వ్యవహారానికి వెళ్లే ముందు చంద్రబాబు మనసు ఎందుకు మారిందో చూద్దాం. భావ ప్రకటనా స్వేచ్ఛంటే ఇద్దరికీ చులకనే! రాష్ర్ట విభజన అనంతరం ఇటు తెలంగాణలోనూ అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించే రీతిలో జరిగిన సంఘటనలు ప్రజాస్వామ్య ప్రియులను ఆందోళనలో పడేశాయి. ప్రభుత్వాలకు నివేదించినా ఫలితం కనిపించక జాతీయ స్థాయిలో ఇండియన్ జర్నలిస్టుల యూనియన్, నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్టుల అభ్యర్థన మేరకు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ముగ్గురు సీనియర్ పాత్రికేయులతో ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ పర్యటనకు ఒక రోజు ముందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తన అధికార పత్రికా గోష్టులకు ఈ నాలుగు మీడియా చానళ్ల ప్రతినిధులను అనుమతించకూడదనే నిర్ణయాన్ని వాపసు తీసుకున్నారు. కానీ, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ దగ్గర ఈ నిషేధం కొనసాగుతూనే ఉన్నది. సంపాదకులతో సమావేశం అయిన రోజు చంద్రబాబు దగ్గర ఈ ప్రస్తావన కూడా వచ్చింది. ప్రభుత్వ కార్య క్రమాలకు ఆహ్వానం వెళుతున్నది కదా ఇంకేమిటి! పార్టీ కార్యక్రమాలకు మాత్రం అనుమతించం. ఇది నా రాజకీయ నిర్ణయం అన్నారాయన. పత్రికలపై తీర్పు చెప్పేది ప్రజలే రాజకీయ పార్టీల కార్యకలాపాలను గురించి తెలుసుకునే పూర్తి స్వేచ్ఛ, అధికా రం ప్రజలకు ఉన్నాయి. రాజకీయ పార్టీల నిర్వహణ ప్రైవేట్ వ్యవహారం కాదు. ఈ వ్యవహారంలో కూడా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జోక్యానికంటే ముందు ముఖ్యమంత్రి స్వచ్ఛందంగా ఆ నిషేధాన్ని కూడా తొలగిస్తారని ఆశిద్దాం. పత్రి కలు చదవాలా వద్దా అనే విషయాన్ని ప్రజలు నిర్ణయించుకుంటారు. దేశవ్యా ప్తంగా కొన్ని ప్రాంతీయ పార్టీలు, ఉప ప్రాంతీయ పార్టీలు రాజకీయాలు తమ ప్రైవేట్ వ్యవహారం అనుకుంటూ ఉంటాయి. భావ ప్రకటనా స్వేచ్ఛ పట్ల గౌరవం ఉండదు. జనం మాకు ఓట్లు వేశారు కాబట్టి ఏం చేసినా చెల్లుతుందనే ధోరణిని కొన్ని ప్రాంతీయ పార్టీలు ప్రదర్శించాయి. ఉద్యమ నేతలైనా ఇంతేనా? ఇక తెలంగాణలో భావ ప్రకటనా స్వేచ్ఛ విషయం కూడా ఆందోళన కలిగించేదే. రెండు తెలుగు న్యూస్ చానళ్ల ప్రసారాలు నిలిచిపోయి నాలుగు మాసాలు కావస్తున్నది. చానళ్ల ప్రసారానికి వెసులుబాటు కల్పించే ఎమ్మెస్వోలు హైదరా బాద్ సహా, పది జిల్లాలలో ప్రసారాలు నిలిపివేశాయి. వాళ్లు చూపుతున్న కారణం ఈ చానళ్లు తెలంగాణ వ్యతిరేకమైనవని. మీడియా సంస్థలు చేసే తప్పులను ఎవరూ వెనకేసుకు రావలసిన పనిలేదు. ఏ తప్పుకైనా తగిన శిక్ష ఉంటుంది. అయితే అది చట్టానికి లోబడి జరగాలి. ఒక చానల్ ప్రసారం చేసిన అటువంటి కార్యక్రమం మీద చట్టపరమైన చర్యలు జరుగుతూనే ఉన్నాయి. అయినా ప్రసారాలు పునరుద్ధరణకు మాత్రం నోచుకోలేదు. తెలంగాణ ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మద్దతుతోనే కేబుల్ ఆపరేటర్లు ఈ చానళ్ల ప్రసారాల నిలిపివేత కొనసాగిస్తున్నారన్నది వాస్తవం. ప్రజాకవి కాళోజీ నారాయణరావు శతజయంతి సభలో ముఖ్యమంత్రి ఎమ్మెస్వోలకు సెల్యూట్ చేసి మీడియా మెడలు విరిచేస్తానని, పది కిలోమీటర్ల లోతున పాతర వేస్తానని స్పష్టం చేశారు. ఆనాటి సభలో ఉన్న కొద్ది వందల మంది చప్పట్లు మొత్తం తెలంగాణ సమాజం ఆమోదంగా చంద్రశేఖర్‌రావు భావిస్తూ ఉంటారని అనుకోవడానికి వీల్లేదు. ఆయనది 30 ఏళ్లకు పైబడిన రాజకీయ అనుభవం. ఓ పదమూడేళ్ల ప్రత్యక్ష ఉద్యమ అనుభవం. పోరాడి ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న ఆనందంలో నుంచి ఇంకా బయటికి రాని కారణంగా ఇలా జరుగుతున్నదా? ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతమని ఏలికలు ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. అప్పుడలా! ఇప్పుడిలా! విభజనకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ నగరంలో జరిగిన జీవ వైవిధ్య అంతర్జాతీయ సదస్సుకు ఒక సెక్షన్ మీడియాకు అనుమతి ఇవ్వనందుకు పెద్ద ఎత్తున నిరసన తెలిపిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ఇవ్వాళ అదే హైదరాబాద్‌లో తన ప్రభుత్వ హయాంలో జరుగుతున్న మెట్రో పొలిస్ ప్రపంచ సదస్సుకు మీడియాను దూరంగా ఉంచింది. కారణం ఏమిటంటే కొందరు మీడియా వారు అక్కడ నిరసన తెలిపే అవకాశం ఉందని నిఘా వర్గాలు నివేదిక ఇచ్చాయని. ఉద్యమాలు చేసిన సందర్భంలో నిరసనే ఊపిరిగా జీవించిన సంస్థలు అధికారంలోకి వస్తే ఎంత నిరంకుశంగా వ్యవహరించగల వో చెప్పడానికి ఇదో ఉదాహరణ. నాలుగు సంవత్సరాల విరామం తరువాత డేట్ లైన్ హైదరాబాద్‌లో మళ్లీ సంభాషణ ప్రారంభం మీడియా మీద దాడులకు సంబంధించే కావడం విచారకరం. -
ఉత్తమ జర్నలిస్టుల అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
న్యూఢిల్లీ: పత్రికా రంగంలో అత్యుత్తమ సేవలందించిన జర్నలిస్టులకు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జాతీయ స్థాయిలో అవార్డులు అందజేయనుంది. నవంబర్ 16న జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా నేషనల్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్సీ ఇన్ జర్నలిజం పేరిట అవార్డులను అందించనుంది. పత్రికా రంగానికి చెందిన ఆరు కేటగిరీల్లో అందజేసే ఈ అవార్డులకు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దరఖాస్తులను ఆహ్వానించింది. రాజా రామ్మోహన్రాయ్ నేషనల్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్సీ ఇన్ జర్నలిజం కింద రూ.లక్ష నగదు పురస్కారం, ప్రశంసా పత్రం అందజేస్తారు. గ్రామీణ జర్నలిజం, డెవలప్మెంటల్ రిపోర్టింగ్, స్త్రీ శక్తి, ఫొటో జర్నలిజం(సింగిల్ న్యూస్ ఫొటో, ఫొటో ఫీచర్), ఉర్దూ జర్నలిజంలో అవార్డులు అందజేస్తారు. వీటికి ఒక్కోదానికి రూ. 50 వేల నగదు పురస్కారం కూడా అందిస్తారు. న్యూస్ పేపర్, న్యూస్ ఏజన్సీల్లో పనిచేసే జర్నలిస్టులు, ఫొటో జర్నలిస్టులు, ఫ్రీలాన్స్ జర్నలిస్టులు ఈ అవార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్ 10లోగా దరఖాస్తులు ద సెక్రెటరీ, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, సూచనా భవన్, లోధీ రోడ్, న్యూఢిల్లీ-110003కి చేరాలి. మరిన్ని వివరాలకు (డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ప్రెస్‌కౌన్సిల్.ఎన్ఐసీ.ఇన్) వెబ్ సైట్‌ను చూడవచ్చు. -
హైదరాబాద్‌కు అక్టోబర్‌లో ప్రెస్ కౌన్సిల్ కమిటీ
హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు అధికారికంగా నిర్వహించిన మీడియా సమావేశాలకు సాక్షి, నమస్తే తెలంగాణ విలేకరులను అనుమతించకపోవడంపై విచారణ జరిపేందుకు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీసీఐ) ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ అక్టోబర్ రెండో వారంలో హైదరాబాద్‌కు రానుంది. ఈ విషయాన్ని పీసీఐ సభ్యు డు కె.అమర్నాథ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 30న కమిటీ హైదరాబాద్‌లో పర్యటించాలని భావించినా వరుస సెలవుల నేపథ్యంలో పర్యటనను వచ్చే నెల రెండో వారానికి మార్చుకున్నట్లు ఆయన వివరించారు. ఏపీ సీఎం మీడియా సమావేశాలకు సాక్షి, నమస్తే తెలంగాణ పత్రికలు, సాక్షి, టీ న్యూస్ టీవీల ప్రతినిధులకు ప్రవేశం నిరాకరించిన అంశంపై విచారణ చేపట్టడానికి రాజీవ్ రంజన్‌నాగ్, కె.అమర్నాథ్, ప్రజ్ఞానంద చౌధురితో త్రిసభ్య కమిటీని పీసీఐ ఏర్పాటు చేయడం తెలిసిందే. -
‘సాక్షి’కి ఆంక్షలపై జోక్యం చేసుకోండి
ప్రెస్ కౌన్సిల్‌కు ఏపీయూడబ్ల్యూజే, ఐజేయూ, టీయూడబ్ల్యూజే విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: ఏపీ సీఎం నారా చంద్రబాబు నిర్వహించే విలేకరుల సమావేశాలకు ‘సాక్షి’ దినపత్రిక, టీవీ చానల్, నమస్తే తెలంగాణ దినపత్రిక, టీ న్యూస్ చానల్‌ను అనుమతించకపోవడంపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తక్షణమే జోక్యం చేసుకోవాలని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ), దాని అనుబంధ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ (ఏపీయూడబ్ల్యూజే), తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ (టీయూడబ్ల్యూజే) శనివారం వి జ్ఞప్తి చేశాయి. సీఎం అధికారిక విలేకరుల సమావేశాలకు అనుమతించేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని ప్రెస్‌కౌన్సిల్ చైర్మన్ జస్టిస్ మా ర్గండేయ కట్జూను కోరాయి. రాష్ట్ర సీఎం నిర్వహించే విలేకరుల సమావేశాలకు ఈ మీడి యాసంస్థలను అనుమతించకపోవడం ప్రభుత్వ నిబంధనలను ఉల్లఘించడమే అవుతుందని ఐజేయూ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్, ఏపీయూడబ్ల్యూజే అధ్యక్ష, ప్రధాన కార్యదర్శు లు డి. సోమసుందర్, ఐవీ సుబ్బారావు, టీయూడబ్ల్యూజే అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్. శేఖర్, విరాహత్ అలీ, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండి యా సభ్యులు అమరనాథ్ చెప్పారు. ఈ నాలు గు మీడియా సంస్థల పట్ల అనుసరిస్తున్న వివక్ష రాజ్యాంగం కల్పిస్తున్న పత్రిక, మీడియా స్వేచ్ఛ ను ఉల్లఘించడమే అవుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పాఠకులపరంగా సాక్షి దినపత్రిక రెండో స్థానంలో ఉందని, తెలంగాణలో నమస్తే తెలంగాణ ముఖ్యమైన పత్రికల్లో ఒకటని గుర్తుచేశారు. వీటిపై ఆంక్షలు విధించడమంటే ప్రభుత్వ సమాచారం ప్రజలకు తెలియకుండా అడ్డుకోవడం కిందకే వస్తుందని పేర్కొన్నారు. టీడీపీ అధ్యక్షుడుగా చంద్రబాబు గతం లో తన విలేకరుల సమావేశాలకు అనుమతించకపోవడంపై సాక్షి యజమాన్యం ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఇప్పటికే ఫిర్యాదు చేసిందని, అది పెండింగ్‌లో ఉందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నాలుగు మీడియా సంస్థలపై విధించిన ఆంక్షలను వెంటనే ఎత్తివేసి, ఆయా సంస్థల విలేకరులను సమావేశాల్లో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. -
బాబుపై ప్రెస్‌కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు
తిరుపతి : ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాపై కక్ష సాధింపునకు పాల్పడటం దారుణమని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) ఆందోళన వ్యక్తం చేసింది. తిరుపతిలో జరిగిన ఐజేయూ కార్యవర్గ సమావేశంలో ఎనిమిది తీర్మానాలు చేసింది. 'సాక్షి' దినపత్రిక, మీడియా పట్ల చంద్రబాబు వైఖరిని ఐజేయూ తీవ్రంగా పరిగణించింది. ముఖ్యమంత్రి అధికారిక ప్రెస్మీట్లకు సాక్షి దినపత్రిక, సాక్షి ఛానల్ ప్రతినిధులను హాజరు కానీయకుండా భద్రతా సిబ్బంది ద్వారా అడ్డుకోవటం దారుణమని ఐజేయూ జాతీయ అధ్యక్షుడు ఎస్ఎన్ సిన్హా, జాతీయ ప్రధాన కార్యదర్శి డి.అమర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ సమాచార, పౌర సంబంధాల శాఖ నుంచి సాక్షి ప్రతినిధులకు ఆహ్వానాలు అందుతున్నాయి, ఆహ్వానం ఉన్నా మీడియా ప్రతినిధుల్ని అడ్డుకోవటం సరికాదన్నారు. ఈ వైఖరిని మీడియాపై దాడిగా అభివర్ణిస్తున్నామన్నారు. ఐజేయూ సమావేశంలో మీడియా పట్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్‌ల తీరును చర్చించినట్లు తెలిపారు. చంద్రబాబుపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేస్తామని వారు తెలిపారు. -
మీడియా నాయకత్వం వహించాలి!
భువనేశ్వర్:దేశంలో పేట్రేగిపోతున్న భూస్వామ్య వ్యవస్థను రూపుమాపడానికి మీడియా కీలక పాత్ర పోషించాలని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జూ విజ్క్షప్తి చేశారు. దేశంలోని భూస్వామ్య వ్యవస్థను, పేదరికాన్నిఅంతమొందించాలంటే దానికి మీడియానే నాయకత్వం వహించాలన్నారు. అఖిల భారత మీడియా కౌన్సిల్ సమావేశంలో సోమవారం పాల్గొన్నఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా దేశంలోని పేదరికం హెచరిల్లుతుందన్నారు. గత కొన్నేళ్ల నుంచి దేశం క్లిష్లపరిస్థితులు ఎదుర్కొంటున్నందున దాన్ని నుంచి కాపాడేందుకు మీడియా ముందుండాలన్నారు. సమాజంలోని భూస్వామ్య వ్యవస్థను పూర్తిగా రూపుమాపడానికి మీడియా పోరు జరపాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. '20 ఏళ్ల నుంచి దేశం చాలా వేదన స్థితిలో ఉంది. సమాజంలో చెడు సంస్కృతి పెరిగిపోయింది. వాటిని నివారించటానికి మీడియా యుద్ధం చేయాలి' అని కట్జూ స్పష్టం చేశారు.